ఆత్మహత్య చేసుకుందాం రండి! ..….కాని ఈ కథ చదివాక !…. - Porandla Sudhakar (SSSRK)

Aatmahatya chesukundam randi

“ఏమండి అబ్బాయి విశ్వం నిద్రలో కలవరిస్తున్నాడు, గత జన్మలో తన పేరు విశ్వాస్ అని తనది ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి అని ఆజన్మలో తన ప్రియురాలు మోసం చేయడం వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోయానని తనకి తల్లి, తండ్రి, చెల్లెలు వున్నారని వారు ఎలావున్నారో చూడాలని అనిపిస్తుందని నాలుగు రోజులుగా నిద్రలో కలవరిస్తున్నాడు, ఇంకా పన్నెండు సంవత్సరాలు నిండని మనబాబు ఇలా ప్రతి రోజు కలవరించడం ఏంటి ?, ఈ మాటలు అన్ని నా మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేసాను ఏమంటారు అన్నట్లు భర్త నారాయణ వైపు చూసింది శారద’.

"నేను కూడా విన్నాను శారద, వాడి మాటలు రికార్డ్ చేసి మంచిపని చేసావు, నాకు తెలిసిన మానసిక వైద్యుడు వున్నాడు, మన విశ్వాన్ని తన దగ్గరికి తీసుకెళ్దాం అన్నాడు నారాయణ”.

‘అప్పుడే మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్లడం ఏంటండీ, ఒక్కసారి మందులు వాడడం ప్రారంభిస్తే జీవితాంతం వాడాల్సి ఉంటుంది కదా అని ఆందోళనగా అంది శారద’.

“ఆలా ఏంకాదు, , నీకు వచ్చిన సందేహమే నాకు వచ్చింది, అందుకే డాక్టర్ ను అడిగాను, అవసరం వున్నన్ని రోజులు మాత్రమే మందులు వాడాల్సి ఉంటుందని చెప్పాడు, రేపు డాక్టర్ దగ్గరకు వెళ్దాం అన్నాడు నారాయణ”.

****

విశ్వం ను తీసుకోని శారద, నారాయణలు ఆసుపత్రి కి చేరుకున్నారు, అక్కడ వున్న బోర్డు పై డాక్టర్ అవినాష్, మానసిక వైద్యనిపుణుడు & హిప్నాటిస్ట్ అని చదివిన శారద,” హిప్నాటిస్ట్ అంటే ఏమిటి? అని భర్త ను ప్రశ్నించింది శారద!”

“హిప్నాటిజం ద్వారా వ్యాధులను నయం చేసే పద్దతిని జర్మన్ దేశస్థుడైన 'ఫెడరిక్ ఆంటోన్ మెస్మర్' కనిపెట్టాడు. అందుకనే దీన్ని 'మెస్మరిజం' అని కూడా అంటారు, తన కంఠస్వరం ద్వారా ఎదుటివారిని నిద్రపుచ్చి అతను నిద్రలోవున్న స్థితిలో అతని మనస్సుపై ప్రభావాన్ని కలుగజేసి, వారి మనస్సులపైన, శరీరంపైన వారికే నియంత్రణ కోల్పోయేటట్లు తన కంఠంద్వార చేయడమే హిప్నాటైజ్, హిప్నాటైజ్ చేయబడిన వ్యక్తి తనమనస్సుపై ఎలాంటి నియంత్రణను కలిగి ఉండడు, అతను ఒక యంత్రంవలె మరొక వ్యక్తి యొక్క ఆదేశాలను మాత్రమే పాటిస్తాడు, తనలో చెలరేగుతున్న భావాలను, తనకు సంబందించిన విషయాలను తనకు తెలియకుండనే అన్ని విషయాలను హిప్నాటిస్ట్ కు చెప్తాడు, తాను వారి శారీరక, మానసిక వ్యాధులను నయం చేయడానికి 'హిప్నోథెరఫీ' ద్వార నయం చేస్తాడు”, అని శారద కేసి చూసాడు నారాయణ”.

అరగంట వేచిచుసాక తమ సీరియల్ నంబర్ రావడంతో విశ్వం ను తీసుకోని డాక్టర్ గారి ఛాంబర్ లోకి అడుగుపెట్టారు నారాయణ దంపతులు, “రండి నారాయణ గారు రండి, అసిస్టెంట్ వ్రాసియిచ్చిన ప్రిస్కిప్షన్ చూసి ఏంటి బాబు సమస్య అని ప్రశ్నించాడు డాక్టర్ అవినాష్”.

“బాబు నిద్రలో కలవరిస్తువుండగా, ఏదేదో కలవరిస్తున్నాడు, మేము రికార్డ్ చేసిన మాటలు వినండి సార్ అని మొబైల్ ఆన్ చేసాడు నారాయణ”,

నా పేరు విశ్వాస్, నాది ఖమ్మం జిల్లా నెలకొండపల్లి గ్రామం కదా! నేను ఇక్కడ వున్నాను ఏమిటి? నన్ను విశ్వం అని పిలుస్తున్నారు ఎందుకు?…….

అదే రికార్డ్ రెండుసార్లు డాక్టర్ విన్నాక, రికార్డింగ్ ఆపుచేసి “ఈమాట ప్రతి రోజు నిద్రపోయాక పదేపదే పలవరిస్తున్నాడు సార్, నాలుగు రోజులుగా ఇదే తంతు , మాకు భయం వేసి వచ్చాము సార్ అన్నాడు నారాయణ”.

“నేను బాబుతో పర్సనల్ గా, మాట్లాడుతాను అవసరం అయితే తనని హిప్నటైజ్ చేసి కనుక్కుంటాను, మీరు బాబును నా వద్ద వదిలేసి కాసేపు బయట కూర్చోండి అని చెప్పాడు డాక్టర్”.

***

విశ్వంను హస్పిటల్ బెడ్ పై పడుకోబెట్టి, “విశ్వం నావైపుచూడు, నీకు నిద్రవస్తుంది, గాఢనిద్రలోకి వెళుతున్నావ్, గాఢనిద్రలోకి వెళుతున్నావ్, అని పది నిముషాలు ప్రయత్నించాకా గాఢనిద్రలోకి జారుకున్నాడు విశ్వం, నా మాట విన్పిస్తుందా అన్నాడు డాక్టర్”, “హు హు అన్నాడు విశ్వం”.

“నీపేరు ఏమిటి అని ప్రశ్నించాడు డాక్టర్”, ‘ నాపేరు విశ్వం, కాదు కాదు విశ్వాస్ అన్నాడు విశ్వం”.

అదేంటీ? రెండు పేర్లు చెపుతున్నావ్, నీ పేరు విశ్వం కదా! విశ్వాస్ అంటున్నావ్ ఏంటి ? విశ్వాస్ గూర్చి నీకు ఏం తెలుసు, నీకు తెలిసింది అంతా చెప్పుఅన్నాడు డాక్టర్”.

“విశ్వాస్, విశ్వాస్ నేనే విశ్వాస్, నేను.. నేను చనిపోయాను, లేదు, లేదు పదిహేను సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకున్నాను.... ఏడ్పు గొంతుతో అన్నాడు విశ్వం”.

“సరే నీ పేరు విశ్వాస్ మరి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నావు, ఆత్మహత్య చేసుకోవాల్సిన ఇబ్బంది ఏమిటి? ఆ అవసరం ఏమొచ్చింది? నీకు తెలిసిన ప్రతివిషయం చెప్పు!, ఇటివంటి కేసు మరిఎప్పుడు తారసపడక పోవడంతో ఉత్సాహకత నిండిన కంఠం తో అన్నాడు డాక్టర్"

"మానాన్నగారి పేరు సూర్యనారాయణ, అమ్మ పేరు జానకి, చెల్లెలు పేరు వెన్నెల, నేనంటే మా ఇంటిలో అందరికి ఎంతో ప్రేమ, నాన్నకు అయితే మరిఎక్కువ, నన్ను ఎవరు ఎమన్నా తాను వారితో దెబ్బలాడేవాడు, నాన్న అడ్తి వ్యాపారం చేసేవాడు, అమ్మ గృహణి, చెల్లెలు అంటే నాకు ప్రాణం, తాను ఎలావుందో ఇప్పుడు, వెళ్లి చూడాలనిపిస్తుంది అని ఏడవసాగాడు విశ్వాస్".

"విశ్వాస్ ఏడ్వొద్దు నేను నిన్ను మీ చెల్లెలు దగ్గరకు, మీ అమ్మానాన్న దగ్గరకు తీసుకువెళతాను కదా, ఇంకా చెప్పు ఏంజరిగింది? అని ఆతృతగా ప్రశ్నించాడు డాక్టర్".

పిడికిలి బిగుస్తుండగా "అమూల్య" "అమూల్య" తాను... తాను నా లవర్ నేను డిగ్రీ పైనల్ ఇయర్ లో ఉండగా తాను మా కాలేజీలో డిగ్రీ రెండవ సంవత్సరంలో చేరింది, తాను పసిమి చాయతో గుండ్రటి మోహంతో, చక్కని పలువరుసతో, ఒక్కసారి చూస్తే మళ్లీ, మళ్ళీ తిరిగి చూడాలనిపించే అందం తనది, నేను చిన్నప్పటి నుండి ప్రతి క్లాస్ లో ఫస్ట్ వచ్చేవాడిని, తానే నన్ను పరిచయం చేసుకుంది, తాను మ్యాథ్స్ లో వీక్, నేను కాళీగా వున్నపుడు లెక్కలు చెప్పించుకునేది, అప్పుడప్పుడు బయట తిరిగేవాళ్ళం, సినిమాలకు, షికార్లకు కూడా వెళ్లేవాళ్లం, ఒకరోజు మేము పార్క్ లో కూర్చున్నాక ప్రేమిస్తున్నావా నన్ను విశ్వాస్ అంది అమూల్య”.

“ ప్రతి క్షణం నీ వెంటే ఉండాలనిపిస్తుంది, ఎప్పుడు నిన్ను చూస్తూ వుండాలనిపిస్తుంది, అలాగే నిన్ను చూస్తూనే నీవొడిలో చనిపోవాలని పిస్తుంది, ఇది ప్రేమేనా? ఏమో నాకు తెలియదు అన్నాను నేను”.

‘ఛ ..ఆలా అనకు నీవంటే నాకు ప్రాణం, నీవులేకుండా నేను లేనురా అంటూ నన్ను దగ్గరకు తీసుకోని పెదాలపై గాఢంగా ముద్దుపెట్టుకుంది అమూల్య, ఆనాటి నుండి నాకు ఎప్పుడు అమూల్య ధ్యాసే కన్నుమూసిన తెరిచినా తానే కనిపించేది, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి, కాలేజి కి సెలవులు ఇచ్చారు, తనని వదలలేక వదలలేక వారి వూరు బస్సు ఎక్కించాను.

డిగ్రీ రిజల్ట్ వచ్చాయి, నేను అతితక్కువ మార్కులతో పాస్ అయ్యాను, నాకు ఎందులోను పీజీ సీట్ రాలేదు, కాలేజీ దగ్గరలో కంప్యూటర్ కోర్సులో జైన్ అయినాను, అమూల్యను చూడకుండా ఉండలేక తనని చూడడానికి ప్రతి రోజు తాను వచ్చే సమయానికి బస్ స్టాప్ లో ఉండేవాడిని, తనతో మాట్లాడాలని ఎంతగా ప్రయత్నించినా, నాతో మాట్లాడేది కాదు, ఆరునెలలు గడిచిపోయాయి, దయచేసి ఒక్కసారి పార్క్ కు రా నీతోమాట్లాడాలి మల్లి ఎప్పుడు కలవడానికి ప్రయతించను అని బ్రతిమాలుకుంటే తాను ఆరోజు పార్కు కు వచ్చింది, తాను రాగానే నేను I Love you అని చెప్పాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎప్పుడైనా చెప్పనా ? అని చాచి నా చెంప పై ఒక్కటి కొట్టింది. ఎప్పుడు ఎవరితోను దెబ్బ పడని నేను చెంప దెబ్బ తినేసరికి కండ్లలో నీళ్లు ఉవ్వెత్తున వచ్చాయి, జల, జలా కారుతున్న ఆ కన్నీటిని తుడుచుకోకుండానే అక్కడి నుండి వేగంగా వచ్చాను.

ఆ తరువాత తెలిసింది తాను మరొకరితో తిరుగుతుందని, చాలా సార్లు వారిని చూసాను , వారిని ఏమనలేక నాలో నేనే కుమిలిపోయాను, నన్ను మోసం చేసినతనని చంపేద్దామన్నంత కోపం వచ్చింది .... కాని నా ప్రేమలో నిజాయితీ అందుకు ఒప్పుకోలేదు, తాను ఎక్కడ వున్నా బావుంటేచాలు అనుకున్నాను, తనని చూడకుండా ఉండలేను, చాటుమాటుగా చూస్తూ ఉండేవాడిని, కాని ఎన్నాళ్ళని ఇలా ఉండను, ఇక భరించలేను అందుకే, ఈ భూమి మీద నుండి సెలవు తీసుకుందామని నిశ్చయించు కున్నాను అందుకే నాన్నకు ఉత్తరం వ్రాయడం ప్రారంభించాను.

ప్రియాతి ప్రియమైన నాన్నగారికి, మీ పాద పద్మమములకు మీ విశ్వాస్ నమస్కరించి వ్రాయునది,

నాన్న వెళుతున్న, జీవితంలో ఓడి పోయాను, నాకు మిమ్మల్ని విడిచి వెళ్లాలని లేదు, కాని వెళ్ళాలి, అమ్మను జాగ్రత్తగా చూసుకో, తనకి ఆరోగ్యం బావుండదు, తాను ఎక్కువగా మనగూర్చి ఆలోచిస్తూ తన ఆరోగ్యాన్ని పట్టించుకోదు, నేను లేను అని దిగులు చెందకండి, ఎల్లప్పుడూ మీ చిరునవ్వులో నేను ఉంటాను, ఏనాడు ఒక్క చిన్న దెబ్బకుడా తినలేదు మీతో కాని, కానీ నాన్న.....చెప్పడానికే నాకు సిగ్గుగా ఉంది, నేను వెళుతున్నానని ఏడ్వకు నాన్న నీవు చాలా ధైర్యవంతుడవు, అందుకే నీకే ఉత్తరం వ్రాస్తున్నా.…

నాన్న నాకు చావాలని లేదు నాన్న... నాకు నాకు మీతోనే ఉండాలని ఉంది నాన్న...నాకు బ్రతకాలని ఉంది నాన్న, కాని కానీ నన్ను మోసం చేసింది నాన్న......నన్ను చేసుకోవడం వాళ్ళ అమ్మనాన్నకు ఇష్టం లేదంటే, నాకు బాకీలేదు, నా బ్రతుకు ఇంతేలే అనుకుంటును, కాని నాన్న మనకంటే డబ్బున్న వాడితో తిరుగుతుంది, తాను వాడినే పెళ్ళి చేసుకుందట, నాన్న తట్టుకోలేక పోతున్న...తనని ఏమనొద్దు .…”అది అది అంటే నాకు పిచ్చిప్రేమ మీ...మీ కంటే కూడా”,...మీరు ప్రాణం పోసారు," అది అది వేరేవాడితో తిరుగుతూ నా ప్రాణం లాగేసుకుంటుంది" నాన్న....మళ్ళీ జన్మంటూ ఉంటే....వద్దోద్దు మరో జన్మవద్దు, దాని మాటలతో, తన చేతలతో పది జన్మలకు సరిపడ నరకాన్ని చూపింది, వందల సార్లు అన్నం సహించక అర్ధాకలితో పస్తులున్నానో….నాకే తెలియదు నాన్న, ఇక భరించలేను నాన్న, నిత్యం ఏడవలేక పోతున్న…..నేను పెట్టుకున్న దిండును అడిగితే చెపుతుంది నాన్న, కన్నీళ్లతో దాన్ని ఎన్నివేలసార్లు తడిపేసానో.… నాన్న నాన్న, అతి త్వరగా నన్ను మరిచిపోండి, నేను పుట్టలేదని భావించి సంతోషంగా వుండండి, ఎప్పుడు నాకోసం ఏడ్వొద్దు, నేను వుండి మిమ్మల్ని బాధపెట్టలేను, అందుకే కానరాని తీరాలకు వెళుతున్నా, ఈ అన్నయ్యను క్షమించమని చెల్లెలికి చెప్పండి, నా బంగారు తల్లి వెన్నెలని ఎడ్వకుండా చూసుకోండి మంచి ఉద్యోగం ఉన్న అతనికి ఇచ్చి పెళ్లిచేయండి నాన్న, ఈఅసమర్ధుని కన్నందుకు బాధపడోద్దని, క్షమించమన్నానని అమ్మకు చెప్పండి నాన్న, ఎప్పటిలా నన్ను దగ్గరకు తీసుకోని చివరిసారి నా నుదిటి పై ముద్దుపెట్టండి నాన్న, ఈ అసమర్ధుణ్ణి క్షమించు నాన్న, ఇక సెలవ్ నాన్న………ఆలా వుత్తరం వ్రాసి ఉరి వేసుకొని చనిపోయాను. …..

‘మా అమ్మనాన్నలను చూడాలి, చెల్లెలు అమూల్య ఎలా ఉందొ, నేను లేకున్నా వారు సంతోషంగా వుండే వుంటారు, నేను వుండి వారిని బాధ పెట్టలేక చనిపోయాను….అని వెక్కి వెక్కి ఏడ్వసాగాడు విశ్వాస్’. ……

“విశ్వం... విశ్వం నేను చెప్పేది వినిపిస్తుందా అని పిలిచాడు డాక్టర్, హుఁ హుఁ అని బదులిచ్చాడు విశ్వం. నీ పేరు విశ్వం, నీవు విశ్వాస్ గూర్చి చెప్పింది అంతా అబద్దం నీవు విశ్వాస్ గూర్చి చెప్పింది ఒక కథ అది నీకు ఎవరో చెప్పారు అంతే, దాన్ని మరిచిపో అది నీకథ కాదు….. నీ కథ కాదు నీవు విశ్వానివి, మీ నాన్న గారి పేరు నారాయణ, మీ అమ్మ పేరు శారద, నీవు ఒక్కడివే కుమారునివి, నీ పేరు విశ్వం అర్ధం అయ్యిందా విశ్వం అని తన మాటల ద్వార అతనికి మనస్సులో గత జన్మ జ్ఞాపకాలను తుడిచివేసే ప్రయత్నం చేసాడు డాక్టర్”.

“విశ్వం ఇప్పుడు చెప్పు? మీ అమ్మ నాన్నల పేర్లు ఏంటి చెప్పు? అని ప్రశ్నించాడు డాక్టర్’, మా అమ్మ పేరు శారద, నాన్న గారి పేరు నారాయణ అని బదులిచ్చాడు విశ్వం’, వెరీ గుడ్ విశ్వం, నెమ్మదిగా కళ్ళు తెరువు, నెమ్మదిగా కళ్ళు తెరువు అని కమాండ్ చెప్తూ తనని నిద్ర నుండి మేలుకొనేలా చేసాడు డాక్టర్’.

టేబుల్ పై వున్న బజర్ మ్రోగించాడు డాక్టర్, డోర్ తీసుకోని నర్స్ రాగ బయట వున్న “ఈ అబ్బాయి తల్లిదండ్రులను పిలువు అని చెప్పాడు డాక్టర్”, అలాగే సార్ అని బయటకు వెళ్లి శారదా, నారాయణ లను పంపించింది నర్స్.

“సార్ అని ఆతృతగా డాక్టర్ కేసి చూస్తూ డాక్టర్ ఎదురుగా వున్న కుర్చీలో కూర్చున్నాడు నారాయణ”, బాబు ను తీసుకొని బయట కూర్చోమ్మ అని శారద కు చెప్పాడు డాక్టర్”. బాబును తీసుకోని శారద బయటికి వెళ్ళాక, నారాయణ గారు మీ విశ్వం ఎవరో చెప్పగా విన్న గతజన్మ కథను తానుగా ఊహించుకొని ఆలా నిద్రలో కలవరిస్తున్నాడు, తనకి మళ్లీ నిద్రలో కలవరించినా, ఆ విషయాన్ని మళ్ళీ విశ్వానికి గుర్తు చేయొద్దు, పదిహేను రోజులకోమారు మీ బాబును తీసుకరండి, హిప్నాటైస్ చేసి మళ్ళీ ఆవిషయం గుర్తురాకుండా చేస్తాను, ఈ టాబ్లెట్స్ ను రెగ్యులర్ గా వాడండి అని ప్రిస్కిప్షన్ వ్రాసి ఇచ్చాడు డాక్టర్.

విశ్వం తల్లిదండ్రులు వెళ్లి పోయాక, పరిపరి విధాలుగా ఆలోచించిస్తున్నాడు డాక్టర్ అవినాష్, అసలు గత జన్మ వుందా! అబ్బాయి చెప్పిన దాని ప్రకారం చుస్తే గత జన్మ జ్ఞాపకాలే అనిపిస్తున్నాయి, ఏది నిజమో ఏది అబద్దమో నిజం చెప్పలేని పరిస్థితిలో విశ్వం తల్లిదండ్రులకు విశ్వం యొక్క గతజన్మ జ్ఞాపకాలని చెప్పలేక నోటికి వచ్చిన అబద్దం చెప్పి పంపాడు డాక్టర్, గతజన్మ అని చెపితే ఆ అబ్బాయి గతజన్మగూర్చి తెలుసుకోవాలని అనుకుంటాడు, గతజన్మలో విశ్వం తన కుటుంబం గూర్చి తెలుసుకోవాలని ప్రయత్నం చేయవచ్చు ఆ కుటుంబ గనుక బాగాలేక పోతే విశ్వం మానసిక పరిస్థితి దెబ్బ తినే అవకాశం వుంది, నిజాన్ని దాచడం వల్ల విశ్వం, విశ్వం కుటుంబానికి మేలే జరుగుతుంది అనుకుంటూ ఏది ఏమైనా విశ్వం చెప్పిన ఆనవాళ్ల ప్రకారం అతని కుటుంబం గూర్చి తెలుసుకోవాలని, తాను ఇంటర్ నేషనల్ జర్నల్ కు వ్రాసే వ్యాసానికి ఇది బాగ పనికి వస్తుంది అని బలంగా నిర్ణయించుకొని ఇంటికి బయలుదేరాడు డాక్టర్ అవినాష్.

****

డాక్టర్ అవినాష్ కారులో కూర్చున్నాక, కారును కదిలిస్తూ "సార్ నేలకొండపల్లి లో ఎక్కడికి వెళ్ళాలి అని ప్రశ్నించాడు కారు డ్రైవర్," "నేను కాలేజి లో చదువుకునే టప్పుడు విశ్వాస్ అనే ఫ్రెండ్ నెలకొండపల్లిలో ఉండేవాడు, అతని నాన్నగారి పేరు సూర్యనారాయణ వాళ్ళ అమ్మగారి పేరు శారద నీకు తెలుసా? అని ప్రశ్నించాడు డాక్టర్",

“నేను విశ్వాస్ తో ఇంటర్ వరకు కలిసి చదువుకున్నాను సార్, నాకు అంత క్లోజ్ కాకపోయినా నాకు తాను తెలుసు, పాపం ఎవరో అమ్మాయి మోసం చేసిందని తాను ఉరి వేసుకొని చనిపోయాడు, బాగ బ్రతికిన కుటుంబం, వాళ్ళ నాన్న అడ్తి వ్యాపారం చేసేవాడు, విశ్వాస్ చనిపోయాక దినకర్మరోజు హిందూ సంప్రదాయం ప్రకారం విశ్వాస్ నాన్న సూర్యనారాయణ గుండెలు అవిసేలాఏడుస్తూ, విశ్వాస్ యొక్క ఎముకలు తీస్తుండగా అక్కడే గుండెనొప్పితో విల,విలలాడుతూ విశ్వాస్ ను కాల్చి, బూడిద చేసినస్థలంలోనే మరణించాడుసార్” అంటూ కారు కు ఎదురుగా పశువులు అడ్డు రావడంతో సడన్ బ్రేక్ తో కారు ఆపాడు డ్రైవర్”,

ఆ అని నోరు తెరిచి, "ఆ ఆ.. తరువాత ఏమైంది అని ఆతృతను అణుచుకోలేక ప్రశ్నిచాడు డాక్టర్" కారును నెమ్మిదిగా నడుపుతూ “సూర్యనారాయణ భాగస్వాములు వ్యాపారంలో మోసం చేసారు, ఆఖరికి వారు ఉంటున్న ఇంటిని సైతం వదలలేదు, ఇంటిని స్వాధీన చేసుకొని ఆ కుటుంబాన్ని బయటికి గెంటివేసారు దుర్మార్గులు, చేతికి వస్తాడనుకున్న కొడుకు, భర్త పది రోజుల తేడాతో మరణించడంతో విశ్వాస్ తల్లి పిచ్చిది అయ్యింది, తాను ఏం మాట్లాడదు, మౌనంగా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది, కొడుకు, భర్త వస్తారని ఎప్పుడు వాకిట్లో కూర్చొని చూస్తూ ఉంటుంది, అన్నంతిను అని ఎంత చెప్పినా తినదు, భర్త కొడుకు వచ్చాక తింటాను అంటుంది, బలవంతంగా కొన్ని పాలు త్రాగుతుంది తప్పా, ఇప్పటివరకు ఒక్క మెతుకు ముట్టలేదు ఆ పిచ్చి తల్లి అని నిట్టూర్చాడు డ్రైవర్.”

“ విశ్వాస్ కు ఒక చెల్లెలు ఉండాలి కదా తాను ఎక్కడ వుంది అని ప్రశ్నించాడు డాక్టర్”, “

“అవునవును విశ్వాస్ చెల్లెలు పేరు వెన్నెల, పేరు తగ్గ అందం తనది, చాల మంచి అమ్మాయి, తల్లి పిచ్చిదై పోయింది, దగ్గరి వారు ఎవ్వరు చేరదీయలేదు, ఓ భూస్వామి దయతలిచి గొడ్ల చావడి ఇవ్వగా అందులో ఉండేవారు, ఏం చేయాలో తెలియని పరిస్ధితిలో పొట్ట నింపుకోవడానికి తాను ప్రక్కనే వున్న ఖమ్మంలోని పత్తి మిల్లులోకి పనికి వెళ్లేది, తల్లిబిడ్డలు ఇద్దరు చిక్కిశల్యమై పోయారు, వెన్నెల నాన్న వున్నపుడు కాళ్లు క్రింద పెట్టకుండా ఎంతో గారాభంగా పెంచాడు తనని, ప్రతి ఒక్కరు తనని ఆదో రకంగా చూసేవారు, వారి మాటలు వినలేక ఒక్కొక్కసారి పనికి వెళ్ళేది కాదు, "విశ్వాస్ చనిపోకపోతే వారి పరిస్థితి ఎంతో ఉన్నతంగా ఉండేది," వాడు చనిపోయి అందరి జీవితాలను నట్టింట్లో ముంచాడు, ఒకరోజు మా బావమరిది తాను ఆటో నడుపుతాడు వాడు వెన్నెలను కట్నం లేకుండా పెళ్లి చేసుకంటా అన్నాడు, నాకు సంతోషం వేసింది, వెంటనే నా భార్యను తీసుకువెళ్లి వెన్నెలతో మాట్లాడాను, గత్యంతరం లేక శీనుగాడిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంది వెన్నెల , ఏ గొప్పింటికో కోడలు అయ్యేపిల్ల మా ఆటో సీను గాడికి పెళ్ళాం అయ్యింది సార్ అన్నాడు డ్రైవర్”.

‘”అవును నీ పేరు ఏంటి? డ్రైవర్ ను వుద్దేశించి ప్రశ్నించాడు డాక్టర్’, నా పేరు కుమార్ అని బదులిచ్చాడా డ్రైవర్.

నాపేరు అవినాష్, నేను డాక్టర్ ను మాది హైదరాబాద్, వెన్నెలను మీ బామ్మర్దికి ఇచ్చి మంచి పనిచేసావ్, లేకపోతే ఆ అమ్మాయి ఎన్నో ఇబ్బందులు పడేది, "బావుంటే ఏడుస్తారు, చెడితే నవ్వుతారు, ఈ లోకంతీరే అంతా" సరే కానీ మీ బావమరిది ఇంటికి తీసుకవెళ్ళు నేను వాళ్ళని ఒకసారి చూడాలి అన్నాడు డాక్టర్, సరే సార్ అని కారు నడపడంలో నిమగ్నం అయ్యాడు డ్రైవర్.

****

‘సార్ సార్ అని గట్టిగా పిలిచాడు డ్రైవర్’, ఎదో ఆలోచనలో వుండి కళ్ళు మూసుకున్న అవినాష్ ఆ.. అని కళ్ళు తెరిచాడు, ‘సార్ మా బామ్మర్ది ఇంటికి వచ్చాము, దిగండి సార్ అన్నాడు డ్రైవర్’,

కారు శబ్దం కావడం తో గుడిసెలోనుండి బయటికి వస్తూ, ఏం బావ టౌన్ కి వెళ్లలేదా అంటూ కారు లో నుండి క్రిందికి దిగుతున్న వ్యక్తి ని చూసి ప్రశ్నార్ధకంగా కుమార్ కేస్ చూసాడు శీను,

“ఈ సార్ పేరు అవినాష్ తాను హైద్రాబాద్ నుండి వస్తున్నాడు, మీ బామ్మర్ది విశ్వాస్ కు ఫ్రెండ్ అంట, ఇతడే సార్ మా బామ్మర్ది శీను అని పరిచయం చేసాడు కుమార్”, నమస్తే సార్ రండి రండి అని గుడిసెలోకి వెళ్లి వరండాలో కుర్చీలు వేసాడు శీను, అందరు కూర్చున్నాక వెన్నెలా, కుమార్ బావ వచ్చాడు మంచి నీళ్లు పట్రా అని కేకేసాడు శ్రీను, స్టీల్ చెంబులో మంచి నీళ్లు పట్టుక వచ్చి శీనుకు ఇచ్చి ఎవరా అన్నట్లు ప్రశ్నార్ధకంగా చూసింది వెన్నెల, సార్ పేరు అవినాష్ తాను డాక్టర్, మీఅన్నయ్య విశ్వాస్ కు ఫ్రెండ్ అంటా అని పరిచయం చేసాడు కుమార్, వెంటనే కొంగును మెడమీదుగా కప్పుకుంటూ రెండు చేతులు జోడించి నమస్కరించింది, ఒక్కసారి వెన్నెల కేసి చూసాడు డాక్టర్, తెల్లని శరీరచ్చాయ, గుండ్రని మోహం, కాస్త బక్కచిక్కినట్లుగా వుండి, వెలిసిపోయిన నేత చీర కట్టుకొని వుంది, మెడలో పసుపు త్రాడును చూసి అయ్యో కనీసం వీసం ఎత్తు బంగారం కూడా లేదు అనుకుంటు ప్రతి నమస్కారం చేసాడు డాక్టర్.’

విశ్వాస్ అనే పేరు వినగానే లోపల కూర్చొని ఏడుస్తున్న జానకి పరుగెత్తుకుంటూ వచ్చి ఎక్కడ? విశ్వాస్ వచ్చాడా? కొడుకు ఎప్పుడు తిన్నాడో ఏమో అంటూ బక్కచిక్కిన శరీరంతో పరుగెత్తుక వచ్చింది జానకి, నేను, నేను విశ్వాస్ ప్రెండ్ ను అమ్మ అని అన్నాడు డాక్టర్, ఏడి నా బిడ్డ ఏడి? నీ ఫ్రెండా నిన్నెపుడు చూళ్ళే, మా వాడికి నిండా 22 సంవత్సరాలు కూడా లేవు, నీకు ఫ్రెండ్ ఎలా అవుతాడు అని ప్రశార్ధకంగా చూస్తూ డాక్టర్ చేతులను ఆప్యాయముగా తడుముతూ చూసింది జానకి, కండ్లలో నీరు ఒలుకుతుండగా విశ్వాస్ మా తమ్ముని ఫ్రెండ్ మరి నాకు కూడా ఫ్రెండ్ కదా! అమ్మఅని తాను లేచి జానకి ని కుర్చీలో కూర్చో బెట్టాడు డాక్టర్, నాకొడుకు ఎలా వున్నాడు ఎన్నాళ్ళు అయ్యిందో వాడిని చూసి ఒక్కసారి వాడిని చూడాలని వుంది, అయ్యో మాఆయన ఇంకా రాలేదు, కొడుకు ను తీసుకవస్తానని వెళ్ళాడు ఇంకా రాలేదు అని ఏడ్వసాగింది జానకి,

జానకి తలపై చేతులు వేసి దగ్గరకు తీసుకొని కొద్ధి సేపు ఏడ్వనిచ్చి, నేను విశ్వాస్ ను తీసుకవస్తాను కదా! అమ్మా అని అనునహిస్తూ జానకి పల్స్ చెక్ చేసి, కనురెప్పలను చూసి పాకెట్ లో వున్న కాగితం తీసి మందులు వ్రాసి ఈ మందులు వాడించండి, కాగితంతీసి శీనుకు ఇచ్చి, ఈ మందులు అయిపోయాక ఖమ్మంలో నా ఫ్రెండ్ డాక్టర్ రాము ఉన్నాడు తనకి చూపించండి, తాను ఉచితంగా మందులు ఇస్తాడు నేను తనకి చెప్తాను, ఇదిగోండి నా మొబైల్ నంబర్ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి అని విజిటింగ్ కార్డు ఇచ్చి , పర్స్ లో నుండి చేతికి వచ్చిన డబ్బులను తీసి శీను చేతిలో పెట్టాడు డాక్టర్,

“డబ్బులు వద్దు సార్, అన్నయ్య, నాన్నగారు పోయాక ఇంత ఆప్యాయంగా వచ్చి మాట్లాడిన వారు లేరు, మీరు రావడమే గొప్ప అదిచాలు సార్, అని కండ్లలో నీరు తిరుగుతుండగా అంది వెన్నెల, అదేంటి అమ్మ, నేను నీ అన్నయ్యనే అనుకోరా అని కంటినుండివస్తున్న నీటిని కర్చీఫ్ తో తుడుచుకుంటూ కారెక్కి కూర్చున్నాడు అవినాష్, కారును ముందుకు కదిలించాడు కుమార్.

కారు వేగంగా వెళుతుండగా, “విశ్వాస్ ప్రేమించిన అమూల్య ఎక్కడ వుంది, తాను ఎవరిని పెళ్లి చేసుకుంది తాను క్షేమంగా, సంతోషంగా వుందా ? అని ప్రశ్నించాడు డాక్టర్,"

'తాను ఎవరినైతే ప్రేమిస్తున్నాఅని విశ్వాస్ ను తిరస్కరించిందో వాడు తనని మోసం చేసాడట, ఇక మింగలేక కక్కలేక తల్లిదండ్రులు చెప్పిన సంబంధం చేసుకుంది, తన పరిస్థితి కూడా బాలేదని రెంటికి చెడిన రేవడిలా అయ్యిందని ఆమె ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటే విన్నాను సార్ అన్నాడు కుమార్"

తాను లేకపోయినా తన కుటుంబం బావుంటుందని, అమూల్యను ప్రేమించి మోసపోయి తాను ఆత్మహత్య చేసుకొని విశ్వాస్ ఎంత తెలివి తక్కువ పనిచేసాడు, తాను ఒక్కడు చనిపోతే ఏమవుతుంది? మాఅంటే పదిరోజులు ఏడ్చి మరిచిపోతారు అనుకున్నాడు, విశ్వాస్ ఒక్కడి చావు మొత్తం కుటుంబాన్ని చిన్నాభిన్నంచేసి, కుటుంబాన్నినాశనం చేసింది, తండ్రి చనిపోయాడు, వ్యాపారంలో నమ్మిన స్నేహితులు, బంధువులు మోసం చేసారు, తల్లి పిచ్చిది అయ్యింది, నా అనుకునే వారు ఎవ్వరు చేరదీయలేదు, చెల్లెలు అతి పేదరికంలో మగ్గుతుంది, దీనికంతటికి కారణం ఎవరు ? ప్రేమలో మోసంచేసిన అమూల్యదా ? తెలివి తక్కువగా అలోచించి ఆత్మహత్య చేసుకున్న విశ్వాస్ దా ? అన్ని విషయాలలో విశ్వాస్ కుటుంబానికి వ్యతిరేకంగా పని చేసిన విధిదా? ఒక బలవంతపు చావు ఎందరి జీవితాలను ఎలా నాశనం చేస్తుందో, ఆత్మ హత్య చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి విశ్వాస్ కుటుంబం గూర్చి చెప్పాలని, “విశ్వాస్ చావు ఎందరికో గుణపాఠం లాంటిది అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు డాక్టర్.

*****

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.