చిట్టతూరులో చిన్మయానంద అనే రుషీశ్వరుడు వుండేవాడు.అతను మిక్కలి దైవభక్తి కలిగిన వాడు. కొంతకాలం క్రితం అతని దైవబలంకి మెచ్చి ఓ సాధువు అతనికి సంకల్ప సిద్ధివరం ప్రసాదించాడు. దీన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా సమాజ శ్రేయస్సుకు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అంతర్థానమయ్యాడు.
చిన్మయానంద ఊరూరు తిరుగుతూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ దీర్ఘకాల వ్యాధులకు తన సంకల్ప సిద్ధి వరంతో నయంచేసి అరాధ్యుడయ్యాడు.
ప్రజలు ఇచ్చే చిరుకానుకలు తిరస్కరించి సమాజ సేవ చేస్తూ కొందరు ధన వంతులు ప్రీతిపాత్రంతో ఇచ్చే చిరుకానుకలతో చిన్మయానంద పెద్ద ధనవంతుడయ్యాడు. అయితే ఆయన ఆ కానుకలను పోగుచేసి నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చి తన ఉదారతను చాటుకుని సమాజ సేవకుడనే బిరుదును ప్రభుత్వం చేతుల మీదుగా పొంది అవార్డు స్వీకరించాడు. ఈ కారణంగా పెద్ద నాయకులు, ప్రజలు ఆయన చుట్టూ తిరుగుతూ తమ సమస్యలు పరిష్కరించుకునేవారు.
ఎవరికి ఏ సమస్య వచ్చినా చిన్మయానంద ముఖంలో తరగని చిరునవ్వుతో క్షణంలో పరిష్కరించి వారి ముఖాల్లో ఆనందపు వెలుగులు ప్రత్యక్షం చేసేవాడు. ప్రజలు చిన్మయానందను దైవ దూతగా కొలిచేవారు.
ఓ రోజు సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో సమీప నదిలో చిన్మయానంద సంధ్యా వందనం చేసుకుని వస్తుండగా అతని ఆశ్రమం వద్దకు ఓ దొంగ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చిన అతని శరీరంపై రక్తపు గాయాలు వున్నాయి.
‘‘ ఎవరు నాయనా.. నువ్వు..?ఇటు వచ్చావు..? ఏమిటి నీ సమస్య?’’ అడిగాడు చిన్మయానంద.
దొంగ ముఖంలో దు:ఖపు ఛాయలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
‘‘ స్వామీ నేను ఓ గజదొంగను...ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాను..భార్యాబిడ్డలు కలవాడిని.. ఇప్పుడు ఓ రాజకీయ నాయకుడి భార్య మెడలో ఖరీదైన హారం కాజేస్తుండగా అదే దారిలో వస్తున్న పోలీసు వ్యాను నన్ను వెంబడిరచింది.. పరిగెత్తుకుని ఇటు వచ్చా..మీరు దయకల వారని విన్నాను..పోలీసులకు దొరికితే జైలు కెళ్లాల్సి వస్తుంది.. నా భార్యా బిడ్డలు అనాథలు అవుతారు..దయచేసి నన్ను రక్షించండి..’’ చేతులు జోడిం చాడు దొంగ.
చిన్మయానంద దివ్య దృష్టితో చూశాడు. వెనుక పరిగెత్తుకొస్తున్న పోలీసులను గమనించాడు. వెంటనే దొంగను ఎలుకగా మార్చాడు. దొంగ రూపంలో వున్న ఎలుక సమీపంలోని కలుగులోకి వెళ్లి దాక్కుంది. అప్పటికే పోలీసులు అక్కడికి వచ్చారు. ‘‘ స్వామీ ఇటు ఓ దొంగ వచ్చాడు.. మీరేమైనా చూశారా? చూస్తే కాస్త చెప్పండి..మాకు దొరక్కుండా పారిపోయి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు..’ అన్నారు.
‘‘ ఇటు ఎవరూ రాలేదు.. అలాంటి వారు ఎవరైనా కన్పిస్తే మీకు వెంటనే తెలుపుతాను సార్..’’ అన్నాడు చిన్మయానంద. పోలీసులకు అనుమానం వచ్చింది. ఆశ్రమం లోకి అణువు అణువు గాలించారు. దొంగ ఎక్కడా కన్పించలేదు. అయినా ఆశ్రమంలోకి వచ్చిన దొంగను మాయచేసి కంటికి కన్పించకుండా చేశాడని కోపంతో చూస్తూ వెనుదిరిగారు పోలీసులు.
చిన్మయానంద కాస్త వణికాడు. అయినా చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు తన దేహంలో కదలికలను లోనే దాచుకున్నాడు. వారు వెళ్లి పోగానే ముప్పు తప్పిందన్న ఆనందంలో అన్ని మరిచి ధ్యానంలో నిమగ్నమయ్యాడు.
వారం రోజులు దాటింది. చిన్మయానంద ఎలుక రూపంలో ఉన్న గజదొంగ విషయాన్ని మరిచిపోయాడు.
ఎలుక రూపంలో వున్న గజదొంగ తన పూర్వ జన్మ వాసనల ఫలితంగా దొంగతనం అలవాటును మానుకోలేదు. ఎలుక నిదానంగా తన కలుగును దాటి పక్కనే వున్న ఇళ్లలోకి ప్రవేశించి తినే పదార్థం పప్పులు, బియ్యం, కూరగాయలు తిని చిందర వందర చేయసాగింది. అది గమనించిన ఇంటి యజమానులు దాన్ని గమనించసాగారు.
ఓ రోజు ఎలుక బంగారు ఆభరణం మాయం చేసి లాక్కెళ్లి చిన్మయానంద ఆశ్రమంలోని తన కలుగులో దాచింది. మరో రోజు ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో బంగారు చైనును మాయం చేసి తన కలుగులో దాచింది. ఇంటి యజమానులు దిక్కు తోచక ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సంఘటన స్థలంలో క్లూస్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ ప్రత్యక్షమైంది. డాగ్ స్క్వాడ్ దొంగతనం ప్రదేశం నుంచి బయటకు వెళ్లి చిన్మయానంద ఆశ్రమం వైపు నడిచింది. అందరూ ఆశ్చ్యంతో వెనుకే నడిచారు. ఆ డాగ్ సరాసరి ధ్యానంలో నిమగ్నమైన చిన్మయానంద వద్దకు నడిచింది. అతడి చుట్టూ తిరిగి నెమ్మదిగా వాసన చూస్తూ కలుగు వద్దకు చేరుకుని నిల్చొంది. పోలీసులకు ఏమీ అర్థం కాలేదు. ఇటు చిన్మయానంద కు జరుగుత్నదేమిటో అర్థం కాక బుర్ర గోక్కుంటూ అయోమయంగా చూశాడు.
పోలీసులు గునపం తెప్పించి కలుగును తవ్వి చూశారు. అందులోంచి ఎలుక బయటకు రాకుండా మరింత లోపలకు వెళ్లి దాక్కుంది. కలుగులో ఉంచిన బంగారు ఆభరణం, చైను బయట పడ్డాయి. పోలీసులు చిన్మయానందను పట్టుకుని బేడీలు వేశారు. ఊహించని హఠాత్మరిణామానికి విస్తుపోయి ‘‘ సార్.. సార్..! వీటి గురించి తనకేమీ తెలీదు.. దయచేసి నన్ను వదిలేయండి..’’ అని చేతులు జోడించాడు.
‘‘ అధ్యాత్మిక ముసుగులో సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి ఇలా దొంగతనాలు చేస్తూ అందరికీ సమస్యలు తెచ్చిపెడుతున్నావు.. ఎన్నాళ్ల నుంచి నువ్వీ దొంగ పనులు చేస్తున్నావు?’’ ప్రశ్నిస్తూ ‘‘ పద..పద.. నిన్ను వదిలితే ఇంకా ఎన్ని మోసాలు చేస్తావో ఏమిటో..? తలుచుకుంటే భయం వేస్తోంది.. నడువు.. నడువు.. స్టేషన్‌కు నడువు..’’ విసురుగా తోశారు పోలీసులు.
చిన్మయానంద ముఖం అవమానంతో చాటేసింది. ఇన్నాళ్లు సంపాదించుకున్న జ్ఞాన దీపాన్ని అజ్ఞాన తిమిరం కప్పేసి అంధకారం నెలకొంది. ఇన్నాళ్లు తనకు చేతులెత్తి నమస్కరించిన భక్తులు తనను ‘‘ దొంగ..దొంగ.. దుర్మార్గుడు..!’’ అని చీత్కరిస్తుంటే చిన్మయానంద ముఖంలో దు:ఖపు ఛాయలు అలుముకున్నాయి. తీవ్ర అశాంతి నెలకొంది. మొదట స్టేషన్ జైలులో గడిపాడు. వారం తర్వాత కోర్టు బోనులో నిందితుడిగా నిలబడ్డాడు. తనకు రెండేళ్లు జైలు శిక్ష పడిరది. జైలులో ఒంటరిగా జీవనం గడుపుతున్న చిన్మయానంద ఆలోచనలో పడ్డాడు. తన జీవితం ఎందుకిలా అయ్యిందా? అని దీర్ఘంగా ఆలోచించాడు. దొంగతనాలు చేసే దొంగను అవివేకంతో రక్షించడం వల్లే ఈ అపవాదు వచ్చిందని గ్రహించాడు. తను రక్షించాలనుకోవడం తప్పు కాదని అయితే ఆ వ్యక్తి మంచి వాడా? కాదా?’ అని ఆలోచించకుండా అజ్ఞానంతో దోపిడీలు చేస్తూ సమాజంలో అశాంతిని సృష్టించే వ్యక్తికి ఆశ్రయం ఇచ్చి అన్యాయాన్ని రక్షించడం వల్లే తనపై అపనింద వచ్చి తన జ్ఞాన మార్గానికి పరీక్ష పెట్టిందని గ్రహించాడు. వివేకంతో నీతి, నిజాయతీగా జీవిస్తేనే సమాజంలో మనుగడ సాధ్యమవుతుందని, అదే జ్ఞాన మార్గమని తెలుసుకున్నాడు. జైలు జీవితం ముగిసిన తర్వాత తనలో వున్న అవివేక, అజ్ఞానపు ఆలోచనల మాలిన్యాన్ని తొలగించుకుని వివేకంతో ముందుకు సాగి ఒంటరిగా ప్రశాంత జీవనం గడిపాడు చిన్మయానంద.