420 - మద్దూరి నరసింహమూర్తి

420

అది ఒక పెద్ద హోటల్. అందులోకి, ప్రవేశిస్తున్నారు ఇద్దరు స్నేహితులు - నారాయణ మరియు శేఖర్.

నారాయణకు ఉద్యోగం వచ్చి మొదటి జీతం అందుకున్న తదుపరి, పార్టీ ఇమ్మని శేఖర్ ఇక్కడకు తీసుకొని వస్తాడు.

వారు టేబుల్ దగ్గర కూర్చున్న తరువాత, ఒక అటెండర్ మెనూ పట్టుకొని వస్తాడు.

నారాయణ : “ఇదేమిట్రా శేఖర్, ఇంత పెద్ద హోటల్ కి తెచ్చేవు. నా జీతమంతా ఈ ఒక్కరోజు పార్టీకే ఖర్చు పెట్టించేస్తావా ఏమిటి”

శేఖర్ : “నారాయణా, నీకెప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచన, ఆందోళనే. ఉద్యోగం వచ్చి మొదటి జీతం అందుకున్న నువ్వు ఎంతో హుషారుగా జల్సాగా ఉండాలి.

‘నిన్న పోనే పోయింది, రేపు వస్తుందో లేదో తెలీదు, కాబట్టి ఈ రోజు పూర్తిగా హాయిగా జీవించు’ అన్నాడో పెద్ద మనిషి.”

నారాయణ : “అలాగని, ఈ పెద్ద హోటల్ లో జేబు పూర్తిగా ఖాళీ చేసుకోమంటావా”

శేఖర్ : “అనవసరంగా గాభరా పడకు. మనం ఎప్పుడు వెళ్లే హోటల్ లో తినేదే ఇక్కడ కూడా తిందాం. అక్కడ మన ఇద్దరికీ 200 రూపాయలు అయేది, ఇక్కడ మహా అయితే 300 రూపాయలు అవొచ్చు.”

ఇంతలో అటెండర్ వచ్చి, మెనూ టేబుల్ మీద ఉంచి, నవ్వుతూ సౌమ్యంగా "మా హోటల్ కి స్వాగతం సార్.

మెనూ చూసి ఏమి కావాలో చెప్తే, పంపిస్తాను.”

శేఖర్ : “ఇంత పెద్ద హోటల్ లో వెరైటీగా ఏమేనా దొరుకుతాయా, లేక అన్ని హోటల్స్ లో ఉన్నట్టుగానేనా."

అటెండర్ : “ఉంది సార్. మీరు మెనూ చూస్తే తెలుస్తుంది"

శేఖర్ : (మెనూ చూసి) “ఇదేమిటయ్యా ఐటెంల ఎదురుగుండా తూనికలు కొలతలు ఉన్నాయి తప్పితే, ఏ ఒక్క ఐటెం ఎదురుగుండా వాటి ధరలు లేవేమిటీ"

అటెండర్ : "అన్ని ఐటెంలు - మెనూలో ఉన్న కొలతలతో తూకాలతో సర్వ్ చేస్తాం సార్. అదే మా వెరైటీ. మెనూలో ఐటెం ఎదురుగా ధరలు లేకపోతే, కస్టమర్లు డబ్బు గురించి ఆలోచించక, ఎంచక్కా వారికి కావలసినవి ఆర్డర్ చేసి, బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు అన్నది మా అనుభవం సార్."

నారాయణ : “తిన్న తరువాత బిల్లు చూసి ఏడుస్తారు కాబోలు"

శేఖర్ : “మా ఇద్దరికీ రెండు ప్లేట్ ఇడ్లీ తెప్పించు.”

అటెండర్ : “ఎలాటి ఇడ్లీ కావాలి సార్.”

నారాయణ : “ఇడ్లీ అంటే ఇడ్లీవే. ఎలాటి ఇడ్లీ అంటావేంటయ్యా”

అటెండర్ : “ఇడ్లీలో ఎన్నో వెరైటీ లు ఉన్నాయి సార్.”

నారాయణ : "ఏమిటోయి ఆ రకరకాలు"

అటెండర్ : “ప్లేయిన్ ఇడ్లీ, తట్టే ఇడ్లీ, మల్లె ఇడ్లీ. రవ్వ ఇడ్లీ, బటన్ ఇడ్లీ, బటర్ ఇడ్లీ, చీజ్ ఇడ్లీ, ఘీ ఇడ్లీ, ఇడ్లీ విత్ సాంబార్, ఇడ్లీ విత్ రసం, సాంబార్ డిప్పుడు ఇడ్లీ, రసం డిప్పుడు ఇడ్లీ, ఇడ్లీ విత్ చట్నీ ఓన్లీ , చట్నీ డిప్పుడు ఇడ్లీ – మీకు ఏది కావాలి సార్.”

నారాయణ : “ఆ లిస్ట్ వింటూంటేనే మూర్ఛ వస్తొందయ్యా. ఇంతకీ ప్లేయిన్ ఇడ్లీ ఒక ప్లేట్ ఎంతేమిటి”

అటెండర్ : “ఐటమ్స్ సర్వ్ చేయకుండా, ధరలు చెప్పకూడదన్నది మా హోటల్ లో ఉన్న పెద్ద నియమం సార్. అయితే, ఒక విషయం చెప్పగలను. మా హోటల్ లో ఏ సింగల్ ఐటెం కూడా వంద రూపాయలకి తక్కువ లేక పోవడమే మా హోటల్ కి ఉన్న ప్రెస్టేజ్. అలాగే, ఐటెంతో వచ్చే ఏ ఆక్సిస్సోరీస్ కూడా పాతిక రూపాయలకి తక్కువ లేదు సార్"

శేఖర్ : “పూరిలో కూడా వెరైటీ ఉందా”

అటెండర్ : “ఎందుకు లేదు సార్. గోధుమపిండి పూరీ, మైదాపిండి పూరీ, ఆయిల్ పూరీ, ఘీ పూరీ, ఉల్లిపాయల కూరతో పూరీ, బంగాళా దుంపల కూరతో పూరీ, రెండూ కలిసిన కూరతో పూరీ, కుర్మాతో పూరీ - మీకు ఏది కావాలో చెప్పండి సార్.”

నారాయణ : “మరి, దోసెలో ఏం వెరైటీ ఉంది”

అటెండర్ : “ప్లేయిన్ దోసె, మసాలా దోసె, రవ్వ దోసె, ఉల్లి దోసె, ఉల్లి మసాలా దోసె, పేపర్ దోసె, ఘీ తో కాల్చిన దోసె, బటర్ తో కాల్చిన దోసె, రోస్ట్ గా కాల్చాలా వద్దా - ఎలా కావాలో, ఏది కావాలో చెప్పండి సార్.”

నారాయణ : “అవేమీ వద్దు కానీ, ఒక కాఫీ వన్ బై టు పంపించవయ్యా.”

అటెండర్ : “మా హోటల్ లో వన్ బై టు సిస్టం లేదు సార్.”

శేఖర్ : “అలా ఐతే, మా ఇద్దరికీ చెరో కాఫీ పంపించవయ్యా.”

అటెండర్ : “అలాగే సార్. కాఫీ లోకి ఆవు పాలా, గేదె పాలా, మేక పాలా, లేక ఒంటె పాలా, ఇవేమీ కాక మిల్క్ పౌడరా - ఏది కావాలి సార్. కాఫీలో కలుపుకుందికి వైట్ షుగరా, బ్రౌన్ షుగరా, లేక షుగర్ బౌల్స్ కావాలా. ప్యూర్ కాఫీ పొడి తో చేసిన డికాక్షనా లేక చికోరీ కాఫీతో చేసిన డికాక్షనా. ఏది కావాలి సార్. కాఫీ హాట్ గా ఉండాలా, కోల్డ్ గా ఉండాలా - ఎలా కావాలో చెప్పండి సార్.

నారాయణ : “ఈ గొడవంతా మేము పడలేము, మాకేమీ వద్దు బాబూ, పద శేఖర్ పోదాం.”

అటెండర్ : “నేను రెండు నిమిషాలలో వస్తాను. కూర్చోండి సార్.”

రెండు నిమిషాల తరువాత వచ్చిన అటెండర్ బిల్ పట్టుకొచ్చి ఇచ్చేడు.

నారాయణ : “ఇదేమిటయ్యా, మేమేమీ తినని దానికి బిల్ ఏమిటి?”

అటెండర్ : “బిల్ సరిగ్గా చూడండి సార్. అందులో మీరేమీ తిన్నట్టుగా లేదు.”

శేఖర్ : (బిల్ మరోసారి చూసి) – “ఇదేమిటయ్యా, బ్లాంక్ ఆర్డర్ చార్జెస్ 200 రూపాయలు, కూలింగ్ చార్జెస్ 200 రూపాయలు - కలిపి 400 రూపాయలకి బిల్ ఏమిటి? పైగా దాని మీద 5 శాతం టాక్స్ కలిపి, మొత్తం 420 రూపాయలా. ఏమిటి ఈ దోపిడీ. మీ మేనేజర్ ని పిలు.”

అటెండర్ : "అలాగే పిలుస్తాను సార్. ఆయనతో కూడా మీరు ఏదేనా డిస్కస్ చేసి, ఏమీ తినకపోతే, బిల్లు ఇంకొంచెం పెరుగుతుంది. ఆ పైన మీ ఇష్టం.

నారాయణ : "మేనేజర్ ని పిలవొద్దులే. బ్లాంక్ ఆర్డర్ చార్జెస్, కూలింగ్ చార్జెస్ ఎలా డిసైడ్ చేసేరయ్యా"

అటెండర్ : " ఏమీ తినకుండా తాగకుండా మీరు నాతో అరగంట పైన డిస్కస్ చేసి, మా కూలింగ్ సిస్టం అనుభవించేరు. అందుకే, ఆ రెండింటికి, మీ ఒక్కొక్కరికి వంద రూపాయల లెక్కన బిల్లు చేసేము. మీరు అరగంట పైగా మా కూలింగ్ సిస్టం అనుభవిస్తూ నాతో డిస్కస్ చేసినా, మీ మీద గౌరవంతో అరగంటకి మాత్రమే చార్జెస్ చేసేము సార్."

శేఖర్ : "మేము ఈ బిల్లు పే చేయకుండా వెళ్ళిపోతే ఏం చేయగలరోయ్ మీరు"

అటెండర్ : "అలా వెళ్ళలేరు సార్. పే చేసిన బిల్లు గేట్ దగ్గరున్న సెక్యూరిటీకి చూపించి, అతను దాన్ని పంచ్ చేసిన తరువాతే, సెన్సర్ సిస్టం తో లాక్ అయిన హోటల్ తలుపులు తెరుచుకుంటాయి సార్. మీరు ఇంకా డిస్కషన్స్ పొడిగిస్తే, ఈ బిల్ మార్చి, కొత్త బిల్ తేవలసి ఉంటుంది. అది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది."

నారాయణ : "ఏమక్కరలేదు. ఇగో బిల్లు అమౌంట్ 420 రూపాయలు పే చేస్తున్నాము. తీసుకో. మా ఉసురు తగలకపోదు మీ హోటల్ కి"

అటెండర్ : "వెళ్లి, మళ్ళా రండి సార్"

నారాయణ & శేఖర్ (ఏక కాలంలో): "మళ్ళా రావడం కూడానా !"

**********

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు