ప్రేమించిన మనస్సు - హేమావతి బొబ్బు

Preminchina manassu

"వాసు ఇంకోసారి ఆలోచించు, ఇలా చేయడం మంచిదేనంటావా", ఆ మాట నేను అప్పటికి అడగడం ఏ పదిహేనోసారి అని అనుకొంటా.

"నా ఆలోచన మంచిదే భాస్కర్", అని వాసు జవాబు.

"నువ్వొకసారి ప్రతిమా ని సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకుపోవడం నేను మంచిదనుకొంటున్నాను. తను మనస్సులో ఏదో దాచుకొని నీతో దగ్గరగా మసలడం లేదని నాకు అనిపిస్తున్నది భాస్కర్".

కాని.......వాసు, ప్రతిమ నేను ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నాం, మరి తను నన్ను ఎందుకు ఇలా దూరం ఉంచుతున్నది. ప్రతిమకు నేనంటే ఎంతో ఇష్టం. తను చక్కగా వంట చేస్తుంది, ప్రేమగా అమ్మ నాన్నలని పలకరిస్తుంది, కానీ ........... నన్ను ఎందుకు తనతో చేరువగా మసలనీయడంలేదని నాకు చాలా బాధగా ఉంది.

"భాస్కర్, ఈరోజు సాయంత్రం సైకాలజిస్ట్ దగ్గరకు నీవు ప్రతిమని తీసుకొని వెళ్ళు. నేను డాక్టర్ గారికి మీ గురించి చెప్పి ఉంచాను" . మా వాసుకి తెలివితేటల మీద నాకు చాలా నమ్మకం. తను నాకు అక్కే కాదు, ఒక మంచి గైడ్ కూడా.

ఓకే వాసు, అని ఫోన్ పెట్టేసాను. ఆఫీస్ నుండి ఇంటికి త్వరత్వరగా బయలుదేరాను.

కాలింగ్ బెల్ కొట్టక మునుపే, ప్రతిమ నాకోసమే ఎదురుచూస్తున్నట్లు తలుపు తీయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అరే మీరు ఇవ్వాళ ఏంటి ఇంత తొందరగా ఇంటికి వచ్చారు చిరునవ్వుతో ప్రతిమ. తనని అలా చూస్తుంటే గాలికి ఎగురుతున్న తన ముంగురులు వలలా నన్ను బందించాయి కదా అని అనుకున్నా."ప్రతిమ, కొంచెం వేడి వేడి చాయ్ ఇవ్వవా, అలాగే కొంచెం తొందరగా బయలుదేరు డాక్టర్ అప్పాఇంట్ మెంట్ ఉంది". "ఎందుకు భాస్కర్, ఒంట్లో ఏదైనా నలతగా ఉందా".

"నీకు ఎలా చెప్పలో అర్థం కావట్లేదు, నేను ఈరోజు సైకాలజిస్ట్ అప్పాఇంట్ మెంట్ తీసుకున్నాను. నువ్వు నాతో ఎంతో ప్రేమగా ఉన్నా ఎందుకో నన్ను దూరంగా ఉంచుతున్నావు. నీకు తెలుసు కదా నాకు పిల్లలంటే ఎంతో ఇష్టం, నాకు నీలాంటి చిన్నారి పాపాయి కావాలి. నువ్వు నాకు చెప్పకపోయినా పర్వాలేదు, నీలోని భయాన్ని పారద్రోలాలని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ నా మాట కాదనవద్దు ప్రతిమ".

భాస్కర్............... తన కండ్లల్లో కన్నీళ్లు.

సారీ........ప్రతిమ.

ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉన్న ప్రతిమ, "భాస్కర్ నీతో నిజం చెప్తున్నాను, నేను ఏ పాపం ఎరుగను. నీకు చెప్పాను కదా అమ్మ నాన్న ఇద్దరిది బ్యాంక్ జాబ్ అని, నేను ఎక్కువగా హాస్టల్ లో ఉండి చదువుకున్నానని, అన్నయ్యని, నన్ను, అమ్మా నాన్నలు ఎంతో ప్రేమగా చూసేవారు నా బాల్యం ఎంతో ఆనందంగా సాగింది" అన్నది.

అప్పుడు నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో, అమ్మకు ఆరోగ్యం బాలేనప్పుడు నాన్న అమ్మని చెన్నై విజయా నర్సింగ్ హోం లో చేర్చారు. అక్కడ అమ్మకి గర్భసంచీ తీసేసారు. నాన్నకి బ్యాంక్ లో ఆడిటింగ్ ఉందని అమ్మకి తోడుగా నన్ను, ప్రతాప్ అన్నయ్య ని ఉంచారు. ప్రతాప్ అన్నయ్య నాకు చిన్నతనం నుండి తెలుసు. మా అమ్మ తనని మా అన్నయ్య తో సమంగా చూసేది. మా ఇద్దరి కుటుంబాల మద్య మంచి స్నేహం ఉండేది.

సో, నేను అమ్మకి అలా తోడుగా ఉన్నప్పుడు, ఆ రోజు అతను హోటల్ రూం లొ నేను ఒంటరిగా ఉన్నది చూసి నన్ను.....................బలత్కారం చేసాడు. అక్కడ మేము ఉన్నది నాలుగు రోజులైనా, నాన్న లేని క్షణాన అతను అలా అమ్మానాన్న ల నమ్మకాన్ని ఛిద్రం చేసాడు. నాన్న ఆ రోజు రాత్రి తిరిగి రాగానే నేను నాన్నకి చెప్పాలని అనుకున్నాను. కానీ ఈ విషయం నాన్నకి చెపితే మా అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు అని అతను నన్ను బెదిరించాడు . నేను చెప్పలేదు, అది కూడా అమ్మకి బాగోలేని క్షణాన ఎలా చెప్పను.

అన్నయ్య అని నమ్మిన అతను ఎన్ని రోజుల నుండి ఎదురు చూసాడో ఆ క్షణం కోసం.

తరువాత అమ్మని నాన్నని ఒప్పించి నేను హైదరాబాద్ లో ఇంజనీరింగ్ లో చేరాను.

అతను నన్ను మాటల్లో దించి తిరిగి ఒప్పించాలని చూసాడు. అమ్మకి నాన్నకి నా మీద లేనిపోనివి చెప్పాడు. నేను మనస్సు చంపుకొని అందరికీ దూరంగా ఉండి చదువుకు న్నాను. ఆ సంఘటన నాలో చెరగని ముద్ర వేసింది. మగవారంటే అసహ్యం వేసింది. కానీ నువ్వు పరిచయం అయిన తరువాత నాలో మార్పు వచ్చింది. నీ మీద ప్రేమ చిగురించింది. నిజం భాస్కర్ నేను ఏ తప్పు చేయలేదు.

...........కళ్ళనీళ్ల తో అంటున్న తనని చూసి, పిచ్చి పిల్ల నీ మనస్సు నిర్మలమైనది. వాడెవడో చేసిన తప్పుకు నిన్ను ఎందుకు బలి చేసుకుంటావు. నాకు నువ్వు కావాలి, అంటూ ప్రేమ గా తనని దగ్గరకు తీసుకొని హత్తుకున్నాను.

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు