నాలాగా ఎందరో ? - జీడిగుంట నరసింహ మూర్తి

Naa laaga endaro

పెళ్లయ్యి భర్త పనిచేస్తున్న చోటకు వెళ్లిపోతున్న మేఘనకు తన పుట్టిల్లు వదిలేసి వెళ్లిపోవాలంటే విపరీతమైన దుఖం ముంచుకొచ్చింది. తనకు సాహిత్యం మీద చాలా ఆసక్తి. చదువు అయిపోయి కొన్నాళ్లు ఖాళీగా ఉన్న సమయంలో యండమూరి , మల్లాది, యద్దనపూడి, కోడూరి , మాదిరెడ్డి నవలలు తెప్పించుకుని చదివినవే చదివేది. కలర్ పెన్సిల్స్ తో ఎన్నో బొమ్మలు వేసేది. భర్త ఎక్కడో నాగపూర్లో ఉద్యోగం చేసుతున్నాడు.. తను తల్లి తండ్రులతో ఉన్న కాలంలో ఎన్నో కథలు వ్రాసింది. రేడియోలో ప్రోగ్రాంలు చేసింది. ఇంకెన్నో పోటీలలో బహుమతులు గెలుచుకుంది. . అలా అని చదువుమీద ఎటువంటి అశ్రద్ధ చేయలేదు. యూనివర్సిటీలో మంచి రాంక్ సంపాదించుకుంది. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి ఒక సామాన్య రాలుగా భర్త దగ్గరకు వెళ్ళాలి. తను తెచ్చుకున్న గుర్తింపులు అత్తగారి ఇంట్లో ఎందుకూ పనికిరావు. అయితే కనీసం తన చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లు, తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించడానికి స్పూర్తినేచ్చే ప్రముఖుల నవలలు తనతో తీసుకెళ్లాలని ఆమె ఆకాంక్ష. ఒక సర్టిఫికెట్లు తప్ప మిగిలినవేవీ తీసుకు వెళ్లొద్దని, అవన్నీ అక్కడకు తీసుకువెళ్తే అత్తగారింట్లో వాళ్ళకు ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు పరిస్తితులను బట్టి మధ్యలో పుట్టింటికి వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా తీసుకెళ్లవచ్చునని తల్లి మాధవి ప్రత్యేకంగా చెప్పింది.

తనకు సంబంధించినవన్నీ పుట్టింట్లోనే వదిలేస్తే రెండేళ్లకు ఒకసారైనా ఇల్లు మారే తల్లి తండ్రులు తన నవలలు, సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గరే వదిలేసి వెళ్తే అవి క్షేమంగా ఉంటాయన్న నమ్మకం మేఘనకు లేదు. మరోపక్క ఇన్నాళ్లుగా తల్లి తండ్రులతో పెనవేసుకున్న బంధాల్ని ఒక్కసారిగా తెంచుకుని వెళ్లిపోవాలంటే గుండెలు ద్రవించిపోతున్నాయి. ఆమెలో ఎప్పుడూ లేని ఏదో అవ్యక్తమైన బెదురూ, నీరసం ముంచుకొచ్చాయి. కూతురు తన సామాను సర్ధుకుని తల్లి వైపు తండ్రి వైపు బిక్కు బిక్కుమని చూస్తూంటే మాధవిలో గట్లు తెగిన నదిలా దుఖం ముంచుకొచ్చింది. తల్లిని చూసిన మేఘన కళ్ళు నీటి చెలమలయ్యాయి. పైకి ఎక్స్ప్రెస్ చెయ్యకపోయినా మేఘన తండ్రి శ్రీహరి రావుకు కూడా చాలా దిగులుగా అనిపించి ఎవరి కళ్ళపడకుండా కళ్ళు ఒత్తుకున్నాడు.

" ఏమిటో మన చాదస్తం . ఆడపిల్ల పెళ్లి అయితే ఇల్లు విడిచి వెళ్లిపోతుంది అని అనుకుంటాం కానీ ఈ రోజుల్లో మగపిల్లల పరిస్తితి కూడా అంతే. వాళ్ళూ పెళ్ళాం వెనకాల వెళ్లిపోతారు. ఇప్పుడు పిల్లలు తల్లి తండ్రులతో ఉంటారన్న నమ్మకం లేదు. కొడుకొక చోట ఉద్యోగం చేస్తూంటే వాళ్ళు పిల్లలతో వెళ్లలేక కొందరు, వాళ్ళతో అడ్జస్ట్ కాలేక కొందరు, ఇలా దూరం దూరంగా ఉండటం సర్వసామాన్యమై పోయింది . ఇంకా కూతుళ్లే నయం. ఏ పురిటికనో , నోములకనో అప్పుడప్పుడైనా వచ్చే వీలుంటుంది. మాధవీ! నువ్వు మనసును స్వాధీనంలో ఉంచుకోమ్మా ఆడపిల్ల పెళ్లి చేసి అత్తవారింటికి పంపించే ప్రతి వారూ గుండె రాయి చేసుకోవాలి. తప్పదు . " అన్నాడు పెళ్లికొచ్చి అక్కడే ఉండిపోయిన మాధవి పెదనాన్న ఒకాయన .

ఇవన్నీ పట్టనట్టు పెళ్ళికొడుకు తల్లి తండ్రులు, కొత్త కోడలిని తీసుకుని వెళ్లిపోవడానికి సామాన్లతో సహా రెడీ గా ఉన్నారు. ట్రైన్ కదిలింది. పెళ్లికూతురి తండ్రి బయటనుండి అందరికీ చేయి ఊపాడు.

పెళ్లి కొడుకు శ్రీకాంత్ నాగపూర్లో ఒక చార్చర్డ్ అకౌంటెంట్ దగ్గర పనిచేస్తున్నాడు. . ప్రస్తుతం శ్రీకాంత్ తల్లి తండ్రులు కూడా అతనితోనే ఉంటున్నారు. మొదటి పండక్కి సగౌరవంగా శ్రీకాంత్ ను , అతని తల్లి తండ్రులను ఆహ్వానించారు మేఘన తల్లితండ్రులు. ఆఫీసులో పని ఎక్కువగా ఉండటం వల్ల రాలేకపోతున్నాం అని మేఘన చేత మెసేజ్ పెట్టించాడు శ్రీకాంత్ . ఆ మెసేజ్ చూసి మేఘన తల్లి తండ్రులు చాలా నిరాశ పడ్డారు . సామాన్యంగా ఎంత దూరంలో ఉన్నా మొదటి పండక్కి రాకుండా ఉండే మగపెళ్ళివారు ఎవరూ ఉండరు. పెళ్ళిలో తమవైపునుండి ఏమైనా లోపాలు జరిగాయా అంటే అటువంటివేమీ బయటకు రాలేదు. పెళ్లి కొడుకు కూడా వెళ్ళేటప్పుడు అందరికీ నవ్వుతూ నమస్కారం చేసే వెళ్ళాడు అతని మొహంలో ఎటువంటి అలక కనిపించలేదు. ఆమె మెదడులో రకరకాల ప్రశ్నలు -సందేహాలు . ఏదో అతనికో, తల్లి తండ్రులకో ఇబ్బంది కలిగి ఉండకపోతే ఇలా మౌనంగా ఉండరు .

"ఏమండీ. ఒకసారి మీరు అల్లుడుగారితో మాట్లాడండి. బహుశా ఇక్కడకు రావడానికి ప్రయాణపు ఖర్చులు మనం పెట్టుకోకపోవడం కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు. ఏదో పెళ్లి చేసేశాము అయిపోయింది మన బాధ్యత అని మనం అనుకోలేము కదా. ఆడపిల్లను ఇచ్చుకున్న వాళ్ళం జీవితాంతం జాగ్రత్తగానే ఉండాలి . ఏ మాత్రం తేడా వచ్చినా మనల్ని జీవితాంతం దెప్పి పొడుస్తారు . ఇక మీరు ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఫోన్ చేయండి . మేఘన మెసేజ్ చూసిన క్షణం నుండి నాకు కాళ్ళూ, చేతులు ఆడటం లేదు " అని మొగుడు కాళ్ళ కింద నిప్పులు పోసేసింది మాధవి.

శ్రీహరిరావుకు నోట్లో నాలిక లేదు అంటూంటారు బంధువులంతా. ఏ విషయంలోనూ ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం, కాళ్ళ కిందకు పాము వచ్చినా కదలపోవడం, నంగి నంగిగా మాట్లాడటం , జీవితంలో ఏ విధమైన రిస్క్ తీసుకోలేకపోవడం లాంటి కొద్దిపాటి అవలక్షణాలు ఎవరినుండి వచ్చాయో కానీ దాని వల్ల అతని భార్య మాధవే ప్రతి విషయానికి దగ్గరుండీ చూసుకోవాల్సి వస్తోంది. మేఘన పెళ్లి విషయంలో కూడా పెళ్లి వారితో మాట్లాడటం దగ్గరనుండి పెళ్ళిలో కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఒంటి చేతిమీద నడిపించాల్సి వచ్చింది.

భార్య తనని ఒక పట్టాన నుంచో నివ్వదు కూర్చొనివ్వదు అని బాగా అనుభవంలో ఉన్న శ్రీహరి రావు కూతురు పెట్టిన మెసేజ్ ఒకటికి రెండు సార్లు బాగా చదువుకుని పెళ్లి కొడుకు తండ్రికి ఫోన్ చేశాడు.

" రావాలని ప్లాన్ చేసుకున్నాం బావగారూ .. ఈ లోపు మా అబ్బాయికి ఏవో ఆఫీసులో అనుకోని సమస్యలు రావడం వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. అబ్బాయి చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర పని చేస్తున్నాడు. మా వాడి మీద మొత్తం పనంతా చూసుకునే బాధ్యత పడింది. . ఎవరో క్లైంట్లు పీకిల మీదకు తెచ్చుకుని మీరైతేనే మాకు న్యాయం చెయ్యగలుగుతారు అంటూ వాడిని ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్నారు. పైగా మా వాడి బాసు వాళ్ళ నుండి ముందే ఫీజ్ తీసుకోవడం వల్ల ఆ పని తప్పించుకోవడానికి వీల్లేని పరిస్తితి ఏర్పడటంతో మొత్తం మా కుటుంబ సభ్యులందరమూ ఆగిపోవాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని మీకు నేను ఫోన్ చేద్దామనుకుంటూండగానే మీనుండి ఫోన్ వచ్చింది. . . అన్నీ బాగుంటే తర్వాత పండక్కి రావడానికి తప్పక ప్రయత్నం చేస్తాము. ఈ విషయంలో మీరేమీ అన్యధా భావించకండి " అని సమయానికి ఏదో ఒక ప్లాన్ వేసి ఆడపెళ్ళి వాళ్ళను ఊరుకోబెట్టాడు పెళ్లి కొడుకు తండ్రి రామేశ్వర రావు. .

శ్రీహరిరావుకు ఒకే ఒక్క కూతురు. బాగా చదివించాడు. చదువు తర్వాత దొరికిన ఉద్యోగమల్లా చేసేసింది . పెళ్లి సంబంధాల దగ్గరకొచ్చేసరికి మగ పెళ్లి వారి కోరికల చిట్టా చూశాక అసలు మనం జీవితంలో ఈ పిల్ల పెళ్లి చెయ్యగలమా అనే అనుమానాలు వచ్చేశాయి. ఎవరిని చూసినా అమ్మాయి "టీసీఎస్లో ఎందుకు ట్రై చెయ్యలేదూ ? అమెజాన్లో ఎందుకు చెయ్యలేదూ ? ఇప్పుడు తను సంపాదించే పాతికవేలు రూపాయలతో మా అబ్బాయి భవిష్యత్తులో ఇల్లు ప్లాన్ చెయ్యాలంటే ఒక్కడివల్ల ఏమవుతుంది ? ఈ రోజుల్లో కనీసం ఒక లక్ష రూపాయలైనా లేకపోతే అది ఉద్యోగమే కాదు" అంటూ పెళ్లి కూతురి మొహం కూడా సరిగ్గా చూడని వాళ్ళే ఎక్కువ. ఏదో రకంగా ఆడపిల్ల డబ్బు మీద ఆధారపడిన పెళ్లి కొడుకుల జాబితానే ఎక్కువున్న ఈ రోజుల్లో ఎన్ని సంబంధాలు చూడటానికి వెళ్ళినా శ్రీహరి రావు కుటుంబానికి నిరాశే ఎదురయ్యింది.

" బావగారూ ఇక ఆ సంబంధాలు అన్నీ వదిలేయ్యండి. మీరేదో మీ పద్దతిలో చేసుకుపోతున్నారని నేను పట్టించుకోవడం లేదు . మీకు ఆసక్తి ఉంటే చెప్పండి. మా ఊళ్ళో హెడ్ మాస్టర్గా ఈ మధ్యే రిటైరైన రామేశ్వర రావు గారి అబ్బాయి నాగపూర్లో ఒక ప్రముఖ చార్టెడ్ అక్కౌంటెంట్ దగ్గర పనిచేస్తున్నట్టు తెలిసింది. రెండు రోజుల క్రితం ఆయన పెన్షన్ తాలూకు వ్యవహారం కనుక్కోవడానికి ఈ వూరు వచ్చి యధాలాపంగా నేను ఇక్కడున్నట్టు తెలిసి నన్ను కలిశాడు. ఇంకా కొడుక్కి పెళ్లి కాలేదుట. ఒకసారి కదిపి చూడమంటారా. ఒక రాయేసి చూద్దాం . " అన్నాడు శ్రీహరి రావు బావమరిది నారాయణ .

సంబంధాలు చూసి చూసి విసిగిపోయి ఉన్న శ్రీహరి రావుకు ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు.. పైగా తన బావమరిది నారాయణ వాళ్ళ బంధువర్గంలో చాలా మందికి సంబంధాలు చూశాడని పేరు. అతను చూసిన సంబంధాలన్నీ ఏ గొడవా లేకుండా బాగానే జీవనం సాగిస్తున్నారని కూడా విన్నాడు. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని , ఎందుకో శ్రీహరి రావు తన కూతురు పెళ్లి విషయం, తను ఇన్నాళ్ళు పడుతున్న టెన్షన్లు గురించి అతనికి చెప్పుదల్చుకోలేదు. కారణం తన సొంత పలుకుబడి ఉపయోగించి ఎవరిమీద ఆధారపడకుండా , ఎవరినుండి ఒక్కపైసా ఆర్ధిక సహాయం తీసుకోకుండా తన కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలని తపన . బావగారు ఏదో ఒక రోజు కూతురు పెళ్లి గురించి తనతో కదపకుండా ఉండకపోతాడా అని ఎదురు చూస్తున్నాడు నారాయణ . అంతే కాకుండా కొన్నాళ్ళ క్రితం ఏదో విషయంలో వాళ్ళిద్దరి మధ్య ఏవో చిన్నపాటి మనస్పర్ధలు రావడంతో కొద్దిగా పలకరింపులు తగ్గాయి. . అయితే గత కొన్ని రోజులుగా ఇదంతా గమనిస్తున్న అతను తన అక్కగారి మొహం చూసి జాలిపడి తనంతట తనే ఒకరోజు మాధవిని ముందుగా సంప్రదించాడు. అప్పుడు అసలు కథ ముందుకు నడిచింది.

" అసలు నీ సహాయం లేకుండా నీ మేనకోడలి పెళ్లి చేయాలని నాకు ఉద్దేశ్యం లేదు నారాయణా . అసలే నీ సమస్యల్లో నువ్వున్నావు. ఈ మధ్య ఊరికి దూరంగా తక్కువలో ఇల్లు దొరుకుతోందంటే సరిగ్గా పత్రాలు అవీ ఉన్నాయా లేదా చూడకుండా కోనెయ్యడం , ఆ తర్వాత ఆ ఇల్లు వేరే వారి పేరు మీద ఉంది అని తెలిసి పెద్ద చిక్కుల్లో పడ్డావు. దాని నుండి బయట పడటానికి నువ్వు చాలా కష్ట పడాల్సి వచ్చింది. నీ పరిస్త్తితులే అలా ఉన్నప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనూ, మీ అక్కగారూ ఊరుకున్నాము. సరే. ఇప్పుడు ఆ భగవంతుడి దయవల్ల ఆ సమస్యలనుండి బయట పడ్డావని తెలిసింది. నువ్వు ఏమీ అనుకోకపోతే మీ వూరి రామేశ్వర రావు మాస్టారి సంబంధం గురించి ఒక సారి కదిపి చూడు. వీలైతే ఇద్దరమూ ఒకసారి మీ ఊరు వెళ్లొద్దాం. " అన్నాడు శ్రీహరి రావు. అతని కంఠంలో అభ్యర్ధన కనిపిస్తోంది. .

నారాయణ స్వతహాగా నెమ్మదస్తుడు. ఎవరితోనూ కలహాలకు దిగడు. తనకు చేతనైనంతవరకు ముందుండి సహాయం చెయ్యడానికి వెనుకాడడు. తన అక్కా, బావగారు తనని ప్రాధేయపడినంత పని చెయ్యడంతో అతని మనసు కలవర పడింది. ఇక వేరే ఆలోచనలకు పోకుండా వెంటనే రామేశ్వర రావును సంప్రదించడానికి సమాయత్తమయ్యాడు.

ఇరువైపులా సంప్రదింపులు ఫలించడంతో పెద్దగా ఎక్కువగా సమయం తీసుకోకుండానే శ్రీహరి రావు తన కూతురు మేఘన పెళ్లి చేసేసి గుండెల మీద బరువు దించుకున్నాడు.

** ** ** *

" మొదటి పండక్కి మనం మా వూరు ఎలాగూ వెళ్లిలేకపోయాం. కారణాలు ఏవైనా మా అమ్మా, నాన్న చాలా నిరాశ పడ్డారు. ఒకసారి వాళ్ళనే రమ్మని పిలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను . నాకు కూడా వాళ్ళనందరినీ చూడాలని అనిపిస్తోంది. మామయ్యగారితో మాట్లాడి మీ ఉద్దేశ్యం చెపితే వాళ్ళకు ఫోన్ చేస్తాను " అంది మేఘన శ్రీకాంత్ తో.

శ్రీకాంత్ ఏం చెప్పబోతున్నాడో అని ఊపిరి బిగబెట్టి వింటోంది మేఘన .

" ఇప్పుడు అటువంటివి ఏమీ పెట్టుకోకు మేఘనా ! నీకు తెలుసు కదా. నాకు ఆడిట్ పనులతో ఊపిరి ఆడటం లేదు. మీ వాళ్ళు వచ్చినా వాళ్ళను ఎవరినీ సరిగ్గా చూసుకోలేము. . అయినా పెళ్లయ్యి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. వీడియోల్లో ఎలాగూ రోజూ మాట్లాడుకుంటూనే ఉన్నారు కదా. పైగా ఇప్పుడు మనముంటున్న ఇల్లు చాలా చిన్నది. వాళ్ళకు మనం సరైన సదుపాయాలు చేయలేం. కొన్నాళ్లు ఆగు. మనం అక్కడకు వెళ్లడమో, లేదా వాళ్ళే ఒకసారి ఇక్కడకు రావడమో ఏదో ఒకటి చేద్దాం. " స్థిరంగా , నిర్మొహమాటంగా చెప్పాడు శ్రీకాంత్.

మేఘనకు అతను చెప్పిన మాటలు అర్ధరహితంగా తోచాయి. శ్రీకాంత్లో ఈ రోజుల్లో అల్లుళ్ళల్లో ఉండే వేగం లేదు. కొత్త అల్లుడికి ఉండవలసిన లక్షణాలు ఎక్కడా లేవు. అతని వాలకం చూస్తూంటే ఆమెకు అనుమానం వస్తోంది. వారం క్రితం ఒక రాత్రి అతను తల్లి తండ్రులతో చాలా సేపు కూర్చున్నాడు. వాళ్ళ మధ్య ఏవేవో సంభాషణలు దొర్లాయి. ఆ మాటల్లో ఒకటి రెండు సార్లు " నాకిష్టం లేదులే అమ్మా. నన్ను బలవంతం చేయకు" అంటూండటం తనకు స్పష్టంగా వినిపించింది. బహుశా మొదటి పండక్కి అత్తగారింటికి వెళ్ళడం విషయంలో అతనికి ఏ మాత్రం ఇష్టం లేదని అర్ధం అవుతోంది. అందుకు బలమైన కారణమేమిటో ఆమెకు బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్ధం కావడం లేదు. తనకు తెలిసీ పెళ్ళిలో తన తల్లి తండ్రులు శ్రీకాంతును , అతని తల్లి తండ్రులను శక్తికి మించి గౌరవించి వాళ్ళ కోరికలన్నీ తీర్చారు. అయినా కూడా వాళ్ళందరూ కలిసి ఎటువంటి పరిస్తితిలోనూ వెళ్లకూడదని ఒక బలమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆడిటింగ్కు సంబంధించి పని ఎక్కువగా ఉందని చెప్పడం ఒక కుంటి సాకు తప్ప వేరే కారణం కాదు.

రానూ రానూ శ్రీకాంత్ ప్రవర్తన మేఘనకు అర్ధం అవుతోంది. అతనిలో ప్రతి దానికీ అసహనం, అసంతృప్తి , అవతలి వ్యక్తులను చులకన చేసి మాట్లాడటం చిన్నప్పటినుండి అబ్బిన బుద్ది అని గ్రహించింది. ఎవరికీ లొంగిపోకూడదు ఎవరి మీదా ఆధారపడకూడదు అనేది అతని సిద్దాంతం. అతన్ని అర్ధం చేసుకోవడానికి అవతలి వారికి కొన్ని జన్మలు పడుతుందేమో అని అనిపిస్తుంది. ఒక్కోసారి సైకోలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. . ఆఫీసులో టెన్షన్ తాలూకు విసుగునంతా తనమీద ప్రదర్శించే వాడు. ఏదైనా అతనితో కూర్చుని మాట్లాడుడామంటే అవకాశం ఇచ్చే వాడు కాదు. రానూ రానూ మేఘన గ్రహించినది ఏమిటంటే చాలా మంది పెళ్లి కొడుకుల్లా అతనికీ డబ్బు ఆశ ఉంది. తన కాబోయే భార్య మంచి ఉద్యోగం చేసి బాగా సంపాదించేది అయ్యుండాలి అని అతను కలలు కన్నాడు. అయితే తన తండ్రికి బాగా తెలిసిన నారాయణ మేఘన సంబంధం తీసుకురావడం అందుకు తండ్రి ఒప్పుకోవడంతో పెళ్లి కూతురు ఖచ్చితంగా ఉద్యోగం చేస్తూంటేనే ముందుకు వెళదాము అని పంతం పట్టిన అతనికి ఆ అవకాశం జారిపోయినట్టయ్యింది. పెళ్లి సమయానికి మేఘన అనుకోకుండా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేయడంతో అతనిలో నిరాశ ఆవరించింది. చాలా మంది ఈ నాటి ఆడపిల్లలు పెళ్లికి ముందు ఉద్యోగాలు చేస్తూ తల్లి తండ్రులకు బాగా సహాయపడటం చివరకు పెళ్లవగానే ఏదో సాకుతో ఉద్యోగం మానేయడం గురించి తన ఫ్రెండ్ సర్కిల్ లో వింటూనే ఉన్నాడు. ఎంతో ఆశించిన అతనికీ అదే జరిగింది. పెళ్లవగానే అతని చెల్లెలు రమణి " మొత్తానికి ఉద్యోగం చేస్తున్న అమ్మాయినే చేసుకుంటాను అని భీష్మించుకు కూర్చున్న నీ పంతం పక్కన పెట్టి మామూలు అమ్మాయినే చేసుకున్నావన్నమాట. తప్పదు నాయనా జీవితంలో రాజీ పడిపోవాలి కొన్ని సార్లు " అంటూ దెప్పి పొడవడం అతనికి ఆమె మాటలు ములుకుల్లా, శూలాల్లా గుచ్చుకున్నాయి. ఆ క్షణం నుండి అతని మనసంతా గందరగోళంగా తయారయ్యింది. తన మాటలతో అన్నగారు ఇబ్బంది పడ్డాడన్న విషయం వెంటనే గుర్తించి " ఓకే అన్నయ్యా . ఎక్కువగా ఆలోచించకు. పెళ్ళిలో నీ ముఖంలో ఎటువంటి ఆందోళనను కనిపించనీయకు. జరిగిందేదో జరిగింది. ఇందులో నాన్నగారు కూడా తొందరపడినట్టు తెలుస్తోంది. . నువ్వు నాగపూర్ వెళ్ళగానే ఒక్క నిమిషం కూడా టైమ్ వృధా కాకుండా తనవెంట పడు. కనపడిన అన్ని ఉద్యోగాలకు అప్లై చెయ్యమను. ఒక్కసారి ఖాళీగా ఉండటం అలవాటైపోతే సుఖం మరిగి ఇక ఏ ఉద్యోగమూ చేయదు. . నీ ఉద్యోగానికి తోడుగా తన సంపాదన కూడా ఉపయోగపడాలి. రేపు మీకు పిల్లలు పుట్టుకొస్తే నీ ఒక్కడి సంపాదన మీద ఇల్లు నడపడం కష్టం. నీ జాగ్రత్తల్లో నువ్వు ఉంటావని ఇలాంటి మాటలు మాట్లాడటానికి ఇది సమయం కాదని తెలిసినా చెపుతున్నాను " అంటూ శ్రీకాంత్ లో ఒక విషబీజాన్ని నాటి వదిలేసింది రమణి . ఆ బీజం శ్రీకాంత్ లో రోజు రోజుకు చిగురు వెయ్యడం మొదలుపెట్టింది.

చెల్లెలు చెప్పిన మాటలు శ్రీకాంత్ కు అనుక్షణం గుర్తుకు వస్తున్నాయి. సహజంగా చిన్నప్పటినుండి డిఫరెంట్ గా ఉండే శ్రీకాంత్ పెళ్ళైన నాటినుండి భార్యతో బయటకు తిరగడం, హోటళ్ళకు, సినిమాలకు వెళ్ళడం లాంటి విషయాలలో ఏ మాత్రమూ ఆసక్తి కనపడనియ్యడం లేదు. ఎంతమటుకూ తన భార్య ఉద్యోగం , సద్యోగం లేకుండా ఖాళీగా గడుపుతోందని తనొక్కడే చెమటోడ్చి కుటుంబాన్ని సాకుతున్నట్టుగా అణువణువూ రగిలిపోతూ మేఘనపైన రోజుకొకసారి ఉద్యోగాలకు అప్లై చెయ్యమని ఒత్తిడి తేవడం మొదలు పెట్టాడు. మధ్య మధ్యలో అతని చెల్లెలు రమణి వదిన ఉద్యోగం ఎంతవరకొచ్చిందీ ? పోనీలే అని జాలి పడకు. . తిని ఊరికే కూర్చుని నవలలు చదువుకోవడం వల్ల నీకే ప్రయోజనం లేదు. అలాగే మీ అత్తగారు, మామగారుతో కూడా అంత క్లోజ్ గా ఉండకు. కావాలనే పెళ్లి కుదరగానే ఆ అమ్మాయిచేత ఉద్యోగం మానిపించేశారు. మొదటి పండగకు మీరంతా కలిసి వాళ్ళింటికి వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఏదో సాకు చెప్పేసి ఎవరూ వెళ్ళకండి. అంగలార్చుకుని అక్కడకు తయారయ్యారు అంటే నువ్వు వాళ్ళ చెప్పుచేతల్లోకి వెళ్ళిపోయినట్టే. ఒకసారి నిన్ని స్వాధీన పరుచుకున్న తర్వాత తర్వాత నీ కోరికలకు విలువ ఉండదు. . అలాగే కూతురుని చూడాలన్న నెపంతో వాళ్ళు మీ దగ్గరకు వచ్చే ప్లాన్ లో కూడా ఉండొచ్చు. ఈ విషయంలో నువ్వు చాలా స్ట్రిక్ట్ గా ఉండు. వాళ్ళు వస్తే నీకు బోళ్ళంత ఖర్చు. ఏ విషయంలోనూ తొందరపడకు. నేను నిన్ను గైడ్ చేస్తూ ఉంటాను. రోజూ నాకు ఫోన్ చేసి అప్డేట్లు చెప్తూ ఉండు " చెల్లెలు మాటలు శ్రీకాంత్ లో మారుమోగుతున్నాయి.

** ** ** **

"మేము డిల్లీ వెళ్తున్నాము. మధ్యలో నాగపూర్లో కొద్దిసేపు ఆగుతాము. ఒకసారి అమ్మా , నాన్న , నువ్వూ స్టేషన్కు వస్తారా ? మిమ్మల్నందరినీ చూసినట్టుంటుంది " అని అడిగింది రమణి శ్రీకాంత్ ను ఒక రోజు.

వాళ్ళతో పాటు మేఘన కూడా స్టేషన్కు వెళ్లింది మేఘన . . రమణి మేఘనను చూసి ఆశ్చర్యపోతూ పెళ్ళిలో బాగా పుల్లలా ఉండేది . ఇప్పుడు బాగా ఒళ్ళు వచ్చిందే వదినకు ?" అంది శ్రీకాంత్ వైపు చూసి. ఆ మాటల్లో" అవునులే ఏ పనీ లేకుండా ఇంట్లో తిని కూర్చుంటే ఒళ్ళు రాకుండా ఏమవుతుంది ?" అని దెప్పిపొడిచినట్టుగా అనిపించింది మేఘనకు. ఒక రెండు నిమిషాలసేపు అన్నా చెల్లెళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకున్నారు. వాళ్ళ మాటల్లో తనమీద విషం చిమ్ముతున్నట్టు అనిపించింది. క్యాబులో వెనక్కి వస్తూ "అన్నా చెల్లెళ్ళిద్దరూ సైకోలే . వీళ్లతో ఎన్నాళ్ళీ జీవితాన్ని వేగుకు రావాలో ?" అని మనసులో ఒకటే మధన పడిపోయింది మేఘన.

ఇంటికి వెళ్ళగానే మేఘనకు డిన్నర్ చెయ్యబుద్ది కాలేదు. అద్దంలో ఒకసారి చూసుకుంది. ఈ మధ్య కొద్దిగా ఒళ్ళు రావడం మాట నిజమే కానీ రమణి ఏమాత్రమూ మేనర్స్ లేకుండా తనని అలా అనేయడం తట్టుకోలేకపోతోంది. ఏదో పిరీడ్స్ క్రమబద్దంగా రాకపోవడం వల్ల ఒళ్ళు వచ్చింది కానీ ఈ ఇంట్లో రోజూ ఎవరో ఒకరు సతాయింపుల మధ్య చిక్కిపోవాలే కానీ ఒళ్ళు కూడా వస్తుందా ?" అనుకుంది నిరాశగా.

మేఘన కనపడిన ఉద్యోగానికల్లా అప్లై చేస్తోంది కానీ పాతికవేలు కన్నా ఎక్కువ ఇవ్వడానికి ఎవరూ సిద్దంగా లేరు. పైగా అవన్నీ నాగపూర్లో ఎక్కడో మారుమూల కంపినీలు. ఏ క్షణం బోర్డు తిప్పేసినా ఆశ్చర్యం లేదు. ఇంత కష్టపడినా పాతిక వేలకు తన మొగుడు చస్తే ఒప్పుకోడు . అది పులుసులోకి కూడా రాదని ఒకసారి అన్నాడు. డబ్బై ఐదు నుండి లక్ష వరకు అతను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు.

నిజానికి పెళ్లి ఉందని తను చక్కటి ఉద్యోగాన్ని మానేసింది. పెళ్లయ్యాక తన కూతురు నాగపూర్కే అంకితం అయిపోవాల్సి ఉంటుందని తన తల్లి తండ్రులు ఊహించి ఉండరు. తను చదువుకున్న చదువుకు హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో అయితే మంచి జీతాలతో ఉద్యోగాలు దొరుకుతాయి. అలా అని తన ఉద్యోగం కోసం శ్రీకాంత్ సంసారాన్ని ఆ నగరాలకు షిఫ్ట్ చెయ్యమంటే చెయ్యడు కదా. ఆ విషయం అతను కూడా అర్ధం చేసుకోవాలి. పోనీ సంపాదన కోసం తనో చోట, అతనో చోట ఉద్యోగం చేసుకోవడం వీలవుతుందా అంటే అది అసాధ్యం. ఈ సమస్యలు శ్రీకాంత్ కానీ, అతని కుటుంబ సభ్యులు కానీ చస్తే అర్ధం చేసుకోరు. వాళ్ళకు ఎంతమటుకూ కావలసినది తను ఉద్యోగంలో లక్షలు సంపాదించడం . అది ఎలా సాద్యమవుతుంది అని ఎంత తల బద్దలు కొట్టుకున్నా అంతుపట్టని విషయం.

"మా కూతురు బాగా చదువుకుంది. ఉద్యోగం చేసి మంచి జీతం సంపాదించే సత్తా ఉంది అని నమ్మించిన మీ నాన్న, మీ అమ్మా ఆ విషయమే ఎత్తడం లేదు" అంటూ అవకాశం దొరికినప్పుడల్లా గుర్తు చేస్తూనే ఉన్నాడు శ్రీకంఠ్. ఏ పుస్తకమో, టీవీ చూస్తున్న సమయంలో వెనకనుండి " ఒక్క రూపాయి సంపాదన లేదు ఏమిటో తెలిసి తెలిసి ములిగిపోయాము. నారాయణ మాటలకు లొంగిపోయాం " అంటూ మామగారూ, అత్తగారూ అవకాశం దొరికినప్పుడల్లా దెప్పిపొడవడం మేఘనకు అలవాటైపోయింది. శ్రీకాంత్, అతని తల్లి తండ్రులు, ఎక్కడినుండో రిమోట్ తో నాటకాన్ని నడిపించే రమణి తెరవెనుక బాగోతాన్ని భరించక తప్పడం లేదు. . ఇలాంటి సంబంధం దొరికిందేమిటిరా భగవంతుడా అని మాధవి ఏడ్వని రోజు లేదు. పోనీ ఒకసారి నాగపూర్ వచ్చి ఒకసారి అన్నివిషయాలు అల్లుడితో మాట్లాడడామంటే అసలు మామగారికీ, అత్తగారికీ అల్లుడినుండి ఆహ్వానమే లేదు.

"పొరపాటు జరిగింది అక్కా. రామేశ్వర రావు కుటుంబంతో మన ఊళ్ళో ఉన్నప్పుడు కొద్దిగా పరిచయాలు ఉన్న మాట నిజమే కానీ వాళ్ళు మరీ ఇంత దారుణంగా ఉంటారని నేను అనుకోలేదు. ఇప్పుడు మనం చెయ్యగలిగేది లేదు. భావిషయత్తులో పిల్లలు పుడితే వాళ్ళందరూ ఏమైనా మారుతారేమో చూద్దాం. " అంటూ బాధపడ్డాడు నారాయణ .

" ఇప్పట్లో మేము నాగపూర్ వెళ్ళే పరిస్తితి కనిపించడం లేదు. . . నువ్వు ఒకసారి నాగపూర్ వెళ్ళిరా. మాతో పోల్చుకుంటే నీకు రామేశ్వర రావుగారితో కొంతలో కొంత చనువు ఉంది కదా . మేఘన గురించి రెండు మాటలు మాట్లాడు. అమ్మాయి తన ఉద్యోగం గురించి మానసికంగా చాలా డిప్రెషన్ లో ఉందని హైదరాబాద్ లో అయితే ఉద్యోగాలకు ఎక్కువ అవకాశం ఉంటుందని , శ్రీకాంత్ నాగపూర్లో ఉద్యోగం చేస్తున్నాడనే మేఘన చేత ఉద్యోగం మానిపించాం అని అంతే కానీ మేఘన ఉద్యోగం విషయంలో ఎటువంటి దురుద్దేశం లేదని ని మా బావగారు మీకు పర్సనల్ గా చెప్పమన్నారని ఒకసారి వాళ్ళను కన్విన్స్ చెయ్యి. మా అమ్మాయిని ఒక వారం రోజులు ఉంచుకుని పంపిస్తాం అని కూడా చెప్పి వాళ్ళను ఏదో విధంగా ఒప్పించి నీతో పాటు మేఘనను తీసుకురా. శ్రీకాంత్ చాలా దురుసుగా, అమానుషంగా, అనాగరికంగా ప్రవర్తిస్తున్నాడని మేఘన ద్వారా చూచాయిగా తెలిసింది. ఎన్ని చదువులు చదివినా , ఎంత విజ్ఞానం పొందినా ఆడది ఆడదే అని ఒప్పుకోక తప్పడం లేదు. . అది పెద్ద వలయంలో చిక్కుకున్నట్టుగా అనిపిస్తోంది. అసలే దాని మనసు చాలా సున్నితం . ఈ మధ్య చూసిన ఫోటోలో నిద్ర లేని దానిలా మొహం బాగా పీక్కుపోయి జబ్బు పడ్డ మనిషిలా ఉంది. ఆ ఫోటో చూడగానే నన్ను నేను నిగ్రహించుకోవాలని చూశాకానీ నాకు అది సాధ్య పడటం లేదు. వెంటనే నాగపూర్ వెళ్ళి అతన్ని నాలుగూ కడిగేయ్యాలని అనిపించింది. కానీ అనాలోచితంగా చేసే ఏ పనైనా మేఘన జీవితాన్ని మరింత సమస్యల్లో పడేస్తుందని ఏమీ తోచక నీకు కబురు పెట్టాను. మనమా వాళ్ళకు చాలా దూరంలో ఉన్నాం. ఏదైనా జరగరానిది జరిగితే మనం అందరమూ జీవితాంతం ఏడ్వాలి. ఇక మనం ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే నష్టమే తప్ప ఏం ప్రయోజనమూ లేదు. సాధ్యమైనంత త్వరలో నువ్వు అక్కడికి వెళ్లడమే మంచిది. " మనసులోని మాటలు చెప్పేశాక శ్రీహరి మొహంలో ఏదో తెలియని రీలీఫ్. . బావగారు చెప్పిన విషయాలు విన్నాక నారాయణ మొహం అప్రసన్నంగా మారింది. పైకి ఏమీ తేలకుండా బలవంతంగా నిగ్రహించుకున్నాడు.

** ** ** **

చెప్పా పెట్టకుండా వచ్చిన నారాయణను చూసి రామేశ్వర రావు ఆశ్చర్య పోయాడు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. అసంకల్పితంగా అతన్ని లోపలకు ఆహ్వానించాడు. దూరంనుండి మేనమామను చూసిన మేఘన కళ్ళు ఆశ్చర్యంగా , ఆనందంగా మెరిసాయి.

" నిన్ను చూడాలనే వచ్చాను మేఘనా!. ఒంట్లో బాగానే ఉంటోందా? చాలా చిక్కిపోయావు. బహుశా చాలా రోజులకు చూడటం వల్ల నాకలా అనిపిస్తోందేమో ? " ఉండబట్టలేక అడిగేశాడు నారాయణ .

"అదేం లేదు మామయ్య. బాగానే ఉన్నాను. నిద్రపోయి లేచాను. అందుకే అలా ఉన్నానేమో ? " ఆత్మవంచన చేసుకుంటూ మాట్లాడినట్టు ఆమెను చూసిన ఎవరికైనా అనిపించక మానదు.

" శ్రీకాంత్ రావడానికి ఆలస్యం అవుతుందా ? అతనితో కూడా కూర్చుని అందరి పర్మిషన్ తో నిన్ను హైదరాబాద్ తీసుకెళ్దామనుకుంటున్నాను. మీరెవరూ పెళ్లి తర్వాత అక్కడికి రాలేదు. మేఘనను వాళ్ళమ్మా, , నాన్న ఒకసారి చూడాలని ఎంతగానో అనుకుంటున్నారు. నాకు ఇటువైపుగా పని పడటంతో పనిలో పనిగా మిమ్మల్నందరినీ పలకరించి తనని తీసుకెళ్లాలని ఆలోచన " మనసులోని మాటను గబగబా చెప్పేసి ఊపిరి పీల్చుకున్నాడు నారాయణ

అటువైపునుండి ఎటువంటి సమాధానం రాలేదు. .

మేఘన ఈలోపు వేడివేడిగా కాఫీ కలుపుకుని వచ్చింది .

" ముందు కాఫీ తాగండి నారాయణా ! హఠాత్తుగా ప్రయాణం ఎలా కుదురుతుంది ? శ్రీకాంత్ వచ్చాక వాడు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆలోచిద్దాం. పైగా హైదరాబాద్ వెళ్లడానికి టిక్కెట్స్ రిజర్వేషన్ చేసుకోలేదు. ఏ అకెషనూ లేకుండా మేఘనను తీసుకెళ్తానంటే వాడు ఒప్పుకోకపోవచ్చు. .. త్వరలో ఏవో పండగలు వస్తాయి కదా. అప్పుడు అందరమూ కలిసి రావడానికి ప్రయత్నిస్తాం. .. మీరు ఏమీ అనుకోకుండా ఒక రోజు మాతో సరదాగా గడిపి వెళ్ళండి. శ్రీకాంత్ కూడా అదే చెపుతాడు. .." అతని మాటల్లో మేఘనను నారాయణతో పంపడానికి ఎటువంటి పరిస్తితులలోనూ సంసిద్దంగా లేరని అర్ధమవుతోంది. ఆయన మాటల్లో మృదుత్వం ఏ కోశానా కనపడటం లేదు.

ఈ లోపు శ్రీకాంత్ లోపలకు వచ్చాడు. లోపలకు అడుగుబెడుతూనే నారాయణను చూసి ఆశ్చర్యపోతూ ఒక ప్లాస్టిక్ నవ్వు విసిరాడు. బలవంతంగా వాళ్ళతో పాటు కుర్చీలో కూలబడ్డాడు.

"మేఘనను వాళ్ళా అమ్మా, నాన్న చూడాలని కలవరిస్తున్నారుట. తీసుకెళదామని వచ్చారు నారాయణ గారు " అన్నాడు రామేశ్వర రావు . ఆయన గొంతులో సన్నని వ్యంగ్య ధోరణి కనిపిస్తోంది.

తండ్రి మాటలకు స్పందిస్తూ "ఓహో అలాగా. మేఘన వెళ్తానంటే వెళ్లమను. మనకేం అభ్యంతరం ? " అన్నాడు శ్రీకాంత్ భార్య కళ్ళల్లోకి గుచ్చి గుచ్చి చూస్తూ.

అతని మాటలకు నారాయణ చాలా సంతోషించాడు. " చాలా థాంక్స్. శ్రీకాంత్. నాకు రైల్వే డిపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళున్నారు. టిక్కెట్స్ కు ప్రాబ్లం ఏమీ లేదు. రాత్రి పదిగంటలకు ట్రైన్ ఉంది . ఒక వారం రోజులు తనని మా దగ్గర ఉంచుకుని మళ్ళీ క్షేమంగా తీసుకొచ్చి మీ ఇంట్లో దించేస్తాను అన్నాడు నారాయణ .

అప్పటివరకూ ఉన్న భయాలు,టెన్షన్లు,, శ్రీకాంత్ అంగీకారంతో తుడిచిపెట్టుకుపోయాయి.

" మీ మామయ్య నిన్ను తీసుకువెళ్తానంటున్నాడు . నీ ఇష్టం మరి " అన్నాడు శ్రీకాంత్ మేఘనను ఉద్దేశించి.

" క్షమించండి మామయ్యా. నాకు ఒక్క దాన్నే రావడం ఇష్టం లేదు. అసలే మేమేవరమూ మొదటి పండక్కి కూడా రాలేదు. ఈ సారి ఏదైనా పండక్కి మమ్మల్ని పిలవండి. అందరమూ కలిసి వస్తాము. అదే మర్యాదగా ఉంటుంది " అంది మేఘన ఉబికివస్తున్న కన్నీళ్లను కళ్ళల్లోనే బలవంతాన అదిమిపెట్టుకుంటూ. .

మేఘన ఆ ఇంట్లో ఏ పరిస్తితిని ఎదుర్కుంటోందో నారాయణకు బాగా తెలుసు. మేఘన ఈ రోజుల్లో అమ్మాయి లాంటిది కాదు. మొగుడిని తమ చెప్పుచేతల్లో పెట్టుకుని ఎలా పడితే అలా ఆడించి అవసరమైతే రోడ్డుమీదకు ఈడ్చేసే పిల్లలున్న ప్రస్తుత సమాజంలో , ఉన్నత చదువులు చదివించడం విషయంలోనూ, పెళ్లి చెయ్యడం విషయంలోనూ , తల్లి తండ్రులు పడ్డ కష్టానికి వాళ్ళను ఎటువంటి అవమానాలకు గురిచేయ్యకూడదని పరిస్తితులతో రాజీపడి కేవలం మంచితనంతో నెగ్గుకురావాలన్న దృఢ నిశ్చయంతో భర్తను, అత్తమామలను ఎదిరించి ముందుకు వెళ్ళడం ఎటువంటి పరిస్తితులలోనూ మంచిది కాదని బాగా ఆలోచించింది కాబట్టే తన మేనకోడలునుండి ఆ విధమైన సమాధానం వచ్చిందని నారాయణకు అర్ధం అయ్యి ఆమెను పక్కకు పిలిచి "చూస్తూంటే ఇక్కడ పరిస్తితులు అయోమయంగా అనిపిస్తున్నాయి. నువ్వేనా మధ్య మధ్యలో మీ అమ్మా, నాన్నలకు ఫోన్ చేస్తూ ఉండు. నేను ఈ వూరు వచ్చి చెయ్యగలిగినది ఏమీ కనపడటం లేదు. ఆవేశంతో నిన్ను నాతో తీసుకెళ్లాలని అనుకున్నాను కానీ అది నిన్ను మరింత ఇబ్బందిని పెడుతుందని గ్రహించలేక పోయాను. నీ సమస్యలకు కాలమే సమాధానం చెపుతుంది. " అన్నాడు నారాయణ నిస్సహాయత ధ్వనించిన గొంతుతో .

"లేదు మామయ్యా. పెళ్ళిలో నేను కొనుక్కున ఫోన్ ఇప్పుడు నా దగ్గర లేదు. వాళ్ళు లాగేసుకున్నారు. వాళ్ళకు తెలియకుండా ఎవరితోనూ మాట్లాడకూడదుట. . అంతా బాగానే ఉంది. త్వరలోనే వాళ్ళంతా మన ఊరు వస్తాము అని చెప్పమన్నారు " అని నాన్నతోనూ, అమ్మతోనూ చెప్పు. ఇక్కడ నువ్వు చూసిన పరిస్తితులను పొరపాటున కూడా వాళ్ళకు చెప్పకు. వాళ్ళ గుండెలు బద్దలైపోతాయ్. నేను ఎలాగో సంయమనం పాటించి ,ఆన్లైన్లో ఉద్యోగం సంపాదించుకుని పరిస్తితులలో మార్పులు తేవడానికి ప్రయత్నిస్తాను. డబ్బులోనే ఆనందాన్ని వెతుక్కునే వీళ్ళను మంచితనంతో దారిలోకి తెచ్చుకుంటాను. ఈ రోజుల్లో ఆడవాళ్ళు మొగుళ్ళను, వాళ్ళ అత్తా మామలను , ఆడపడుచులను క్షణాల్లో వీధికీడ్చగలిగి వేరు కాపురాలు పెట్టించడానికి దమ్మూ, ధైర్యం ఉన్న వాళ్ళు అని భ్రమలో బ్రతికేసే సమాజం మనది. కానీ ఎంతోమంది సైకోల మధ్య జీవితాలను నెట్టుకొచ్చే ఆడపిల్లలు కూడా ఉంటారు అని చెప్పడానికి నేనే ఉదాహరణ. వీళ్ళల్లో అంత తేలికగా మార్పు రాదు. మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలు కాకపోవచ్చు. కానీ ఆర్ధిక సంబంధాలు మానవ సంబంధాలను ప్రభావితం చెయ్యకమానవు. ఆడది సందర్భాన్ని బట్టి అనేక రకాల పాత్రలను పోషిస్తుంది. నేను కూడా అంతే. ప్రస్తుత నా పరిస్తితులకు తట్టుకుని మీకూ, నా కుటుంబానికి మంచి పేరు తేవడానికి అహర్నిశలూ కృషి చేసి నన్ను నేను నిరూపించుకుంటాను . . దయచేసి నన్ను నమ్మండి. పరిస్తితులను చేజించుకుంటూ ముందుకు వెళ్లగలిగే నమ్మకం నాకుంది. . ఈ విషయంలో నాకు మనోబలం కలగాలని నన్ను ఆశీర్వదించి జాగ్రత్తగా వెళ్ళి రండి" మనసులోని మాటలను చెప్పేసి గుండెలనిండా ఊపిరి పీల్చుకుంది మేఘన .

మేఘన వ్యకిత్వానికి నారాయణలో అంతకు ముందున్న టెన్షన్ మెల్లమెల్లగా తగ్గుతోంది. ఆమె మాట్లాడిన ప్రతి పదంలోనూ లాజిక్ కనిపిస్తోంది. అయినా కూడా అన్ని సమస్యలను ఆమెకే వదిలేసి వెళ్లిపోవడానికి మనస్కరించకపోయినా తను అక్కడ ఇంక్కొక్క క్షణం ఉండటం ఎవరికీ క్షేమం కాదు అని అనుకుని వెంటనే అక్కడినుండి కదిలాడు సాధ్యమైనంతవరకు శ్రీకాంతును , అతని తల్లి తండ్రులను ఏ విధంగానూ నొప్పించకుండా .

రైలు వేగం అందుకుంది తన అక్క, బావగార్లను ఏ విధంగా ఒప్పించాలో గురించిన నారాయణ ఆలోచనలు కూడా రైలుతో పాటు సమాంతరంగా ముందుకు సాగాయి. . *****

సమాప్తం

మరిన్ని కథలు

Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్
Kshama lo dharitri
క్షమలో ధరిత్రి.
- Aduri.HYmavathisrinivasarao,
Marmam
మర్మం
- రాము కోలా దెందుకూరు
Korthi
కొర్తి
- బివిడి ప్రసాద రావు
Atrhata
అర్హత
- డి.కె.చదువుల బాబు
Antataa neeve
అంతటా నీవే
- షామీరు జానకీ దేవి
Ahakaram techhina sapam
అహంకారం తెచ్చిన శాపం
- గొట్టాపు శ్రీనివాస రావు