సి.సి.కెమెరా (క్రైమ్ కథ) - చెన్నూరి సుదర్శన్

C C Camera

“గుడ్ మార్నింగ్ విజయశేఖర్.. కమిన్” అంటూ ఆహ్వానించాడు మడికొండ పోలీసు స్టేషన్ ఎస్సై మన్మధరావు. “ఇంకా రాలేదేమిటా! దినపత్రికలో వార్త చదువలేదా! ఏమి! అని ఇప్పుడే మనసులో అనుకుంటున్నాను.. ప్రత్యక్షమయ్యావు. చాలా సంతోషం” అంటూ కుర్చీలో నుండి లేవకుండానే షేక్ హ్యాండ్ చేస్తూ,. మరో చేత్తో కూర్చోమన్నట్టు కుర్చీ చూపించాడు.

విజయశేఖర్ ఒక రిజిస్టర్డ్ ప్రైవేటు పరిశోధక సంస్థలో పనిచేస్తున్నాడు. దినపత్రికలలో క్రైమ్ వార్తలు వచ్చినప్పుడల్లా తత్సంభిత పోలీసు స్టేషన్ లకు వెళ్లి ఆరాతీయడం అతని పని. కేసు పరిశోధనలలో ఎస్సైలకు సాయపడుతూ ఉంటాడు కూడా. కాని మన్మధరావుకు ఇలాంటి సాయాలు అంటే ఇష్టముండదు. తాను పరిశోధిస్తున్న కేసులో మరొకరు తలదూర్చడమంటే ‘నాటకంలో మన పాత్ర లేక పోయినా ముఖానికి రంగు పులుముకున్నట్ట’ ని సహించడు. విజయశేఖర్ పాత్ర అలాంటిదేనని అతని నమ్మకం. కాని అతని పైఅధికారులు ఆ సంస్థకు సహకరించాలని ఆదేశాలుండడం.. లోలోన కుత, కుతలాడుతూంటాడు.

పెదవులపై చిరునవ్వులు అద్దుకుని.. “మొన్న పత్రికలో వచ్చిన వార్త గురించి తెలుసుకుందామని వచ్చావా?” అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నలో కాస్త వ్యంగ్యం దోబూచులాడుతోంది. అది విజయశేఖర్ పసిగట్టక పోలేదు. కాని తాను రియాక్ట్ అయితే వచ్చిన పని వ్యర్థమవుతుందని మనసులో అనుకుంటూ పైకి మాత్రం ..

“అవును సర్. నేను సెలవుల్లో ఉన్నాను. ఈరోజు తిరిగి జాయినయ్యాను. మా బాస్ ఈ కేసు అప్పగించాడు” అంటూ కుర్చీలో కూర్చొన్నాడు విజయశేఖర్. “వార్త చదివాను. నాకెందుకో అనుమానంగా ఉంది” అన్నాడు వినయంగా..

“అవునులే.. అనుమానించడమే కదా! మన పని. అయినా ఇందులో అనుమానించ దగ్గ విషయమేమీ లేదు విజయశేఖర్. అంతా అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా ఉంది”

“కేసు బుక్ చేశారా సర్”

“ఎవరి మీద అని బుక్ చేస్తాం చెప్పు. ఇందులో అనుమానితులెవరూ లేరు. పైగా ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదు. అయినా మనకు తప్పడుగాడా! అని ఒక ఫైల్ మాత్రం ప్రిపేర్ చేసి ఇప్పుడే అటకెక్కించాను” అంటూ మోముపై ముసి, ముసి నవ్వులు పూయించాడు మన్మధరావు.

“సర్.. మీకు అభ్యంతరం లేకుంటే ఫైల్ ను ఓమారు చూపిస్తారా!” అంటూ వేడుకోలుగా అడిగాడు విజయశేఖర్.

“దానికేం భాగ్యం శేవిజయఖర్ చూడు” అంటూ స్టేషన్ రైటర్ సోమయ్యను పిలిచి సూచనలిచ్చాడు.

మన్మధరావుకు ధన్యవాదాలు చెప్పి సోమయ్య వెంట వెళ్ళాడు విజయశేఖర్. ఫైల్ క్షుణ్ణంగా చదివాడు. మన్మధరావు పత్రికా విలేకరులకు ఇచ్చిన వివరాలూ ఉన్నాయి. దానినే పత్రికలో ప్రచురించారు.

‘రఘునాథం, రమణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి స్వస్థలం ములుగు జిల్లాలోని జంగాలపల్లి. బ్రతుకుదెరువు కోసం రెండు నెలల క్రితం కాజీపేట వచ్చారు. రైల్వే శాఖలో మడికొండ రైల్ గేట్ వద్ద రఘునాథం వాచ్ మన్ గా తాత్కాలికంగా నియమితుడయ్యాడు.. అతనికి ఎక్కువగా రాత్రుళ్లు పనిచేయాల్సి వచ్చేది. ఆ నేపథ్యంలో భార్య మీద అనుమానం మొలకెత్తింది. తరచుగా గొడవ పడే వారు. ఆవేళ ఇద్దరూ తగువులాడుకున్నారు. రఘునాథం కోపాన్ని నియంత్రించుకోలేక రమణి తలను నిండు నీళ్ళ బకెట్లో ముంచి అంతమొందించాడు. ఈ విషయాన్ని ఒక ఉత్తరంలో రాసి జేబులో పెట్టుకున్నాడు. మడికొండ గేటు వద్ద గల బ్రిడ్జిపై నుండి ట్రైన్ కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు’

పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఉన్నాయి. అవసరమైన పత్రాలను ఫోటో తీసుకుని తన కార్యాలయానికి వెనుతిరిగాడు విజయశేఖర్.

ఆమరునాడు రఘునాథం ఆత్మహత్య చేసుకున్న ప్రాంతానికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించాడు విజయశేఖర్. తాను దేనికోసమైతే వచ్చాడో.. అది కనబడింది.. సి.సి. కెమెరా. వెంటనే కాజీపేట రైల్వేస్టేషన్ కు బయలుదేరాడు. ఆ ప్రాంతపు సి.సి. కెమరాలను అనుసంధానం చేసిన కార్యాలయానికి వెళ్లి తన ఐ.డి. కార్డు చూపించాడు. అక్కడి ఆఫీసర్ ఇంచార్జ్ సాదరంగా లోనికి ఆహ్వానించి విషయం అడిగి తెలుసుకున్నాడు. రఘునాథం బ్రిడ్జీ పై నుండి రైల్వే ట్రాక్ మీద దూకే దృశ్యం ఒకటికి పది మార్లు చూసి నిర్థారణ చేసుకున్నాడు విజయశేఖర్. కొంత సమాచారం లభించినట్టు తృప్తిగా సెలవు తీసుకొని బయట పడ్డాడు. నేరుగా పోలీసు స్టేషన్ వెళ్లి మన్మధరావును కలిసి తన అనుమానాన్ని చెబుతూ.. రుజువుగా సి.సి.కెమెరా నుండి తాను పదిల పర్చిన వీడియోను చూపించాడు. బుర్ర గోక్కున్నాడు మన్మధరావు.. అయితే ఇప్పుడు ఏంచేద్దామన్నట్టు.

“సార్ సోమయ్యను మఫ్టీలో నాతో పంపండి. మీ ఆధీనంలో ఉన్న హతుని ఇంటికి వెళ్లి మరికొంత సమాచారం రాబట్టుతాను” అంటూ తన పరిశోధనా ప్రణాళిక విశదీకరించాడు. “సర్..ఈ కేసు పరిశోధించి ఆధారాలతో సహా ఫైలు మీకే అప్పగిస్తాను. ఈ కేసుతో మీకు మంచి పేరు వస్తుంది”

విజయశేఖర్ అలా లోతుగా, నిష్కల్మషంగా.. కేసు గురించి వివరించడం మన్మధరావుకు నచ్చింది. సరే అన్నాడు. కాని లోలోన.. సి.సి. కెమెరా విషయం తన బుర్రకు తట్టనందుకు తనకు తానే నిందించుకున్నాడు.

విజయశేఖర్, సోమయ్యలు రఘునాథం ఇంటికి వెళ్ళారు. ఇంట్లో రఘునాథం డైరీ దొరికింది. అందులోని చేతి వ్రాతను చూడగానే విజయశేఖర్ భ్రుకుటి ముడిపడింది. ఇది తాను చెబితే నమ్మరు. నిర్థారణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలని సోమయ్యకు విషయం వివరించాడు.

ఇంటి ప్రక్క వాళ్ళను రఘునాథం దంపతుల గురించి వాకబు చేశాడు. రఘునాథం ఇంట్లో లలిత అనే ఆవిడ పని చేసేదని తెలిసి ఒకింత ఆశ్చర్య పోయాడు విజయశేఖర్. రఘునాథంకు వచ్చే జీతభత్యాలు అంతంత మాత్రమే. పని మనిషిని పెట్టుకోవడం.. భార్యకు భారం కావద్దనేమో! అంత ప్రేమ ఉన్న రఘునాథంకు భార్య మీద అనుమానమా!. లలిత ఇంటికి వెళ్తే రఘునాథం, రమణిల సఖ్యత గురించి రాబట్టవచ్చు. అని మనసులోకి వచ్చిందే తడవుగా సోమయ్యను తీసుకుని లలిత ఇంటికి బయలుదేరాడు.

సోమయ్యను చూసి గుర్తు పట్టింది లలిత. పోలీసాయన మరెవ్వరినో తీసుకుని రావడం.. అనుమానమేసి వాళ్ళాయనను పిలిచింది.

“మీ ఆయనకోసం రాలేదు. నీతోనే మాట్లాడాలి” అన్నాడు విజయశేఖర్.

ఏమిటా అన్నట్టు నివ్వెరపోయి నోరు తెరచి చూడసాగింది లలిత. ఆ చూపులో” నీవెవరు? అని గోచరిస్తోంది.

“నువ్వు రఘునాథం ఇంట్లో పని చేసే దానివని ఇంటి ప్రక్క వాళ్ళు చెప్పారు. రఘునాథం అతని భార్య ఎప్పుడూ గొడవ పడే వారా? నీ కేమైనా తెలుసా? కనుక్కుందామని వచ్చాం”

ఇంతలో “ఎవరూ వచ్చింది?” అంటూ గుమ్మం తెరుచుకుని వాకిట్లోకి వచ్చాడు లలిత భర్త భద్రయ్య.

ఇద్దరినీ ఎగాదిగా చూస్తూ “ఎవరు కావాలి?” అంటూ ప్రశ్నించాడు గంభీరంగా.

భద్రయ్యను చూడగానే విజయశేఖర్ మస్తిష్కంలో ఆలోచనలు చెలరేగాయి. అందులో ఒక మెరుపు మెరిసింది. వెంటనే..

“భద్రయ్యా.. రఘునాథం తన భార్యను హత్య చేసి తను ఆత్మహత్య చేసుకున్నాడని అందరికీ తెలిసిందే. కేసు ఫైలు మూసేసే దశకు వచ్చింది. దాని సపోర్టింగ్ కోసం చిన్న పని మిగిలి పోయింది. అందుకే వచ్చాం” అంటూ సోమయ్య మీకు తెలుసు గదా! అన్నట్టు చూపుడు వేలుతో సోమయ్యను చూపించాడు.

“నాకు తెలుసు సార్” అంది లలిత.

“అవునమ్మా.. నువ్వు వారింట్లో పనిచేసేదానివి కదా!. రమణి హత్య జరిగిన రోజున నువ్వు పనిలోకి వెళ్ళ లేదని రాసిస్తే చాలు. ఆ కేసును నేనే దర్యాప్తు చేస్తున్నాను” చెప్పాడు విజయకుమార్. అవునన్నట్టు సోమయ్య మద్దతు పలుకుతూ.. తన చేతిలో ఉన్న ఫైలు నండి ఒక తెల్ల కాగితం తీసి లలితకిచ్చాడు.

“లలితా ఆగు. నేను రాసిస్తాను” అంటూ లలిత చేతిలోని కాగితం లాక్కున్నాడు భద్రయ్య.

భద్రయ్య చాలా జాగ్రత్తగా ఆనాటి తేదీతో సహా నమోదు చేసి రాసిచ్చాడు. దానిపై ఇది వాస్తవం అనే ఒకే ఒక ముక్క లలితతో వ్రాయించుకుని దాన్ని సోమయ్యకిచ్చాడు విజయశేఖర్ ఫైల్లో పెట్టమన్నట్టు.

ఇరువురు నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి ఎస్సై మన్మధరావుతో సమావేశమయ్యారు.

“సర్.. ఈ రోజు కేసుకు సంబంధించిన అత్యంత విలువైన సమాచారం సేకరించాను. దీంతో కేసు అసలు స్వరూపం బయట పడుతుందని నా నమ్మకం” అంటూ విజయశేఖర్.. ఒకటి ఆత్మహత్య చేసుకున్న రంగనాథం జేబులో దొరికిన కాగితం, రెండవది రంగనాథం ఇంట్లో ఇంట్లో దొరికిన డైరీ, మూడవది భద్రయ్య రాసిచ్చిన కాగితం మన్మధరావు ముందు పెట్టాడు. “సర్.. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపండి. ఫలితంతో మిస్టరీ వీడుతుంది”

ఇందులో మిస్టరీ ఏముంది అన్నట్టుగా నిర్లిప్తంగా ఆ మూడింటినీ తీసుకుని సోమయ్యకు ఆపని అప్పగించాడు మన్మధరావు.

***

ఆమరునాడు విజయశేఖర్ పోలీసుస్టేషన్ వచ్చేసరికి లలిత లాకప్పులో కనబడింది. ఫోరెన్సిక్ ఫలితం ఊహించాడు. భద్రయ్య రాసిన కాగితం మీద లలిత చేవ్రాలు తీసుకోవడం మంచిదయ్యింది. సోమయ్య తను తిరిగి వస్తుంటే భద్రయ్య లలిత మీద కేకలు వేయడం .. తనకాఊహకు కారణమయ్యింది. మన్మధరావు ఛాంబరుకు వెళ్తుంటే అతనే ఎదురయ్యాడు.

“విజయశేఖర్.. యు ఆర్ గ్రేట్” అంటూ అభినందించాడు.

“నో సర్.. నాట్ ఎటాల్. ఇందులో నాగోప్పతనమేమీ లేదు. ఇంకా నిజానిజాలు తేలాలిగా” అంటూ లలిత వంక చూశాడు. లలిత తల దించుకునే ఉంది.

“భద్రయ్యను పట్టుకొస్తున్నామని మన వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేశారు. ఉదయం లలిత ఒక్కర్తే దొరికింది. వాడు వచ్చాక ఇద్దరినీ ఒకే బొక్కలో వేసి తోమితే నిజాలు బయటకు వస్తాయి” అంతే కదా! అన్నట్టు లాఠీని తనదైన శైలిలో తిప్పసాగాడు.

“సర్.. భద్రయ్యను మరో సెల్లో వేయండి” అంటూ నిజాలు ఎలా రాబట్టాలో సలహా ఇచ్చాడు విజయశేఖర్. “పత్రికా విలేకరుల బృందాన్ని పిలిపించండి. వారి ముందు కేసు పరిశోధన వివరించండి”

అలాగే బాగుంది మీ ఆలోచన అన్నట్టు తలూపాడు మన్మధరావు. విలేకరులకు ఫోన్లు చేసి రప్పించమని సోమయ్యను పురమాయించాడు. భద్రయ్యను ఏ సెల్ లో వేయాలో ఆదేశించాడు.

***

మరో గంటలో పత్రికా విలేకరుల బృందం స్టేషన్ ముందు వచ్చి వాలింది.

వారిని పోలీసు స్టేషన్ వెనుకాల ఉన్న రేకుల షెడ్డు కిందకు తీసుకు వెళ్ళాడు సోమయ్య. చిన్నసభలాగా అమర్చిన కుర్చీలలో అంతా ఆసీనులయ్యారు.

విజయశేఖర్ కలుగ జేసుకుని విలేకరులను సంబోధించి విషయం క్లుప్తంగా చెప్పాడు. రెండు రోజుల క్రితం వచ్చిన హత్య, ఆత్మహత్యల వార్తను గుర్తు చేశాడు.

“కొద్ది క్షణాల్లో మన ఎస్సై మన్మధరావు గారు వచ్చి వాస్తవాలు వెల్లడిస్తారు” అని ప్రకటించగానే అందరిలో ఉత్కంఠ మొదలయ్యింది. సోమయ్య తెప్పించిన అల్పాహారం ఆరగించి టీ, కాఫీలు సేవిస్తూ.. మన్మధరావు కోసం ఎదురి చూడసాగారు.

మరో అరగంట తరువాత మన్మధరావు వేదిక దగ్గరకు వచ్చాడు. అతని వెనుకాల లలిత, భద్రయ్యలు పిల్లి కూనల్లా వచ్చి ఒక ప్రక్కగా నిలబడ్డారు. విలేకరుల కెమెరాలు క్లిక్కులకు వారి ముఖాలు స్పందించడం లేవు. ఇక చాలు అన్నట్టు చేతితో సంజ్ఞ చేస్తూ.. మన్మధరావు విలేకరులకు అభివాదము చేసి గొంతు సవరించుకున్నాడు.

“రెండు రోజుల క్రితం ఇదే వేదిక మీద నేను హత్య, ఆత్మహాత్యల గురించి చెప్పాను. హత్య తానే చేసినట్టు ఒప్పుకొని తను ఆత్మఆహత్య చేసుకోవడంతో కేసును నేను పెద్దగా పట్టించుకోలేదు. కాని విజయకుమార్ గారు తన అనుమానాన్ని వ్యక్త పరుస్తూ.. కేసును పరిశోధించాలని అభ్యర్థించారు. మరునాడు ఒక వీడియో తీసుకుని రావడంతో కేసు పరిశోధనకు పునాది పడింది. రఘునాథం ఆత్మహత్య చేసుకోలేదని అర్థమయ్యింది. అప్పుడు అతని జేబులోని ఉత్తరం మీద అనుమానమేసింది. వారి ఇంటికి చుట్టాలు, పక్కాలు ఎవరూ రారు. కేవలం లలిత మాత్రమే వారి ఇంటిలో పని చేస్తుంది. లలిత మీద అనుమానంతో ఆమె ఇంటికి వెళ్ళాం. చాకచక్యంగా ఆమె దస్తూరిని, ఆమె భర్త భద్రయ్య దస్తూరిని ఒక స్టేట్ మెంట్ రూపంలో తీసుకున్నాం. లలిత వ్రాయకుండా అడ్డుకుంటున్న భద్రయ్య వైకరి మా అనుమానాన్ని బలపర్చింది. మా అనుమానం నిజమయ్యింది కూడా. రఘునాథం జేబులో దొరికిన ఉత్తరంలోని దస్తూరి లలితదని ల్యాబ్ ధ్రువపర్చింది. దాంతో లలితను, భద్రయ్యను వేరు, వేరుగా సెల్లులో వేసి ఒక అబద్ధంతో నిజాలు రాబట్టాను” అంటూ విలేకరులనందరిని కలియ జూశాడు మన్మధరావు. అంతా ఆశ్చర్యంగా చూడసాగారు.

“ఇది మన విజయకుమార్ గారు ఇచ్చిన సలహా.. భద్రయ్య దగ్గరికి నా శైలిలో లాఠీ ఊపుకుంటూ వెళ్లి లలిత అంతా నిజం చెప్పింది. ఇక నువ్వు బుకాయించి లాభం లేదు. రఘునాథాన్ని బ్రిడ్జిపై నుండి ఎందుకు తోసేసావని గద్దించాను. లాఠీ గాలిలోకి లేచేసరికి భద్రయ్య నోరు విప్పాడు. రఘునాథం స్త్రీలోలుడు. మాయ మాటలతో రమణిని లేపుకు వచ్చి మడికొండలో కాపురం పెట్టాడు. లలితపై కన్నేసి కావాలని పనిమనిషిగా కుదుర్చుకున్నాడు. వీరి భాగోతం పసిగట్టి రమణి గొడవ పడేది. రమణిని చంపడం చూసింది లలిత. ఎప్పటికైనా తనకూ ఇదే గతి పడుతుందేమోనని అనుమానంతో భద్రయ్యకు రఘునాథం మీద చాడీలు చెప్పి అతన్ని అంతమొందించాలని పథకం రచించింది. లలిత ఉత్తరం వ్రాసి రహస్యంగా రఘునాథం పర్సులో పెట్టింది. అలా రఘునాథం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి తాము తప్పుకోవాలనుకున్నారు కాని ‘తామొకటి తలిస్తే దైవమొకటి తలుచును’ అన్నట్టు సి.సి.కెమెరాల పుణ్యమా అని దొరికి పోయారు” అని విలేకర్ల కరతాళ ధ్వనుల మధ్య చెప్పడం ముగిస్తూ.. ఆత్మీయంగా విజయశేఖర్ ను ఆలింగనం చేసుకున్నాడు మన్మధరావు. *

మరిన్ని కథలు

Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు