నేను మీవెంటే.... - పోరండ్ల సుధాకర్.

Nenu mee vente

రిటైర్మెంట్ కు దగ్గరగా వున్న వివేకానంద వరండాలో కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నాడు, ముప్పై సం. లు కాపురం చేసిన భార్య అరుంధతి గుండెపోటుతో మరణించడం, ఈరోజుకు 15 రోజులు అవుతుంది, కార్యక్రమాలన్ని ముగిసి బంధువులు అందరు ఎవరి ఇళ్లలోకి వారు వెళ్ళిపోయాక, తన ఒక్కగానొక్క కూతురు, తాను ఇంటిలో మిగిలిపోయారు. ఇక రేపోమాపో అల్లుడి నుండి పిలుపు వస్తే కూతురు వెళ్లి పోతుంది, ఇక ఒంటరిగా బ్రతకాలి, అరుంధతి ఎంతపని చేసావు, ఒంటరిగా నన్ను వదిలి వేసి వెళ్లావు, ఏనాడు పల్లెత్తు మాట అనని సహధర్మచారిని ఆరు నెలల నుండి తనని రాచిరంపాన పెట్టడం, చీటికి మాటికి ఏపని చేసిన వంకపెడుతూ అరచి గోల పెట్టడమే కాకుండా వంటపని, ఇంటిపని అంత తనతోనే చేయించడం, ఒకానొక పరిస్థితుల్లో విడాకులు ఇస్తానని బెదిరించడం, తరువాత వారం రోజులనుండి యధావిధిగా ఎంతో ప్రేమతో ఉండడం, హఠాత్తుగా గుండెపోటు తో మరణించడం ఏంటో అర్ధంకాక పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు వివేకానంద. నాన్న నాన్న అని కూతురు అవనిక పిలుపుతో శూన్యంలోంచి ఒక్కసారిగా ఉలిక్కిపడి కూతురు వంక నిర్వికారంగా చూసాడు వివేకానంద. నాన్న మీ అల్లుడు ఫోన్ చేసాడు, వెంట మిమ్మల్ని కూడా తీసుకొని రమ్మన్నారు, మిమ్మల్ని లాంగ్ లీవ్ పెట్టమన్నారు, ఏమంటారు అన్నట్లు చూసింది అవనిక. నేను ఎక్కడికి రాను అన్నట్లు అడ్డంగా తలవూపుతూ, ఇప్పుడు 10 వ తరగతి పిల్లలకి నేను అందుబాటులో ఉండకపోతే పిల్లలు పరీక్షలో తప్పుతారు, అదీకాక మీ అమ్మ జ్ఞాపకాలను వదిలిరాలేనురా, కాని నాన్న నేను ఏ తప్పు చేసానురా, మీ అమ్మ నన్ను చాలా ఇబ్బందికి గురిచేసింది బాధతో గొంతు పూడుకపోగా తన్నుక వస్తున్న ఏడుపును ఆపుకుంటూ అన్నాడు వివేకానంద. అమ్మ ఏనాడు ఎవరిని బాధపెట్టి ఎరుగదు కాని మీపట్ల ఎందుకు అంత అమానుషంగా ప్రవర్తించిందో అర్ధం కావడంలేదు నాన్న అని తండ్రి తలమీద చేయివేసి ఏడుస్తూ అంది అవనిక. ఆ నాన్న అమ్మ ఈమధ్య డైరీ వ్రాయడం అలవాటు చేసుకుంది అని తన మాటల ద్వార విన్నాను, డైరీ వ్రాయడం వల్ల పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం, మనస్సు అంతా ప్రశాంతంగా ఉంటున్నట్లు చెప్పింది, అమ్మ ఇప్పుడు లేదు కదా నాన్న, అందులో ఏం రాసుకుందో ఏమో, అమ్మ డైరీ మీరు చదవండి, అమ్మ ప్రవర్తనకు సమాధానం దొరుకొచ్చు అని ఇప్పడే తెస్తా ఉండండి నాన్న అని బీరువాలో వున్న డైరీ ని తెచ్చి తండ్రి కిచ్చి వంటరూమ్ లోకి అడుగు పెట్టింది అవనిక. కూతురు ఇచ్చిన డైరీని వణుకుతున్న చేతులతో అందుకొని ప్రేమతో నిమురుతూ కండ్లనుండి నీరు ఉబికివస్తుండగా, నెమ్మదిగా డైరీని తెరిచాడు వివేకానంద. అందమైన అక్షరాలవెంట పరుగులు తీయడం ప్రారంభించాడు వివేకానంద. తేది మార్పు ఎందుకో అనవసరపు ఆలోచనలు వస్తున్నాయని ఈ రోజు నుండే డైరీ వ్రాయడం ప్రారంభించాను. తేది మార్పు. డైరీని రోజు వ్రాద్దామని అనుకున్న ఎందుకో వ్రాయబుద్ది కావడం లేదు, అందుకే మధ్య మధ్య వదిలేసి వ్రాస్తున్నాను, 15 రోజుల క్రితం మా వారి సహచర ఉపాధ్యాయుడిగా పని చేసిన నారాయణ మాస్టారు రిటైర్ అయిన వారం రోజులకే చనిపోవడం అత్యంత బాధాకరం, ఆయన భార్య అన్నపూర్ణను ఏనాడు బయట కాలు బయటపెట్టనివ్వలేదు, అంత అపురూపంగా చూసుకున్నాడు, కనీసం బజారుకు వెళ్లి కూరగాయలు కూడా తెచ్చుకోవడం ఎరగదు తాను. తేది మార్పు. శ్రీవారిని స్కూల్ కు పంపించాక నేను అన్నపూర్ణ ఇంటికి వెళ్ళాను అక్కడ..... ఏం వదిన అన్నయ్య చనిపోయి దినాలు అన్ని అయిపోయాయి కదా! ఇంకా మీ బంధువులు ఇంటిలో వున్నారు ఎందుకు? వీళ్ళు ఎవరు అన్నయ్య ఉన్నపుడు వచ్చేవారు కాదు కదా! అంది అరుంధతి. మీ అన్నయ్య తరపు బంధువులు నా తరుపు బంధువులు వున్నారు, నన్ను తమవెంట తీసుకెళ్లడానికి పోటీ పడుతున్నారు, ఎవరి వెంట వెళ్లలో అర్ధం కావడంలేదు వదిన అంది అన్నపూర్ణ. తాను వున్నపుడే డబ్బులకోసం పీడించే వారని వీరినందరని రానివ్వలేదు, వీరు అందరు నిన్ను తమతో ఉంచుకోవడానికి పోటి పడుతున్నారంటే నమ్మడానికి వీలులేదు, ఈ రోజుల్లో కన్న బిడ్డలే డబ్బులకోసం వేధిస్తూ తిండి పెట్టడంలేదు, అని గుసగుసగా చిన్నగా మాట్లాడుతూ ఏమంటావ్ అన్నట్లు చూసింది అరుంధతి. నీవన్నది నిజమే వదిన మా ఆయన అన్న పిల్లలు ఇంకా నా చెల్లెలు పిల్లలు ఈ ఇంటిని అమ్మి తమ తమ ఇండ్లకు రమ్మని అక్కడ మరో ఇల్లు కొనుక్కోమని అందులో అందరం కలిసి వుందామని, తాము జీవితకాలం కంటికి రెప్పలా చూసుకుంటాం రమ్మని పోరు పెడుతున్నారు, అంతే చిన్నగా అంటూ ఏం చేయమంటావ్ అన్నట్లు చూసింది అన్నపూర్ణ. చేతగానప్పుడు వస్తానని, చేతనైనన్ని రోజులు స్వతంత్రంగా ఉంటానని, నిష్కర్షముగా చెప్పండి, ఇప్పుడే వెళ్లి వారి వద్ద ఉంటే నెమ్మదిగా, నీ దగ్గర ఉన్న ఆస్తులు కాజేసి రోడ్డుపై నెడతారు, "ఆస్తులు వారికి వ్రాసి ఇస్తే నీ ఇంటిలో నీవే అనాధవు అవుతావు" అని హెచ్చరించింది అరుంధతి. *** తనని బంధువులు వెంట తీసుకవేళ్లడం గూర్చి అదే రోజు సాయంత్రం చర్చకు వచ్చింది అని, తన నిర్ణయం చెప్పాక వాళ్ళు అనరాని మాటలు అని వెళ్లారని, మానవత్వం కంటే డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారని అంటూ బాధపడింది అన్నపూర్ణ. తేది మార్పు. అన్నపూర్ణ ను కలిసి బయటకి త్రిప్పడం తనకి పెన్షన్ రావడానికి సంబంధించిన పనులు చేసిపెట్టడం బ్యాంక్ పనులు ఎలా చేసుకోవాలో ఇతరత్రా పనులన్నీ తనకు తానుగా చేసుకునే విధముగా తర్ఫీదు ఇస్తూ ధైర్యాన్ని, మానసిక దృఢత్వాన్ని కల్పించాను, నారాయణ మాస్టారు ఉద్యోగంలో చాలా ఆలస్యంగా చేరడంతో అన్నపూర్ణ కు పెన్షన్ తక్కువ వస్తుంది, అందుకోసమని వారి ఇంటిని రివర్స్ మార్టిగేజ్ క్రింద బ్యాంక్ వారికి తనఖా పెట్టాను, (Revarse Mortgage) రివర్స్ మార్టి గేజ్ ఇది వృద్దుల పాలిట వరం, స్థిర ఆస్తులు వుండి అమ్మడం ఇష్టం లేనివారు లేదా ఆస్తులు వుండి నా అనే వారినుండి పోషణ నిమిత్తం డబ్బులు ఇవ్వకుండా నిరాదరణకు గురైన వృద్దులు తమ ఆస్తులను బ్యాంకు నందు తాకట్టుపెట్టి, ఆస్తి యొక్క మూల విలువను బట్టి నెల నెల పెన్షన్ లాగ డబ్బులు 20 సం. పాటు పొందేవిధంగా కేంద్రప్రభుత్వం చట్టం తీసుకవచ్చింది, వృద్దుల తదనంతరం వారి వారసులు వృద్దులు తనఖా డబ్బులు బ్యాంకు నందు జమచేసి నట్లైన ఆఆస్తి వారసులకు చెందుతుంది లేకపోతే అట్టి ఆస్తిని బ్యాంకు వారు స్వాదీనం చేసుకుంటారు) నెల నెల మరిన్ని డబ్బులు తీసుకునేలా చేసాను. అయిన జీవిత భాగస్వామి లేని లోటు పూడ్చలేనిది.....ఎంతచేసినా ఎప్పుడు మూడిగానే ఉంటుంది అన్నపూర్ణ, తనకి చెప్పాను, రోజులు బాగ లేవని ఎవరిని నమ్మి ముందుగా ఆస్తి రాసి ఇవ్వొద్దని, "ఎవరైతే తనని బాగా చూసుకుంటారో వారికి తన తదనంతరం మాత్రమే ఆస్తి చెందేలా వీలునామా రాయాలని", ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వంత బిడ్డలకు కూడ ఆస్తులు ముందస్తుగా ఇచ్చే పరిస్తితులు లేవని, "కన్నబిడ్డలే ఆస్తులు వ్రాయించుకున్నాక ప్రాణం వుండగానే స్మశానం లో వదిలి వేస్తున్నారని" జాగ్రత్తగా ఉండమని, ఈ మాటలు మాక్కూడా వర్తిస్థాయని నిర్మొహమాటంగా అన్నపూర్ణ తో చెప్పాను. తేది మార్పు. అమ్మాయి ప్రసవం గూర్చి నేను 10 రోజులు అమ్మాయి దగ్గరకు వెళ్లి ఈ రోజే వచ్చాను ఇంటికి, మా శ్రీవారిని చూడగానే ఏడ్పు వచ్చినంత పనైంది, హోటల్ తిండి పడినట్లు లేదు, 10 రోజులకే శవంలా తయారు అయ్యాడు, కండ్ల క్రింద చారికలు వచ్చాయి, నిద్రకూడ సరిగ్గా పోయినట్లు లేదు, కనీసం టీ పెట్టుకోడం కూడా రాదు, పదిరోజులు దూరంగా ఉంటే ఎంతో కాలం దూరం అయినట్లు తయారు అయ్యాడు ఏంటో ఈ మనిషి, ఇకముందు తనని వదిలి ఎక్కడికి పోకూడదు. తేది మార్పు.. ఈ పది రోజుల నుండి నాకు చాలా అలసటగా ఉంటుంది, గాలి పీల్చడం ఇబ్బందిగా అనిపించడంతో దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళాను, అక్కడ నేను చిన్నపుడు కలిసి చదువుకున్న నా స్నేహితురాలు వైద్యురాలిగా ఉండడంతో నాకు అన్ని పరీక్షలు చేసింది, నాకు చిన్నపుటి నుండే గుండెకు సంబంధించిన సమస్య ఉంది, అది మందులు వాడితే అఫుడే తగ్గిపోయింది అని అనుకున్నాను కాని అది మళ్ళీ తిరగబెట్టింది, కండిషన్ కాస్త సీరియస్ గానే ఉందని నా స్నేహితురాలు చెప్పగానే నాచుట్టువున్న పరిసరాలను మరిచిపోయి ఒక్కసారిగా కుర్చీలో కూలబడిపోయాను, తాను నా మోహం మీద నీళ్లు చల్లి నీకు ఏం కాదు మందులు రాసిస్తాను క్రమం తప్పకుండా వాడు అని మందులు తెచ్చి నా చేతిలో పెట్టింది, ఈ విషయం ఎవరికి చెప్పవద్దని తనతో ప్రమాణం చేయించుకున్నాను, మా వారికి తెలిస్తే అసలు తట్టుకోలేడు, అసలే తనది చిన్న పిల్లల మనస్తత్వం. తేది మార్పు. గుండె జబ్బు విషయం ఎవరికి తెలియకుండా అత్యంత గోప్యత పాటించాను, మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళాను, నా స్నేహితురాలు వేరే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ టెస్టులు చేయించింది, ఎక్కువ టెన్షన్ పడొద్దని, జాగ్రత్తగా ఉండాలని, మందులు వాడమని చెప్పారు, ఎందుకో ఇక మావారి నుండి దూరం అయ్యే సమయం ఆసన్నమైందని అనిపిస్తుంది, "నేను లేకపోయినా తనని మానసికంగా తట్టుకొని ఉండేలా తయారు చేయాలి", అందుకు, తన పట్ల కఠినంగా ఉండేలా చూడమని ఆ దేవున్ని ప్రార్ధించాను. తేది మార్పు. ప్రియమైన శ్రీవారు ఇన్నాళ్లు మిమ్మల్ని చాల కష్టపెట్టాను కదూ! నాపై పీకలదాక కోపం నేను దూరం అయ్యానని బాధ, నన్నెందుకు నా శ్రీమతి ఇలా బాధపెట్టింది అనే సందేహం మీకు వస్తాయని నాకు తెలుసు, ఈ డైరీ నేను లోకం విడిచి వెళ్ళాక మీరు చదవాలని, చదివేలా చూడమని నా డాక్టర్ ఫ్రెండ్ కు చెప్పాను, అందుకే ప్రత్యేకంగా మీకోసం వ్రాస్తున్నాను. నేను వెళుతున్నాను, మీతో గడిపిన మధురక్షణాలు చాలు, ఇన్నాళ్లు మిమ్మల్ని చాల ఇబ్బంది కి గురిచేసి, ఇంటి పనులు అన్ని చేసుకునేలా శిక్షణను ఇచ్చాను, నా మీద మీకు ఎంత ప్రేమ వుందో నాకు తెలుసు, నేను దూరమైన మరుక్షణం మిమ్మల్ని మీరు పట్టించుకోవడం మాని వేస్తారు, నా మీద మీకు ఉన్న ప్రేమ ఒకకారణం అయితే, మీకు ఇంటిపని ఏది రాకపోవడం మరో కారణం , నాకు ఎందుకో మిమ్మల్ని విడిచివెళ్లే రోజు వచ్చింది అని నామనస్సు పదే పదే చెప్పింది, ఎంతో మంది దంపతులు ప్రతినిత్యం కొట్టుకొని కాపురం చేసినవారు తమభర్తలు చనిపోయిన భార్యలు తట్టుకొని ఎంతోకాలం జీవిస్తారు, ఎందుకంటే ఆడవారిలో మానసిక స్థైర్యం ఎక్కువ, అదే భార్య కనుక భర్త ముందే చనిపోతే సం. తిరగకుండానే చనిపోయిన ఎంతోమంది భర్తలను చూసాను, ఎందుకంటే మగవారు పెళ్లి అయ్యాక పూర్తిగా భార్యలమీద ఆధారపడి జీవిస్తారు, భార్య బ్రతికి ఉండగా తనకి నరకం చూపించిన భర్త సైతం భార్య చనిపోగానే ఒక్కసారిగా డీలపడి రోగాల బారినపడిమరణిస్తారు, అందుకే అందరిలా కాకుండా మీరు మరిన్ని రోజులు పిల్లలకు పాఠాలు చెప్పాలి, వారిని బావిభారత పౌరులుగా తీర్చిదిద్దండి, నేను వెళ్ళాక మన ఇంటిని ట్యూషన్ చెప్పడానికి ఉపయోగించండి, మీ కంటి నుండి ఏరోజు కన్నీళ్లు రాకూడదు, నేను మీకు బౌతికంగా దూరం అయినా మిమ్మల్ని నేను కనిపెట్టుకునే ఉంటాను, నేను మీవెంటే ఉంటాను మీ ప్రతిచర్య గమనిస్తూ ఉంటాను అనే విషయాన్ని మరిచిపోకండి, అదిగో మీ కళ్లనుండి నీళ్లు వస్తున్నాయ్......మరి నాకు ఏడ్పువస్తుంది, మీరు ఏడిస్తే నాకు ఏడ్పువస్తుంది....ఇక సెలవా మీ అరుంధతి. నిర్వీకారంగా శూన్యంలోకి చూస్తూ కళ్లనుండి వస్తున్న ధారాళంగా వస్తున్న నీటిని తన కొంగుతో తుడుస్తూ ఏంటి నాన్న మరి చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నావ్, పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు, మమ్మి ఎప్పుడు మన మద్యే ఉంటుంది తనకి వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ అంది అవనిక, అవునవును తాను మనమద్యే వుంటానంది అని బలవంతంగా నవ్వును పులుముకుంటూ, త్వరగా టిఫిన్ తయారు చేయరా, త్వరగా ఫర్నిచర్ షాప్ కు వెళ్ళాలి, మన ఇంటిని స్కూలుగా మార్చమని చెప్పింది అని కొత్తగా తెచ్చుకున్న ఉత్సాహంతో తువ్వాలు అందుకొని బాత్రూమ్ కు దారి తీసాడు వివేకానంద. అమ్మ తన డైరీ ద్వార డాడీ కి మార్గ నిర్ధేశం చేసినట్లుంది అనుకుంటూ వంటగదిలోకి దారి తీసింది అరుంధతి. * సమాప్తం.*

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు