"ఒక అమ్మాయిని ప్రేమించి, ఆ అమ్మాయి మనల్ని మెచ్చి... ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే వుండే ఆనందం ప్రపంచం లో ఎక్కడా దొరకదు ,పెళ్లంటే అదీ. " అరమోడ్పు కళ్ళతో తన్మయత్వం లో మునిగి పోయి అన్నాడు రాజేంద్ర శర్మ.
చుట్టూ కూర్చొని చూస్తూ ,తదేకంగా ఇదంతా వింటున్న స్నేహితులందరూ ఆలోచనలో పడ్డారు .
" అంతేనంటావా ?" అని తల గోక్కుంటూ అనుమానాస్పదంగా అడిగాడు రవీందర్.
" అవున్రా..లేక పోతే ముక్కూ మొహం తెలీని అమ్మాయిని పెళ్లిచూపులు అనబడే ఆ.. తతంగం లో చూసి ఎలా పెళ్లి చేసుకుంటాం?" అన్నాడు రాజేంద్ర శర్మరెట్టించిన స్వరం తో, స్నేహితుల వేపు సమాధానం చెప్పండి అన్నట్లు గా చూసి, నిలబడి టక్ సరి చేసుకుంటూ.
" పెళ్లి చూపుల్లో , అమ్మాయి తో మనసు విప్పి మాట్లాడుకోవటానికి మనకు కాస్త సమయం ఇస్తారుగా ?" ముని వేళ్ళతో గడ్డం కొస రుద్దుకుంటూ సందేహం వెలిపుచ్చాడు మోహన్.
" పిచ్చివాడా ! అక్కడ మహా అయితే అరగంటో, గంటో ఇస్తారు..దాంతో నీకేం తెలుస్తుంది
అమ్మాయి మనసు ,మనస్తత్వం. పెళ్లి చూపులకు వెళ్లి , అలా పై పై మెరుగులు చూసి పెళ్లి చేసుకుంటే ...ఆ తర్వాత మనసులు కలవక పోతే..ఉంటుంది నాసామి రంగా " అని నవ్వాడు రాజేష్ శర్మ తన స్నేహితులను చూసి చప్పట్లు కొట్టుతూ .
" నిజమేరా నువ్వన్నది, కానీ మనకు అలా ప్రేమించే అమ్మాయి దొరకాలి కదా ? " తల పైకెత్తి
ఆకాశంవేపు చూసి సందేహంగా అడిగాడు రవీందర్ .
" దొరుకుతారు..ఖచ్చితంగా ..తొందరేంటి, దొరికే వరకూ ఆగడమే " అన్నాడు నవ్వుతూ.
అతని మాటలు విని స్నేహితులందరూ తలొక ఆలోచనతో ఇండ్లకు బయలు దేరారు.
రవీందర్ , మోహన్, రాజేశ్వేర శర్మ చిన్న నాటి స్నేహితు లు . ఎవరికీ ఇంకా పెళ్లి కాలేదు. అంతా బ్రహ్మచారులు. పెళ్లి సంబంధాల లో తల మునకలై వున్నారు .
ఇంటి గేట్ తీసి కార్ ఇంటి ఆవరణ లోపల పెట్టి , ఇంట్లోకి అడుగు పెట్టాడు రాజేష్.
ముందు గదిలో తల్లి-తండ్రి, ఇద్దరూ చాలా గంభీరంగా ,తన రాకను కూడా పట్టించుకోకుండా కూర్చొని ఉండటం గమనించాడు రాజేష్.
లోపలికివచ్చి చొక్కా విప్పుతూ వారి కేసి చూసి "ఏంటమ్మా... చాలా సీరియస్ గా వున్నారు, ఏమైంది ?" అన్నాడు మెల్లగా
రామ శర్మ ఏమీ మాట్లాడ లేదు.కొడుకు వేపు ఒక చూపు చూసి ఊరుకున్నాడు.
సుజాత కళ్ళు ఎత్తి కొడుకు వేపు నిష్టూరంగా చూసి "ఈ రోజు కూడా ఆ మచిలీపట్టణం అమ్మాయి వేపు నుండీ మధ్య వర్తి వచ్చాడు. అమ్మాయిని చూడటానికి ఎప్పుడొస్తారు?" అనిఅడిగాడు . ఏం చెప్పగలం. ఇలా మంచి మంచి పెళ్లి సంబంధాలు వస్తూ వున్నాయి , వారికి ఏం చెప్పాలిరా ? నువ్విలా అన్ని సంబంధాలు తిప్పికొడుతుంటే నీకు పెళ్లి అయ్యేదిఎలా? ?'' అంది కాస్త కోపంగా , దిగులుగా.
"అమ్మా నేనింతకు ముందే చెప్పాను కదా , పెళ్లి చూపులు ..నాకిష్టం లేదు. నాకు నచ్చిన అమ్మాయి కనపడితే నేనే చెప్తానుగా . అప్పుడే పెళ్లి .అంత వరకూ....నన్ను
ఇబ్బంది పెట్టొద్దు." అని ఖరాఖండిగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు.
ఏం మాట్లాడాలో తెలీక భర్త వైపు చూసింది సుజాత. . కళ్ళతోనే భరోసా ఇచ్చి మళ్ళీ దీర్ఘాలోచనలో పడ్డాడు రామశర్మ. ఒక నిశ్చయానికి వచ్చిన వాడిలా లేచి వెళ్లి ఫోన్ చేతిలోకి తీసుకుని మాట్లాడ సాగాడు..
***
ఆ రోజు బ్యాంకు లో మేనేజర్ సెలవు పెట్టటం తో రాజేష్ కు పని ఎక్కువ గా వుంది. .
పైగా ముందు రెండు రోజులు సెలవులు రావటం తో కస్టమర్ల తాకిడి ఆ రోజు మరీ ఎక్కువ అయింది .
చాలా బిజీ గా వున్నాడు. సరిగ్గా కొద్ధి సేపట్లో బ్యాంకు మూసి వేసే ముందు , చాలాటెన్షన్ తో కంప్యూటర్ ముందు పని చేస్తున్న సమయానికి "హలో గుడ్ ఈవెనింగ్ సర్" అన్న తీయటి గొంతు వినిపించి తలెత్తి పైకి చూసాడు రాజేష్.
సన్నగా, పొడవాటి అమ్మాయి, పెద్ద కాటుక కళ్ళతో ఆదుర్ధాగా టేబుల్ ముందు నిలబడి వుంది. ఒత్తైనజుత్తు, పొడవాటి జడతో చేతిలో బాగ్ పట్టుకుని "సర్ ...సేవింగ్స్ బ్యాంకు అకౌంట్ తెరవాలండి " అంది,కాస్త ప్రాధేయపడుతున్నధోరణిలో
" రేపు ఉదయాన్నే రండి ..ఈ రోజు సమయం దాటి పోయింది" అన్నాడు మళ్ళీ కంప్యూటర్ మీదికి దృష్టి సారిస్తూ..
" రేపు నేనొక ఇంటర్వ్యూ కి వెళ్ళాలండి , దయచేసి ఈ రోజు చేసి పెట్టండి ..ప్లీజ్ " అంటూ చిన్న గా నవ్వింది .
తక్షణం ఆ అమ్మాయికేసి ఒకసారి చూసాడు. చెవులకు వేలాడుతున్న జూకాలు , నాజూకైన మెడలో సన్నని బంగారు గొలుసు, చురుకైన కాటుక కళ్ళతో మెరిసి పోతూ వుంది ఆమె.
" సరే ..అలా కూర్చోండి." అని చెప్పి బజర్ నొక్కాడు.
రాజేష్ ఎదురుగా వున్న కుర్చీ లో ఆమె కూర్చుంది.
" సార్ చెప్పండి " అంటూ చిరాకుగా మొహం పెట్టుకుని వచ్చాడు ఆఫీస్ బాయ్.
" ఖాతా తెరవటానికి అప్లికేషన్ ఫారాలు పట్టుకుని రా " అని చెప్పాడు కంప్యూటర్ మీద నుండీ దృష్టి మరల్చ కుండా .
ఆఫీస్ బాయ్ వెంటనే కొన్ని పేపర్ లు తెచ్చి టేబుల్,మీదపెట్టాడు
వాటిని తీసుకుని అమ్మాయి వేపు తిరిగి " మేడం ! మీ పేరు ,అడ్రస్ , వగైరా అన్నీ అందులో నింపి నాకు ఇవ్వండి. " అని వాటిని ఆమె చేతికిచ్చాడు.
" నా పేరు కాత్యాయని " అని తన పేరు చెప్పి చిన్నగా నవ్విందిఆమె!
" మంచి పేరు....ఏం చేస్తుంటారు "అన్నాడు మర్యాద పూర్వకంగా రాజేష్.
"బీటెక్ అయ్యింది,ఇప్పుడిప్పుడే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను .." అని సమాధానం చెప్పుతూ అప్లికేషన్ నింప సాగింది కాత్యాయని .
పెన్నుతో రాస్తున్న వేళ్ళను అతడు గమనించసాగాడు. సన్నగా, పొడవుగా వుండి , లేత గులాబీ రంగు గోర్లు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. పెన్ను పట్టుకునే విధానం కూడా కళాత్మకంగా వుంది అనుకున్నాడు అతనుమనసులో.
అన్నీ పూర్తి చేసి " ఇదుగోండిసర్, పూర్తిచేసాను " అంటూ అప్లికేషన్ అతనికిఅందించింది.
వాటిని తీసుకుని " మీరు కాసేపు అక్కడ వెయిట్ చేయండి" అని కేబిన్ బయట విజిటర్స్ చైర్స్ వేపు చూపించాడు.
లేచి వెళ్తున్న కాత్యాయని ని చూసి, తిరిగి తన చేతిలో వున్న పేపర్ లో కాత్యాయని వివరాలు చూసాడు. తండ్రి పేరు, ఇంటి పేరు చూసి ' మన వాళ్ళేసుమా! ' అని మనసులోఅనుకుని కంప్యూటర్ లో తిరిగిపని చేసుకో సాగాడు.
కాసేపటి తర్వాత బజర్ నొక్కి ,ఆఫీస్ బాయ్ లోనికి రాగానే కేబిన్ బయట కూర్చున్న కాత్యాయని ని చూపించి " ఆ మేడం ను లోపలి రమ్మను " అని చెప్పాడు.
లోనికి అడుగు పెట్టిన కాత్యాయని ని చూసి "కూర్చోండి " అని చెప్పి, పాస్ పుస్తకం చేతికందించి నవ్వి " బ్యాంక్ లో ఏ అవసరం వచ్చినా సరే రండి " అన్నాడు.
" థాంక్ యు సర్,..మీ పేరు ?.." అని నవ్వుతూ రాజేష్ కళ్ళ లోకి చూసింది కాత్యాయని.
ఆ చూపుల్లో మన్మథుడి అస్త్రాలు దూసుకొచ్చాయి . ఒక క్షణం తడబడ్డాడు రాజేష్.
" రాజేశ్వర శర్మ..'రాజేష్' అంటారు " అన్నాడు లేచి నిలబడుతూ .
" మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు మీకు ," అని సమ్మోహనంగా నవ్వి వెను తిరిగి వెళ్తున్న కాత్యాయని ని చూసి ' అందం అంటే ఇలా ఉండాలి 'అనుకుని బరువుగా ఊపిరి వదిలి , తన పనిలో మునిగి పోయాడు.
చాలా సేపటి వరకు కాత్యాయని చూపులు, అందం అతడిని వెంటాడుతూనే వున్నాయి.
******
"రేపు అగ్రహారం లో పెళ్లి కి..వెళ్ళాలి ..గుర్తుందిగా?..ఉదయమే పెళ్లి ..మనం కాస్త పెందలాడే బయలు దేరాలి " కొడుకునుఉద్దేశిన్చి అన్నాడు రామ శర్మ.
"సరే నాన్నగారు వెళదాం , అమ్మా! కాస్త ముందుగా నిద్ర లేపవే నన్ను" అని తల్లికి చెప్పి గది లోకి వెళ్లి పడుకున్నాడు రాజేష్.
అందరూ ఉదయాన్నే బయలుదేరి ఎనిమిది గంటలకల్లా పెళ్లి ఇంటికి చేరు కున్నారు.
కారు దిగి పెళ్లి ఇంటి వేపు చూసాడు రాజేష్. ఇంటి ముందు చాలా పెద్ద పందిరి వేసి వుంది. నాద స్వరం , బాజా బజంత్రీలు మోగుతూ వున్నాయి. పందిరి మొత్తం మామిడాకుల తో పచ్చగా కళ కళ లాడుతూ వుంది. ఇంకా అప్పుడప్పుడే ఒక్కొక్కరూ లోపలి వెళ్తున్నారు..
మధ్యలో చిన్నగా పెళ్లి మండపం పూలతో అల్లుతున్నారు.. ఇంతలో పెళ్లి కూతురి తండ్రి ఎదురొచ్చి రామశర్మ ను పలకరించి లోనికి తీసుకెళ్లి " ముందుగా టిఫిన్ చేయండి" అంటూ అటుగా వెళ్తున్న ఒకమ్మాయిని చూసి " రాణి ! ఇదుగో వీళ్ళకు టిఫిన్ ఏర్పాట్లు చూడు " అని చెప్పాడు.
పక్కగా ఉన్న హాల్ లోకి వెళ్లి వరుసగా వేసిన కుర్చీలలో కూర్చున్నారు రామశర్మ కుటుంబం. అరటి ఆకులు పరిచి ఇడ్లి, మినప వడలు వడ్డించారు వాళ్లకి .
టిఫిన్ ముగించి వచ్చేసరికి పెళ్లి పందిరి కింద అప్పటికే చాలా మంది వచ్చి కూర్చోవటం గమనించి రాజేష్ కూడా వెళ్లి ముందు వరసలో కూర్చున్నాడు.
చిన్న పిల్లలతో అక్కడ హడావిడి ఎక్కువగా వుంది. అరుస్తూ ఆట పాటలతో పిల్లలుపరుగెడుతూ వున్నారు. వాళ్ళ అల్లరి చూసి ఆనందించ సాగాడు రాజేష్.
ఎరుపు రంగు పట్టు చీర కట్టుకున్న ఓ అమ్మాయి కాఫీ లు ట్రే లో పట్టుకుని రాజేష్ ముందు నిల బడింది.
" కాఫీ తీసుకోండి " అన్నమాట విని తల పైకెత్తి ఆ అమ్మాయి ని చూసాడు. ఎదురుగా కాత్యాయని.
తడబడి లేచి నించున్నాడు. గుండె వేగం పెరిగింది.
"మీరా!! " అని నవ్వి కాఫీ గ్లాస్ అందుకున్నాడు .
" అవునండీ నేనే ..కాత్యాయని " అని ప్రతిగా నవ్వింది ఆమె.
" మీరెలా ఇక్కడ? " ప్రశ్నించాడు ఆసక్తిగా.
" పెళ్లి కూతురు 'చెల్లెలు ' వరుస నాకు" అని చెప్పి పక్క వారికి కాఫీలు అందివ్వటానికి వెళ్ళిపోయింది కాత్యాయని.
అప్పటి వరకూ ఆసక్తి లేకుండా కూర్చున్న రాజేష్ కి కాత్యాయని కనిపించినప్పటి నుండీ
కాస్త హుషారుఅనిపించింది . అతని కళ్ళు కాత్యాయని కొరకు వెదక సాగాయి.
చాలా మంది అమ్మాయిలు పట్టు చీరల తో , జడల్లో మల్లెపూలతో అటూ ఇటూ హడావిడిగా తిరుగుతున్నారు.
ఒక పక్క కూర్చున్న కొంత మంది అబ్బాయిల గుంపు ఆ అమ్మాయిలను చూస్తూ,ఆనందంలో మైమరచిపోతుండటం గమనించి నవ్వుకున్నాడు రాజేష్.
పెళ్లి సందడి క్రమంగా పెరిగింది. వచ్చిన ఆహ్వానితుల ముచ్చట్ల తో , భజంత్రీల చప్పుడు తో మంటపం అంతా నిండి పోయి కోలాహలంగా వుంది .
పురోహితుడు మంత్రాలు చదువుతూ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తో పూజా కార్యక్రమం మొదలు పెట్టాడు..
రాజేష్ మనసంతా కాత్యాయని మీదే వుంది. పెళ్లి పందిరి అంతటా నిలబడ్డ అమ్మాయిలలో కాత్యాయని ఎక్కడా అనుకుంటూ మెల్లిగా గమనించ సాగాడు.
కానీ ఎక్కడా ఆమెకనిపించ లేదు.
ఇంతలో తన నెవరో చూస్తున్నట్లనిపించి ,కుడి వేపు చూసాడు. అక్కడున్న ఒక పెద్ద స్థంభం పక్కన నిలబడి కాత్యాయని ,రాజేష్ ను చూస్తూ కనిపించింది . అనుకోకుండా ఇద్దరి చూపులు ఒకేసారి కలుసుకున్నాయి.
వెంటనే పక్కకు తప్పుకుని చాటుకు వెళ్ళిపోయింది. రాజేష్ కూడా చటుక్కున తల తిప్పుకుని పెళ్లి కార్యక్రమం వైపు చూస్తున్నట్టు నటించ సాగాడు.
"పెళ్లి ఏర్పాట్లు చాలా బాగా వున్నాయి కదూ" అడిగింది సుజాత కొడుకుని .
అవును అన్నట్లు అన్యమనస్కంగా తల ఊపి , కాత్యాయని కనిపిస్తుందేమో అని చుట్టూ చూడసాగాడు రాజేష్.
కాసేపట్లో మంగళ సూత్ర ధారణ కూడా మొదలైంది. అందరూ లేచి వెళ్లి కొత్త జంట పైన అక్షింతలు వేసి , భోజనాల వైపు వెళ్ళ సాగారు.
" పద.. మనం కూడా కానిచ్చేద్దాం " అని లేచి ముందుకు నడిచాడు రామశర్మ .
పందిరి నిండా చాలా వరుసల్లో టేబుల్స్ ,చైర్స్ వేసి విస్తరాకులు పరిచి ఉంచారు.
ఒక పక్కగా తల్లి తండ్రి ని కూర్చో పెట్టి, తాను కూడా కూర్చున్నాడు రాజేష్.
వడ్డనలు జరుగుతుండగా ఆఖరున నెయ్యి వేస్తున్న కాత్యాయని ని చూసి సంతోషం గా గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు రాజేష్.
తన ముందుకి రాగానే కాత్యాయని కళ్ళలోకి చూసి నవ్వాడు రాజేష్, సిగ్గుతో కళ్ళు దించుకుని , నవ్వు మొహం తో ముందుకి వెళ్లి పోయింది కాత్యాయని. మధ్యలో కొన్ని లడ్డూలు తీసుకొచ్చి రాజేష్ కు బలవంతంగా వడ్డించింది. సంతోషంతోఆమెపనికి ఉబ్బితబ్బిబ్బయ్యాడు రాజేష్.
అది చూసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు రామశర్మ ,సుజాతలు.
భోజనాలయిన తర్వాత మండపం లో కూర్చొని అక్కడ కనిపించిన స్నేహితుల తో బాతాఖాని వేసుకున్నాడు రామ శర్మ. సుజాత చుట్టాలను కలిసి వస్తానని లోనికి వెళ్ళింది.
ఒక్కడికి ఏమీ తోచక తాను కూడా మండపం లో ఎదురుగా వున్నా కుర్చీ పైన కాళ్ళు పెట్టుకుని కూర్చున్నాడు రాజేష్. ఇంతలో కాత్యాయని , రాజేష్ దగ్గరికి వచ్చి " మీరు ఎలా వచ్చారు " అంది.
కంగారుగా లేచి నించున్నాడు రాజేష్. " మా కార్ లోనే వచ్చామండి " అని సమాధానం ఇచ్చాడు చిరు నవ్వుతో.
" మీ తో బాటు నే నుకూడా రావచ్చా, కార్లో ఖాళీ ఉంటేనే సుమండి" అంది కాత్యాయని కాస్త మొహ మాటంగా .
అప్పుడే అక్కడికి వచ్చిన సుజాత అది విని " దానికేం భాగ్యం తల్లీ..ఇంచక్కా రావచ్చు ..ఏ వూరు మీది , ఎక్కడా " అంది .
" మీ ఊరేనండి ..పాలకోడేరు " అంది నమస్కారం చేస్తూ.
" మేం ..ఇంకో అరగంటలో వెళదాం మరి " చెప్పాడు రాజేష్ . పెళ్ళికి వచ్చినందుకు అతని మనసు చాలా సంతోషంగా వుందిఇప్పుడు .
పెళ్లి ఇంట్లో వీడ్కోలు చెప్పి బయలు దేరారు అందరూ. వెనక సీట్లో కూర్చున్న కాత్యాయని
తన కాలేజీ కబుర్లతో సుజాతకు ప్రయాణ సమయం తెలీకుండా చేసింది.
ఊర్లోకి చేరుకునేటప్పటికీ చీకటి పడి పోయింది.
'' ఇదుగోనండీ ఇక్కడే మా ఇల్లు, కొద్దిగా పక్కకు తిప్పండి ''అంటూ కాత్యాయని తనింటి దారి చూపించింది రాజేష్ కు.
ఇంటి ముందు కారు దిగి " రండి ఇంట్లోకి... కాఫీ తాగి వెల్దురు గాని " అని ఆహ్వానించింది కాత్యాయని .
"ఇప్పుడు ఆలస్యమై పోయిందిగా తల్లీ ,ఇంకో మారు వస్తాం.." అని నచ్చ చెప్పింది సుజాత.
కార్ లో నుండీ వెనక్కి చూసి చేయి ఊపాడు రాజేష్. ప్రతిగా చేయి ఊపింది కాత్యాయని .
ఆ రాత్రి కాత్యాయని ఆలోచనలతో నే నిద్ర పోయాడు రాజేష్ .
****
వారం రోజులపాటు రోజూ కాత్యాయని గురించి ఎదురు చూసాడు రాజేష్.
ఒక రోజు మళ్ళీ బ్యాంకు మూసే సమయానికి రాజేష్ ముందు నిలబడి " హలో సర్ గుడ్ ఈవెనింగ్ " అంది కాత్యాయని .
కంప్యూటర్ పని లో మునిగి పోయిన రాజేష్ ఉలిక్కి పడి ఆమెనుచూసాడు. ఎదురుగా నవ్వుతూ నిలబడ్డ కాత్యాయని ని చూసి తత్తర పాటు తో నిలబడి " హలో ..హలో కూర్చోండి " అన్నాడు.
ముందు వున్న కుర్చీలో కూర్చొని " ఈ డబ్బులు అకౌంట్ లో జమ చేయాలి , అందుకే వచ్చాను " అని అలవోకగా సిగ్గుపడుతూ నవ్వింది.
ఆ నవ్వు చూసి ముగ్ధుడైపోయాడు రాజేష్. కన్నార్పకుండా చూస్తున్న రాజేష్ ను చూసి " ఏవండీసర్..కాస్త ఆలస్య మై పోయింది .. అందుకే మీ దగ్గరకు వచ్చాను. పైగా గుడికి వెళ్ళాలి ఇప్పుడు." అంది.
" సరే ఇటివ్వండి. నే చేసి పెడతాను. అన్నట్లు ఇవ్వాళ ఏంటి స్పెషల్ ..గుడికి వెళ్ళటం ?"అన్నాడు
" ఈ నెలంతా వెళతాను .ప్రతీ రోజూ సాయంత్రం లేదా ఉదయం " అంది కాత్యాయని .
తేరిపారా చూసాడు కాత్యాయనిని. పలుచని కాటన్ చీర, జడలో మల్లె పూలు, కంటి నిండుగా కాటుక.,నుదుటన ఎర్రని చిన్న బొట్టు, అర చేతుల కు గోరింటాకు తో మెరుపు తీగలా అనిపించింది ఆమె.
" సార్ మరి నే వెళ్ళనా? ? " అని లేచి నిలబడి అడిగింది.
" కూర్చోండి కాఫీ తీసుకుని వెల్దురు గాని " అని చెప్పి ఆఫీస్ బాయ్ ను పిలిచి " రెండు కాఫీ పంపించు" అన్నాడు.
" మీ నాన్న గారు ఏం చేస్తారు..మీరెంత మంది ? " కుతూహలంగా ప్రశ్నించాడు రాజేష్.
చెప్పసాగింది కాత్యాయని .
ఇంటి విషయాలు , హాబీస్ గురించి మాట్లాడుకుంటూ వుండి పోయారిద్దరు .
సమయం గిర్రున తిరిగి పోయింది.
" అయ్యా ..బాబోయ్ , మీతో కూర్చుంటే టైమే తెలీ లేదు. గుడికి ఆలస్య మై పోయిందీ రోజు . ఇప్పుడేం వెళతాను.. ఇంక.. రేపే వెళ్ళాలి ..వస్తా నండి " అంటూ నవ్వి లేచింది .
" రేపు నేనూ రావడానికి ట్రై చేస్తాను..ఇంతకీ ఏ గుడి ?" అడిగాడు రాజేష్
" రామాలయం ..వస్తారా ? రండి. ఓకే. " అని చెప్పి వెను తిరిగి వెళ్తున్న కాత్యాయని ని చూస్తూ ఈ లోకం మర్చిపోయాడు రాజేష్.
మరుసటి రోజు ఉదయం గుడి కి వెళ్లి కోనేరు వొడ్డున కూర్చుని ,కాత్యాయని తో చాలా సేపు మాట్లాడుతూ వుండిపోయాడు రాజేష్.
అలాగే నెల రోజులు గడిచి పోయాయి.ఎన్నో విషయాలు చర్చించుకున్నారు కున్నారు ఇద్దరూ . .
ఇద్దరి అభిప్రాయాలు ఒకటే లాగా వున్నాయి సుమా అనుకున్నాడు రాజేష్.
జీవితం లో తాను వెతుకుతున్న అమ్మాయి ఇప్పటికి దొరికింది అనుకున్నాడు. మనసంతా గాలిలో తేలిపోతున్నట్టు గా వుంది అతనికి. ఆలస్యం చేయకుండా కాత్యాయని మనసు తెలుసు కోవటం మంచిది అనుకుని ఒక నిశ్చయానికి వచ్చాడు.
ఒక రోజు సాయంకాలం గుడి మెట్ల మీద కూర్చొని " కాత్యాయనీ..ఒకసారి
మీ నాన్నగారిని కలుద్దామనుకుంటున్నాను " అన్నాడు.
" దేని గురించి " కొంటె గా నవ్వింది కాత్యాయని.
" మన గురించే....తమరేమంటారు ?" ఆదుర్ధా గా అడిగాడు రాజేష్.
" మీ ఇష్టం " అంది తల వంచుకుని సిగ్గుతో.
***
ఇంటికి వెళ్లి అమ్మతో అన్ని విషయాలు చెప్పి కాత్యాయని కుటుంబ వివరాలు ఇచ్చాడు రాజేష్. ఎలాంటి అవరోధాలు లేకుండా పెద్దల అంగీకారం తో పెళ్లి నిశ్చయమైంది.
వెంటనే ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు.
రాజేష్ ఆనందానికి అవధుల్లేవు.
ప్రేమించి , నచ్చిన అమ్మాయి తో పెళ్లి విషయం ,పేరు పేరునా స్నేహితులందరికీ తెలియ చేసి ఆహ్వానం పంపాడు..
***
ఆరోజురామాలయం ఆవరణ లో పచ్చటి పందిరి కింద రాజేష్ , కాత్యాయనిల వివాహ వేడుకలు మొదలయ్యాయి.
పెళ్లి పందిరంతా హడావిడి గా వుంది. నాద స్వరం, భజంత్రీలు మోగుతున్నాయి.
ముహూర్త సమయం ఆసన్న మైంది . మంగళ సూత్రం చేతిలోకి తీసుకుని ,పెళ్లి పీటల పై ఎదురుగా కూర్చున్న కాత్యాయని వేపు ఆనందంగా చూసి, భజంత్రీలు బిగ్గరగా మ్రోగుతుండ గా , ముందుకి వంగి కాత్యాయని మెడలో మూడు ముళ్లు వేసాడు రాజేష్.
వెంటనే వారి మీద జల్లులు గా అక్షింతలు కురవడం మొదలైంది. తాను కన్న కలలు నిజమై,ప్రేమించిన అమ్మాయి ని భార్య గా పొందిన సంతోషం అతని మనసు నిండా నిండిపోయింది.
వధూ వరుల బంధువులందరూ ఆ జంట ను ఆశీర్వదించి, వెళ్లి తమ కుర్చీల్లో కూర్చొని మాట్లాడుకో సాగారు.
మంగళ సూత్ర ధారణ కార్యక్రమం అయిపోయిన తర్వాత , కళ్ళలో నీరు పెట్టుకుంటున్న కాత్యాయని తల్లి తండ్రిని చూసి , రామ శర్మ వారి దగ్గరికి వెళ్లి ధైర్యం చెప్పి భుజం తట్టాడు.
కాత్యాయని తండ్రి ఆనందాశ్రువులు తుడుచుకుని " మీ సలహా ప్రకారం అన్నీ చేశాను బావ గారు..ఇక మా అమ్మాయి మీ ఇంటి కోడలు అయిపోయింది. అన్నీ మీరనుకున్నట్లు గానే జరిగాయి. " అన్నాడు రామశర్మ చేతులు పట్టుకుని.
" పిల్లలు సంతోషంగా ఉంటే మనక్కావలిసిందేముంది బావగారు ...మనం చెప్పినట్లు కాత్యాయని నా సలహా పాటించింది. అమ్మాయి గొప్ప తెలివైనదే " అన్నాడు నవ్వుతూ రామశర్మ.
" మీ సంబంధం మాకు పూర్తిగా నచ్చింది అన్నయ్య గారు . పెళ్లి చూపులకు అబ్బాయి ఒప్పుకోవటం లేదాయె.. మీరు ఆ సమయానికి ఇచ్చిన సలహా తో కాత్యాయని ని బ్యాంకు కు, అగ్రహారం పెళ్ళికి, గుడికి పంపాము. దేవుని దయతో అంతా సవ్యంగా జరిగింది. " అంది తృప్తిగా కాత్యాయని తల్లి.
" మరేం చెయ్యాలమ్మా..మా వాడు ప్రేమించే పెళ్లి అన్నాడు...తప్ప లేదు ,అందుకే ఇవన్నీ అలా చేయాల్సి వచ్చింది. ఇది ఏమైనా కాత్యాయని సాధించిన గెలుపు " అన్నాడు రామ శర్మ.
అందరూ తృప్తిగా సంతోషంగా పెళ్లి పందిరి వైపు చూసారు .
అక్కడ రాజేష్ , కాత్యాయని, పోటీ మీద పోటీగా తలంబ్రాలు నెత్తిన పోసుకుంటూ ఉండటం కనిపించింది.
మనస్ఫూర్తిగా దీవించారు పెద్దలందరు .
అసలు విషయం తెలియని రాజేష్ స్నేహితులందరూ, రాజేష్ ను చూసి కాస్త ఈర్ష్య తో 'మొత్తానికి అనుకున్నది సాధించాడు మనక్కూడా ఇలా ప్రేమ వివాహం జరిగితే బావుంటుందనుకుంటూ', భోజనాల వేపు కదిలారు.
**