తుఫాన్ పెళ్లిళ్లు .... - జీడిగుంట నరసింహ మూర్తి

Tufaan pellillu

"అందరూ లగేజ్ సర్ధుకున్నట్టేగా . అయితే నేను క్యాబ్ చెపుతాను మరి " అన్నాడు కృష్ణా రావు అందరినీ ఒకసారి పరికించి చూస్తూ. .

పెళ్లి కొడుకు విశాల్, కృష్ణా రావు అల్లుడు రాజేష్ ముందే తయారయ్యి ఉన్నారు. ఇక కృష్ణా రావు సరే సరి అతను ఏ ప్రయాణం అయినా సరే రెండు గంటల ముందు సిద్దమయ్యి అక్కడున్న వాళ్లందరినీ హడావిడి పెట్టేస్తూ ఉంటాడు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆడవాళ్ళు ఒక పట్టాన దేనికీ తయారవ్వరు అని వాళ్ళ వెనక పడి

షన్టుతూనే ఉంటాడు. అయినా కూడా చివరకు ఎప్పుడూ హడావిడితో ప్రయాణం చేసేటప్పుడు ఏదో ఒకటి వాళ్ళతో తీసుకెళ్ళడం మర్చిపోతూనే ఉంటారు. .

ఐదు గంటలకే చిరు చీకట్లు అలుముకోవడం కృష్ణా రావు గమనించాడు. ఆకాశం మేఘావృతం అయ్యింది. కృష్ణారావులో బీపీ పెరగడం మొదలుపెట్టింది. బంగాళా ఖాతంలో అల్పపీడనం వల్ల దాని ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల మీద ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పనే చెప్పింది. కుదరగా కుదరగా కుదిరిన పెళ్లి సంబంధం. పూర్వం మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా అని అడిగేవాళ్లు. కాల ప్రభావం ఇప్పుడు మగ పిల్లల పరిస్తితి కూడా అలాగే తయారయ్యింది. ఒక పట్టాన ఏ సంబంధమూ ముందుకు రావడం లేదు. దానికి తోడు ఆడ పిల్లల కోరికలు కూడా ఆకాశాన అంటుతున్నాయి. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన అమాయికి కూడా నెలకు కనీసం ఒకటిన్నర లక్షల జీతం సంపాదించే సాఫ్ట్వేర్ సంబంధం కావాలి. . ఇంకొంతమంది అయితే పెళ్లి కొడుక్కు సొంత ఇల్లు, ఫర్నిచర్ ఉంటేనే ముందుకు వస్తున్నారు . కారు దగ్గర కొంతమంది రాజీ పడినా కనీసం మంచి బైక్ అయినా ఉండాలి. ఏది ఏమైతేనేం. విశాల్ కు సంబంధం త్వరగానే కుదరడం , పెద్దగా ఎక్కువగా గ్యాప్ లేకుండానే ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. . అదేదో శాస్త్రం చెప్పినట్టు దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన అన్నట్టు ఇప్పుడు కోటేశ్వరుడి పెళ్ళికి కూడా ఉప్పెనల నుండి తప్పించుకోలేని పరిస్తితి. .

అంతా తండ్రే చూసుకుంటాడు అని అనుకున్నాడో ఏమో విశాల్ నిబ్బరంగా టీవీ చూస్తూ కూర్చున్నాడు. పైగా తల్లి తండ్రులు చూసిన సంబంధం. అమ్మాయి బాగా ఉందా లేదా ఉద్యోగం మంచిదా కాదా అంతవరకు మాత్రమే అతను చూసుకున్నాడు. మిగిలిన లాంఛనాలు, పెట్టుబడులు విషయం అన్నీ కృష్ణారావుతోనే ఆడ పెళ్లి వాళ్ళు మాట్లాడుకున్నారు.

అన్ని సామాన్లు బయటకు తీసుకొచ్చి ఇంటికి తాళం వేశారు. .

"ఇదేమిటి మబ్బు పట్టినట్టుంది ?" అంది కృష్ణారావు భార్య లక్ష్మి బయటకు వస్తూనే కంగారు పడుతూ.

"ఆ.ఆ. మీరిలాగే మెల్లిగా మీనమేషాలు లెక్కపెడుతూ తయారవుతూ ఉంటే తుఫాన్ కూడా వచ్చేటట్టుగా ఉంది. . స్టేషన్ ఇక్కడుందా? కనీసం రెండు గంటలైనా పడుతుంది . " అన్నాడు కృష్ణా రావు సామానులన్నీ వెనకాల డిక్కీలో సర్ధుతూ.

"కంగారు పడాల్సిన అవసరం లేదులే . మబ్బులు తేలిపోతాయి . ముందు అందరూ వచ్చి లోపల కూర్చోండి. డ్రైవరు సాబ్ స్టేషన్ కు చేర్చే విషయం చక్కగా చూసుకుంటాడు " అన్నాడు విశాల్ వాతావరణాన్ని తేలిక పరుస్తూ .

ముందుగా లక్ష్మి క్యాబుకు ఎదురుగా వెళ్ళి ఒక కొబ్బరికాయ దిష్టి తీసి వచ్చి లోపల కూర్చుంది. ఇంటినుండి అన్ని సామానులు మోసుకు వెళ్ళడం కష్టమని లక్ష్మి రాజమండ్రిలో ఉన్న తన అక్కగారికి పెళ్ళిలో పెట్టాల్సిన పెట్టుబడి బట్టలు, పెళ్లి కూతురు నగలతో సహా అన్నీ అప్పగించి అందుకు అయిన మొత్తం డబ్బును పంపించేయ్యమని భర్తకు పురమాయించింది. . దానితో ముప్పాతిక వంతు బాధ్యత తప్పింది.

ఆకాశంలో మెరుపులు దిగంతాలకు వ్యాపిస్తున్నాయి. ఒక దానిమీద ఒకటి పోటీపడి కళ్ళు చెదిరేటట్టుగా మెరుస్తూ మబ్బుపట్టి చీకటిగా మారిన దారినంతా వెలుగు, వెనువెంటే చీకట్లతో నింపేస్తున్నాయి. .ఆకాశం గట్టిగా ఉరిమింది. ఆ వెనుకే కుండపోత వర్షం. ఇదేమీ పట్టనట్టు డ్రైవరు ట్రాఫిక్ చీల్చుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి ట్రాఫిక్ అదుపు తప్పి ముందుకు కదలడం లేదు. అందరి మనసులు క్షణికంగా చెదిరి గుండెల్లో గుబులు పట్టుకుంది. . వాళ్ళందరికీ డ్రైవరే దేవుడిలా అనిపించాడు. అవును మరి తమ ప్రయాణం మొత్తం అంతా అతని మీదే ఆధారపడి ఉంది.

"బాబూ. ట్రైనుకు అందుకోవాలి. . వేరే రూట్ ఉంటే అటునుండి పోనీ . అలా మెల్లిగా వెళ్తూ ఉంటే ట్రైన్ కాస్తా వెళ్లిపోతుంది. " అన్నాడు కృష్ణా రావు ఆతృత , ఉద్వేగం మిళితమైన కంఠంతో .

" కృష్ణా రావు గారు . మేము ఆల్రెడీ స్టేషన్ కు వచ్చేశాము. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు ? ఇక్కడ హెవీగా వర్షం పడుతోంది మరి. మేమంతా మీ కోసం ఎదురుచూస్తున్నాము " అని ఎవరో స్టేషన్ నుండి ఫోన్ చేస్తున్నారు.

పెళ్ళికి తమతో పాటు రావడానికి దగ్గర బంధువులకు కూడా కృష్ణారావే టిక్కెట్లు తీసుకున్నాడు. అవి అన్నీ అతని దగ్గరే ఉన్నాయి. వాళ్ళ ప్రయాణం వీళ్ళు స్టేషన్కు సకాలంలో చేరడం బట్టి ఆధారపడి ఉంది. ఒక పక్క క్షణక్షణానికి వర్షం ఎక్కువైపోయి ఎక్కడా తెరిపి ఇవ్వడం లేదు. అందరి ముఖాల్లో అసహనం పెరీగిపోతోంది. మధ్యాన్నం వరకు ఎండ బాగానే కాయడంతో హఠాత్తుగా పరిస్తితి ఇంత విపరీతంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు.

"ఆ .. ఆ. వస్తున్నాం . మధ్య దారిలో ఉన్నాం. ట్రాఫిక్ ఎక్కువగా నిలబడి పోయి ఉంది. పాపం డ్రైవర్ తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మీరేమీ కంగారు పడొద్దు. ట్రైన్ బయలుదేరడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆ లోపు ఎలాగైనా చేరుకుంటాం" అని ఆ ఫోన్ చేసిన వ్యక్తికి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు కానీ అతని గొంతులో భయం తాలూకు లక్షణాలు స్పష్టంగా అగుపిస్తున్నాయి. .

ఇదే అవకాశం అనుకుని కృష్ణా రావు అల్లుడు రాజేష్ కొద్దిగా గొంతు పెంచాడు.

"ఎవరైనా పెళ్లి రేపు రాత్రి పెట్టుకుని ఒక రోజు ముందుగా బయలుదేరుతారా ?అసలు ఒక ప్లాన్ లేకుండా ప్రయాణం పెట్టుకున్నారు. వీళ్లతో పాటు మనల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు " అంటూ మామగారిని డైరెక్ట్ గా అనలేక భార్య మీద అరవడం మొదలుపెట్టాడు . ఒక పక్క ఆ అమ్మాయి అంత ఇరుకులో చంటి పిల్లతో ఉతుకుష్టంగా అనిపిస్తోంది. పరిస్తితి క్షణక్షణానికి అయోమయంగా గందరగోళంగా అనిపిస్తోంది. ఇటువంటి పరిస్తితిలో ధైర్యం చెప్పాల్సింది పోయి భర్త అడుగడుగునా దెప్పి పొడుస్తూ ఉండటం ఆమెకు చాలా అవమానంగా భావిస్తోంది. చాలా ఇళ్ళల్లో అల్లుళ్లు తమ మరదల పెళ్లిళ్లకు, బావ మరుదుల పెళ్లిళ్లకు మామగారితో పాటు ముందుండి ఎంతో కొంత బాధ్యత నెత్తిమీద వేసుకుని వాళ్ళకు సహకరిస్తారు. చూస్తూంటే తన మొగుడికి అలాంటి లక్షణాలు ఏ కోశానా లేవు. ఎంతమటుకూ అత్తా మామలు తన విషయంలో పట్టించుకుంటున్నారా లేదా, తనకు అన్ని మర్యాదలు జరుగుతున్నాయా లేదా అనే వాటిమీదే దృష్టి పెడతారు. ఎన్ని సంవత్సరాలు గడిచినా వాళ్ళను కొత్త పెళ్లి కొడుకుల్లా చూడాలి . వాళ్ళకు ఏ చిన్న లోపం జరిగినా జీవితాంతం సాధించడానికి సిద్దమవుతారు . ఈ పెళ్లి విషయంలో ఇంకా ముందు ముందు భర్తతో ఎటువంటి ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుందో అని అనుక్షణమూ భయపడుతూనే ఉంది . ధుమధుమ లాడుతున్న భర్త మొహాన్ని చూశాక అతన్ని ఎదురించే శక్తి లేక అసహాయంగా శూన్యం నిండిన కళ్ళతో బయటకు చూస్తూండిపోయింది.

తమ కూతురు అల్లుడు కోసం , వేరే వూరునుండి వచ్చే అతని తల్లి తండ్రుల కోసం ప్రత్యేకంగా ఒక పెద్ద రూము తీసుకోమని కృష్ణారావు పెళ్లి కూతురు తండ్రికి రెండు మూడు సార్లు నొక్కి నొక్కి చెప్పాడు. మరోపక్క ఇంతమంది బంధువులను ఈ తుఫాన్ పరిస్తితిలో ఆయన సరిగ్గా చూసుకోగలడో లేదో అనుమానం కూడా ఉంది. .

ఒక పక్క ట్రాఫిక్ జామ్ అయిపోయింది. క్యాబ్ ముందుకు కదలడం లేదు. స్టేషన్ కు వెళ్లడానికి వేరే దారి లేదు. కృష్ణారావు టైమ్ చూసుకుంటున్నాడు అసహనంగా. ఒక గంటలోగా స్టేషన్ కు చేరుకోకపోతే ట్రైన్ వెళ్ళి పోతుంది. అంతకన్నా ముందు స్టేషన్లో తమ కోసం ఎదురుచూసే బంధువులు చూసి చూసి వాళ్ళ ఇళ్లకు వెళ్లిపోతారు. కొన్న టిక్కెట్స్ అన్నీ దండగే. అసలు తమ ప్రయాణం కూడా సవ్యంగా జరిగేటట్టుగా కనపడటం లేదు.

రాజేష్ కు కోపం తారాస్తాయికి వెళ్తోంది.

"మామయ్యగారు. ముందు స్టేషన్ లో ఉన్న వాళ్ళకు ఫోన్ చేసి చెప్పండి. మనం ఎటువంటి పరిస్తితిలోనూ స్టేషన్ కు చేరుకోలేము. వాళ్ళకు పరిస్తితి చెప్పి వాళ్ళనైనా ఇంటికి వెళ్లిపొమ్మనండి. మనం ఏదైనా పెద్ద టాక్సీ పట్టుకుని వెళ్లిపోదాము. ఇంకా ఆలస్యం చేస్తే అటువైపు వెళ్ళే వాహనాలు కూడా దొరకవు . ప్రస్తుతం అయితే అటువైపు తుఫాన్ ప్రభావం అంతగా ఉన్నట్టు కనపడటం లేదు. పెళ్లి రేపు రాత్రి తొమ్మిది గంటల తర్వాత కాబట్టి ఎలాంటి పరిస్తితులలోనైనా రేపు పది, పదకొండు లోపల చేరిపోతాము. మీరేమీ టెన్షన్ పడకండి " అన్నాడు రాజేష్ మామగారి ముఖంలో ఆందోళన చూశాక. .

కృష్ణారావు రైల్వే స్టేషన్లో కూర్చున్న తోడల్లుడు మాధవరావుకు ఫోన్ చేసి అక్కడ పరిస్తితి కనుక్కుని " చూస్తూంటే మేము ట్రైన్ టైముకు అక్కడకు చేరుకుంటాము అన్న నమ్మకం సన్నగిల్లింది. . మేము మధ్యలో ట్రాఫిక్ లో చిక్కుకు పోయాము. మా వల్ల మీరు కూడా ఇబ్బందుల్లో పడొద్దు. ఇటువంటి పరిస్తితి వస్తుందని ఎవరూ ఊహించలేదు. మీరు దయచేసి ఏమీ అనుకోకుండా ఇంటికి వెళ్లిపోండి. అందరమూ సఫర్ అవ్వడం మంచిది కాదు. ఇలా చెపుతున్నానని మీరేమీ అనుకోవద్దు. మీరు అక్కడ మిగిలిన మన బంధువులందరినీ సముదాయించి ఆ పని చేయండి. మాకు తప్పదు కాబట్టి ఏ టాక్సీనో పట్టుకుని పెళ్లి వారింటికి చేరుతాం. పెళ్లయ్యాక ఎలాగూ సికిందరాబాద్ లో రిసెప్షన్ కార్యక్రమం ఉంది కాబట్టి అందరమూ అక్కడ కలుసుకుందాము. వాళ్ళ మనను బాధ పడకుండా కన్విన్స్ చేసే బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. " అన్నాడు కృష్ణారావు ఇబ్బంది పడుతూ. .

" అవునులెండి. మేమూ అదే ఆలోచిస్తున్నాము. టిక్కెట్లు అన్నీ మీ దగ్గరే ఉన్నాయి. మా దగ్గర ఉన్నా మేము రాజమండ్రి వెళ్లి మీరు రాకుండా చేసేదేమీ లేదు. ఇంకొద్దిసేపు చూసి వెళ్లిపోతాము. చూస్తూంటే మీరు రావడానికి ఇంకో ముప్పావు గంటైనా పట్టేటట్టుగా ఉంది. ట్రైన్ రావడానికి ఆలస్యం కావచ్చు అని ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఎంత ఆలస్యం అయినా కూడా మీరు ఇక్కడకు వచ్చే అవకాశం అయితే కనపడటం లేదు. సరే లెండి. కొద్దిగా వర్షం తగ్గాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళి పోతాం. అయినా మీరు చెప్పినట్టు పదిహేను మంది వరకూ స్టేషన్కు వచ్చి ఉండాలి అన్నారు కానీ ఇక్కడ మాత్రం ఆరేడుగురు మాత్రమే కనిపిస్తున్నారు. టిక్కెట్లు వాళ్ళ డబ్బుతో కొనుక్కోలేదు కాబట్టి ఇంటిదగ్గర బయలుదేరే టప్పుడే తుఫాన్ పరిస్తితి చూశాక వాళ్ళ నిర్ణయం మార్చుకుని ఉంటారు. మీరన్నట్టు ఇంకో రెండు రోజుల్లో ఎలాగూ రిసెప్షన్ ఉంది కదా అక్కడ కలుద్దాం అని అనుకుంటున్నారేమో . మీరు ఈ విషయంలో ఎక్కువ ఆందోళన పడకండి. ఎవరు వచ్చినా రాకపోయినా పెళ్ళిలో ఇటువైపునుండి మీ కుటుంబం, ముఖ్యంగా పెళ్లి కొడుకు పెళ్లి వారింటికి చేరుకుంటే చాలు. స్టేషన్ వరకూ ఎలాగూ వస్తారు కాబట్టి బయట టాక్సీ స్టాండ్లో ఆ వూరు వరకూ వచ్చే టాక్సీలు ఉంటాయి. " అంటూ ఫోన్ పెట్టేశాడు మాధవరావు. . .

క్యాబులోంచే ఒకసారి పెళ్లికూతురు తండ్రికి ఫోన్ చేశాడు కృష్ణా రావు. పరిస్తితి వివరించి మేము అనుకోకుండా ఈ రోజు రాత్రి ట్రైన్ కు వచ్చే పరిస్తితి కనపడటం లేదు. మీ వూళ్ళో ఎలా వుందో కానీ ఇక్కడ తుఫాన్ ప్రభావం మరీ తీవ్రంగా ఉంది. ఇప్పటికే రోడ్డులన్నీ నీళ్ళ మాయం అయిపోయాయి. మేము మధ్యలోనే చిక్కుకుపోయాం. స్టేషన్ కు చేరు కున్నా ఎటువంటి పరిస్తితులలోనూ ట్రైన్ అందుకునే అవకాశం లేదు . కాబట్టి మీరెవరూ మా కోసం స్టేషన్ కు రానక్కరలేదు ,మేము ఏదో ఒక టాక్సీ పట్టుకుని డైరెక్ట్ గా మ్యారేజ్ హాల్ దగ్గరికి వచ్చేస్తాం " అన్నాడు . ఇంకా క్యాబులోనే వేలాడుతూ ఉండటంతో అసలు వాళ్ళ ప్రయాణం పూర్తిగా అనిశ్చితంగా అనిపిస్తోంది. .

"ఏమిటో సార్. మాకు మీరు చెప్పినట్టు అంత తీవ్రత కనపడటం లేదు. అయితే తుఫాన్ హెచ్చరికలు వస్తున్నాయి. మీరు ఇక్కడకు వచ్చి పడిపోతే ఎలాగో అలా మా బంధువులను, మా వూరి వాళ్ళ సహాయంతో ఎలాంటి పరిస్తితులనైనా ఎదురుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. . మీరు అన్నట్టు మీకు ట్రైన్ అందకపోతే మీ ఇష్టదైవానికి దణ్ణం పెట్టుకుని టాక్సీలో వచ్చేయ్యండి. మీరు టాక్సీ ఎక్కాము అని కన్ఫర్మ్ చేయగానే నేను మొత్తం ఖర్చులు అన్నీ ఫోన్ పే చేసేస్తాను. మీరు ఒక్క పైసా జేబులోంచి తియ్యొద్దు. ఇప్పటికే మీకు చాలా నష్టం జరిగింది. మీరు ఇంకా ఏమీ ఆలోచించకుండా వచ్చేయ్యండి.అవసరమైతే ఇక్కడ జరగవలసిన పెళ్ళికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు షార్ట్ కట్ చేసేద్దాము . మధ్య మధ్యలో ఎలాగూ ఫోనులు చేసుకుందాం. ఏమీ ఇబ్బంది లేదు " అని భరోసా ఇచ్చి అవతల ఫోన్ పెట్టేశాడు పెళ్లి కూతురు తండ్రి.

క్యాబులో మిగతా వారు ముందు ముందు ఏం జరగబోతోందో అన్న విషయాన్ని పూర్తిగా కృష్ణారావుకు వదిలేసి తటస్తంగా ఉండిపోయారు.

ఫోన్ రింగయ్యింది. కృష్ణారావు ఆతృతగా తీశాడు.

"హల్లో అన్నయ్యగారు నేను మాధవరావును మాట్లాడుతున్నాను. . ఇప్పుడు మీరెక్కడ ఉన్నారు ? ఇంకో గంటలో నైనా రాగలరా స్టేషన్ కు ? ఎందుకంటే మేము ఇళ్లకు వెళ్ళి పోదాం అనుకుంటూ ఉంటే స్టేషన్లో అన్నౌంస్మెంట్ వినపడింది. మధ్యలో ఏదో సమస్య రావడం వల్ల రైలు ఒకటిన్నర గంట ఆలస్యం గా నడుస్తోందని చెప్పారు. అప్పటివరకూ రైట్ టైమే అని ప్రకటన వచ్చినా ఇదేదో మన అదృష్టం కొద్దీ జరిగినట్టుంది. . మీరు ఇక ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోండి. మీకోసం ఎదురుచూస్తూంటాం. మధ్యలో ఇరుక్కుపోయిన మరో నలుగురైదుగురు బంధువులు కూడా ఇప్పుడే స్టేషన్కు చేరుకున్నారు. బహుశా వారు కూడా ఈ ట్రైన్ అందుతుందని కలలో కూడా అనుకుని ఉండరు. " అన్నాడు మాధవ రావు ఎంతో ఎగ్జైటింగ్గా .

అనుకోకుండా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ కంట్రోల్ చెయ్యడం వర్షం ఆగిపోవడంతో లైన్ క్లియర్ అయ్యి డ్రైవరు అరగంటలోనే స్టేషన్కు చేర్చేశాడు. గుండెల్లో గుబులుతోనే అందరూ లోపలికి అడుగుబెట్టారు. కృష్ణారావును చూడగానే స్టేషన్ లో ఆతృతతో నిరీక్షిస్తున్న అతని బంధువుల మొహం చేట అంత అయ్యింది. కృష్ణారావు కుటుంబానికి ఇప్పుడు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా అనిపించింది. అప్పటివరకూ ఉన్న భయాలు , టెన్షన్లు అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.

" గ్రేట్ కృష్ణా రావు గారు. మీకు అన్నీ పరిస్తితులు కలిసి వచ్చాయి. ఏ కారణంవల్లనో ట్రైన్ రావడం ఆలస్యం అయ్యింది. ప్రకృతి భీభత్సవంగా మారి రోడ్లు జలమయమై పోయినా స్టేషన్ కు గంట ముందుగానే వచ్చేశారు. ఈ పరిస్తితిలో ట్రైన్ ఆలస్యంగా నడవడం మేము అసలు ఊహించలేదు. మనకే ఇలా వుంటే పాపం మన ఆడవాళ్ళ పరిస్తితి ఇక చెప్పనక్కరలేదు " అంటూ ఎంతో రిలీఫ్ ఫీలయ్యాడు మాధవరావు . .

రైల్లో అందరూ ఎవరి సీటు వాళ్ళు చూసుకుని కూర్చున్నాక ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ఫోన్ తీసుకుని పెళ్లి కూతురి తండ్రికి ఫోన్ చేశాడు కృష్ణారావు.

"బావగారు. మేమందరమూ ట్రైన్లో ఉన్నాము. పరిస్తితులు మాకు సహకరించాయి. అనుకున్నట్టే ఆరు ఏడు గంటలకల్లా అక్కడికి చేరుకుంటాము. స్టేషన్ కు ఎవరినైనా పంపించండి. ఏదైనా ఒక పెద్ద వెహికిల్ లో మమ్మల్నందరినీ కళ్యాణ మండపం దగ్గరకు చేర్చే ఏర్పాటు చేయండి " అన్నాడు.

" గ్రేట్ ఆండీ. నిజానికి నేను తలపెట్టిన ఏ కార్యక్రమం అయినా ఇంతవరకు సమస్యల మయం కాలేదు. నాకా నమ్మకం ఉంది. . మీరు ఇందాక ఫోన్ చేసినట్టు సరైన సమయానికి ఇక్కడ చేరుకోలేకపోతే పెళ్లికి ముందు చేయవలసిన కొన్ని ముఖ్య కార్య క్రమాలు, ముచ్చటలు జరిపించలేని పరిస్తితి వచ్చి పెళ్లి అసంపూర్తిగా జరిగినట్టుగా అనుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు మాకు కొండంత బలం వచ్చింది. రేపు మీరు ఇక్కడకు చేరుకునే సమయానికి మేము తాళ మేళాలతో స్టేషన్ కు వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాము. మీరిక ప్రశాంతంగా ఉండండి " అంటూ ఫోన్ పెట్టేశాడు పెళ్లి కూతురి తండ్రి.

లోపల కూర్చుని ఉండటం వల్ల తుఫాన్ ప్రభావం తెలియలేదు కానీ రాజమండ్రి చేరాక దాని ప్రభావాన్ని అందరూ చూడగలిగారు. ఎలాగో అలా సామానులన్నీ ఒక పక్కకు చేర్చారు. అప్పటికే ఒళ్ళంతా రైన్ కోట్లు కప్పుకుని నిలబడి ఉన్న పెళ్లి కూతురి తండ్రి , ఆయన అనుచరులు పలకరింపులు కూడా పక్కన పెట్టి ఒక గ్రూపుగా నిలబడి ఉన్న పెళ్లి వారిని గుర్తించి తీరానికి చేర్చినట్టుగా పెళ్లి హాలు దగ్గరకు చేర్చారు. చెపితే భయపడి ముహూర్తం కాన్సిల్ చేస్కుని వెనక్కి వెళ్ళి పోతారేమో నన్న భయంతో తుఫాన్ తీవ్రత గురించి ఎక్కువగా చెప్పకుండా పరిస్తితి అదుపులోనే వుందన్నట్టుగా పెళ్లి కూతురు తండ్రి కవరింగ్ ఇచ్చినా అందుకు భిన్నంగా ఉంది పరిస్తితి. హటాత్తుగా వరద ముంచుకొస్తే చెట్టుకొకళ్లు, పుట్టకొకళ్లు పరిగెత్తినట్టుగా మగ పెళ్లి వారు అక్కడ కనపడిన గదుల్లోకి దూకారు. . వారిలో ఎందుకొచ్చామురా భగవంతుడా అనుకున్న వారు లేకపోలేదు. తుఫాన్ తీరం రాజమండ్రికి దగ్గరగా ఉండటం అల్ప పీడన ప్రభావం వల్ల ఎవరో చెపితే కానీ అక్కడ పెళ్లి జరగబోతోందన్న విషయం ఎవరికీ తెలిసే అవకాశం లేదు. కట్టిన బోర్డులు గాలి , వర్షానికి ఒక పక్కకు ఒదిగిపోయి ఉన్నాయి. ఇంకోపక్క అల్పాహారం కోసం , విందు భోజనం కోసం కేటాయించిన స్థలం అంతా నీళ్ళతో నిండిపోయి ఉంది.

"బావగారూ ప్రకృతి ఇలా ప్రకోపిస్తుందని ఎవరూ అనుకోలేదు. మీ అందరికీ ఎన్నో సదుపాయాలు సమకూర్చాలని ఎన్నో అనుకున్నాను. ఇప్పుడు ఎలాగో అలా పెళ్లి చేసి బయట పడితే చాలనే పరిస్తితి దాపురించింది. ఈ విషయంలో దయచేసి మీ అందరూ మాకు సహకరించి ఈ పెళ్లి దిగ్విజయంగా జరిగేటట్టుగా ఆ భగవంతుని కోరుకుందాం" అంటూ చేయి పట్టుకుని ప్రాధేయపడ్డాడు పెళ్లి కూతురి తండ్రి విశ్వేశ్వర రావు. ఆయన పక్కనే ఆయన శ్రీమతి బిక్కుబిక్కుమని నిలబడి చూస్తోంది కాబోయే వియ్యంకుడు, వియ్యపురాలు, వారి బంధువులు ఎటువంటి సమస్య సృష్టిస్తారోనని.

ఆ రాత్రి ముహూర్తం సమయానికి ఒక అరగంట సేపు ప్రకృతి కరుణించడంతో పెళ్లి కూతురి మెడలో సూత్రం పడగానే ఇరుపక్షాలు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. బంధువులంతా పరిస్తితిని అర్ధం చేసుకుని మౌనంగా ఉన్నారు కానీ కొంతమంది దగ్గర బంధువులు పెళ్ళిలో కలిగిన అసౌకర్యానికి తీవ్ర మనష్టాపంతో కుతకుతలాడిపోయారు. "ఇలాంటి పెళ్లిని మా జీవితంలో ఎక్కడా చూడలేదు . ఒక్క సౌకర్యం కల్పించలేదు సరికదా కనీసం అందుకు పశ్చాతాపం కూడా పడలేదు . బొత్తిగా మంచీ మర్యాద లేని మనుషులు. ఇటువంటి సంబంధం కావాలని చేసుకుని అంతా అద్భుతంగా జరిగిందన్న భ్రమలో ఉన్నారు ఈ కృష్ణారావు దంపతులు. అవును . కొడుక్కి పది సంబంధాలు వచ్చినా ఏ ఒక్క సంబంధం కుదరకపోగా ఆఖరికి ఈ రాజమండ్రి వాళ్ళు ఒప్పుకోవడంతో వీళ్లతో తగాదా పడితే పీటలమీద పెళ్లి ఆగిపోతున్న భయంతో కిక్కురుమనకుండా కూర్చున్నారు " అంటూ పెళ్ళికి రావడానికి అంతగా ఆసక్తి చూపని వాళ్ళను కూడా టికెట్ ఛార్జీలు భరించి పెళ్లికి తీసుకొస్తే వీళ్ళ కామెంట్స్ ఆ విధంగా సాగాయి.

అప్పగింతలు, ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ధైర్యం చేసి పూర్తి చేసేశాక తర్వాత రోజు సాయంత్రం బంధువులతో పాటు కృష్ణారావు కుటుంబ సభ్యులు ట్రైన్లో బయలుదేరారు. తుఫాన్ పెళ్లి సమయంలో కొంతసేపు తెరిపిచ్చినా , సాయంత్రం అయ్యేటప్పటికి దాని ప్రతాపం చూపించసాగింది. ఆ తర్వాత రోజు ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ లో రిసెప్షన్ కార్యక్రమం ఉంది. అంచనా ప్రకారం, పెళ్ళికి రాని వాళ్ళు , ఇతర ముఖ్యమైన బంధువులు కలుపుకుంటే రెండు మూడొందల మంది ఐనా హాలు దగ్గరికి చేరుకుంటారు.

మాగపెళ్ళి వారు, వారి బంధువులు పూర్తిగా అలిసిపోయి ఉండటం, తీవ్రమైన చలికి వారిలో కొంతమందికి జ్వరం వచ్చినట్టుగా అనిపించడం లాంటి సమస్యలతో ఒళ్ళు ఎరగకుండా పడుకుని ఉన్నారు. ఒక అర్ధ రాత్రి ఎవరో అంటున్నారు. ట్రైన్ పట్టాలు తప్పి మధ్యలో మూడు గంటలు ఆగిపోయిందని , పెద్ద పెను ప్రమాదం తప్పిందని, ఐదు గంటలకు హైదరాబాద్ చేరాల్సిన బండి పట్టాలను సరిచేస్తే పదకొండు గంటలకు చేరుకుంటే గొప్ప విషయమని అంటూంటే కృష్ణారావు గుండెల్లో రైళ్లు పరిగెత్తసాగాయి. ఒక పక్క రెండు లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చి ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవడం , ఈ రైల్ ఆలస్యంగా కారణంగా సరైన సమయానికి చేరుకోకపోతే అక్కడకు వచ్చిన బంధువుల పరిస్తితి ఏమిటి ? అందరూ దుమ్మెత్తి పొయ్యరా ? భగవంతుడా ఏమిటి ఇలాంటి సమస్య తెచ్చి పెట్టావు ? పెళ్లిళ్లు వేరే దూరపు ఊళ్ళల్లో చేస్తే ఎంత పక్కాగా ప్లాన్ చేసినా కూడా ఇటువంటి పరిస్తితులను ఎదుర్కొక ఎవరికైనా తప్పవేమో ?మరోపక్క తుఫాన్ తీవ్రత ఎక్కడ తగ్గేటట్టుగా లేదు . రకరకాల ఆలోచనల మధ్య కృష్ణారావు పడుకున్న బంధువులందరినీ లేపేసి సమస్యను చర్చించసాగాడు.

"రిసెప్షన్ కు వెళ్లకపోతే ఏమొచ్చిందిలే. ట్రైన్ దిగగానే సరాసరి ఇంటికి వెళ్లిపోవచ్చు" అనుకోవడానికి వీలు లేకుండా ట్రైన్ లో అందరూ ముఖ్యమైన వాళ్ళే ఉన్నారు.

ఏ మాటకామాట చెప్పుకోవాలి. రైల్వే డిపార్ట్మెంట్ అద్భుతమైన నిరంతర కృషికి అనుకున్న సమయానికి ముందుగానే చెదిరిపోయిన పట్టాలను సరిచేయడం ట్రైన్ అటూ ఇటూగా తర్వాత రోజు ఉదయం పదిన్నర ప్రాంతంలో చేరుకోగానే మళ్ళీ అందరూ మరోసారి గట్టిగా గుండెనిండా ఊపిరి పీల్చుకున్నారు. .

కృష్ణారావు కుటుంబం , అతని దగ్గర బంధువులు హైదరాబాద్ చేరగానే వాళ్ళు బుక్ చేసుకున్న గదులలో స్నానం గట్రా చేసి అవతలవారికి ఎటువంటి డౌట్ రాకుండా పువ్వులా తయారైపోయి రిసెప్షన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించారు. రాజమండ్రి బయలుదేరినప్పుడు పడిన టెన్షన్ గురించి కానీ, పెళ్ళిలో పడిన ఇబ్బందులు కానీ , మధ్యలో రైలు పట్టాలు తప్పి ఐదు గంటలకు రావాల్సిన ట్రైన్ మరో ఐదు గంటలు ఆలస్యంగా వచ్చిందని గానీ ఎవరూ తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. వాళ్ళకు జరగవల్సిన మర్యాదలు బాగా జరగడంతో పెళ్లి కూడా బాగా జరిగి ఉంటుందని ఊహించుకుంటూ ఎవరిళ్లకు వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు.

ఇంత భయంకరమైన తుఫాన్లో కూడా ఈ పెళ్లి ఎటువంటి ఆటంకం రాకుండా జరిగిందంటే అంతా తన తెలివితేటలు, టైంలీ మేనేజ్మెంట్ తో పాటు తను పెట్టించిన ముహూర్త బలం అని " చక్కగా కవరింగ్ ఇచ్చుకున్నాడు పెళ్లి కూతురి తండ్రి విశ్వేశ్వర రావు. పెళ్ళిలో ఎన్నో అవకతవకలు జరిగినా ఎంతో సంయమనంతో , విజ్ఞతతో సహకరించిన కృష్ణా రావు మాత్రం ఎంతో కాలంగా తన కొడుకు కోసం ఎన్నో సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన క్రమంలో చివరకు ఎలాగో కుదిరిన సంబంధాన్ని తుఫాన్ చెడగొడుతుందేమో అని అనుక్షణమూ పడ్డ భయంలోంచి చివరకు రిసెప్షన్ ముగిసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళి పోవడంతో గుండెలు తేలిక పడ్డట్టయ్యి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. అవును మరి ..... పూర్వం ఆడ పెళ్లి వారు తమ కూతుళ్ల పెళ్లిళ్లు చెయ్యడానికి పెళ్ళికి ముందు , తర్వాత ఎన్నో కష్టాలు అనుభవించేవారుట. కాల మహిమ ఆ పురిటి నొప్పులు ఇప్పుడు మగ పెళ్లి వారు పడుతున్నారు******

సమాప్తం

మరిన్ని కథలు

Kshama lo dharitri
క్షమలో ధరిత్రి.
- Aduri.HYmavathisrinivasarao,
Marmam
మర్మం
- రాము కోలా దెందుకూరు
Korthi
కొర్తి
- బివిడి ప్రసాద రావు
Atrhata
అర్హత
- డి.కె.చదువుల బాబు
Antataa neeve
అంతటా నీవే
- షామీరు జానకీ దేవి
Ahakaram techhina sapam
అహంకారం తెచ్చిన శాపం
- గొట్టాపు శ్రీనివాస రావు
Donga chetiki taalaalu
దొంగ చేతికి తాళాలు
- కొల్లాబత్తుల సూర్య కుమార్
Aa raatri
ఆ రాత్రి
- జాహ్నవి ప్రియా