వక్ర బుద్ధి- - బి.రాజ్యలక్ష్మి

Vakrabuddhi

అరవింద వీధి తలుపు తెరచిన చప్పుడుకు తలెత్తి చూసింది ।అశోక్ వచ్చాడు ఇద్దరూ పలకరించుకున్నారు ।

“మీ అమ్మ లేరా “ప్రశ్నించాడు ।

“”ఇప్పుడు మూడేగా అయ్యింది అమ్మ ఆఫీసు అయిదు అవుతే కానీ వదలరు అయినా నువ్వు సెలవులో వుండి అమ్మ కూడా సెలవులో వుందనుకున్నావా”నవ్వింది ।

అశోక్ అయిదు సంవత్సరాల క్రిందట అరవింద వాళ్ల ప్రక్కింట్లో
విద్యార్థి గా అద్దెకు వచ్చాడు ।అప్పటికి అరవింద హైస్కూల్లో వుంది ।అశోక్ డిగ్రీ వుత్తీర్ణుడయ్యి
అదే వూళ్లో ఒక కంపెనీ లో వుద్యోగం లో చేరాడు ।అరవింద ఇంటర్ లో చేరింది కానీ చదువంటే ఆసక్తి లేదు .
ఒక్క కూతురు అందులో తండ్రి లేకపోవడం అరవింద గారాబం గా పెరిగింది .చదువు మీద శ్రద్ధ లేదు ,కుట్లూ అల్లికల మీద శ్రద్ధలేదు సాహిత్యం మీద ఆసక్తి లేదు .రోజు ఆలా గడిపేస్తుంది .అశోక్ అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తుంటాడు .

“అశోక్ యెదురింటి మేడ గదిలో ఒకావిడ అద్దెకు వచ్చారు ,చూసావా ?”అడిగింది అరవింద .

“చూసాను “అన్నాడు అశోక్ .

“”ఆవిడ మీద నీ అభిప్రాయం ?” అశోక్ ని ప్రశ్నించింది .

“ఏ అభిప్రాయం లేదు ,మనకెందుకు ?”అన్నాడు అశోక్ .

“ నాకైతే మంచి అభిప్రాయం లేదు .”అన్నది .

“నువ్వెందుకు ఆలా అనుకుంటున్నావు ? ఆవిడ తో మాట్లాడవా ?”ప్రశ్నించాడు .

“వారం రోజులు గా చూస్తున్నాను ,పగలంతా తలుపులు మూసే వుంటాయి ,అర్ధ రాత్రి కాగానే తలుపు తెరిచిన చప్పుడు వినిపిస్తుంది ,ఒక వ్యక్తి లోపలికి వెళ్తాడు .తలుపులు మూసేస్తుంది .తెల్లవారు ఝామున ఆ వ్యక్తి వెళ్లిపోతాడు .”అన్నది అరవింద .

అశోక్ మౌనం గా విన్నాడు .

అరవింద కాఫీ రెండు కప్పుల్లో తెచ్చింది .

“అశోక్ రేపటినించి ఆఫీసు వెళ్లాలి కదూ సెలవులన్నీ అయిపోయినట్టున్నాయి కదా “అన్నది .

“అవును “అన్నాడు .

“అరవిందా ,కనీసం డిగ్రీ అయినా ప్యాసవ్వు ,అమ్మ యెన్నాళ్లు కష్టపడతారు ?”అన్నాడు అశోక్ .

“నాకు చదువంటే విసుగు “అన్నది అరవింద విసుగ్గా చూసింది .అశోక్ మరింక ప్రశ్నించలేదు .

“అశోక్ ! మీ ఆఫీసులో అమ్మాయిలు వుద్యోగం చేస్తున్నారా ?”అడిగింది .

“మా ఆఫీసు లో పదిమంది అమ్మాయిలు అన్ని భాషల వాళ్లు వుద్యోగాలు చేస్తున్నారు ,యీ రోజుల్లో ఆడవాళ్లు యింట్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవడం లేదు “కాస్త వెటకారం జోడించి అన్నాడు .

ఆ వెటకారాన్ని పట్టించుకోలేదు అరవింద .

“నువ్వు వాళ్లతో హోటళ్లకు సినిమాలకు వెళ్ళావా ?” ఆసక్తి గా అశోక్ ని సూటిగా చూస్తూ అడిగింది .

“ఒక ఆఫీసులోనే పని చేస్తున్నాం కదా ,సరదాగా కాంటీన్ కి వెళ్తాము.డ్రాఫ్టింగ్ గురించి చర్చించుకుంటాం ,నేను వాళ్లతో సినిమాలకు వెళ్లలేదు ,అంత అవకాశం రాలేదు “అశోక్ నవ్వేసాడు .

“అమ్మాయిలు బొత్తిగా చెడిపోతున్నారు ,”అసహ్యం గా మొహం పట్టింది .

అశోక్ లేచాడు ,”రేపటినించీ ఆఫీసు కదా “బట్టలు ఇస్త్రీ చేసుకోవాలి “అన్నాడు అశోక్ .

“అశోక్ యివాళ రాత్రి యెదురింటి ఆవిడను చూడు ,తెలుస్తుంది ఆవిడపధ్ధతి సరిగా లేదని “అన్నది అరవింద .అశోక్ సమాధానమివ్వకుండా వెళ్లిపోయాడు .అతను వీధి చివర వరకు వెళ్ళేదాకా చూస్తూనే వుంది .
———————————-/———/——————————/——/—————//——/—///——

ఆదివారం మధ్యాహ్నం ,అరవింద టీవీ చూస్తూ నవ్వుకుంటున్నది.అశోక్ వచ్చాడు .

“అమ్మ లేరా ?” అడిగాడు .
“అమ్మ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లింది ,అశోక్ నిన్న సాయంకాలం మీ ప్రక్కింటి ఆవిడను భర్త బాగా కొట్టాడు ఆవిడ యేడుపులు విన్నావా ?”అడిగింది అరవింద .

“నిన్న నేను సాయంకాలం ఫ్రెండ్స్ తో సినిమాకు వెళ్లాను ,అయినా యెవరింట్లో ఏం జరిగిందో మనకు అవసరమా ? అరవిందా ,టైం యెందుకిలా వేస్ట్ చేసుకుంటావు ?” కొంచెం గట్టిగానే అన్నాడు అశోక్

అరవింద అతని మాట పట్టించుకోలేదు ,”ఆవిడ కూరల బండి రాగానే బయటకు వస్తుంది అదేటైం బండి దగ్గరకు ఒకతను వస్తాడు ,యిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు .పదిహేను నిమిషాల తర్వాత అతను వెళ్లిపోతాడు ,ఆవిడ లోపలికి వెళ్లిపోతుంది ,నిన్న కూరలబండి దగ్గర వీళ్ళిద్దరూ వున్నప్పుడు భర్త వచ్చాడు ,చూసాడు .ఆ తర్వాతనే మొగుడు చితకబాదాడు .”యేదో గొప్పపని చేసినదానిలాగా గర్వం గా అన్నది .

అశోక్ మౌనం వహించాడు .

“అశోక్ , అమ్మా ,నేనూ రేపు వూరికి వెళ్తున్నాం వారం రోజులు పడ్తుంది “అన్నది. అరవింద .

“జాగ్రత్తగా వెళ్లండి ,నాకూ పనుంది వెళ్తాను “అంటూ అశోక్ వెళ్లిపోయాడు .

————-/——///———/—————————-/—————/——-/—/——————-///——-

వారం రోజుల తర్వాత అరవింద ,అమ్మ వూరినించి వచ్చారు .అశోక్ రావడం లేదు .అరవింద ప్రతిరోజూ యెదురు చూసేది .ఆత్రుత ఆపుకోలేక అతని గది దగ్గరకు వెళ్ళి చూసింది .ఎప్పుడూ తాళం వుంటున్నది .సుమారు పది రోజుల తర్వాత అశోక్ దగ్గర నుంచి
వుత్తరం వచ్ఛింది.

“అరవిందా ,

నీకు యిలా వుత్తరం వ్రాయవలసి వస్తుందని నేనెన్నడూ వూహించలేదు . నీకు ఆశాభంగం !మన్నించు.నేను డిగ్రీ లో చేరినప్పుడు మీ ప్రక్కింటి గది
లో అద్దెకు వచ్చాను .అప్పుడు నువ్వు పదో తరగతి చదువుతున్నావు .మనిద్దరం సరదా కబుర్లు చెప్పుకునే వాళ్ళం.నాకు యీవూళ్ళో నే జాబ్ వచ్చింది.నిన్ను పెళ్ళి చేసుకుందామనుకున్నాను.
వీలో వయస్సు పెరుగుతున్నకొద్దీ నీ చుట్టూ సమాజాన్ని ముఖ్యం ఆడ మగ గురించి చీకటి కోణం లో చూడడం మొదలు పెట్టావు .నీ సమయమంతా వక్రం గా ఆలోచిస్తూ గడిపేస్తున్నావు.

ఎవరి జీవితం వారిది .మనకెందుకు? ఎదురింటి మేడ గది లో వచ్చే అతను ఆమె భర్త
,అతను నా ఫ్రెండ్,వేరే వూళ్ళో అతను పని చేస్తాడు.వచ్చేటప్పటికి చీకటి పడుతుంది.నువ్వు ఆ వక్రంగా ఆలోచించావు.అలాగే నా ప్రక్క యింటి ఆవిడ పెద్దనాన్న కొడుకు కూరల బండి దగ్గర పలకరించే వాడు .అయితే. ఆవిడ మొగుడు కు అతని కి మాటలు లేవు.అయినా అరవిందా ,నీకెందుకు యివన్నీ!అందరి లోపాలు యెంచుతూ వీ జీవితాన్ని చీకట్లో కి పంపుతున్నావు!నిన్ను చేసుకుంటే నాకు మనశ్శాంతి వుండదు.మన మనస్తత్వాలు వేరు ,ఆలోచనలు వేరు.గది
ఖాళీ చేసాను .ప్రస్తుతం మా వూళ్ళో వున్నాను.పెళ్ళి కుదిరింది .నీ మనసు బాధ పెట్టినందుకు మన్నించు.
అశోక్
ఆ వుత్తరం చదివి అరవింద మొదలు నరికిన చెట్టు లా ఒరిగింది



.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు