జమిందారీ బంగళా - చిట్టత్తూరు మునిగోపాల్

Jamindari bangala

ఘల్... ఘల్... ఘల్... ఉండుండి వినిపిస్తోంది గజ్జల శబ్దం. భగ్గుమంటూ మంటలు నాలుకలు చాస్తూ ఎగసాయి. ఆ వెంటనే హృదయవిదారకమైన రోదనలు.

"కాపాడండి... కాపాడండి" ఒకరు కాదు... ఇద్దరుముగ్గురు మహిళలు భయవిహ్వలంగా అరుస్తున్నారు.

పెట్రోలింగ్ డ్యూటీ ముగించుకుని నేను బస చేసిన లాడ్జికి బైక్ మీద వెళ్తున్న నాకు గుండె గుభిల్లుమంది. రోడ్డుకు సుమారు నలభై అడుగుల దూరంలో కనిపిస్తున్న ఆ పురాతన జమీందారీ బంగళా నుంచే ఈ వింతలు వినిపించి, కనిపిస్తున్నాయి. దెయ్యాలున్నాయన్న వారితో సాధారణంగా నేను ఏకీభవించను. అయితే అది అది నలుగురిలో ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను. పైగా టైం రాత్రి పన్నెండు దాటుతోంది. భయం ఎక్కువవుతుండగా బైక్ వేగం పెంచి ముందుకు దూకించి కాస్త దూరంలో ఆపాను. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం నా విధి. గతంలో జమీందారుల అజమాయిషీలో ఉన్న ఈ పట్టణంలో రెండు రోజుల క్రితమే ఎస్సై గా జాయిన్ అయ్యాను. శివార్లలో ఉండే లాడ్జి గదిలో తాత్కాలిక బస. పట్టణ మ్యాప్, చరిత్ర ఇంకా పరిచయం కావాల్సి ఉంది.

ఒకవేళ ఆ పురాతన జమీందారీ బంగళాలో ఎవరైనా జమీందారీ వంశస్థులు నివశిస్తూ ఉంటే... వారికి నిజంగానే ఏదైనా ఆపద సంభవించి ఉంటే. ఈ ఆలోచన రాగానే దెయ్యాల భయం దూరమైంది. ఆపదలో ఉన్న వారిని ఆడుకోవాలన్న ఆత్రుత ఎక్కువైంది. ఉన్నపళంగా బైక్ ను వెనక్కు మళ్లించి అప్పటికే సగం తెరచి ఉన్న తుప్పు పట్టిన ఇనుప గేటు దాటుకుని బంగాళా వరండాలోకి వెళ్లి ఆపి దిగాను. విచిత్రం, నన్ను భయపెట్టిన మహిళల రోదనలు, అరుపులు ఇప్పుడు వినిపించడంలేదు. భగబగా మండుతున్న మంటల వెలుగులు మాత్రం ఆవరణ అంతటా పరచుకుని కనిపిస్తున్నాయి. బంగళా భారీ తలుపులకు లోపలినుంచి గడియ పెట్టి ఉంది.

నా ఊహ నిజమే. ఈ బంగళాలో ఎవరో నివసిస్తున్నారు. ఎవరూ లేకపోతే లోపలినుంచి ఎవరు గడియ పెడతారు? నిజం... లోపలున్న మహిళలను ఎవరో మంటలకు ఆహుతి చేస్తున్నారు. అలా కాలిపోతూ వారు పెట్టిన అరుపులే నాకు వినిపించింది. బహుశా ఇప్పటికే ఆ మహిళలు ప్రాణాలు విడవడంవల్లనే తనకిప్పుడు వారి అరుపులు వినిపించడంలేదు. ఇలా ఆలోచించగానే ఎక్కడలేని ఆవేశం ముంచుకొచ్చింది. రెండు చేతులతో తలుపులు దబదబా బాదాను.

"ఎవరిదీ? వినీలా నువ్వు వెళ్లి చూడమ్మా, ఎవరో అతిథులు వచ్చినట్లు ఉన్నారు." లోపలినుంచి గంభీరమైన గొంతు ఆజ్ఞాపించింది.

"అలాగే పితాజీ..." తీయనైన కంఠస్వరంతోపాటు ఘల్లుఘల్లుమన్న గజ్జల శబ్దం దగ్గరైంది. అవును, అది ఇంతకుముందు వినిపించిన శబ్దమే. ఆలోచనలో పడిన నేను కిర్రుమన్న చప్పుడుతో తలుపులు తెరచుకోవడం గమనించలేదు. ఇంకా తలుపుల మీదే ఉండిపోయిన నా అరచేతులకు, అవి తెరచుకోగానే మెత్తటి బూరుగదూదిలోకి కూరుకు పోయిన అనుభూతి కలిగింది. ఉలిక్కిపడి చూసిన నన్ను , మేలిమి పరదా వెనుకనుంచి చూపులు చురుగ్గా తాకాయి.

కాటుక కలువ కళ్ళు... నుదుటిపై పడుతున్న రింగుల కేశపాశాల వెనుక ఎర్రటి నిలువు బొట్టు... రత్నాలు పొదిగిన ముక్కర మెరుస్తున్న సన్నగా కోటేరేసిన నాసిక... లేలేత కొబ్బరి ముక్కలను తలపిస్తున్న బుగ్గలు... అదురుతున్న ఎర్రటి పెదవులు... మత్తు మస్తిష్కాన్ని ఆవహిస్తుండగా నా చూపులు కిందికి తత్తరపడి పోయాయి. ఎక్కిన మత్తు దిగి, ఎత్తైన పాలిండ్లపై అంతదాకా వాలివున్న అరచేతులు బెదిరి పక్కకు తప్పుకున్నాయి. ఆ కంగారులో నా చేతుల కింద మరింత వత్తిడికి గురైన ఆమె హిమోన్నతాలు కిందికి నొక్కుకుపోయి రెట్టించిన వేగంతో ముందుకు వచ్చి బౌన్స్ అయ్యాయి.

"ఎవరమ్మా వచ్చినవారు?" లోనుంచి అదే గంభీర స్వరం.
సిగ్గుతో కుంచించుకుపోయి మాటలు రానట్లుగా నిలబడిపోయిన ఆ అజంతా శిల్పం,

"ఎస్సైగారనుకుంటాను నాన్నా..." అని బదులిస్తూనే, "అవును కదండీ..." అంటూ యూనిఫాంలో ఉన్న నావైపు సందిగ్ధంగా చూపులు సారించింది. "యస్" అని తలూపగానే పక్కకు జరిగి లోనికి దారి ఇచ్చింది.

విశాలమైన హాలు మధ్యలో పెద్ద సింహాసనం వంటి కుర్చీమీద ఒక వ్యక్తి కాలుమీద కాలు వేసుకుని ఆశీనుడై ఉన్నారు. ఆయన తొడిగిన దుస్తులు, మేజోళ్ళు, రెండు చేతివేళ్ళకు ఉన్న వజ్రాలు పొదిగిన ఉంగరాలు... జమీందారీతనం సూచిస్తున్నాయి.

"రండిరండి ఎస్సైగారూ, ఆశీనులు కండి" అంటూ ఎదురుగా ఉన్న ఆసనాన్ని చూపించారు.

నేను కూర్చోలేదు. నిలబడే హాలంతా కలియజూశాను. ఆ తర్వాత గబగబా హాలోనుంచే ఉన్న మెట్లను ఎక్కి పై భాగానికి చేరుకుని అక్కడ తెరచే ఉంచిన గదులను పరిశీలించాను. కాలిన శరీరాలు కానీ, మంటలు రేగినట్లుగా బూడిద ఆనవాళ్లు కానీ నాకు ఎక్కడా కనిపించలేదు.

“ఏమైంది ఎస్సైగారూ, ఏమిటి వెదకుతున్నారు? మావల్ల మీకు కాగల సాయమేదైనా ఉంటే చెప్పండి, చేసి పెడతాము." అతి దగ్గరగా వినిపించిన మాటలకు ఆడిరిపడి పక్కకు చూశాను.

అక్కడ నిలబడి ఉన్నారు జమీందారు. అతని వంటిమీద ఇంతకుముందు చూసిన ఖరీదైన దుస్తులే ఉన్నాయికానీ, చాలాచోట్ల మాసికలు పడి చేతి కుట్లు వేసి ఉన్నాయి. గాంభీర్యం ఎటు పోయిందో... దీనత్వం తాండవిస్తోంది ఆయన ముఖంలో.

ఇదేమిటి, ఇంతలోనే ఈయనలో ఇంత మార్పేమిటి? అంటే ఇక్కడ దెయ్యాలున్నాయా? ఈ జమీందారు దెయ్యమా? మరి ఇంతకుముందు తలుపు తీసి లోనికి ఆహ్వానించిన సౌందర్యారాశి కూడా దెయ్యమేనా? వెన్నులో సన్నగా వణుకు మొదలైంది. భయపడ్డామని తెలిస్తే, దెయ్యాలు మరింత భయపెట్టడానికి ప్రయత్నిస్తాయట.

లేని ధైర్యం తెచ్చుకుని అడిగాను, "ఈ బంగాళానుంచి ఏవో మంటలు కనిపించి, మహిళల ఆర్తనాదాలు వినిపించాయి. నాకంతా తెలుసు. మీరు మంటలకు ఆహుతి చేసింది ఎవయిని? ఎందుకు? నిజం చెప్పి సరెండర్ అయితే తక్కువ శిక్ష పడుతుంది, చెప్పండి." అడిగాను అధికారం ఉట్టిపడే స్వరంతో.

నవ్వారు జమీందారు విషాదంగా.

"అమ్మా వినీలా, సారుకు ద్రాక్షపండ్ల రసం పట్టుకురా." కేకేశారు కిందికి వినబడేలా. "పితాజీ..." పిలుపు వినిపించడంతో కిందికి తొంగి చూశారు. నేనూ అటు చూశాను అప్రయత్నంగా.

ఇంతకు ముందటి చీనిచీనాంబరాలే ధరించింది ఆమె. అయితే చినిగి మాసికలు పడిన ఆ దుస్తులలోంచి శరీర భాగాలు అక్కడక్కడా బయటకు కనిపిస్తున్నాయి. ఆమెకన్నా రెండుమూడేళ్ళు తక్కువ వయసు కలిగిన యౌవనవతిలు మరో ఇద్దరు కుడిఎడమల నిలబడి ఉన్నారు. వారి పరిస్థితి కూడా అలాగే ఉంది.

"ఎన్నిమార్లు చెప్పాలి మీకు, అతిథులు వచ్చినపుడు కాస్త మంచి దుస్తులు వేసుకోమని. మన వంశ గౌరవ మర్యాదలను మంటగలుపుతున్నారు. లోనికి వెళ్ళండి." ఆగ్రహంతో మండిపడ్డారు జమీందారు. చప్పున పక్కనున్న గదుల్లోకి పరుగు తీశారు ముగ్గురు అమ్మాయిలూ.

రెండు చేతులతో ముఖం దాచుకుని అక్కడున్న ఒక కాలు విరిగిన కుంటి కుర్చీమీద కూలబడ్డారు జమీందారు.

"అయిపోయింది, అంతా అయిపోయింది. ఒకప్పుడు ఎంతబాగా బతికిన వంశం నాది. జమీన్లు పోయాయి. ఆస్తులు పోయాయి. బంధువులు, స్నేహితులు మోసం చేశారు. ఎందుకూ పనికిరాని పరువు ప్రతిష్ఠలు మిగిలాయి. చివరకు వయసుకు వచ్చిన కూతుళ్లకు పెళ్లిళ్లు కూడా చేయలేని దౌర్భాగ్యపు బతుకు నాది." వెక్కిళ్ళుపెట్టి రోదిస్తున్నాడాయన. కిందనుంచి అమ్మాయిల ఏడుపులు కూడా వినిపిస్తున్నాయి. నాకు చాలా బాధేసింది. వీళ్ళు నిజమైన మనుషులే. దెయ్యాలుగా పొరబడ్డాను.

"సార్, లేవండి. మిమ్మల్ని మోసం చెసిన వారు ఎవరో చెప్పండి. కేసు ఫైల్ చేసి, కోర్టులో సూట్ వేద్దాము. మీ ఆస్తులు మీకు తిరిగి వచ్చేదాకా చట్టపరంగా నేను మీ కుటుంబానికి అండగా ఉంటాను. కాకపోతే మీరు ఫాల్స్ ప్రిస్స్టేజ్ ను వదులుకోవాలి. లేవండి ముందు.” ఆయన రెండు భుజాలమీదా చేతులు వేసి ఓదార్చడానికి ప్రయత్నించాను. నా చేతులు విసిరికొట్టారు జమీందారు. ఏదో స్థిర నిశ్చయానికి వచ్చినట్లు దిగ్గున పైకి లేచి కిందికి పరుగు తీశారు.

ఆ పరిణామం ఊహించని నేను ఆయన చేతులు తీసిన విసురుకు నేలమీద వెల్లకిలా పడ్డాను. నడుము కలుక్కుమంటుంటే పైకీ లేవలేక, పక్కనే ఉన్న కొయ్య స్తంభానికి చేరగలబడ్డాను.

"జమీందారుగారూ, ఎక్కడికి వెళ్తున్నారు, ఆగండి.” అని అరవసాగాను.

అంతలో కింద హాల్లోనుంచి భగ్గున మంటలు పైకి లేచాయి. "కాపాడండి... కాపాడండి..." అంటూ ఆ మంటల మధ్య కాలిపోతున్న ముగ్గురు అమ్మాయిల హాహాకారాలు ఆ పాడుబడ్డ పురాతన జమీందారీ భవనంలో ప్రతిధ్వనించాయి. నొప్పిని ఓర్చుకుంటూ అప్పటికే పైకి లేచి నిలబడ్డ నాకు - అదే మంటల్లో కాలిపోతున్న జమీందారు కళ్ళల్లో... పరువు ప్రతిష్ఠలు వికటాట్టహాసం చేస్తూ కనిపించాయి.

భయంతో పరుగులు తీస్తూ బయటపడ్డ నాకు తర్వాత తెలిసింది- అయినవారందరూ మోసం చేస్తే తట్టుకోలేని జమీందారీ వారసులొకరు, తన ముగ్గురు కూతుళ్ళతో కలిసి ఆ పాడుబడ్డ బంగాళాలో మంటల్లో కాలి ఆత్మాహుతి చేసుకుని మృతి చెందారని... అలా తమ జమీందారీ వంశం "పరువుప్రతిష్ఠలు" కాపాడారని.

అర్ధరాత్రి పన్నెండు గంటలు అయిందంటే చాలు... ఇప్పటికీ ఆ జమీందారు బంగళాలో నుంచి ఉవ్వెత్తున ఎగసిపడే మంటలు కనిపిస్తుంటాయి. యౌవనవతుల హాహాకారాలు వినిపిస్తుంటాయి.
(చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ముప్పాయేళ్ల క్రితం జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా అల్లిన కథ)

-------------------------------------------------

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న