"కిట్టయ్య" - యు.విజయశేఖర రెడ్డి

Kittayya

రాఘవాపురంలో ఉండే గుడి పూజారి రామశర్మ పోరుగూరు సీతాపురంలో నామకరణ మహోత్సవానికి వెళ్లదలచి అడ్డదారిలో వెళుతూ దాహమై పారుతున్న చెరువు వద్దకు వెళ్లి దోసిలి పట్టి నీళ్లు తాగుతుండగా ఆయనను ఒక పిల్లవాడు పక్కకు తోశాడు. “ఏరా నాయనా.. ఈ నీళ్లు తాగ కూడదా?” అన్నాడు రామశర్మ.

“క్షమించండి అయ్యగారు’ అని చేతిలో తోకను పట్టుకున్న నల్లటి తేలును చూపించి. “ఇది చాలా ప్రమాదకరమైంది తమరిని కుట్టబోయింది అందుకే తోసేశాను” అన్నాడు ఆ పిల్లవాడు. “నా ప్రాణాలు కాపాడవురా నాయనా” అని చేతులు ఎత్తి నమస్కరించాడు రామశర్మ. తరువాత దప్పిక తీర్చుకుని అటు పక్కగా ఉన్న రావి చెట్టును ఆనుకుని కూర్చున్నాడు. ఆ పిల్లవాడు కూడా కాస్త ఎడంగా కూర్చున్నాడు. ఆ పిల్లవాడికి సుమారు పదిహేను సంవత్సరాలు ఉంటాయి కానీ బలిష్టంగా ఉన్నాడు.

“నీ పేరేంటి.. ఎక్కడుంటావు..ఏంచేస్తుంటావు” అన్నాడు రామశర్మ” “అయ్యా! నా పేరు కిట్టయ్య, నా అనే వాళ్లు లేని నన్ను ఈ ఊరిలో ఉండే ఒక అవ్వ చేరదీసి పెంచింది. ఆరోగ్యం బాగులేక ఈ మధ్యనే ఆ అవ్వ చనిపోయింది. కొన్ని ఇళ్లకు ఈ చెరువు నుండే కావడితో నీళ్ల బిందెలు మోస్తుంటాను. అందుకు వారు పెట్టిన తిండి తిని జీవనం కొనసాగిస్తున్నాను..ఈ నల్ల తేళ్లు ఆ చెరువు వద్ద ఉన్న ఇసుకలో ఎక్కువగా ఉంటాయి” అని రావి ఆకులతో చేసిన బుట్ట నుండి తీసి చూపించాడు కిట్టయ్య.

“నాతో పాటు మా ఇంటికి వస్తావా? మాకూ పిల్లలు లేరు, మాతో పాటు ఉంటూ, నాకు సహాయకుడిగా ఉందువు గానీ” అన్నాడు రామశర్మ. “ ఓ అలాగే గురువుగారు పదండి..ఏదీ ఆ కాళీ చేతి సంచి ఇలా ఇవ్వండి” అని తీసుకుని కింద పడ్డ రావి ఆకులతో ఆ సంచిని నింపి, బుట్టలో నుండి తేలును తీసి సంచిలో వేశాడు. “కిట్టయ్యా..ఎందుకు ఆ తేలును వదిలేయకుండా సంచిలో వేశావు?” అన్నాడు. “ఆ తేలు అవసరం ఉంది గురువుగారు పదండి” అన్నాడు.

వారు కొద్ది దూరం పోగానే ఒక దొంగ వారిని అడ్డగించి చేతిలోని సంచిని ఇమ్మన్నాడు. “అయ్యా! ఇందులో ఆకులు తప్ప ఏమీ లేవు కావాలంటే చూడండి” అన్నాడు కిట్టయ్య. “ఆ...నాకు తెలియదనుకున్నవా.. ఆకుల మధ్యలో ధనం దాచి ఉంటారు” అని సంచిని లాక్కుని సంచిలో చెయ్యి పెట్టి తిప్పాడు.. అంతే తేలు దొంగ వేలును కుట్టింది “అయ్యో..చచ్చాను అని సంచిని పారేసి పరుగు తీశాడు.

“అబ్బో కిట్టయ్యా! .. నీవు తెలివి గల వాడివిరా” అన్నాడు రామశర్మ. చిరునవ్వు నవ్వాడు కిట్టయ్య. సీతాపురం పొలిమెరలో అడుగు పెడుతూనే ఒక పొద వద్ద ఆ సంచిని విదిలించి ఆ సంచిని మడిచాడు. నామకరణం చేయవలసిన ఇంటికి చేరుకుని కార్యక్రమం అయ్యాక వారు ఇచ్చిన సంభావనలను సంచిలో వేసుకుని, భోజనం చేసి మరో మార్గం గుండా ప్రయాణమై రామశర్మ ఇంటికి చేరుకున్నారు.

ఇంట్లో అడుగు పెడుతుండగానే “ఎవరండీ ఈ అబ్బాయి” అని అంది సీతమ్మ. జరిగిందంతా చెప్పాడు రామశర్మ. ‘తాను దూర కంత లేదు మెడకో డోలు అన్నట్టు’ ఉన్న చిన్న గదులు మనకే సరిపోవడం లేదు ఆ కిట్టయ్య ఎక్కడ ఉంటాడు” అంది సీతమ్మ. వారు మాట్లాడుకొంటుండగానే “అమ్మగారూ...సామాన్లు పెట్టుకునే గదిని చూసొచ్చాను బాగా సర్దితే నాకు పడుకోవడానికి కాస్త చోటు సరిపోతుంది” అని చెప్పి ఆ గదిలోకి వెళ్ళాడు.

కాసేపటికి బయటకు వచ్చి “గురువుగారూ అందులో ఉన్న పెద్ద దంపుడు రోలు కదలడం లేదు దాని చుట్టూ తవ్వి మట్టి తీస్తే కదులుతుంది.. అందుకు నాకు పలుగు, పారా కావాలి” అన్నాడు కిట్టయ్య. “పక్కింటి రంగయ్య వద్ద ఉంటాయి.. నా పేరు చెప్పి తీసుకురా” అన్నాడు రామశర్మ. కాసేపటికి అవి తెచ్చి తవ్వి మట్టి తెచ్చి బయట పారబోసి మళ్లీ “గురువుగారు ఒక సారి ఇలా రండి” అని కేక పెట్టాడు.

ఆ కేకలు విన్న రామశర్మ,సీతమ్మలు ఆ గదిలోకి వెళ్లారు. సగం వరకూ కదిలిన రోలు కింద చిన్న గొయ్యిని చూపించాడు అందులో గుడ్డ కట్టిన ఒక రాగి బిందె కనిపించింది. ఇద్దరూ ఆ రోలును కదుపుతుండగా సీతమ్మ కూడా ఒక చెయ్యి వేసింది. పూర్తిగా రోలు పక్కకు జరిపి ఆ బిందెను పైకి తీసి గుడ్డను విప్పాడు రామశర్మ, అందులో వెండి నాణేలు యాభై వరకూ ఉన్నాయి.

రామశర్మ,కిట్టయ్యతో సహా రాగి బిందెను తీసుకుని ఆ ఊరి జమీందారు ఇంటికి వెళ్లి జరిగింది చెప్పాడు. నీ స్థలంలో దొరికింది అవి మీ పూర్వీకులు దాచినవి కాబట్టి అవి నీకే చెందుతాయి..వాటిని నీకోసమే ఖర్చు పెడతాను అని వాటిని తీసుకొని ఇంకా కొంత ధనం తనే ఖర్చు చేసి పాత ఇల్లును పూర్తిగా తొలగించి కొత్త ఇల్లు కట్టించి, దేవాలయాన్ని ఇంకా అభివృద్ది చేయించాడు జమీందారు. “ఈ కిట్టయ్య వల్ల నీకు అంతా మంచే జరిగింది ’కలసొచ్చే కాలమొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు’ అంటారు పిల్లలు లేని నీవు ఈ కిట్టయ్యను దత్తత తీసుకో’ అన్నాడు జమీందారు. ఒక మంచి రోజు చూసి కిట్టయ్యను దత్తత తీసుకున్నారు రామశర్మ దంపతులు.***

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు