పేరుకే ‘విజయ్’ అయినా, పాపం ఆ అబ్బాయికి ఎప్పుడూ కలిగేది అపజయమే - అందుకు కారణం విజయ్ కి పెద్దవాళ్ళ మాటల మీద ఉన్న గురి, భక్తి, గౌరవం.
బడి ఆటల మైదానంలో పదిహేను రోజుల తరువాత వార్షిక ఆటల పోటీలు జరుగుతాయి అని తెలియగానే - విజయ్ వాళ్ళ నాన్న మరియు మామయ్య సలహాల మీద ‘ వంద మీటర్ల పరుగు పందెం ‘ మరియు ‘ క్రికెట్ బాల్ త్రో (cricket ball throw ) ‘ ఆటల పోటీలలో పాల్గొనడానికి, పేరు ఇచ్చేడు.
విజయ్ మామయ్య ‘పరుగు పందెం’ కోసం, నాన్న ‘క్రికెట్ బాల్ త్రో’ పందెం కోసం తర్ఫీదు ఇస్తానన్నారు.
ముందుగా జరిగే వంద మీటర్ల పరుగు పోటీలో ఉత్సాహంగా పాల్గొన్న విజయ్, మామయ్య మాట మీద గౌరవంతో అతనిచ్చిన సలహా తు. చ. తప్పకుండా పాటించి, ఓటమి చవిచూడడంతో బాటూ నలుగురిలో నవ్వులాటగా మిగిలిపోయేడు. ఆ ప్రహసనం ఏమిటో తెలుసుకోవాలంటే, ఆ పోటీ వీడియో వెనక్కి తిప్పి చూడవలసిందే. ఇంకెందుకు ఆలస్యం, రండి చూసేద్దాం.
ఆ పోటీలో ప్రత్యర్ధులు వంద మీటర్లు పరిగెత్తి, మళ్ళా అంతే దూరం వెనక్కి రావాలి. విజయ్ పాతిక మీటర్ల దూరం కూడా ముందుకి వెళ్లక మునుపే, మిగతా ప్రత్యర్థులందరూ వెనక్కి రావడం ప్రారంభించేరు. కారణం --
" ముందు నువ్వు తాపీగా కొంత దూరం నడిచి, తరువాత కొంత దూరం మెల్లిగా పరిగెత్తి, ఆ తరువాత మిగిలిన దూరం
త్వరగా పరిగెత్తితే - ముందే త్వరగా పరిగెత్తిన వాళ్లంతా అప్పటికే అలసిపోయి ఉంటారు కాబట్టి, నీదే విజయం "
-అని విజయ్ మామయ్య ఇచ్చిన అమూల్యమైన సలహా.
విజయ్ నాన్న "నువ్వు ఏమీ నిరుత్సాహపడకురా. ఇంకో పోటీకి, మన పొలంలో కొలను దగ్గర తర్ఫీదిచ్చేను కదా” అని ఊరడించేడు. ఆ పోటీ వీడియో కూడా వెనక్కి తిప్పి చూసేద్దాం రండి.
-- కొడుకుని పొలం తీసుకొని వెళ్లిన విజయ్ నాన్న, అక్కడున్న కొలనులో ‘గుండ్రని పెద్ద పెద్ద రాళ్లు’ దూరంగా విసరడంలో –
-- బాగానే తర్ఫీదు ఇచ్చి, ‘క్రికెట్ బాల్ త్రో‘ పోటీకి విజయ్ ని పంపిన విషయం విశదమవుతోంది.
*****