ప్రయోగం - మద్దూరి నరసింహమూర్తి

Prayogam

ఈ కథా నాయకులైన 4 మర్కటాలు -- రామారావు, కృష్ణారావు, గోవింద్, గోపాల్ -- ఆంధ్రేతర రాష్ట్రంలోని చిన్న ఊళ్ళో, నాలుగు వేరు వేరు కార్యాలయాలలో పనిచేస్తూ, అందరూ సుమారుగా ఒకే ఈడు వారు - ముఖ్యంగా తెలుగువారే అవడంతో - సత్రం తిండి మఠం నిద్ర అన్నట్టుగా ఒకే ఇంట్లో అద్దెకు ఉంటూ ఒకే హోటల్ లో తింటూ ఉండేవారు. ప్రతీరోజూ లేస్తూనే కాఫీ త్రాగడానికి హోటల్ కి వెళ్లే ఓపిక తగ్గి స్టవ్ కొనుక్కొని దగ్గరగా ఉన్న పాలవాడి దగ్గర రోజూ అరలీటర్ పాలు కొనుక్కుంటూ చిక్కటి కాఫీ త్రాగేవారు. తరువాత స్నానాలు కానిచ్చి, టిఫిన్ కి రెండు పూటలా భోజనానికి హోటల్ మీద పడేవారు.

అలా గడుస్తూండగా – ఒక శుక్రవారం ఉదయం భోజనం చేస్తూ --

రామారావు : ఈ హోటల్ వాడు పెట్టే ఒకేలాంటి తిండి తిని తిని చికాకొస్తోంది. రేపు శనివారం రాత్రి భోజనానికి వీడి దగ్గర మానేసి, మనమే ఇంట్లో ఏదేనా ప్రయోగం చేద్దామా.

కృష్ణారావు : మన దగ్గర ఆ డొక్కు స్టవ్, పాలు మరిగించే గిన్నె, ఒక స్పూన్, నాలుగు గ్లాసులు తప్పితే మరేమీ లేవు కదా.

గోవింద్ : మనకి కావలసిన సరుకులు కొనుక్కొని, కావల్సిన సామాన్లు పక్కవాళ్ళింట్లో ముష్టి ఎత్తుదాం.

గోపాల్ : పూరీ, కూరా, సేమియా పాయసం చేసుకుందామా.

కృష్ణారావు : ఒక పూరీ కనీసం 100 గ్రాములు ఉంటుందనుకుంటా. ఒక్కొక్కరం కనీసం 10 పూరీలు లాగించలేమా.

గోవింద్ : అలాగైతే, 4 కేజీలు గోధుమ పిండి కొంటే సరిపోతుంది. నూనె కూడా ఒక కేజీ కొంటే సరిపోతుందనుకుంటా.

గోపాల్ : ఈ హోటల్ వాడికి రేపు రాత్రి భోజనానికి రావడం లేదు అని చెప్పేస్తే సరి. ముందుగా చెప్పకపొతే, మీకోసం వండేను కదా అని మనం రాకున్నా, మన ఖాతాలో బాకీ రాసేస్తాడు.

నలుగురూ బజారుకి వెళ్లి 4 కేజీలు గోధుమ పిండి, కేజీ నూనె, ఒక సేమియా ప్యాకెట్, వంద గ్రాములు జీడిపప్పు, వంద గ్రాములు నెయ్యి, కేజీ పంచదార, వంద గ్రాములు ఉప్పు, వంద గ్రాములు పచ్చిమిర్చి, రెండు కేజీలు దుంపలు, ఒక కేజీ ఉల్లిపాయలు కొన్నారు.

పక్కవాళ్ళింట్లో పూరీల పీట, కర్ర , మూకుడు, చట్రం, అట్లకాడ, 2 గరిటెలు, పెద్ద గిన్నెలు రెండు, చిన్న గిన్నెలు రెండు, ఒక చాకు, 4 స్పూన్లు తెచ్చుకున్నారు. పెరట్లోనే ఉన్న అరటి చెట్టు వారికి కావలసిన ఆకులు పళ్లతో సహా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

భళ్ళున తెల్లవారి శనివారం రానే వచ్చింది. పాలు ఒక లీటర్ ఎక్కువ కొన్నారు, పాయసం కోసం.

ఆఫీస్ లు అయిన తరువాత -- పాకాలమీద పడ్డారు నల భీములు.

స్టవ్ మంట ఎక్కువగా ఉండడంతో నెయ్యి వేసి వేయించిన సేమియా కాస్తా ఎక్కువగానే మాడింది. గిన్నె అడుగుకి అట్టకట్టిన పాలు కూడా మాడు వాసనతో ఘుమ ఘుమ లాడేయి. నాలుగు కేజీల పిండి ఒకేసారి కలిపితే - ఒక చిన్న సైజు పర్వతాకారం కనుల నిండుగా ప్రత్యక్షమైంది. పూరీలు ఒత్తుతూంటే, పీటకి పిండి అంటుకుంటూ, అనేక దేశపటాల చిత్రాలన్నీ కళ్ళ ముందర కనువిందు చేసేయి. పోనీ అవే వేయించుకుందాం అని మరిగిన నూనెలో హుషారుగా వేసేసరికి, మరుగుతున్న నూనె నలుగురి శరీరాల్ని వెచ్చగా పలకరించింది.

తుళ్ళిపడిన ఆ నలుగురూ భయం వేసి, స్టవ్ ఆర్పేసి, చల్లటి నీళ్లతో వేడి నూనె పడిన చోట కడుక్కొని, మందుల దుకాణానికి వెళ్లి 'బర్నాల్' పూసుకున్నారు.

తరువాత ఈదురోమని, 'సీతాపతి' ని వేడుకొని, వాడు పిల్లి మీద కుక్క మీద పెట్టి తిడుతూ, పెట్టిన గడ్డినే అమృతంలా ఆరగించి –

అలవి కాని ప్రయోగాల జోలికి ఇంకెప్పుడూ వెళ్లకూడదని –

ఎవరి చెంపలు వారే గట్టిగా వాయించుకున్నారు.

*****

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు