భాగవత కథలు -30 పరీక్షిన్మహరాజు - కందుల నాగేశ్వరరావు

Parikshinmaharaju

భాగవత కథలు -30

పరీక్షిన్మహరాజు

-1-

కురుక్షేత్ర సంగ్రామంలో దుర్యోధనుడు తొడలు విరిగి నేలకూలాడు. అతనికి సంతోషం కలిగించాలని అశ్వత్థామ అర్ధరాత్రి పాండవ శిబిరంలోకి వెళ్లి నిద్రిస్తున్న ఉపపాండవుల తలలు నరికి తెచ్చి సమర్పించాడు. ద్రౌపది దుఃఖాన్ని చూడలేక అర్జునుడు గాంఢీవాన్ని ధరించి బయలుదేరాడు. అశ్వత్థామ అర్జునుడు ఒకరిపై ఒకరు బ్రహ్మాస్త్రాలు ప్రయోగించారు. ఆ రెండు బ్రహ్మాస్త్రాలు ఢీకొని లోకాలు కంపించాయి. శ్రీకృష్ణుని సలహాతో అర్జునుడు రెండు బ్రహ్మాస్త్రాలు ఉపసంహరించి అశ్వత్థామను బంధించాడు. ద్రౌపది కరుణించి గురుపుత్రుని క్షమించి ప్రాణబిక్ష పెట్టింది. అశ్వత్థామ ప్రయోగించిన బాణం ఉత్తరాగర్భస్తుడైన పరీక్షిత్తును దహించివేయాలని చూసింది. ఉత్తర ప్రార్థన ఆలకించిన శ్రీకృష్ణుడు ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షిస్తున్న తన సుదర్శన చక్రం అడ్డువేసి కాపాడాడు.

ఉత్తరకు నెలలు నిండాక శుభగ్రహాలన్నీ ఉచ్ఛస్థితిలో ఉన్న సమయంలో ఒక బాలుడు జన్మించాడు. విష్ణువు అనుగ్రహంతో జన్మించాడు కాబట్టి అతనికి ‘విష్ణురాతుడు’ అని పేరు పెట్టారు. బ్రాహ్మణులు ఆ బాలుని జాతకం చూసి ధర్మరాజుతో “మహారాజా, ఈ బాలుడు ఉత్తమగుణాలతో విష్ణుభక్తుడై కలి కల్మషాలను హరించగల గొప్పవాడౌతాడు. అనేక సంవత్సరాలు రాజ్యపాలన చేసి పుణ్యలోకాలు చేరుకుంటాడు” అని చెప్పారు. ఆ బాలుడు పుట్టిన దగ్గర నుండి గర్భంలో ఉన్నప్పుడు తనను రక్షించిన భగవంతుడు విశ్వమంతా నిండి ఉన్నాడని పరీక్షగా చూడడం వలన ‘పరీక్షిత్తు’ అని పేరు వచ్చింది.

-2-

శ్రీమన్నారాయణుడు ఏనాడైతే తన అవతారసమాప్తి కావించాడో ఆనాడే కలియుగం మొదలైంది. కలి ప్రవేశం వల్ల సమస్త ప్రదేశాల్లో అధర్మం విస్తరించిందని తెలుసుకున్న ధర్మరాజు తన మనుమడైన పరీక్షిత్తును హస్తినాపుర సింహాసనంపై కూర్చుండబెట్టి కురు సామ్రాజ్యానికి పట్టాభిషేకం చేసాడు. సకల ధన కనక వాహన పరివారాన్ని పరీక్షిత్తుకు అప్పగించి వైరాగ్యమార్గాన్ని ఆశ్రయించాడు. పూర్వం నారదుడు ఇచ్చిన ఉపదేశం గుర్తుకు తెచ్చుకొని పుణ్యంలోక ప్రాప్తికి ప్రయత్నించి విష్ణులోకాన్ని చేరుకున్నాడు. భీమార్జున నకుల సహదేవులు కూడా అదే మార్గాన్ని అనుసరించారు.

పరీక్షిత్తు తన పూర్వుల బాటలో జనరంజకంగా పరిపాలన సాగిస్తున్నాడు. ఒకనాడు తన రక్షణలో ఉన్న కురు జాంగలదేశంలో కలిపురుషుడు ప్రవేశించాడని విన్నాడు. యుద్ధం చేయాలనే కుతూహలంతో తన రథాన్ని అధిరోహించి, అపార సేనావాహినితో విజయయాత్రకు బయలుదేరాడు. నాలుగు దిక్కుల్లో ఉన్న రమ్యకం, హిరణ్మయం, హరివర్షం, కింపురుషుం, భద్రాశ్వం, కేతుమాలం, భారతవర్షం అనే దేశాలనూ, ఉత్తర కురు దేశాలను జయించాడు. వందిమాగధ బృందాలచే గానం చేరబడుతున్న పద్యాలవల్ల తన పూర్వీకుల కథలను, శ్రీకృష్ణుడు తనను అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రజ్వాలల నుండి కాపాడిన వృత్తాంతాన్ని తెలుసుకున్నాడు. పద్మనాభుని ఆరాధనలో పరవశమై పవిత్రమైన మనస్సుతో ఉన్నాడు.

ఆ సమయంలో వృషభాకారం ధరించి ఒంటి కాలితో తిరుగుతున్న ధర్మదేవుడు, కాంతి కోల్పోయి కన్నీళ్లు కారుస్తూ ఆవురూపంలో ఉన్న భూదేవిని “ఎందుకు అలా రోదిస్తున్నావు? భూభారాన్ని తగ్గించడంతో కోసం శ్రీహరి ఇన్ని సంవత్సరాలు మానవాకారం ధరించి ఆనందం చేకూర్చే అవతారం చాలించాడని దుఃఖిస్తున్నావా?” అని అడిగాడు.

అప్పుడు భూదేవి ధర్మదేవుడుతో ఇలా అంది. “ధర్మదేవతా స్వరూపుడవైన నీవు పూర్వం ఈ లోకంలో నాలుగు పాదాలతో నడుస్తూ ఉండేవాడివి. ఈ నాడు శ్రీకృష్ణుడు లేనందువల్లనే కదా కాలప్రభావానికి లోబడి ఒంటి కాలితో నడుస్తున్నావు. సుగుణాలరాశియైన చక్రధరుడు అవతారం చాలించాక, పాపాత్ముడైన కలిపురుషుడు భయంకరమైన పాపకృత్యాలకు పాల్పడుతున్నాడు. ఆ ప్రజలను చూస్తుంటే నేను దుంఖం ఆపుకోలేక పోతున్నాను”. ఈ విధంగా వృషభరూపంలో ఉన్న ధర్మదేవుడూ, గోరూపంలో ఉన్న భూదేవి ఇద్దరూ సరస్వతీ నదీతీరంలో సంభాషించుకుంటున్నారు.

పరీక్షిత్తు తన పరివారంతో అక్కడకు వచ్చేసరికి చేతిలో బెత్తము పట్టుకొని రాజవేషంలో ఉన్న కలిపురుషుడు కోపంతో రాక్షసునిలా ఆ వృషభాన్ని కాలితో తన్నాడు. ఆ తన్నుకు వృషభం నేలమీద పడింది. భయంతో వణుకుతున్న గోమాతను కూడా ఆ పాపాత్ముడు పైకెగిరి కాలితో తన్నాడు. తన కంటి ముందే గోవృషభాలను తన్నుతున్న కలిని చూసిన పరీక్షిత్తు తన విల్లు ఎక్కుపెట్టి ఇలా అన్నాడు. “ఏ పాపమూ ఎరుగని వీటిని అన్యాయంగా ఎందుకు తన్నావురా? నా రాజ్యంలో ఎవరూ ఎప్పుడూ ఇటువంటి నేరాలు చేయకూడదని నీకు తెలియదా? నీవెవరు? రాజవేషం ఒలకబోస్తున్న దూర్తుడా, నిన్ను కఠినంగా శిక్షిస్తాను. చక్రధారి శ్రీకృష్ణుడూ, గాంఢీవధారి అర్జునుడూ ఈ లోకాన్ని విడిచి వెళ్లారనే ధీమాతో సాధుజంతువులను దండిస్తున్న నీకు రాజదండన తప్పదు” అన్నాడు.

“ఓ వృషభరూపంలో ఉన్నధర్మదేవా, ఇదిగో చూడు నా పరాక్రమంతో ఇప్పుడే ఈ దురాత్ముణ్ణి చీల్చి చెండాడుతాను. నిన్ను మరల నాలుగు పాదాలతో నడిపించుతాను. అమ్మా భూమాతా భయపడకు. ఈ దుర్మార్గుణ్ణి ఇప్పుడే నా బాణాలతో హతమారుస్తాను.” అని పరీక్షిత్తు ధర్మదేవుణ్ణీ భూమాతనూ ఊరడించాడు.

అప్పుడు తనను సంహరింతడానికి తయారవుతున్న మహారాజును చూసి కలి రాజచిహ్నాలన్నీ విడిచి, భయంతో గడగడ వణుకుతూ రాజు పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి “ఓ రాజా, నన్ను చంప వద్దు. నీ చరణాలను శరణు వేడుతున్నాను. నన్ను కరుణించు” అని ప్రార్థించాడు.

పరీక్షిత్తు కలిని చంపకుండా క్షమించి మందలించాడు. “నీలో అసత్యం, లోభం, దొంగతనం, దౌర్జన్యం, దురాచారం, మోసం, కపటం, కల్మషం, దౌర్భాగ్యం మొదలైన అధర్మగుణాలు ఉన్నాయి. సత్యానికి ధర్మానికి నిలయమైన ఈ ఆర్యావర్తంలో నీకు చోటు లేదు. నీ ధూర్తస్వభావాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపో” అని కత్తిని పైకెత్తి ఆదేశించాడు.

అప్పుడు కలి పరీక్షిత్తుతో “రాజా, మెరుస్తున్న నీ కరవాలం చూసి నా గుండెలు పగులుతున్నాయి. ఇప్పుడు నేనెక్కడికి పోయేది?ఎక్కడ ఉండేది? ఎటు చూసినా నీ రూపమే కనపడుతోంది. నేను ఎచట తల దాచుకొనేది? నీవే ఆలోచించు”.అలా బాధపడే కలిపురుషుని ప్రార్థన ఆలకించిన పరీక్షిన్మహారాజు జూదం, మద్యపానం, స్త్రీలు, ప్రాణివధ, సువర్ణం అనే అయిదు స్థానాలు అనుగ్రహించాడు. అందువల్ల అసత్యం, గర్వం, కామం, హింస, వైరం అనే అయిదు స్థానాలు కూడా కలిపురుషుని వశమయ్యాయి. ఆ స్థానాలు తప్ప మిగిలిన ప్రదేశాలు తాకవద్దని కలిని కట్టడి చేశాడు. ఈ ప్రకారం మహారాజు కలిపురుషుణ్ణి నిగ్రహించి పోగొట్టకున్నా తపస్సు, శౌచం, దయ అనే మూడు పాదాలు ధర్మదేవతకు అర్పించి భూదేవికి ఆనందం కలిగించాడు. ఆ తరువాత నాలుగు సముద్రాల నడుమ నున్న భూమండలాన్ని పరాక్రమవంతుడైన పరీక్షిత్తు ఏకచ్ఛత్రంగా పరిపాలించాడు.

-3-

పరీక్షిన్మహరాజు ఒకనాడు మృగాలను వేటాడాలని ఉత్సాహంతో అరణ్యమంతా విచ్చలవిడిగా తిరిగాడు. అడవి పందులను, తోడేళ్లను, సింహాలను, పులులనూ మహారాజు నైపుణ్యంతో పడగొట్టాడు. మృగాల వెంటబడి తరుముతూ తన వెంట అడవికి వచ్చిన బటుల నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ఆకలిదప్పుల వలన అలసిపోయిన రాజు చల్లని జలాశయం కోసం వెదికాడు. చివరకు ఒక తపోవనాన్ని ప్రవేశించాడు.

ఆ తపోవనంలో శాంతంగా తపస్సు చేస్తున్న శమీకమహర్షిని చూచాడు. ఆ మహర్షి పంచేద్రియాలను నిరోధించి సమాధి అవస్థలో ఉన్నాడు. పరీక్షిత్తు ఆ మునీంద్రుని సమీపించి నాలుక తడి ఆరిపోగా పొడిగొంతుతో “నీళ్ళు నీళ్ళు దాహం” అన్నాడు. ఆ ముని మాట్లాడ లేదు. అలసి దాహార్తుడైన రాజు ముని సమాధి స్థితిలో ఉన్న విషయం గ్రహించలేక ఆగ్రహానికి గురైనాడు.

“ఈ మునికి ఎంత గర్వం, రాజునైన నేను దాహానికి నీళ్ళు అడిగితే మెదలడు, కళ్ళు తెరవడు. మహర్షినని అహంభావం తలకెక్కి ఇంతగా కన్నులు మూసుకుపోయాయి కాబోలు” అని మనస్సులో తలచి రోషంతో కుమిలిపోతున్న రాజు లోలోపల ఉడికిపోయాడు. కలి ప్రభావం వల్ల కోపాన్ని ఆపుకోలేక వింటి మొనతో చచ్చిన ఒక పామును తెచ్చి ఆ బ్రహ్మర్షి మెడలో వేశాడు. ఆశ్రమం బయటకు వచ్చి తిరిగి తన పరివారాన్ని కలిసి హస్తినాపురం తిరిగి వచ్చాడు. కలికి ప్రాణదానం చేసిన రాజు ఇదంతా కలిప్రభావం అని గ్రహించలేక పోయాడు.

కాస్సేపటికి శమీకమహర్షి కుమారుడైన శృంగి ఆశ్రమానికి వచ్చాడు. తండ్రి మెడలో ఉన్న చచ్చిన పామును చూసి చాలా బాధపడ్డాడు. ఆశ్రమం బయట ఉన్న మునికుమారుల ద్వారా జరిగింది తెలుసుకున్నాడు. “మహారాజు తపోనిష్ఠలో ఉన్న తన తండ్రి మీద చచ్చిన పామును విసిరిపోతాడా? ఆరాజుకు ఏమి పోయేకాలం వచ్చిందని ఇలాంటి పని చేశాడు?” అని అనుకున్నాడు.

తన కోపాన్ని నిగ్రహించుకోలేక “ఆలోచన లేకుండా చచ్చిన సర్పాన్ని తీసుకువచ్చి మౌనముద్రలో ఉన్న మా తండ్రిగారి మెడలో పడవేసి దురహంకారంతో కన్నూ నిన్నూ కానని ఆ రాజు హరిహరాదులు అడ్డుపడినా నేటికి ఏడవరోజు తక్షకుని విషానికి ఆహుతి అవుగాక” అని శపించాడు.

అలా పరీక్షిత్తును భయంకరంగా శపించి శృంగి మరల ఆశ్రమానికి తిరిగివచ్చాడు. తండ్రి మెడలోని చచ్చిన పామును చూస్తూ ఏడవసాగాడు. శమీకమహర్షి సమాధి చాలించి కళ్ళు తెరిచాడు. భుజంపై వ్రేలాడుతున్న పాముని తీసి దూరంగా పారవేసాడు. కుమారుణ్ణి చూసి నాయనా ఎందుకు ఏడుస్తున్నావు? ఈ సర్పాన్ని నా మెడపై ఎవరు చుట్టారు? అని అడిగాడు. శృంగి తండ్రికి జరిగిందంతా చెప్పాడు. శమీకుడు దివ్యదృష్టితో ఆ రాజు పరీక్షిత్తు అని తెలుసుకొని కొడుకు చేసిన పనికి విచారించాడు.

“నాయనా, ఇంతటి కఠోరమైన శాపం ఎందుకు పెట్టావు? పరీక్షిత్తు తల్లి గర్భంలోనే అశ్వత్థామ బ్రహ్మాస్త్రానికి గురయ్యి శ్రీకృష్ణుని కటాక్షం వల్ల బ్రతికి బయటపడ్డాడు. ఇప్పుడు వాసుదేవుడు లేకపోవడం వలన లోకమంతా చీకాకు పాలైంది. ఇటువంటి కష్ట సమయంలో పరీక్షిన్మహరాజు సమదృష్టితో పరిపాలన చేస్తున్నాడు. చిన్నఅపరాధానికి నువ్వు రాజును శపించావు. రాజు మరణిస్తే రాజ్యంలో అరాచకం విస్తరిస్తుంది. ధర్మం నశిస్తుంది” అని కుమారుడితో చెప్పి శమీకమహర్షి సంతాపం చెందాడు. తన శిష్యులలో ఒకడిని శాపవృత్తాంతాన్ని రాజుకి చెప్పిరమ్మని పంపించాడు.

-4-

అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తు మునిశిష్యుని ద్వారా శృంగి ఇచ్చిన శాపం గురించి తెలుసుకున్నాడు. ఏకాంతంగా ఆలోచిస్తూ ‘దైవ సంకల్పం తప్పించడం ఎవరి తరమూ కాదు. నేను చేసిన పాపానికి శిక్ష అనుభవించడం తప్పదు’ అనుకున్నాడు. పరీక్షిత్తు తనను శపించిన శృంగి మీద ఏమాత్రం ఆగ్రహించలేదు. సామర్థ్యం ఉండి కూడా తిరిగి శపించలేదు. రాజ్యాన్ని త్యజించాడు. గంగానదీ తీరంలో ప్రాయోపవేశం చేసి ప్రాణాలు విడవడానికి సంకల్పించుకున్నాడు.

ఈ విషయం తెలిసి బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు మహర్షులతో కలిసి అక్కడకు విచ్చేశారు. పరీక్షిత్తు అందరినీ సాదరంగా ఆదరించి సాష్టాంగనమస్కారాలు చేశాడు. వారికి జరిగినదంతా వివరించి తన పాపం పరిహారమయ్యి కైవల్యం పొందే మార్గం శలవీయమని అర్థించాడు. “రాజేంద్రా, నీవు మహా తపశ్శాలులైన నీ పూర్వీకులకు తగ్గ ఉన్నతుడవు. నీవు సామర్థ్యం ఉన్నా నిన్ను శపించిన మునికుమారునిపై ప్రతీకారం తీర్చుకోలేదు. నీ మరణం గురించి విచారించకుండా మోక్షాన్ని కోరుకుంటున్నావు. నీవు ఈ మనుష్యదేహాన్ని వదలిపెట్టి పుణ్యలోకాన్ని చేరేంతవరకూ నీ మాటలు వింటూ మేమంతా ఇక్కడే కూర్చుంటాము” అని ఆ మహర్షులు అన్నారు.

ఆ సమయంలో దైవయోగం వల్ల సర్వసంగ పరిత్యాగీ, బయట ప్రపంచాన్ని మరచినవాడూ, వస్త్రాలను త్యజించి వెర్రివానివలె కనపడేవాడూ అయిన శుకమహాయోగి అక్కడకు విచ్చేశాడు. పరీక్షిత్తు వేదవ్యాస కుమారుడైన అ మహాయోగికి స్వాగత సత్కార్యాలు గావించాడు. “మీ రాకవల్ల నేను ధన్యుణ్ణి అయ్యాను. నీవు గోవు పాలు పిదికినంత సేపటి కంటే ఎక్కడా ఉండవు. తండ్రీ నాకు మోక్ష మార్గం చెప్పు” అని ప్రార్థించాడు.

“రాజా, మా తండ్రి వ్యాసభగవానుడు వేదతుల్యమైన భాగవతాన్ని నా చేత చదివించాడు. భగవంతుని అవతారలీలలు నన్నాకర్షించడం వల్ల దీనిని పఠించాను. నీకు భాగవత తత్త్వం తెలియజేస్తాను. భాగవత శ్రవణం వల్ల మోక్షం కాంచించేవాడికి ముక్తి లభిస్తుంది. జన్మజరామరణాది సంసారభయాలన్నీ తొలగిపోతాయి. ఒక్క క్షణమైనా హరినామం స్మరిస్తే చాలు అది ముక్తిని ప్రసాదిస్తూంది. ఖట్వాంగ మహారాజు తనకు ఆయువు ఒక్క క్షణం మాత్రమే మిగిలి ఉందని తెలుసుకొని గోవింద సంకీర్తనం చేసి భయరహితుడై రెండు గడియల్లోనే మోక్షం పొందాడు”. శుక మహర్షి ఈ విధంగా ప్రారంభించి శ్రీహరి అవతార మహిమలతో కూడిన భాగవతాన్ని పరీక్షిత్తుకు ఏడురోజులలో వివరించి అక్కడ నుండి యథేక్షగా వెళ్ళిపోయాడు.

-5-

తరువాత పరీక్షిత్తు దర్భలపై కూర్చొని శ్రీహరిని ధ్యానిస్తున్నాడు. శృంగి శాపం వల్ల వస్తున్న తక్షకునికి దారిలో కాశ్యపుడు అనే బ్రాహ్మణుడు కలిసాడు. కాశ్యపుడు ఎలాంటి విషాన్ని అయినా హరించగల సామర్థ్యం కలవాడు. అతడు పరీక్షిత్తును రక్షించడానికని వస్తున్నాడు. అది తెలిసిన తక్షకుడు ఆ బ్రాహ్మణునికి అపారమైన ధనాన్ని ఇచ్చి వెనక్కి పంపేశాడు. ఆ తరువాత తక్షకుడు ఒక పురుగుగా మారి పరీక్షిత్తు అంతఃపురానికి తీసుకువెళ్తున్న పండులో దూరాడు. రాజు ఆ ఫలం తినబోగా మహాసర్పంగా మారి పరీక్షిస్తున్న కాటు వేశాడు. పరీక్షిత్తు మరణించాడు.

పాండవ వంశాంకురం, అర్జునుని మనుమడు, అభిమన్యుని పుత్రుడు, తల్లి గర్భంలో ఉండగానే శ్రీకృష్ణ పరమాత్మను దర్శించి ఆయన కృపకు పాత్రుడైనవాడు, విష్ణుభక్తుడు, ప్రజారంజకుడు, పరిపాలనా దక్షుడు అయిన పరీక్షిన్మహరాజు వైకుంఠప్రాప్తి పొందాడు.

***శుభం***

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.