సమయపాలన - నారంశెట్టి ఉమామహేశ్వరరావు

Samayapalana

సమయం ఉదయం పదిన్నర అవుతోంది. తన దగ్గర చదువుతున్న విద్యార్థుల్లో సగం మంది కూడా తరగతి గదిలో కనిపించలేదు. కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నారు రాఘవయ్య మాష్టారు. అందుకు సరైన కారణం లేకపోలేదు.
అంతకు ముందురోజు సాయంత్రమే సేవా దృక్పథం ఉన్న ఒక వేదగణిత పండితుడు ఆ బడికి వచ్చాడు. గణితంలో గమ్మత్తులు, సులువుగా లెక్కలు చెయ్యడం, కఠినమైన సమస్యలను సులువుగా, వేగంగా పరిష్కరించే చిట్కాలను పిల్లలకు ఉచితంగా నేర్పిస్తానని, అందుకు తనకు అవకాశం ఇమ్మని అడిగాడు. గణితం మీద పట్టు సాధించిన విద్యార్థులు తరగతి వార్షిక పరీక్షల్లోనే కాకుండా ఉద్యోగాలకు జరిగే పోటీ పరీక్షల్లోనూ విజయం పొందగలరని వేదగణిత పండితుడు ధీమాగా చెప్పాడు.
అలాంటి పండితుడి చేత ప్రత్యేక బోధన చేయిస్తే గణితంలో వెనుకబడిన పిల్లలకు సులువుగా అర్ధమవుతుందని భావించారు రాఘవయ్య గారు. పిల్లలతో ఆ విషయం చెప్పగానే ఆదివారమయినా సరే వస్తామన్నారు విద్యార్థులు. దాంతో వేదగణిత పండితుడికి సరేనని మాట ఇచ్చారు రాఘవయ్య.
అనుకున్న సమయం గడిచిపోతోంది కానీ పిల్లలందరూ రాలేదు. మాష్టారుకి తలకొట్టేసినట్టు ఉంది. అరగంట తరువాత మిగతా పిల్లలంతా ఒకరొకరుగా హాజరయ్యారు.
విద్యార్థులని తరగతిలో కూర్చోబెట్టి తనకున్న అపారమైన అనుభవం, నైపుణ్యం జోడించి అనేక గణిత విషయాలను సులభంగా అర్ధమయ్యేలా చెప్పారు ఆ వేదగణిత పండితుడు. విద్యార్థుల చేత జేజేలు అందుకుని వెళ్లిపోయారు వేదగణిత పండితుడు.
ఆయన వెళ్ళిపోయాక “మీలో చాలా మంది ఆలస్యంగా వచ్చారు? ఏమైంది” అనడిగారు మాష్టారు.
“ఆదివారమని ఆలస్యంగా నిద్ర లేచాను” అని ఒకరు జవాబు చెప్పారు.
‘బస్సు దొరకలేదని ‘ మరొకరన్నారు. ఇంకో అమ్మాయి ‘మా ఇంటికి చుట్టాలు వచ్చారని, అమ్మ సాయం చేయమంటే చేసానని” చెప్పింది. అలా ఒక్కొక్కరూ ఒక్కో కారణం చెప్పారు.
వాళ్లు చెప్పిందంతా ఆలకించిన మాష్టారు ‘మీరు జీవితంలో గొప్పస్థాయికి చేరాలంటే సమయపాలన పాటించాలి. తెలిసిందా ? ” అని అడిగారు,
ఒక విద్యార్థి లేచి నిలబడి “అంటే ఏమిటి మాష్టారు?” అనడిగాడు.
“చెప్పిన సమయానికి చేస్తామన్న పని ప్రారంభించడం, వెళ్లాల్సిన ప్రదేశానికి వెళ్లడం లాంటివన్నమాట. ఈ వయసులోనే మీకు అలసత్వం, బద్ధకం పనికి రాదు. తొమ్మిదిన్నరకు రావాలంటే తొమ్మిదింపావుకి వచ్చేలా సిద్ధపడాలి. అప్పుడే ఏదైనా ఆటంకం వచ్చినా సరే అనుకున్న సమయానికి అనుకున్న చోటుకి వెళ్ళగలం. బడికి హాజరయ్యే విషయం కూడా అలాంటిదే” అన్నారు రాఘవయ్య మాష్టారు.
అది విన్న ఒక విద్యార్థి లేచి “ఒక్క రోజే కదా ఆలస్యమయ్యాము. అంతే కదా” అన్నాడు.
మాష్టారుకి కోపం వచ్చింది. “ఒక్కరోజని కాదు. అదో అలవాటుగా మారితే ప్రమాదం. మిమ్మల్ని సరైన దారిలో నడపాల్సిన బాధ్యత నామీద ఉంది. ఇప్పటినుండే తేలిగ్గా తీసుకోవడం మొదలైతే భవిష్యత్తులో మీకు నష్టం కలుగుతుందని బాధ కలుగుతోంది” అన్నారు.
“తప్పయింది మాష్టారు .. “ అని తలదించుకున్నాడు ఆ విద్యార్థి.
మాష్టారు ఈసారి పిల్లల వైపు చూసి “టెలిఫోను కనిపెట్టింది ఎవరో తెలుసా?” అనడిగారు. “ఓ తెలుసు. అలెగ్జాండర్ గ్రాహంబెల్” అన్నారు అందరూ .
“కానీ మీకు తెలియని విషయం ఒకటుంది. గ్రాహంబెల్ కంటే ముందుగానే ‘ఎలీషా గ్రే ‘ టెలిఫోన్ ని కనిపెట్టాడు. ఆయన ముందుగానే టెలీఫోన్ కనిపెట్టినప్పటికీ పేటెంట్ రైట్స్ నమోదు చెయ్యడానికి ఆలస్యంగా వెళ్లారు. అప్పటికే అతనికంటే ముందుగా వెళ్లిన గ్రాహంబెల్ దరకాస్తు చేయడం వలన ఆ ఆవిష్కరణను ఆయన పేరున నమోదు చేశారు. అందువల్ల ఎలీషా గ్రే కు దక్కాల్సిన ఖ్యాతి దక్కలేదు. అంతేకాదు రాయల్టీ రూపంలో అందాల్సిన ఎంతో డబ్బుని కోల్పోయాడు కూడా . ఆ ప్రయోజనాలన్నీ ముందుగా దరకాస్తు చేసుకున్న గ్రాహంబెల్ కి దక్కాయి. సమయపాలన పాటించకపోవడం వల్ల చాలా ఖ్యాతిని, డబ్బుని నష్టపోయాడు ఎలీషా గ్రే” అని చెప్పారు.
తరగతి లోని పిల్లలంతా “అవునా” అని ఆశ్చర్యపోయారు.
మరల రాఘవయ్య మాష్టారు ” ఎవరైనా రోగిని సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకు వెళ్ళలేదనుకోండి. సరైన సమయానికి వైద్య సహాయం అందకపోవడం వల్ల ఆ రోగి ప్రాణాలు పోవచ్చు. ఏదైనా ప్రయాణం ఉన్నప్పుడు సమయానికి బస్సులు నిలిపే స్థలానికి వెళ్లలేదనుకోండి. బస్సుని అందుకోలేకపోవచ్చు. ప్రయాణమే రద్దవవచ్చు. లేదంటే వాయిదా పడవచ్చు. అందుకే సమయానికి పనులు చేయడాన్ని అలవరచుకోవాలి. అలవాటుగా మార్చుకోవాలి. సమయాన్ని వృధా చెయ్యకూడదు“ అని చెప్పారు.
‘సమయాన్ని వృధా చేయడమంటే ఏమిటో చెప్పండి’ అన్నారు పిల్లలంతా .
“ఎవరికీ ఉపయోగం లేని కబుర్లతో కాలం గడపడమే సమయాన్ని వృధా చేయడం. అలాంటివి విద్యార్థులే కాదు పెద్దలు కూడా మానెయ్యాలి. ఉపయోగపడే పనులకు సమయాన్ని వెచ్చించాలి. మీకో విషయం తెలుసా? ఆఫీసుకు లిఫ్టులో వెళ్ళేటప్పుడు కూడా మన ప్రధాని జవహర్ లాల్ నెహ్రు పుస్తకాలను చదివేవారు. ఆ కాస్త సమయాన్ని కూడా వృధా చేసేవారు కాదు. సమయాన్ని సద్వినియోగం చేయడమంటే అదే. మీరు కూడా తెలివిగా కాలాన్ని వినియోగించడం నేర్చుకోవాలి” అని ముగించారు.
పిల్లంతా పశ్చాత్తాపం చెందిన మనసుతో “తప్పయింది మాష్టారు. మరెప్పుడూ క్లాసుకి ఆలస్యంగా హాజరవ్వము. సమయాన్ని వృధా చెయ్యము” అని మాట ఇచ్చారు. వారి మాటలని విశ్వసించారు రాఘవయ్య మాష్టారు.

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు