అవును ఆయన అవాక్కయ్యాడు! - లక్ష్మీ సుజాత

avunu aayana avaakkayyadu

ప్రసాద్ చెల్లెలి పెళ్ళిచూపులు జరుగుతున్నాయి.

అప్పుడే వచ్చిన ప్రసాద్ తో వాళ్ళ నాన్న "చెల్లెలి పెళ్ళిచూపులని తెలుసుగా... ఇప్పుడా రావడం?" అన్నాడు.

"ఎప్పుడొచ్చామన్నది కాదు ప్రశ్న అసలొచ్చామా లేదా అన్నది ముఖ్యం" అంటూ కూర్చున్నాడు.

"ఈ అబ్బాయీ..." అడిగారు అక్కడున్నవాళ్ళు.

"ఎవరి పేరు చెబితే చెల్లెల్లందరూ రాఖీకట్టిన అన్నయ్యగా భావిస్తారో వాడే ప్రసాద్, అంటే నేను... ఈ చెల్లెకి రక్తం పంచుకు పుట్టిన అన్నయ్యని"

"అమ్మాయికి... వంట చేయడం... పాటలు పాడడం వచ్చా" పెళ్ళికొడుకు తల్లి ప్రశ్నించింది.

"అవే కాదు... మీక్కావలసిన వాటికన్నా ఒకటెక్కువగానే వచ్చు నా బంగారు చెల్లెకి... మీకేవన్నా అభ్యంతరమా?" సూటిగా చూస్తూ అన్నాడు ప్రసాద్.

వాళ్ళు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు.

"అమ్మాయి లక్షణంగా వుంది. మీ సంప్రదాయమూ నచ్చింది. ఇహ తాత్సారం చేయకుండా కట్నాలు కానుకలు గురించి మాట్లాడుకుంటే..." అబ్బాయి తండ్రి అన్నాడు.

"కట్నాలు కానుకలా?... మేమిచ్చే పొజిషన్లో వున్నా ఇవ్వం. ఎందుకంటే రేపు మీరు చచ్చి నరకానికి వెళితే గరుడపురాణం ప్రకారం కనుకాట్నక శిక్ష వేస్తారు. అంటే బంగారం... డబ్బుల్లో... గుండు సూదులూ... దబ్బనాలు పెట్టి వాటితో హింసిస్తారు. మంచితనంతో మా చెల్లెని ఇంటికోడలిగా చేసుకుంటే ఆడియో ఫంక్షనంత గ్రాండుగా పెళ్ళి జరిపిస్తాం. ప్రతి పండక్కీ సినిమా విజయోత్సవాలంత వేడుకలు జరిపిస్తాం. కాని రేపు పెళ్ళయ్యాక మా చెల్లెని వేదిస్తే అమ్మతోడు నేను అందర్నీ అడ్డంగా నరికేస్తా" అన్నాడు క్రోధంగా...

దానికి వచ్చినవాళ్ళందరూ భయంతో బిక్కచచ్చిపోయి "సరేనండి మేము వెళ్ళొస్తాం... త్వరలో ఏ విషయం ఉత్తరం రాస్తాం" అంటూ పారిపోయారు.

"ఈ పెళ్ళిచూపులకన్నా నువ్వు రాకూడదని వెయ్యి దేముళ్ళకి మొక్కుకున్నాను... నా మొర ఎవరూ వినలేదు. నువ్వు తగలడ్డావు. ఈ పెళ్ళిచూపుల తతంగాన్ని తగలెట్టావు" క్రోధంగా కొడుకువంక చూస్తూ అన్నాడు పరంధామయ్య.

"విన్నావా చెల్లెమ్మా నాన్న మాటలు! నా చెల్లెలి సుఖం తప్ప నాకేది ముఖ్యం కాదని నువ్వైనా మనసులో అనుకుంటే చాలు" అన్నాడు కళ్ళనీళ్లతో.

"ఏడిశావు. నీ మూలంగా నా ఆశలు ఆవిరై కోరికలు ఉడిగిపోతున్నాయి. నాన్న బ్రతికుండగా నా పెళ్ళిచేయనివ్వవు... అలాగని ఫ్యూచర్లో నువ్వూ చేయలేవు... ఛఁ... వెధవ బ్రతుకు నాది" అని విసుగ్గా లోపలికి వెళ్ళిపోయింది.

"నీ మాటతో ఈ అన్న గుండెకి గాయం చేశావమ్మా... గాయం చేశావు" అని సోఫాలో కుప్పకూలిపోయాడు.

***

"ఒరేయ్. నా రిటైర్మెంట్ కి ఇంకా మూడేళ్ళే వుంది. ఆ లోపల నువ్వు జీవితంలో సెటిలవ్వాలి. దయచేసి ఈసారన్నా ఇంటర్వ్యూలో చక్కగా సమాధానాలు చెప్పి ఉద్యోగం సంపాదించరా" వేడికోలుగా అడిగాడు పరంధామయ్య.

"ఈ ఇంటికీ... నీకూ ఆధారంగా వుండాలని నాకు మాత్రం అనిపించదా నాన్నా... కానీ విధికి అందరూ తలవంచాల్సిందే... ఏది రాసిపెట్టి వుంటే అది జరుగుతుంది... హుఁ" అని చెప్పి సర్టిఫికెట్ల ఫైల్ తీసుకుని వేగంగా బయటకెళ్ళిపోయాడు.

***

"ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఏది"

"అవినీతి"

ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

"ఈ ఉద్యోగం మీకు ఎంత అవసరమో చెప్పగలరా?"

"అంటే నా అవసరం మీకు లేదా?... మీరు ఛారిటీ సంస్థ స్థాపించి ఉద్యోగార్థుల అవసరాల కనుగుణంగా ఉద్యోగాలిచ్చి... జీతాలిస్తారా? అడుగడుగునా కుంభకోణాలు... ఆశ్రితపక్షపాతాలు... అవినీతిపర్వాలు... హుఁ." ఉద్రేకంతో ఊగిపోయాడు.

"మీకు షార్ట్ టెంపరనుకుంటా..?"

"ఏం మీకు వుండదా! మీరూ నా స్థాయి నుండే ఈ స్థాయికొచ్చారు కదా మర్చిపోయారా ఆ సంగతి? ఆ సీట్లో కూర్చోంగానే ‘గతం గతః’ అనుకోవడమేనా?... ఇహనుండైనా పనికొచ్చే ప్రశ్నలేసి, పనిచేసే వాళ్ళని తీసుకోండి. మీ సంస్థ, దేశం రెండూ బాగుపడతాయి. అంతేగాని లంచాలకోసం వేకెన్సీల నమ్ముకుని అభ్యర్ధుల జీవితాలని అంధకారం చేయొద్దు... ప్లీజ్" అని విసురుగా బయటకొచ్చేశాడు.

వాళ్ళకి క్షణం పాటు ఏమీ అర్ధం కాలేదు. బుర్ర హీటెక్కడంతో, ఇంటర్వ్యూలు మరుసటిరోజుకి వాయిదావేసి వెళ్ళిపోయారు.

***

"ఏరా ఉద్యోగం వచ్చిందా?" ఆశగా అడిగింది పార్వతమ్మ కొడుకుని.

"ఆ ముఖం చూస్తే తెలియడంలా ఏం వెలగబెట్టాడో" వ్యంగంగా అన్నాడు పరంధామయ్య.

"నిన్ను నీ బాధని అర్ధంచేసుకోలేని వాడు కాదు నాన్నా నీ కొడుకు. ప్రతి కుక్కకీ మొరిగే రోజు ఒకటి వస్తుంది. నీ కొడుక్కీ వస్తుంది. అప్పటిదాకా కూల్ గా వుండాలి కూల్ గా..." అని తన గదిలోకి వెళ్ళిపోయాడు.

***

"పార్వతీ! నేనేం పాపంచేశానని నాకు ఇలాంటి కొడుకుని ప్రసాదించాడు ఆ పరమేశ్వరుడు. నిష్ఠా గరిష్ఠుడిగా నిత్యకర్మలు చేశానే! అగ్నిహోత్రంతో... చేసిన పాపాలు పటాపంచలు చేసుకున్నానే అటువంటి నాకు..." బాధతో ఆయన గొంతు పూడుకుపోయింది.

"ఏవండీ మరే! వాడు అలాపుట్టడానికి కారణం మీరు కాదండీ, నేను. పాపిష్టిదాన్ని. నేను గర్భవతిగా వున్నప్పుడు రాజమండ్రి లో మా పుట్టింట్లో వుండేదాన్నికదా! అప్పడు మాఇంటి పక్కనే ఒక సినిమా టాకీస్ వుండేది. దాని యజమాని కుటుంబం మాకు తెలిసిన వాళ్ళే. దానితో నేను కాలక్షేపానికి ప్రతిరోజూ దాదాపు ప్రతి షోకీ సినిమాకెళ్ళేదాన్ని. ఫ్రీగా వస్తోందని సినిమా చూశానుగాని అది మన జీవితాల మీద ఇంతగా ప్రభావం చూపుతుందనుకోలేదు."అంది.

అప్పుడే అటుగా వచ్చిన ప్రసాద్ "అమ్మా! ఎంతపనిచేశావమ్మా! నీ ఆనందంకోసం నువ్వు సినిమా హాల్లో కూర్చుంటే దాని ఫలితం నా మీద పడింది. నేను నిజ జీవితంలో నటుడ్ని అయిపోయాను. నాన్నతో సహా సమాజం నన్ను అపహాస్యం చేస్తోంది. వేడుక చూస్తోంది. ఇదేనా మీరు తల్లిదండ్రులుగా నాకు చేసింది. నన్ను కనకపోయినా బావుండేదమ్మా! బావుండేది." అని తల్లి కాళ్ళమీద పడిపోయాడు.

పరంధామయ్యకి అంతా అయోమయంగా వుంది. గర్భవతిగా కొన్ని సినిమాలు చూసిన తన భార్యవల్ల తనకింతటి ఉపద్రవం ఎదురైతే... తన చుట్టాలు... తనకి తెలిసిన వాళ్ళు అహర్నీశలూ ఛానల్ టీవీలకి అతుక్కుపోయి మనోహింసాత్మక సీరియల్స్ కి బానిసలైపోతున్నారు. ఆ ప్రభావం వాళ్ళమానసిక స్థితిమీద, గర్భవతుల పిండాలమీద ఎటువంటి ప్రభావం చూపుతుందో... ముందు ముందు సమాజం ఎలా వికృతత్వాన్ని సంతరించుకుంటుందో ఊహించుకుంటుంటే ఒళ్ళు జలదరించింది. ఆయన చాలాసేపటి వరకూ అవాక్కయిపోయి అలా స్థాణువులా వుండిపోయాడు.

***

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ