టెస్ట్ డ్రైవ్ - ఆకెళ్ళ శివ ప్రసాద్

test drive

"మ నిద్దరం విడిపోదాం" గుమ్మంలోకి అడుగు పెడ్తూ అందామె.

"ఎందుకు"

"ప్రేమించుకున్నాం కనుక"

"ప్రేమిస్తే విడిపోవాలా..అంటే ద్వేషిస్తే కలిసివుండే వాళ్ళమా?"

"...."

"నాలో లోపాలు ఏంటి" బేలగా అడిగాడు అతను.

"నీ నవ్వు చాలా బావుంటుంది"

"నాలో లోపాలు చెప్పమంటున్నా"

"నీ డ్రస్ సెన్స్ బావుంటుంది..సెన్స్ ఆఫ్ హ్యూమర్ బావుంటుంది"

"నాన్సెన్స్..నేను అడుగుతున్నది లోపాల గురించి"

"లోపాలుంటేనే విడిపోవాలా?" క్యాజువల్ గా హ్యాండ్ బ్యాగ్ లోంచి బబుల్ గమ్ తీసి నోట్లో వేసుకుంటూ అడిగింది. అంతక్రితం వారమే పరిచయం. వన్ బై టూ కాఫీ మొదలు అన్నీ షేర్ చేసుకున్నారు. ఆమె హాస్టల్లో ఉంటోంది. పెయింట్స్ వేస్తుంటుంది. అతను సాఫ్ట్ వేర్ రంగంలో ఉంటూ సాఫ్ట్ గా ఉంటున్నాడు.

"నేను చాలా పెయింట్స్ వేశాను...ప్రతి పెయింట్ ఇష్టపడ్తాను. అది పూర్తయ్యాక లోపాలు కంపించవ్.. కానీ కొత్త పెయింట్ వేయాలనిపిస్తుంది."

"ప్రేమా, పెయింట్ ఒకటేనా?"

మాట్లాడలేదు.

"ప్రేమ గురించి చాలా చెప్పావ్.."

"ఇప్పటికీ చెప్తున్నా"

"నీకసలు బుద్ధి లేదు."

" అవును"

"బాధగా లేదా?"

"వుంది"

"అబద్ధం"

"నేను బాధ పడట్లేదని ఎందుకనుకుంటున్నావ్?"

"విడిపోదామంటున్నావ్ గా"

"విడిపోవడంలో ఆనందం, కలిసి వుండడంలో బాధ కన్నా బావుంటుందనిపిస్తుంది"

"విడిపోవడం ఆనందం, కలిసి వుండడం బాధా?"

"ప్రేమ పెద్ద సముద్రం...మనం చిన్నపడవలో వెళ్తున్నాం."

"....ఏం, పడవలు బోల్తా పడ్డాయా?"

"......."

"రిలేషన్ లో పర్మనెన్సీ సరిపడదా?"

"ఏ విషయంలోనైనా జర్నీ ఇష్టం.."

"గమ్యం ఒకటి ఉండాలిగా"

"ఆ గమ్యం నువ్వు కాదనిపిస్తోంది"

".....ఓహో...నీ గమ్యం ఎలా ఉండాలో చెప్తావా..."

" కాలం చెప్పాలి..."

"ఫిలాసఫీ చెప్తున్నావా...?"

" ప్రేమా, ఫిలాసఫీ రెండూ ఒకటే.."

అతను తన చేతికి వున్న వాచీని విసిరి కొట్టాడు. అది ఆమె అతనికి బహుమతిగా యిచ్చింది. అతడు ఆమెకు బహుమతిగా ఇచ్చిన మెడలోని చైన్ ని ముద్దు పెట్టుకుంది.

నేల మీదపడిన వాచీని అందుకొంది.

పెద్ద ముల్లు, చిన్నముల్లు విరిగిపోయినా సెకండ్ల ముల్లు తిరుగుతోంది.

వాచీ వైపు చూసి మెల్లగా నవ్వింది.

బైట వాన పడ్తోంది.

అతను అసహనంగా ఉన్నాడు. ఆమె మనసు వాన కురిసి, వెలసిన తరవాత ఖాళీగా వున్న ఆకాశంలా వుంది.!!

తన అక్కలా తను ప్రేమలో మోసపోకూడదు. టెస్ట్ డ్రైవ్ లో నమ్మకం ఇవ్వలేని మనిషిని జీవితాంతం నమ్మి అడుగు వేయలేదు!!!

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ