భలే మంచి పాలకుడు - - బోగా పురుషోత్తం

Bhale manchi palakudu
సిరిపురంలో సీతయ్య అనే ఓ భూస్వామి ఉండేవాడు. అతనికి పదెకరాల పొలం వుంది. తన పొలం పక్కనే వున్న ఇతరుల పొలాలను కూడా ఆక్రమించుకుని తను ఎంతో ధనవంతుడినని అందరూ తన మాఏట వినాలని చెప్పి ఎదురు తిరిగితే పగబట్టి వారిని పతనం చేసేవాడు.
రానురాను సీతయ్య ఆగడాలు అధికమయ్యాయి. సిరిపురం ప్రజలు విసిగిపోసాగారు.
ఓ సారి వర్షాకాలం..కుండపోత వర్షం పడటంతో ఆ ఊరి చెరువు, ఏరు ఏకం అయ్యాయి. నీళ్లంతా ఊర్లోకి ప్రవేశించాయి. ఇళ్ల అన్ని మునిగిపోయాయి. ఊరిజనం నిలువ నీడలేక అల్లాడిపోసాగారు. సీతయ్య ఇల్లు, పొలం చాలా ఎత్తుగా వుండడంతో అతని ఇల్లు, పొలం చెక్కుచెదరలేదు. దీన్ని చూస్తూ సీతయ్య ఇంట్లో కూర్చొని ఆనందించసాగాడు.
ప్రజలు నీళ్ల నుంచి రక్షించుకోడానికిపెద్ద చెట్లపై ఎక్కి కూర్చొని రక్షించుకోసాగారు. పిల్లలు ఆహారం లేక ఆకలితో అలమటించసాగారు. సీతయ్య వారిని చూసి నవ్వుకుంటూ ఆనందించసాగాడు. ఆ ఊరి సర్పంచ్‌కు సీతయ్యను చూసి కోపం వచ్చింది. తక్షణం ఓ నాటు పడవను తెప్పించి ప్రజలను సమీపంలోని గుట్టమీదికి చేర్చాడు. అక్కడ పెద్ద టెంటు ఏర్పాటు చేసి వారికి అన్ని వసతులు కల్పించాడు.
పరిస్థితి చక్కపడిన తర్వాత తన పొలంలో పెద్ద రేకుల షెడ్‌ నిర్మించి నీడ వసతి కల్పించి ఆదుకున్నాడు.
వారం తర్వాత వర్షం తగ్గుముఖ పట్టింది. ఊరి ప్రజలకు నిలువ నీడ లేక అల్లాడారు. అదే సమయంలో సర్పంచ్‌ జయరామయ్య తన ఇంటి పరిసరాల్లో పెద్ద రేకుల షెడ్‌ ఏర్పాటు చేసి అందరికీ నీడ కల్పించాడు.
సీతయ్యకు ఇది చూసి కంఠగింపుగా మారింది. గత సర్పంచు ఎన్నికల్లో నిలబడిన తనకు పరాభవం ఎదురైంది. అప్పటి నుంచి గెలిచిన సర్పంచు రామయ్య అయినా, ఆ ఊరి ప్రజల పేరైనా చెబితే సీతయ్యకు ఆసహ్యం వేసేది. తనను గెలిపించనందుకు అందరికీ తగిన శాస్తి ఎదురుకావాలని నిరీక్షించాడు. తన పగ, ప్రతీకారాలతో విసిగిపోయిన ప్రజలు సీతయ్య అంటే అసహ్యం ఏర్పడిరది. జనం అతని ఇంటి ముఖం కూడా చూసే వారు కాదు.
రెండేళ్ల తర్వాత సర్పంచ్‌ ఎన్నికలు సమీపించాయి.
ఇటు జయరామయ్య, అటు సీతయ్య బరిలో నిలబడ్డారు.
జయరామయ్యకు ప్రజాబలం, అభిమానం మెండుగా వున్నాయి. సీతయ్యకు పగ, ప్రతికారాలు, అర్ధబలం వున్నాయి.
ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ప్రజలు ఓట్లు వేస్తున్నారు. పోలింగ్‌ స్టేషన్‌లో పోటీ దారుల కుమారులిద్దరూ పోలింగ్‌ ఏజెంట్లుగా నిలబడ్డారు. సరిగ్గా సమయం పదిగంటలైంది. సీతయ్య మనుషులు పది మంది కర్రలు, రాడ్లతో లోనికి ప్రవేశించి బ్యాలెట్‌ పేపర్లు లాక్కుని ఓట్లు వేసుకుని రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ‘‘ ఇదేమిటయ్యా..ఇలా చేస్తున్నారేమిటయ్యా..?’’ ప్రశ్నిస్తూ ఎదురు తిరిగి అడ్డుకోబోయాడు జయరామయ్య కొడుకు ప్రదీప్‌.
‘‘ హేయ్‌.. అడ్డుకోవడానికి నువ్వెవరు? దూరంగా వెళ్లు.. వెళ్లవయ్యా.. లేదంటే చంపేస్తాం..’’ బెదిరించాడు పది మంది వ్యక్తుల్లో ఒకడు. ప్రదీప్‌ మరికొంచెం బలం ప్రయోగించి వారిని పక్కకి తోయబోయాడు. వెనుక వున్న ఓ వ్యక్తి రాడ్‌తో తలపై బలంగా మోదాడు. మరుక్షణంలో ప్రదీప్‌ ‘‘ అమ్మో..!’’ అంటూ బిగ్గరగా అరుస్తూ కుప్పకూలాడు. వెనుకే ఉన్న మరో వ్యక్తి కర్రతో కొట్టాడు. తల పగిలి రక్తం వచ్చి గిలగిల తన్నుకు చనిపోయాడు.
పోలింగ్‌ సిబ్బంది భయంతో బయటికి పరుగులు తీశారు. పోలింగ్‌ నిలిచిపోయింది. అప్పటికే బ్యాలెట్‌ పేపర్లు అన్ని పోలై బ్యాలెట్‌ బాక్సులోకి వెళ్లిపోయాయి. తమ పని పూర్తయినట్లు వచ్చిన పది మంది రౌడీలు వెళ్లిపోయారు. గంట తర్వాత పోలీసు బలగాలు అక్కడికి వచ్చాయి. ప్రదీప్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ప్రదీప్‌ మృతి వార్త విని అతని తండ్రి జయరామయ్య ఆవేదనతో కుప్పకూలాడు. విషయం తెలిసిన ప్రజలు ఆస్పత్రి వద్దకు చేరుకుని సీతయ్యను అరెస్టు చేయాలని ధర్నాకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని ప్రజలను చెదరగొట్టి తరిమి వేశారు.
వారం రోజుల తర్వాత పోలీసుల పహారాలో మళ్లీ పోలింగ్‌ ప్రారంభమైంది. జయరామయ్య కొడుకు పోయిన దిగులుతో తనను ఈ ఎన్నికలు వద్దేవద్దని ప్రశాంతంగా బతకనివ్వాలని ప్రజలకు చేతులెత్తి నమస్కరించాడు. ప్రజలు నిరాకరించారు. తామే స్వయంగా పోలింగ్‌ స్టేషన్‌లో ఏజెంట్లుగా కూర్చున్నారు. మళ్లీ సీతయ్య రిగ్గింగ్‌కు పాల్పడడానికి ప్రయత్నించాడు. పోలీసులు అడ్డుకుని అల్లరి మూకలను పరిసర ప్రాంతాల నుంచి వెళ్లగొట్టారు. పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మరుసటి రోజు ఫలితాలు వచ్చాయి. ప్రజా బలం వున్న జయరామయ్య అత్యధిక మెజార్టీతో విజయదుందుభి మోగించాడు.
దీన్ని సీతయ్య జీర్ణించుకోలేకపోయాడు. మళ్లీ ప్రజలపై పగ, ప్రతికారాలు తీర్చుకోసాగాడు. జయరామయ్య తనకు పదవి వద్దని వదిలి మరో ఊరికి వెళ్లిపోయాడు. ప్రజలు మళ్లీ నాయకుడి కోసం ఎదురుచూశారు. పదవి కోసం ఎదురు చూస్తున్న సీతయ్యను అదృష్టం వరించింది.
రెండు నెలల తర్వాత మధ్యంతర ఎన్నికలు నిర్వహించారు. సీతయ్య అంగ, అర్ధ బలంతో గెలిచాడు. ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. లోన దాచుకున్న పగ, ప్రతీకార జ్వాలకు మళ్లీ ఆజ్యం పోశాడు. ఈ సారి అధికార బలంతో పేదల గుడిసెల తొలగించి, స్థలాల ను స్వాధీనం చేసుకోసాగాడు. ప్రజల్లో ఆందోళన మొదలైంది. తమ మొర ఆలకించే వారే కరువయ్యారు. కాలమే బుద్ధి చెబుతుందని ఎదురుచూడసాగారు.
ఓ రోజు సీతయ్య తన సేవకులను వెంటబెట్టుకుని పొలం గట్టుపై నడుస్తున్నాడు. ఎదురుగా మరో సేవకుడు సామీ.. ‘ మీ అబ్బాయి..మీ అబ్బాయి..’ అదుర్దాగా అన్నాడు.
సీతయ్య ఆందోళనతో ‘ ఏం జరిగింది..? చెప్పు..’ ప్రశ్నించాడు.
‘‘ అయ్యా మీ కొడుకు బైక్‌పై వెళుతుంటే ఎదురుగా వస్తున్న వాహనం కొట్టేసిందయ్యా..’’ అన్నాడు.
ఆ మాట విన్న సీతయ్యకు నోటి మాట రాలేదు. గుండె ఆగినంత పనైంది. కొడుక్కి ఏమైందో ఏమోనని పొలం గట్లుమీద పడి లేస్తూ రోడ్డుపైకి పరిగెత్తారు. రోడ్డుపై రక్తం మడుగులా ప్రవహిస్తోంది. అప్పటికే అక్కడ పడిపోయిన సీతయ్య కొడుకును అదే దారిలో ఎదురుగా వస్తున్న జయరామయ్య తన కారులో తీసుకుని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చాడు. మెదడులో నరాలు చిట్లిపోయి రక్తం గడ్డ కట్టిందన్నారు వైద్యులు. కోమాలో వున్న సీతయ్య కొడుకు మంచి వైద్యం అందడంతో 24 గంటలు తర్వాత కళ్లు తెరిచి చూశాడు. సీతయ్యకు ఆనందంలో మునిగి తేలాడు. కొడుక్కి చిన్న దెబ్బ తగిలినందుకే తల్లడిల్లిన సీతయ్యకు జ్ఞానోదయమైంది. ఇన్ని కష్టాలు పెడుతున్నా ఓర్చుకుని కన్న కొడుకును పొట్టన పెట్టుకున్నా ప్రతీకారం దరి చేయనీయకుండా మానవత్వంతో ప్రమాదంలో కొట్టుమిట్టాడుతున్న తన కన్న కొడుకును రక్షించినందుకు జయరామయ్యకు చేతులెత్తి నమస్కరించాడు మానవత్వం పరిమళించిన సీతయ్య. ఆ నాటి నుంచి మంచితనం, మానవత్వంతో ఆలోచిస్తూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన సమస్యగా భావిస్తూ పరిష్కరించి అనునిత్యం కంటికి రెప్పలా చూసుకుంటూ గొప్ప పాలకుడిగా పేరుతెచ్చుకున్నాడు సీతయ్య.

మరిన్ని కథలు

Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్
Kshama lo dharitri
క్షమలో ధరిత్రి.
- Aduri.HYmavathisrinivasarao,
Marmam
మర్మం
- రాము కోలా దెందుకూరు
Korthi
కొర్తి
- బివిడి ప్రసాద రావు
Atrhata
అర్హత
- డి.కె.చదువుల బాబు
Antataa neeve
అంతటా నీవే
- షామీరు జానకీ దేవి
Ahakaram techhina sapam
అహంకారం తెచ్చిన శాపం
- గొట్టాపు శ్రీనివాస రావు
Donga chetiki taalaalu
దొంగ చేతికి తాళాలు
- కొల్లాబత్తుల సూర్య కుమార్