గొప్పోళ్ళ కథలు - జీడిగుంట నరసింహ మూర్తి

Goppolla kathalu

పద్మనాభ రావు జీవితంలో డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఉద్యోగాలలో అనేక స్కాముల్లో మేనే జ్మెంట్ తో చెయ్యి కలిపి లక్షలు వెనకేసుకున్నాడు. . అయితే దానికి తగ్గట్టుగా రాత్రింబవళ్ళు సంస్థల కోసం కష్టపడి పని చేస్తూ ఉండటంతో ఎవరూ అతని మీద ఎవరూ ఎలిగేషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేయలేదు.

అతని దృష్టిలో సంపాదించడం చేతగాని వాడు జీవించడం అనవసరం అంటాడు. బ్రతికున్నప్పుడే అన్ని ఆస్తులు సమకూర్చుకోవాలని తాపత్రయ పడుతూ ఉంటాడు. ఆ క్రమంలో కనిపించిన చోటల్లా స్థలాలు కొనేశాడు. ఇంట్లో పిల్లల్ని ఎదగడానికి అవకాశం ఇవ్వక వాళ్ళ భవిష్యత్తు తరాలకు తనే సోపానాలు వేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడితో అతని ఆరాటం ఆగలేదు. వ్యాపారం చెయ్యడానికి పెళ్ళాం పిల్లలను స్వదేశంలోనే వదిలేసి దుబాయి వెళ్ళి బిజీ అయిపోయాడు. అక్కడే ఉండి ఇండియాలో వివిధ ప్రదేశాలలో నాలుగైదు అపార్ట్మెంట్లు కొనడానికి డబ్బులు ఏర్పాటు చేశాడు. ఇది కాకుండా పూర్వీకులు ఇచ్చిన తన స్వగ్రామంలో ఉన్న ఇల్లును అమ్మేసి సిటీలో నాలుగు బెడ్ రూమ్ల ఇల్లు కట్టించాడు. ఇన్ని రకాలుగా ఇంత ఆస్తిని సంపాదించినా ఏ టాక్స్ వాళ్ళు అతని మీద దాడి చేయకుండా జాగ్రత్తపడ్డాడు. దుబాయిలో వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండటం వల్ల అతని భార్యా పిల్లలు"మీరు మా కోసం బెంగపెట్టుకొనవసరం లేదు. మేము ఇక్కడ హాయిగా బ్రతికేస్తున్నాం. వీలున్నపుడు మేమే అక్కడికి వచ్చి చూస్తాం "అనడంతో ఆ మాటలు పద్మనాభరావుకు మరింత ధైర్యాన్ని , ఊతాన్ని ఇచ్చాయి.

స్వదేశంలో స్వంత ఇంట్లో భార్యా పిల్లలతో ఉన్నప్పుడు వేళకు వేడి వేడి భోజనం, అన్ని వసతులు వాటికంతట అవే అమరిపోయి గుండులా ఉండే అతనికి దుబాయిలో సరైన తిండి సౌకర్యం లేక , వేళకు నిద్రా నిప్పులు లేక శరీరం సగం తగ్గింది. దానితో పాటు వ్యాపారంలో టెన్షన్ కూడా పెరిగింది. ఒక రోజు బాంక్ ఎకౌంట్లు చూసుకుంటున్న పద్మనాభరావుకు హటాత్తుగా గుండె పట్టేసినట్టయ్యింది . సమయానికి దగ్గరలో పెళ్ళాం , పిల్లలు లేరు . దేశం కానీ దేశంలో ఉన్నాడు. తన పనులు చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టుకున్నాడు కానీ వాడి బాధ్యత పరిమితం. కుటుంబంలో లోని వ్యక్తులు లాగా అతను దగ్గర కాలేడు. పైపెచ్చు తన యజమాని సంపాదన మీద అతను ఒక కన్నేసి ఉంచాడు. గుండె నొప్పితో గిలగిలలాడుతున్న పద్మనాభరావును హాస్పటలుకు చేర్చాడు. పనిలో పనిగా ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులకు వార్త అందించాడు. దగ్గరా దాపా వాళ్ళు వచ్చి చూడటానికి ? వాళ్ళకు ఫ్లయిట్ దొరికి వచ్చేటప్పటికి ఒకటిన్నర రోజులు పట్టింది. అప్పటికి డాక్టర్లు ప్రధమ చికిత్స అనంతరం గుండెలో ఒక స్టెంట్ వేశారు. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ మామూలు మనిషి అవుతాడు అని అతని భార్యా పిల్లలకు హామీ ఇచ్చాడు. భర్త అనారోగ్యం దృష్ట్యా, పోనీ కొన్నాళ్లు తను కూడా భర్త దగ్గరే ఉందామంటే ఇండియాలో ఉన్న ఇళ్లను చూసుకోవడానికి అక్కడ ఎవరో ఒకరు ప్రతి క్షణం కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరం ఉందని, విలాస జీవితానికి అలవాటు పడ్డ భార్య ఒక్క నిమిషం పరాయి దేశంలో ఉండలేక కొడుకుతో పాటు వెనక్కి వెళ్ళి పోవాల్సిన పరిస్తితి వచ్చింది. అలా అని భర్తను ఇండియా వచ్చేసెయ్యమని చెపుదామంటే కోట్లు సంపాదించి పెడుతున్న వ్యాపారాలు వదిలి రావడం పద్మనాభరావుకు కానీ, ఆ కుటుంబం లోని ఎవరికీ ఇష్టం లేదు. ఆశ్చర్యం ఏమిటంటే, వాళ్ళల్లో ఎవరూ కూడా ఈ సంపాదన ఎందుకు? ప్రాణం కన్నా ఇది ముఖ్యమా అని వారించిన వారు లేరు. పద్మనాభరావు డబ్బు సంపాదనలో వాళ్ళకు భాగముంది . వాళ్ళ ప్రోత్సాహం ఉంది. మనిషి రక్తం అలవాటైన పులి ఇంకా ఇంకా వేటాడుతూనే ఉంటుంది తప్ప అలసి పోయి ఒక మూల కూర్చోధు . సరిగ్గా పద్మనాభరావుది అదే పరిస్తితి. పది రోజుల్లోనే పూర్తిగా కోలుకున్న అతను మళ్ళీ తన వ్యాపార రంగంలో ముందుకు దూసుకుపోతున్నాడు.

"సార్ మీకు ఎవరో ఫోను చేస్తున్నారు . ఇమ్మంటారా?" అన్నాడు పని వాడు.

" ఇటివ్వు " అంటూ ల్యాండ్లైన్ రిసీవర్ అందుకున్నాడు.

" హలో . మీరు పద్మనాభరావు గారేగా ? మీతో రెండు నిమిషాలు మాట్లాడొచ్చా ?"

" ముందు మీరెవరో చెప్పండి. "

" నేను ఒక పారిశ్రామికవేత్తని. పేరు నిరంజనరావు. మీరు పెద్ద వ్యాపార వేత్త అని విన్నాను. నేను ఇండియా లో ఒక పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. మీకు ఇష్టమైతే మీతో భాగస్వామ్యం అవ్వాలని అనుకుంటున్నాను. మీరు ప్రస్తుతం దుబాయి లో ఉన్నారని తెలిసింది. . మీరు ఎప్పుడు ఇండియా వస్తారు ? మీతో అన్ని విషయాలు మాట్లాడాలి . మీకు కుదరకపోతే నేను దుబాయి వచ్చి మిమ్మల్ని కలవడానికైనా సిద్దమే "

"చాలా సంతోషం . మరో రెండు నెలల పాటు నాకు ఇక్కడ దుబాయిలోనే వ్యాపార ఒప్పందాలు ఉన్నాయి. పైగా వాళ్ళ నుండి భారీ పెట్టుబడులు కోసం ప్రయత్నిస్తున్నాను. అవి అన్నీ విజయవంతంగా నెరవేరితేనే మీరు చెప్పిన పవర్ ప్రాజెక్టులో నా భాగస్వామ్యం వహించగలను . అప్పటివరకూ మీరు వేచి చూడగలిగితే పర్వాలేదు. ఈ లోపు ఒకసారి వచ్చి నన్ను కలవాలనుకుంటే మనం ఆ వ్యాపారానికి సంబంధించిన అన్ని లావాదేవీలు మాట్లాడుకోవచ్చు .. సరేనా " అంటూ ఫోన్ పెట్టేశాడు పద్మనాభరావు.

అనుకున్నట్టుగా నిరంజనరావుతో పవర్ ఒప్పందం కుదిరింది. ఇప్పుడు పద్మనాభరావు వ్యాపారాలు అంచెలంచెలుగా పెరిగిపోతున్నాయి.

అక్కడ ఇండియాలో పద్మనాభరావు పెద్దకొడుకు చదువు డిగ్రీ పూర్తికాకుండానే ఆగిపోయింది. తండ్రి వ్యాపారాలు అతన్ని ముందుకు వెళ్లకుండా అడ్డుపడ్డాయి. అవును తరతరాలకు సరిపడా సంపాదించాడాయే. కూర్చుని తిన్నా తరిగేది కాదు.

పద్మనాభరావు కూతురు రమ్య బాగానే చదువు వెలగబెడుతోంది అనుకుంటూ ఉండగానే ఎవరో ప్రేమలో పడింది. అవతలవాడు అన్ని రకాలుగా అనర్హుడు. ఆ అమ్మాయి కేవలం వయసు ప్రభావం వల్ల అతని మోజులో పడి కొట్టుకుపోతోంది. బాగా డబ్బున్న కుటుంబాలలో లాగానే పద్మనాభరావు భార్యకు పిల్లల ఆలనా పాలన చూసే సమయం లేదు. క్లబ్బులు, విలాసాలతోనే సరిపోతోంది. పద్మనాభరావుకు మాత్రం తన కూతురికి తన స్తాయికి తగ్గట్టు వ్యాపార రంగంలోని దిగ్గజాల కుటుంబాలలో వారికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచన. ఆలోచన అయితే ఉంది కానీ ఎంతమటుకు ఊపిరి ఆడని పనులలో కొట్టుకుపోతున్న అతనికి కూతురు చేస్తున్న పనులు దృష్టికి రావడం లేదు.

ఎన్నో పెద్ద పెద్ద డబ్బున్న కుటుంబాలలో చాలా మందిలో జరుగుతున్నట్టుగానే పద్మనాభరావు కుటుంబంలోనూ జరిగింది. రమ్య ఒకరోజు చెప్పాపెట్టకుండా వయసు ఆకర్షణతో తను మోజు పడిన వాడితో లేచిపోయింది. పద్మనాభరావు కొడుక్కి ఏ బాధ్యతా పట్టలేదు. చెల్లెలు ఎటుపోయిందో ఆరా తీసే జ్ఞానం , చొరవ అతనిలో ఏ మాత్రమూ లేదు. ఇక అతని భార్య సరే. తన విపరీత పెంపకంవల్ల , ఇంట్లో విలాస జీవితానికి బానిసలవడం వల్ల తన కూతురు తప్పు దారి పట్టిందని ఆ మూర్ఖురాలికి ఆలోచనే లేదు.

ఇండియాలో తన పిల్లలు చేస్తున్న నిర్వాకం అంతా పద్మనాభరావు దృష్టికి వచ్చింది. కొన్నాళ్లు వ్యాపారాన్ని తన సహచరులకు అప్పగించి హుటాహుటిన ఇండియా వచ్చాడు.

కూతురు ముక్కూ , మొహం తెలియని వాడిపైన మోజుపడి ఇల్లు వదిలి పారిపోయినా ఆ ప్రభావం తన వ్యాపార రంగం మీద పడకుండా ఉండటానికి ఆమె పైన ఏ మాత్రమూ ద్వేషం పెట్టుకోకుండా పారిపోయిన ఆ జంట కోసం కేవలం ఇరవై నాలుగు గంటలలో వెతికించి వాళ్ళ పెళ్లి ఎవరూ ఊహించనంత ఘనంగా చేయించాడు. అల్లుడికి తన వ్యాపార రంగంలో పెద్ద వాటా ఇచ్చేసి కూతురు, అల్లుడు మనసుల్లో హిమాలయాలంతా ఎదిగిపోయాడు. ఇక కొడుకు సరే. తండ్రి వ్యాపారాలు దినదినాభివృద్ది చెందుతున్నంత వరకు తన భవిష్యత్తుకు ఏ మాత్రమూ డోకా లేదని గట్టి నమ్మకంతో ఉన్న అతగాడికి అన్ని కంపినీలలో వాటాలతో పాటు కొత్తగా వచ్చిన పవర్ ప్రాజెక్టు కూడా చూసుకునే బాధ్యతను అప్పగించడంతో ఆ కుటుంబంలో అనేక లొసుగులు వున్నా , పూడ్చలేని అగాధాలు ఉన్నా అవన్నీ కోట్ల రూపాయల ఆస్తుల చాటున మరుగున పడిపోయాయి. ప్రపంచం దృష్టిలో పద్మనాభరావు కుటుంబం అన్నిరకాల పైకొచ్చిన కుటుంబమే మరి . డబ్బున్న వాడికి ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది. హత్యలు చేసినా సునాయాసంగా బయటపడొచ్చు. ఎటువంటి మచ్చనైనా చెరిపేసుకోవచ్చు. పోయిన పరువును మళ్ళీ పోగుచేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ పద్మనాభరావు తన ఆస్తులు, వ్యాపారం మరింత పెంచుకోవడానికి దుబాయి బయలుదేరి వెళ్తున్నాడు ***

సమాప్తం

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ