పెళ్లిల్లా మజాకా ....? - జీడిగుంట నరసింహ మూర్తి

pellilla majakaa

రమణా రావు గారికి ఒక్క కూతురు. కొడుకులు లేరు. పొలాలు లేకపోయినా పల్లెటూరిలో రెండు ఇళ్ళు , సిటీలో రెండు ఇళ్ళు ఉన్నాయి. ఈ మధ్యే తను చేస్తున్న ఉద్యోగం నుండి రిటైరయ్యాడు. ఇక తన ఒకే ఒక కూతురు అపూర్వ పెళ్లి చేసేసి ఇంట్లో ఖాళీగా కూర్చుని పుస్తకాలు చదువుకోవడం, పాత సినిమాలు యూట్యూబ్లో చూడటం, ఇంకా వీలైతే టీవీ సీరియళ్ళ మీద పడటం. ఇవన్నీ చెయ్యడం తన చేతిలోని పనే కానీ కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలంటేనే తలకు మించిన పనిగా ఉంది. ఈ రోజుల్లో పిల్లల పెళ్లిళ్లు చెయ్యాలంటే డబ్బు ఒకటే ఉంటే చాలదు అని అతనికి అనుభవపూర్వకంగా అర్ధమయ్యింది. మగ పెళ్లి వారిని ఎలా నమ్మాలి ? పెళ్లి కొడుకు తిన్ననైన వాడో కాదో, అతని తల్లి తండ్రులు తన కూతురుని బాగా చూసుకుంటారో లేదోనన్న ఇత్యాది అనుమానాలు అతనికి లేకపోవు. అసలే రమణారావు చాదస్తపు మనిషి అవ్వడంతో ఆయన దగ్గర వాళ్ళు ఇటు ఏడు తరాలు, అటు ఏడు తరాలు పిల్లల్ని ఇచ్చుకునేటప్పుడు చూసుకోకపోతే నిండా ములిగిపోతావు అంటూ హెచ్చరించడం వల్ల ఒక్క తరాన్ని చూడటమే తన తరం కావడం లేదు కానీ ఇటూ అటూ ఏడుతరాలా ? ఇదేదో సామెత కోసం ఉపయోగించే మాటే కానీ ఆచరణలో సాద్యమవుతుందా ? ఈ రోజుల్లో ఎవరి కుటుంబాన్నైనా వాళ్ళ డీయన్సీలు తెలుసుకోవడం వీలవుతుందా ? ఈ లోపు పుణ్యకాలం అంతా పోయి తన కూతురు చక్కగా పెళ్లి కాకుండానే అందరికీ ఆంటీ అయిపోతుంది.

అప్పటికీ వచ్చిన రెండు మూడు సంబంధాల వాళ్ళ మీద గూఢచారులను పెట్టి వాళ్ళ కదలికలను గమనించి చూశాడు. వాళ్ళు మరీ ఏగాయితనంగా కనపడి పెద్దగా ఆస్తులు లేకపోగా ఇంట్లో కుచేల సంతానంలాగా నలుగురైదుగురు పిల్లలు, డబ్బై, ఎనభై ఏళ్ళు దాటి ఇంకా రాయిలా ఉన్న ఇంటి యజమాని వైధవ్యం పొందిన అక్కగార్లు ఇవన్నీ చూశాక బాబోయ్ ఇటువంటి కుటుంబాలలో తన పిల్లను పడేస్తే ,ముప్పై ఏళ్ళు కూడా రాకుండానే జీవితం సమాప్తమైపోవడం ఖాయం అని భయపడి అవతల వాళ్ళు రెండు మూడు సార్లు తనకి ఫోన్ చేసినా తను మాత్రం పొరపాటున కూడా ఫోను తియ్యలేదు. .

"ఇంత టెన్షన్ పడే కన్నా మీ దగ్గర బంధువుల్లో ఎవరైనా ఉంటే చూసుకుని వాళ్ళతో సంబంధం కలుపుకోవచ్చు కదా. అప్పుడు ఈ ఏడు తరాలు అంటూ పట్టుకుని వేలాడాల్సిన పని లేదు. పైగా చుట్టాలైతే అత్తగార్లు, ఆడపడుచులు బయట వాళ్ళను పెట్టినట్టుగా అంతగా ఆరళ్ళు పెట్టరు. ఒకరిమీద ఒకరు ప్రేమాభిమానాలు పంచుకోకపోయినా రోజులు ఏదో రకంగా వెళ్లిపోతాయి " అంటూ రమణారావుకు ఎంతోమంది సలహాలు ఇచ్చారు.

"అదీ అయ్యింది. కాగడా వేసి వెతికినా ఎవరిళ్లల్లోనూ మగపిల్లలు కనపడటం లేదు. ఒక పక్క మాధ్యమాలలో ఆడపిల్లల శాతం నానాటికీ తగ్గిపోతోందని, భవిష్యత్తులో మగపిల్లలకు పెళ్లి చేసుకోవడానికి ఒక్క ఆడ పిల్లా దొరకదు అంటూ ఊదరగొట్టేస్తూ ఉంటే రమణారావుకు మాత్రం ఎక్కడ చూసినా వీధుల్లో గుంపులు గుంపులుగా ఆడపిల్లలు కనిపిస్తున్నారు. ఏ ఇంట్లో వెతికినా ఇద్దరూ లేక కనీసం ఒక ఆడపిల్ల అయినా ఉంటోంది. ఇక కొన్ని చోట్ల వంశ పారంపర్యంగా ఒక బెల్ట్ బెల్టూ ఆడపిల్లలే పుట్టుకొస్తున్నారు. లింగు లిటుకుమని ఒక మగ నలుసు పుట్టుకొచ్చి వాడు ఎదిగి పెద్దవాడయ్యి పెళ్ళికి రెడీ అయితే ఇక ఆ ఇంట్లో కోరికల చిట్టా ఒక మహా గ్రంధంలాగానే ఉంటుంది. . పైగా దగ్గర బంధువర్గంలో పిల్లల్ని చేసుకుంటే పిల్లలు అనారోగ్యాలతోనో, అవకారాలతోనో పుట్టే అవకాశం ఉందని , వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులన్నీ రిపీట్ అవుతాయని డాక్టర్లు మాధ్యమాలలో ఒకటే హోరెత్తించేస్తున్నారు. ఆ భయం రమణారావులోనూ ఉంది. ఇదే కాకుండా ఈ మధ్య బంధువులు కానీ, బయట తెలిసిన వాళ్ళు కానీ తమకు తెలిసిన సంబంధాల గురించి అసలు ఎవరికీ చెప్పడానికి సాహసించడం లేదు . ఏ కారణం చేతనైనా పెళ్లి జరిగాక ఆ పెళ్లిళ్లు పెటాకులైనా, కుటుంబాలలో ఏవైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ సంబంధాన్ని రికమెండ్ చేసిన వాళ్ళను జీవితాంతం ఆడుకుంటారు. . అందుకే చాలామంది వాళ్ళ పిల్లల పెళ్లి సంబంధాలు చూసుకునేటప్పుడు గుట్టు చప్పుడు కాకుండా , ఎవరినీ సంప్రదించకుండా , పూర్తిగా పెళ్లిళ్లు కుదిర్చేసుకుని శుభలేఖలు అచ్చువేయించి ఇచ్చే అంత వరకు ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచుతున్నారు. ఇటువంటి పరిస్తితిలో రమణారావు ఎవరినైనా సంబంధాలు గురించి అడగబోతే "లెక్కకు మించి మ్యారేజ్ బ్యూరోలు ఉన్నాయి కదయ్యా. అందులో రిజిస్టర్ చేసుకుంటే తుట్టలు తుట్టలుగా సంబంధాలు అవే వచ్చి పడతాయి" అంటూ తప్పించుకునే వాళ్ళే ఎక్కువ. .

" వాటిని కూడా నమ్మలేము లెండి. వాళ్ళ వంతా వ్యాపార దృక్పథం. మన ఫోన్ నెంబర్ ఇచ్చేసి చేతులు దులుపుకుంటారు. . ఆ తర్వాత ఆ పెళ్లిళ్లు పెటాకులైనా వాళ్లకేమీ సంబంధం లేదు ఆ బాధ ఏమిటో జీవితాంతం మనం అనుభవించాలి . " అనేవాడు రమణారావు.

రమణారావు ఇల్లాలు పేరు శ్రీలక్ష్మి. ఆమెకు దగ్గర చుట్టం ఒకావిడ పెళ్లిళ్ల బ్యూరో నడుపుతోంది. అప్పటికీ చాలా సార్లు ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పమని శ్రీలక్ష్మి ఆవిడను పోరింది.

"వద్దులే లక్ష్మీ, నువ్వు నాకు కజిన్ సిస్టర్ వవుతావు. ఏదైనా సమస్య వస్తే మన మధ్య సంబంధాలు చెడిపోతాయి. బయట వాళ్ళకు ఏ సంబంధం చూసినా ఆ యాతనేదో వాళ్ళూ, వాళ్ళూ పడతారు. మా బాధ్యత సంబంధం చూపించడం వరకే. వాళ్ళ కాపురాలు బాగా లేకపోతే మా బాధ్యత అంటూ ఏమీ ఉండదు. నువ్వు ఏమీ అనుకోకపోతే వేరే పెళ్లిళ్ల బ్యూరోలో రిజిస్టర్ చేసి చూడండి. ఎక్కువ డబ్బు కడితే మంచి సంబంధాలు చూసి పెడతారుట. " అంటూ శ్రీ లక్ష్మి ఎలాగా తను చుట్టం అవడం వల్ల ఆ రిజిస్టర్ ఫీజు తనుకూడా కట్టించుకునే విషయంలో మొహమాటాలు ఎందుకని మొదట్లోనే సంబంధాల ప్రస్తావన తుంచేసింది.

బయట సంబంధాలు వెతకడం విషయంలో పూర్వం వాళ్ళు ఎలా చేసే వారో కానీ రమణారావు దంపతులకు మాత్రం ఆత్మహత్యా సదృశ్యం లాగా అనిపిస్తోంది. ఒక వారం పది రోజులు తీవ్రంగా తలపట్టుకుని ఆలోచించిన దరిమిలా ఇది సరైన పద్దతి కాదని తీర్మానించుకుని అదేదో టీవీలో వార్తల మధ్య, సీరియళ్ళు మధ్య ఒకటే హోరెత్తెస్తున్న వివాహ బ్యూరోల ప్రకటన చూశాక ఇదేదో బాగానే ఉందనుకుంటూ ఇక ఒక్క క్షణం ఆగక ఐదు వేలు రూపాయలు ఫీజు కట్టి వాళ్ళు చెప్పబోయే సంబంధాల కోసం ఎదురు చూడటం మొదలు పెట్టారు. .

" ఏమండీ. డబ్బులు కట్టేసాంగా. . ఇక మగపిల్లల తల్లి తండ్రులు ఫోనులు చెయ్యడం మొదలు పెడతారు. మీకు ఏది చెప్పాలో ,ఏమి చెప్పాలో సరిగ్గా అవగాహన లేదు. . అవసరార్ధం కొన్ని అబద్దాలు ఆడాలి. మీరు వాళ్ళ దగ్గర నసుగుతూ మాటలాడుతూ ఉంటే వాళ్ళక్లు అనుమానాల మీద అనుమానాలు వరసగా పుట్టుకొస్తాయి. కనీసం ఫోనులో వచ్చే సంబంధాల విషయంలో నాకు వదిలేయ్యండి. . అవతల వాళ్ళు అంతా ఆడ పెత్తనం అనుకున్నా సరే. మిమ్మల్ని మాత్రం ఈ విషయంలో మాట్లాడనియ్యను." అంటూ మొగుడి మోహమ్మీద గట్టిగా చెప్పేసింది రమణారావు భార్య శ్రీలక్ష్మి.

"ఏదో ఒకటి చెయ్యి. పక్కనే నేనూ ఉంటాను. వాళ్ళకు ఏవైనా అనుమానాలు ఉంటే నాకివ్వు. అసలు చాలా సంబంధాల వాళ్ళు ఇంట్లో మగవాళ్ళు పట్టించుకోకపోతే అవమానంగా భావించి ఫోను పెట్టేస్తారు . ఏదో కట్నం దగ్గర, లాంచనాల దగ్గర మాత్రమే మగవాళ్ళు తలదూర్చాలి అంటే కుదరదు. మంచీ చెడులు మేము కూడా ఆలోచించాలి . " అంటూ ఉక్రోషంగా మాట్లాడాడు రమణారావు.

ఆ రోజునుండి ఎవరెవరో ఫోనులు చెయ్యడం మొదలుపెట్టారు. శ్రీలక్ష్మి ఒక పాత డైరీ తీసుకుని ఫోన్ దగ్గరే కూర్చుంటోంది. ఫోన్ మోగినప్పుడల్లా ఆమె గుండె దడదడలాడటం మొదలుపెట్టి వెంటనే అటెన్షన్ లోకి వచ్చేసి గొంతు బాగా సవరించుకుని అవతల వాళ్ళు ఎవరో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యక "చాలా సంతోషం అండీ. మా అమ్మాయి కడిగిన ముత్యం . బాగా చదువుకుంది. వినయ విధేయతలలో తనకి ఎవరూ సాటి రారు " అంటూ మొదలుపెట్టేసేది.

"మేము పెళ్లిళ్ల సంబంధాల వాళ్ళం కామమ్మా. గ్యాస్ బుక్ చేశారు కదా. రేపు వస్తుందని చెప్పడానికి ఫోన్ చేశాం అనో , పేపర్ వాళ్ళం, పేపర్ వేయించుకుంటారా అంటూ మరొకళ్ల ఫోనులు అవడంతో ఆమె ముఖం అవమానంతో ఎర్రబడిపోయేది.

ఆ రోజు ఆదివారం . రాత్రి ఏడూ, ఎనిమిది ప్రాంతంలో ఎవరినుండో ఫోన్ వచ్చింది. వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి వాళ్ళే అని నిర్ధారించుకున్నాక " అవునండీ. మా వారు మీ అబ్బాయి ప్రొఫైల్ చూశారు. మాకు తీర్చుకోవాల్సిన సందేహాలు ఉన్నాయి. మాట్లాడ వచ్చునా ?" అడిగింది శ్రీలక్ష్మి

"సందేహాలా ? మీకు అన్ని వివరాలు పూసగుచ్చినట్టు అందులో ఇచ్చాము కదండీ " అంటున్నారు అవతలవైపు నుండి చిరాకుగా.

"అవుననుకోండి. ఒక ముఖ్యమైన సందేహం ఉంది. అబ్బాయికి మందు, సిగరెట్టు లాంటి అలవాటేమేనా ఉందా ? ఇంకో విషయం మేము పూర్తి శాకాహారులం. వేరే వంటలు మా ఇంట్లో నిషేదం మరి " అంది గుండె దిటవు చేసుకుని .

" మందు, సిగరెట్టు అలవాటు లేదని మేము చెపితే మీరు నమ్మేస్తారా ? " అవతలి వ్యక్తినుండి వ్యంగ్యంగా సమాధానం ఇచ్చింది. .

" అమ్మో అయితే అవన్నీ ఉన్నాయన్నమాట . ముందే చెప్పి రక్షించారు. ఇక మీరు వేరే సంబంధం చూసుకోవచ్చు . " అని ఫోను పెట్టెయ్యబోయింది శ్రీలక్ష్మి.

అవతల వ్యక్తి "ఆగండాగండి. అంత ఆవేశ పడిపోకండి. చూస్తూంటే మీరు చాలా అమాయకుల్లా ఉన్నారు. . ఈ రోజుల్లో మందు అలవాటు లేని పిల్లలు ఎవరు ఉంటారండీ ? రెగ్యులర్గా కాకపోయినా ఏదైనా పార్టీలలో కలిసినప్పుడు అవన్నీ మామూలే. మీకు ఎవరైనా మాకు అటువంటి అలవాట్లు లేవని చెపితే వాళ్ళు మీకు అబద్దం చెపుతున్నట్టు లెక్క. సిటీలలో బార్లు,పబ్బులు , అర్ధరాత్రి తర్వాత కూడా తెరిచి ఉంటున్నాయి అంటే దానర్ధం ఏమిటి ? ఇప్పుడున్న నాగరికపు పోకడలు ప్రకారం లింగ బేధం అంటూ లేకుండా అవి నడుస్తున్నాయి. దయచేసి ఆహారం విషయం, మందు విషయం ఈ రెండు ఎవరినైనా అడిగి అవమాన పడకండి. తొందరపడి వీటి గురించి ప్రశ్నిచినంత కాలం మీ అమ్మాయికి సంబంధం దొరకడం అసాధ్యం " అని అవతల వ్యక్తి సూటిగా చెప్పేయ్యడంతో శ్రీలక్ష్మికి ఒళ్ళు మండిపోయింది.

". వీళ్ళ మొహాలు. ఇంత పొగరుమోతు తనంతో సమాధానాలు చెప్పే వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్లు చస్తే అవ్వవు. అసలు ఈ రోజుల్లో మగ పిల్లలకు సంబంధాలు దొరక్క ముప్పై ఐదేళ్లు వచ్చి ,జుట్లు ఊడిపోయి మొహాలు పీక్కుపోయి వయసు మీద పడిన వాళ్ళల్లా కనిపిస్తూ ఉండటం వల్ల అసలు పెళ్లిళ్లు అవడం చాలా కష్టంగా ఉంది. . ఆడపిల్లల కోరికలు కూడా ఎక్కువున్న ఈ కాలంలో కాస్త సంబంధాలు చూసుకునేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకోవాలి " అంది కోపంగా .

ఆ రోజు శ్రీలక్ష్మి పక్కింట్లో పేరంటం అని అటు వెళ్ళగానే ఎవరినుండో ఫోన్ వచ్చింది. ప్రొఫైల్ చూసి ఎవరో ఫోన్ చేస్తున్నారు.

"మగ పెళ్లి వారితో మీరు మాట్లాడటానికి వీల్లేదు. ఏదో ఒకటి చెప్పబోయి ఇంకొకటి మాట్లాడతారు". అని ఆల్రెడీ భార్య కాషన్ ఇవ్వడంతో రమణారావు కొద్దిసేపు తటపటాయించాడు. అయినాకూడా ధైర్యం చేసి వాళ్ళతో మాట్లాడటం మొదలు పెట్టాడు. ఎవరికి ఫోను చేసినా మగవాళ్ళు నోళ్ళు మూసుకుని ఈ విషయంలో ఆడవాళ్ళను మాత్రమే మాట్లాడటానికి ప్రేరేపిస్తున్న తరుణంలో విసిగెత్తిపోయి ఉన్న అవతల వ్యక్తికి మగ గొంతు వినపడటంతో ఆసక్తి పెరిగి " నమస్కారమండీ. మీ అమ్మాయి ప్రొఫైల్ చూశాను. బాగానే ఉంది. మీరేం చేస్తూంటారు , ఆస్తుల వివరాలు లాంటివి కనుక్కుని సంతృప్తి పడ్డాక అయితే రేపు ఆదివారం అమ్మాయిని చూసుకోవడానికి ఏర్పాటు చెయ్యగలరా ?" అన్నాడు ఆ పెద్దమనిషి. రమణారావు మొహం చేట అంత అయ్యింది. ఇన్నాళ్ళు తన భార్య మాట్లాడుతూంటే ఒక్క సంబంధం కూడా రాలేదు. ఇప్పుడు తను ఫోను తియ్యగానే ఏకంగా అమ్మాయిని చూసుకోవడానికి వచ్చేస్తాననడంతో అతనికి సంతోషంతో గంతులు వెయ్యాలనిపించింది. .

" గ్రేట్ అండీ. తప్పకుండా అలాగే ఏర్పాటు చేస్తాము. . అయితే ఈ విషయం మా ఆడవాళ్ళకు కూడా చెప్పి మీకు మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాను. తను బయటకు వెళ్ళినట్టుంది. రాగానే నేను తన చేత కూడా ఫోన్ చేయిస్తాను " అన్నాడు రమణారావు తబ్బిఉబ్బవుతూ .

" ఏమిటండీ బాబూ. మధ్యలో మళ్ళీ వాళ్ళ ఇంటర్వ్యూలు ఎందుకులెండి ఏదీ ఒక పట్టాన తేల్చరు. ప్రపంచంలో లేని అనుమానాలన్నీ వాళ్ళకు వచ్చేస్తూ ఉంటాయి. . మాకు వచ్చే ఫోనులలో ఆడపెళ్ళి వారి కోరికలు, అనుమానాలు ఎక్కువున్నవే వస్తున్నాయి. ఈ రోజుల్లో మగపిల్లలకు పెళ్లిళ్లు కావడం చాలా కష్టంగా ఉందంటూ ఒక ప్రచారం బలంగా ఉంది దాన్ని భయంగా తీసుకుని మగ పెళ్లి వారు మెగా గా ఉండాల్సిన వాళ్ళు మూగగా తయారవుతున్నారు. మీరు మీ శ్రీమతికి విషయం చెప్పి రేపు ఆదివారం చూపులకు వస్తామని చెప్పండి. ఏవైనా డౌట్లు ఉంటే అక్కడే తీర్చుకోవచ్చు. ఈ విషయంలో పెద్దగా రాద్దాంతం చెయ్యడం మాకు ఇష్టం ఉండదు " అన్నాడు ఆయన నిర్మొహమాటంగా .

. శ్రీలక్ష్మి పేరంటానికి వెళ్ళి ఇంట్లో అడుగుబెట్టెసరికి రమణారావు ఆమెకు ఎదురుగా వెళ్ళి " ఏమోయ్ నువ్వు అటు వెళ్ళగానే ఎవరో సంబంధం వాళ్ళు ఫోన్ చేశారు. ప్రొఫైల్ కూడా చాలా బాగుంది. పెళ్లి కొడుకు నాకు బాగా నచ్చేశాడు. పిల్లాడి తండ్రి కూడా చాలా మర్యాదస్టుడిలాగానే కనిపిస్తున్నాడు. " అన్నాడు రమణారావు ఆపుకోలేక .

"ఏడిచినట్టుంది. అసలు మీరేందుకు మాట్లాడారు. ? ఏం అవకతవకలు మాట్లాడారో ఏమిటో ? నేను వచ్చే అంతవరకు ఆగొచ్చుకదా . మా ఆడవారు బయటకు వెళ్లారు . వాళ్ళొచ్చాక మాట్లాడిస్తాను అని చెప్పలేకపోయారు ?" అంటూ ఉరిమి చూసింది శ్రీలక్ష్మి .

"బాగానే ఉంది వరస . నువ్వు నా నోరుమూసేసి మాట్లాడనియ్యకుండా నువ్వు ఏవేవో తింగరి ప్రశ్నలు వెయ్యడం వల్ల వాళ్ళకు ఎక్కడో కాలి ఇంతవరకు ఒక్కరు కూడా మళ్ళీ ఫోన్ చేయలేదు. . అయినా ఆయన చెప్పేశాడు. మీ ఆడవాళ్ళతో మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తే మాత్రం మేము ఫోను పెట్టేస్తాం అని . ఇక నీ అహంకారాన్ని కొద్దిగా పక్కన పెట్టు. నేను మాట్లాడినా మొదటి సంబంధమే క్లిక్ అయ్యేటట్టుగా ఉంది. వాళ్ళకు మన అమ్మాయి ప్రొఫైల్ నచ్చిందిట. నీతో కూడా చెప్పి రేపు ఆదివారం పిల్లను చూపించే ఏర్పాటు చేయించమని చెప్పాడు. చూశావా ఇంతవరకు లాక్కొచ్చాను. . ఇక ఈ విషయంలో అడ్డం పడక అమ్మాయికి ఫోను చేసి చెప్పు ఆదివారం చూసుకోవడానికి పెళ్లివారొస్తున్నారని . ఎక్కువ టైమ్ కూడా లేదు ఏర్పాట్లు చేసుకోవడానికి " అంటూ శ్రీలక్ష్మి మొహంలోకి చూడకుండా ఎవరికో ఫోన్ చెయ్యడానికి అక్కడనుండి వెళ్లిపోయాడు రమణారావు.

'అయ్యో రాత. వాళ్ళకు మాటిచ్చేశారా వచ్చెయ్యమని. వాళ్ళు అంత తొందరపడి ఎగేసుకుని వచ్చేయడానికి సిద్ద పడుతున్నారంటే అర్ధం వాళ్ళ కొడుక్కి ఏ సంబంధం కుదరడం లేదని . ఎవడిని పడితే వాడిని దారిన పోయే దానయ్యను నా కూతురికి చస్తే చెయ్యను. అసలే అది నేను ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకొను అంటూ మొరాయిస్తోంది. ." అంది శ్రీలక్ష్మి.
"చాల్లేవోయ్ ఇక్కడ ఏదో నీ కూతురికి ఎన్నో సంబంధాలు వచ్చేసినట్టు మాట్లాడుతున్నావు . సంవత్సరం నుండి ప్రయత్నిస్తున్నాం. ఒక్క సంబంధాన్నైనా దగ్గరకు రానిచ్చావా ? నీ సూటీ పోటీ మాటలతో వాళ్ళను తీవ్రంగా అవమానించావు. అక్కడేదో నీ కూతురు ప్రత్యేకంగా ఆకాశం నుండి ఊడిపడిందని ? ఈ అహంకారాన్ని వదులుకుని ఒక ఆడపిల్ల తల్లిగా ప్రవర్తించు. మొదట్లో నేనూ నీలాగానే అనుకున్నాను నా కూతురుని చూసుకోవడానికి నా ఇంటిముందు క్యూ కడతారని. చాలా సార్లు వాళ్ళ మీద నిఘా కూడా పెట్టాను. తర్వాత అది పద్దతి కాదు అని తెలిసింది దానికి వేరే మార్గాలు అనుసరించాలని. ఈ రోజుల్లో ఆడ పెళ్లి వారు కానీ, మగ పెళ్లి వారు కానీ తమ పిల్లల పెళ్లిళ్ల విషయంలో మూర్ఖత్వంగా ప్రవర్తిస్తే ఇక వాళ్ళు మనకు ఏ అవకాశమూ ఇవ్వకుండానే వాళ్ళకు నచ్చిన వాళ్ళతో వెళ్ళి పోయి వాళ్ళ పెళ్లిళ్లు వాళ్ళే చేసుకుంటారు. పిల్లలకు పెళ్లిళ్లు అవ్వడం అంత తేలికైన విషయం కాదు. ఇదో యాగం లాంటిది. చివరి వరకు ఎన్నో అవాంతరాలు ఉంటాయి. సంబంధాలు తప్పి పోవడం మాట అటుంచి, కావాలని వాటిని చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటప్పుడు ఆ సంబంధాలను జాగ్రత్తగా డీల్ చెయ్యాలి. అదృష్ట వశాత్తు ఈ సంబంధం వాళ్ళు బాగానే స్పందించారు. నువ్వు కూడా నెంబర్ తీసుకుని వాళ్ళతో చక్కగా నాలుగు మాటలు మాట్లాడు. లేకపోతే పెళ్లి కూతురు తల్లికి బెషిజాలు ఎక్కువ అనుకుంటారు. . వాళ్ళతో జాగ్రత్తగా బిహేవ్ చెయ్యి. ఇప్పుడు ఆడపెళ్ళి వారికైనా, మగ పెళ్లి వారికైనా ఇగోలు ఉండటం మామూలే. కానీ సమయానుసారం, సానుకూలంగా, సమయస్పూర్తిగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు అలా అని ఈ సంబంధం ఖాయం అయిపోతుందని భావించనక్కరలేదు. ముందు ఒక అడుగు పడింది కదా. తర్వాత పరిస్తితులే అవే చక్క పడతాయి. ఎక్కవగా ఆలోచించక ప్రశాంతంగా ఉండు. నీకు నీ కూతురు బాధ్యత ఎంతో నాకు అంతకన్నా ఎక్కువ. గుర్తుపెట్టుకో. " అన్నాడు రమణారావు తన అస్తిత్వాన్ని,వ్యకిత్వాన్ని నిలబెట్టుకోవాలన్న ప్రయత్నం చేస్తూ.

"అవును నిజమే తను అతిశయంతోనూ, అహంభావంతోనూ, అనుమానాలతోనూ తన భర్తకు తెలియకుండా ఈ మధ్య కాలంలో ఎన్నో సంబంధాల వాళ్ళను అవమానపరిచి తన కూతురికి ఎప్పుడో జరిగిఉండాల్సిన పెళ్లిని నిర్లక్ష్యంగా అడ్డుపడింది. ఇప్పుడు ఆమె ముఖంలో ఇంతకు ముందున్న మూర్ఖపు పట్టుదల కనిపించడం లేదు.

" మీరు చెప్పింది నిజమేనండీ. మనం మన అమ్మాయిని దృష్టిలో పెట్టుకుని కూడా ఆలోచించాల్సింది. అది ఇప్పుడు ప్యానిక్ అయిపోయింది. మనం తనకు సరైన సమయంలో పెళ్లి సంబంధాలు చూడగలిగే పరిస్తితి చెయ్యి దాటిపోయిందని ఇప్పుడు పెళ్ళంటేనే విముఖత చూపిస్తోంది. . అందుకే తనకు కొన్నాళ్ళ వరకు పెళ్లి మాట తలబెట్టొద్దని చాలా సార్లు నాతో అంది. సరే. నేను చాలా పొరపాటు చేశాననిపిస్తోంది. ఈ సంబంధం కాకపోయినా ఇకనుండి మీరే ఆ విషయాలు చూసుకోండి. నేను మీకు తోడుగా ఉంటాను " అంది శ్రీలక్ష్మి . ఆమె ముఖంలో ఏదో తెలియని రిలీఫ్.

"అలా అని నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నానని అనుకోకు లక్ష్మీ. మగ పెళ్లి వారికైనా ఆడపెళ్ళి వారికైనా ముందు ఆ కుటుంబంలో భార్యా , భర్తల మధ్య ఒక సరైన అవగాహన, ముందు చూపు, నిస్వార్ధం తో కూడిన ఆలోచనలు ఉండి తమ పిల్లల భవిష్యత్తుకు సోపానాలుగా ఉండటం చాలా అవసరం. అదే పద్దతిలో పిల్లలను పెంచడం కూడా అవసరం. విభిన్న మనస్తత్వాలతో, పోకడలతో , వ్యతిరేక భావాలతో తల్లి తండ్రులు సంయమనం , సమన్వయం పాటించకపోతే పిల్లలు మన చేతుల నుండి జారిపోయి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు . అందులో కొంతమంది జీవితాలు పూల వనాలు అయితే మరి కొందరి జీవితాలు ముళ్ళ పొదలుగా మారుతాయి. అటువంటి చేదు అనుభవాలు చాలా మంది జీవితాలలో కాపురముంటున్నాయి. ఆ పరిస్తితులు మన పిల్లలకు రాకూడదని ప్రతి కుటుంబంలోని పెద్దలు అనుకోవాలంటే వారిమధ్య సమన్వయం తప్పదు. " అంటూ ఎంతో లాజికల్ గా మాట్లాడుతున్న మాటలు శ్రీలక్ష్మి హృదయానికి హత్తుకుని కళ్ళముందు ఒక అద్భుతాన్ని చూస్తున్న దానిలా ఉండిపోయింది శ్రీలక్ష్మి.

కారడవిలో దారితప్పిన వాళ్ళులా పరిగెడుతున్న రమణారావు దంపతులు ఇప్పుడు పూర్తి ప్రక్షాళన గావించుకున్న మనసులతో రేపు ఆదివారం జరగబోయే పెళ్లి చూపుల మీద దృష్టి పెట్టడానికి సమాయత్తమయ్యారు ******

సమాప్తం .

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.