ప్రేమికులు - మద్దూరి నరసింహమూర్తి

Premikulu

" ఇప్పుడేం చేద్దాం రఘు?

" అదే ఆలోచిస్తున్నాను రమా "

" ఇప్పటికే ఆలస్యం అయింది, త్వరలో మనం ఒక నిర్ణయానికి రావాలి "

" రెండురోజుల తరువాత ఇక్కడే, ఇదే సమయానికి కలుద్దాం. ఈలోగా నేనేదో ఆలోచించి చూస్తాను. నువ్వు కూడా నీకు తోచిన ఆలోచనతో రా. "

-- అని, ఆరోజు సమావేశానికి ముగింపు పలికి, భారమైన మనసులతో, వారి వారి ఇంటి దార్లు పట్టేరు.

రఘు, రమ బి.టెక్ చదువుతున్నప్పటినించి స్నేహితులు. ఇద్దరూ ఒకే కాలేజీలో కంప్యూటర్స్&ఎలక్ట్రానిక్స్ చదువుతున్నారు.

పరీక్షలలో, ఒకరికి ఒకసారి ఎక్కువ మార్కులు వస్తే, మరోసారి మరొకరికి వచ్చేవి. అలా ఒకరికొకరు దగ్గరయేరు.

ఒకరి అభిరుచులు మరొకరు తెలుసుకోగలిగేరు. అచిరకాలంలోనే మంచి స్నేహితులుగా మారిన వారిద్దరూ ప్రేమలో పడ్డారు. మనసులు ఇచ్చి పుచ్చుకున్నారు.

ఇద్దరూ సంస్కారవంతులు కాబట్టి, శరీరాల అందమైన కలయికని వివాహ తదుపరి అనుభవానికి అపురూపంగా దాచుకున్నారు.

వారి చదువు ముగింపుకొచ్చి, ఉద్యోగ నియమాన్క విశ్లేషణలో, వారిరువురికీ ఉద్యోగం ఉన్న ఊళ్ళోనే దొరికింది, వేరువేరు కంపెనీలలో.

ప్రేమైక జీవితంలోంచి వైవాహిక జీవితంలోకి మారడానికి ఇప్పుడు కావలసినది, వీరి ప్రేమ గురించి ఏమాత్రం తెలియని పెద్దల అంగీకారం, ఆశీర్వాదం.

అనుకున్నట్టుగానే, మూడో రోజున వారిద్దరూ కలుసుకున్నారు.

"మీఇంట్లో ఏమంటున్నారు రఘు" అన్న రమ ప్రశ్నకి, రఘు ---

రమ గురించి, రమ పుట్టింటివారి గురించి, వారిద్దరిలో ఒకరి మీద మరొకరికి ఉన్న గాఢమైన ప్రేమ గురించి వివరంగా చెప్పేడు రఘు వాళ్ళింట్లో. అన్నీ ప్రశాంతంగా విన్న రఘు నాన్నగారు ---

“అబ్బాయి, పెద్దలు అనుభవంతో ఒక సూచన ఇచ్చేరు - ‘పిల్లని ఇచ్చుకొనేటప్పుడు మన కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవారి ఇంట్లో ఇచ్చుకోవాలి. అలాగే, పిల్లని తెచ్చుకొనేటప్పుడు మన కంటే తక్కువ స్థాయిలో ఉన్నవారి ఇంటినించి తెచ్చుకోవాలి.' నువ్వు ప్రేమలో పడి, మనకంటే చాలా సంపన్నులైన వారి అమ్మాయిని మన కోడలిగా తెస్తానంటే ఎలాగ ? తనవారికంటే తక్కువ స్థాయిలో ఉన్న మన ఇంట్లో, ఆ అమ్మాయి సుఖంగా కాపురం చేయలేదు అన్నది నిర్వివాదాంశం. పెళ్ళైన తరువాత నాలుగురోజులు అన్నీ బాగానే ఉన్నట్టు అనిపిస్తాయి. కొద్దిరోజులలోనే, ఆ అమ్మాయికి పుట్టింటికి అత్తింటికి తేడా తెలిసొస్తుంది. అక్కడితో, ఆ అమ్మాయి వేరు కాపరం కోరడం, కాదంటే మీరిద్దరూ దెబ్బలాడుకోవడాలు వరకూ వెళ్తుంది. కాబట్టి సుఖాన ఉన్న ప్రాణం దుఃఖాన మార్చుకోక, మీఇద్దరి ప్రేమకి ఇక్కడితో తెగతెంపులు చేసుకొని, మనకి తగ్గ అమ్మాయిని పెళ్లి చేసుకొని, నువ్వు సుఖంగా ఉండు, నీ కన్నవాళ్ళని సుఖంగా ఉంచు. "

“మరి నువ్వేమన్నావు?

“ఎటువంటి పరిస్థితిలోనూ మీ అంగీకారం లేకుండా పెళ్లి చేసుకోను అని చెప్పడమేకాక, నేను నిన్ను తప్పమరో అమ్మాయిని పెళ్లి చేసుకోనని కుండ బద్దలుకొట్టినట్టు చెప్పేసేను. దాంతో, మా అమ్మనాన్నతో సహా మాచెల్లి కూడా, నాతో మాట్లాడడం లేదిప్పుడు. మరి మీఇంట్లో ఏమన్నారు ?

రఘు గురించి, రఘు కుటుంబం గురించి, వారిద్దరిలో ఒకరి మీద మరొకరికి ఉన్న గాఢమైన ప్రేమ గురించి వివరంగా చెప్పిన రమ మాటలన్నీ విన్న రమ నాన్నగారు ---

“మాకు లేకలేక కలిగిన సంతానివి నువ్వు. నేను తప్పకుండా మీ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను. కానీ, నాదొక షరతు."

పట్టలేని సంతోషంతో, "నాకు తెలుసు నాన్నా, నా మాట నువ్వు కాదనవని. నీ షరతు ఏదైనా నాకు అంగీకారమే."

"కొడుకులు అంటూ లేని నాకు అల్లుడే కొడుకుగా నా వ్యాపార బాధ్యతలు తీసుకోవాలి. కాబట్టి మీరిద్దరూ అనుభవం కోసం ఎన్నాళ్ళు కావలిస్తే అన్నాళ్లూ ఉద్యోగం చేసుకోండి. తరువాత మీరెప్పుడు చెప్తే అప్పుడు రంగరంగ వైభవంగా మీ పెళ్లి జరిపించి అల్లుడిని ఇల్లరికం ఉంచుకోవాలి అన్నదే నా కోరిక షరతు. ఇల్లరికమా అని అల్లుడు చిన్నపోనక్కరలేదు, సిగ్గు మొహమాటం ఏమీ పెట్టుకో అక్కరలేదు. మనలో ఒకడిగా చూసుకుంటాం. మన ఇంట్లో మీద పోర్షన్ లో మీరు, క్రింద పోర్షన్ లో నేను మీఅమ్మ ఉంటాం. వంటకీ తక్కిన పనులకు పనివాళ్ళు ఉండనే ఉన్నారు. కట్నం ఎంత కావాలో చెప్తే, అల్లుడి అకౌంట్ లో జమ చేస్తాను. అంతే కాదు, అతని ఇంటివాళ్లకి వేరే ఇవ్వవలసి వస్తే కూడా ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు. అబ్బాయి ఇల్లరికానికి రావాలి, అంతే. "

ఉలిక్కిపడిన రమ – “ఇల్లరికం గురించి మామధ్య మాటలే జరగలేదు. రఘు ఏమంటాడో?”

"నీమీద ప్రేమ నిజమైనదైతే, అబ్బాయి కాదనడు. నువ్వు పుట్టిన తరువాత ఈఇంట్లో లక్ష్మి తాండవించిందమ్మా. నువ్వు వెళ్ళిపోతే, నీతో పాటూ ఈఇంటి లక్ష్మి కూడా వెళ్ళిపోతుంది. నిన్ను మరో ఇంటికి పంపించి, ఈఇల్లు శూన్యం చేసుకోలేము."

“మరి నువ్వేమన్నావు రమా?”

"ఇప్పుడు బాల్ నీ కోర్ట్ లో ఉంది. నువ్వే చెప్పాలి"

"ఇల్లరికం నెపంతో మా కుటుంబాన్ని వాళ్ళ మంచి చెడుకి వదిలేయడానికి, నా మనసు సంస్కారం రెండూ అంగీకరించవు రమా."

పక్కా పది నిమిషాలు వారిద్దరి మధ్య నిశ్శబ్దం నిలబడింది.

"రమా, మనం ఇరుపక్కలవారి మనసులు తెలుసుకున్నాం. వారి ఆలోచనల్లో నిజం, మన పట్ల ఆరాటం లేకపోలేదు. మనం ఏమి చేయాలిప్పుడు అన్నదే ప్రశ్న. ఇంట్లోనించి వచ్చేసి లేచిపోయిన వాళ్ళు అన్న ముద్ర వేయించుకొనేటంత మూర్ఖులం కాము. అలా అని, పెళ్ళికాకుండా సహజీవనం చేసేటంత కుసంస్కారులం కాము. పెద్దల అంగీకారం ఆశీర్వాదం లేకుండా పెళ్లి చేసుకుంటే, ఇటు మనం అటు వాళ్ళు అసహనంగా అసంతృప్తిగా గడిపే జీవితాలకి అర్ధం ఉండదు. "

"మరి, ఏం చేద్దామయితే? నువ్వు ఏం చెప్తే అది చేయడానికి, నేను సిద్ధం."

"మనది స్వచ్ఛమైన ప్రేమే కానీ, శారీరక సుఖం కోరే ప్రేమ కాదు. అందుకే, ఈజన్మకి మనం బ్రహ్మచారి ప్రేమికులుగా, మిగిలిపోదాం. మనకి శారీరక సుఖం విధి వ్రాతలో లేదని సరిపెట్టుకొని, వచ్చే జన్మలోనేనా దంపతులుగా కలపమని దేవదేవుడిని వేడుకుందాం. ఒకేఊళ్ళో ఉన్న మనం స్నేహితులుగా కలుసుకోవడం పెద్ద సమస్య కానే కాదు. మరి నువ్వేమంటావు?"

“అంతే చేద్దాం. కానీ, నీకున్నంత బలమైన మనసు నాకు లేదు. చిన్నప్పటినించి నేను కోరేది చేజిక్కించుకోవడం, దొరక్కపోతే మనసు పాడుచేసుకోవడం అలవాటైన నాకు, పరిస్థితి సరిపెట్టుకోవటానికి కొంత సమయం పడుతుంది.

వీలైనప్పుడల్లా వారు కలుసుకుంటూ ఒకరికొకరు దగ్గరగానే ఉన్న అనుభూతిని ఆస్వాదిస్తున్నారు.

రెండునెలల తరువాత, రఘుని ఎనిమిది నెలల కాలం ట్రైనింగ్ అని అమెరికా పంపింది ఆఫీస్.

చిన్నప్పటినుంచి ఆడిందే ఆట పాడిందే పాట అని ముద్దుగా పెరిగిన రమకి, రఘుతో పెళ్ళికి తల్లితండ్రులవైపునించి ఎటువంటి అవరోధం ఉండదు అనుకుంది. కానీ ‘షరతు’ అన్న నెపంతో, తాను కోరుకున్న రఘుని తనకు కాకుండా చేసిన తండ్రి మీద కోపం, రోజు రోజుకి పెరిగిపోతూంది.

రఘు అమెరికా వెళ్లిన నెలలోపలే ఉద్యోగం మానేసింది. ఆవిషయం రఘుకి కానీ తల్లితండ్రులకి కానీ తెలియచేయలేదు.

భౌతికంగా దూరమైన రఘుని తలచుకుంటూ, తల్లితండ్రులతో మాట్లాడడం తగ్గించింది. ఎక్కువగా తనగదిలో ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకుంది.

తల్లితండ్రులతో వెళ్లే పార్టీలలో, తమ ఇంట్లో జరిగే పార్టీలలో, చాలామంది ఆడ మగ మద్యం పుచ్చుకోవడం గమనించిన రమకి తెలిసినదొక్కటే – ఒత్తిడి, బాధలు మరచిపోయి ఉత్సాహం తెచ్చుకుందికే అలా మద్యం సేవిస్తారని. ఇంట్లో కూడా ఆ సరుకు ఉండడంతో - మనసుకి కలిగిన గాయం మరచిపోయి, లేని ఉత్సాహం తెచ్చుకోవొచ్చేమో అని –మద్యాన్ని ఇప్పుడు తన సహచరిని చేసుకుంది. ఆరు నెలలు గడిచేసరికి, మద్యానికి తానే సహచరిగా మారిపోయింది.

కొన్నాళ్ళు ఒంటరిగా వదిలేస్తే, రఘుని మరచిపోయి తమ దారికి వస్తుందనుకున్నారు రమ తల్లితండ్రులు.

డబ్బున్న వాళ్ళింట్లో, చాలా విషయాలు పనివారికి ముందుగా తెలిసి, ఇంట్లోవాళ్లకి తాపీగా తెలుస్తాయి. రమ మద్యానికి బానిస అయిన విషయం, మధ్య మధ్యలో కడుపు నొప్పి అంటూ బాధపడుతూండడం, తల్లితండ్రులకి చాలా ఆలస్యంగా పనివాళ్ళ ద్వారానే తెలిసింది.

కన్నకడుపు మమకారంతో, తల్లితండ్రులు బలవంతంగా రమని డాక్టరుకి చూపించేరు.

ఆమెని పరీక్షించిన డాక్టరు "ఖాళీ కడుపుతో ఎక్కువగా మద్యం సేవించడం వలన కిడ్నీలు రెండూ బాగా దెబ్బతిన్నాయి. వెంటనే, మద్యం మాని పౌష్టిక ఆహరం సేవించకపోతే, కిడ్నీ మార్పిడి అవసరం త్వరలోనే వచ్చేటట్టుంది" అని చెప్పేరు.

వెంటనే జాగ్రత్త పడకపోతే, రమ పరిస్థితి చేయి దాటిపోతుందని ఆమె తల్లితండ్రులు, మద్యం రమకి అందుబాటులో లేకుండా చేసేరు. రఘు లేని జీవితం ఉంటే ఎంత, లేకపోతె ఎంత అని ఆలోచిస్తున్న రమకి, పదిరోజులు తిరిగేసరికి కడుపులో విపరీతమైన నొప్పి ఆరంభమైంది. కడుపు చేత్తో నొక్కుకుంటూ, విపరీతంగా బాధపడుతున్న రమని మరలా డాక్టరుకి చూపించేరు.

రమని పరీక్షించిన డాక్టరు "త్వరలో ఒక కిడ్నీ తప్పక మార్పిడి చేసుకోవాలి. లేదంటే, ప్రాణానికే ప్రమాదం" అని చెప్పి, "ఎవరైతే కిడ్నీ దానం చేస్తారో, వారు పరిపూర్ణంగా ఆరోగ్యవంతులై ఉండాలి, పైగా వైద్య పరీక్షలో ఆవ్యక్తి కిడ్నీ ఈమెకి సరిపోతుందని తేలాలి " అని కూడా జాగ్రత్తలు చెప్పేరు.

రెండో ఆలోచన లేని రమ తల్లితండ్రులు తమ కిడ్నీ పరీక్షించి సరిపోతే, వెంటనే మార్పిడికి ఏర్పాటు చేయండి అని చెప్పడంతో, వారిని పరీక్షించిన డాక్టరు పెదవి విరిచేరు.

రమ తండ్రి ఇవ్వ చూపిన డబ్బుకి ఆశ పడిన అతని ఉద్యోగస్తులు నలుగురు ముందుకొచ్చినా ఎవరి కిడ్నీ సరిపోలేదు.

ఇంత డబ్బు ఉండి కూడా, కూతురు గురించి ఏమీ చేయలేని నిస్సహాయతని తలచుకొని కుమిలిపోతున్న తల్లితండ్రులని చూసి, రమ అంత బాధలోనూ విరక్తిగా నవ్వుకుంటోంది.

టైనింగ్ పూర్తిచేసుకొని వచ్చిన రఘు, నెలరోజులుగా ఫోన్లో కానీ స్కైప్ లో కానీ అందుబాటులో లేని రమని కలవడానికి ఆమె పనిలో చేరిన కంపెనీకి వెళ్ళేడు. అప్పుడు తెలిసిందతనికి, రమ ఎప్పుడో ఉద్యోగం మానేసిందని.

మరోదారి లేని రఘు, రమని కలవడానికి వాళ్ళ ఇంటికే వెళ్తే - రమ ఆసుపత్రిలో ఉంది, ఆమె తల్లితండ్రులు కూడా అక్కడే ఉన్నారని తెలిసింది.

ఒక్కసారిగా తన ఎదురుగా నిలచిన రఘుని చూసి, ఆనందంతో అతనిని అందుకుందామని పక్కమించి లేవబోతూ నిస్త్రాణగా పక్కమీద వాలిపోయిన రమని చూసిన రఘు విలవిలలాడిపోయేడు. ఇంతలా రమ ఆరోగ్యం దిగజారడానికి కారణం తెలుసుకున్న రఘుకి, ఆమె మీద కోపం, జాలి, ప్రేమ ఒక్కసారిగా వెల్లువలా ఉప్పొంగేయి.

రఘుని చూసిన రమ తండ్రి, "నీవల్లే, నా బంగారు తల్లి ఇలా తయారైంది. నువ్వసలు ఆమె జీవితంలోకి ఎందుకు ప్రవేశించేవు, ఇప్పుడు నా తల్లి నాకెలా దక్కుతుంది" అని ఒక్కసారిగా అతని మీద దుఃఖంతో కూడిన కోపంతో విరుచుకుపడ్డాడు.

పెద్దాయన పరిస్థితిని అర్ధం చేసుకోగలిగిన సంస్కారం ఉన్న రఘు, వెంటనే అక్కడనుంచి నిష్క్రమించి, డాక్టరు దగ్గర రమ ఆరోగ్యం గురించి ఆరా తీసి, ఆమెని కానీ ఆమె తల్లితండ్రుల్ని కానీ మరి కలవలేదు.

రెండు రోజుల తరువాత, డాక్టరుగారు "రమకి సరిపోయిన కిడ్నీ దొరికింది, మరునాడు ఆమెకి ఆపరేషన్ చేసి కిడ్నీ మార్పిడి చేస్తాం" అని చెప్పేరు.

ఆదాత ఎవరంటే, "తన వివరాలు గోప్యంగా ఉంచమని ఆ దాత కోరేరు." అని వెళ్ళిపోయేరు, డాక్టరు.

ఆపరేషన్ చేసి, కిడ్నీ మార్పిడి విజయవంతంగా జరిగి, పూర్తిగా తెలివొచ్చిన రమకి, కిడ్నీని దానం చేసిన దాత - రఘు - ని స్ట్రెట్చెర్ మీద తీసుకొచ్చి చూపించేరు డాక్టరు.

పక్క పక్కనే పడుకున్న రఘు రమ ఒకరిని ఒకరు పట్టుకుందికి చాచిన చేతులు నీరసంగా వాలిపోతుంటే, పడిపోకుండా కలిపి పట్టుకొని ఆసరాగా నిలబడ్డారు రమ నాన్నగారు, మనసులో ఉన్నతమైన వారి ప్రేమకి జోహారు చెప్తూ, వారిని మనసారా ఆశీర్వదిస్తూ.

* * * * * *

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు