ఆ రాత్రి .. - కర్లపాలెం హనుమంతరావు

Aa raathri

సెల్ ఫోన్ స్క్రీన్ 11 : 23 చూపిస్తోంది .

శ్రీపతి ఆ మసక చీకటిలోనే చేతులూపుకుంటూ నడుస్తున్నాడు. . అదోరకమైన ట్రాన్స్ లో .

శ్రీపతికి మందు, డ్రగ్సూ లాంటి వ్యసనాలేవీ లేవు. ఆ మత్తంతా లాంబా థియేటర్లో సెకండ్ షో షకీలా మార్క్ మూవీ ఎఫెక్ట్.

అయిన ఆలస్యం ఎట్లాగూ అయిందని.. పేరడైజ్ లో ' పేట్ ' ఫుల్ గా బిర్యానీ లాగించి .. మీఠాపాన్ నోటితో గోల్డ్ కింగ్ దమ్ము కొట్టేస్తూ ఇంటికి తిరిగెళుతున్నాడు.

పెరేడ్ గ్రౌండ్స్ దాటి వినాయకుడి గుడి వెనక షార్ట్ కట్ నుంచి కోర్ట్ రోడ్డు లోకొస్తున్నప్పుడు కనిపించిందామె . . ఒంటరిగా .. నిదానంగా ఈస్ట్ మారేడు పల్లి మైన్ రోడ్డు వైపుగా వెళుతూ!

చినుకులింకా పెద్దగా పడ్డం లేదుగాని.. వాతావరణంలో ఓ రకమైన వణుకు .. ఉండుండి వీస్తున్న చలిగాలి మూలకంగా!

అమావాస్య కింకా ఐదారు రోజులున్నట్లుంది .. ఆకాశంలో వెలుగుని చీకటే చిత్తు చేస్తోంది . ఆ వెలుగు నీడల కుస్తీ పట్ల మధ్య నుంచి వెళ్లే ఆ మనిషి వీధి దీపం కిందికి వచ్చినప్పుడు .. తేరిపార చూస్తే .. భుజాన వేళాడే లేడీస్ హ్యాండ్ బ్యాగుని బట్టి ఓ వయారిభామ అని పసిగట్టింది శ్రీపతి నిషా మనసు. హుషారుగా ఈలేయమంది గానీ బుద్ధి స్కూల్లో మాష్టారులాగా ' ష్ష్‌! ' మని గద్దించింది.

మూడు పదుల ఫుల్లీ హెల్తీ గై శ్రీపతి . కష్టాలు కన్నీళ్లంటే ఆట్టే తెలియని, బొత్తిగా పట్టించుకోని నేటి తరం లేటెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ ; కేర్ ఫ్రీ న్యూలీ మేరీడ్ యంగ్ ఫెలో కూడా!

ఫస్ట్ డెలివరీకని పుట్టింటి కెళ్లిన భార్యామణి కారణంగా నెల్లాళ్ల బట్టి వళ్లు విరహ వేదనతో కాగిపోయే శ్రీపతి మీద సహజంగానే .. ఆ నడిరేయి .. జనసంచారం లేని లూపు లైను రాస్తా పై చీకట్లో ఒక్కతే బిక్కుబిక్కుమంటో సాగిపోయే చినదానిపై సదభిప్రాయం కలగడమంటే నేటి కాలపు సహజ ధర్మానికి సూటయ్యే వ్యవహారం కాదు .

ప్రకృతి ధర్మంగానే శ్రీపతిలోనూ వికృతమైన భావనలు మొదలయ్యాయి . క్షణాలు గడిచే కొద్దీ విచక్షణా రహితంగా అవి చిరుదుస్సాహసానికి పురికొల్పే స్థాయికి చేరాయి.

ఎవరో ఆమె? .. నడిరాత్రిళ్లు ఇలా రోడ్డు పైన ఒంటరిగా సాగిపోయే దుస్సాహసి! ఆ చకచకా నడిచే వైనం చూస్తే రూటూ . . వెళ్లే చోటూ రెండూ .. చిరపరిచతమే లాగుంది! అలవాటుగా చేసే చాటు పనే కాబట్టి ఆ నడక అంత అలవోకగా సాగిపోతున్నది. . అనిపించింది శ్రీపతి చిలిపి మనసుకి .

వినాయకుడి గుడి వెనక చాటుగా కనపడే ఒక తరహా కాలనీ బాపతు జనంలో కొందరు కోర్టు రోడ్డుకు ఎడంగా ఉండే పోష్ కాలనీలకు ఇట్లాగే అర్థరాత్రిళ్లు అపరాత్రిళ్లు వెళ్లి వస్తుంటారని ఆఫీసు కొలీగొకడు బార్ లో ఫుల్ మూడ్ లో ఉన్నపుడు గోకిన పలుకులు శ్రీపతి చెవుల్లో ఇప్పుడు గీ.. గీ.. మని ప్రతిధ్వనించాయి ‌. దాంతో ధైర్యం రెండింతలు రెచ్చిపోయింది. . అదిచ్చిన ఊతంతో ఊహల అల్లరిని చేతల వల్లరిగా మార్చుకునే ఉద్రేకంతో శ్రీపతి అడుగులు వడివడిగా పడటం మొదలయ్యాయి.

ఆ వయ్యారి, డొంక రోడ్డు వదిలి హైవే ఎక్కి ఆ జిగేల్ జిగేల్ వెలుతుర్లో కనుమరుగయ్యే లోపల్నే కేచ్ చేసెయ్యాలి . తన అదృష్టం పరీక్షించుకోవాలి . ఆలసించిన ఆశా భంగం . మంచి తరుణం మించక ముందే ఎదరకొచ్చిన తరుణిలాభం , వెధవ నీతుల మధనలో పడి వదులుకోడం తెల్లారికి మిగిలిపోయే వగపు ఏడుపుల అనుభవమే.. అనిపించింది కూడా శ్రీమాన్‌ వేంకట శ్రీపతి మహారసికులవారికి .

శీలరక్షణార్ధం ఆ చిన్నదాని దగ్గర ఏ పెప్పర్ స్ప్రే లాంటి ఆయుధమో ఉంటే ! నో ప్రాబ్లమ్ .. నేక్ గా తప్పించుకునే తెలివిలేటం తన దగ్గరా పుష్కలంగా ఉన్నాయి . బుద్ధి కొద్ది ఎలర్ట్ గా ఉంటే చాలు . . బాల ఎంత కరాటే , కుంగ్ఫూ బ్లాక్ బెల్ట్ అయినా మదమెక్కిన మగతాపం ముందు బేలయిపోవాల్సిందే! అన్నిటికీ తెగించి .. ఆ షకీలా ఫేమ్ సినీమా విలన్‌ టైపు దౌర్జన్యానికి దిగకపోతే కాలిదాకా వచ్చిన లకీ స్టారు పొందును చేజేతులా జారవిడుచుకున్నట్లే !

'కాకున్నది కాకమానదు. కాక మీద ఉన్నప్పుడే కోరిక తీర్చుకోక తప్పదు . . మరీ అంత ప్రమాదమే ముంచుకొస్తే.. గిస్తే గిరుక్కున మూడుడుగులు వెనక్కు తిరిగి రెండు కాళ్లకూ బుద్ధి చెప్పుటయే సరయిన మందు ! కమాన్.. అన్నిటికి సిద్ధంగా ఉండు.. ! ' అని తనను తాను హెచ్చరించుకుంటూ శ్రీపతి గబగబా ఆ లలన వెనక పడనే పడ్డాడు .

వణికే గొంతును బలవంతంగా పెగుల్చుకుని ఆమెనుద్దేశించి 'హాయ్!' అంటూ అదో రకంగా చిటికేసి పలకరించాడు.

మొదటి పిలుపుకు ఆమె ఆగింది కాదు . నడక వేగం మరంత పెంచింది. రెండో పిలుపుకు నడుస్తూనే గిరుక్కున వెనక్కి తిరిగి చూసింది . గభాలున చీరెకొంగు భుజం నిండా కప్పేసుకుని పక్క సందు చీకట్లోకి ఇంచక్కా జారుకుంది.

వెంటాడే క్రూరమృగం వాతబడకుండా భీతహరిణి తప్పించుకొనే దృశ్యం బుల్లి తెరపై చూసేందుకు 'సుందరం' గానే ఉంటుంది. కాని, వాస్తవంలో ఓ అసహాయ జీవి స్వాహా చేసే ' క్రూర మృగం ' నుంచి తనని తాను తప్పించుకునే సన్నివేశం మాతం గగుర్పాటు కలిగిస్తుంది.

శ్రీపతిలోని క్రూరమృగం అహం దెబ్బతింది . 'ఆఫ్ట్రాల్ ఓ ఆడది .. అందులోనూ అర్థరాత్రులు చెడతిరిగేది .. చెట్టంత మగవాడు తాను. . జస్ట్ పిలిస్తే.. పెడచెవిన పెట్టేంత సాహసిస్తుందా ! మహా ముదురులాగుంది . . ముందు దీని పొగరు అణచవలసి ఉంది ! అల్లరయితే అవనీ! ఆడది .. అదే ఎక్కవ నష్టపడేది! తనకెలాగైనా తప్పించుకునే దోవ దొరకక పోదు'

తనకు తానే పరాకులు చెప్పుకున్న శ్రీపతి. . ఒక్క ఉదుటున తానూ ఆ సందులోకే ఉరికేశాడు. మలుపు లోని ఓ భారీ భవంతి ముందు వీధి లైటు స్తంభం కింద నక్కినట్లు నిలబడున్న ఆమె ముందు కొచ్చి నిలబడ్డాడు. నఖశిఖ పర్యంతం పరీక్షగా చూశాడు.

ఆ తటిల్లత వీధి లైటు వెలుగులో తటిల్లున మెరిసింది. శ్రీపతి కళ్లను మిరిమిట్లతో విస్తుగొలిపింది.

తానూహించిన దాని కన్నా ఎన్నో రైట్లు అందంగా ఉందీ సుందరి . కానీ, తానూహించిన విధంగా భయమేదీ ఆ ఆమని మొహంలో కనిపించింది కాదు. ఆత్రుతే తప్ప తప్పు చేసే వాళ్లలో కొట్టొచ్చినట్లు కనిపించే అపరాధ భావనేదీ లేనే లేదు .

మెరిసేదంతా బంగారం కాదు. ఈ బాపతు నాపసానులే లోలోపల పాప కార్యాలకు ఒడిగట్టేది. ఇంతందంగా ఉంది. కాబట్టే ఎవడో దీని వలలో పడ్డట్లుంది . ఆ ' ఎవడో' జాబితాలో తాను మాత్రం ఎందుకు చేరకూడదు! తనూ మొగాడేగా ! అందగాడేగా! తన లక్కూ పరీక్షించుకుంటే తప్పేముంది?

'పని జరగాలంటే పిట్టను బెదరగొట్టకు! యాక్టరువేగా .. జంటిల్ మన్ లా నటించు ముందు ' అంటూ సలహా ఓటి పారేసింది కోరికలతో సలసలా కాగిపోయే కొంటె మనసు.

'ఎవరండీ మీరు ? ఇంత రాత్రి వేళా చీకట్లో ఈ సందుల్లో ఎందుకు తాచ్చాడుతున్నట్లు ? ' అనడిగాడా అమ్మణ్ణి సాధ్యమైనంత మృదుత్వాన్ని పలకరింపులో కలగలుపుకొని శ్రీపతి .

ఎన్ని ప్రశ్నలడిగినా ఒక్క దానికీ బదుల్లేదా భీతహరిణి నుంచి. అన్నిటికీ మౌనమే సమాధానం. దీపస్తంభం పక్కన మరో దీపస్తంభంలాగా నిలబడివుంది. శ్రీపతికి చిర్రెత్తుకొచ్చింది ఆ నయగారానికి.

'నోరెత్తవేం? పిలవాలా పోలీసుల్ని?" అని మొరటుగా అడగాలనిపించింది . కానీ, ' గజగజా వణుకుతో సన్నగా ఏడిచే ఆమెను చూసన్నా అక్కడి కాగి పో ' అంటూ కంగారుగా అడ్డొచ్చింది గుండెలోని దిక్కుమాలిన నటన. .

వంచన సలహా మీదనే గొంతులో రవంత మార్దవం నింపుకొని 'ఏడవకండీ! ప్లీజ్ డోంట్ క్రై! ప్రాబ్లమ్స్ .. చెప్పుకోలేనివి ఏమైనా ఉన్నాయా మీకు ! కమాన్‌ .. నాతో పేర్ చేసుకోవచ్చు ! ఇప్పుడే మా ఇంటికి రావచ్చు.. రండి ! '' అన్నాడు శ్రీపతి ఆమె చేతిని చనువుగా తాకుతూ.

' నా ఊహకు మించి నటించేస్తున్నావ్ ! మహా గడుసరివేరా నువ్వు! శభాష్! కంటిన్యూ! ' అంటూ మనసు ఎంకరేజ్ చెయ్యడంతో మరింత రెచ్చిపోయాడు శ్రీపతి .

చొరవగా చెయ్యి చాపి " మరి రండీ .. వెళదాం! ఎంతో దూరం లేదులేండి మా ఇల్లు! " అంటూ మృదువుగా ఆమె చేతిని తన గుప్పెటలోకి తీసుకున్నాడు.

ఆమె చేతిని గుప్పెట నుంచి విడిపించుకోలేదు .. సరికదా .. రెండో చేతితో ఆ గుప్పిటను మరింత గట్టిగా బిగిస్తూ తలను శ్రీపతి భుజం పైన సుతారంగా వాల్చి అదో రకంగా అడిగింది "మీకు పెళ్లయిందా ? ప్రాబ్లమేమో కదా ? "

అంత దుఃఖంలోనూ ఆమెగారు అలా విచారణకు దిగడం ఆశ్చర్యం కలిగించింది శ్రీపతికి .

'అమ్మో! అనుకున్నంత అమాయకురాలేం కాదీ అమ్మడు . నెరజాణే ' అనుకున్నాడు శ్రీపతి తన వంటికుంపట్లో ఆమె రగిలించే తపన మంటలలో కొంటె కోరికలను చలికాచుకుంటూ!

' ఈ కిక్కులో నిజం కక్కేస్తే పిట్ట జారిపోవచ్చు. ఇంటి కెళ్లి ఇంచకా పబ్బం గడుపుకొ! ఆనక నీ దిక్కుమాలిన నిజాయితీ ఏదో నిరూపించుకో.. పో ! ' అంటూ కొంటె మనసు మరింత ఎక్కించింది .

''అబ్బే ! నో ప్రాబ్లమ్ అండీ ! ఎప్పుడైనా మా ఇంటికి ఫ్రీగా రావచ్చు! . వెళ్దాం రండి మరి .. వెళ్దామా ! " అనడిగాడు ఆశగా శ్రీపతి .

ఆమె స్వరంలోనూ మార్పు స్పష్టంగా కనిపించింది " ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నారే ! ఎవరూ పడలేదా ఇప్పటి దాకా !" అందామె. . చిర్నవులు అందంగా చిందించి.

తబ్బుబ్బయిపోయాడు శ్రీపతిలోని అబ్బాయిగాడు .

'మరీ బేలేం కాదీ బాలామణి. జాణతనం జాస్తిగానే చూపిస్తుంది. పనికిమాలిన బిడియంతో నువ్వే ఇంత వరకూ గింజుకున్నది! ' అంటూ మహా దెప్పింది శ్రీపతిలోని మనసు మళ్లీ మళ్లీ . మొహమాటపు తెరను చీల్చి మోహన్ని బైటకు నెట్టింది .

"చలిగాలిగా ఉంది. తుప్పర్లు. మరీ ఎక్కువయితే వర్షంతో ప్రాబ్లమ్ ! రెండగల్లో వస్తుంది మా ఇల్లు. తొందరగా వెళ్లి పోదాం - రండీ! " అంటూ ఆమె చెయ్యి పట్టుకుని మహా ఆత్రంగా గుంజాడు శ్రీపతి .

"ఒన్ మినిట్ మిస్టర్.. మిస్టర్ ... ? "

"మిష్టర్ .. ఉమాకాంత్ '' బదులిచ్చాడు శ్రీపతి.

కిసుక్కున నవ్వింది మనసులోని గడుసుతనం శ్రీపతి చచ్చు తెలివితేటలు ఆశ్చర్యంగా చూసి.. మురిసి .

" మిష్టర్ ఉమాకాంత్ ! తాతగారికి ఈ కాంపోజ్ డోస్ ఎక్కించొస్తా! హోల్ నైట్ కిక్కురమనకుండా పడుకుంటారు ! దీని కోసమే బైటికొచ్చింది.

' షార్ట్ కట్ ' అని తెలిసీ భయం భయంగానే ఈ సందు నుంచి వెళుతున్నది . లకీగా మీ పరిచయమయింది . పేరెంట్స్ కూడా జౌటాఫ్ స్టేషన్ . సర్వెంట్ ఎక్కడో తాగి పడున్నట్లుంది . ఒంటరిగా ఉండాల్సొస్తుందని బహటే వర్రీ అయిపొయ్యానుండీ ! థేంక్ గాడ్ ! లకీగా మీ కంపెనీ దొరికిందండీ! వర్షం ముంచుకొచ్చేటట్లుంది . మీ ఇంటి దాకా ఎందుకు ? ఇంత పెద్ద ఇల్లు ఇక్కడుండగా! జస్ట్ వెయిట్ ప్లీజ్ ! వెనక నుంచి ఎంట్రీ ఉంది. దానికి లాక్వేసి ఉందో లేదో చూసి వస్తా! అందాకా ఈ బ్యాగ్ చూసుకోరా ప్లీజ్ .. మిస్టర్ ఉమాకాంత్ ! బై ది బై! మై నేమీజ్ సుశ్రూష. " అంటూ ఆమె బ్యాగ్ శ్రీపతి చేతిలోకి విసిరి గోడ చాటు సందులోకిరెప్పపాటులో మాయమైంది.

చలిలో .. మసక చీకటిలో .. మిణుకు మిణుకు మనే వీధి దీపం కింద పాపం వణుకుతూ ఎంత సేపు నిలబడ్డాడో పాప కోసం వెయ్యి కళ్లతో ఆబగా ఎదురుచూస్తో శ్రీపతి .

పది నిమిషాలు గడిచినా సుశ్రూష బైటికి రానే లేదు. చడీ చప్పుడయినా వినరావడం లేదు .

చినుకులుగా మొదలయిన వర్షం విసురు గాలితో కలిసి మొహాన జల్లులు కొట్టేస్తూ మహా అల్లరి పెట్టేస్తుంటే శ్రీపతికి వళ్లు మండింది, మరింకా ఎదురు చూసే ఓపిక నశించింది.

విసురుగా వెళ్లి బలంగా గేటును తోస్తే తలుపు సులువుగానే తెరుచుకుంది! సుశ్రూష చెప్పినట్లు దానికి ఏ తాళమూ వేసిలేకపోవడంవింతనిపించింది. అనుమానం పెరిగి వరండాలోకి పరుగెత్తి తడిసే కన్నులు చికిలించి మరీ గేటు వంక తేరిపార చూసాడు శ్రీపతి .

అప్పుడే తళుక్కు తళుక్కుమని ఆకాశం నుంచి జారిన మెరుపుల కాంతి ధారలో గేటు మీది నల్లటి బోర్డు చూసి బిత్తరపోయాడు శ్రీపతి .

"సూశ్రూష లెప్రసీ క్యూర్ సెంటర్ " అని తాటికాయంత తెల్ల రంగు అక్షరాలు ఆ నల్ల బోర్డు మీద కొట్టొచ్చినట్లు కనిపించడంతో అవాక్కయిపోవడం అతగాడి వంతయిందిప్పుడు . ' నీ భీత హరిణి హ్యండ్ బ్యాగూ ఒక్కసారి చెక్ చేసి చూసుకో అర్భకుడా ! ' అంది బుద్ధి లోపలి గడ్డు నిజం . . వెక్కిరింపు నవ్వుతో .

శ్రీపతి కంగారుగా సుశ్రూష హ్యాండ్ బ్యాగు తెరిచి చూస్తే దాన్నిండా ఏవేవో టేబ్లెట్స్, ఇంజెక్షన్సూ , ఆయింట్ మెంట్సూ ... సిటీలోని ప్రముఖ కుష్ఠు వ్యాధిరోగ వైద్య నిపుణుడు డాక్టర్ సాల్మన్ రాసిచ్చిన ప్రిస్కిప్షన్సూ ! అన్ని మందుచీటీల మీదా పేషెంట్ స్థానంలో మిస్ సుశ్రూష పేరు మాత్రమే మెన్షన్ చేసుండటంతో కాలి కింది భూమి కదిలి లోపలకు కుంగిపోతున్నట్లనిపించింది శ్రీపతికి .

తానిప్పటి దాకా రాసుకు పూసుకు తిరిగిన లేడీ ఒక లెప్రసీ పేషెంటా! ఆమె చేతులను తన గుప్పిట్లో బంధించడం, అవసరమున్నా లేకపోయినా తన వంటితో ఆమె వంటిని పదేపదే అంటుకోవడం . . అన్ని వెకిలి చేష్టలూ ఒక్కొక్కటే సినిమా సన్నివేశాలకు మల్లే కంటి ముందు కదలాడుతుంట్ వళ్లంతా కంపరమెత్తిపోయింది శ్రీపతికి . నిజంగానే తన పన్నాగం ఫలించి ఆ పాపిష్టి సుశ్రూషతో గాని తాను నైటంతా ఎంజాయ్ చేసుంటే!

.. ఒక కుష్ఠురోగితో సంయోగమా! .. ఊహించడానికే భయం వేసింది శ్రీపతికి.

ఒక్క క్షణం కూడా ఆ ప్రాంగణంలో ఉండబుద్ధికాలేదు. హ్యాండ్ బ్యాగునక్కడే ఓ మూలకు గిరాటేసి గేటుని ధడాల్మని కాలితో బైటికి తన్నేసి అంత గాలివానలోనూ ముద్దగా తడుస్తూనే చీకటిలో కల్సి పోయాడు చివరకు శ్రీపతి .

***

రాణి పండంటి బిడ్డతో ఇంటికి తిరిగొచ్చింది. బిడ్డను చూసి ఆశీర్వా దాలందించే చుట్టాలు పక్కాలు, చుట్టుపక్కల వాళ్లు , తెలిసిన వాళ్లందరి రాకపోకలతో ఇల్లంతా రోజూ ఓ పెళ్లివారి విడిదిలా సందడిగా ఉంటోంది.

ఆ రోజు శ్రీపతి తలనొప్పిగా ఉందని ఎప్పటికన్నా ముందే ఆఫీసు నుంచి ఇంటికి తిరిగొచ్చాడు.

వరండాలో షూస్ విడుస్తుండగా లోపలి నుండి నవ్వులు వినిపించాయి. . భార్యతో కలుపుగోలుగా మాట్లాడుతున్న ఆ గొంతు ఎక్కడో విన్నట్లనిపించింది శ్రీపతికి !

కుతూహలం కొద్దీ కిటికీ గుండా లోపలికి తొంగి చూస్తే బాబును వళ్లో ఉంచుకుని రాణి పక్కనే ఆనుక్కూర్చుని ఉత్సాహంగా కబుర్లు చెప్పే ఆమె మరెవరో కాదు ! నెల కేందట తనకు భయంకరమైన అనుభవాన్ని చవిచూపించిన మహాతల్లి కుమారి సుశ్రూషా దేవి. . భయంకర కుష్ఠువ్యాధి రోగి!

బాబుకు .. భార్యకు .. రాబోయే పెద్ద ప్రమాదం కళ్లకు కట్టినట్లయి గజాగజా వణికిపోయాడు శ్రీపతి .

ఒక్క ఉదుటున హాల్లోకి దూకి ఆ సుశ్రూష ఒడిలోని బాబును విడదీసి, భార్యనూ ఆమె నుంచి దూరంగా నెట్టేస్తూ... బిగ్గరగా అరిచాడు .. " డోంట్ టచ్ హర్! దిస్ డెవిల్ ఈజే లెప్రసీ పేషెంట్.. లెప్రసీ పేపెంట్ ! ''

భర్త సడన్ ఎంట్రీ , హిస్టీరికల్‌ యాక్షన్స్ కి రాణి బిత్తరపోయింది ముందు . సుశ్రూష వంక తీక్షణంగా చూస్తూ ఆయన అంత మొరటుగా ఎందుకు ప్రవర్తిస్తున్నట్లో ఆమెకు అర్ధమయింది కాదు .

కానీ, బాబును పలకరించి ఆశీర్వదించేందుకు ఎంతో ఉత్సాహంతో ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన తన చిన్ననాటి స్నేహితురాలి పట్ల భర్త అంత దురుసుగా ప్రవర్తించడం ఆమెకు అమితమైన కోపం తెప్పించింది .

ఎన్నడూ లేనిది ఆగ్రహంతో ఊగిపోతూ భర్త మీదకు దూసుకెళ్లి " ఇంకొక్క మాట మీ నోటి నుంచి వస్తే మర్యాద దక్కదు. తనెవరనుకుంటున్నారో! నా చిన్ననాటి క్లోజ్ ఫ్రెండు మనోజ్ఞ. ఆమెను పట్టుకుని.. ఎవతో సుశ్రూషా.. ఏదో లెప్రసీ పేషెంట్ అంటూ పిచ్చిగా కారుకూతలు కూస్తుంటే విని సహించేదిలేదు. "

ఆవేశంతో ఊగి పోయే రాణి మాటల్లోని ఆ ' మనోజ్ఞ' అనే పదం విని బిత్తరపోయాడు శ్రీపతి . తనను లాగే తన భార్యనూ ఏవేవో టక్కరి కథలలో వెర్రిదాన్ని చేయడానికే దాపురించినట్లుందీ లెప్రసీ దయ్యం .

శ్రీపతికి కోపం నసాళానికి అంటింది. ఆవేశంతో అరుస్తున్న భార్యను పక్కకు తోసేసి మనోజ్ఞ కేసి తీక్షణంగా చూస్తూ " నువ్వు ఇంకొక్క క్షణం ఇక్కడుంటే ఏం చేస్తానో నాకే తెలీదు. గెటౌట్ .. ఫస్ట్ గెటౌట్‌ యూ ఛీటర్ ! మారుపేర్లు పెట్టుకుని నమ్మిన మనుషుల్ని ఫూల్స్ చెయ్యడం నీకు ఆట అయితే కావచ్చు! మళ్లీ రుళ్లీ మోసపోయేందుకు మేమేమీ వెర్రిపప్పలం కాదు. మర్యాదగా కదిలితే తమరికే మంచిది. లేదంటే తిన్నగా కటకటాల వెనక్కెళ్లి చిప్పకూడు తిండమే గతి." అంటూ చిందులేశాడు శ్రీపతి .

" ఓ. కే మై డియర్‌ ఉమాకాంత్! నా మేటర్ నేను చూసుకుంటా! పండంటి బాబుకు తండ్రయి మా రాణిని తల్లి పోస్టుకు ప్రమోట్ చేసినందుకు ముందుగా మీకు నా మనస్ఫూర్తి ధన్యవాదాలు .. ఆ తర్వాత అభినందనలు!అంటూ రాణి వంక తిరిగి " సరేనే రాణీ! మీ రాజావారిని కూల్ చేసి అప్పుడు మరీ పిలు! ఫుల్ డే అంతా బావగారిని ఆటపట్టిస్తూ నా మరదలుసరదాలన్నీ మరోసారి తీర్చుకుంటా! " అంటూ బాబు బుగ్గమీద .. రాణి బుగ్గమీదా శ్రీపతి చూస్తుండగానే చటుక్కున రెండు హాట్ హాట్ ముద్దులిచ్చి నవ్వుకుంటూ వెళ్లి పోయింది మనోజ్ఞ .

శ్రీపతి, వెళ్లి పోయిన సుశ్రూష ఉరఫ్ మనోజ్ఞ వంకా.. రాణి, భర్త శ్రీపతి వంకా అయోమయంగా చూస్తూ అట్లాగే నిలబడిపోయారు.

***

రెండో కాన్పుకి పుట్టింటి కెళ్లే ముందు రోజు రాత్రి " ఈ సారైనా శ్రీవారు ఒళ్లు దగ్గరుంచుకుని బుద్ధిగా మసలుకుంటారనే ఆశ! అందరూ మా మనోజ్ఞ మాదిరి మంచి మరదళ్లే ఉండరు ! ఫ్రెండు భర్త గదా అని గుర్తుపట్టి స్వాభిమానమే కాకుండా, బావగారి గౌరవ మర్యాదలకూ భంగం కలగకూడదనే అంత రొష్టుపడుతు కూడా అలవాటులేని నాటు నాటకాన్నిబాగా రక్తి కట్టించింది, పిచ్చిది. మా డాక్టర్ మనోజ్ఞ మీరన్నట్లు ఛీటర్ కాదు. కాలేదు కూడా. తను లెప్రసీ స్పెషలిష్ట్. కాబట్టే తను ట్రీట్ చేసే పేషెంట్ సుశ్రూష పేరుతో మీ మాయదారి మగరోగాన్నీ ట్రీట్ చేసి నా కాపురాన్ని కాపాడింది . శ్రీపతులువారు ఉమాకాంతులుగా మారి వేసే వెర్రి మొర్రి వేషాలకు .. వళ్లు కొవ్విన మరో ఆటకత్తెలయితే అంటగట్టేది ఏ ఎయిడ్స్ లాంటి అంటువ్యాధులనే .. బీ కేర్ ఫుల్ .. "

" సారీ రాణీ ! రియల్లీ సారీ!" శ్రీపతి గొంతు పశ్చాత్తాపంతో వణికింది.

'' ఏ శ్రీవారి నుంచీ శ్రీమతి వినకూడదనుకొనే చెడ్డమాట ఈ ' సారీ ' సర్! సందర్భం వచ్చింది కాబట్టి ఎప్పటి బట్టో మనసులో అనుకుంటున్న ఒక్క మాట మీకు చెప్పాలనుకుంటున్నా . మనసారా నమ్మిన కట్టుకున్నవాడి వంశాభివృద్ధి కోసం మృత్యు దేవతకైనా ఎదురొడ్డి పోరాడి ఓ బిడ్డకు రక్తమాంసాలు పంచి ఇచ్చే ఏ శ్రీమతికైనా నిజమైన శ్రీవారు ప్రేమతో ఇచ్చే వెలలేని బహుమతి - ఆమె నమ్మకం వమ్ముకాని విలువైన రుజుప్రవర్తన" అంది రాణి శ్రీపతి గుండెల్లోకి గువ్వలా ఒదిగిపోతూ .

"మొదటి తప్పే చివరి తప్పు . నాతి చరామి అని శ్రీమతిగారికి ఇదే శ్రీవారు ఇచ్చే గట్టి హామీ " అన్నాడు శ్రీపతి రాణిని మరింత గట్టిగా తన హృదయానికి హత్తుకుంటూ .

***

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు