"డబల్ డోర్ ఫ్రీజ్ లేకపోతే కష్టం. ఈరోజుల్లో వుండాల్సిందేనే. డబ్బులు గురించి చూసుకో కూడదు. అదే కొనమని గట్టిగా చెప్పు అల్లుడు గార్ని. మన అబ్బులు మావయ్య, అదేనే కెనడా కిరణ్ కుమార్ వాళ్ళ నాన్న, కోఠిలో వుంటాడు కదా, మొన్న వాళ్ల ఇంట్లో చూసాను. ఫ్రిజ్ డోర్ మీద డిజైన్ దిమ్మ తిరిగి పోయేలా వుందనుకో. ఫోటో తీశాను. వాట్సప్ లో పెడతా. ఆది కొను. వేరేదేమి వద్దు, వేరేది ఏదైనా ఛండాలంగా వుంటుందని అల్లుడు గార్కి. గట్టిగా చెప్పు. సరేనా దివ్యా ?.. మీ చెల్లాయి ఫోన్ చేస్తోంది…" అంటూ ఫోన్ కట్ చేసింది జానకమ్మ. ఆమె కూతురు దివ్య సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తోంది. అల్లుడు బ్యాంక్ లో ఆఫీసర్. ఈ మధ్యనే వివాహమయ్యి, వాళ్లు కొత్తగా కాపురం పెట్టుకున్నారు గచ్చిబౌలిలో. వ్యవసాయం నేపథ్యంగా, మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చిన జానకమ్మ , ఆడ పిల్లల్ని చదివించి, ఉద్యోగస్తులను చేయడం, ఆమె సాధించిన గొప్ప విజయంగా భావిస్తుంది. సరే, అంతవరకు భరించవచ్చు. కానీ పిల్లలు కాస్త సంపాదనాపరులయ్యే సరికి, గతం మరిచి, అహంభావం అరువు తెచ్చుకొని, మదాన్ని కొని తెచ్చుకొని, వచ్చిరాని పరాయి భాషా పదాల్ని అసందర్భంగా సంభాషణలలో జోడిస్తూ, మాట్లాడే విధానానికి వింత అందాలు రుద్దింది . కూతురు కాపురమనే సినిమాకి, కథ, కథనం, మాటలు, దర్శకత్వం,సంగీతం, ఇలా "సర్వము తానైనవాడు" అన్న చందంగా భావిస్తుంది జానకమ్మ. కొండొకచో, ఆవిడ 'అతిథి పాత్ర'లోనూ జీవిస్తుంది. చరవాణి చెంత నుండగా చింతలకేమి కొదువ?అన్నట్లుగా పడక గదిలో (ఆలమగల, సరస సంభాషణలనడం, కాస్త అతిశయోక్తిగా వుంటుందేమో ) కబుర్లు, కూతురు అత్తవారింటి విశేషాలు, వంట వార్పూ, ఆఫీసు, ఇత్యాది విషయాల్లో దూసుకు పోయి, ఒక వేళ కూతురు చెప్పడానికి సంశయించినా, తన టీవీ సీరియల్ , సినిమా పరిజ్ఞానంతో, ఆ విషయాలన్నీ నేర్పుగా సంగ్రహించి, వాటిని శోధించి, తర్కించి, అపార తన అనుభవాల్ని మేళవించి, అడగకుండానే సలహాల పరంపరలను కూతురి మీదకు 'ప్రేమ'గా సంధించే ప్రజ్ఞాశాలి, 'సుగుణశీలి' జానకమ్మ. కొన్నిసార్లు తల్లి ప్రవర్తనకి, కూతురు విసుక్కొంటూ,"అమ్మా! నీ కెందుకు మా గొడవ. మమ్మల్ని వదల్లేయి తల్లీ " అని ప్రాధేయపడినా, కరుణించని ఆ తల్లి బలహీనతను, తన 'భాగ్యం'గా భావించి మురిసి పోయేది ఆ కూతురు. భార్య జానకమ్మ ఆగడాలకు అడ్డుకట్ట వేయలేని ఆమె భర్త, 'జానకమ్మ మొగుడు'గా ఇంటా, బయటా విఖ్యాతి పొందాడు. మరో విచిత్ర మేమిటంటే, తనకి ఇష్టం లేని పనులు గురించి ఎవరైనా మాట్లాడినా, ఆరా తీసిన,"అమ్మో! ఇంక ఏదైనా వుందా పిన్నీ, ఈ విషయం ఆయనకి తెలిస్తే, నా చర్మాన్ని చీల్చి, డోలు కట్టి వాయించరూ? నా వల్ల కాదు బాబోయ్…" అంటూ పతివ్రతా శిరోమణిలా గజగజా వణుకుతూ భయం నటించేది. అనారోగ్యం, ఆసుపత్రులు వంకతో అల్లుడు ఇంటిలో మేట వేసింది. అత్తగారి ఆగడాలకు అడ్డు అదుపు లేకపోవడంతో, అల్లుడు మనసులో అసంతృప్తి జ్వాలలు చెలరేగసాగాయి. అత్త ప్రభావంతో, ఆమె శిక్షణలో, భార్య కూడా ప్రతి విషయానికి అలగడం, పొట్లాడటం, నా మాట నెగ్గి తీరాల్సిందేనని పిచ్చిపంతాలకు పోవడంతో జీవితం దుర్భరంగా వుందతనికి. వివాహ జీవితం మీద విరక్తి కలుగుతోంది. దుబారా ఖర్చులు చేయడం, కారు లోనే తిరగడం, రెస్టారెంట్లులో తినడం, తల్లీ కూతుళ్ళకు అలవాటుగా మారింది. వాళ్ళకి భద్రతాధికారిగా,ఆ మావ గారు సేవలందించేవాడు. పద్ధతులు మార్చుకోమని అల్లుడు ఏ విధంగా చెప్పినా, అదంతా అరణ్య రోదన కావడం, చివరకు భార్యా భర్తలు, ఒకరి నొకరు తిట్టుకోవడం దాటి, భౌతికంగా కొట్టుకోవడం దాకా కూడా వెళ్ళింది. ఐనా తల్లి కూతురు కలిసి అల్లుడ్ని ఎలా లొంగదీసుకోవాలాని ఆలోచనలు చేసేవారు. 💐💐💐 కొత్త కోడలి ఆగడాలు, అసహ్యకర ప్రవర్తన, పట్టరాని కోపంతో ఊగిపోతూ, అరుస్తూ 'చంద్రముఖి'లా మారి, చరవాణిని నేలకేసి కొట్టడం, ఇంకా ఇంటి గృహోపకరణాలు, కుర్చీలు విసరి విరగ కొట్టడంతో పాటు, ఉద్వేగాన్ని అదుపు చేసుకోలేక అరుస్తూ, కొడుకు మీద కూడా చేయి చేసుకోవడం చాలా దిగులు కలిగించింది రాజేశ్వరరావు దంపతులకు. కొడుకు ద్వారా విషయాలు తెలుస్తూనే వున్నాయి. కోడలు, ఏదైనా మానసిక అనారోగ్యంతో బాధ పడుతోందేమోనని అనుమానం వచ్చింది. కానీ అలాంటి వాళ్లు వైద్యం చేయించుకోరు. వైద్యం చేయించుకొంటేగాని అవి తగ్గవు. ఇదో అంతులేని కథ. వీటికి తోడు, అల్లుడింటిలో వింత అత్త పెత్తనం. కొడుకు దురవస్థకు కన్నీళ్లు పెట్టుకోని రోజు లేదు ఆ తల్లిదండ్రులకు. పోలీస్ స్టేషన్ గడప తొక్కాలంటే, కుటుంబ గౌరవం అడ్డువస్తుంది. అంతేకాక, చట్టాలన్ని ఆడవాళ్ళకే సానుకూలంగా వున్నాయి ఈ వేదభూమిలో. కొడుకుని కన్న అత్తమామలు, సహజ న్యాయ సూత్రాల ప్రకారం నేరస్తులే ఏ పరిస్థితిలోనైనా. స్త్రీ సమస్యల సాధన, వారి హక్కుల రక్షణ కోసం ఒకనాడు మహిళా సంఘాలు స్థాపించినట్లుగా, ఈనాడు, భార్యా బాధితులు కూడా సంఘాలను స్థాపించుకోవలసిన అవసరం ఉందేమో. నిజంగా ఆలోచించవలసిన సమయమిది. కొడుకుకి ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతూ, తగిన ప్రయత్నాలు చేస్తున్నాడు తండ్రి రాజేశ్వరరావు. 💐💐💐💐 సుమారు మధ్యాహ్నం ఒంటి గంటవుతుంటే తలుపు చప్పుడు విని, ఈ సమయంలో వచ్చినదెవరానని ఆలోచిస్తూ, తలుపు తీసి చూసింది జానకమ్మ. కూతురు, అల్లుడు ఉదయమే ఆఫీసులకి వెళ్లిపోయారు. రాత్రికి గాని వాళ్లు ఇంటికి రారు. తలుపు తీసి బయటకు వచ్చి చూసింది. ఎత్తుగా, దృఢంగా, గుబురు మీసాలున్న వ్యక్తి చేతిలో ఏవో కాగితాలు పట్టుకొని నిలబడ్డాడు. చిరునామా రుజువు చేసుకొని, అల్లుడు, కూతురు,జానకమ్మ, జానకమ్మ మొగుడు పేర్లు చెబుతూ, వారందరూ ఇక్కడే వున్నట్లు నిర్దారణ చేసుకొని,"జానకమ్మ ,మీరేగా, మీ మీద పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. విచారణకు రావాల్సి వుంటుంది. సాయంత్రం ఐదు గంటలకు గచ్చిబౌలి పోలీసు స్టేషన్ కి రమ్మని మా సి.ఐ చెప్పారు."అని చెప్పి, వాళ్ళ ఫోన్ నంబర్లు వ్రాసుకొని వెళ్ళాడు. హెచ్చిన గుండె చప్పుడుతో, దబ్బున తలుపు వేసి, బాల్కనీలోకి పరుగున వెళ్లింది. రోడ్డు మీద మలుపు తిరుగుతున్న పోలీసు జీపులో, ఆ సివిల్ డ్రెస్సులో వున్న ఆ పోలీసు అధికారిని చూసి గుండెల్లో రాయి పడింది జానకమ్మకి. 💐💐💐 నాలుగు రోజుల క్రితం, తల్లి, కూతురు దైవ దర్శనానికి, క్యూలో నిలబడినప్పుడు, వెనుక నుంచి కొందరు ముందుకు త్రోసుకొంటూ వెళ్ళిపోతుంటే, వాళ్ళని అడ్డగించి పొట్లాడటం, ఆది బాహాబాహి ముష్టియుద్ధం దాకా వెళ్లే ప్రమాదాన్ని పసిగట్టిన భక్తులు కొందరు, ద్వంద్వ యుద్ధానికి దేవాలయం, తగిన వేదిక కాదని, బయటకు పోయి, మీ పౌరుష ప్రతాపాలు, విశ్వరూపాలు, ప్రదర్శించుకోమని సలహా చెప్పి, అతి కష్టం మీద వాళ్ళని వారించ గలిగారు. ఆ సంఘటన జ్ఞాపకం వచ్చింది జానకమ్మకి. పోలీసులు, ఫిర్యాదులు, అరెస్టులాంటివి వినడమే తప్పా, పెద్దగా విషయాలు ఏమీ తెలియవు ఆమెకు. తెలియని మరో సంగతి ఏమంటే, ఆ రోజు గొడవ పడింది సాక్షాత్తూ ఒక పెద్ద పోలీసు ఆఫీసర్ భార్య, బావ మరిది కుటుంబంతో. జానకమ్మకి భయం వేసి, కూతురుకి జరిగిన సంగతి ఫోన్లో వివరించింది. ఇద్దరికీ ఏమీ చేయాలో తెలియడంలేదు. పోలీసు కేసుల్లో ఇరుక్కుంటే, ముందు ఉద్యోగం పోవడం ఖాయమని తెలిసింది. రిమాండ్, కోర్టులో వాదనలు, విచారణలు, లాంటి వివిధ విషయాలు గురించి కొంత మంది స్నేహితులు చెప్పడంతో, భయం ఇంకా పెరిగింది. డబ్బు, గౌరవ మర్యాదలు మంట కలిసి, జీవితం కుక్కలు చింపిన విస్తరవుతుందని స్నేహితులు కొందరు భయపెట్టారు. ఈ పరిస్థితి నుండి, గట్టెక్కడం కోసం ఆలోచిస్తుంటే, గుర్తుకు వచ్చాడు భర్త . ఫోన్లు మీద ఫోన్లు చేయసాగింది ఆతనికి. బ్యాంక్ ఆడిట్ గొడవలో చాలా బిజీగా వుండి, చరవాణి సంగతే మరచి పోయాడతడు. ఇటు, తల్లి ఫోన్ చేసి కూతుర్ని పదే పదే ప్రశ్నించడం, అటు మొగుడు ఫోన్ ఎత్తకపోవడంతో, దివ్యకి పిచ్చెక్కింది. ఆమెకు తెలియకుండానే, రక్తపోటు పెరిగి, ఫోన్లో తల్లిని బూతులు తిట్టింది. తల్లీ కూతుళ్ళ ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైంది. ఇంట్లో తల్లి కూడా భయాందోళనకు గురై, మొగుడ్ని తిట్టి పోసింది. కూతుర్ని శపించింది. ఆ రోజు గుడిలో గొడవకి కారణం నువ్వంటే నువ్వని ఒకరి నొకరు నిందించుకొన్నారు. సమయం గడుస్తున్నకొద్దీ, కనిపించని కాలనాగు, వెంబడిస్తున్నట్లు భయపడ సాగింది జానకమ్మ. 💐💐💐 హాల్లోంచి బాల్కనీలోకి కాలు కాలిన పిల్లిలా తిరుగుతోంది జానకమ్మ. పోలీసుజీప్ లో తనని లాక్కొని పోతారేమోనని, పోలీసుకేసు వలన. కూతురు ఉద్యోగం పోతే పరిస్థితి ఏమిటని చెప్పలేనంత నరకయాతన పడుతోంది. నిజానికి, జానకమ్మ మొగుడు, పరమానందంగా వున్నాడు ఆ క్షణంలో. మనసులో భార్య తిక్క కుదిరి, తోక ముడిచే రోజు రావాలని మనసులోనే దేవుడిని ప్రార్ధించాడు. 💐💐💐 ఆఘమేఘాలమీద, సరాసరి తన క్యాబిన్ లోకి దూసుకొస్తున్న భార్య దివ్యని చూస్తూ, తన కళ్ళని తానే నమ్మలేక పోయాడు కార్తికేయ. వాడి పోయిన ఆమె వదనంలో, భయాందోళనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నోట మాట రావడం లేదు. నీళ్ళ సీసా తీసి గడగడా త్రాగి జరిగిన విషయం చెప్పింది. అన్నీ శాంతంగా విని, " సరే, మీ అమ్మని నాన్నని పోలీసుస్టేషన్ కి వెళ్ళమను. ఈ హైదరాబాద్ లో మీ మావయ్యలు, బాబయ్యలు బోల్డంతమంది వున్నారట కదా ! ఫోన్ కొడితే కార్ల మీద కోటిమంది క్షణాల్లో దిగుతారట. మరి భయమెందుకు? పోలీసు స్టేషన్లో నా మీద కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు కదా నువ్వు, మీ అమ్మ? పనిలో పనిగా, స్టేషన్లో నా మీద కూడా..." తల వంచుకొని,పని చేసుకొంటూ, నిష్ఠురంగా మాట్లాడుతున్న కార్తిక్ మాటలు పూర్తి కాకుండానే, దివ్య లేచి నిలబడి విసవిసా వెళ్ళిపోయింది. బయటకు వచ్చి ఆటోలో కూర్చొని, తల్లికి ఫోన్ చేసి, "ఎక్కడ చచ్చావ్?..ఫోన్ ఎత్తలేవా? అబ్బులు మావయ్య వచ్చాడా? రాలేదా!" కూతురి మాటల తూటాలు తల్లి గుండెల్లోకి దిగేసరికి, తల్లికి, ఉక్రోషం, ఉద్వేగం కట్టలు త్రెంచుకొని, బొంగురు పోయిన స్వరంతో,"మనుషుల నిజ స్వరూపాలు ఇప్పుడే కనిపించాయి. మన వాళ్లందరికీ ఫోన్ చేసి సహాయంగా రమ్మంటే, ఒక్కళ్ళు రాలేదు సరికదా, నే చెప్పేదంతా సినిమాకథలా విని, ఏమనుకోకు జానకి, ఏమైనా నువ్వు, నీ కూతురు దివ్య కూడా నోటి దురుసు, గయ్యాళితనం తగ్గించుకోవాలి. గౌరవ మర్యాదలున్న వాళ్లం కదా, మీతో పోలీసు స్టేషన్లుకి వస్తే, మాకు చిన్నతనంగా వుంటుంది. మా పరిస్థితి అర్థం చేసుకో అన్నారు."అంటూ జానకమ్మ ఏడ్వసాగింది. దివ్యకి ఏమీ చేయాలో పాలుపోవడం లేదు. నిజంగా ఈ కేసు వలన ఉద్యోగం పోతే, … లాయర్లు, వాదనలు, వాయిదాలు… ఇలా స్నేహితులు చెప్పినట్లుగానే తన జీవితం వుండబోతోందానని ఆందోళనతో వ్యాకుల పడుతోంది. ఇంతలో, కార్తీక్ నుంచి ఫోన్ రావడంతో, ఆత్రంగా ఫొన్ తీసింది."దివ్యా! ఎక్కడున్నావ్, ఏమీ చేస్తున్నావ్, పోలీసు స్టేషన్కి వెళ్ళు తున్నావా?..."అతని ప్రశ్నలకి ఏమి సమాధానం చెప్పాలో తెలియడంలేదామెకు. కార్తీక్ అన్నాడు,"నా మాట వింటానంటే, ఒక సలహా చెబుతా. ముందు నా దగ్గరకురా" అన్నాడు ప్రేమగా. సమాధానం చెప్పకుండానే, ఫోన్ కట్ చేసింది దివ్య. . 💐💐💐 జానకమ్మ, మొగుడుతో పోలీసు స్టేషన్ చేరుకొంది. వచ్చి వెళ్ళేవాళ్ళతో స్టేషన్ చాలా కోలాహలంగా వుంది. చాలాసేపు నిలబడడంతో, కాళ్లు గుంజుతున్నాయి ఆ జంటకు. లోపలకి వెళ్ళాలంటే బెరుకుగా వుంది. జానకమ్మ మొగుడు ధైర్యం చేసి, కౌంటర్ లో కూర్చున్న వ్యక్తి దగ్గరకెళ్ళి, ఎంతో మర్యాదగా," సి.ఐ. గారు వున్నారా సార్?"అని అడిగాడు. సమాధానంగా తల పైకెత్తి,"ఏంటి పని? ఆయన వచ్చే వేళ అయ్యింది. నీ పేరు?" అన్నాడతడు. పేరు చెప్పబోతుంటే, అతన్ని ఎవరో పిలిచి నట్టునిపించి, వెనక్కి తిరిగి చూశాడు. దూరంగా వున్న జానకమ్మ ఇలా రమ్మనట్లు సైగ చేస్తోంది. గబ గబా ఆమె దగ్గరకు వెళ్ళాడు. జానకమ్మ అంది, " సీ.ఐ. లోపలే వున్నాడట. అదిగో అక్కడ చెట్టు క్రింద నిలబడ్డాడే, అతనే మన ఇంటికి వచ్చింది. నన్ను చూసి, ఆగి, సార్ పిలుస్తారు, ఇక్కడే వుండండి అని చెప్పి లోపలికి వెళ్ళాడు.."అంది. ఇంతలో, ఒక మహిళా కానిస్టేబుల్ అక్కడకొచ్చి,"జానకమ్మ ఎవరు?"అని గట్టిగా అరిచింది. "ఆ..ఆ...నేనే జానకమ్మని… పిలిచారా?" అని ఆమె వైపు వెళ్లింది. " అవును. సార్ పిలుస్తుండు.. గిట్లరా.." అంటూ లోపలికి తీసుకుని వెళ్ళుతుంటే, జానకమ్మ వెంట ఆమె భర్త కూడా వాళ్లని అనుసరించాడు. ఆ మహిళా కానిస్టేబుల్, వెనక్కి తిరిగి, అతని వంక కోపంగా చూస్తూ,"వెనక్కి పో"అన్నట్లు చేత్తో సైగ చేసింది. తలూపుతూ, జానకమ్మ గురించే తలపోస్తూ, అక్కడే నిలబడ్డాడు. జానకమ్మ జబ్బపట్టుకుని నడుస్తోంది ఆమె. ఇంతలో వేరే గదిలోంచి వచ్చిన మరో మహిళా కానిస్టేబుల్ జత కలవడంతో, జానకమ్మను బర బరా ప్రక్క గదిలోకి లాక్కొని పోయారు అతని కళ్ల ముందే. 💐💐💐 ఫోన్ మ్రోగడంతో ఉలిక్కిపడి, గబగబా బయటకు వచ్చి,"దివ్యా ! నువ్వు ఎక్కడున్నావు?...అవన్నీ చెబుతాకానీ, నువ్వు కూడా స్టేషన్ కి వచ్చావా? నేను చెట్టు క్రింద నిలబడ్డా.." అంటూ చుట్టూ కలయచూశాడు కూతురు కోసం తండ్రి. తండ్రిని చూసి, తల్లి కనబడకపోవడంతో ఆందోళన పడుతూ, "ఏం జరిగింది? అమ్మ ఏదీ?.." ఏడుపు ఒకటే తరువాయి ఆమెకు. ఇంతలో భుజం మీద పడిన చేతి స్పర్శకి, భయపడి, వెనక్కి తిరిగి చూసింది. ఎదురుగా నిలబడి ఉన్నాడు కార్తీక్. అతన్ని చూసి నివ్వెర పోయింది దివ్య. "నేను రానని అనుకొన్నావు కదా! ఇద్దరం కలిసి వద్దామనే నీకు ఫోన్ చేసా...కానీ నువ్వు… సరే, మీ అమ్మ… ఎక్కడ? రాలేదా?" అంటుంటే, కొద్ది దూరంలో కుంటుకొంటూ, ఆయాస పడుతూ, కందిపోయిన బుగ్గలతో, కళ్లు తుడుచు కొంటూ జానకమ్మ అక్కడకి అతి కష్టంగాచేరుకొంది. నోటవెంట రక్తం రావడంతో నోట మాట పెగలడం లేదామెకు. కనుల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. స్టేషన్లో, కమ్మగా,గమ్ముగా జరిగిన సన్మాన కార్యక్రమం, గుడిలో జరిగిన సంఘటనకు ప్రతిఫలమేనని సులువుగానే గ్రహించారు తల్లీ కూతుళ్లు. నిలబడ లేక కూర్చోలేక నానా అవస్థలు పడుతూ ఇంటికి చేరింది జానకమ్మ. మరునాడు దివ్యతో బాటు కార్తిక్ కూడా స్టేషన్ కెళ్ళాడు. పోలీసు ఇన్స్పెక్టర్ తో కార్తీక్ మాట్లాడే విధానం, ఆ ధైర్యం దివ్యకి ఆశ్చర్యం కలిగించింది. కేసులో ఇరుక్కుంటే ఉద్యోగం పోతుందేమోనని, తల్లిని హెచ్చరించిన విధంగానే ఇప్పుడు తనను కూడా లోపలికి లాక్కెళ్లి…భయాందోళనకు లోనవుతోంది దివ్య. " మీరు ఆ గుడిలో చేసిన పనికి, కేసు పెట్టి. మీ కెరీర్ నాశనం చేయగలం. కానీ, మీ భర్త కార్తిక్ అభ్యర్ధన కాదనలేక పోతున్నా. మరో సంగతి, మీరు గట్టిగా కేకలు పెడుతూ, ఇరుగు పొరుగు వాళ్ళ ప్రశాంతతను పాడుచేస్తున్నారని కూడా మాకు ఫిర్యాదు వచ్చింది. నిజమేనా? మానసిక వైద్యుడుతో సంప్రదించి, మందులు వాడుతూ, ప్రశాంతంగా వుండండి. మానసిక వైద్యం చేయించు కొంటున్నట్లు మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వండి. సరేనా?" అంటూ ఆ పోలీసు ఇన్స్పెక్టర్ బయటకు నడిచాడు. దివ్య గట్టిగా గాలి పీల్చుకొంది. ఇంతలో ఒక మహిళా కానిస్టేబుల్ వచ్చి దివ్యని గదిలోకి పిలిచింది. కార్తిక్ వైపు జాలిగా చూస్తూ, దివ్య బిక్కుబిక్కుమంటూ లోపలికి వెళ్ళింది. ఆ గదిలో కుర్చీలో కూర్చొని వున్న మహిళా అధికారిణి, దివ్య కేసి చూస్తూ, "ఒళ్ళు దగ్గర పెట్టుకుని మంచిగ వుండు. లేకపోతే నార్ల తీస్తామల్ల. మల్లా లొల్లి చేస్తే, కారం మస్తు పూసి,దీన్ని నీ …లోకి తోస్తా. సమజయిందా, ఖబడ్దార్!" అంటూ లాఠీని చూపిస్తూ హెచ్చరించింది. మరో కానిస్టేబుల్, తెల్ల కాగితం మీద సంతకం చేయమంది. కిక్కురుమనలేదు దివ్య. గబ గబా సంతకం చేసి, బయటకు వచ్చి, అల్లంత దూరంలో వున్న కార్తిక్ ని గట్టిగా పెనవేసుకొని, గుండె బరువంతా దించుకొంది. ధారాపాతంగా కురుస్తున్న ఆమె కనీళ్లను తుడిచి," పద, ఇంటికి వెళదాం" అన్నాడు. ఆటోలో కూడా ఆతని చేతిని గట్టిగా పట్టుకొని, అతని గుండెల మీద వాలిపోయింది దివ్య. ప్రేమగా ఆమె తల మీద చేయి వేశాడు కార్తిక్. "డాక్టర్ ని సంప్రదించి మందులు వాడితేనే మంచిదనిపిస్తొంది. అప్పుడు కానీ, నాకు మానసిక ఆరోగ్యం రాదు. ఇప్పుడే వెళదాం. కాదనకు. ప్లీజ్.."అంది దివ్య. సంతోషంగా తలుపాడు కార్తిక్. ఆటో, మలుపు తిరిగి, గాలిలోకి దూసుకు పోతోంది. 💐💐💐 రోగం ఏదైనా, ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ రాకూడదని, సమయం, సందర్భం బట్టి నోటిని అదుపులో పెట్టుకోవడం మంచిదన్న జీవిత పాఠం నేర్చుకున్న జానకమ్మ, తిరుగు ప్రయాణానికి రిజర్వేషన్ చేయించుకొంది. జానకమ్మకి 'రోగం' బాగా కుదిరినందుకు ముసిముసి నవ్వులు నవ్వుకొంటూ, సామాన్లు సర్దుతున్నాడు ఆమె మొగుడు. పోలీసు అధికారులు కొందరు రాజేశ్వరరావుకి ప్రాణ మిత్రులు కావడంతో, కొడుకు కార్తిక్ తో మంతనాలు జరిపి, కొడుకు కాపురాన్ని సరిదిద్దిన విషయం తెలియదు జానకమ్మకి. కొడుకు కాపురం చూడాలని ఎప్పటినుంచో ముచ్చట పడుతున్న భార్యని తీసుకుని, సికింద్రాబాద్ రైలెక్కాడు రాజేశ్వరరావు. 💐💐💐💐 .