" సుధా! అమ్మా , సుధా!" " పిలిచారా, మామయ్యా!" "అవునమ్మా!" "ఉండండి, చెయ్యి కడుక్కు వస్తాను" " ఆ, చెప్పండి మామయ్యా! ఏం కావాలి?" " నా కళ్లజోడు కనిపించడం లేదమ్మా, ఇందాకటి నుంచి వెతుకుతున్నాను" "గంట క్రితం మీకు కాఫీ తెచ్చినప్పుడు పేపరు చదువుతున్నారు కదా," అని కోడలు సుధ మాధవరావు కూర్చున్న సోఫా, పక్కన టేబుల్, టి.వీ స్టాండ్ ఎక్కడ వెతికినా ఆయన కళ్లజోడు కనిపించలేదు. కొడుకు ప్రణవ్ కి టిఫిన్ లంచ్ బాక్స్ సిద్ధం చేసి స్కూల్ బస్ కి పంపి తనకి లంచ్ బాక్స్ తయారు చేసుకుని మామయ్యకు డైనింగ్ టేబుల్ మీద భోజనం ఏర్పాట్లు చేసేసరికి సమయం క్షణాల్లో గడిచిపోయింది. టూ వీలర్ వెహికిల్ ఐనా ట్రాఫిక్, సిగ్నల్స్ దాటి ఆఫీసుకి చేరేసరికి తల ప్రాణం తోకకి వచ్చినంత పనవుతుంది.మామయ్య గారికి తోడుండే సుబ్బయ్య భార్యకి ప్రాణం బాగోలేదని హాస్పిటల్లో చూపించాలని ముందుగా శలవు తీసుకున్నాడు. ప్రణవ్ స్కూల్ నుంచి వచ్చేసరికి మద్యాహ్నం రెండవుతుంది. బేంక్ లో ఆడిట్ జరుగుతున్నందున తనకు శలవు పెట్టే అవకాశం లేదు. బేంక్ ఆఫీస్ టైమవుతోంది అనుకుంటూ డ్రాయింగ్ రూమ్ అంతా వెతికినా ఆయన కళ్ళజోడు కనబడ లేదు. ఎందుకైనా మంచిదని వాష్ రూమ్ కెళ్లి చూడగా వాష్ బేసిన్ పైన షెల్ఫ్ లో కళ్లజోడు కంటపడింది. వెంటనే తెచ్చి ఆయన కిచ్చి దొరికిన విషయం చెప్పింది. " అవునమ్మా, ఇందాక బాత్రూం కెళ్లినప్పుడు చేతులు ,ముఖం కడుక్కుని కళ్లజోడు అక్కడే మర్చిపోయినట్టున్నాను" అని తన మతిమరుపును జ్ఞప్తికి తెచ్చుకున్నారు మాధవరావు. ఇటువంటి సంఘటనలు ఇదివరకు కూడా చాలా జరిగాయి.వయసు పైబడిన మాధవరావు గారికి ఈమద్య మతిమరుపు, చేతులు వణకడం చేస్తున్నారు. కాఫీ తాగేటప్పుడు చేతులు వణికి బట్టల మీద పోసుకున్నారు. కొడుకు శ్రీధర్ న్యూరోలజిస్టుకు చూపగా వయసుతో పాటు ఆల్జిమర్స్, డెమష్నియా నరాల వ్యాధులు సాధారణమని చెప్పి మందులు వాడుతూ ఎప్పుడూ ఎవరో ఒకరు కనిపెటట్టుకుని ఉండాలని సూచించారు. ఇదివరకు కూడా మాధవరావు గారు బాత్రూం అనుకుని కిచెన్ వైపు రావడం జరిగింది. ఒకసారి గుడికి వెళ్లిన ఆయన ఇంటి దారి తప్పి పార్కు వైపు వెల్తూంటే వారి వీధిలో ఉండే విద్యార్థి సిద్ధార్థ్ గుర్తుపట్టి ఇంటి దగ్గర వదిలి పెట్టాడు. అందువల్ల ఆయన వెంట ఉండి కాలకృత్యాలకు, అవుసరమైన పనులు చెయ్యడానికి ఒక సహాయకుడిగా సుబ్బయ్య అనే మనిషిని ఏర్పాటు చేసారు. మాధవరావు గారు కాలేజీ లెక్చరర్ గా ఉద్యోగం చేసేవారు. చేతికి అందొచ్చిన పెద్ద కొడుకు శివరామ్ వెహికిల్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయాడు.ఆ దెబ్బ ఆయనను మానసికంగా కుంగదీసింది.ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ పొంది విశ్రాంత జీవితం గడుపుతున్నారు. రెండవ కొడుకు శ్రీధర్ ను సాఫ్ట్వేర్ ఇంజినీర్ని చేస్తే మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద హోదాలో జాబ్ చేస్తున్నాడు. కొడుకు కంపెనీ పని మీద ఎక్కువగా విదేశాలకు వెళ్లవలసి వస్తోంది. మాధవరావు చిన్ననాటి మిత్రుడు వెంకటరావు ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గా ఉద్యోగం చేస్తున్నారు.వారిది పెద్ద కుటుంబం అవడం వెంకటరావు పెద్ద కొడుకుగా ఇంటి భాద్యతలు ఆర్థిక ఇబ్బందులతో గడ్డుగా రోజులు గడుపుతున్నారు.ముగ్గురు ఆడపిల్లల పోషణ చదువులు కష్టంగా ఉండేది. పెద్ద కూతురు సుధను డిగ్రీ చదివిస్తే బేంక్ సెలక్షన్ ఎగ్జామ్స్ రాసి ప్రభుత్వ రంగ బేంక్ లో జాబ్ సంపాదించి ఆర్థికంగా సహాయపడి చెల్లెళ్లను డిగ్రీలు చదివించి టీచర్స్ గా సెటిల్ చేసింది. భార్యతో చిన్న నాటి బాల్యం చదువులు స్నేహితుల ముచ్చట్ల సందర్భంగా మాధవరావు గారికి వెంకట్రావు గుర్తుకు వచ్చి వాకబు చెయ్యగా ఆయన కుటుంబం ఆర్థిక పరిస్థితి తెలిసి బాధ పడ్డారు. మిత్రుడు వెంకటరావుకు తోడుగా నిలవాలని తలిచి మాధవరావు తన స్వంత ఊరికి చేరి వెంకటరావును పరామర్సించారు.అక్కడే వారి పెద్దమ్మాయి సుధను చూడటం, ఆ అమ్మాయి అణకువ వినయం చూసి తమ కుమారుడు శ్రీధర్ కు తగిన జోడు అని అదీగాక వెనక ఆడసహాయం లేనందున భార్య ఎదుర్కొనే ఇబ్బందులు తలిచి పెళ్లి నిశ్చయ తాంబూలాలు తీసుకోవడం జరిగింది. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తనకు శ్రీకృష్ణుడు కుచేలుడికి చేయూత నిచ్చినట్టు మిత్రుడు మాధవరావు తన స్నేహ బంధాన్ని నిరూపించి రూపాయి కూడా కట్నం, కానుకలు లేకుండా తన స్వంత ఖర్చుతో సుధ పెళ్లి జరిపించి కోడలుగా చేసుకున్నారు. కొత్త కోడలుగా మాధవరావు గారింట్లో అడుగు పెట్టిన సుధ అత్తమామ లిద్దర్నీ అమ్మానాన్నల మాదిరి కంటికి రెప్పలా చూసుకునేది. తను కాపురానికి రావడం అత్త గారు కేన్సర్ తో బాధ పడటం చూసింది. తనకి జీవిత భాగస్వామిగా ఎంతో సేవచేసిన భార్య కేన్సర్ బారిన పడటం మాధవరావు గారు తట్టుకోలేక పోయారు.డబ్బు కోసం చూడక ఎందరో కేన్సర్ స్పెషలిస్టులకు చూపించినా ఫలితం లేకపోయింది. కోడలు సుధ రాత్రింబవళ్లు అత్తగార్ని కనిపెట్టుకుని సేవలు చేసింది. భార్య మరణం కోలుకోలేని దెబ్బ తీసింది మాధవరావు జీవితంలో. మామ గారికి దగ్గరుండి అన్ని సపర్యలు చేస్తూ ఆయనను మామూలు మనిషిని చేసింది కోడలు. వయసుతో పాటు మానసిక ఆరోగ్యం దెబ్బ తినడం, పరాకు, మతిమరుపు ఆయన్ని వేధిస్తున్న సమస్యలు. భర్త శ్రీధర్ ఉద్యోగ రీత్యా విదేశీ ప్రయాణాలు, భార్య మరణంతో దిగులుగా ఉన్న మామగారిని చూసుకోవడం, రోజువారీ తన బేంక్ ఉద్యోగం సుధకు ఎంతో ఇబ్బందిగా మారింది. ఇంటి పరిస్థితుల దృష్ట్యా తను ఉద్యోగం మానేస్తానని సిద్దమవగా మాధవరావు వద్దని వారించగా సుధ జాబ్ చేస్తోంది. మాధవరావు గారి మంచి మనసు, ఆపద్భాంధవుడిలా తండ్రిని ఆదుకున్న స్నేహభావం, అత్త గారి ఆత్మీయత, భర్త శ్రీధర్ చూపే ప్రేమానురాగాలు సుధను అనురాగాల పల్లకిలో ఓలలాడించింది. * * * *