జోడెడ్ల బండి - మద్దూరి నరసింహమూర్తి

Jodedla bandi

"సారీ, లేటైనట్టున్నాను. ఎంతసేపైంది మీరొచ్చి"

"మీరు టైంకే వచ్చేరు. నేనే ఐదునిమిషాలు ముందుగా వచ్చేను. బైదిబై, నా పేరు విజయకుమార్."

"అయ్యో, మీ పేరు తెలియక పోవడమేమిటి. మీకు కూడా తెలిసే ఉంటుంది, నా పేరు ప్రవీణ"

“తెలుసు. మీ పేరు కూడా మీ అంత అందంగా ఉంది."

"థాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్."

“మీరు నాకు బాగా నచ్చేరు. మరి, మీకు నేను నచ్చేనా.”

"మీరు ఫోటోలో కంటే కూడా చాలా హ్యాండ్సమ్ గా మ్యాన్లీగా ఉన్నారు. నాకు కూడా మీరు బాగా నచ్చేరు."

“మీరేమిటి తీసుకుంటారు. కాఫీ , టీ, కూల్ డ్రింక్, ఐస్ క్రీం."

"ఐస్ క్రీం. బెటర్, టూటీఫ్రూటీ"

"ఐ టూ లవ్ ఐస్ క్రీం" అని – అటెండర్ కి రెండు టూటీఫ్రూటీ ఆర్డర్ ఇచ్చేడు విజయకుమార్.

"మీరూ అదే ఫ్లేవర్ లైక్ చేస్తారా"

"అవునండీ. మన ఇరువురి ఇష్టాలు ఒకటే అని తెలిసే వరుసలో, ఇదే తొలిమెట్టు"

"ఇంక మనం టాపిక్ లోకి వద్దాము. నా కోరిక మన్నించి, మీరు ఇక్కడికి వచ్చినందుకు థాంక్స్. మాట్రిమోనీ సైట్ లో ఒకరి వివరాలు మరొకరం తెలుసుకున్నాం. ఇంకా ఒకరికొకరం వీలైనంత ఎక్కువగా అర్ధం చేసుకోవాలంటే, మనకుటుంబాల గురించి కూడా తెలుసుకోవాలి కదా. మీఇంట్లో ఎవరెవరుంటారు. "

"మాఇంట్లో నేను పెద్దవాడిని. బి.కామ్. ఫైనల్ చదువుతున్న తమ్ముడున్నాడు. చెల్లెలు ఇంటర్ ఫైనల్ చదువుతూంది. నాన్నగారికి ఇంకా ఐదేళ్ల సర్వీస్ మాత్రమే ఉంది. మూడు గదుల స్వంత ఇల్లుంది. పెళ్ళైతే మన కాపురం ఆ ఇంట్లోనే. మరి మీఇంట్లో ఎవరెవరుంటారు."

ప్రవీణ : (నవ్వుతూ) "మాఇంట్లో ఎవరుంటే ఏమిటి లెండి. పెళ్ళైతే కాపురానికి నేను మీఇంటికి రావాలి కానీ,

మీరు రారు కదా మాఇంటికి.”

“మీరు భలే ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నారే. ఐ లైక్ ఇట్."

"సూటిగా చెప్పాలంటే, మరో ఐదేళ్ల తరువాత మీ ఇంటికి మీరొక్కరే ఆర్జనపరులన్నమాట"

"మా తమ్ముడికి ఉద్యోగం వచ్చినంతవరకూ అంతే. పైగా, అప్పటికి మా చెల్లెలు కూడా పెళ్ళికి అందుకుంటుంది"

"అంటే, ఒక రకంగా మీ చెల్లెలు పెళ్లి బాధ్యత కూడా మీదే"

"అంతే కదండీ "

--- అప్పుడే ఐస్ క్రీం వచ్చేయి.

ఇద్దరూ తాపీగా తినడం ఆరంభించేరు.

-2-

ప్రవీణ : "మీ చెల్లెలు పెళ్ళైన వరకూ, మీ తమ్ముడుకి ఉద్యోగం వచ్చే వరకూ, మనకి అచ్చట ముచ్చట తీరడం కూడా కొంత సమస్యే అనుకుంటాను."

"ఆ మాట కొంతవరకూ నిజమే. కానీ, మీరు కొంచెం సర్దుకొని సహకరిస్తే, పెద్ద కష్టం కాదనుకుంటా"

"మా ఇంట్లో నేను ఆడింది ఆట పాడింది పాటగా పెరిగేను. ఇన్ని సమస్యలతో ….. మీ ఇంట్లో నేను కాపురం చేయ…లేనే…మో అనిపిస్తోంది."

"మీ మనసులో ఏముందో వివరంగా చెప్పండి"

ప్రవీణ : (కొంతసేపు నిశ్శబ్దంగా ఉండి) "మీరు ఏమీ అనుకోకపోతే … మానాన్నగారికి చెప్పి, మన కాపురం కోసం అన్ని సదుపాయాలతో ఒక ఇల్లు ఏర్పాటు చేయిస్తాను. అందులో మనం వేరుగా ఉండి, మీకెప్పుడు కావలిస్తే అప్పుడు మీఇంటికి వెళ్లి, మీవాళ్ళని చూసి రావొచ్చు. మన ఇద్దరం ఉద్యోగాలు చేస్తాం కాబట్టి, మీరు మీవాళ్ళకి డబ్బు సహాయం ఎప్పుడు ఎంత చేయాలనుకున్నా, నాకేమీ అభ్యంతరం ఉండదు. ఎప్పుడు వెళ్లాలనుకుంటే అప్పుడు వెళ్ళి నేను మావాళ్ళని చూడడానికి మీకు కూడా అభ్యంతరం ఉండకూడదు.”

"మనకి పిల్లలు పుడితే మీరు ఉద్యోగం మాని పిల్లలని చూసుకుంటారా, లేక వేరే ఆలోచన ఉందా మీకు.”

"నేను ఉద్యోగం మానడం అన్న ప్రసక్తే లేదు. మెటర్నిటీ లీవ్ దొరికినంత కాలం సమస్య ఉండదు. ఆ తరువాత ఆయాని పెడితే, పిల్లల పెంపకం సాఫీగా జరిగిపోతుంది. వాళ్ళు కొంచెం పెరిగి స్కూల్ లో చేర్చవలసి వచ్చినప్పుడు బోర్డింగ్ స్కూల్ లో చేర్చి, వారాంతంలో మనం వెళ్లి చూసి రావొచ్చు.”

"అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలన్నారు. మీరు మా ఇంటికి ఎప్పుడేనా వస్తారో లేదో కూడా సెలవీయండి.”

ప్రవీణ : (నవ్వుతూ) “భలేవారే మీరు. ఏదేనా ఫంక్షన్ ఉంటే, మీతో బాటూ వెళ్లి ఫంక్షన్ అయిపోయిన తరువాత మన ఇంటికి వచ్చేస్తాను. ఏమేనా పనులుంటే చూసుకొని, తాపీగా మీరు రావచ్చు.”

"మీ మనసు తెరిచి మీ ఆలోచనలన్నీ తెలిపినందుకు చాలా థాంక్స్.”

"అంటే, మీరు నా ఆలోచనలకి సమర్ధిస్తూ ఒప్పుకున్నట్టేగా. ఇంకొక్క ప్రొపోజల్. పెళ్లి కూడా సింపుల్ గా రిజిస్ట్రార్ ఆఫీస్ లో కానిచ్చేద్దాం. ఆ తరువాత మన స్నేహితులకి బంధువులకి రిసెప్షన్ ఇస్తే సరిపోతుంది. ఇందుకు కూడా మీరు ఒప్పుకుంటే, ఇక్కడినించి డైరెక్ట్ గా రిజిస్ట్రార్ ఆఫీస్ కి వెళ్లి అప్లికేషన్ ఇచ్చేద్దాం.”

"ఒక్క నిమిషం ఆగండి. మన ఆలోచనలు ఐస్ క్రీం ఫ్లేవర్ వరకే ఒకటిగా ఉన్నాయి. ఎందుకంటే --- నేను డబ్బుకే కాదు, ఏ ఇతర రూపేణా కూడా అమ్ముడుపోడానికి సుముఖుడిని కాను. నా అవసరం ఎంతో ఉన్న నావాళ్ళని, వదలి వేరు కాపరం పెట్టడానికి నేను సిద్ధంగా లేను. మీరు ఈకాలం ఆడపిల్లలలాగే ఆలోచిస్తూ మాట్లాడేరు. అందుకు నేను మిమ్మల్ని తప్పుగా అనుకోవడం లేదు. మీ ఆలోచనలకి తగిన వేరే వాడిని చూసి మీరు పెళ్లి చేసుకోండి. నాకు సరిపోయిన అమ్మాయి - గంతకు తగ్గ బొంత - దొరక్కపోదు. భిన్న అభిప్రాయాలతో ఉన్న మనం వేరు దారులలో వెళదాం, లేవండి.”

-3-

అని లేవబోతున్న విజయకుమార్ తో –

ప్రవీణ : "రెండు నిమిషాలు నా కోసం కూర్చోండి, ప్లీజ్.”

విజయకుమార్ : "ఇంకా ఏమేనా చెప్పేదుందా”

"ఎస్. మీమనసు తెలుసుకోవాలనే నేను అలా మాట్లాడేను. మీతో ఇప్పుడు మాట్లాడి, మీ కుటుంబాన్ని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసుకున్న నేను, ఇంత మంచి మనిషిని వదులుకోనేటంత మూర్ఖురాలిని కాను.”

"కానీ, నేను రిజిస్ట్రార్ ఆఫీస్ కి రాలేను."

"అదేం"

"మా అమ్మ - - - ' నీకు నచ్చిన పిల్లని చేసుకో. ఆ విషయంలో నేను కానీ, మీ నాన్న కానీ అడ్డు చెప్పం. అయితే, అలా నచ్చుకొనేటప్పుడు అమ్మాయితో అన్ని విషయాలూ మాట్లాడుకొని ఇద్దరూ ఏకాభిప్రాయానికి రండి. అంతే కాక, అమ్మాయి రంగేమిటి, డబ్బున్న అమ్మాయా లేక డబ్బు లేని అమ్మాయా, ఉద్యోగం చేస్తుందా లేక చేయదా ఇవన్నీ కూడా మాకు అనవసరం. అవి నువ్వు చూసుకోవలసినవి. కానీ, అమ్మాయి మన కుటుంబంలో ఒకరుగా కలిసిపోగలుగుతుందా లేదా అన్నది మాత్రం విధిగా నువ్వు గ్రహించుకోవాలి. అలా కాకపోతే, మన సంసారం ముక్కలవడానికి మూడు రోజులు చాలు. ఆ తరువాత విచారించి లాభం లేదు ' - - - అని మరీ మరీ నా చెవిలో ఇల్లు కట్టుకొని చెప్పింది. ఇక పొతే, మా నాన్న --- ' గుళ్ళోనో, రిజిస్ట్రార్ ఆఫీస్ లోనో, ఏదో తప్పుచేసినట్టు పెళ్లి చేసుకోవొద్దు ' --- అని క్లుప్తంగా చెప్పేరు. మా నాన్న మాటని గౌరవించడం నా ధర్మం."

"మీ నాన్నగారి మాటని గౌరవిస్తారు సరే. మరి, మీ అమ్మగారు చెప్పినట్టు నేను మీఇంట్లో ఒకరిగా కలిసిపోగలనో లేదో అని నన్ను పరిశీలించేరా"

విజయకుమార్ (నవ్వుతూ): " మీరు రెండోసారి మీ మనసు తెలియచేసిన తరువాత, ఆ విషయంలో నాకు ఇక ఎటువంటి సందేహం లేదు లెండి"

"ఇప్పుడు మా నాన్న చెప్పిన మాట కూడా వినండి."

"ఏం చెప్పేరేమిటి"

“మా నాన్న - - - ' అమ్మా, నీకు నచ్చినవాడిని ఎంచుకొని పెళ్లి చేసుకొనే హక్కు నీకు ఉంది. ఆ విషయంలో నీకు నా పూర్తి సహకారం ఉంటుంది. కానీ, నీపెళ్లి శాస్త్రప్రకారంగా జరిపించి, కన్యాదాన పుణ్యఫలంతో ‘దశ పూర్వేషామ్ దశ పరేషామ్’ అనే పుణ్య గతి వైపు నేను నడవడంలో నువ్వు కూడా సహకరించాలి ' - - - అని నాకు మరీ మరీ గుర్తు చేస్తుండేవారు.”

"మరి మీరు రిజిస్ట్రార్ ఆఫీస్ కి పోదాం అన్నారు"

"అది కూడా మీ మనసు తెలుసుకోవాలనే. ఇంకొక్క విషయం మిమ్మల్ని అడగడం మరచిపోయేను.”

“ఇంకెందుకు ఆలస్యం. అడగవలసినదేదో అడగండి. నా జవాబు బట్టి మనం అంతిమ నిర్ణయం తీసుకోవొచ్చు.”

“మీకు కొంచెం కోపం వచ్చినట్టుంది.”

-4-

విజయకుమార్ (నవ్వుతూ): “అదేమీ లేదు.”

“మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుంటారు?”

“అంటే మీ ఉద్దేశం?”

“లుంగీ, ధోవతి, పైజామా కుర్తా లాంటివి వేసుకుంటారా -- లేక, లాగులు నిక్కర్ల లాంటి షార్ట్స్ వేసుకుంటారా”

“ఎందుకు అలా అడిగేరు?”

“ఎందుకంటే, జమాజెట్టీ లాంటి మగవారు లాగులు నిక్కర్ల లాంటి షార్ట్స్ వేసుకొని అటూ ఇటూ తిరుగుతూంటే చూడడానికి సిగ్గు అసహ్యం వేస్తుంది. అంతేకాదు, ఫాషన్ పేరుతొ, బ్రోకెన్ జీన్స్ వేసుకున్నవాళ్ళని చూస్తే నాకు వాళ్లలో ముష్టివాళ్ళే కనిపిస్తారు. ఇది చిన్న విషయమైనా, పెళ్ళికి ముందర తెలుసుకోవడం మంచిది. దయచేసి, నాకు నిజం చెప్పండి.”

“ఆ విషయంలో మన ఇద్దరి ఆలోచనలు ఒకటే.”

ప్రవీణ (గట్టిగా ఊపిరి పీల్చుకొని) : “హమ్మయ్య. ఇక, నా తరఫునించి మిమ్మల్ని పెళ్లి చేసుకుందికి ఎటువంటి అభ్యంతరం లేదు. మీ సమ్మతి కూడా సెలవిస్తే సంతోషిస్తాను.

"చాలా బాగుంది. మరి మీరు ఉద్యోగం మానే ప్రసక్తే లేదంటున్నారు.”

"ఇప్పటికీ అదే నా ఆలోచన. అయినా, నేను ఉద్యోగం చేస్తే మన ఇంటిని మన వాళ్ళని నిర్లక్ష్యం చేస్తానేమో అని మీ భయమనుకుంటాను.”

"కరెక్ట్ గా ఊహించేరు."

“ఇంటినుంచి పనిచేసి, డబ్బు ఆర్జించడానికి బోలెడు అవకాశాలు ఉన్న ఈరోజుల్లో, ఇంట్లోనే ఉండి మన ఇంటిని ఇంటిలోని వారిని చూసుకుంటూ నేనూ అంతో ఇంతో ఆర్జించగలను. వేన్నీళ్ళకి చన్నీళ్ళలాగ, మనం ఇద్దరం ఆర్జనపరులైతే, జోడెద్దులబండి లాంటి మన కుటుంబం సామరస్యంగా సమస్యారహితంగా సాఫీగా సాగిపోతుందని నా నమ్మకం. లేదూ, ఒంటెద్దుబండి లాగ మీరొక్కరే బరువు లాగుతారంటే మీ ఇష్టం. ఒక్కసారి ఆలోచించండి. మీ ఇష్టమే నా ఇష్టం.”

"నా కుటుంబం సారీ, మన కుటుంబం కోసం మీరు అంతగా ఆలోచిస్తుంటే, నేను మాత్రం మీ అభిమతాన్ని ఎందుకు కాదంటాను. పదండి, మనం ఇద్దరూ కలిసి జోడెద్దుల బండిలో ప్రయాణం చేద్దాం.” –

అని విజయకుమార్ తన చేతిని ప్రవీణకి అందిస్తే, బ్రతుకు బాటలో కలిసి ప్రయాణం చేయడానికి ఇద్దరూ నవ్వుకుంటూ ముందుకి కదిలేరు.

*****

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు