భాగవత కథలు -28 శ్రీకృష్ణుని సుతల వైకుంఠ లోకాల పర్యటన - కందుల నాగేశ్వరరావు

Srikrishnuni sutala vaikuntha lokala paryatana

భాగవత కథలు -28

శ్రీకృష్ణుని సుతల వైకుంఠ లోకాల పర్యటన

శ్రీకృష్ణుడుతల్లి దేవకి కోరిక తీర్చుటకు సుతలలోకం వెళ్ళుట:

ద్వారకా నగరంలో బలరామకృష్ణులు, దేవకీ వసుదేవులు మిగిలిన యాదవులందరితో కలిసి ఆనందంగా కాలం గడుపుతున్నారు. ఆ సమయంలో పూర్వం బలరామకృష్ణులు సముద్రంలో పడిపోయిన తమ గురుపుత్రుణ్ణి మరల తెచ్చియిచ్చిన విషయం,ప్రజలు చెప్పుకుంటూ ఉండగా దేవకీదేవి విన్నది. కంసుని చెఱశాలలో కంసుని చేత వధింపబడ్డ తన బిడ్డలు గుర్తుకు వచ్చారు. వారిని చూడాలని కోరిక కలిగింది.

ఆమె బలరామకృష్ణుల వద్దకు వచ్చి వారిని పలు విధాలుగా పొగిడింది. “పాపాత్ములైన ముర, కంస, శిశుపాల, పౌండ్రక వాసుదేవ, నరక, జరాసందాది రాజులను సంహరించి భూభాగాన్ని తగ్గించారు.సృష్టి స్థితి లయాలు అన్నీ మీ లీలావిలాసాలు. మీరు పూర్వం మృతుడై యమలోకంలో ఉన్న మీ గురుపుత్రుణ్ణి తెచ్చి గురుదక్షిణగా సమర్పించారు. అలాగే కంసుడు చంపిన నా బిడ్డల్ని తెచ్చి నాకు చూపించండి” అని శోకిస్తూ ప్రార్థించింది.

బలరామకృష్ణులు తల్లి కోరిక నెరవేర్చడానికి సుతల లోకానికి వెళ్లారు. సుతలలోక నివాసియైన బలిచక్రవర్తి చక్రధరుడైన కృష్ణుణ్ణి, హలధరుడైన బలరాముణ్ణీ చూశాడు. బలిచక్రవర్తి తన ఆప్తులతో కలిసి ఎదురేగి వారికి స్వాగతం చెప్పాడు. వారిని తగిన ఆసనాలపై కూర్చుండబెట్టి వారి పాదాలు కడిగి పాదజలం తన శిరస్సుపై జల్లుకున్నాడు.పళ్ళు పాయసం మొదలైన నైవేద్యాలను; రకరకాల ఆభరణాలను. సమర్పించాడు. చేతులు జోడించి నమస్కరించి శ్రీకృష్ణుని ఎన్నో విధాలుగా స్తుతించాడు.

“నీ కృప వలన సంసార సాగరాన్ని దాటగలిగాను. ముక్తి సాధనాన్ని చూడగలిగాను. నీవు నా మందిరానికి విచ్చేశావు. నా జన్మ ధన్యమయ్యింది. స్వామీ నేను నీ దాసుణ్ణి. మీ ఆజ్ఞకు బద్దుణ్ణి. మీరు ఇక్కడకు వచ్చిన పని తెలపండి” అని బలిచక్రవర్తి చేతులు జోడించి భక్తితో విన్నవించాడు.

కృష్ణుడు సంతోషించి దానవేంద్రునితో “పూర్వం ఆదియుగంలో మరీచి భార్య యైన వర్ష అనే స్రీకి ఆరుగురు కుమారులు పుట్టారు. ఒకనాడు బ్రహ్మ తన పుత్రికను కామించి శృంగారానికి ఉపక్రమించడం చూసి వారు బ్రహ్మను పరిహసించారు. బ్రహ్మకు కోపం వచ్చి రాక్షసులుగా జన్మించండని వారిని శపించాడు. శాపవశంగా వారు హిరణ్యకశిపుని కుమారులుగా పుట్టారు. ఆ జన్మ తరువాత దేవతల హితం కొరకు యోగమాయాదేవి వారిని దేవకి గర్భంలో ప్రవేశ పెట్టింది. వారు పుట్టిన వెంటనే కంసుడు వారిని సంహరించాడు. మా అమ్మ దేవకీదేవి పుత్ర శోకంతో కుమిలిపోతూ వారిని చూడాలని కోరింది. ఆమె పంపగా మేము ఇచ్చటకి వచ్చాము. ఇక్కడ నీదగ్గర సుఖంగా ఉన్న వీరే ఆమె పుత్రులు. తరువాత నా అనుగ్రహం వల్ల పుణ్యలోకాలు లభిస్తాయి” అని తమ రాకకు కారణం వివరించాడు.

ఈ విధంగా పలికి బలిచక్రవర్తి అనుమతితో దేవకీ కుమారులను తీసుకొని భూలోకానికి వచ్చాడు. “అమ్మా, వీరే నీ పుత్రులు చూడు” అని బలరామకృష్ణులు దేవకీదేవికి చూపించాడు. ఆమె ఆనందంతో నా కన్నబిడ్డలు వచ్చారా అంటూ వారిని కౌగలించుకుని లాలించింది. వారికి ప్రేమతో చనుబాలిచ్చింది. వారు వైష్ణవమాయా ప్రభావంతో తల్లిపాలు త్రాగారు. దేవకీదేవి పుత్రశోకం నుండి విముక్తురా లయ్యింది. ఆ కుమారులు శ్రీకృష్ణుడి స్పర్శతో బ్రహ్మశాపం నుండి విముక్తి పొంది తమ నిజరూపాలు ధరించి తమ తమ స్థానాలు చేరుకున్నారు.

కృష్ణార్జునులు వైకుంఠంలో శ్రీహరిని దర్శించుట:

శ్రీకృష్ణుడు కుశస్థలిలో సుఖంగా ఉంటున్న రోజులలో ఒక బ్రాహ్మణుని భార్యకు కుమారుడు పట్టి, పుట్టగానే చనిపోయాడు. ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ కుమారుని శవాన్ని ఎత్తుకొని కృష్ణుని మందిరం దగ్గరకు వచ్చాడు. ఆ బాలుని శవాన్ని రాజద్వారం దగ్గరే ఉంచి విధిని నిందిస్తూ, తనను తాను తిట్టుకుంటూ దుఃఖింపసాగాడు. అలా శోకంతో కుమిలిపోతున్న ఆ బ్రాహ్మణుడు అక్కడి ప్రజలతో “ఆచారాలు పాటించకుండా రాజు చేసిన పాపం వల్ల నా పుత్రుడు పుట్టిన వెంటనే చనిపోయారు. న్యాయమార్గం వదలిపెట్టి ఇంద్రియాలకు బానిస అయిన రాజు పాలించే రాజ్యంలో ప్రజలు కష్టాలు పడుతూనే ఉంటారు” అని చెప్పుతూ ఏడుస్తూ ఎక్కడినుండి వెళ్ళిపోయాడు.

ఇదే విధంగా తనకు పుట్టిన బిడ్డలు వరుసగా చనిపోగా వారిని కూడా తెచ్చి రాజమందిర ద్వారం దగ్గర పెట్టి ఏడుస్తూ మునుపటిలాగే తిట్టి వెళ్ళిపోతూ ఉండేవాడు. అతనికి అలా ఎనమండుగురు కొడుకులు పుట్టి చనిపోయారు. తొమ్మిదవ కొడుకుకూడా పుట్టగానే చనిపోగా వాని శవాన్ని తెచ్చి ఏడుస్తున్న బ్రాహ్మణుణ్ణి అర్జునుడు చూసాడు. అర్జునుడు ఆ బ్రాహ్మణుడితో “ అయ్యా, నీవు దుఃఖిస్తుంటే చూచి ఈ అన్యాయాన్ని ఆపగలిగే విలుకాడు ఒక్కడు కూడా ఈ నగరం లేడా? ఇది మహా పాపం. నీ కుమారుణ్ణి నేను బ్రతికిస్తాను. అలా చేయలేకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను ”అని అందరూ ఆశ్చర్యపోయేటట్లుగా అన్నాడు.

ఆ మాటలు విని బ్రాహ్మణుడు “అయ్యా, ఇలాంటి అనుచితమైన పలుకులు దేనికి? బలశాలురైన బలరామకృష్ణులు ఉన్నారు. ప్రద్యుమ్నాదు లున్నారు. బలం గలిగిన యాదవ వీరులు ఎందరో ఉన్నారు. వారు చేయలేని పని నీకు ఎక్కడ సాధ్యమవుతుంది. నీ దారిని నువ్వు వెళ్ళు” అన్నాడు.

బ్రాహ్మణుడి మాటలకు అర్జునుని మనస్సులో దురహంకారం చెలరేగింది. అతడు విప్రుణ్ణి చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ వినేటట్లు “నేను కృష్ణుణ్ణి కాను, ప్రద్యుమ్నుణ్ణీ కాను, అతని కొడుకు అనిరుద్ధుణ్ణీ కాను. నేను యుద్ధంలో గాండీవంతో వాడి బాణాలు వేసి శత్రువులను చీల్చి చెండాడే మహా పరాక్రమం కలిగిన అర్జునుణ్ణి. అంతేకాదు. ఆ పరమశివుణ్ణే భుజబలంతో ఎదిరించి పోరాడిన నేనెవరో నీకు తెలియదా? ఇప్పుడే వెళ్ళి మృత్యుదేవత పొగరు అణచి నీ బిడ్డలను తెస్తాను” అని రోషంతో పలికాడు.

అర్జునుడి మాటలతో బ్రాహ్మణుడికి నమ్మకం కుదిరింది. అర్జునుణ్ణి పొగుడుతూ ఆ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్లాడు. కొన్ని రోజులు గడిచాయి. అతని భార్యకు మరల ప్రసవవేదన మొదలైంది. వెంటనే వచ్చి పార్థునికి ఈ విషయం చెప్పాడు. అర్జునుడు శివుడికి మనస్సులో నమస్కరించాడు. మంత్ర దేవతలను మనస్సులో తలుచుకొని గాండీవాన్ని ఎక్కుపెట్టి పట్టుకున్నాడు.

బ్రాహ్మణుని వెంట వెళ్ళి ప్రసవ మందిరం చుట్టూ బాణాలతో కప్పేసాడు. ప్రసూతి గృహ ద్వారం దగ్గర కావలి కాస్తూ ఉన్నాడు. అప్పుడా బ్రాహ్మణుడి భార్యకు మగపిల్లవాడు పుట్టాడు. పుట్టిన బిడ్డ శరీరంతో సహా ఆకాశంలోకి అదృశ్యమైపోయాడు. బ్రాహ్మణుడు ఏడుస్తూ కృష్ణుడి దగ్గరకు వచ్చాడు.కృష్ణుడి సమక్షంలో నిలబడి “ముకుందా, నా విన్నపాన్ని ఆలకించు. అర్జునుని మాటలు నమ్మి నేను మరొక పుత్రుని పోగొట్టుకున్నాను. నన్ను నేనే నిందించు కోవాలి. విశ్వ సృష్టి స్థితి లయాలకుకారకుడవైన నీవు కాక ఒక మానవమాత్రుడు ఈ మహాకార్యం చేయ గలడా? ఈ అర్జునుడు ఒక విలుకాడా! అతని వద్ద నిజంగా దివ్యాస్త్రాలు ఉన్నాయా!” అంటూ అర్జునుని నిందించ సాగాడు.

ఈ మాటలు విన్న అర్జునుడు కోపించి తన విద్యాప్రభావంతో వెంటనే బయలుదేరి యముని మందిరానికి వెళ్లాడు. అక్కడ అతనికి బ్రాహ్మణ కుమారులు కనపడలేదు. అక్కడ నుండి పార్థుడు ఇంద్రుడు, అగ్ని, వాయువు, కుబేరుడు మొదలైన దేవతల మందిరాలకు వెళ్లాడు. కాని అక్కడ ఎక్కడా అతనికి విప్ర పుత్రులు కనపడలేదు. తరువాత యక్ష, కిన్నెర, నాగ, సిద్ధ, రాక్షస లోకాలన్నీ వెదికాడు. కాని వారి జాడ తెలియ లేదు. చివరకు భూలోకానికి వచ్చి తను చేసిన ప్రతిజ్ఞ ప్రకారం అగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధమైనాడు.

శ్రీకృష్ణుడికి ఈ సంగతి తెలిసి వెంటనే అక్కడికి వచ్చాడు. అర్జునునితో నీకు మృత కుమారులను చూపిస్తాను నాతో రమ్మని మంటల్లో దూకకుండా ఆపాడు. శ్రీకృష్ణుడు అర్జునుని తీసుకొని దివ్యరత్న కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న తన రథం అథిరోహించి బ్రాహ్మణకుమారులను వెదుకుటకు బయలుదేరాడు. కృష్ణునిరథం మహావేగంతో పట్టణాలు, పల్లెలు, అరణ్యాలు, పర్వతాలు, నదులు, దీవులు, సప్త సముద్రాలు, చివరకు మేరుపర్వతంకూడా దాటి ముందుకు సాగి పోయింది.

ఆ రథం దట్టమైన చీకటి మండలాన్ని సమీపించింది. వారు ధైర్యంగా ఇంకా ముందుకు వెళ్లారు. చీకటి మరింత భయంకరంగా ఉంది. కళ్ళకుఏమీ కనపడటం లేదు. గుర్రాలు కూడా దారి తప్పి నిలబడిపోయాయి. అప్పుడు శ్రీకృష్ణుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ చక్రం బాల సూర్యుడి వంటి కాంతితో ముందుకు దూసుకుపోతుంటే ఆ వెలుగులో అతివేగంగా రథాన్ని నడిపించకుంటూ వెళ్ళి ఆ కటిక చీకటిని దాటారు. అప్పుడు వారి కళ్ళు మిరుమిట్లు కొలిపే మహాతేజం కనపడింది. దాన్ని చూసి అర్జునుడు భయంతో కళ్ళు మూసుకున్నాడు. ఇంకొంత దూరం ముందుకు వెళ్ళాక ప్రచండ వాయువేగం వల్ల లేచి పడుతున్న కెరటాలతో ఉన్న అనంత జలరాశిని కృష్ణార్జునులు ప్రవేశించారు. ఆ తేజోమయ జలరాశి మధ్యలో అందమైన మణులు పొదిగిన బంగారు స్థంభాలతో, వ్రేలాడుతున్న రత్నహారాలతో అలంకరించబడి అనంత తేజంతో ప్రకాశిస్తున్న ఒకానొక దివ్యభవనం కనపడింది.

ఆ భవనం మహోన్నతంగా, సూర్య చంద్రుల కిరణాలు కూడా ప్రవేశించలేక, పరమ యోగులకు మాత్రమే ప్రవేశయోగ్యంగా ఉంది. అటువంటి దివ్యభవనంలో పద్మరాగమణులతో కూడిన పడగలతో విషధూమరేఖల వంటి నాలుకలు కలిగి వెండి కొండలా ఉన్న ఆదిశేషుడు వారికి కనిపించాడు. ఆ ఆదిశేషుని పాన్పు మీద సుఖంగా ఆసీనుడై ఉన్న తేజోమూర్తిని కృష్ణార్జునులు దర్శించారు. నీలమేఘశ్యాముడు, ఆశ్రితజన రక్షకుడూ, లక్ష్మీ మనోహరుడు, పీతాంబర ధరుడూ, హార కేయూర కటక కంకణ కరీటాలను ధరించినవాడూ అయిన మహావిష్ణువును వారు చూచారు.శ్రీదేవి భూదేవితో కూడిన ఆ శ్రీమన్నారాయణునికి శ్రీకృష్ణార్జునులు భక్తితో సాష్టాంగపడి చేతులు జోడించి నమస్కరించారు.

ఆ ఆదిదేవుడు వారిని దయతో చూసి చిరునవ్వుతో ఇలా అన్నాడు. “భూమికి భారమైన రాక్షసులను సంహరించడానికి మీరిద్దరూ నా అంశతో నరనారాయణులుగా అవతరించారు. అఖండ దీక్షతో ఉన్న మిమ్ములను చూడాలని వైకుంఠంలో నివసిస్తున్న మునీశ్వరులు కోరారు. అందుకొరకు మీరు ఇక్కడకు రావాలనే ఉద్దేశంతో ఆ బ్రాహ్మణ కుమారులను ఇక్కడకు తెప్పించ వలసి వచ్చింది. ఆ బాలకులను మీరు తీసుకొని వెళ్ళండి”.శ్రీమహావిష్ణువు అలా చెప్పి ఆ బాలకులను ఇచ్చికృష్ణార్జునులకు వీడ్కోలు చెప్పాడు. వారు వినయంతో భగసవంతుణ్ణి పలు విధాల స్తుతించి అక్కడ నుండి బయలుదేరారు.

కృష్ణార్జునులు వారు తలపెట్టిన కార్యం సక్రమంగా పూర్తి అయినందుకు సంతోషించారు. ఆ బ్రాహ్మణ కుమారులను వెంట పెట్టుకొని, వారి వయస్సులకు తగ్గ ఆకారాలతో వారిని ఆ బ్రాహ్మణునికి అప్పగించారు. ఆ బిడ్డలను చూసి ఆ విప్రుడు ఎంతో సంతోషించాడు. ఇంద్రకుమారుడూ, పరాక్రమవంతుడూ అయిన అర్జునుడు శ్రీకృష్ణుడితో వైకుంఠం వెళ్ళి శ్రీమన్నారాయణుని దర్శించినందుకు ఆనందించి మనస్సులోనే పలుమార్లు స్తుతించాడు. పరమానందంతో కృష్ణుడి పాదాలకు నమస్కరించి ఆయనను కీర్తించాడు.

శ్రీకృష్ణుడు సమస్త ప్రజలనూ సంరక్షిస్తూ, దుర్మార్గులను సంహరిస్తూ, ధర్మాన్ని సంస్థాపించుతూ ద్వారకలో శుభసంతోషాలతో ప్రకాశించాడు.

*శుభం*

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు