ఒంటి కొమ్ము ఆవు కథ - భవాని శంకర్

Onti kommu aavu katha

“ఆ.. నానా, వొస్తున్న.” “ఎండలు మిడిమేలంగున్నయ్ తొందరగొచ్చెయ్ రా” “ఇంగో అర్ధగంటల ఇంటి కాడుంటా” అని చెప్పి ఫోను పెట్టేసి ఆఫీసు నుంచి బయటికొచ్చి బండి స్టార్టు చేశాడు రాజు. సూర్యుడు నడినెత్తిన భగ్గుమంటున్నాడు. కణతల వెంబడి ధారగా కారుతుంది చెమట. రాజు పెదాలు తడారిపోయాయి, గొంతు ఎండుకుపోయింది. మిట్ట మధ్యాహ్నం కావడం వల్లనేమో, షాపులేమీ తెరవలేదు. తను తహశీల్దారుగా పనిచేసే ఆఫీసులోనే గుమాస్తాగా పనిచేసే రాజేష్ ఇల్లు పక్కనే. బండి నేరుగా రాజేష్ ఇంటికి చేరుకుంది. రాజేష్ టీవీ చూస్తున్నట్టున్నాడు. “పోలీసుల హెచ్చరికలు లెక్క చెయ్యకుండా సమ్మెకు దిగుతున్న గూండాలపై బుల్డోజర్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..” అంటూ టీవీలో వార్తలు చదువుతున్నాడు న్యూస్ రీడరు. తలపు దగ్గరగా వెళ్ళి, “రాజేష్” అని పిలిచాడు రాజు. టీవీ సౌండు తగ్గించి బయటకొస్తూ, “మీరేంటి సర్ ఇలా.?” కొక్కేనికి వేలాడుతున్న చొక్కా తగిలించుకోబోయాడు రాజేష్. “షాపులేమీ తెరిచినట్టుగా లేరు, దాహంగా ఉంది. కాసిన్ని నీళ్లు ఇస్తావా?” “ఉండండి సర్ తెస్తాను” అంటూ వెనుదిరిగి లోపలికెళ్లి గ్లాసు నిండా నీళ్లు తెచ్చిచ్చాడు రాజేష్. “ఇంకో గ్లాసు తెమ్మంటారా” అని రాజేష్ అడిగిన ప్రశ్నకి చాలని చెప్పి, పక్కనే ఉన్న డస్ట్ బిన్లో గ్లాసు పడేసి ఇంటికి బయల్దేరాడు రాజు. ****** దాదాపుగా ఇరవయ్యేళ్ల క్రితం “మోవ్, లేసి పనులు సూస్కోని మల్ల పండుకుందువు గానీ.. లెయ్ ఇంగ” సూర్యుడి కంటే ముందే లేచి ముసలి తల్లి మీద కేకలేస్తూ గుడిసె లోంచి బయటికొచ్చాడు సామేలు. గట్టిగా మూలుగుతూ, చేతుల్ని బలంగా చాపి, శరీరాన్ని విరుస్తూ సరిచేసుకుని, ఎడమ చేతిలో కాస్త ముగ్గుపొడి వేసుకుని పళ్ళు తోముతున్నాడు. “లేస్తే పండుకోలేను, పండుకుంటే లేవలేను. ఎక్కడ గానుకోచ్చిందో.. నా సావుకే వొచ్చింది ఈ రోగం” వంగిపోయున్న నులకమంచం మీంచి లేచింది సామేలు తల్లి. “నీ తిక్క మాటలకేమి గానీ.. రాజు గాన్ని లేపి బడికి తయ్యారుజెయ్. నేను పనికివోతున్న.” చెంబుడు నీళ్లు తాగి బయటికి కదిలాడు. * “యేమిరా సామేలూ ఇంత పొద్దుగాలొస్తివి, యా ఊరు కాలిపాయ!” అన్నాడు మేస్త్రీ తారేసు. “ఈ సుట్టుపక్కల నా పనిని పేర్ల వెట్టింది నువ్వొక్కనివేనా సామీ” “నీ పెగ్గేలకేమి గానీ, ఇయ్యాల పని కొంచం కస్తిగజెయ్.” చొక్కా విప్పి పని మొదలెట్టాడు సామేలు. పశువుల జంగిలీలు మేతకు కదిలాయి. కాన్వెంటుకు పొయ్యే పిల్లలు గుర్రపుబండ్లు ఎక్కి బడికి పోతున్నారు. పని చేసుకుంటూనే పక్కనే టీకొట్టులో ఉన్న రేడియోని శ్రద్ధగా వింటున్నాడు సామేలు. “భారతదేశ పదకొండవ రాష్ట్రపతిగా APJ అబ్దుల్ కలాం ప్రమాణ స్వీకారం నేడు. ముఖ్యాంశాలు సమాప్తం. సమయం, తొమ్మిది గంటలు. తర్వాతి కార్యక్రమం అలనాటి మధురగీతాలు..” చెప్తుండగానే లేచి చొక్కా తగిలించుకుని, “న్నోవ్, నాక్కొంచం పనుంది. ఒకటేసారి తినీ గినీ వొస్త పనికి” అన్నాడు. “ఎప్పుడు వడితే అప్పుడు వచ్చిపోతే ఈడ మీ నాయన చేస్తడారా పని” తారేసు. “నువ్విట్ట అంటవనే ముందే మా సిన్నాయన్ని అడిగిన లేన్నా సామీ” “అట్టనా.. ఎవుర్రా నీ సిన్నాయన?” “ఏందినా, మా సిన్నాయన తెలదా నీకు!? ఈ గుడి కట్టిస్తుండేది, ఊర్లు దేవలాలు మొత్తం సూస్కునేది మా రామిరెడ్డి సిన్నాయన్నే” “రామిరెడ్డి నీకెట్ట ఐతడ్రా సిన్నాయన? నీ సిన్నమ్మని గీన ఇచ్చి చేసింటివా?” “నీతో మాట్లాడుకుంట కూసుంటే యా పని గాదు గానీ, నేను వొయ్యొస్త.” * “అమా.. మోవ్, రాజు గాన్ని బడికి పయనం జేసినవా?” అరుస్తూ వొచ్చాడు గుడిసెలోకి. “నేను రెడీ నానా. పోదమా?” అన్నాడు రాజు. రాజు హుషారైన పిల్లాడు. చాలా తెలివైవాడు. అన్నీ తల్లి పోలికలే వచ్చాయి అంటూ ఉంటుంది సామేలు తల్లి. తండ్రీకొడుకులిద్దరూ బడి దారి పట్టారు. “ఇప్పుడు మనం యాడికిపోతున్నమో తెల్సునా?” అడిగాడు సామేలు. “కొత్త బడికి.” హుషారుగా చెప్పాడు రాజు. “మీయమ్మ ఇప్పుడు మనంబొయ్యే బడిల్నే సదువుకునిందంట. అందరి కంటే బాగా సదివేదంట. ఇంగో మూడేండ్లు సదివింటే మంచి ఉజ్జోగమొచ్చేది అని చెప్పి బాధపడేది.” “నానా, అమ్మ ఏం పని జేసేది?” “అన్నీ జేసేది. పొలం పనులకి పొయ్యేది, నాతో పాటుగ ఇసుక, రాళ్ళు మొయ్యనీకె, మీ జేజితో పాటుగ ఊర్ల దొడ్లు ఎత్తెయ్యనీకె పొయ్యేది. అట్ట మనిషికి మించిన పనులు జేసే, రోగం తెచ్చుకోని మనల్ని ఇడ్సిపెట్టిపోయింది.” “నువ్వు పోతలెకుంటివ్యా దొడ్లు ఎత్తెయ్యనీకె?” “అది మొగోల్ల పనిగాదురా తిక్క నాకొడకా. ఆడోల్లు మాత్రమే చేసేతోళ్లు” మాటల్లో బడొచ్చేసింది. “ఇంగ రేపన్నుంచి నేను రాను ఇడ్సివెట్టనీకె. నియ్యంతట నువ్వే రావాల. ఏమి?” “సర్లే. నువ్వు మర్సనంగపో ఇంటికి.” దారిలో తల్లికి మందులు కొని ఇంటికి చేరుకున్నాడు సామేలు. “ఒక కాలు కాటికి జాపి బతుకుతున్న. నాకెందుకురా ఈ మాత్తర్లు, ఇంత కర్చు?” “మిరప్పొడిల ఉప్పు తక్కువయిందని మొన్న చెప్పిన. ఇంగా అట్టనే ఉంది.” పళ్ళెంలో చేతులు కడుగుతూ అన్నాడు. “నాయనా.. నా మాటిని పెండ్లి జేస్కోరా.” “పనికి ఆల్చం అయిపోతుంది. నేను పోయొస్త.” * నోట్లో బీడీ పెట్టుకుని శ్రద్ధగా పార్వతీదేవి ముక్కును చెక్కుతున్నాడు మేస్త్రీ తారేసు. “అన్నా.. యే బొమ్మనైనా బిరబిర చెక్కిపాడేస్తవ్, ఎట్టన్నా అంత బాగ నేర్చుకున్నవ్ పని?” అబ్బురపడిపోతూ అడిగాడు సామేలు. “మా నాయన, జేజినాయన, వాళ్ళ నాయన కాన్నుంచి చేస్తున్నంరా మేము ఈ పని. నీకు రాళ్లు మొల్సడం ఎట్టనో నాకు ఈ పని అంతే.” “రాళ్ళు ఎవడన్నా మొలుస్తాడు. విగ్రహం చెయ్యనీకె పని రావాల.” “నేర్సుకుంటే ఏందన్నా వొస్తదిరా.” “నువ్వు ఎన్నేండ్లున్నప్పుడు నేర్సుకున్నవ్?” “సిన్నప్పట్నుంచీ మా నాయనెంటనే పొయ్యేది పనికి. కానీ పదారు పడే వరకు నేర్పియ్యల్యా మా నాయన. ఆ తర్వాత ఒక్క ఏడాదిల నేర్సుకున్న. పని మొత్తం నేర్పినంక ఏమన్న్యాడో తెల్సునా మా నాయన?” “ఏమన్న్యాడు?” “నన్ను దగ్గరికి పిల్సుకోని, “ఒరేయ్ నాయనా తారేసు నాకొడకా.. నేను నీకు నేర్పిచ్చిన ఈ పనిని మందికి గీన నేర్పేవురా.. లచ్చ రుపాయలు ఆశ జూపినా ఎవ్వనికి నేర్పగూడదు” అన్న్యాడు.” “వోయమ్మ. ఎందుకునా అట్ట?” “అదే అడిగిన నేను గుడక. అప్పుడు మా నాయన నవ్వుతా, “ఈ పని శానా గొప్ప పనిరా, అందురూ చేసే పని గాదు. నువ్వు మందికి నేర్పితివే అనుకో.. నిన్ను కుక్కలు గూడక పనికి పిల్సుకోవు. అదే గినక జరిగితే వాళ్ళ దేవున్ని మల్లా అంత దగ్గర్నుంచి చూసే అవకాశమే రాదు మనకి. కావట్టీ.. నీ పిల్లలకి తప్ప ఎవ్వనికీ నేర్పగూడదు. ఇది మతికి వెట్టుకోని బతుకు” అని జెప్పినాడు.” నోరెళ్ళబెట్టి తారేసు వైపే చూస్తున్నాడు సామేలు. “నీకు అర్దంగాదులే గానీ, బెరబెర కానియ్యండి పని. రేపు మద్దేనం లోపు మొత్తం ఐపోవాల.” అందమైన ఎరుపును మేఘాలకు అద్దుతూ దూరంగా కనిపిస్తున్న లోయల్లోకి జారుకున్నాడు సూర్యుడు. అందరూ పనుల్లోంచి లేచారు. సామేలు చొక్కా తగిలించుకుని రామిరెడ్డి ఇంటివైపు బయల్దేరాడు. రామిరెడ్డి ఇంట్లో ఎవరూ ఉన్నట్టు లేరు, బయట గేటుకు పెద్ద తాళం తగిలించి ఉంది. ఆయన కోసం ఆ గేటు పక్కనే కూర్చున్నాడు. రామిరెడ్డి ఊరి పెద్దమనిషి. ఇప్పుడు ధర్మకర్త కూడా. ఊర్లో ఉన్న గుళ్ళూ, గోపురాలు మొత్తం అతని ఆధీనంలోనే పని చేస్తాయి. సామేలుకి అతనంటే అమితమైన గౌరవం. కాసేపటికి రోడ్డు మీద అలా నడిచొస్తున్నాడు రామిరెడ్డి. సామేలు లేచి నిలబడ్డాడు. “ఏమిరా, బలేటొచ్చినవ్?” రామిరెడ్డి “కొంచం డబ్బులు గావాల నైనా” చిన్నగా అడిగాడు సామేలు. “ఇంగో రెండు దినాల్ల పని అయిపోతది గదరా. మొత్తం అప్పుడే తీస్కుందువుపో” “రాజుగానికి స్కూలు బట్టలు గొనాల. అందుకే..” “ఏమిరోవ్.. మనూరి బడిల గుడక యూనిఫారాలు పెట్టినారా?” “మన ఊర్ల బడి మానిపిస్తి గద నైనా మన రాజుగాన్ని. బడిల సారు దినాము రాజుగాని తోటికనే కసువులు కొట్టిస్తున్నాడంట, బండలు తూడిపిస్తున్నాడంట. సదువు బంగం అయిపోతదని పెద్ద బడిల జేర్పిస్తి.” “సర్లే.. ఎంత గావాల?” “రెండు నూర్లు ఇప్పియ్యే. సాలు.” “సరే, లోపలికొచ్చి తీస్కపో.” ఇంటికెళ్ళే దారిలో ఒక నోటు పుస్తకం, పెన్సిలు కొన్నాడు. కాళ్ళు కడుక్కోడానికి చెంబు చేతిలోకి తీసుకుని “ఓరి రాజూ, ఇవి లోపలికి దీస్కపోదురా” అనగానే ఉత్సాహంతో బయటికొచ్చి తండ్రి తెచ్చిన పుస్తకం చేతుల్లోకి తీసుకుని గట్టిగా వాసన పీల్చి, “కొత్త పుస్తకం వాసన బల్లే ఉంటది నానా” అన్నాడు రాజు. “కొత్త బట్టల వాసన ఇంగా బాగుంటదిలే” అనగానే రాజు అనదంతో గెంతులేశాడు. సామేలు అన్నం వండితే, సామేలు తల్లి పచ్చడి నూరింది. ముగ్గురూ కలిసి తిన్నారు. రాజు మంచమెక్కి జేజి పక్కకి చేరాడు. సామేలు పక్కనే చాప మీద పడుకున్నాడు. “నిన్న యాడిదాంక ఇన్యావురా కత?” అడిగింది జేజి. కాసేపు ఆలోచించి “ఊ.. ఒంటికొమ్ము ఆవు బోనాసి దాటే వరకు మతికుంది.” అన్నాడు రాజు. “ఆ.. జనాలు ఒంటి కొమ్ము ఆవుని ఊర్ల నుంచి ఎల్లగొడతారా.. అప్పుడు ఆ ఆవు ఊరిని ఇడ్సిపెట్టి, దాని దూడని ఈపు మింద ఎక్కిచ్చుకోని బోనాసి ఏరు దాటి ఇవతలికొస్తది..” అంటూ కథ చెప్తుంటే ఊ కొడతూ కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు రాజు. రాజుకి దుప్పటి కప్పి తను కూడా పడుకుంది. తెల్లవారగానే లేచి కసువులు కొట్టి, మూలుగుతూ అంట్లు తోముతుంది సామేలు తల్లి. సామేలు కూడా లేచి నీళ్లు తాగి పనికి కదిలాడు. “రా బ్బీ సామేలు, మీరు ఇయ్యాల ఎంత బిరబిర పనిజేస్తే అంత పొద్దుగాల ఇంటికి బోవచ్చు.” అన్నాడు తారేసు. “మిగితా మంది గుడక వొచ్చి వంగితెనే గదనా పనయ్యేది. నేనొక్కన్నే జేస్తే ఐపోతదా ఏమి” చొక్కా తీసి పక్కనపెట్టి మాలు కలుపుతున్నాడు. ‘ఎంత ఆల్చమైనా మద్దేనం మూడు కల్లా పని మొత్తం ఐపోతది. ఇయ్యాల సినిమాకి బోవాల’ అనుకున్నాడు. మాటలు చెప్పుకుంటూ, పాటలు పాడుకుంటూ హుషారుగా సాగిపోతుంది పని. భోజనానికి ఇంటికొచ్చేలోపే బడికి పోయినట్టున్నాడు రాజు. గబగబా తినేసి, చిరిగిన బొంతలు కుడుతున్న తల్లిని మందులు వేసుకుందో లేదో ఆరా తీసి పని స్థలానికి కదిలాడు. రాయి మొలుస్తూ, “తారేసన్నా, ఇయ్యాల టాకీసుల ఏం సిన్మా ఆడుతుంది?” అడిగాడు పక్కనే శివుడి విగ్రహానికి కూర్పులు చేస్తున్న తారేసుని. “తెలదురా నాగ్గూడక. నేను గూడ పోదమనుకుంటి పని అయిపోతే. సూడాల.” “నిన్ననే ఒక నూరు ఎక్కువ ఇప్పిచ్చుకునింటే బాగుండు, ఇప్పుడు మల్ల పోవాల డబ్బుల కోస్రం” మధ్యాహ్నం ఒంటిగంటకు పనంతా అయిపోయింది. మళ్లీ రామిరెడ్డి ఇంటివైపు కదిలాడు సామేలు. డబ్బులిస్తాడన్న నమ్మకం ఉన్నా, అడుగుదామా వద్దా అన్న సందిగ్ధంలో నడుస్తున్నాడు. ఆ సందిగ్ధత తోనే రామిరెడ్డి ఇంటికి చేరుకున్నాడు. “యేమిరా మల్లొస్తివి?” “ఇంగో వంద రూపాయలు గావాల్నే.” “నీళ్ళ లెక్క తాగుతున్నవేమిరా దుడ్లని!” “పని అయిపొయింది గదా.. సిన్మాకి వోదమని..” జేబులోంచి ఒక వంద నోటు తీసి చేతిలో పెట్టాడు. చిన్నగా నవ్వి, “నేను పొయ్యొస్త సిన్నాయన అయితే” అని చెప్పి నేరుగా బడి దగ్గరికి బయల్దేరాడు. బళ్ళో మాష్టారుతో మాట్లాడి ఆ మధ్యాహ్నానికి రాజుకి సెలవు తీసుకున్నాడు. “యాడికి నానా పోతున్నం?” “నీకు కొత్త బట్టలు కుట్టనీకె ఇయ్యొద్దూ.. అట్టనే రేత్తిరి సిన్మాకి పోదం” రాజు కళ్ళు వెలిగిపోయాయి. “ఏం సిన్మా నానా?” “నాగ్గూడక తెలదు. యాదుంటే అదీ.” ఇంటికెళ్ళి పుస్తకాల సంచి ఒక మూలన పెట్టి, తండ్రితో కలిసి టైలరు దగ్గరికెళ్ళి కొలతలిచ్చాడు రాజు. కొడుకుని ఇంటికి పంపి అక్కడే పులిజూదం ఆదుతూ కూర్చున్నాడు సామేలు. * “.. పాలమర్రి పుల్లయ్య అను నేను, ఓబుల్ రెడ్డి కుమారుడు రామిరెడ్డికి నా రెండెకరాల తుమ్మమాను చేను విక్రయిన్నట్టుగా రాసి ఇస్తున్న స్థలవిక్రయ ఖరారునామా” చదివి వినిపించి సంతకం చేయబోయాడు పుల్లయ్య. “డబ్బులు ముట్టినాకనే సంతకం చేద్దువు. ఆగు” అని డబ్బుల కోసం లోపలికెళ్ళాడు రామిరెడ్డి. బీరువా లోపల చెయ్యి పట్టి తడిమాడు, డబ్బుల్లేవు. కంగారుగా ఇంకా లోపలకి చెయ్యి పట్టి చూశాడు, డబ్బు కనపడలేదు. “యేమే.. బోడీ.!” కంగారుగా కేకేశాడు. రామిరెడ్డి భార్య వంటగది నుంచి బయటికొచ్చింది. “బీరువల దుడ్లు గీన తీసినవా?” ఆమె లేదన్నట్టు తలూపింది. “నువ్వు తియ్యక, నేను తియ్యక ఇంగెవడు తీస్తాడు నియ్యమ్మ మొగుడు.” ఆమె మౌనంగా నిలబడి ఉంది. రామిరెడ్డి చకచకా బయటికొచ్చి, “ఇగో పుల్లయ్య, దుడ్లు ఇయ్యాల లేవు గానీ, ఇదే బాండు తీస్కోని రేపురా” అని చెప్పి బయటున్న తన తమ్ముడు రాఘవరెడ్డిని పిలిచాడు. “బీరువల దుడ్లు కనపడ్తలేవురా..” “ఏం దుడ్లునా?” కంగారుగా అడిగాడు రాఘవరెడ్డి. “తిర్నాల డబ్బులురా.. నలవై వేలు.” “ఏం మాట్లాడ్తున్నవ్ అన్నా.. యాడికిపోతయ్, ఇంట్లనే ఉంటయ్ సరింగ సూడునా సామి” రామిరెడ్డి భార్య ఇళ్లంతా చూసింది. దొరకలేదు. దిగులుగా కుర్చీ మీద కూర్చుని, “పోయిన తిర్నాల్ల ఎంత కష్టపడి మిగిలిస్తే మిగిల్న దుడ్లురా అవి!” అన్నాడు రామిరెడ్డి. “నువ్వు ఏం టెంశను తీస్కాకు. మన దుడ్ల మీన చెయ్యేసిన్నాకొడుకుల్ని ఊరకనే ఇడ్సిపెడ్తమా ఏంది.. నువ్వు సూస్కుంట ఉండు, రేపట్లోపు దొరుకుతాడు.” * సాయంత్రం అవ్వగానే పులిజూదం నుంచి లేచి ఇంటి దారి పట్టాడు సామేలు. దారిలో చికెన్ షాపు దగ్గర ఆగాడు. “ఏందినా కిచకిచలాడ్తుంది అంగడి. ఇయ్యాల ఆదివారం గుడక కాదే.” “నీకు తినాలనిపిచ్చినట్టనే గదరా మందికి గూడ.” అన్నాడు అక్కడే ఉన్న ఒకతను. చిన్నగా నవ్వి, “నాకో ముక్కాల్ కిలో కొట్టునా” అన్నాడు సామేలు. “అయినా రామిరెడ్డి ఇంట్లనే దొంగలు పడడం ఏందిరా వింతగాకపోతే” గుంపులో మాట్లాడుకుంటున్నారు. “వాళ్ళ మందిల్నే ఎవరో ఒకరు కొట్టేసుంటారెహే.” అన్నాడు ఇంకొకతను. “ఇంగేం మల్ల. రామిరెడ్డి సొమ్ము కొట్టేసేటంత దైర్నం బయిటోడు జెయ్యడు.” “వోర్నీ.. నేను మద్దేనమే గదనా ఆడికి పొయ్యొచ్చిన. ఎప్పుడు జరిగిందిది!?” అడిగాడు సామేలు ఆశ్చర్యపడిపోతూ. “ఇప్పుడే తెల్సింది మాగ్గుడక. రాఘవరెడ్డి, వాయన కొడుకు భాస్కర్రెడ్డి దొంగను పట్కోనీకె తిరుగులాడ్తున్నారంట.” మాంసం చేతబట్టుకుని దొంగతనం గురించే ఆలోచిస్తూ బయల్దేరాడు సామేలు. ‘అయినా వాల్లకేమన్న దుడ్లు కొదువనాలే. దొరక్కపోతే, పోతే పోయినయ్ అనుకోని ఇడ్సివెడ్తారు.’ అనుకున్నాడు. * “కచ్చితనంగ సామేలు గాని దెబ్బనే ఇది.” అన్నాడు భాస్కర్రెడ్డి తండ్రితో. “కదా!! నేను గుడక అదే అనుకుంటిరా. కానీ మనకి వాడంటే పడదు గావట్టి వాని మీనికి దొబ్బుతున్నం అనుకుంటాడేమో మీ పెదనాయన.” అన్నాడు రాఘవరెడ్డి. “వాయనకి అల్ల తెలదు, మొల్ల తెలదు. వొప్పుకోడు అనిజెప్పి దొంగతనం జేసినోన్ని ఊరికినే ఇడ్సిపెడ్తమా? పెదనాయనకి నేను జెప్తపా.” * “సామేలు గాని ఏటే పడింది అనుకుంటున్న నా నేనైతే. భాస్కర్ గాడు గూడ అదే అంటున్నాడు.” “మీకు ముందు నుంచే వాడంటే మంట. మీ మాటలు ఎట్టరా నమ్మేది?” రామిరెడ్డి. “మాకు వాడంటే పడదని నీకు తెలుసని మాకు తెలియదా ఏంది? నువ్వు నమ్మవని దెల్సినా అంత గట్టిగ జెప్తున్నం అంటే వాడు కొట్టేసిన దానికి ఆదారాలున్నయి గావట్టే.!” భాస్కర్రెడ్డి. “యాడరా ఆదారాలు? అవే దొరికితే నేను మాత్రం ఇడ్సిపెడ్తనా ఏమి?” “వాడు డబ్బులు గావాలని జెప్పి రెండుసార్లు ఈ పక్క రావాల్సిన పనేమి, ఒక్కటేసారి రావొచ్చుగద. సందుల ఎవ్వరు లేని టైముల గుడక ఈ పక్కొచ్చి తిరిగిపోయినాడంట రెండు మూడు సార్లు. ఇంగ వాని తండ్రి ఎట్టాంటోడో నీకు తెల్యదా?” “అయినా వాడు ఈ పని జేసినాడంటే నమ్మబుద్ధి అయితలేదురా.. తిక్క నాకొడుకురా వాడు.” “ఆ.. నువ్విట్ట నెత్తిన ఎక్కిచ్చుకున్న్యందుకే వాడు ఈపొద్దు నెత్తిన ఏరిగినాడు. తిక్క నాకొడుకంట.. నువ్వుపో.. నీ తిక్క ఇడిపిస్తాడు.” రామిరెడ్డి ఆలోచనలో పడ్డాడు. ఎంత ఆలోచించినా వాళ్ళు చెప్పింది నమ్మడానికి తన మనసు సంకోచిస్తుంది. “ఇంగా ఈ ఆలోచనలేందే పెదనాయనా.. పంచాయితి పెడ్తే ఏంది ఎట్ట అని అదే బయటికొస్తది. నువ్వు ఊ అను సాలు.” “ఇంగ నేనైనా చేసేదేముందిరా. కావాల్సిందేందో అయ్యేటట్టు సూడరి.” * ఎంతో ఇష్టంతో వండించుకున్న కోడికూర తిని సినిమాకి పయనమౌతున్నారు తండ్రీ కొడుకులు. సామేలు బయట అరుగు మీద కూర్చోనుంటే, రాజు లోపల తల దువ్వుకుంటున్నాడు. భాస్కర్రెడ్డి మోటారుసైకిల్ మీద తన ఇంటి వైపే రావడం గమనించాడు సామేలు. అరుగు మీద నుంచి లేచి, “ఏంది భాస్కరన్నా ఇట్టొచ్చినవ్? ఏమన్నా పనుందా?” అడిగాడు సామేలు. “నీతోనే సామేలూ పనీ..” బండి ఆపి, “కొంచం మాట్లాడాల, అట్ట పక్కకి పోదాంపా.” సామేలు భుజం మీద చెయ్యేసి పక్కకి తీసుకెళ్లాడు. “ఏందినా పనీ.. చెప్పు” “పని పక్కనవెట్టు గానీ.. అంగి మంచిదేసినవ్, యాడికి పోతున్నవ్?” “పిలగాన్ని తోల్కోని సిన్నాకి పోదాం అనుకుంటినా.” “అట్టనా.. అది సరే గానీ, మా పెదనాయన ఇంట్ల దుడ్లు పోయిన కత తెల్సునా?” “అంగడి కాడ మాట్లాడుకుంటుంటే ఇన్న్యా. ఏమైందన్నా ఇసియం? ఏమన్న బయట పడిందా?” “సామేలూ.. నువ్వు మా పెదనాయనెంట సిన్నప్పుట్నుంచీ తిరిగినోనివి. మాగ్గూడక కావాల్సినోనివి. నీ మంచికొరకే జెప్తున్న.. నీకు, నాకు తప్ప మూడో కంటికి ఎరుక కానియ్యను. కొట్టేసిన దుడ్లు తెచ్చియ్యి.” సామేలు నెత్తిన పిడుగు పడినంత పనైంది. “ఏందినా నువ్వు మాట్లాడేది? నేను దొంగతనం జెయ్యడమేంది? నా జీవితంల యానాడన్నా అట్టాంటి పనిజేసి ఎరిగిన్నా!” మాటలో వణుకు మొదలైంది. “నువ్వు గట్టిగా అరిసి మమ్మల్ని బయపెట్టేది ఏమన్నుందా చెప్పు. నువ్వు తప్పు వొప్పుకోని దుడ్లు ఇస్తేనా ఇది ఈడితో అయిపోతది. లేదనుకో.. రేపు పంచాయితిల తేల్చాల్సొస్తది విషయం. ఊరికినే ఊర్ల ఇకారం అయిపోతవ్.” గొంతు కాస్త పెంచి, “చెయ్యని తప్పుకు నేనెందుకు ఇకారమైత? పంచాయితి గాకపోతే ఏమన్నా జేస్కపోండి. నేను తప్పుజెయ్యల్యా, ఎవ్వనికీ బయపడాల్సిన అవసరంల్యా.” మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు సామేలు. “ఆ మాట చెప్పినవ్ బాగుంది. పంచాయితిలనే తేల్చుకుందాం అయితే.” అని చెప్పి అక్కడ్నుంచి కదిలాడు భాస్కర్రెడ్డి. సామేలు వెన్నులో వణుకు మొదలైంది. గుండెల్లో కుంపటి పెట్టినట్టైంది. ఒళ్లు వేడెక్కి చెమటలు కక్కుతూంది. కళ్ళు తిరుగుతున్నట్టనిపించింది. “నానా, సిన్మాకి లేటయితుంది. తొందరగరా పోదం.” గుడిసె దగ్గర్నుంచి కేకేశాడు రాజు. కొడుకు చెయ్యి పట్టుకుని పక్క ఊర్లో ఉన్న థియేటరుకి బయల్దేరాడు. నడక సాగట్లేదు, పంచాయితీని గురించిన ఆలోచనలు సూదుల్లా పొడుస్తున్నాయి. రాజు ఏవేవో మాటలు చెప్తుంటే కనీసం ఊ కొట్టలేకపోతున్నాడు. సినిమా పూర్తయింది. ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. సామేలు మనసు ఏమాత్రం కుదుట పడలేదు. తల్లితో విషయం చెప్పలేకపోయాడు. రాత్రంతా నిద్ర పట్టలేదు. తన మనసంతా బాధ, భయాల చీకటితో అలుముకుంది. పొద్దున్నే లేచి పనికి పోలేదు, ఎందుకని తల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. రాజును దగ్గరుండి బడికి పంపించాడు. పంచాయితీ విషయమై వేసిన చాటింపు తల్లి చెవిన పడింది. ఆమె గుండె ముక్కలైంది. గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ, “అసలు ఏందిరా ఇదంతా? నువ్వు దొంగతనం చెయ్యడమేందిరా?” అని అడగ్గానే సామేలు గొంతు మూసుకుపోయింది, శరీరం మోయలేనంత బరువెక్కింది. రెప్పపాటులో కళ్ళు కన్నీటి సంద్రాలయ్యాయి. తను మోస్తున్న భావోద్వేగాలు వెచ్చటి కన్నీళ్ళ రూపంలో లావా లాగా విజృంభించాయి. తల్లి ఒడిలో బోర్లా పడుకుని గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు. తల్లితో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. గొంతు నుండి విరిగిన శబ్దాలు తప్ప మాటలు రావడం లేదు. మధ్య మధ్యలో శ్వాస తీసుకోవడానికి ప్రయత్నిస్తూ, విఫలమవుతూ వెక్కి వెక్కి తన శక్తినంతా కూడగట్టుకుని ఏడుస్తున్నాడు. సామేలు తల్లి కళ్ళు తుడుచుకుని, “నువ్వు దొంగతనం చేసినవంటే ఆ దేవుడు గూడ నమ్మడురా. సన్నపిల్లగాని లెక్క ఎందుకు ఏడుస్తవ్.. ఇంగ ఆపు. ఏం గాదులే. నేను లేనూ నీకు?” ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది. కాసేపటికి ఏడుపు ఆపి అలాగే తల్లి ఒడిలో పడుకుని నిద్ర పోయాడు సామేలు. చర్చిలో నాలుగో గంట మోగింది. చొక్కా తగిలించుకుని పంచాయితీ స్థలానికి బయల్దేరాడు సామేలు. ఊరికి దాదాపు నడిబొడ్డున ఉన్న ఆంజనేయుడి గుడి ముందర పంచాయితీకి సిద్ధం చేస్తున్నారు. జనాలు గుంపులు గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. సాయంత్రం నాలుగున్నరకి పంచాయితీ మొదలైంది. రామిరెడ్డి, రాఘవరెడ్డి లతో పాటు మిగతా ఊరి పెద్దలంతా అరుగు మీదున్న కుర్చీల మీద కూర్చొని ఉన్నారు. భాస్కర్రెడ్డి అరుగు మీద ఒక మూలన కూర్చొని ఉన్నాడు. ఊరి జనాలు కింద అరుగు చుట్టూ నిలబడి ఉన్నారు. సామేలు పెద్దలకు ఎదురుగా, జనాల ముందర నిలబడి ఉన్నాడు. “ఏమిరా సామేలూ, దొంగతనం నువ్వే జేసినవ్ అంటున్నాడు రామిరెడ్డి. ఎట్ట మల్ల?” పంచాయితీ ప్రారంభించాడు గత ఇరవయ్యేళ్లుగా ఊరి పెద్దగా వ్యవహరిస్తున్న రాజిరెడ్డి. “ఆ దొంగతనానికి, నాకూ ఎటువంటి సంబంధమూ లేదు.” తెగేసి చెప్పాడు సామేలు. “అది గాదురా.. కచ్చితంగా నువ్వే జేశినవ్, నువ్వు తప్ప ఇంకోడు తీసుకున్నాడు అనే దానికి ఆస్కారమే లేదు అని జెప్తున్నారు. దానికేమంటవ్?” అడిగాడు రాజిరెడ్డి పక్కనే కూర్చున్న ఊరి ప్రధాన బ్రాహ్మణుడు రావణ శర్మ. “అంత కచ్చితనంగ చెప్పేతోల్లు, నేను దొంగతనం జేసినట్టు వాళ్ళు నిరూపన జెయ్యాల గానీ, ఏ తప్పూ జెయ్యని నేనేం చెప్తా సామీ.” భాస్కర్రెడ్డి కోపంగా పైకి లేచి, “ఏమిరా, నకరాలా.. మా ఇండ్ల సందుల వర్సబెట్టి రెండు దినాలు ఎందుకు తిరిగినవ్ అయితే?” “ఆ.. ఊర్ల నేనొక్కడ్నే మీ సందుల తిరుగులాడిన్నా అయితే?” “ఇంగోసారి నోరు తెరిస్తే కిందికొచ్చి కొడతా నాకొడకా.. నీ తండ్రి ఎట్టాంటోడో, నీ కుటుంబం ఎట్టాంటిదో ఊరి జనాలు మర్సిపోయినారు అనుకుంటున్నవా..” “ఏమిరా భాస్కరూ, ఈడ మేమున్నం అని మరిసిపోయినవా, లేకుంటే దొమ్మల్ల పసురు గాని ఎక్కిందా? నువ్వే తేల్చేసుకునేదానికి పంచాయితి ఏమిటికిరా ఉండేది.” అన్నాడు రాజిరెడ్డి. “సరేరా సామేలూ, వాళ్ళ కాడ గూడక బలమైన ఆదారాలు లేవు గావట్టి.. నువ్వు తప్పు జెయ్యలేదని బాస జెయ్యాలరా. చేస్తవా?” రావణ శర్మ. “నేను ఏమిటికైన సిద్ధమే సామీ.” ఊరి దైవమైన మల్లికార్జున స్వామి దేవాలయం పక్కనున్న బావి దగ్గరికి వచ్చారు అందరు. ఊరి పెద్దల సమక్షంలోనే తాను దొంగతనం చెయ్యలేదని బావిలో మునిగి తన ఇష్ట దైవం, కుటుంబం, కొడుకు మీద ప్రమాణం చేశాడు సామేలు. ఏడు గంటలకి పంచాయితీ ముగిసింది. తనలోని భయాన్ని జయించానన్న విజయగర్వంతో ఇంటికొచ్చాడు సామేలు. ఊర్లో పని దొరకట్లేదు సామేలుకి. తనకి పనివ్వడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. టౌనులో ఉంటున్న తన స్నేహితుడి సహాయంతో ఏదో పని సంపాదిస్తున్నాడు. ఒక రోజు పనుంటే, ఇంకో రోజు పస్తులన్నట్టు సాగుతుంది. తిండి గింజలకి కూడా ఇబ్బందైపోయింది. తల్లి ఆరోగ్యం క్షీణించసాగింది. రోజూలాగే ఆ రోజుకూడా వేకువనే లేచి, తల్లిని లేవమని కేకేశాడు. ఆమె పలకలేదు. దగ్గరికెళ్ళి ఆమె నుదుటి మీద ముసిరి ఉన్న ఈగని చేతితో తోలి, ఆమె గడ్డం పట్టుకుని తలను కదిలిస్తూ, “మా.. మోవ్, లెయ్యే” అని అరిచాడు. ఆమె కదల్లేదు. చల్లని ఆమె చేతిని తన కళ్ళకు అద్దుకుని మూగబోయిన గొంతుతో ఏడుస్తున్నాడు. మరణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. సరైన తిండి లేక చనిపోయింది తన తల్లి. దినభోజనాలకి మాత్రం మాంసం పెట్టాలంట, లేకపోతే ఆమె ఆత్మ సంతోషించదని శాస్త్రం చెప్తుందట. ధినభోజనాలకే కాబట్టి అప్పు సులువుగానే దొరికింది, అప్పు చేసి ఘనంగా జరిపించాడు కార్యక్రమం. తను తప్పుడు బాస చేసినందుకే తల్లి చనిపోయిందనీ, తన తల్లి చావుకు కారణం సామేలే నని జనాలు బలంగా నమ్మడం మొదలెట్టారు. జనాల్ని లెక్కచేయడం పూర్తిగా మానేశాడు సామేలు. మనుషులు పోయారని కాలం ఆగిపోదన్న విషయం త్వరగానే అర్థమైంది సామేలుకి. రాజుని బడికి పంపడం, టౌనుకెళ్ళి దొరికిన పని చేసుకోవడం.. కాలం వెళ్లదీస్తున్నాడు. టౌనుకెళ్ళే రోడ్డు పక్కన ఉండే శివయ్య ఇంట్లో దొంగతనం జరిగిందంట. వాళ్ళకి పంచాయితీ అవసరం రాలేదు. బంధు బలగంతో కలిసి ఇంటి మీదకొచ్చి కొడుకు కళ్ల ముందే ‘ఊరి దొంగ’ సామేలుని కొట్టి వెళ్ళిపోయారు. సామేలు రక్తం మరిగింది. సమాజం అంటరానిదన్న ముద్ర వేశాడు. ఊరిని వెలేశాడు. సామాను పెట్టె తలకెత్తుకుని, కొడుకు చెయ్యి పట్టుకుని ఊరిని శాశ్వతంగా వదిలి వెళ్లిపోయాడు. ******** మోటారుబండిని ఇంటి ముందున్న కాంపౌండులో ఆపి, తండ్రి కోసం కొన్న మందుల సంచీ చేత బట్టుకుని, ఇంకో చేత్తో బూట్లు విప్పుతూ, “నానా” అని కేకేశాడు రాజు. ఇంట్లోంచి బయటికొచ్చిన తండ్రి చేతిలో మందుల సంచీ పెట్టి, “ఈసారైనా ఆగం జెయ్యకుండా ఏస్కో మందులు.” అన్నాడు. “నాకెందుకురా ఈ మందులూ, బొందులూ.. ఉక్కు శరీరం నీ నాయనది, తెల్సునా!” అంటూ లోపలికెల్లాడు సామేలు. సాయంత్రం నిద్ర లేచి, పొగలు కక్కుతున్న టీ చప్పరిస్తూ కాంపౌండులో ఉన్న కుర్చీ మీద కూర్చుని న్యూస్ పేపరు తీసుకున్నాడు రాజు. “కుండలో నీళ్ళు తాగినందుకు బాలుడిని కొట్టిన ఉపాధ్యాయుడు. ఇరవై మూడు రోజుల తరువాత బాలుడి మృతి” అన్న శీర్షిక చదవగానే అసహ్యంతో పేపరుని పక్కన పడేశాడు. మధ్యాహ్నం రాజేష్ ఇంటి దగ్గర తను తాగి డస్ట్ బిన్లో పడేసిన ప్లాస్టిక్ గ్లాసు తన కళ్ల ముందు అలాగే మెదులుతూ ఉంది.

మరిన్ని కథలు

Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి
Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్
Kshama lo dharitri
క్షమలో ధరిత్రి.
- Aduri.HYmavathisrinivasarao,
Marmam
మర్మం
- రాము కోలా దెందుకూరు
Korthi
కొర్తి
- బివిడి ప్రసాద రావు
Atrhata
అర్హత
- డి.కె.చదువుల బాబు