పరశురాముడూ - పళ్ళడాక్టరూ - ఆదూరి హైమవతి

parashuraamudoo - palladaaktaroo

చెప్పొద్దూ మాపరశురాముడు మహామొండి మనిషైనా డాక్టర్ల మాటంటే వేద వాఃక్కే! వాక్కు... అనకుండా వాఃక్కని ఎందుకన్నానంటే వాడి ఘట్టి నమ్మకాన్ని అంత గట్టిగా వత్తి వత్తి పలికి నట్లుంటుందనీ, అది మీకు అర్ధంమైనట్లుంటుందనీ నీ నీ. వేదాన్ని ఔపోసాన పట్టిన వేదపండితులు సైతం చెప్పినా నమ్మని విషయాలను డాక్టర్ అదీనీ, ఆచారిగారు చెప్తే ఇట్టే నమ్మేస్తాడు మా పరశురాముడు. ఇదే వేదంలో ఉండి ఉంటుందని వాడి నమ్మిక వాడికి చిన్నప్పట్నుంచీ అదో పిచ్చి ‘వైద్య నమ్మకం' . అది ఎలా ఏర్పడిందంటే...

మేం మూడో క్లాస్లో చదివేప్పుడనుకుంటా అంత బాగా గుర్తు లేదు కానీ, ఓమారు మా పరశురామునికి తీట పట్టింది. బళ్ళో అందరూ దూరంగా కూర్చునేవారు, తమకూ ఆతీట పట్టుకుంటుందనే భయంతో. వాడు పక్క నుంచీ వెళుతుంటే ముక్కు మూసుకునేవారు చీము వాసనకు! స్కూలు పంతులు పాపయ్య సైతం వాడి పలకని దూరంగా బల్ల మీద పెట్టి మరీ చూసేవారు.

ఎన్నోమార్లు "ఒరే! పరశురామా! కుంకుడు పిసరు తో వొళ్ళు బాగా రుద్దుకుని రోజుకు రెండు మార్లు స్నానం చేయరా! లేకపోతే శీకాకాయ పొడైనా సరే రా! వేప ఆకులు నూరి ఆ పచ్చడి వంటికి పట్టించి ఆరాక స్నానం చేయరా! ఇలా స్కూల్ కు వస్తే మా కందరికీ బాధేరా! నీవలా గోళ్ళతో గోక్కుంటుంటే రక్తం చీము కారి వాసనేస్తుంటే చూడటమే కష్టంగా ఉందిరా!" అని పాపం పంతులు పాపయ్యగారు రోజుకు పది మార్లయినా చెప్తూనే ఉండేవారు.

ఓరోజున ఆయన వాడికి ఓ అర్ధ శేరు కుంకుడు కాయలూ, శీకాకాయ పొడీ కొని తెచ్చిచ్చారు. ఐనా వాడు అది రుద్ది స్నానం చేస్తే ఒట్టు. పంతులుగారు వాళ్ళ అమ్మనూ నాన్నగారినీ పిల్చిమరీ చెప్పారు "ఏం చేయమంటారు చెప్పండి పంతులు గారూ! వాడేం చిన్నవాడా! పదేళ్ళు వంటి మీది కొచ్చాయి. (ఏమాట కామాటే చెప్పుకోవాలి మరి... కాస్త ఆలస్యంగా బళ్ళో చేరి కాస్త కాస్త చదువుతూ క్రింది వారికి బాడీగార్డ్ గా ఉండి స్నేహం కట్టాల నేసత్ సంకల్పంతో, నిదానమే ప్రధానమని మెల్లిగా చదూకోడం వల్ల పదేళ్ళకు మూడో తరగతిలో ఉండి మమల్నందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ పెద్దన్నలా ఉండేవాడు). వారానికోమారు స్నానం చేస్తే తీట, గజ్జి వస్తాయని ఎన్నిమార్లు చెప్పినా వినడే! ఏంకావాల్సి ఉంటే అదే అవనీండి పంతులుగారూ! మావల్లకాదు వాడిని మార్చటం." అని చెప్పి వెళ్ళారు.

ఓ శుభ ముహూర్తాన పంతులు గారు బళ్ళో మెడికల్ క్యాంప్ పెట్టించి పిల్లలందరినీ, డాక్టర్ గారి చేత పరీక్షలు చేయించారు. అప్పుడు చర్మవ్యాధి నిపుణుడైన ఆయుర్వేద వైద్యులు ఆచారిగారు వాడిని పిలిచి "నాయనా! పరశురామా! నీపేరు చాలా గొప్పది. నీవూ దానికి తగినట్లు ఉండాలోయ్! నీకు ప్రత్యేకంగా వైద్యమేమీ అవసరం లేదు. నేనిచ్చే మందు రోజూ వంటికి పట్టించి, ఆరాక రోజూ రెండు పూటలా ఈ మందుపొడి తో రుద్ది స్నానం చెయ్యి , రాత్రులు వంటికి ఈ నూనె పట్టించు ఈ మందు కాయలు రోజూ రెండు పూటలా మింగు, అంతే ఒక్క పదిరోజుల్లో నీ ఒంటి మీద ఒక్క పుండు ఉంటే చెప్పు, నేను వైద్యం చేయటం మానుకుంటా ఛాలెంజ్" అని చెప్పాడు.

అంతే ఆరోజు నుండీ వైద్యం మొదలెట్టుకుని బడి పంతులు గారు చెప్పిందే ఐనా వైద్యుల వారు చెప్పిన వేప గుండ రాచుకుని, ఒక పూట కుంకుడు పొడితోనూ మరోపూట శీకాకాయ పొడితోనూ రుద్ది రుద్ది స్నానం చేసి, రాత్రులు ఒంటికి వేప నూనె ఒక వారం, నువ్వులనూనె ఒక వారం రాచు కుంటూ, వైద్యులిచ్చిన వేపమాత్రలు మింగుతూ ఉండే సరికి తీట గజ్జి ఎటుపోయాయో తెలీదుకానీ చక్కని నిగ నిగలాడే చర్మం వచ్చింది. నిమ్మపండు ఛాయతో మెరిసి పోయాడు పరశురాముడు. వాడి పక్కన కూర్చోను పోటీ పెరిగిపోయింది తరగతిలో. వంతుల ప్రకారం రోజు కొక్కరు కూర్చునేవారు. అలా వాడి ప్రతిష్ట పెరిగి, చదువుపై శ్రధ్ధ పెరిగి క్లాస్ లో మొదటి వాడుగా పొడుగు, బలంతో పాటు చదువులోనూ మొదటి స్థానం సంపాదించాడు మాపరశురాముడు. వాడికీ నాకూ మంచి దోస్త్ పెరిగింది. ఎస్సెల్సీ వరకూ మేం ఇరువురం ఒకే బెంచ్ ఒకే స్కూల్. అలా మా మైత్రి బలపడింది.

ఎస్సెల్సీ పరీక్షలు పదిరోజు లుండగా మా పరశురాములుకు తలనొప్పి విపరీతంగా వచ్చింది. తల ఎత్తి చూడలేకపోయాడు. వాళ్ళ బామ్మ "ఒరే నాయనా! చదివి చదివి వేడెక్కింది. తలకు ఆముదం అంటుకుని తలారా స్నానం చేయి, తల నొప్పి ఇట్టే పోతుంది" అని చెప్పగా ఆమె పై తాటి చెట్టంత ఎగిరాడు, వాడసలే ఆరడుగుల పొడుగు. వాడికి ఝడిసి ఎవ్వరూ ఏమీ చెప్పలేక మౌనం వహించగా, ఇద్దరం కలసి చదువుతున్నాం గనుక నేనే వాడిని ఆయుర్వేద వైద్యులు ఆచారి గారి వద్దకు తీసుకెళ్ళా ను. ఆయన అంతా విని ఒక సీసా యిచ్చి అది బాగా తలకు పట్టించి ఒక గంట నానాక తలారా స్నానం చేయమన్నాడు మూడు రోజులపాటు. ఆయన వైద్య రుసుంతో పాటుగా, తైలం సీసా సొమ్ము చెల్లించి, నాన్న చేతి తైలం వదిల్చి, వచ్చాక వైద్యుల వారు చెప్పినట్లు ఒక్కరోజు చేయగానే తలనొప్పి మటు మాయ మైంది. దాంతో మావాడికి వైద్య ఆచారిగారిపట్ల నమ్మకం పెరిగిపోయింది.

మేం ఇంటర్లో చేరే రోజున వాడికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. వాళ్ళ అవ్వ "ఎంతిష్టమైనా కొత్త బియ్యంతో చేసిన అతి రసాలు అదే పనిగా తింటే కడుపునొప్పిరాకే మవుతుంది? చెప్తే వింటేనా?" అని చివాట్లు పెట్టింది. శోఠి గుండ తేనెలో కలిపి బాదం ఆకులో వేసి తినమని ఇస్తే విసిరవతల పారేశాడు. చారుకాచి ఇస్తే 'నీవేతాగు నాకు వద్దని' పారబోశాడు.

“ఎవ్వరి మాటా వినడు వీడు" అని తల పట్టుక్కూర్చున్నారంతా. ఈమారూ వాడిని నేనే దగ్గిరుండి మళ్ళీ ఆయుర్వేద వైద్యులు ఆచారిగారి వద్దకు తీసుకెళ్ళాను.

"బాబూ! ఉదయం ఇడ్లీ, రాత్రిపూట ఈ పొడికలుపుకుని ఓగ్లాసెడు మజ్జిగ త్రాగు. కడుపునొప్పి తగ్గేవరకూ ఈ పొడి రోజుకొక పొట్లం చొప్పున మొదటి ముద్దలో వేసుకుని తిను." అంటూ శోఠిపొడి పది పొట్లాలు కట్టించి ఇచ్చాడు. ఈమారూ పాపం మా పరశురాముని తండ్రి గారి జేబు తైలం వదిల్చాక వైద్యులిచ్చిన ఆమందుపొట్లాలు తినగానే వాడి కడుపునొప్పి ఒక్క రోజులో మటుమాయ మైంది. ఆదెబ్బతో ఆచారి వైద్యుల మీద నమ్మకం మరీ ఎక్కువైంది పరశురామునికి.

వాడి అమాయకత్వానికి నాకు జాలేసినా, ఇంట్లోవారి మాట పెడచెవిన పెడుతూవాడి తండ్రిగారి జేబు తైలం ఇలా వదుల్చుతున్నందుకు వాడిపై నాకు కొంత ఆగ్రహం వచ్చిన మాట మాత్రం యదార్ధం. మెల్లిగా మాపరశురాముని ఆరోగ్యం కుదుటబడి మేమిద్దరం ఇంటర్లో చేరాం. వాళ్ళబామ్మ మాతో పాటు పట్నంలో ఉంటూ మాఇద్దరికీ వండి పెడుతుండగా మేం హాయిగా తింటూ శ్రధ్ధగా చదువుకుంటూ ఇంటర్ పాస్ చేశాం. నేను ఇంజనీరింగ్ లో చేరగా, మాపరశురాం మాత్రం డిగ్రీలో చేరాడు, దాంతో మాఇద్దరి సాన్నిహిత్యమూ కొంత శారీరకంగా దూరమైనా శలవుల్లో కలిసినపుడు మాత్రం చిన్నప్పటి విషయాలు చెప్పుకుంటూ హాయిగా గడిపేసే వాళ్ళం.

నేను ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాలు తిరుగుతూ, వివాహమై భార్య పిల్లల బాధ్యతలు సంసార జంజాటకపు సందడిలో మా పరశురాముని కలవడం కుదరలేదు. జీవన పోరాటపు ఒరవడిలో పడి బాల్య మిత్రుని ఙ్ఞాపకాలు కొంత దూరం చేసుకున్నమాటమాత్రం యదార్ధం. పిల్లల చదువులూ, పెళ్ళిళ్ళూ, ఉద్యోగ బాధ్యతలూ పూర్తై విశ్రాంత జీవనంలోకి వచ్చాక, తిరిగి బాల్య బంధాలూ, స్నేహాలూ, మనస్సు పొరల్లోంచీ బయటకు రాగా మా పరశురాముని చూడాలనిపించి బయల్దేరాను.

దారిపొడవునా మా ప్రాధమిక పాఠశాల రోజులు తలంచుకుంటూ వాడి ఇల్లు చేరాను. మీకు చెప్పనే లేదుగా మాపరశురాముడు డిగ్రీ పూర్తి చేసి బి.ఎడ్.చేసి మా స్వంత ఊర్లోనే పంతులుగా చేరాడు.

పెళ్ళై వాడికి ఓకుమార్తె, కుమారుడూనూ, వాడూ బాగా చదివి అమెరికా వెళ్ళిపోయాడుట. కూతురు మాత్రం బెంగుళూర్లో భర్తతో ఉంటున్నదిట.

నన్ను చూడగానే మాపరశురాముడు పడిన ఆనందం ఇంతా అంతా కాదు. వాడు గట్టిగా నన్ను హత్తుకుని కన్నీరు కార్చాడు. "ఏంటిరా! ఇదంతా! పిచ్చా?" అన్నాను.

"ఏమైనా అనుకోరా! విశ్శూ! నిన్ను చూస్తే నాకు మన ప్రాధమిక పాఠశాల రోజులు గుర్తువస్తున్నాయిరా!" అన్నాడు గద్గదంగా.

"నాకూ నూ అంతేరా! దారి పొడవునా నేనూ అవే ఆలోచిస్తూ వచ్చాను. ఎంత అమాయకపు రోజుల్రా!" అనుకుంటూ ఇద్దరం కాఫీ ఫలహారాలు పూర్తి చేసి రోడ్డంట పడబోతుండగా, "ఏమండీ! వేడి ఉప్పు నీరు పెట్టాను కాస్త పుక్కిలించి వెళ్ళండి. చలి గాలికి మళ్ళీ పన్ను నెప్పెడుతుందేమో!" అంది పరశురాముని ధర్మపత్ని. “అన్నీ నీకే తెల్సినట్లు చెప్పకు. నాకే పన్ను నెప్పీలేదు." అంటూ బయల్దేరదీశాడు నన్ను.

"పోనీ మాచెల్లాయి మాట విని కాస్త ఉప్పునీరు పుక్కిలించి రారాదుట్రా!" అన్నాను, కాస్త మాట వినే మనస్తత్వం వచ్చిందేమోని. ఊహూ వాడేమీ మారలేదు.

"ఈ ఆడాళ్ళకు లేనిపోని భయాల్రా! అన్నింటికీ కాస్తంతను కొండత చేసుకుని గాభరాపడి మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తారు. పదరా విశ్శూ !వెళదాం." అంటూ నాచెయ్యి పట్టి బయటికి లాక్కెళ్ళాడు. చిన్నప్పటి కబుర్లు చెప్పుకుంటూ నడవసాగాం.

"ఏరా! ఎవరైనా మన జతగాళ్ళు ఈ ఊర్లో ఉన్నారా! ఎవ్వరూ కనిపించరేమిరా!" అన్నాను.

"మన సావాసగాళ్ళు ఎవ్వరూ లేరురా విశ్శూ! అంతా కొడుకుల దగ్గరికెళ్ళి పోయారు. ఈ పల్లెటూర్లో ఎవరుంటార్రా! నాకు మాత్రం ఈపల్లె వదలి వెళ్ళాలని లేదురా! అందుకేగా ప్రియ మిత్రుడివి నీవు ఇంజనీరింగ్ లో జాయినైనా నేను ఊరు వదలటం ఇష్టంలేక పంతుల్నై ఉన్నఊర్లోనే ఉండిపోయా. ఈ ఊరుమాత్రం వదలనురా! మాతృభూమిరా మాతృభూమి!" అన్నాడు ఎంతో ఉద్రేకంగా.

వాడి పుట్టిన ఊరిపై ఉన్నభక్తికి నేను కాస్త అచ్చెరురువొందినమాట వాస్తవం.

"ఐతే ఎవ్వరూ ఇక ఇక్కడికి రానే రారా?" అన్నాను.

“అప్పుడప్పుడూ వస్తుంటారు. అంతేరా! ఇది చలి కాలం కదా! ఈ చలికి ఎవ్వరూ రారు ఇప్పుడు." అంటూ 'అబ్బా!' అని బుగ్గ పట్టుకుని మెలితిరిగి పోసాగాడు. నేను కంగారుగా "ఏమైందిరా" అంటూ వాడిని పట్టుకుని ఒక చెట్టు క్రింద కూర్చోబెట్టాను. కాస్త సేపయ్యాక పరశురాముడు తేరుకుని "మళ్ళీ పన్ను నొప్పి వచ్చినట్లుందిరా! గత నెల నుంచీ వేపుకు తింటోంది." అంటూ బుగ్గ పట్టుకుని కూర్చున్నాడు బాధగా.

"మన ఆయుర్వేద వైద్యాచారి గారు ఉన్నార్రా!" అన్నాను. "ఆహా ఉన్నారు. ఆయన చలవ్వల్లే నేనింత హాయిగా ఉంటున్నాను." అన్నాడు అంత బాధలోనూ కృతఙ్ఞతగా కళ్ళు మూసుకుని. ఆ మూసుకోడం బాధ తోనో, భక్తితోనో తెలీక అయోమయంలో పడ్డానేను.
"మరి ఆచారిగారి ఇంటికెళదాం పద ఆయన్నీ చూసినట్లుంటుంది." అని పరశురాముడ్నీ లేవదీసి నడిపించుకుంటూ ఆచారి గారిల్లు చేరాం.

"నమస్కారం! ఆచారిగారూ! నేను గుర్తున్నానా సార్!" అనగానే "మీ పరశురాముడు గుర్తున్నన్ని నాళ్ళూ నీవు గుర్తుంటావోయ్ విశ్శూ! చెలికాడ్ని చూసేందుకు వచ్చా వేంటోయ్! ఏమోయ్! పరశురామూ! ఏమైందేం?" అంటూ ఇద్దర్నీ ఒకే మారు పలకరించారు. వయస్సు వచ్చినా ముసలితనం ఆయన్లో కనిపించనందుకు ఆశ్చర్యమేసింది. మేమే విశ్రాంతి పొందగా ఆయన షుమారుగా ఎనభయ్యోపడిలో ఉన్నా మాకంటే లేతగా ఉన్నట్లున్నారు. మావాడు వాని పన్ను నెప్పి గురించీ విన్నవించుకున్నాక "ఇదో ఈ పొట్లాలు వేడి నీళ్లలో వేసి రోజుకు మూడు మార్లు పుక్కిలించి, ఈపొడి కాస్తంత నెప్పి ఉన్న పన్నుకు అతికించి పది నిముషాలుంచు, మూడు రోజుల్లో నెప్పి మటు మాయమైపోతుంది. ఆతర్వాత వచ్చి మా కుమారుడు పళ్ళడాక్టర్ వాడి సలహా తీసుకో, నేను దగ్గరే ఉంటాన్లే భయపడకు." అని చెప్పి జేబు తైలం వదిలించి పంపాడు.

ఇంటికి వచ్చాక విషయమంతా విన్న పరశురాం శ్రీమతి మండి పడింది. "చూడండి అన్నయ్యగారూ! మీ స్నేహితుడు, నేనిచ్చిన ఉప్పు కాదని, ఆచారి ఉప్పు కప్పురం లాగా డబ్బిచ్చి కొని తెచ్చారు! నేచెప్పిందీ ఆచారిగారు చెప్పిందీ ఒక్కటే, ఐనా శంఖం లోదే తీర్ధంకదా!" అని చిట పట లాడి వేన్నీళ్లలో ఆమందుపొట్లం వేసి తెచ్చిచ్చింది.

"మీ స్నేహితునికి పిచ్చి ఇంతా అంతా కాదండీ అన్నయ్యగారూ! మావాడి దగ్గరకు అమెరికా వెళ్ళేప్పుడు ఈయన చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఆరు నెల్లకు మూడు శేర్ల కుంకుడు గుండ, మూడు శేర్ల శీకాకాయ గుండ, రెండుశేర్ల వేపగుండ, శేరుంబావు శొఠిగుండ అన్నీకలిపి ఒక సంచిలో సర్దారు. చెకింగ్ చేసేప్పుడు వాళ్ళగోల 'ఇవన్నీ ఏంటని?!' నేనేదో ఆయన గారికి వంటికి డాక్టర్లిచ్చిన మందని నచ్చ చెప్పేసరికి తలప్రాణం తోక్కొచ్చిందంటే నమ్మండి. ఆచారి మందు మీదున్న నమ్మకం కట్టుకున్న నామీద లేదండీ!" అని వాపోయింది. 'కన్నవాళ్ల మీదే లేదుతల్లీ ఇహ నీమే దెలా వస్తుందా' ని మనస్సులో అనుకున్నాను.

మూడురోజులకు పన్ను నెప్పితగ్గాక మాపరశురాముని శ్రీమతి కోరిక మేరకు నేను దగ్గరుండి ఆచారిగారి కుమారుడు పళ్ళడాక్టర్ గారి వద్దకెళ్ళాం. పళ్ళడాక్టర్ పరీక్షించి పన్నుపీకాలనీ బాగా పుప్పి పట్టిందనీ చెప్పాడు. ససేమిరా ఆచారి గారి వైద్యంతప్ప మరేమీ చేయించుకోనని మొండి పట్టు పట్టాడు పరశురాముడు. చివరకు ఆచారిగారు "అయ్యా! పరశురామూ! నేను దగ్గరుండి చూస్తాగా! నీకేమీ భయంలేదు" అని నచ్చజెప్పి, మత్తు మందిచ్చి పన్నుపీకాక, ఆపన్ను చూపాడు పరశురాముకు దాన్నిండా ఏదేదో అంటుకుని నల్లగా పుచ్చిపోయి ఉంది. లోపలంతా డొల్ల.

"చూడండి పరశురాముడుగారూ! మీకు మానాయనగారి మీదున్న నమ్మకానికి సంతోషమే కానీ పళ్ళకు పళ్ళ డాక్టర్నీ, కళ్ళకు కళ్ళడాక్టర్నీ, చెవికి చెవి డాక్టర్నీ, గుండెకు గుండె డాక్టర్నీ ఇలా ఆయా వైద్యం తెలిసిన వారిని సంప్రదించాలి. ఈ రోజుల్లో ఒకే వైద్యుడు అన్నీ బాగు చేయలేరు. ఈ విషయం ఈయన మానాయన గారైనా చెప్తున్నాను. మీకూ వయసవుతున్నది కంటి నొప్పికీ మానాయన గారెలా మందిస్తారు చెప్పండి. కనుక నామాట విని ఒకమారు పట్నం వెళ్ళి ఫుల్ చెకప్ చేయించుకోండి మంచిది...” అనిచెప్పిన పళ్ళడాక్టర్ మా పరశురాముని కంటికి, మనస్సుకూ శ్రీకృష్ణ పరమాత్మలా కనిపించి ఆయన చెప్పినట్లే చేయను అంగీకరించాడు.

తన పన్ను నొప్పిలేకుండా పీకి నందుకో, ఆచారికొడుకైనందుకో, మరెందుకో గానీ ఆయన మాట వేదవాఃక్కైంది మావాడికి. ఇన్నాళ్ళకు ఆచారి గారికి ప్రత్యామ్నాయంగా మరో బోధకుడు మాపరశురామునికి దొరికినందుకు నేనెంతో సంతోషించాను...

***

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ