రాజహంస - లావణ్య వింజమూరి

Rajahamsa

" ఏమండోయ్ , ఫిల్టర్ కాఫీ రెడీ.ఎక్కడ ఉన్నారు ? " ఇంక ఎక్కడ ఉంటారులే, పెరడు - పచ్చదనం , పక్షులు - ప్రకృతి అనుకుంటూ తిరుగుతూ ఉంటారు కదా అనుకుంటూ ఒక చెంబులో వేడి వేడి కాఫీ , రెండు గ్లాసులతో పెరట్లోకి వచ్చింది రాజేశ్వరి. తనకి ఉన్న చిన్న పెరట్లోనే పూల మొక్కలు , ఒకటి , రెండు కూరగాయ మొక్కలు పెంచుకుంటూ సన్నజాజి , మల్లె పందిళ్లను మనసంత కళ్ళు చేసుకుని చూసుకుంటూ ఉంటే దాన్ని మించిన స్వర్గం లేదనిపిస్తుంది రామయ్య గారికి.సూర్యోదయానికి ముందే లేచి అక్కడి మొక్కల్ని , పూవుల్ని ,వాటి చుట్టూ ఝుమ్మంటూ తిరిగే తుమ్మెదలని చూసుకుంటూ వేడి వేడి ఫిల్టర్ కాఫీ తాగితే కానీ ఆయనకి రోజు మొదలవదు." ఏవండీ, నేను ఒకటి అడుగుతాను , ఒప్పుకుంటారా ? " కాఫీ తాగి గ్లాసు కింద పెడుతూ అడిగింది రాజేశ్వరి. కాఫీ చివరి చుక్క వరకు ఆస్వాదిస్తూ తాగి ఏమిటన్నట్టు భార్య వైపు చూసారు రామయ్యగారు. ' ఒప్పుకుంటారా అని అడుగుతారు కానీ ఏ విషయమైనా ఒప్పించి తీరుతారు....ఒప్పుకోక తప్పుతుందా మొగుళ్ళకి..నిజం చెప్పాలంటే ఆడవాళ్లు అన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతారు అంటారు. కానీ కాదు. మగవాళ్లే.. అందునా మొగుల్లే ఎక్కువగా అన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతారు...' అని మనసులో అనుకుంటూ " చెప్పు , ఏమిటి ఆ విషయం " అన్నారు రామయ్య గారు. " పిల్లలిద్దరూ మన దగ్గర్లోని పట్టణాల్లోనే సెటిల్ అయ్యారు. వాళ్ళు ఇక్కడ ఉండలేరు , మనం అక్కడ ఉండలేము.పండగకీ , పబ్బానికీ కలవడం తప్ప వాళ్లకి ఖాళీలు ఉండవు.ఈ కరోనా, లాక్డౌన్ ల పుణ్యమా అని ఒక పండగా లేదు , పబ్బమూ లేదు.నాకు మన అమ్మాయి చిత్ర ని చూడాలని ఉంది.మొన్న కలలోకి కూడా వచ్చింది.వెళ్లి ఒక రెండు రోజులు ఉండి వద్దాం " అని ఆయన సమాధానం కోసం ఎదురుచూస్తోంది రాజేశ్వరి." ఇప్పుడు ఏ కారణం లేకుండా ఎందుకు చెప్పు వెళ్లడం " అనే ఆయన మాట పూర్తవకుండానే అందుకుంది రాజేశ్వరి ," మనం ఏమయినా చుట్టాలమా , కారణం వెతుక్కుని వెళ్ళడానికి ?" అంటూ కుర్చీలోంచి విసుగ్గా లేచింది...ఆ చప్పుడుకి అక్కడే ఉన్న పిచుకుల జంట తుర్రుమంది... రామయ్య గారు నవ్వుకున్నారు ...ఆయనకి అర్థమైపోయింది ఆ రోజు ఏ విధంగా గడవబోతోంది అనేది.ఆయనకి ఆ ఇల్లు , పెరడు , పక్షులు వాటిని చూస్తూ గడపడమంటే చాలా ఇష్టం. అందుకే ఆయనకి ఇల్లు వదిలి ఏ ఊరూ వెళ్లడం నచ్చదు.సరేలే, అది అడిగిన దాంట్లో మాత్రం తప్పేముంది.కూతుర్ని చూడాలి అనిపించింది కాబోలు అని తనకి తానే నచ్చజెప్పుకుని " సరేలే రెండు రోజులు ఆగి వెళదాం. ఊర్లో చిన్న చిన్న పనులు ఉన్నాయి " అన్నారు.ఆ మాట పూర్తయిందో , లేదో రాజేశ్వరి గారి కళ్ళల్లో రెండు చిచ్చుబుడ్లు వెలిగాయి.వెంటనే కుర్చీలో కూర్చుని " చిత్ర కి సున్నుండలు అంటే చాలా ఇష్టం.అవి చేస్తా..అల్లుడు గారికి ఎలాగూ తీపి పదార్థాలు ఇష్టం కాదు. ఆయనకి జంతికలు , చెక్క వడలు చేస్తాను.ఇంకా ఏమి చేసి తీసుకెళ్తే బాగుంటుంది చెప్పండి."అంది.మొన్న ఆ మధ్య టీవీ లో చూసిన అపరిచితుడు సినిమా గుర్తుకు వచ్చింది రామయ్య గారికి . అందులో హీరో కి ఒక పాత్ర నుండి ఇంకో పాత్రలోకి మారడానికి కనీసం ముప్పై సెకన్లు పట్టి ఉంటుంది. ఈమెకి ఒకటి , రెండు సెకన్లు కూడా పట్టలేదు అనుకున్నారు. ఎంత ఆశ్చర్యం....ఎంతయినా ఆడవాళ్లు , అందునా భార్యలు….ఒప్పుకోక తప్పుతుందా…. వీరికి ఒక కూతురు చిత్ర , కొడుకు నవీన్.కూతురికి పెళ్లయి మూడేళ్లు కావస్తోంది.ఇంకా పిల్లాజెల్లా ఎవరూ లేరు.అల్లుడు గారు ఏదో కంపెనీలో టీం హెడ్.తెలిసిన వాళ్ళ పెళ్లిలో చిత్ర ని చూసి ఇష్టపడి అందర్నీ ఒప్పించి మరీ చేసుకున్నాడు.చిత్ర అందగత్తె.చక్కటి పొడుగు, ఆ పొడుగుకి తగ్గ నల్లటి , చిక్కటి జడ, చామనఛాయ లో ఉండే చిత్ర చూసిన ఎవరికయినా నచ్చుతుంది మరి.ఇంకా చదువుకుంటా అన్నా గాని డిగ్రీ పూర్తవగానే ఈ సంబంధం చేసేసారు.ఇక కొడుకు నవీన్ ,వాడికి క్రిందటి సంవత్సరమే పెళ్లి చేశారు.కొడుకు , కోడలు ఇద్దరూ కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగులే.ఎవరి జీవితాలు వారివి. ఇంక ఆరోజు రాజేశ్వరి హడావుడి కి అంతూ పొంతూ లేదు.మధ్యాహ్న భోజనం ,బంగాళాదుంపల వేపుడు , ఆవకాయ ,చారు తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.మరి కూతురుకి పిండివంటలు వండాలి కదా.మొత్తానికి ఆ రోజు గడిచింది.తర్వాతి రోజు ఉదయం పది అయి ఉంటుంది ఇంటి గుమ్మం ముందు ఆటో ఆగిన శబ్దానికి అటువైపు చూసారు రామయ్య గారు.ఆటో లోంచి చిత్ర…….చిత్రంగా చూసారు చిత్ర వైపు.వంట గదిలోంచి వచ్చిన రాజేశ్వరి ఆనందానికి అవధులు లేవు." రా చిత్రా,రేపు మేమే మీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాం.బాగానే వచ్చావు ,రా రా " అంటోంది." ఏం అమ్మా , అల్లుడు గారు రాలేదా ? " బాధ్యతా, భయం కలిసిన ప్రశ్న అది రామయ్య గారి గొంతులోంచి. "లేదు నాన్నా , ఆయనకి సడన్ గా బెంగళూర్ లో నాలుగు రోజుల క్యాంపు వచ్చి పడింది . ప్రొద్దున్నే ఫ్లయిట్ కి వెళ్లారు.నన్ను కూడా రమ్మన్నారు కానీ ,మిమ్మల్ని చూసి చాలా కాలం అయింది కదా అని ఇక్కడికి వస్తా అని చెప్పాను." ఆ మాట వినగానే కాస్త ఊపిరి పీల్చుకుంది ఆ తండ్రి హృదయం.… కబుర్లు, భోజనాలు అన్నీ అయి సాయంత్రం అవగానే సన్నజాజి పూలు కోయడానికి పెరట్లోకి వచ్చారు తల్లీ కూతుళ్లు. ఆ చుట్టాల గురించీ, ఈ చుట్టాల గురించీ, చుట్టుపక్కల వాళ్ళ గురించీ కబుర్లే కబుర్లు. ఎక్కడినుండి వస్తాయో ఆడవాళ్లకి ఈ కబుర్లు అనుకున్నారు రామయ్య గారు .ఈ మధ్య కబుర్లలో ఈ కరోనా కూడా భాగమైంది కదా.." అమ్మా,నేను ఈ పువ్వు కోస్తున్నట్టు గా నిలబడతాను ,ఒక ఫోటో తీయి " అంది చిత్ర.ఆ ఫోన్లు, ఫోటోలు తీయడాలు మాకెక్కడ వచ్చు తల్లీ. నా వల్ల కాదులే " అంది రాజేశ్వరి." సరేలే , నేనే సెల్ఫీ తీసుకుంటా "అంటూ చిత్ర మూడు,నాలుగు భంగిమల్లో ఫోటోలు తీసుకుంది.వాళ్ళ అమ్మతో మాట్లాడుతోందే కానీ నిముషానికి ఒక సారి ఫోన్ ఓపెన్ చేస్తోంది .పక్కన పెడుతోంది.మెసేజ్ సౌండ్ రావడం,దానికి రిప్లై పంపడం. మళ్ళీ పక్కన పెట్టడం .ఇదే తంతు.ఈ సెల్ ఫోన్లు వచ్చాక పక్కన ఉన్నవాళ్ళని పట్టించుకోవడం మానేశారు అందరూ అనుకున్నారు రామయ్య గారు.ఎప్పుడైనా పిల్లలతో మాట్లాడాలంటే ల్యాండ్ ఫోన్ లోంచే మాట్లాడుతారు . కిందటి సారి ఇక్కడికి వచ్చినప్పుడు కోడలు ఫోన్ కొని మరీ తెచ్చింది.మావయ్యా , ఇందులోంచి వీడియో కాల్ చేస్తే చూసి మాట్లాడుకోవచ్చు.తెలుగు లో మెసేజ్ లు పంపవచ్చు.నేను నేర్పుతాను అని...కానీ రామయ్య గారే వద్దు అన్నారు.ఎప్పుడైనా పిల్లలు వస్తేనే అందరికి వీడియో కాల్స్ చేసి మాట్లాడడం.రాత్రి భోజనాలు అయ్యాక హాల్లో మంచం మీద పడుకున్నారు రామయ్య గారు.ఒక గదికి కొడుకు ఏసీ పెట్టించాడు వేసవి లో ఉపయోగపడుతుందని.తల్లికూతుళ్ళు ఆ గదిలో పడుకున్నారు.కిటికీలోంచి వచ్చే చల్లనిగాలిని ఆస్వాదిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు రామయ్య గారు . గంట రెండు కొట్టి ఉంటుంది.మెలకువ వచ్చిన రామయ్య గారికి ఓరువాకిలి గా తీసి ఉన్న తలుపు లోంచి చిత్ర ఇంకా ఫోన్ వాడుతూ కనిపించింది. అల్లుడు గారితో అనుకుంటా...వికసించిన ముఖం తో మెసేజ్ లలో బాగా బిజిగా ఉంది.ఎప్పుడు పడుకుందో తెలీదు.పది గంటలకు లేచింది.మళ్ళీ ఫోను, మెసేజ్ లు.ఇరవైనాలుగు గంటలూ అదే పని.తల్లి తో కబుర్లు కూడా చెప్పడం లేదు.రామయ్య గారికి ఎక్కడో చిన్న అనుమానం,భయం….కూతురు మాట్లాడుతున్నది అల్లుడు గారితోనేనా…ఇంక ఎవరైనానా ? ఆ ఆలోచన,సందేహం….రామయ్య గారి ప్రశాంతత ను దూరం చేసాయి.రెండు రోజులు ఇదే తంతు.చెల్లెలు వచ్చిందని తెలిసినట్టు ఉంది అన్నగారు నవీన్ కూడా వచ్చాడు.కోడల్ని పుట్టింటికి పంపి. " ఏరా ,కోడలు పిల్ల ఏది ? " రాజేశ్వరి గారి ప్రశ్న కి సమాధానం చెప్పకుండానే లోపలికి వెళ్ళిపోయాడు నవీన్." నిన్నేరా, కోడలు ఏదీ?" ఈ సారి రెట్టించింది రాజేశ్వరి.పుట్టింటికి వెళ్లిందిలే అనేసి ఊరుకున్నాడు.తర్వాతి రోజు కూడా చాలా ముభావంగా ఉన్నాడు.రాజేశ్వరి గారు గుచ్చి గుచ్చి అడిగిన మీదట చెప్పాడు " నేను విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాను " అని." అదేమిటి అన్నయ్యా, వదిన చాలా మంచిది.ఏం అయింది? " నవీన్ సమాధానం కోసం అందరి చెవులు దొప్పల్లా ఎదురు చూస్తున్నాయి."ఈ మధ్యన తన ప్రవర్తనలో తేడా వచ్చింది.ఈ లాక్డౌన్ టైంలో అందరిలాగే తనకి కూడా పూర్వ పరిచయాలు,చిన్ననాటి ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపులు మొదలయ్యాయి.,చిన్ననాటి ఫ్రెండ్ అట.అస్తమానూ అతనితో ఫోన్లు, మెసేజ్ లు.మొన్న గట్టిగా అడిగితే నా ఇష్టం,నీకెందుకు అంది.నాతో ఉంటూ,వేరే వాడితో చనువుగా మసిలే భార్య నాకు వద్దు.అందుకే డైవర్స్ తీసుకుందాం అని అనుకుంటున్నాను. మీకు ఈ విషయం చెప్పడానికే వచ్చాను." అన్నాడు.అంతే….ఈ మాటలకి అందరూ షాక్. " ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాగా ఉండాలి కానీ ఇలా కుటుంబాలు నాశనం చేస్తే ఎలాగ ,అయినా కోడలు కి మాత్రం బుద్ధి ఉండక్కర్లేదూ…ఈ ఫోన్ల వలన తెలియని వాళ్లు అందరూ స్నేహితులు అవడం, స్నేహితులు కాస్తా ఇంకాస్త చనువు తీసుకోవడం….. " ఇంక రాజేశ్వరి గారి తిట్లకి అంతు లేకుండా పోయింది.రామయ్య గారు కూడా చాలా బాధగా " ఒరేయ్ ,స్నేహితులు ఉండడం తప్పు కాదు. స్నేహితులకి విలువ ఇస్తూనే కుటుంబాన్ని ఆనందమయం చేసుకోవాలి.నీటిని వదిలి పాలను మాత్రమే స్వీకరించే రాజహంస లాగా ఈ సమాజంలో మనం కూడా మంచిని, మంచివారిని మాత్రమే స్వీకరిస్తూ చెడు గా ప్రవర్తించే వారికి దూరంగా ఉండాలి. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళని అక్కడ పెడితే ఏ సమస్యా ఉండదు. అయినా కోడలు పిల్ల అలా ఎలా తయారైందిరా.చిత్ర ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. చిన్న పిల్ల అయినా భర్తకు అనువుగా తనని తాను మలచుకుంటూ ఆనందం గా ఉండడం లేదూ.సరేలే రేపు కోడలితో మాట్లాడి నచ్చ చెబుదాం. చెబితే అర్ధం చేసుకుంటుంది.మంచి పిల్ల.".అన్నారు. రాత్రి ఎవరికీ నిద్రలు లేవు.చెప్పడం చెప్పేసాడు కానీ అన్నయ్య రోజంతా డల్ గా ఉండడం,తిండి సరిగా తినకపోవడం, అస్తమానూ ఫోన్లో వదిన ఫోటోలు చూసి బాధ పడడం చిత్ర గమనిస్తూనే ఉంది.కానీ అమ్మ అన్న మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి….తను మాత్రం చేస్తున్నది ఏమిటి ? తన క్లాస్మే ట్ రఘు తో అర్థరాత్రి కూడా కబుర్లు.తన భర్త కి తెలిస్తే…? ఎంత బాధ పడతాడో. ఇప్పుడు అన్నయ్య పరిస్థితే తన భర్త కి కూడా వస్తే….తనని కోరి పెళ్లి చేసుకున్నాడు.చాలా మంచివాడు.ఎప్పుడూ తనని పల్లెత్తు మాట అనలేదు.తన మీద పెట్టుకున్న నమ్మకం అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.నిజమే అమ్మ పెద్దగా చదువుకోకపోయినా చాలా కరెక్టు గా చెప్పింది….ఫ్రెండ్స్ ని ఫ్రెండ్స్ లాగా చూస్తే ఏ సమస్యా ఉండదు. ఎవరికి ఇవ్వాల్సిన విలువ వాళ్ళకి ఇవ్వాలి.మితిమీరి చనువుగా ప్రవర్తించే వాళ్ళని ఆది లోనే కట్ చేసేయాలి అనుకుంది. తర్వాతి రోజు ఉదయం పదకొండు అయింది ." చిత్ర ఎక్కడికి వెళ్ళింది ?" రామయ్య గారి ప్రశ్న కి సమాధానం ఎవరి దగ్గరా లేదు.ఇంతలో బయట నుంచి వచ్చింది చిత్ర.వస్తూనే చెప్పింది ," నా క్రొత్త నెంబర్ సేవ్ చేసుకోండి. ఆ సిమ్ తీసేసాను , ఇంక ఆ నెంబర్ పని చేయదు " అని. రామయ్య గారూ, నవీన్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని 'మన ప్లాన్ పని చేసిందిగా , చిత్ర కూడా రాజహంస అయింది 'అన్నట్టుగా చిరునవ్వ్వు నవ్వుకున్నారు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు