బంద్‌ మార్చిన భవిష్యత్‌ - - బోగా పురుషోత్తం

Bandh marchina bhavishyat
తిరుపతి నగరం ఎప్పుడూ జనంతో, రణగొణ ధ్వనులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఎందుకో ఆ రోజు నిర్మానుష్యంగా ఉంది. నగరంలో ఎటు చూసినా షాపులు, టిఫిన్‌ కొట్లు, టీ కొట్లు, మందుల దుకాణాలు పూర్తిగా మూసిఉన్నాయి. ఇక అత్యవసరసేవలు అవసరమైతే ఏమి చేయాలో దిక్కుతోచటం లేదు. ఎటు చూసినా కనుచూపుమేర జన సంచారం లేదు. కరుణాకర్‌లో ఆదుర్దా క్షణ క్షణానికి పెరిగిపోతోంది. ఓ పక్క డ్రైవరు ఆ కారును వాయు వేగంతో నడుపుతున్నాడు. తమిళనాడు సరిహద్దులోని ఊతుకోట సమీపంలో ఓ పల్లె నుంచి సూరీడు ఉదయించకముందే బయలుదేరారు వాళ్లు. పల్లెటూరు.. సింగిల్‌ రోడ్డుపై , రైతుల పొలాలు, రోడ్లపై ఇటు , అటు పరిగెడుతున్న ఆవులు, గేదెలను తప్పించుకుంటూ.. గతుకుల రోడ్డుపై వచ్చే సరికి పది గంటలయింది. తిరుపతి నగర పొలిమేరల్లోకి ప్రవేశించారు. ఇక పది నిముషాల్లో యూనివర్సిటీ వద్దకు చేరుకుంటామన్న వారి ఆనందం ఆవిరైంది.
ఎదురుగా పెద్ద గుంపు చేతుల్లో కట్టెలు, రాడ్లు పట్టుకుని దౌర్జన్యంతో ప్రతి షాపు గేట్లు మూసివేస్తున్నారు. వారిని చూడగానే డ్రైవరు కాస్త నెమ్మదిగా కారు నడిపాడు. అయినా వాళ్లు కారు అద్దాలను పగులగొట్టారు. విరిగిపడిన ముక్కలు కారులో కూర్చున్న కరుణాకర్‌ అబ్బాయి కళ్లలో పడేంత పని అయ్యింది.
వాళ్లు ఖర్చీపులు అడ్డుపెట్టుకుని ముప్పు నుంచి తప్పించుకుని ఊపిరి పీల్చుకున్నారు. అంతలోపే ఆ గుంపు కారును చుట్టుముట్టేసింది. డోర్లు తెరుచుకున్నాయి. ‘‘ఈ రోజు బంద్‌ వుంది .. మా ప్రియతమ నాయకుడు చనిపోయాడని తెలీదా? మీకు ..అంత పెద్దనాయకుడు చనిపోతే కాస్త సానుభూతి తెలపాలన్న జ్ఞానం కూడా లేదా.. మీకు’’ అంటూ ఒక్కొక్కరిని కారునుంచి విసురుగా తోసేసి వెళ్లిపోయారు.
‘‘ అయ్యా..అయ్యా..మా వాడు పీజీ ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు రాయాల్సి వుంది.. మా వాడు పరీక్షలు రాసేస్తే వాడికి బెంగుళూరులో ఏదైనా ఉద్యోగం దొరుకుతుంది.. ఇంకో పది నిముషాల్లో యూనివర్సిటీ వద్దకు చేరుకోకుంటే పరీక్ష హాలులోకి అనుమతించరు. ఈ ఏడాది చదివిన చదువంతా వృథా అవుతుంది..దయచేసి మా వాడిని వదిలేయండి..’’ దీనంగా చేతులెత్తి ప్రాధేయపడ్డాడు ఆ కారులో కూర్చున్న కరుణాకర్‌.
‘‘ మా నాయకుడి ప్రాణాలకంటే మీ వాడి భవిష్యత్‌ గొప్పా?’’ వెటకారం చేశాడు. ‘‘ ఒక్క అడుగు ముందుకు కదిలితే మీ అంతు చూస్తా ..!’’ బెదిరించి వెళ్లిపోయారు గుంపుల్లోని వాళ్లు.
కరుణాకర్‌కు ఏమి చేయాలో దిక్కుతోచలేదు. సీట్లో కూర్చున్న కొడుకుని చూశాడు. కదలకుండా కూర్చున్నాడు. పది నిమిషాలు దాటిపోయింది. ఆ గుంపు కాస్త దూరంగా వెళ్లిపోయాక కారును వెనక్కి తిప్పి పక్క రోడ్డులో వేగంగా వెళ్లాడు. యూనివర్సిటీ పరీక్ష హాలు గేటు వద్ద ఆపాడు. గేట్లు మూసి వేసి వున్నాయి. లోపల కూర్చున్న సెక్యూరిటీకి హాల్‌ టిక్కెట్‌ చూపించాడు కరుణాకర్‌ కుమారుడు కుమారస్వామి. ‘‘ టైం మించిపోయిందయ్యా.. లోనికి అనుమతించం’’ తల అడ్డం తిప్పాడు.
కొడుకు కోసం తాను పడ్డ సంవత్సరం శ్రమంతా వృథా అయ్యిందని తలపట్టుకున్నాడు కరుణాకర్‌. ఇక చేసేదేమీ లేక ఇంటి ముఖం పట్టాడు.
ఆ సంవత్సరం గడిచింది. మరుసటి సంవత్సరం ప్రారంభం నుండే కుమారస్వామి తిరుపతిలో అద్దె గదిలో వుంటూ పట్టుదలతో లాయర్‌ కోర్సు పీజీ ఫైనల్‌ సెమిస్టరు పరీక్షలు రాసి యూనివర్సిటీ పరిధిలో గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. ప్రాక్టీసు అనంతరం నాలుగేళ్ల తర్వాత తిరుపతిలో ఓ గది తీసుకుని కుమారస్వామి, లాయర్‌ అని బోర్డు తగిలించాడు.
ఓ రోజు కుమారస్వామి ఓ క్రిటికల్‌ కేసు వాదించేందుకు కోర్టుకు బయలుదేరుతున్న సమయంలో ఓ నల్గురు వ్యక్తులు ఆయాసంతో పరిగెడుతూ కుమారస్వామి కాళ్ల మీద పడేంత పనిచేశారు.
‘‘ ఎవరయ్యా.. మీరు.. మీ సమస్య ఏమిటీ..?’’ ప్రశ్నించాడు.
గతంలో ఓ బంద్‌లో పాల్గొని మిమ్మల్ని పరీక్ష రాయనీయకుండా ఆపి బాగా ఇబ్బంది పెట్టించాము సార్‌.. అందుకు మాకు తగిన శాస్తే జరిగింది.. బంద్‌లో దుకాణాల అద్దాలు పగిలి తీవ్ర నష్టం వాటిల్లిందని యజమానులు పది లక్షలు పరిహారం చెల్లించాలని కోర్టులో కేసు వేశారు సార్‌..మేము చాలా పేద వాళ్లం తినడానికే తిండి లేని వాళ్లం..మా అబ్బాయిలు బాగా చదువుకుని ప్రయోజకులవుతారని అనుకుంటే ఆ నాయకుడి వెంట తిరిగి జీవితం వృథా చేసుకున్నారు.. ఇప్పుడు బంద్‌ల పేరుతో ఇతరులకు నష్టం కల్గిస్తూ మాకు అప్రతిష్ట తెచ్చి పెట్టారు సార్‌..’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు బంద్‌లో పాల్గొన్న అబ్బాయిల తల్లిదండ్రులు.
అది విన్న కుమారస్వామి ఆ అబ్బాయిలను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కోర్టులో వారిపై వున్న కేసులన్నింటిని ‘‘ ఏదో తెలిసి తెలియని వయసులో దుకాణాలకు అలా నష్టం కలిగించారు..వారి తల్లిదండ్రులు చదువుకోమని కళాశాలకు పంపితే ఇలా నాయకుల వెంట తిరుగుతూ భవిష్యత్‌ను పాడు చేసుకుంటున్నారు సార్‌.. వీరిని దయ ఉంచి వదిలిపెడితే బాగా చదివించి సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడుతారు సార్‌..!’’ అని కోర్టులో లాయర్‌ కుమారస్వామి వారి తరపున జడ్జిని వేడుకున్నాడు.
జడ్జి మంచి మనసుతో వారిపై కేసులు కొట్టి వేయించి చదువుకుని ప్రయోజకులయ్యేoదుకు అవకాశం కల్పించాడు.
లాయర్ కుమారస్వామి బాగా చదువుకుని వాదించడం వల్లే ఇప్పుడు తమఫై వచ్చిన అభియోగం తొలగిపోయిందని గ్రహించారు అబ్బాయిలు. తాము చదువుకుంటే సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందవచ్చని తెలుసుకున్నారు. వారిలో ఒకరు అర్థాంతరంగా వదిలేసిన ఇంటర్‌ను పూర్తి చేసి డిగ్రీ చదివి లా కోర్సు పూర్తి చేసి న్యాయం, చట్టం, ధర్మ పరిరక్షణకు నడుం కట్టాడు. మరొకడు డాక్టర్ కోర్సు చదివి ప్రజలకు సేవ చేశాడు. మరొకడు యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యాడు.
ఓ రోజు వర కట్నం కేసును బాధితురాలి తరపున చాకచక్యంగా వాదిస్తుంటే గతంలో వారి కేసును కొట్టేస్తూ తీర్పు నిచ్చిన జడ్జి ఆసక్తిగా విన్నాడు. ఇన్నేళ్ల తర్వాత న్యాయ పరిరక్షణకు, సమాజ శ్రేయస్సుకు నడుం కట్టిన ఆ అబ్బాయిలను ‘‘ భేష్‌..భేష్‌..!!’’ అనిఅభినందించాడు జడ్జి.
కొద్ది సంవత్సరాల తరువాత జడ్జి తన తల్లికి గుండెపోటు రావడంతో హస్పెటల్ కి వెళ్ళాడు. అక్కడ తాను కేసు కొట్టివేసిన విద్యార్థి కనిపించాడు. ఆశ్చర్యం వేసింది. అతని దగ్గరికి వెళ్లి " నువ్వు .. ?" అన్నాడు.
" అవును సార్ ..నేనే బందులో పాల్గొని అందరికి ఇబ్బంది కలిగించిన వ్యక్తిని.. కుమారస్వామి సారు, మీ దయతో బయటపడి బాగా చదువుకుని ఈ స్థితికి వచ్చాను.. మీ తల్లికి ఏమీ కాదు.. ఆపరేషన్ చేస్తే.. చాలు.." అంటుంటే ఆశ్చర్యపోయాడు. వారంరోజుల తరువాత గుండె ఆపరేషన్ చేశారు. విజయవంతమై తల్లి ఇల్లు చేరడంతో ఆనందంలో మునిగి తేలాడు జడ్జి .
కొద్ది రోజుల తరువాత యూనివర్సిటీలో చదువుకొంటున్న తన చిన్న కుమారుడిని చూ సేందుకు వెళ్లాడు జడ్జి. అక్కడ తన కొడుకు కూర్చున్న క్లాసురూంలో అనర్గళంగా పాఠాలు బోధిస్తున్నాడు ప్రొఫె సర్ . ఒకప్పుడు చదువుకోకుండా బందుల పేరుతో ప్రజలకు సమస్యలు తెచ్చి పెట్టిన ఆ అబ్బాయి బాగా చదివి తన కుమారుడికే విద్య ప్రయోజనాల గురించి వివరిస్తుంటే ఆశ్చర్యంతో చూశాడు జడ్జి. ప్రయోజకులై సమాజ శ్రేయస్సుకు పాటు పడుతూ మంచి పేరు తెచ్చుకున్నందుకు ముగ్గురు అబ్బాయిలను వారి తల్లిదండ్రులు, కుమారస్వామి అభినందనలతో ముంచెత్తారు. ప్రయోజకులై సమాజ సేవ చేస్తున్న ముగ్గురిని స్వాతంత్ర దినోత్సవం రోజున ఘనంగా సన్మానించాడు జడ్జి.

మరిన్ని కథలు

Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు