ఎదురు తిప్పరా.. తిరగలి! - చెన్నూరి సుదర్శన్

Eduru tipparaa tiragali

పూర్వం రత్నగిరి రాజ్యాన్ని రాజసింహుడు అనే రాజు పరిపాలించే వాడు. ప్రజలంతా రాజును గుర్రాల రాజు అని మారు పేరుతో పిలిచే వారు. రాజు తనకది సార్థక నామధేయమని సంతోషించే వాడు. రత్నగిరి సైతం గుర్రాల రాజ్యమనే మారు పేరుతో ప్రజలు పిలిచేలా చేయాలని కలలు కనేవాడు. అందుకు కారణం గుర్రపుస్వారి మీద అతనికున్న మమకారం. ఒకసారి ఎక్కిన గుర్రాన్ని తిరిగి ఎక్కే వాడు కాదు.

‘గుర్రాలను తెచ్చిచ్చిన వారికి బహుమతులు’ అంటూ ప్రకటించి రంగు రంగుల గుర్రాలను సేకరించే వాడు. దేశంలో ఉన్న వివిధ జాతుల గుర్రాలతో రాజుగారి గుర్రపుశాల నిత్యం కళ, కళ లాడేది.

గుర్రపుశాల నిర్వహణ బాధ్యత చూసే వాడు గురువయ్య. రాజసభ అనంతరం రాజుగారి స్వారీ కోసం అలంకరించిన గుర్రాన్ని గురవయ్య స్వయంగా తీసుకుని వచ్చి రాజసౌధం ముందు నిలిపే వాడు. రాజసింహుడు గుర్రాన్ని అధిరోహించి అలా వీధుల గుండా వెళ్తుంటే.. ‘గుర్రాల రాజుకు జై’ అని పిల్లలు నినాదాలిచ్చే వారు. రాజసింహుడు సుతారముగా మీసాలు మెలేస్తూ.. దర్పాన్ని ప్రదర్శించే వాడు.

ఒకరోజు రాజు మరునాడు ఎక్కాల్సిన కొత్త గుర్రం కాపలాదారుల కన్ను గప్పి గ్రామంలోకి దౌడు తీసింది. గురువయ్య గుండె గుభేలుమంది. వెంటనే గుర్రం మీద వెదకటానికి బయలుదేరాడు. కనుచూపు మేరలో గుర్రం ఎక్కడా కనిపించ లేదు.

ఒక పల్లెటూరు పొలిమేరలో కొందరు పిల్లలు ఆడుకోవడం గమనించి దగ్గరి వెళ్ళాడు. పిల్లలంతా భయంతో వణకి పోయారు.

“భయపడంకండి. ఇటు వైపు ఏదైనా గుర్రం వెళ్ళడం చూసారా?” అంటూ అడిగాడు గురువయ్య. పిల్లలంతా చూసారు కాని చెప్పాలా! వద్దా! అని ఆలోచనలో పడ్డారు.

“రాజుగారికి చెప్పి మంచి బహుమానం ఇప్పిస్తాను” అని గురువయ్య ఆశ చూపాడు.

“నేను చూసాను” అంటూ తిరుపతి అనే పిల్లవాడు ముందుకు వచ్చాడు.

“అయితే చూపిద్దువు గాని పదా..!” అంటూ తిరుపతి వీపు మీద కొరడా ఝళిపించాడు గురువయ్య. ఊహించని పరిణామానికి తిరుపతి ఏడుపు రాగాలతో.. పరుగు అందుకున్నాడు. మిగిలిన పిల్లలంతా పరుగెత్తి తిరుపతి తండ్రి వీరయ్యకు విషయం చెప్పారు. వీరయ్య గుండెలు బాదుకుంటూ పిల్లలు చూపిన దారిలో పరుగు తీశాడు. అల్లంత దూరంలో కనబడిన తిరుపతిని చూసి.. “ఒరేయ్.. తిరుపతీ.. ఎదురు తిప్పరా.. తిరగలి!” అంటూ గట్టిగా కేక వేశాడు.

వీరయ్య చెక్కబొమ్మల వ్యాపారి. పిల్లల కోసం రక రకాల, రంగు రంగుల బొమ్మలు చేసి అమ్ముతూ ఉంటాడు. అందులో వీరయ్య తిరగలి అంటే పిల్లలకు చాలా ఇష్టం. ఎక్కువగా అవే అమ్ముడు పోయేవి. వ్యాపారంలో ఎవరైనా తనను మోసం చేస్తే.. ‘తిరగలి ఎదురు తిరిగిందిరా తిరుపతీ.!’ అని వాపోయే వాడు.

తన తండ్రి కేక లోని అంతరార్థం తిరుపతికి అర్థమయ్యింది. గురువయ్యను మోసపుచ్చి తప్పించుకోవాలని అనుకున్నాడు. వెంటనే తిరుపతి వెనుకకు తిరిగి “అయ్యా.. అది గుడ్డి గుర్రమా మంచి గుర్రమా. మరి నేను చూసింది గుడ్డి గుర్రం” అంటూ అమాయకంగా అన్నాడు తిరుపతి. “చల్.. రాజుగారిది మంచి గుర్రం” అంటూ తిరుపతిని విడిచి పెట్టి వేగంగా రాజుగారి గుర్రం కోసం దౌడు తీశాడు గురువయ్య.

వీరయ్య తన కొడుకు తెలివి తేటలను మెచ్చుకుంటూ హృదయానికి హత్తుకున్నాడు. ఇరువురి కళ్ళల్లో ఆనందభాష్పాలు దొర్లాయి. *

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు