భాగవత కథలు –27 సాల్వుని సౌభక విమానం - కందుల నాగేశ్వరరావు

Salvuni soubhaka vimanam

భాగవత కథలు –27

సాల్వుని సౌభక విమానం

సాల్వుడు శిశుపాలుని మిత్రుడు. రుక్మిణీ పరిణయం సమయంలో శిశుపాలునికి సహాయంగా వచ్చి శ్రీకృష్ణుణ్ణి ఎదిరించి చావు దెబ్బలు తిన్న రాజులలో సాల్వుడు కూడా ఉన్నాడు. వాడు మొండి పట్టుదలతో యాదవులను నాశనం చేస్తానని జరాసంధుడు మొదలైన రాజుల సమక్షంలో ప్రతిజ్ఞ పట్టాడు.

సాల్వుడు ఒక నిర్జన ప్రదేశంలో అత్యంత నిష్టతో ఈశ్వరుణ్ణి గూర్చి తపస్సు మొదలుపెట్టాడు. అతడు ప్రతి రోజు పిడికెడు దుమ్ము మాత్రం ఆహారంగా తీసుకొంటూ, చెదరని భక్తితో ఒక సంవత్సరం పాటు ఘోరమైన తపస్సు చేశాడు. వాని భక్తికి సంతోషించిన శివుడు ప్రత్యక్షమై “నీవు ఏమి కోరినా ఇస్తాను, కోరుకో” అని సాల్వునితో అన్నాడు.

సాల్వుడు ఈశ్వరునికి నమస్కారం చేసి “ఓ స్వామీ! గరుడ గంధర్వ యక్ష రాక్షస దేవతాదులకు సాధ్యం కానిదై నా కోరిక ప్రకారం అవసరమైనప్పుడు ఆకాశమార్గంలో సంచరించగల వాహనాన్ని నాకు ప్రసాదించు” అని కోరాడు. ఈశ్వరుడు వాని కోరికకు తగిన పట్టణాన్ని నిర్మించి యిమ్మని దేవ శిల్పి అయిన మయుణ్ణి ఆదేశించాడు.

మయుడు ఈశ్వరుని ఆజ్ఞ ప్రకారం ‘మిక్కిల పొడవూ వెడల్పూ కామ గమనమూ కలిగిన పట్టణాన్నిలోహంతో నిర్మించి దానికి సౌభక విమానం’ అని పేరు పెట్టి సాల్వునికి ఇచ్చాడు. వాడు మయుడు ఇచ్చిన ఆ దివ్య విమానాన్ని స్వీకరించి సంతోషంతో దానిని అధిరోహించాడు. యాదవులపై పూర్వం నుండి తనకున్న శత్రుత్వంతో కన్ను మిన్ను కానక ద్వారకా పట్టణాన్ని తన సైన్యంతో ముట్టడించాడు. ద్వారకలోని నదులనూ, వనాలను పాడు చేశాడు. సరస్సులను, నూతులనూ కప్పించాడు. కోటగోడలు పడగొట్టించాడు. మిద్దులనూ మేడలను కూల్చేశాడు. పట్టణంలోని బంగారం, రత్నాలు లాంటి విలువైన వస్తువులను కొల్లగొట్టాడు. ప్రజలను చెరపట్టాడు. విమానంలో ఆకాశంలోకి ఎగిరి అక్కడనుండి రాళ్ళూ, చెట్ల కొమ్మలూ కురిపిస్తూ అందరినీ పెక్కు బాధలకు గురిచేసాడు.

ద్వారకానగరం సాల్వునిచేత చాలా కష్టాల పాలయ్యింది.శ్రీకృష్ణుని కుమారుడు మహా వీరుడు అయిన ప్రద్యుమ్నుడు ప్రజలకు భయపడవద్దని చెప్పి మహోత్సాహంతో అస్త్రశస్త్రాలు ధరించి, ఉన్నతమైన రథం ఎక్కి యుద్ధభూమికి బయలుదేరాడు. అతని వెంట పరాక్రమవంతులైన గదుడు, భానువిందుడు, చారుదేష్ణుడు, సాంబుడు, అనిరుద్ధుడు, అక్రూరుడు, కృతవర్మ మొదలైన యాదవ వీరులందరూ చతురంగ బలసమేతులై యుద్ధభూమికి బయలుదేరారు.రెండు పక్షాల మధ్య యుద్ధం దేవదానవ యుద్ధంలా కనపడింది.

గుర్రాల గిట్టలవల్ల, రథచక్రాలవల్ల, భటులపాదాలవల్ల లేచిన దూళి ఆకాశాన్ని చీకట్లతో నింపింది. మదగజాల ఘీంకారాలు, భటుల హుంకారాలు, యుద్ధభేరీల భాంకారాలతో భూమ్యాకాశాలు రెండూ నిండిపోయాయి. ఇదంతా చూస్తున్న ప్రద్యుమ్నుడు వీరావేశంతో విజృంభించి తన దివ్యాస్త్రాలతో సాల్వుడు పన్నని మాయాజాలాన్ని చేధించాడు. తరువాత ఇరువైఅయిదు బాణాలతో సాల్వుని సైన్యాధిపతిని గాయపరిచాడు. మరిన్ని బాణాలు ప్రయోగించి సాల్వునిపై కాలభైరవుడి వలె విజృంభించాడు.అతని అద్భుత పరాక్రమాన్ని చూసి ఇరుసైన్యాలూ పొగిడాయి.

అప్పుడు సాల్వుడు సాంబునిపై బాణాలు ప్రయోగించాడు. సాంబుడు ధనస్సు ఎక్కుపెట్టి సాల్వుని వక్షాన్ని బాణాలతో కొట్టి ఇంకొన్ని బాణాలు వేసి సౌభకవిమానాన్ని గాలిలో ఊగేటట్లు చేశాడు. గదుడు, సాత్యకి, భానువిందుడు, చారుదేష్ణుడు, శుకుడు, సారణుడు, అక్రూరుడు, కృతవర్మ మొదలైన యాదవ వీరులందరూ శత్రువులు భయపడేటట్లుగా తమ తమ ఆయుధాలతో సాల్వుని గుర్రాలనూ, ఏనుగులనూ, రథాలనూ ధ్వంసంచేసి సైనికులను చెల్లాచెదురు చేశారు.

సాల్వుడికి చాలాకోపం వచ్చింది. అతడు మయుడు నిర్మించిన మాయా విమానంలోవిజృంభించాడు. అది ఒకసారి ఆకాశంలో, ఇంకొకసారి భూమిపై, మరియొకసారి కొండ శిఖరంపై అనేక రూపాలతో ప్రత్యక్షమై శత్రువులను కలవరపెడుతోంది. అంతకు ముందు ప్రద్యుమ్నుని దాడికి బయపడిభయంతో పారిపోయిన సాల్వుని సైనికులుధైర్యం తెచ్చుకొని యుద్ధానికి తిరిగి వచ్చారు. ఇరుపక్షాల యోధులూ అలసిపోకుండా పౌరుషంతో పోరాడారు.

సాల్వుని మంత్రి ద్యుముడనేవాడు ప్రద్యుమ్నునివక్షం పగిలేటట్లుగా తన గదతో మోదాడు. ఆ దెబ్బకు ప్రద్యుమ్నుడు అస్త్రాలను రథంపై వదలి మూర్చపోయాడు. యుద్ధశాస్త్రం తెలిసిన సారథి రథాన్ని మరలించి యుద్ధభూమి నుండి ప్రక్కకు తీసుకుపోయాడు. కొంచెం సేపటికి ప్రద్యుమ్నుడు మూర్చ నుండి తేరుకొని తనను రణభూమి నుండి ప్రక్కకు తెచ్చినందుకు సారథిని మందలించాడు. అప్పుడు సారథి “శత్రువులచేత గాయపడ్డప్పుడు రథికుడూ, సారథీ పరస్పరం రక్షించుకోవడం యుద్ధధర్మం. కాబట్టి ఇలా చేశాను. ఇప్పుడు నీవు బాధపడక విరోధులను ఆపడానికి ప్రయత్నించు” అని చెప్పి రథాన్ని తిరిగి యుద్ధభూమికి తీసుకువచ్చాడు. అప్పుడు ప్రద్యుమ్నుడు ద్యుముణ్ణి సమీపించి బాణాలు ప్రయోగించి వాని రథాన్ని, గుర్రాలను, సారథినినుగ్గు నుగ్గు చేశాడు. చివరకు పదునైన బాణంతో ద్యుముని కంఠాన్ని నరికాడు. ఇది చూసిన సాంబుడు మొదలైన యోధులు సాల్వ సైనికుల శిరస్సులు ఖండించారు.

ఈ విధంగా ఆ సంగ్రామం ఇరువది ఏడు రోజులు సాగింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థం నుండి ద్వారకకు తిరిగివస్తూ మార్గమధ్యంలో కనపడిన అపశకునాలు చూసి శత్రువులు ద్వారకపై దండెత్తినట్లుగా గ్రహించాడు. ద్వారకను సమీపించిన వాసుదేవుడు బలపరాక్రమాలతో యుద్ధం చేస్తున్న యాదవ వీరులనూ, వారికి భేదింప సాధ్యంకాకుండా వున్న సౌభకవిమానాన్నీ, అందులో వున్న సాల్వుణ్ణీ చూసాడు.

కృష్ణుణ్ణి చూసిన సాల్వుడు భయంకరమైన “శక్తి”అనే ఆయుధాన్ని కృష్ణుడి రథసారథియైన దారుకునిపై ప్రయోగించాడు. అలా దూసుకు వచ్చే ఆయుధాన్ని కృష్ణుడు ఒక్క బాణంతో మార్గంలోనే పొడి పొడి చేశాడు. కృష్ణుడు అంతటితో శాంతింపక ఆకాశంలో గిరగిరా తిరుగుతున్న సౌభుకాన్నీ, అందుకోని సాల్వుణ్ణీ పదునైన బాణాలు వేసి నొప్పించాడు. సాల్వుడు కోపంతో కృష్ణుని ఎడమ భుజంలో దిగబడేటట్లు బాణాలు వేశాడు.సాల్వుడు కృష్ణుని ఉద్దేశించి “నా మిత్రుడు శిశుపాలుణ్ణి చంపిన నిన్ను హతమార్చి పగతీర్చుకుంటాను” అని ప్రగల్భాలు పలికాడు.

కృష్ణుడు “మూర్ఖుడా! నీకు చావు మూడింది కాబట్టే ఇలా వాగుతున్నావు” అని పలికి తన గదాయుధాన్ని గిరగిరా త్రిప్పి వాని మీదకు విసిరాడు. ఆ దెబ్బకు సాల్వుని నోటి నుండి ముక్కు నుండి రక్తం కారుతుండగా సౌభక విమానంతో సహా మాయమయ్యాడు. సాల్వుడు మళ్ళీ కన్పించి మాయా వసుదేవుణ్ణి కల్పించి “కృష్ణా! నీ ఎదుటే నీ తండ్రిని హతమారుస్తాను” అంటూ ఆ మాయా వసుదేవుడి శిరస్సు ఖండించాడు. కొంతసేపు దుఃఖంలో ములిగిపోయిన కృష్ణుడు వెంటనే తేరుకొని బలరాముని రక్షణలో ఉన్న తండ్రిని వీడెలా తేగలడని ఆలోచించి, ఇదంతా మాయని గ్రహించాడు.

అప్పుడు శ్రీకృష్ణుడు సాల్వుణ్ణి చంపడానికి నిశ్చయించుకొని వర్షధారల వంటి బాణ సముదాయాన్ని ప్రయోగించి వాని కిరీటాన్నీ, ధనస్సునూ, కవచాన్నీ ఛేదించి వేశాడు. ఆకాశం నిండా మెరుపులు వ్యాపించేటట్లు గదాదండాన్ని విసిరి మాయతో కూడిన సాల్వుని సౌభకవిమానాన్ని ముక్కముక్కలు చేసి, సముద్రంలో పడేటట్లు చేశాడు. అప్పుడు సాల్వుడు కోరలు పెరికిన పామువలె మాయాబలం నశించి భూమిపైకి వచ్చాడు. శ్రీకృష్ణుడు ముందు గదాసహితంగా వాని చేతిని ఖండించాడు. తరువాత కృష్ణుడు సుదర్శన చక్రం ప్రయోగించి సాల్వుని శిరస్సు ఖండించివేశాడు.

ఈ విధంగా శ్రీకృష్ణుడు సాల్వుణ్ణీ అతని సౌభక విమానాన్నీ ధ్వంసం చేయడం శిశుపాలుని మరొక స్నేహితుడు దంతవక్త్రుడు అనేవాడు చూసాడు. వాడు మిక్కిలి భయంకరాకారంతో భూమి వణికేటట్లు నడుస్తూ, కృష్ణుడి మీదకు యుద్ధానికి వచ్చాడు. అలా వస్తున్న దంతవక్త్రుణ్ణి చూసిన కృష్ణుడు కూడా గద చేతపట్టి రథం దిగాడు. దంతవక్త్రుడు అట్టహాసంగా నవ్వుతూ కృష్ణునితో “ కృష్ణా! నీవు ఈరోజు నా కంట పడటం నా అదృష్టం. బందు రూపంలో ఉన్న విరోధిని నువ్వు. నా మేనమామ కొడుకు అని కూడా చూడకుండా నిన్ను నా గదాదండంతో యమలోకానికి పంపిస్తాను. నిన్ను చంపి నా మిత్రుల ఋణాన్ని తీర్చుకుంటాను” అని దుర్భాషలాడాడు. ఇలా అంటూనే తన గదతో కృష్ణుడి తలపై మోదాడు. కృష్ణుడు కోపించి వజ్రాయుధం లాంటి గదతో వాని గుండెపై కొట్టాడు. ఆ దెబ్బకు వాడు రక్తం కక్కుతూ నేలకూలాడు. పర్వతం వంటి దేహంతో నేలపై తన్నుకుంటూ ప్రాణాలు విడిచాడు.

ఆ సమయంలో అన్న మరణం చూచి విథూరథుడు అనేవాడు మహాకోపంతో భయంకరమైన డాలు కత్తి ధరించి కృష్ణుడి పైకి దూకాడు. కృష్ణుడు తన చక్రాయుధంతో వాడి శిరస్సు ఖండించాడు. ఈ విధంగా భగవంతుడైన శ్రీకృష్ణుడు శిశుపాలుని వధించిన తరువాత సౌభక సాల్వుణ్ణీ, దంతవక్త్రునీ, వారి సోదరులనూ, వారి వంశం వారిని ఎంతోమందిని సంహరించాడు.

ఆ సమయంలో నరులు, మునులు, దేవతలు, గంధర్వులు, కిన్నరులూ మొదలైన వారంతా ఆశ్చర్యానందాలతో శ్రీకృష్ణుని గొప్పతనాన్ని స్తుతించారు. అప్సరలు నాట్యం చేస్తుండగా దేవతలు పూల వర్షం కురిపించారు. దేవదుందుభులు మ్రోగుతుండగా, యాదవవీరులు సేవించుచుండగా శ్రీకృష్ణుడు పరమానందతతో అతి వైభవంగా ద్వారకానగరా ప్రవేశించాడు.

***

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.