అర్థ-నారి - ఆపాసా (ఆలూరి పార్థసారథి)

Artha Naari

(నవంబరు 2019వాహిని” సిడ్నీ తెలుగు ఎసోసియేషన్ వారి

వెబ్ మాసపత్రికలో ప్రప్రథమంగా ప్రచురితం.

అలాగే, ‘ప్రతిలిపి’ వెబ్ పత్రికలో కూడా వెనువెంటనే 4 నవంబరు 2019 న ప్రచురించబడింది.

ఇంతవరకు అచ్చులో ఎక్కడా రాలేదు.)

చిన్­న్­న్న మాట

ఐదు దశాబ్దాల క్రితం ఒక పెద్దతను నా పేరులో ఎత్తి చూపిన అచ్చుతప్పే, ఈ కథకి ప్రేరణ.

ఏం చెయ్యను! అప్పటికే నా పేరు తప్పుల తడకతో సార’ధి’ గా చలామణి అయిపోయింది. ఆ రోజుల్లోనే ఒకసారి నా స్నేహితుడొకడు నా మీద కోపంతో, ‘పార్ థూ’ అని అరిచాడు. ఎంతో సంతోషం వేసింది. ‘ఇన్నాళ్టికి నువ్వొక్కడివి నా పేరు ‘థూ’ అని సరిగా పలికేవురా!’ అని సంబరపడిపోయి, వాణ్ణి కౌగిలించుకున్నంత పని చేశాను. హడలిపోయి పారిపోయాడు వాడు. అది వేరే సంగతి.

ఆ తరవాత ఐదు దశాబ్దాలలో నేను గమనించింది వింటే, చాలామంది ‘నిజమా!’ అని ఆశ్చర్యపోవచ్చు.

నిజానికి అర్ధము (ధ వత్తు) అంటే సగము అని (ఉదా. అర్ధనారీశ్వరుడు, అర్ధరాత్రి, అర్ధచంద్రుడు, అర్ధవ్యాసం, అర్ధరూపాయి, అర్ధగంట వగైరా), అర్థము (థ వత్తు) అంటే శబ్దార్థం, ధనం, కారణం, వగైరా అని అర్థం (సగం అని ఏమాత్రం కాదు). అందుచేత, ‘ధ’ శబ్దానికి బదులు ‘థ’ శబ్దం, ‘థ’ శబ్దానికి బదులు ‘ధ’ శబ్దం ఉపయోగించకూడదు. అది తప్పు. అనర్థం! ఇదీ అందరికీ తెలిసిందే. నిజానికి మన వర్ణమాలలో ఉన్నన్ని అక్షరాలు మరే భాషలోను లేవు. అందుచేత తెలుగు తెలిసిన వారికి మిగిలిన వారికంటే చక్కగా ఉచ్చారణ దోషాలు లేకుండా, పలకగలిగే సౌలభ్యం ఉంది.

అయినప్పటికీ కొంతమంది తెలుగువారు మాత్రమే ‘ధ’, ‘థ’ ల ఉచ్చారణని పట్టించుకుని కథ, రథం, స్వార్థం, గ్రంథం, లాటి పదాల్ని సరిగా పలుకుతుంటారు. అయినా చాలామంది కన్నడిగలు, మళయాళీలు, తమిళులు ఈ అక్షరాల్ని స్పష్టంగా పలుకుతారు. చాలామంది తెలుగువారు మాత్రం, “మన మాతృభాషే కదా, మనం ఎలా పలికినా చెల్లుతుంది” అనే నిర్లక్ష్య ధోరణో ఏమో గాని, ఎదురుగా స్పష్టంగా ‘థ’ కానీ ‘థ వత్తు ‘ కానీ రాసి ఉన్నా, కనిపిస్తున్నా పట్టించుకోకుండా, నిస్సంకోచంగా నిర్భయంగా కధ, రధం, స్వార్ధం, గ్రంధం అని ‘ధ’వే పలుకుతుంటారు.

అయినా మన తెలుగువారికున్న ఎడాప్టబిలిటీ, గ్రహణశక్తీ, క్షమాగుణం ఎంత ఎక్కువంటే; మన భాషని ఎదుటివాడు ఖూనీ చేసేస్తున్నా, అపభ్రంశం చేస్తున్నా ప్రతిఘటించం! అవతలివాడి బాధని అర్థం (మరోసారి చెప్తున్నా సగం కాదు) చేసేసుకుంటాం. సర్దుకుపోతాం. అదీ మన గొప్పతనం!

అర్ధం, అర్థం ఈ రెండు మాటల్ని ప్రయోగించి రాయాలనే తాపత్రయంతో చేసిన చిన్న ప్రయత్నమే ఈ కథ. ‘ధ, థ’ శబ్దాల అర్థాలలోని భేదమే ఈ కథకు ప్రాణం!

--:oo(0)oo:--

అర్థ-నారి కథ

‘ఈరోజు ఎలాగైనా సమయం సందర్భం చూసుకుని సాహసం చెయ్యాలి. ఆర్థిక సహాయం కోసం విక్రమ్­నే అడగాలి. లేకపోతే తన కల సాకారం అయేట్టు లేదు. ఇప్పట్లో ఇల్లు కొనడం జరిగేట్టు లేదు ...’ అని అనుకుంటున్నాడు కాళి.

ఇంతలోనే, ‘కాళీ కాళీ’ అని బెడ్­రూమ్­లోంచి అపరకాళిలా అరచినట్టు వినిపించిన అర్థ-నారి చండి పిలుపుకి సహజంగానే ఉలిక్కిపడ్డాడు. హాల్లోంచి బెడ్­రూమ్ వైపు పరుగెత్తాడు. ఏదో అర్థం అంటే డబ్బు సమస్యే ముంచుకొచ్చినట్టుంది అని గాభరాపడ్డాడు కాళి. గదిలోకెళ్ళి అపరాధిలా నిలబడ్డాడు.

కాళీని చూస్తూనే చండి, విసుగ్గా ‘ఎప్పటికప్పుడు ఇంట్లో అవసరాలకి తగ్గట్టు డబ్బులుంచాలని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీ పేరుకి తగ్గట్టు ఇంట్లో అంతా ఖాళీ! అవతల నాకాఫీసుకి టైమ్ అయిపోతోంది. సాయంత్రానికల్లా మా అమ్మావాళ్ళూ వచ్చేస్తున్నారు. వాళ్ళని బయటకి తీసుకెళ్ళాలీ; బోల్డన్ని ఖర్చులుంటాయని నీకు తెలుసు. నువ్వు కూడా విక్రమ్­తోపాటు ఇల్లు చూడ్డానికి వెళ్తానన్నావు. పైగా అమ్మా వాళ్ళు వచ్చేలోగా ఇంటికి రానన్నావు. నువ్వొచ్చేంత వరకు చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఎలా?’ అని విరుచుకుపడింది.

‘అలా అరవకపోతే, ఆమాత్రం అవసరానికి తగ్గ కాసులు నీ ఎకౌంట్లోంచి తియ్యొచ్చుగా!’ అని కాళీ నోటి చివరవరకు వచ్చింది. అదృష్టంకొద్దీ అంతకుముందు తిన్న మొట్టికాయలు గుర్తొచ్చి తమాయించుకున్నాడు. నాలుక జారకుండా వెనక్కి మడిచేశాడు. గొంతువరకు వచ్చిన గరళాన్ని కక్కకుండా గుటుక్కున మింగేశాడు.

వినయ విధేయ రాముడిలా, ‘ఇదుగో ATM కే వెళ్తున్నా. ఒకక్షణంలో వచ్చేస్తా. తెచ్చేస్తా!’ అని సవినమ్రంగా చెప్పాడు. స్వామి కార్యం కోసం తత్పరత చూపే హనుమంతుళ్ళా ఒక్క అంగలో బయటకు ఉరికాడు కాళీ.

--:oo(0)oo:--

రొప్పుతూ ఇంట్లోకడుగుపెట్టాడు కాళి. అపరకాళి ప్రత్యక్షం! ‘మళ్ళీ ఏమైందా!’ అని ఆశ్చర్యపోదామనుకునేసరికి, సెంటర్ టేబుల్ ­పై బొత్తిగా పెట్టివుంచిన ఇస్త్రీ బట్టలు వెక్కిరించాయి.

వాతావరణాన్ని తేలికపరుద్దామని, ‘చాకలికి రూకలిచ్చీశావా?’ అని అడగబోయాడు. అలవాటు ప్రకారం నాలుక మడతపెట్టేశాడు. అసంకల్పితంగా జేబులోంచి పర్సు తీశాడు. అర్థ-నారికి అర్థం కనిపించింది.

ఛటాలున వాలెట్ లాక్కొని కొన్ని నోట్లు తీసి హ్యాండ్­బ్యాగ్­లో కుక్కుకుంది. సరసర బయటకు దారి తీయబోతూ కొరకొరచూసింది కాళి వైపు. ‘చాకలాడు, పై ఫ్లోర్­ ఫ్లాట్స్­లో బట్టలు ఇచ్చి కాసుల కోసం తిరిగొస్తానన్నాడు. సొమ్ములివ్వం గాని, సోకులు మాత్రం కావాలి!’ అంది ఈసడింపుగా. ఆవెంటనే తలుపు ధడేల్­మంది. చండి మాయమయింది.

కాళీ కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళి టేబుల్ సొరుగులో, అల్మిరా లాకర్లో, కిచెన్­లో, చండికి అందుబాటులో ఉండేలా అన్ని చోట్లా కొంత నగదు పెట్టాడు. చివరకి హాల్లోకొచ్చాడు. గ్యాస్ సిలిండర్­వాడికివ్వటానికి, రెడీగా కొంత పైకం, షోకేస్­లో కనిపించేలా ఉంచాడు. చిక్కి శల్యమైన తన పర్సు­ని తిరిగి జేబులో భద్రంగా పెట్టుకున్నాడు. ‘ఇలా ఊటబావిలోంచి ఊరే నీరంతా ఎప్పటికప్పుడు తోడేస్తుంటే, ఇల్లు గుల్లే నా కల కల్లే! లాభం లేదు, ఏదోవొకటి వేగం చెయ్యాలి. ఎలాగైనా ఒక చిన్న ఫ్లాట్ అయినా సరే, సొంతం చేసుకోవాలి.’ అనుకున్నాడు.

ఈలోగా కాలింగ్ బెల్ మోగింది. చాకలే అయుంటాడని, తలుపు తీస్తూనే ‘ఎంత?’ అన్నాడు.

ఎదురుగా బడికెళ్ళాల్సిన వయసు కుర్రాడు ప్రశ్నార్థకంగా కనిపించాడు. వాడి చేతిలో బ్యాన్ చేసిన పోలిథిన్ కవర్లో వేసిన కూరగాయలు, పాల ప్యాకెట్లు ఉన్నాయి. కాళీ ప్రశ్నకు జవాబుగా చిన్న స్లిప్పు ఇచ్చాడా ప్రకాష్ డైలీనీడ్స్ బాల కార్మికుడు. ‘అమ్మగారు కొన్నారు. మీరింట్లోనేవున్నారూ, మీరిస్తారు పైసల్ అని చెప్పారు.’ అన్నాడు.

కాళీ, ‘హ్యాండ్­బ్యాగ్­లో ఉన్న ధనం మూట తియ్యొచ్చుగా తియ్యదు.’ అనబోయి తమాయించుకున్నాడు. ‘ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్టు, మధ్యలో వీడిమీద ఎందుకు?’ అనుకుని యథాప్రకారం నోరు కుట్టేసుకున్నాడు.

మారు మాటాడకుండా, పర్సులోంచి తీసి ‘ఈకాష్ ప్రకాష్­కి. ఈ ఐదు రూపాయలు నీకు!’ అన్నాడు కాళి. కుర్రవాడు ఏదో పెన్నిధి దొరికినట్టు అమాంతం అందుకున్నాడు. కాళీ చేతికి ఆ నిషిద్ధ కవర్ అందించి, ఎగురుకుంటూ లిఫ్ట్ వైపు పరుగులు తీశాడు. ఈలోగా లిఫ్ట్ ఆగింది. చాకలొస్తున్నాడేమో అని వేచి చూశాడు కాళి. వీపు మీద పెద్ద మూటలాంటి నీలం బ్యాగు వేసుకుని వస్తూ కనిపించాడు, కొరియర్ వాడు. దగ్గరకు రాగానే, ‘కొరియరా?’ అని అప్పనంగా వస్తున్న బంగీని ఆనందంగా అందుకోబోయాడు కాళి.

‘అవున్సార్!’ అని పార్సెల్ అందిస్తూ ‘క్యాషా? కార్డా?’ అని బాంబు పేల్చాడు వాడు.

‘ఎంత?’ అన్నాడు నిరుత్సాహంగా, ప్యాకెట్టు­కి అంటించిన బిల్ చూస్తూ. అవేవో లేడీస్­కి సంబంధించినవి.

చెప్పాడవతలి వాడు. అనుమానంగా కాళీని ఎగాదిగా పైకీ కిందికీ చూసి ‘ఆడవాళ్ళ సామాన్లు ఇతనికెందుకబ్బా!’ అన్న మొహం పెట్టి, అడిగాడు – ‘కాళీవేనా?’

‘ఆఁ! ఖాళీవే!’ అన్నాడు తన పర్సులోని క్యాష్­కి అన్వయించుకుంటూ. నీరసంగా క్రెడిట్ కార్డ్ తీసి అందించాడు. ‘అమ్మగారు పెట్టే ఖర్చులన్నిటికీ అయ్యగారే ఇవ్వాలి. సొమ్మొకడిది సోకొకడిది!’ అనబోయాడు. నోరు జారకుండా నియంత్రించుకున్నాడు.

కొరియర్ వాడటు వెళ్ళగానే చాకలివాడిటు వచ్చాడు.

‘ఎంత?’ అనడిగాడు కాళి, జావ కారిపోతూ. మనసులోనే, ‘కొద్దిరోజులు పోతే వీడు కూడా నాలాటి వాళ్ళ కోసం స్వైపింగ్ మషిన్ పట్టుకుని తిరుగుతాడో ఏంటో!’ అనుకున్నాడు.

కాళీ మనసు కనిపెట్టినట్టు చాకలి, ‘క్యాష్ లేకపోతే, పేటీయం కాని భీం కాని చెయ్యండి. లేదా ఆన్­లైన్ ట్రాన్స్­ఫర్ చేసినా ఫరవాలేదు! నిన్ననే అమ్మగారికి నా ఎకౌంట్ డీటైల్స్ ఇచ్చాను.’ అన్నాడు.

కాళీ నోట మాట రాలేదు! చేత రొక్కం వచ్చింది.

--:oo(0)oo:--

విక్రమ్ కోసం ఎదురుచూస్తూ సోఫాలో కూలబడ్డాడు కాళీ. కాలు మీద కాలు వేసుకున్నాడు.

అలా కాలు మీద కాలు వేసుకున్నప్పుడల్లా కాళీకి తన పెళ్ళయిన కొత్తల్లో చండి కరాఖండిగా చెప్పిన మాటలు చెవుల్లో రింగుమంటాయి. ఇప్పుడూ అన్నాయి.

“గృహస్థుగా ఇంటికి సంబంధించిన అన్ని అవసరాలు, వ్యవహారాలూ చూసుకోవాల్సిన బాధ్యత నీదే. తగినంత సంపాదించడం నీ ధర్మం! అన్ని విషయాల్లోనూ నీకు సహకరించడం, నీకొచ్చేదాంట్లో సరిపెట్టుకోవడం గృహిణిగా నాధర్మం! అంతేకాని, ధనం ఆర్జించడం కాదు. నా ధర్మాన్ని నేను నిర్వహిస్తాను. అర్ధాంగిని, సగభాగాన్ని కదా అని నానుండి అర్థం, ఐ మీన్ ఫైనాన్స్ మాత్రం ఆశించకు. పొత్తం విత్తం పరహస్తం గతం గతః అన్నారు. అర్థమయిందా మహానుభావా! నా సంపాదననుండి దమ్మిడీ ఆశించొద్దు, ఇవ్వను. నా ఆర్జన మీద దర్జా వెలగబెట్టడానికి వీల్లేదు. అలాటి ప్లాన్లేం వెయ్యకు. చెల్లవు! నేనసలు ఉద్యోగమే చెయ్యట్లేదనుకో. అలా అయితేనే మా అమ్మానాన్నల్లా వృద్ధాప్యంలో నిశ్చింతగా నిర్పూచీగా బతగ్గలం. దానివల్లే వాళ్లు ఈరోజు ఇంత ప్రశాంతంగా ఏ చీకు చింత లేకుండా హాయిగా ఆనందంగా కాలు మీద కాలు వేసుకుని కూచోగలుగుతున్నారు.”

అంతే! తుళ్ళిపడ్డాడు. కాలు మీద కాలు షాక్ కొట్టినట్టయి తీసేశాడు. అదీ ఎప్పుడూ జరిగేదే.

కాలు కిందకి దించగానే కాలింగ్ బెల్ మోగింది. ఎదురుగా కొలీగ్ విక్రమ్! “అరె, మీ బెటర్ హాఫ్ ఏరీ? ఆమె రారా ఇళ్ళ వేటకి?” అని ప్రశ్నించాడు కాళీ.

నిలబడే విక్రమ్ జవాబిచ్చాడు –

“బెటర్ - ఆఫ్ అనే, ఐ మీన్ దూరంగా ఉంటేనే మంచిదని బెటర్­హాఫ్­ని తీసుకురాలేదు. అలా తీసుకువెళ్ళి తీసుకువెళ్ళే, ఇల్లు ఫైనల్ చెయ్యడం ఈజన్మకి కుదరదని జ్ఞానోదయం అయింది.

ఇక్కడకొచ్చే ముందే ఆమెకి స్పష్టం చేశా. ఆవిడ కోరుకునేలాటి ప్రదేశంలో ఇల్లు కొనాలంటే కనీసం మూడు కోట్లు ఉండాలి అన్నా. ఆమె, ‘ఏంటి? వేసుకునేవే?’ అని వెటకారం చేసింది. నేను ఏడవలేక, ‘కాదు. దోచుకునేవి! అయితే అది కుదిరే పని కాదు.’ అని దులుపుకుని వచ్చేశా.

అయినా ఇన్­కంటాక్స్ డిడక్షన్, అద్దె భారం తగ్గాలంటే ఇల్లు కొనడమే ఉత్తమం అని ఈ వేటలో పడ్డాం గాని, లేకపోతే నాలాటి నెలజీతగాడికి సొంతిల్లు కొనాలనే కోరికే కలిగేది కాదు. అది మా అర్ధనారికి అర్థం కాదు.

అయితే మన అదృష్టంకొద్దీ ఇప్పుడు ఇన్నాళ్టికి నాకు తెలిసిన బిల్డర్ ఒకడు, సిటీకి దూరంగా మన బడ్జెట్­లో, ప్రశాంతమైన వాతావరణంలో ఒక కోలనీ గురించి చెప్పాడు. ‘గుడి, బడి, పార్కు, లైబ్రరీ, జిమ్, స్విమ్మింగ్ పూల్, నాలుగు ఆటస్థలాలు, వాకింగ్ ట్రాక్స్, డైలీ నీడ్స్, అన్నీ ఉన్నాయి.’ అన్నాడు. పద చూసొద్దాం.” అని కాళీని తొందరపెట్టాడు.

కాళీ, సరే సమయం చూసుకుని కారులోనే తన లోటు బడ్జెట్ సంగతి వివరించొచ్చు అనుకుని విక్రమ్­తో ఇళ్ళ వేటకి బయల్దేరాడు.

--:oo(0)oo:--

తీరా కారు నడుపుతూ విక్రమ్ అంతవరకు సిటీలో చూసిన ప్లాట్లు, ఫ్లాట్ల ఖరీదుల గురించి తాము చూడబోయే ఇళ్ల గురించి ఎనాలిసిస్ చెప్తుంటే, కాళీకి తన గోడు చెప్పుకోవటానికి కుదరలేదు. అలా చాలాసేపు ప్రయాణం చేశాక, మహానగరానికి దూరంగా ఒక గేటెడ్ కమ్యూనిటీలో కారు ఆపాడు విక్రమ్.

కాళీ ఆశ్చర్యపోతూ, ‘ఈ 14 అంతస్తుల బిల్డింగుల కాంప్లెక్స్­లో ఫ్లాటా! అదీ సెకండ్­హ్యాండా! ఎంత హౌసింగ్­లోన్ ఫెసిలిటీ ఉంటే మాత్రం! మీ ఆవిడ ఒప్పుకుంటుందంటావా!’ అడిగాడు అపనమ్మకంగా. కానీ మనసులోనే లెక్కలు కట్టాడు. ఇదే అయితే, విక్రమ్ తమ ఇద్దరి ఫ్లాట్లకి సరిపడా డిపాజిట్ సులువుగా చేసెయ్యగలడు అని సంబరపడ్డాడు.

విక్రమ్ కాళీతో, “మన ఇష్టప్రకారమే జరుగుతాయా అన్నీ? ఎంతైనా, తాహతుకి మించి పరుగెత్తలేం కదా కాళీ! ఉన్నదాంట్లో సర్దుకుపోవాలి. అది మీ ఆవిడలాగ మా ఆవిడకి అర్థం కాదు. ఆమె ధోరణి ఎప్పటికీ మారదు. అదే చిక్కు. నీకింకా మా అర్ధనారి సంగతి పూర్తిగా తెలిసినట్టు లేదు. ఆవిడ మాటల్లోనే చెప్తాను విను –

‘పీనాసి వాళ్ళలా కక్కుర్తిగా బతకేకంటే, ఉన్నప్పుడు హాయిగా ఎంజాయ్ చెయ్. ఈరోజున్న రూపాయి విలువ, మనం ఖర్చు చేద్దామనుకునే వేళకి పైసా చెయ్యదు. ఈ ఆనందం తృప్తి, తరవాత పొందాలంటే, దీనికి ఎన్నోరెట్లు వెచ్చించాల్సి ఉంటుంది. తీరా వెచ్చించినా, అప్పుడు ఈ సమయం సందర్భం వయసు అవకాశం ఏవీ ఇలాగ ఉండవ్. వయసు ఉడిగిన తర్వాత ఏం జుర్రుకుంటాం మనం? ఏం చేద్దామన్నా ఎక్కడలేని నిస్సత్తువ, ఏం చూద్దామన్నా నిర్వికారం. ఆవేశంతో మొదలు ఆయాసంతో మిగులు. పడక్కుర్చీలో ప్రపంచయానం తప్ప అప్పుడు చెయ్యగలిగేదేం ఉండదు. అందుకే ఈవయసులోనే అనుభవించాలి. వయసుండగానే ఏ ముద్దుముచ్చటన్నా! ఆ తరవాతేం ఉంటే మాత్రం, ఏం ప్రయోజనం? నాకు మా అమ్మా-నాన్నల జీవితం నేర్పిన గుణపాఠం ఇదే! పొదుపు చేశారు. ఏం లాభం? ఏమీ అనుభవించలేకపోయారు. ఆతప్పు నే చెయ్యదలచుకోలేదు. అందుకే, కనీసం నా డబ్బు నాకొదిలెయ్. నా జీతం నా జీవితం నాది. నీ అర్ధనారిని నేను. అందుచేత నీది కూడా నాదే. సగం అనుకునేవు; పూర్తిగా.’

అదీ ఆమె తత్త్వం. అదీ మా దుబారా బతుకు. ఏం చెప్పమంటావు? అలా మాకొచ్చిందంతా ఎప్పటికప్పుడు హుళక్కే! మిగిలి చచ్చిందేం లేదు!

అయినా ఒక కొమ్ము కాయడానికి నువ్వున్నావు కదా కాళీ. అదే నా ధీమా! నువ్వు మాకు చేతి సాయం చెయ్యడమే కాకుండా మా ప్రక్క ఫ్లాట్­ మీరే కొంటున్నారని చెప్తే, ఆమె కచ్చితంగా ఒప్పుకుంటుందని నా నమ్మకం! మరో దారి లేదని అర్థం చేసుకుంటుంది. ఈ ఫ్లాట్­కే తలొగ్గుతుంది. ఏఁవంటావ్?”

ఏఁవంటాడు? మ్రాన్పడిపోయాడు కాళీ! అడగడం ఆలస్యం చేశానా అని మదనపడ్డాడు. చేతికొచ్చిందనుకున్న ఫ్లాట్ చెయ్యి జారిపోయింది. కల చెదిరిపోయింది. సందర్భం ఇలా వచ్చింది. పచ్చి వెలక్కాయ గొంతులో పడింది. మెల్లిగా ఎలాగోలా గొంతు పెగుల్చుకుని తడబడుతూ, అసలు విషయం చెప్పాడు. అలా అప్పుడు నాలిక జారాడు. కక్కలేక మింగలేక ఇన్నాళ్ళు పడుతున్న బాధ వెళ్ళగక్కాడు.

“నీకు తెలియనిదేముంది విక్రమ్. పేరుకి మేము ఇద్దరం సంపాదిస్తున్నాం. కాని, నిజానికి నా ఒక్కడి జీతమే అన్నిటికీ ఆధారం. అలాంటప్పుడు నేనెలా ఈ ఊబిలోకి దిగగలను? మంత్­లీ ఇన్­స్టాల్­మెంట్ మాత్రమే అయితే, ఎలాగోలా కిందామీదా పడి కట్టెయ్యగలను. అంతేకాని, ముందు కట్టాల్సిన డిపాజిట్ అవీ ఎక్కడ్నుంచి తేనూ? అదీ లక్షల్లో? నావల్ల కాదు. పోనీ మావాళ్ళక్కాని మా అత్తవారిక్కాని ఏఁవైనా ఉన్నాయా అంటే, ఏలుకోడానికి కాదుకదా కనీసం ఎత్తుకోడానికైనా ఏ ఊళ్ళూ లేవు. ఇంకా నిన్నే అడగాలనుకున్నాను.” అని మొహం వేలాడేశాడు.

ఈసారి మ్రాన్పడిపోవడం విక్రమ్ వంతయింది. ‘ఆదుకుంటాడనుకుంటే, ఆడుకుంటాడేంటీ? చుక్కెదురయ్యిందేంటీ?’ అని పరిపరివిధాల చింతించాడు.

ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. చేసేదేం లేక తెల్ల మొహాలు వేశారు. వెనక్కి తిరిగారు.

--:oo(0)oo:--

విక్రమ్ మొహం వేళ్ళాడేసుకుని ఇంటికి చేరడంతో, అతడి అర్ధనారి(సగభాగం) ‘ఏమైందండి అలా ఉన్నారు! ఇళ్ళ రేట్లు పెరిగిపోయాయా?’ అనడిగింది.

‘ఉహుఁ! మనం అనుకున్నట్టే అన్నీ కుదిరాయి. డిపాజిట్­కే ద్రవ్యం కుదరట్లేదు.’ అని, కాళీఎలా తమ ఆశల మీద నీళ్ళు జల్లేసిందీ చెప్పాడు, విక్రమ్.

ఆమె, ‘కొంపదీసి కాళీకి, మనకి సహాయం చెయ్యడం ఇష్టం లేక, కథలు చెప్పడం లేదు కదా! అయినా ఫరవాలేదు! మనీ అనేది ఎలాటి వస్తువంటే, మనదగ్గర లేకపోయినా, మనచుట్టూరా చచ్చేంత పడివుంటుంది. సమయానికి అడుగు అడుక్కో దోచెయ్! తప్పేంకాదు. తప్పేదిలేదు! కాళీ కాకపోతే మరో దగ్గర సాధించవచ్చు. పదండి పొత్తు కుదిరితే సొత్తు మనదే!’ అని ధైర్యం చెప్పింది. ఒక ఐడియా ఇచ్చింది. బలవంతంగా విక్రమ్­ని బయల్దేరదీసింది. అతడు అనుమానంగా అర్ధమనస్కుడై (సగం మనసుతో) అర్ధనారి వెంట నడిచాడు.

--:oo(0)oo:--

ఈలోగా కాళీ అప్పుకోసం చెప్పులరిగేలా ఊరంతా తిరిగాడు. చివరికి కాళ్ళతో పాటు మొహం కూడా వేళ్ళాడేసుకుని ఇంటికి చేరాడు. సోఫా మీద మాఁవగారు కాలిమీద కాలేసుక్కూర్చుని కాలూపుతూ కనిపించారు. అది చూసి ఒకప్పుడు చండి, వాళ్ళ అమ్మానాన్నల గురించి చెప్పినవి మళ్ళీ గుర్తొచ్చి ఈర్ష్యతో ఒళ్ళుమండిపోయింది కాళికి. అరికాలి మంట నెత్తికెక్కింది. అయినా మామూలే, ఏంచెయ్యలేకపోయాడు. మొహం చేటంత చేసుకుని ‘బాగున్నారా!’ అని సభ్యతగా పలకరించి తన గదిలోకెళ్ళాడు.

చండి ‘ఏమైందండీ, కాయా పండా?’ అనడిగింది.

‘బూడిద!’ అనబోయి, మరోలా ‘పండే! విభూతిపండు!’ అన్నాడు చికాగ్గా. ‘పణంకోసం నాప్రాణం పణంగా పెడతానన్నా ఎక్కడా పుట్టలే! చివరకి దుడ్డుకోసం దొడ్డిదార్లు తొక్కడానిక్కూడా సిద్ధమయా. ప్చ్! దుడ్డు తిరగేసారేగాని, దొరకలే! ఋణంకోసం దారుణంగా, తొక్కని గుమ్మాలన్నీ తొక్కా! దాతలే కరువయ్యారనుకున్నానిన్నాళ్ళూ ఈలోకంలో! ఋణదాతలు సైతం మాయమయ్యారని ఈరోజే తెలిసింది! ఏం చేస్తాం! మంచి అవకాశం, టాక్స్ డిడక్షన్ ఎగ్గొట్టొచ్చు, అద్దెల బాధనుంచి తప్పించుకోవచ్చు అనుకున్నా, సెకండ్­హ్యాండుదైనా సరే మనదంటూ ఒక కొంప ఏర్పడుతుందనుకున్నా. అంతే! ఈజన్మకింతే ప్రాప్తం! ఇళ్ళవేట ఈరోజుతో సమాప్తం!’ అన్నాడు నిరాశతో చతికిలబడిపోతూ కాళి.

వెంటనే చండి, ‘అలా గాలి తీసేసిన బెలూన్­లా అయిపోతారేంటండీ! నాకంతా తెలుసు! డిపాజిట్­కి మీదగ్గరున్నది సరిపోదని తెలుసు. ఇందాకలే విక్రమ్, అతడి భార్య, మనింటికి వచ్చారు. అది చెబ్దామనే మీకోసం ఎదురుచూస్తున్నాను.’ అనేసరికి కాళి మొహం విప్పారింది. నిండా గాలి నింపిన బెలూన్­లా పొంగిపోయింది.

ఆతృతగా ‘బిల్డర్­కి మొదట చెల్లించాల్సిన ముడుపు విక్రమ్ వాళ్ళు సర్దుతామన్నారా?’ అనడిగాడు.

చండి, ‘అబ్బ! చెప్పేది పూర్తిగా వినండి.’ అని అసలు సంగతి అప్పుడు చెప్పనారంభించింది. కాళీకి కలవరం మొదలయ్యింది.

‘కావలసిన డిపాజిట్­కి సరిపడా, వాళ్లకోసం కూడా మనల్నే ఎక్కడన్నా చూడమని రిక్వెస్ట్ చేసింది విక్రమ్ భార్య.’

అంతే! బెలూన్ టప్­మంది. నీరు కారిపోయాడు కాళీ. చండి చెబుతున్న మాటలు చెవిలో పడుతున్నాయి కాని బుఱ్ఱకెక్కట్లేదు. ఆమె అదేం గమనించకుండా చెప్పుకుపోతోంది.

‘విక్రమ్ భార్యకి మనల్ని చూసి బుద్ధి వచ్చిందిట. మనం ఒక ఛాన్సిస్తే, తనుకూడా నాలా అర్థ-నారిలా, డబ్బుమనిషిలా మారిపోతానంది! నెలనెలా తన జీతంలోంచి పైసా పైసా పొదుపు చేసి వేగం బాకీ తీర్చేస్తానని హామీ ఇచ్చింది.

ఏ విషయం, మిమ్మల్ని అడిగి చెప్తానన్నాను. ఏమంటారు? ఇన్నాళ్ళూ నే చేసిన సేవింగ్స్­లోంచి తీద్దామా?’ అంది కాళీ కళ్ళల్లోకి చూస్తూ.

ఒకక్షణం చండి అంటున్నదేంటో అర్థం కాలే. దిగ్భ్రమతో ఆమెవైపే చూస్తూ ఉండిపోయాడు, కాళీ!

స్పష్టం చేస్తూ ఆమె, ‘ఇలాటి రోజుకోసమనేగా నేనలా అర్థ-నారిలా కర్కశంగా ప్రవర్తించి మీ మనసు కష్టపెట్టింది. ఐయామ్ సారీ!’ అంది.

తమకే కాక విక్రమ్­ వాళ్ళ­ డిపాజిట్­కి కూడా సరిపడినంత ఆర్థిక సహాయం చెయ్యడానికి చండి సిద్ధపడిందని, అప్పటికి అర్థమయింది కాళీకి.

అంతే! ఆనందం పట్టలేక ఉబ్బితబ్బిబయాడు. అసలుసిసలైన అర్ధనారిలా మారిన తన అర్థ-నారిని అమాంతం ఎత్తి గిరగిరా తిప్పి ఉక్కిరిబిక్కిరి చేశాడు.

అక్కడ విక్రమ్ కూడా అట్నుంచి ఇటు అర్థ-నారిలా మారిన అర్ధనారిని చూసి అదే పని చేస్తున్నాడని ఇక్కడ కాళీకి తెలీదు.

--:oo(0)oo:--

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు