అర్దరాత్రి..! అమావాస్య చీకటి, కాటుక పులుముకుంది ఈ రోజు ఎందుకో?, కొత్తగా నిర్మించిన నేషనల్ హైవే రోడ్డు పైన కారు గంటకు నూట యాభై కిలోమీటర్లు వేగంతో దూసుకు పోతుంది. శ్రావ్యమైన సంగీతం వింటూ , వేగానికి లిమిట్ అనేది లేకుంటే ఎంత బాగుంటుందో.మినిమం 200 దాటాలనే కోరిక తీరేది అనుకుంటూ, దూసుకు పోవాలనే కోరికతో స్పీడో మీటర్ వైపు కసిగా చూస్తున్నాడు ధనుంజయ్... కారు ధరణీ అపార్ట్మెంట్స్ క్రాస్ చేసి ,మరో మలుపు తీసుకుని వెనీలా అపార్ట్మెంట్స్ వైపు దూసుకు పోతుంది తనలోని కోరికకు అడ్డుకట్ట వేస్తూ సడెన్గా రోడ్డు మధ్యకు దూసుకొచ్చిందో యువతి . చేతిలో లగేజ్ తో. కారు హెడ్ లైట్ ఫోకస్ లో చూసాడు ధనుంజయ్. అమ్మాయ్ లిఫ్ట్ కావాలంటూ చేతిని చూపుతుందని. ఇంత రాత్రివేళల్లో ఇలా ఒంటరిగానా స్త్రీ లు సంచరించే స్వేచ్ఛ అప్పుడే వచ్చేసిందా! అనుకుంటూ ,కాస్త కాలక్షేపంగా ఉంటుందిలే, అనుకుని కారు ఆమెకు దగ్గరగా ఆపి డోర్ తీసాడు ధనుంజయ్. ఆమె కారులో సర్దుకుని కూర్చుంటూ , "ఈ సమయంలో లిఫ్ట్ ఇవ్వాలనే మీ అభిప్రాయంకు హృదయ పూర్వక కృతజ్ఞతలు ."అంటూ ,తన చేతిని ముందు చాచింది ఆమె. చేతిని అందుకున్న ధనుంజయ్ ఒక విషయం గ్రహించాడు తిరిగి కారు వేగం అందుకుంటుంది. "ఇంత రాత్రి వేళ మీరు ఇక్కడ ?" "మీరు ఎక్కడ నుండి వస్తున్నారో తెలుసుకోవచ్చా?" అడిగాడు ధనుంజయ్... "నా పేరు అడగనందుకు థ్యాంక్యూ, గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీ నుండి" సమాధానం చెప్పింది ఆమె.. "మార్చురీ నుండి !మంచి జోక్,సరే కానీ అక్కడ మీకు ఉద్యోగమా? "అడిగాడు ధనుంజయ్.. "కాదు నేనే పేషెంట్ " . "అక్కడ జాయినై ఆరు నెలలు అవుతుంది. చనిపోయి వారం రోజులు అవుతుంది." "జోకులు మీద జోకులు భలే వేస్తున్నారు" అందుకున్నాడు ధనుంజయ్.. "గవర్నమెంట్స్ హాస్పిటల్స్ లో శవాలను ఎలుకలు తింటాయనే వార్త మీరు వినేవుంటారు ? అక్కడ నేను ఉన్నా అనడానికి మీకు సాక్షం . నేను కారు దిగుతూ చూపిస్తాలెండి" .అంది ఆమె "అవసరం లేదు నేను నమ్ముతాను"... అన్నాడు ధనుంజయ్.. "ఇంతకూ మీ చావుకు కారణం తెలుసుకోవాలని బయలుదేరారా" అడిగాడు ధనుంజయ్.. "లేదు నేను చంపాలనుకున్న వ్యక్తి ఎలా చనిపోయాడో తెలుసుకోవాలని ఉంది" అన్నదామె. "మీకు అంత శ్రమ అవసరం లేదు లేండి, మీరు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు! మీ డైరీ చదివి.డబ్బులు ,నగలు దాచిన వివరాలు తెలుసుకున్న వ్యక్తి చనిపోయాడు." "ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు".అడిగింది ఆమె. ఆత్రంగా . "ఎలా అంటే! మిమ్మల్ని చంపి డబ్బులు బంగారం తీసుకున్న డాక్టర్! నేనే కనుక" , విషయం చెప్పాడు ధనుంజయ్.. "మరి మీరెలా చనిపోయారు" అడిగింది ఆమె. అమితమైన ఆశ్చర్యంగా ఆమె వైపు చూసాడు ధనుంజయ్. "తను చనిపోయిన విషయం ఈమెకెలా తెలుసో?" అనుకుంటూ.. "కారు ఎక్కిన తరువాత మీకు షేక్ హ్యాండ్ ఇవ్వడంతో తెలిసిందిలేండి. అంతగా ఆశ్చర్యంగా చూడకండి. ,మీ చేతులు చాలా చల్లగా ఉన్నాయ్, మీలో జీవం ఉంటే కాస్త వెచ్చదనం కలిగి ఉండేది. అయినా ఒక జీవం లేని శరీరం మరో జీవం లేని శరీరాన్ని ఆ మాత్రం,గుర్తించలేదా...?" పకపకా నవ్విందామె. "మీరు డిటెక్టివ్ కథలు బాగా చదువుతారేమే , అందుకే అంత నిశితంగా పరిశీలించారు.ఇంతకూ మీరు ఎక్కడ దిగుతారు." అడిగాడు ధనుంజయ్. "ఎం అంత త్వరగా నన్ను వదిలించు కోవాలనిపిస్తుందా... ? ఎయిర్ పోర్ట్ దగ్గర ఆపండి. ఒక్క సారి ప్లాయిట్ లో విహరించాలనుంది." చెప్పిందామే.. "దెయ్యాలకు కోరికలు కూడా ఉంటాయా?ముసిముసిగా నవ్వాడు ధనుంజయ్. "ఏం మీకు లేవా కారు 150కి.వేగంతో డ్రైవ్ చేయాలని .." నవ్వింది ఆమే. "బాబోయ్ మనస్సును చదివేస్తున్నారు .. మీతో ప్రయాణం ప్రమాదకరమే మరెన్ని విషయాలు తెలుసుకుంటారేమో భయంగా ఉంది " అంటున్న ధనుంజయ్ వైపు చూస్తూ... వారం క్రితం చనిపోయిన మీకు భయమా?" అయినా మీ సీక్రెట్స్ అన్నీ తెలిసిన మీ గర్ల్ ఫ్రెండ్ ఏమీ చేయలేక పోయింది.మరి నేనెంత నవ్వింది ఆమే..... "ఇంతకూ తమరు ఎక్కడి వరకో చెప్పలేదు , అడిగింది ఆమె," "మన నివాసం ఎక్కడికో అక్కడికే అని మీకు తెలియనిదా.." నవ్వుతున్నాడు ధనుంజయ్.. తీరని కోరికలు ఇలా తీర్చుకుంటూ తిరుగుతున్న మనకు నివాసం ఎక్కడిది అనుకునే రెండు ఆత్మలు గాలిలో తేలిపోతున్నాయి..