దేవయాని - కర్లపాలెం హనుమంతరావు

Devayaani

సూటిగా చెప్పేస్తా కథ .

బి.హెచ్. ఇల్ . లో నేనో ఇంజనీర్ని .

కంపెనీ పని మీద ఓ వారం పాటు నెల్లూరు ప్రాంతాలకు వెళ్లాల్సివచ్చింది.

పని మధ్యలో వచ్చిన ఓ శుక్రవారం నాన్నగారి తిథి . విధిగా అమ్మ జరిపించడం గుర్తొచ్చి ఈసారి మాత్రం నాగా ఎందుకని బసచేసిన హోటల్లో విచారిస్తే కావల్నించి వచ్చే ఓ శాస్త్రిగారికి నన్నప్పగించారు .

' దగ్గర్లోనే రామతీర్థం ఉంది. ఇట్లాంటి ధార్మిక కార్యక్రమాలకు అక్కడ అన్ని సదుపాయాలూ

ఉంటాయ్ . మబ్బులో కాలు ఝాడిస్తే పొద్దు గుంకేలోగా తిరిగొచ్చేయచ్చు' అన్నారు శాస్త్రి గారు .

ఆ ఏరియాలూ చూసినట్లుంటుందని పెందలాడే బైల్దేరి ఏడింటికల్లా రింగు రోడ్డు దగ్గర బస్సు దిగిపోయాం .

'ఇంకో అరగంట ఈ ఇసుక పర్రల్లో నడిస్తే తీర్థం వస్తుంది. కానీ, మబ్బులు

కమ్ముకుంటున్నాయే! ' అని సందేహించినా నా బలవంతం మీద బైల్దేరారు శాస్త్రిగారు .

పని పూర్తి చేసుకొని ఒంటిగంట కల్లా తిరుగు ముఖం పట్టాం తృప్తిగా .

సగం దూరం రాగానే భోరున వర్షం ! అంతకంతకు జోరు ఎక్కువవడమే గాని తగ్గే సూచనలు కనిపించడంలా . తల దాచుకుందామన్నా దగ్గర్లో ఏ ఆశ్రయం కనిపించలేదు.

'దగ్గరి దారొకటి ఉంది. ఎప్పడో గాని అటేపు గుండా వెళ్ళరు మర్యాదస్తులు ' అన్నారు శాస్త్రిగారు.

ఇప్పుడా చాదస్తాలన్నీ పెట్టుక్కూర్చునే టైమేదీ! అప్పటికే సగం తడిసి ముద్దయ్యాం. పంతులు గారి సంగతట్లావుంచి రోజుల్లా వానలో తడిస్తే తెల్లారి ఏ పడిశమో పట్టుకోడం ఖాయం . వచ్చిన పని గడువు లోగా సక్రమంగా అవకబోతే ఆఫీసులో మాటొస్తుంది . మొండిగా అడ్డదారినే ఎంచుకున్నా. శాస్త్రి గారికీ రాక తప్పింది కాదు .

ఆ అడ్డదారి ఊళ్లో గట్టిగా పాతిక నిట్రాడు పాకలు కూడా లేవు. జల్లు పడ్తుందని తలుపులు మూసి ఉన్నాయ్ అన్నీ . ఊరి చివర్న ఏ తలుపుల్లేని పాకొకటి కనిపిస్తే అందులో దూరేసా. శాస్త్రి గారూ నా వెంటే.. సంశయిస్తో .

పంతులుగారి తటపటాయింపుకు కారణం లేకపోలే . . అదో కల్లు పాక !

గుప్పున కొట్టే ఆ పులవ గబ్బుకు కడుపు తిప్పినట్లయింది. అయినా తప్పదుగదా ! అప్పటికే తలారా స్నానమయింది ఇద్దరికీ.

పాకలో చేరిన మూకలో ఎవడో వెకిలిగా ' మన పంతులొచ్చాడు . కాస్త పక్కకు జరుగండ్రా! ఆళ్లక్కూడా ఓ ముంత మిగల్చవే .. చప్పగా తడిచి వణకతండారు బాపనోరు ' అంటం. . తతిమ్మా తాగుబోతులంతా విరగబడి నవ్వడం!

శాస్త్రిగారికి ఉక్రోషం ముంచుకొచ్చింది. పదమూడేళ్ల పాపొకతి సత్తు గ్లాసులో మంచితీర్థం తెచ్చిచ్చినా పుచ్చు కోకుండా అట్లాగే వానలో తడుస్తో వెళ్ళిపోయారెక్కడికో. . ఎంత పిల్చినా వెనక్కైనా తిరిగి చూడకుండా !

నేను మాత్రం మొండిగా అక్కడే ఉండిపోయా! పిట్టగోడ మీదకు చేరగిలబడి తడవకుండా దాచిన చివరి సిగిరెట్టు నెట్లాగో ముట్టించి పొగ వదలుతూ బైటకు చూస్తున్నా!

జల్లు కాస్త తెరిపిస్తే ఈ దరిద్రం నుంచి బైటపడాలని తొందర .

సిగిరెట్ అంతమయిందే కాని .. ఈ గాలి వానకు మాత్రం అంతూ పొంతూ లేదు.

చీకట్లు కూడా కమ్ముకొస్తున్నాయి . పైపెచ్చు తట్టుకోలేని చలిగాలి. వెచ్చటి టీనో, కాఫీనో గొంతులో పడితే బావుణ్ణు !

నవ్వొచ్చింది. కల్లుపాకలో కాఫీ కోసం కలవరించడం ! అక్కడికీ మనసాగక అక్కడక్కడే తచ్చర్లాడే ఇందాకటి పాపనడిగా !

తలడ్డంగా ఊపింది తను. చెత్తా చెదారం ఏరి బుట్టలో వేస్తోందా పాప .

'సచ్చినోళ్లలారా! చీకటడుతుంది. లెగండి .. లెగండి! ఇగ కొంపలకి ఎళ్లి సావండి .. పెల్లాం బిడ్డల ఉసురు ఎంతకాలమిట్లా పోసుకుంటార్రా ! ' అంటూ హఠాత్తుగా తడికవతల్మించి ఓ అమ్మాయి ప్రత్యక్షమయింది!

' మర్దలు పిల్లా ! ఇంకో పిక్క గొంతులో పణ్ణీయవే ! మంచి మిండగాణ్ణి కుదిర్చి పెడ్తాగా నైటుకి! ' అన్నాడో వెధవ ముద్ద ముద్దగా!

' అట్టాగేలా బావా .. నీ కొంపలోనే దాచినట్టుండావే మిండగాణ్ణి ! బేగి బైటికి సావు! అక్క బద్రం ' అంది ఊడ్చే ఊడ్చే చీవురెత్తి ఆ కూసినాడి మొహం మీద రెండు పెట్టి .

ఆ దెబ్బతో అందరూ తూగుతూ వాగుతూ బైటిక్కదిలారు! పాక ఇట్టే ఖాళీ అయిపోయింది!

మిగిలింది నేనొక్క ణ్ణే! బైటికెళ్లాలి .. తప్పదు . . పరువు నిలబడాలంటే! లేచి నిలబడ్డా .

'మీరు కూర్చోండి సార్ ! జల్లు తగ్గినాకే వెళుదురు గానీ! ' అందామె అంత గావుగొంతునూ క్షణంలో వీణ తీగల మీటినట్లుగా మార్చేస్తూ ! పాత యాస కూడా లేదు!

కల్లు కుండలు లోపలికి పట్టడంలో చిన్న పిల్లకు సాయం పట్టిందా అమ్మయి. ఇద్దరూ కల్సి ఐదు నిమిషాల్లో ఆ ప్రదేశాన్నంతా శుభ్రం చేసేసారు.

'వణికిపోతున్నారు. లోపల పొయ్యి మండుతుంది. చలి కాచుకోవచ్చు ! బట్టలన్నా కొద్దిగా ఆరతాయి గదా! ' అంది తడిగుడ్డతో ఆ గచ్చంతా తుడుస్తూ !

ఆవరణంతా అగరు ధూపం వాసన .

పాప ఓ పెద్ద స్టీలు గ్లాసుకు నిండా టీ తెచ్చి నా ముందుంచింది.

' ఏమనుకోవద్దు సార్! ఆ ఎంగిలి మంగలాలు అన్నిటి మీదా ఎగబడతారు . కల్లు .. కాఫీ దేనికీ తేడా ఉండదు. రాణికి నేనే ఇట్లా ట్రయినింగిచ్చా! ' అంది ఆ అమ్మాయి.

ఇంత సంస్కారవంతమైన అమ్మాయి ఇట్లా కల్లు కుండలు ముందేసుకొని కూర్చోడమేంటి ? !

అడిగి మర్యాద తప్పిన మగాళ్ల జాబితాలో చేరడమెందుకని మౌనంగా ఉండిపోయా .

మొత్తానికి ఈ గాలివాన నాకో వింత అనుభవం చవి చూపించిందన్న మాట మాత్రం నిజం !

పూర్తిగా చీకట్లు కమ్మినా వాన జోరు వెనక్కు తగ్గడంలా ! రాత్రంతా చీకట్ల మధ్యనే ఒంటిగా గడపాలా ? వయసులోని వంటరి ఆడపిల్ల.. ఊరికి దూరంగా జనసంచారం లేని చోటు! ఏం జరగనుందో ఊహకెట్లా అందడం ?

కడుపులో ఎలుకల కదలిక మొదలయింది. బైలుదేరే ముందు చేసిన అల్పాహారం . అదీ హడవుడిగా .

కల్లుపాకలో భోజనమా ? ఏమో .. చాయ్ దొరకలేదా ! ఈసారి నవ్వుకు బదులు ఆశ కలిగింది .

ఆశ నిరాశ కాలేదు.

పొగలు కక్కే అన్నెం గిన్నెతో వచ్చిందా పాప. ఉలవ చారు , చింత చిగురాకు పప్పు.. !

' పెద్ద కులం అనుకుంటా . తప్పు కాదనుకుంటే మీరే వడ్డించుకు తినండి సార్ . రెండు ముద్దలు ఎంగిలి పడితే ముఖం తేటడుతుంది ! ' అందా అమ్మయి అచ్చంగా మా అమ్మలా .

అకలి సిగ్గెరగదంటారు. పాప ఇచ్చిన సత్తు పళ్లెంలోకి రుచిగా ఉన్న పదార్థాల మారు వడ్డించుకుని మరీ మెక్కేశాను .

చాయికి, భోజనానికని ఏమైనా ఇవ్వాలా? పాపం, ఎన్ని ఇబ్బందుల్లేక పోతే ఈ తాగుబోతుల మధ్యిట్లా కల్లమ్ముకుంటుందీమె !

జేబులోంచి తీసిన పర్శు లో ఒక్క పొడి నోటూ కనిపించింది కాదు !

నా వరస చూసి ముఖం మాడ్చుకుందా అమ్మాయి 'కల్లమ్ముకుంటున్నాని అన్నం అమ్ముకుంటానా సార్! ఇక్కడి కెప్పుడూ మీలాంటోళ్లు రారు . మారాజులు మీ రొక్కరే వచ్చారు తెలిపో తెలీకో! నన్నూ నా బిడ్డనూ మనుషుల్లా చూశారు. ఆ మర్యాద అయినా నిలుపుకోవద్దా ? ఆ తృప్తి నాకు మిగలద్దా ! ' అందామె నిష్టురంగా .

ఎంత ఆత్మాభిమానం!

కడుపు నిండిం తరువాత ఆవలింతలు మొదలయ్యాయ్ .

'తడిక్కు అటేపు పొడిగానే ఉంటుంది . పగలంతా పొయ్యి మండుతుంటుంది గదా! తలుపేసుకొని అక్కడే బట్టలు ఆరబెట్టుకోవచ్చు . వాన నెమ్మళిస్తే హెచ్చరిస్తా! పోదురు గానీ! ' అంది .. తానక్కడే పక్క సర్దుకుంటూ .

పిల్లదాని చేత నల్లటి గోళీలాంటిదేదో మింగించింది. నల్ల మందనుకుంటా ! పాక తలుపు లోపల్నుంచి గట్టిగా బిగించొచ్చింది.

పగలంతా అలసి ఉన్నానేమో ... అటేపున్న నులక మంచం మీద అట్లాగే వాలిపోయా బట్టలు మార్చుకుని .

మధ్య రాత్రిలో మెలుకొ వచ్చింది హఠాత్తుగా . తడిక్కవతల ఓ మగ గొంతు . . అదే పనిగా బండ బూతులు .. ఎవర్నోఎవరో బాదేస్తో . ఉండుండి సన్నగా ఏడుపులు .. మూలుగులు కూడా . . ఆ అమ్మాయివే లాగున్నాయి !

అప్పుడర్థమయింది ! పగటి పూట కల్లుపాకే చీకట్లో ఈ 'చిలక' పడక ! కల్లు అమ్ముకునే అమ్మి .. తెల్లారే దాకా వళ్లమ్ముకునే మోహిని అన్న మాట!

అప్పటి దాకా ఆమె మీదున్న జాలంతా ఒక్కసారి జుగుప్స కిందకు మారిపోయింది . పడుకునున్న నులక మంచం ముళ్ల పాన్పనిపించింది.

గభాలున లేచి నిలబడ్డా . రాత్రి ఆమె ఇస్తే కట్టుకున్న గళ్ల లుంగీ ఏ తిరుగుబోతు మనిషిదో ! కంపరం అనిపించింది. దాన్నక్కడికక్కడే పీకిపారేసి పొయ్యి దగ్గరున్న నా బట్టలు అందిన కాడికి లాక్కుని దొడ్డి తడిక తలుపు తన్ని ఆ జోరు వానలోనే వెనక్కైనా తిరిగి చూడకుండా వచ్చిన దారి పట్టేశా . క్రెడిట్ కార్డులన్నీ తీసేసుకుని తడిసిన నోట్లు నిండిన పర్శును మాత్రం అక్కడే పడేసి రావడం మర్చిపోలా!

ఆ అనుభవంతో మససంతా చేదయిపోయింది . వచ్చిన పని చేయబుద్ధవక సిక్ రీజన్ చెప్పి తిరిగొచ్చేశా.

చాలా కాలం దాకా గుండెకయిన ఆ గాయం సలుపుతూనే ఉండేది.

పాప రూపం మనసులో మెదిలినప్పుడల్లా పాపం అనిపించేది . ఆ అమ్మాయి మీద మాత్రం అసహ్యం అలాగే ఉండిపోయింది !

***

సగంలో వదిలేసొచ్చిన పని పూర్తి చేసే బాధ్యత నా మీదే పడింది మళ్లా !

కాకతాళీయంగా అదే హోటల్లో దిగడం, హోటల్ వాళ్ల కార్యానికేదో రావడంతో మునుపటి శాస్త్రిగారే మళ్లీ తటస్థపడ్డారు.

ఆయనే గుర్తుపట్టి ఆనాటి సంఘటనను ప్రస్తావిస్తూ ' దేవయాని ' సంగతి మీ దాకా వచ్చిందా ? ' అనడిగారు యథాలాపంగా.

ఆమె పేరు ' దేవయాని ' అన్న సంగతి అప్పుడే నాకు తెలియడం . తన మీదేమంత ఆసక్తి లేక పోయినా పాపను గూర్చి తెలుసుకోవాలనిపించింది.

'ఆ మూగ పిల్లా? దాని మూలకంగానేగా పాపం . . దేవయానికీ జీవిత ఖైదు! మీకంతా తెలుసనుకుంటున్నానే ! అందులో మీ పాత్రా కొంతుందని గుసగుసలున్నాయి మరి! ' అన్నారు శాస్త్రి గారు గుంభనగా .

స్టన్నయిపోవడం నా వంతయింది! ' వివరంగా చెప్పండి శాస్త్రిగారూ ! ' అని నిలేశా ఆదుర్దాగా .

' ఇదిగో ఈ కార్యం ముగించుకొనొచ్చి తమర్ని కలుసుకుంటా . రెండు రోజులు పడుతుందేమో . అప్పటి దాకా మీరు అటేపుగానీ వెళతారేమో ! తొందరపడకండి .. ఎందుకైనా మంచిది ' అని హెచ్చరించి మరీ వెళ్లారాయన.

ఆ రెండ్రోజులు ధ్యాస పని మీద లేదు. దేవయానా ఆమె పేరు! ఎంత చక్కని పేరు ! ఆ దిక్కు మాలినదానికి ఆజన్మ కారాగారమా? ఏం ఘనకార్యం చేసిందో మహాతల్లి ? అట్లాంటి వగలాళ్లు ఎంతకైనా తెగిద్దురు. తను జైల్లో ఉంటే మరి పాప గతో ! ఆ బంగారు తల్లికి నోరు కూడా లేదన్న సంగతి విని చాలా డిస్టర్బయా . అన్నిటికన్నా ముఖ్యంగా ఇందులో ఉన్న నా పాత్రేమిటో అర్థం కాలా!

నాలుగో రోజు ఉదయం కాస్త పొద్దెక్కాక శాస్త్రిగారొచ్చి ' ఆలస్యం అయింది .. ఏమనుకోకండి ' అంటూ నన్నో స్మశానవాటిక వైపు తీసుకెళ్లారు .

' ఇక్కడ మనకేం పని? ' అనడిగా ఆశ్చర్యంగా .

' అసలు రహస్య మంతా ఇక్కడే పూడ్చ బడ్డది ' అంటూ స్మశానం వెనక వేపున్న దిబ్బల మీదకు తీసుకెళ్లారు నన్ను .

ఆయన చూపించిన చిన్న ఇటిక రాళ్ల కుప్ప లాంటి కట్టడం మీద గుర్తు కోసం కాబోలు ' రాధికా రాణి ' అని తెల్ల పెయింటుతో రాసుంది !

' ఎవరీ రాధికా రాణి? ' అనడిగా అయోమయంగా.

' మీరన్నారే .. ఆ చిన్న పిల్ల ' అన్నారాయన అదోలా ముఖం పెట్టి!

గుండెలు దభేల్మన్నాయి. ' పాప ' చనిపోయిందా? '

మౌనంగా తలూపి 'ఇహ బైల్దేరదాం రండి! ' అంటూ రోడ్డు మీదకు తీసుకొచ్చారు.

ఆటోలో పోతున్నప్పుడు అనేక సంచలన విషయాలు బైటపెట్టారాయన . ఒక్కోటీ ఒక్కో ఆటం బాంబు!

' దేవయాని' కల్లు అమ్ముకునే గౌండ్ల పిల్ల కాదు. పిఠాపురం సైడు నుంచి పారిపోయొచ్చిన దేవదాసీలది . కులవృత్తి చెయ్యమని తల్లి పీడిస్తుంటే చెప్పాపెట్టకుండా ఈ మూగ పాపనేసుకొని ఇటేపుకు పారిపోయొచ్చింది. అక్కడ ఇంటికి తరచూ వచ్చే సరసుల్లో ఒకాయన ఈ ఏరియా అరక్ సబ్ కంట్రాక్టర్ . ఈ దేవయాని ఆయనగారి కూతురేమో కూడానూ! చనువుగా దగ్గరికి తీస్తుండేవాడని చెప్పేదీమె . ఇట్లా పారిపోయిరావడంలోనూ , ఈ మూలనున్న కల్లుపాక మనిషి దగ్గర చేర్చడంలోనూ అతగాడి అండదండలున్నట్లూ నిర్ధారణ కాని ఓ అనుమానం . ఆ సబ్ కంట్రాక్టర్ ఇంటి పురోహితుణ్ణి నేను చాలా కాలంగా . ఆ కల్లుపాక మనిషీ నాకు కొత్తవాడేం కాదు . దయామయుడు . ఈ పిల్ల మీద చాలా వాత్సల్యం . పోతో పోతో తనకు చెందిన ఈ ఒక్కగా నొక్క పాకా బతుకుతెరువు కోసమని ఈ పిల్ల పరం చేశాడాయన. . సొంత కొడుక్కది సుతరామూ ఇష్టం లేదు . వాడో జులాయి వెధవ . ఈ పాక గుంజుకోడానికి అన్నిందాలా ప్రయత్నం చేశాడు. సబ్ కంట్రాక్టర్ అండ వల్ల వీలుపడలా! ఆ మూగ పాప ఈమెకు చెల్లెలూ కాదు . . అంత వయసు కూతురుండే అవకాశమూ లేదు. అన్న కూతరని చెప్పింది నాకు . నానమ్మ దగ్గరుంటే దీన్నీ అన్నిందాలా అచుత్యం చేస్తారని వస్తూ వస్తూ వెంట తెచ్చేసుకుంది. అంతమంది అలగా జనం మధ్య ఇన్నాళ్లూ ఈ తప్ప తాగే వృత్తిలో గుట్టుగా నెట్టుకురావాలంటే ఎంత గుండె దిటవు ఉండాలి ! అందునా వయసులో ఉంది. బంటరిగా ఉండేది ! '

శాస్త్రిగారి మాటలకూ ఆ రోజు రాత్రి నేను చూసిందానికీ పొంతన కుదరటంలేదు. ఆ మాటే అంటే ' అక్కణ్ణుంచే జరిగిన కథంతానూ. తమరు అపార్థం చేసుకున్నారండీ పాపం ఆ దేవయానిని ! ఆ రాత్రి ఆ వచ్చిన వెధవాయి పాకాయన సొంత బిడ్డ . పైకమవసరం పడ్డప్పుడల్లా వేళా పాళా లేకుండా పాక మీద కొచ్చి పడ్డం, అడ్డం వస్తే అవాచ్యాలు కూయడం .. రెండు వడ్డించైనా ఆమె గడించుకున్న ఆ కాస్తా వడలాక్కుపోవడం నిత్య కృత్యం . వీలయినంత వరకు దెబ్బలు భరిస్తూ అడ్డుకోడమే తప్పించి , తానుగా కలబడ్డమో , అవాచ్యాలు పేలటమో చేసేది కాదు. పాకాయనంటే అంత అభిమానం . నీతిగల మనిషి. ఆ రాత్రి తమరు లోపలున్నప్పుడే వచ్చి సీను చేస్తున్నాడన్న ఉక్రోషంతో తను పాక బైటి కెళ్లి అడ్డంపడింది. ఈ రచ్చ మధ్యనే మదమెక్కున్న వెధవొకడు పాకలోకి దూరెళ్లి ఆదమరిచి పడకునున్న పసిదాని మీద పడ్డాడు . అది చూసి తట్టులేక చూర్లోని తాటి మట్టలు కొట్టే కొడవలితో ఒక్కేటు వేసేసిందట మెడకాయ మీద . లబాయిలో దిబాయిలో అంటూ వాడు ముందు పోలీస్టేషన్ కెళ్లి అనక ఆసుపత్రిలో చేరాడు. తెల్లారి తీరిగ్గా పోలీసులొచ్చి .. విచారణా .. తతంగమూనూ ! రాత్రికి రాత్రే తమరట్లా వెళ్లి పోయిం తరువాత జరిగిన సినిమా కాబట్టి ఇదంతా .. మీ దాకా వచ్చినట్లు లేదు . వేటుపడ్డ వెధవ మూడు రోజుల తర్వాత చావడంతో హత్య కేసూ, అదనంగా కల్తీ సరకమ్మేమరో కేసూ, ఇహ మిండరికం గోల ఎప్పుడూ ఉండేదేగా .. అన్నీ కలగలిపేసి బోన్లో నిలబెట్టారు పోలీసోళ్లు .. అవతలి పార్టీ గడ్డి దిట్టంగా మేసి . ప్రాథమిక విచారణఅయిన తరువాత నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించేశారీ దేవయాన్ని . యావజ్జీవం తప్పదంటున్నారిప్పుడు అంతా ! '

'మరి .. ఇందులో నా ప్రమేయం ఎక్కడుంది పంతులుగారూ?' అనడిగా ఈ కథంతా విన్న తరువాత అయోమయంగా.

' ఆరాత్రి మీరు వెళ్లిపోయే ముందు మంచం మీద వదిలేసిన మీ పర్సు లోని రెండు వేల నోట్లు ఓ పదితో సహా పోలీసులకు సాక్ష్యంగా దొరికాయి.అవీ, మీరు తాగి పడేసిన సిగిరెట్ పీకలా అంత చిన్న ఊళ్లో దొరికేవి కావు . పిల్లదానికి నల్ల మందిచ్చిన వైనం కూడా పరీక్షల్లో తేలడంతో ఆ పని మీరిద్దరు కలిసి చేసిందని కేసు బనాయించారు. మీ ఊసు మాత్రం ఊహక్కూడా అందకపోవడంతో, దేవయాని కూడా నోరిప్పకపోవడంతో 'గుర్తు తెలియని వ్యక్తి ' గా నమోదయింది ఛార్జిషీటులో . అందుకే తమర్నిటు వేపుకు రావద్దని హెచ్చంంచింది' అన్నారు శాస్త్రి గారు.

మరా రాధికా రాణి ' రాళ్ల గుట్టా?! '

' ఆ మూగ పిల్ల పేరదే. పిఠాపురం ముఠా దేవయాని జైలుకెళ్లి విషయం తెల్సి పసిబిడ్డనన్నా ఎత్తుకెళ్లాలని వెదకడం మొదలు పెట్టారిక్కడిక్కడే .

ఆటో ఆగింది ఓ పెంకుటింటి గేటు ముందు .

'వచ్చిన వాళ్లు ఎటూ వచ్చారు. ఒక్కసారి మా ఇంటిని కూడా చూద్దురు గానీ రండి ! ' అంటూ గేటు తీసారు శాస్త్రిగారు.

నడవాలోని చెక్క కుర్చీలో కూలబడి ' కాస్త మంచి తీర్థం ' ఇప్పించండి ' అన్నా శాస్త్రి గారితో !

' అయ్యో! మీరు మా అతిధులు! వట్టి మంచి తీర్థంతో సరిపెడితే మా పితృ దేవతలు ఆగ్రహిస్తారు.' అంటూ లోపలికెళ్లి వచ్చారు.

శాస్త్రిగారి కూతురనుకుంటా నీళ్ల గ్లాసుతో బైటి కొచ్చింది. వెనకనే చాయ్ కప్పుతో ' రాధికా రాణి ' !

గుడ్లప్పగించి చూస్తుంటే తరువాత చెబుతానన్నట్లు సైగ చేసారు శాస్త్రి గారు .

బైటికొచ్చిం తరువాత ' పిఠాపురం ముఠా నుంచి కాపాడాలని ఈ పాపను ఇక్కడ దాచా . దేవయాని ప్రాధేయపడింది జైలుకెళ్లి నప్పుడు . ఆ తల్లి మాట కాదనడం నా వల్లవుతుందా! ముఠాను నమ్మించడానికి రాధికా రాణి చచ్చిపోయినట్లు ఖాళీ సమాధి ఏర్పాటు చేయించింది నేనే' అన్నారు శాస్త్రి గారు .

' కల్లుపాకలో క్షణం పాటు నిలబడ్డానిక్కూడా సంకోచించిన శాస్త్రిగారేనా ఈయన ! '

కదిలే ఆటోలో నుంచి వెనక్కి తిరిగి చూస్తే దేవయానిని కల్లు పాకాయన అండన చేర్చింది కూడా ఈయనేనేమో అనిపించింది.

అనుకోకుండా శాస్త్రి గారికి ఆటోనుంచే రెండు చేతులూ ఎత్తి నమస్కరించా .

***

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు