మమతల పల్లకి - కందర్ప మూర్తి

mamatala pallaki

" పిన్నీ, ఎలాగున్నావ్?"అంటూ ఆటో దిగిన సరోజ హాల్లో కొచ్చి పార్వతమ్మను చూసి చేతులు పట్టుకుని పలకరించింది. " ఏమే , సరోజా !ఎలాగున్నావే ? చాలా రోజుల తర్వాత నిన్ను చూసానే" అంటూ అక్క కూతురు సరోజని సోఫాలో కూర్చోపెట్టి పక్కన కూర్చుని కుశల ప్రశ్నలు అడగసాగింది పార్వతమ్మ. "ఔను పిన్నీ! చాల రోజుల తర్వాతే రావడం జరిగింది. పిల్లల చదువులు, అల్లుడి గారి డ్యూటీ మీద కేంపులు తీరిక చిక్కడం లేదు. పెద్దది రమకి డిగ్రీ పరీక్షలు పూర్తయాయి. అది సి.ఎ చేస్తానని ముందు నుంచి కోచింగ్ క్లాసులకు వెల్తోంది.ఆ చదువులతోటే అది రోజంతా బిజీబిజీగా ఉంటోంది. చిన్నోడు వాసు ఇంటర్ చదువుతు జెఇఇ ఎంట్రన్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు.ఆయన ఎ.జి ఆఫీసు ఆడిట్ డ్యూటీలతో నెలలో సగం రోజులు కేంపుల్లో ఉంటారు. ఇంటి పనులు, పిల్లల చదువుల భాద్యత నాకు తప్పడం లేదు.ఏదైనా శుభకార్యం ఉంటే పట్నంలో ఐతే వెళ్లే అవకాశం ఉంటోంది కాని పై ఊళ్లకి వెళ్లడం అవడం లేదు.ఇప్పుడు ఆయనకి నాలుగు రోజులు శలవులు కలిసి వచ్చాయి. ఒకసారి మిమల్ని అందర్నీ చూడటమవుతుందని పిల్లల్ని ఆయనకి అప్పచెప్పి వంటమనిషి వెంకమ్మ గార్కి నేను వచ్చేవరకూ వంట పనులు చూడమని చెప్పి ఇలా వచ్చాను పిన్నీ! అంటూ పార్వతమ్మ గారితో కుటుంబ కబుర్లు చెబుతోంది. సరోజ. " మా అక్క పోయినప్పటి నుంచి ఆఇంటి రాకపోకలే కరువయ్యాయి.తర్వాత భావ గారు గతించడం మగపిల్లలు విదేశాల్లో సెటిలవడం, హైదరాబాదులో ఉన్న నువ్వూ నీ కుటుంబ పనుల వత్తిడితో రావడమే కరువైంది. పెళ్లీడు కొచ్చింది రమకి సంబంధాలు చూస్తున్నారా? వాళ్లు చదువులంటూ తాత్సారం చేస్తారు. మనమే నచ్చచెప్పి ఏదో మంచి సంబంధం చూసి నాలుగు అక్షింతలు వేసేస్తే సంసారంలో కుదురుకుంటారు లేకపోతే చదవులంటూనే జుత్తు నెరిసే వరకూ కాలం గడుపుతారు. ఏ వయసు ముచ్చట ఆ వయసులో జరగాలి" అంటూ సరోజకి నచ్చచెబుతోంది పార్వతమ్మ. " నువ్వు చెప్పింది నిజమే పిన్నీ, కాని పాత తరం రోజులు కావుగా. ఇప్పటి పిల్లల ఆలోచనలు అభిప్రాయాలు వేరు. మనలా పెద్దవాళ్లు తెచ్చిన సంబంధాలు చేసుకోడానికి ఇష్టపడటం లేదు.పెద్ద చదువులతో పాటు హోదా ఉద్యోగం, హంగులు ఆర్భాటాలు కావాలను కుంటారు.మోడరన్ జీవితం కోరుకుంటున్నారు. కాబట్టి మనం కూడా వాళ్ల అభిరుచులు, ఆశయాలకు విలువ ఇవ్వాలి. నన్నే చూడు, డిగ్రీ అయిన తర్వాత టైపు షార్టహేండ్ నేర్చుకున్నాను. కొంత కాలం ఉద్యోగం చేస్తానంటే నాన్న వినకుండా మంచి గవర్నమెంటు ఉద్యోగి అని పెళ్ళి చేసేరు. తర్వాత పిల్లలు సంసారం ఇలా ఊపిరి సలపకుండా జీవితం సాగుతోంది." పార్వతి పిన్నితో తన కుటుంబ విషయాలు మాట్లాడుతోంది సరోజ. పెరట్లో తులసిమొక్కకి పూజ చేస్తున్న కోడలు సుమ ఎవరు ఈ సమయంలో అత్తగారితో ముచ్చట్లు పెట్టుకున్నారని పూజ ముగించి హాల్లోకి వచ్చి చూస్తే ఆడపడుచు సరోజ , అత్తగారి పక్కన కనబడింది. " హాయ్, వదినా! ఎంతసేపైంది వచ్చి? కొత్త వారి మాటలు వినబడుతుంటే ఈ సమయంలో ఎవరు వచ్చారని ఆలోచిస్తున్నానంటు పలకరించి ఉండు , కాఫీ కలిపి పట్టుకు వస్తానంటూ వంట గదిలో కెళ్లి రెండు కాఫీ కప్పులతో వచ్చి వారి పక్కన కూర్చుంది. "నీకేదీ కాఫీ ? "అడిగింది సరోజ. " ఈరోజు శుక్రవారం ఉపవాసం.నీళ్ళు తప్ప మరేదీ ముట్టను" అంది సుమ. "ఏమిటి, వదినా! ఇంకా వారాలు వ్రతాలు ఉపవాసాలంటూ ఆరోగ్యం పాడు చేసుకుంటావు.ఈ మద్య నీకు తలనొప్పి, తల తిరగడం వంటి ఇబ్బందులు వస్తున్నాయని నాని గాడు ఫోన్లో చెప్పాడు. ఇలా పూజలు వారాలు ఉపవాసాలంటూ ఏమీ తినడం మానేస్తే నీ ఆరోగ్యం ఏం కాను? సుశీలకి పెళ్లి చెయ్యాలి. నారాయణ గాడిని ఒక ఇంటివాడిని చేసి కోడల్ని తేవాలి. ఇన్ని భాద్యతలు పెట్టుకుని నీ ఆరోగ్యం బాగులేకపోతే ఎలా రోజులు గడిచేది? పిన్నికి కూడా పెద్ద వయసు.ఆవిడను కూడా కనిపెట్టుకు ఉండాలి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి వదినా!" సుమకి నచ్చచెబుతోంది సరోజ. " భాద్యతలు తప్పవు సరోజా, మీ అన్నయ్యది వైదీకమాయె.ఇంట్లో మడి, ఆచారం, పూజలూ తప్పని సరి. వైదిక కుటుంబం అన్న తర్వాత ఇవన్నీ తప్పవు." " నిజమే సుమా, ఉద్యోగాల వారితో పోలిస్తే వైదిక వృత్తిలో ఎన్నో భాద్యతలు నియమ జీవితం ఆచార వ్యవహారాలకు కట్టుబడి ఉండాలి. అలాగే ఇంట్లో వాటిని పాటించవల్సి ఉంటుంది. నువ్వు డిగ్రీ చదివి కూడా మీ నాన్న గారి మాటకు గౌరవమిచ్చి వేదం తప్ప మరే పాఠశాల చదువులేని అన్నయ్యని పెళ్లి చేసుకుని నీ పెద్ద మనసును చాటుకున్నావు. పిల్లల్ని భాద్యతగా పెంచుతున్నావు. అత్త గార్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నావు. నీ కుటుంబ భాద్యతల ముందు అన్ని హంగులతో సుఖమయ జీవితం గడుపుతున్న మేము దిగదుడుపే. ఈ రోజుల్లో ఏమాత్రం చదువుకున్నా ఉద్యోగస్థుడే భర్త కావాలని, హంగుల జీవితం ఉండాలని ప్రతి ఆడపిల్లా కోరుకుంటుంది. వాటన్నిటిని కాదని సాంప్రదాయ కుటుంబ కోడలిగా నీ జీవితాన్ని ధారపోసావు. ఇంతటి ఉదాత్త మనసు ఎవరికుంటుంది ఈరోజుల్లో" ఆడపడుచు సుమ ఔదార్యాన్ని మెచ్చుకుంది సరోజ. " అన్నయ్య ఏదైనా కార్యక్రమానికి వెళ్లేడా!" అడిగింది. " ఔను, సరోజా! ఇవాళ ఒక గృహ ప్రవేశం కార్యక్రమానికి ఉదయాన్నే తయారయి వెళ్లేరు.వచ్చేసరికి మద్యాహ్నమవుతుంది." సమాధానం చెప్పింది. ఇంతట్లో సుమ కూతురు సుశీల సంగీత క్లాసు నుంచి ఇంటికి వస్తూనే సరోజ అత్తని చూసి " హాయ్, అత్తా! ఎప్పుడొచ్చావు? ప్రకాశం మామయ్య, రమ వదిన, వాసు బావ ఎలాగున్నారు?" ప్రశ్నల మీద ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. " అందరూ బాగానే ఉన్నారు సుసీ! నీ సంగీతం క్లాసులు ఎంతవరకు వచ్చాయి? ఇంటర్ పరీక్షలు ఎప్పటి నుంచి? బాగా ప్రిపేరవుతున్నావా" తన సందేహాలు తీర్చుకుంది సరోజ. " ఇంటర్ అవగానే డిగ్రీ పూర్తి చేసి సంగీతంలో డిప్లమో తీసుకుంటాను అత్తా!" తన అభిప్రాయం చెప్పింది. " మీ అమ్మ కోరిక కూడా అదే సుశీలా, నువ్వు డిగ్రీ పూర్తి చెయ్యాలి.సంగీత సుశీలగా వేదికల మీద కచేరీలు ఇవ్వాలి. పదిమందికి సంగీతంలో ప్రావిణ్యం కల్పించాలి. అమ్మా నాన్నలకు పేరు తేవాలి." ప్రోత్సహించింది. "అలాగే అత్తా! తప్పక నావంతు కృషి చేస్తాను." అని చెప్పి ఇంట్లోకి వెళ్లింది సుశీల. కబుర్లు చెప్పుకుంటూ పార్వతమ్మ, సరోజ , సుశీల భోజనాలు చేసే సరికి వెంకటేశ్వర్లు కొడుకు నారాయణను వెంటతీసుకుని గృహ ప్రవేశ కార్యక్రమ వస్తువులు సంచులతో ఇంటికి చేరేసరికి గుమ్మంలో కొత్త ముఖం సరోజ చెల్లిని చూసి ఆశ్చర్య పోయాడు. "ఏమే సరోజా, ఎంతకాలమైంది నిన్ను చూసి? బావగారు, పిల్లలు అంతా బాగున్నారు కదా! " కుశల ప్రశ్నలు అడిగి పెరట్లో కాళ్లు కడుక్కోడానికి వెళ్లేడు వెంకటేశ్వర్లు. " ఏరా నారాయణా, నీ వైదికం ఎంతవరకు వచ్చింది? నాన్న వెంట ఉంటూ అన్ని కార్యక్రమాలు నేర్చుకుంటున్నావన్న మాట.నాన్నలా అందరిలో మంచి పేరు సంపాదించుకోవాలి.వేదంలో ఘనాపాటీలైన మీ తాతల మాదిరి అందరి చేతా శభాష్ అనిపించుకోవాలని " మెచ్చుకుంది నారాయణని. "అలాగే , అత్తా! మీ అందరి ఆశీసులు ఉండాలి" అని వినయం కనబరిచాడు. ఇలా ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ ఆత్మీయతతో మమతల పల్లకిలో ఊగిసలాడారు ఆ కుటుంబ సబ్యులు. * * *

మరిన్ని కథలు

Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్
Kshama lo dharitri
క్షమలో ధరిత్రి.
- Aduri.HYmavathisrinivasarao,
Marmam
మర్మం
- రాము కోలా దెందుకూరు
Korthi
కొర్తి
- బివిడి ప్రసాద రావు
Atrhata
అర్హత
- డి.కె.చదువుల బాబు
Antataa neeve
అంతటా నీవే
- షామీరు జానకీ దేవి
Ahakaram techhina sapam
అహంకారం తెచ్చిన శాపం
- గొట్టాపు శ్రీనివాస రావు
Donga chetiki taalaalu
దొంగ చేతికి తాళాలు
- కొల్లాబత్తుల సూర్య కుమార్