పెళ్లి కావలా ......నాయన. - Porandla Sudhakar (SSSRK)

Pelli kavala nayanaa

చీ ఛీ బయటికి వెళ్లాలంటేనే భయంగా వుంది, ఎవరో ఒకరు ఏంది శారదమ్మ మీ మనవరాలి పెళ్లి చేసేది ఉందా లేదా? మీ మనవరాలి ఈడుకు మాకప్పుడు పెళ్ళికి ఎదిగిన పిల్లలు వున్నారు, ఇదేమి చోద్యం శారదమ్మ వయస్సు మీదపడ్డ పిల్లను ఇంకా ఎన్ని దినాలు ఇంటిమీద ఉంచుకుంటారు, మీ మనవరాలికి ఎప్పుడు పెళ్లి చేస్తారు, పెద్దోడు అయిన మీ మనవనికి ముప్పైరెండు సంవత్సరాలు నిండే, ఇంకా పెళ్లి కాకపాయే అని మూతిమూడు వంకర్లు తిప్పుకుంటూ చాటుగా నవ్వుకుంటూ అడుగుతున్నారు, బయట అడుగుపెట్టాలంటేనే ఇబ్బందిగా వుంది అంటూ కాలి చేతిసంచిని లోపలికి తీసుకవచ్చి సోఫాలో పడేసి తలపట్టుక కూర్చుంది శారదమ్మ.

ఏందే ముసలి పొద్దున్నే నా పెళ్లి గూర్చి రుస రుసలాడుతున్నావ్, నాకు లేని తొందర నీకు, నీదోస్తాన్లకు ఎందుకే అంటూ కంప్యూటర్ ను ఒడిలోకి తీసుకొని శారదమ్మ ఎదురుగా వున్న సోఫాలో కూర్చుంది శ్రేష్ట.

అసలు సదువు కున్నావ్ కాని నీకంటే సన్నాసినయం, ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట ఆ వయస్సులు జరగాలి, ఇంకా నాలుగు రోజులు అయితే నీకు మొగుడు దొరకడం కష్టం అవుతుందే, ఇప్పటికే నీకు వయసు పెరిగి వయసుతో పాటు బరువు పెరిగావు, చిన్నపిల్లలు నిన్ను ఇప్పటికే అక్క అనకుండా ఆంటీ అని పిలుస్తున్నారు. ఇంకా ఆలస్యం అయితే ఏ తల నెరిసినవాడినో, లేదా రెండో సంబంధం వాడినో చేసుకోవాల్సి ఉంటుందని నాబాధ అని నుదుటిని చేతితో కొట్టుకుంటూ అంది శారదమ్మ.

వచ్చిన పెళ్లి సంబందాలలో నీకు నచ్చితే, మీ అమ్మకు నచ్చదు, లేదా మీ నాన్నకు నచ్చదు అందరికి నచ్చినా, నీ అన్న ప్రణవ్ కు నచ్చదు, ఇగ పెళ్లి ఎప్పుడు అవుతుంది, ఇగ మీ అమ్మనాన్నలు మనవలు, మనవరాళ్లను ఎప్పుడు ఎత్తుకుంటారు తూ... ఎదవజన్మలు అంటూ చిన్నగా ఎడ్వాసాగింది శారదమ్మ.

ఏం అత్తమ్మ ఊరుకుంటుంటే బాగా రెచ్చిపోతున్నావ్, మీకు తిండిఎక్కువై ఇటువంటి మాటలు అంటున్నారులాగా వుంది, మీరు ఉండాలనుకుంటే అన్ని మూసుకొని వుండండి లేకపోతే మీ మహారాణి కూతురు వద్దకు వెళ్లిపోండి అంటూ వంటింటిలో నుండి అరిచినట్లు అంది రమ్య.

గదే ఆలోచిస్తున్న అది ఎక్కడో బెంగుళూర్ లో ఉందాయె లేకపోతే మీతోటి, జనాలతో ఇన్నిమాటలు పడుకుంటా వుండే ఖర్మ నాకేంది మీరు ఏడన్న కాలిపోండి అంటూ ప్రక్కన వున్న మంచినీళ్లు తీసుకొని గడగడా త్రాగింది శారదమ్మ.

ఎందుకే అమ్మ ఊరికే అరుస్తావు, దానికి ఉద్యోగం వచ్చి ఇంకా రెండు సంవత్సరాలు కూడా కాకపాయె, అప్పుడే దానికి పెళ్లి ఏందీ, నీ మొగుడు అదే నా తండ్రి కోట్లు కుడా బెట్టి పోయాడా ఏందీ, ఇంకా ఇల్లు కొన్న అప్పు తీరకపాయె, రోజు దాని పెళ్లి గూర్చి గొడవ పెడుతున్నావ్, ఉండాలనుకుంటే వుండు లేకపోతే వెంటనే ఇంట్లో నుండి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ చూపుడు వ్రేలిని గుమ్మం వైపు చూపించాడు శేఖర్.

ఇంకా అంత మాటన్నాక, వెళ్లక ఉంటానా ఏందీ అని ఏడుస్తూ లోపలి వెళ్లి బట్టలు సర్దుకోసాగింది శారదమ్మ.

***

శేఖర్ వున్నావా నాన్న అని లోపలికి వచ్చాడు సుదర్శన్, రండి మామయ్య రండి ఈ రోజు రెండవ శనివారం కదా స్కూల్ లేదు మామయ్య, సిలబస్ కూడ దగ్గర పడింది ఎక్సట్రా క్లాస్ లు ఏమి తీసుకోవడం లేదు అందుకే ఇంటి పట్టున వున్నాను రండి కూర్చోండి మామయ్య అని ఎదురుగా వున్న సోపా చూపిస్తూ సుదర్శన్ కూర్చున్నాక తాను తన ఎదురుగా కూర్చున్నాడు శేఖర్.

నాన్న ఎప్పుడు వచ్చారు, అమ్మ కులాసాగా వుందా అని ప్రశ్నించింది రమ్య, ఇప్పుడే వచ్చాను మీ అమ్మకేం బావుందమ్మా అన్నాడు సుదర్శన్

శేఖర్ తండ్రి చిన్నప్పుడే చనిపోయాక చెల్లెలు శారదమ్మను చేరదీసి పిల్లలను పెంచి మంచి పొజిషన్ లోకి రావడానికి సహాయం చేసాడు, అంతేకాక తన కూతురు రమ్యను శేఖర్ కు ఇచ్చి వివాహం చేసాడు, అందుకే సుదర్శన్ కు ఏనాడు ఎదురు మాట్లాడడు శేఖర్, సుదర్శన్ అంటే ఆఇంటిలో అందరికి భక్తి , గౌరవం, ఎవరు కూడా తనకి ఎదురుచెప్పరు.

ఏమయ్యా శేఖర్ మా ఫ్రెండ్ నా మనమరాలు శ్రేష్ఠకు తెచ్చిన సంబంధం గణాలు కలవలేదని చెప్పావట, నీకు ఏ పురోహితుడు చెప్పాడు, వధువరుల జాతకాలు కలవలేదని చెప్పే పురోహితుడు తాను ఏ రోజు చనిపోతాడో, తనకు ఏరోజు ఏమౌతుందో తన జాతకం గూర్చి తనకే తెలియదు, అలాంటప్పుడు ఇతరులకు ఏవిధంగా ముహూర్తం పెడతాడు, మంచిరోజులు, చెడ్డరోజులు అనేవి వున్నాయా, పెళ్ళికి మంచి ముహూర్తం పెట్టిన అయ్యగారు అదే వధువరులు కొన్నాళ్లకే విడాకులు తీసుకుంటే తాను సరైన ముహూర్తం పెట్టలేదని ఒప్పుకుంటాడా.? పిల్లల గణాలు కలవలేదని సంబంధాలు విచ్చగొట్టే పురోహితులు ఎక్కువయ్యారు నేడు, పూర్వం గణాలు కలవకపోయిన సంబంధం కుదర్చడానికి నాటి పురోహితులు పేర్లు మార్చి సంబంధం కుదిర్చేవారు, నాడు ఇన్ని విడాకులు తీసుకున్న జంటలు ఉన్నాయా? మరి ఇప్పుడు ఎందుకు అతిగా జాతకాల గూర్చి ఆలోచిస్తున్నారు?.

ఆ అన్నయ్య గణాలు కలవలేదని, జాతకాలు కలవలేదని, ఏ పురోహితుడు చెప్పలేదు, పురోహితులను సాకుగా వాడుకుంటున్నారు, అనవసరంగా వారిని బదనాం చేస్తున్నారు, అసలు నా మనవరాలికి పెళ్లి చేయడం నా కొడుక్కి ఇష్టంలేదు, తనకి కూతురు తెచ్చే డబ్బులుకావాలి తప్ప దాని సుఖసంతోషాలు అవసరం లేదు, నీ కూతురుకు అదే నా కోడలుకు కోట్లల్లో పడగలెత్తిన అల్లుడు కావాలి, ఇగ నామనవరాలికి ఎర్రగా, బుర్రగా వుండే ఆరుఅడుగుల అందగాడు కావాలి, మా ఇంటిలో సంబంధం ఒకరికినచ్చితే ఒకరికినచ్చదు, అందరికి నచ్చితే నా మనవరాలిని వారు నచ్చరు, ఇది నామనవరాలి పెళ్లిబాగోతం అన్నయ్య అని బట్టలు సర్దుకున్న బ్రేఫ్ కేసు పట్టుకొని అన్నయ్య ఎదురుగా నిల్చొని కంటి నుండి నీరు కారుతుండగా అంది శారదమ్మ.

ఎక్కడికి శారద బయలు దేరావు?, ఏడుస్తున్నావ్ ఎందుకు? లాలనగా దగ్గరకు తీసుకున్నాడు సుదర్శన్, గట్టిగా సుదర్శన్ ను పట్టుకొని వెక్కి, వెక్కి ఏడుస్తూనే మనవరాలి పెళ్లి చేయండి అని అన్నందుకు నన్ను ఓ శత్రువులా చూస్తున్నారు, నన్ను బయటికి వెళ్లిపొమ్మని అంటున్నారు, ఇక నేను ఇక్కడ ఉండాలేనురా అన్నయ్య, బయట అడుగుపెడితే చాలు తెలిసిన, తెలియని వారందరు మనవడి, మనవరాలి పెళ్లి గూర్చి ఎకసక్కెంగా మాట్లాడి చాటుమాటుగా నవ్వుతున్నారు, ఇంట్లో చెబితే వినరు నన్ను ఏం చేయమంటావ్ అన్నయ్య ఇగ ఇక్కడ వుండలేనురా అంది శారదమ్మ.

రా ఇక్కడకూర్చో నేను మాట్లాడుతానుకదా అని నెమ్మదిగా సోఫాలో కూర్చోబెట్టి తాను ప్రక్కకు కూర్చున్నాడు సుదర్శన్.

స్నానం చేసి వెంట్రుకలను టవల్ తో తుడుచుకుంటూ మళ్ళీ మొదలు పెట్టింది ముసలిది అంటూ హాల్ లోకి వచ్చి తాతయ్య ఎప్పుడు వచ్చారు అంది శ్రేష్ఠ.

పెద్దవాళ్ళు అంటే గౌరవం లేదా ఆలా మాట్లాడొచ్చా, ఇదేనా మీ మమ్మి నేర్పించింది అని కోపంతో చూసాడు సుదర్శన్, సారితాతయ్య అని తలవంచుకుంది శ్రేష్ఠ.

నీకు అందంలో మన్మధుడు లాంటి అబ్బాయిని కావాలనుకోవడంలో తప్పులేదు, అలాంటి అందమైన అబ్బాయి తనకికూడ రతీదేవి లాంటి భార్య కావాలను కోవడం లో తప్పులేదుకదా!, నీకు అప్పుడే 29 సంవత్సరాలు దాటినవి, నీ శరీరం నీ అదుపులో ఉందా అప్పుడే ఇంచుమించు 70 కిలోల బరువు వున్నావు, నిన్ను చేసుకోబోయేవాడు నిన్ను ఎలా నచ్చుతాడు ఇంకా ఇలా వరుడు నచ్చలేదని తిరస్కరిస్తూ పోతే ఆఖరికి ఎవడో బోడిలింగం దొరికితేచాలు అనుకునే పరిస్థితి వస్తుంది తెలుసా అని శ్రేష్ఠ ను ఉద్దేశించి అన్నాడు సుదర్శన్.

తలఎత్తి ఒకసారి సుదర్శన్ మోహంలోకి చూసి ఏడుపు మోహంతో తలవంచుకొని మౌనంగా రోదించసాగింది శ్రేష్ఠ.

రమ్య నీ సంగతి చెప్పు, నీకు కోట్లు పడగలెత్తిన వాడు అల్లుడుగా రావాలనుకోవడం తప్పులేదు, మనగూర్చి కూడా ఎదుటివాడు ఆలోచిస్తాడు కదా! వాళ్ళు కూడా తమకు తగిన సంబంధం కావాలనుకుంటారు కదా.

ఇప్పుడు నీ కూతురుకు తగినట్లు అబ్బాయికి కనీసం 34 సంవత్సరాలు అబ్బాయి కావాలి, ఎంతమంది ఇంకా అంత వయస్సు వున్న అబ్బాయిలు వుంటారు, మున్ముందు ఇక సంబంధాలు రావడం కష్టం అవుతుంది అప్పుడు పరిస్థితి ఏమిటి? ఇప్పుడు శ్రేష్టకు పెళ్లి చేసినా త్వరితగతిన పిల్లలు కలిగితే పర్వాలేదు, అదే ఆలస్యం అయి ఆలస్యంగా పిల్లలు కలిగితే పిల్లల వయస్సు 20 సంవత్సరాలు వచ్చే సరికి వీరి వయస్సు 60 సంవత్సరాలకు దగ్గరలో వుంటారు, దురదృష్టం వెన్నాడితే వారి అచ్చట ముచ్చట తీరకుండానే కాలం తీరిపోతారు, ఇది మీ ఫ్యామిలీ ఒక్కదాని గూర్చే అనడంలేదు కుంటిసాకులతో కాళ్ళకాడికి వచ్చిన సంబంధాలను కాదనుకొని తర్వాత సంబంధాలకోసం కళ్ళారిగేలా తిరిగే ఎంతోమందిని వుద్దేశించి అంటున్న మాటలు ఇవి, “సంబంధం విషయంలో కొన్ని కొన్ని విషయాలలో రాజీ పడాలి తప్పదు”, అమ్మాయిలకు ఆలస్యంగా వివాహం చేసినా వరుడి తల్లితండ్రుల వయస్సు సుమారు 60 సంవత్సరాలు ఉంటుంది, అత్తగారి ఇంటికి వెళ్ళగానే వారికి సేవలు చేయకతప్పదు, చేయను అంటే గొడవలు, వెరసి విడాకులు, రమ్య నీకు అల్లుడుగారికి వయస్సు ఇప్పుడు 60 సంవత్సరాలకు చేరువలో వున్నారు, ఈ రోజుల్లో 50 సంవత్సరాలు దాటితేనే అనేక రోగాలు చుట్టుముట్టుతున్నాయి, ఎన్ని రోజులు బ్రతుకుతారో తెలియదు, ఈ చివరి రోజుల్లో మనుమలు మనమరాళ్ళతో ఆడుకోవాలని లేదా ?

పిల్లల సంపాదనతో మీరు వెనకేసుకొని ఏమిచేస్తారు, ఆసంపాదన ఎవరికోసం, అన్ని వుండి పిల్లలకు సరైన తిండి, బట్ట ఇవ్వని పిసినారి తల్లిదండ్రులు ఎందరో వున్నారు, పిల్లల సంతోషం కంటే తల్లిదండ్రులకు కావల్సింది ఏముంది?, ఈ సంపదనంతా ఎవరికోసం, మీకు అప్పుడే షుగర్, బిపి లు వచ్చాయి, ఈ వయస్సులో మీరు తినలేరు, త్రాగలేరు మరి సంపాదన ఎందుకమ్మా,

నా చెల్లెలు తన బాధ్యతగా తాను చెప్పాల్సింది చెప్పింది, పెద్దవాళ్ళు తమ అనుభవంతో అన్ని అలోచించి చెబుతారు, మంచిమాటలు మీకు చెవినబట్టలేదు, సరికదా తనని ఇంటినుండి బయటికి గెంటెయ్యాలని చూసారు అని అల్లుడిని అనలేక కూతురును ఉద్దేశించి అన్నాడు సుధర్శన్.

తండ్రి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, శరీరం అంధఃపాతాళంలోకి వెళుతున్నట్లు అనిపించి, కంటినుండి నీరు ధారాళంగా రాసాగింది రమ్యకు.

తాతయ్య మీరు ఏ సంబంధం చేసుకోమంటే అదే సంబంధం చేసుకుంటాను, చెప్పుడు మాటలు విని అనవసరంగా ఎదో, ఏదేదో వూహించుకున్నాను అని ఏవగింపుగా తండ్రి వైపు చూస్తూ అంది శ్రేష్ఠ, కూతురు చూపులు చురకత్తులవలే గుచ్చుకున్నట్లై తల మరోవైపు తిప్పుకున్నాడు శేఖర్.

శ్రేష్ఠ నీకు పెళ్లి కావాలని మీ ఇంటిలోని అందరు మనఃస్ఫూర్తిగా అనుకుంటే మీరందరు కలిసి మా ఇంటికి రండి, రెండో మాటకు అవకాశం ఇవ్వకుండా శారదా రారా అని ప్రక్కనే వున్న బ్రీఫ్ కేసు ను అందుకొని చెల్లెలు చెయ్యిని పట్టుకొని బయటికి దారి తీసాడు సుదర్శన్.

ముగింపు: ఒక తండ్రి స్థానంలో వుండి సదాశయంతో వ్రాసిన ఈ కథలో మంచిని స్వీకరిస్తారని, ఎవరినైనా-

నొప్పించినా నన్ను మన్నిస్తారని ఆశిస్తూ ..మీ రచయిత:

****

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు