అతను ఎవరు.... - hemavathi bobbu

Atanu Evaru
ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే కారణం అతనే. అతన్ని మరవడమంటే నన్ను నేను మరవడమే.
అతను నా జీవితములోని ప్రతి మలుపులో నేనున్నానంటూ నన్ను ఆదుకున్నాడు. పాపాయి గా ఉన్నప్పుడు అన్నం తిననని మారాం చేస్తుంటే, నాకు ఎన్నో కథలని చెప్పి నన్ను తన భుజాలపై ఎక్కించుకుని అటూ ఇటూ తిప్పుతూ నన్ను గారం చేస్తూ నాకు అన్నం తినిపించేవాడు.

ఇద్దరు ఆడపిల్లల తరువాత కొడుకు కోసం ఎదురుచూస్తున్న అమ్మకి నేను పుట్టానని అమ్మ విసుక్కుంటుంటే నేనున్నానంటూ నన్ను జోల పాడి నిద్రపుచ్చేవాడు. తనని నేను ఎలా మరువగలను. బామ్మ నన్ను గడుగ్గాయి నని, అల్లరి పిల్లనని తిడుతుంటే, అతను నన్ను, నా అల్లరిని ఓపిగ్గా భరించేవాడు.

కాలేజీకి పంపడం వద్దు, ఇది ఇంటి మీదకు తెచ్చిన తంపులు చాలు, అక్కడకు వెళ్ళి ఇక మన మీదకు ఏ ముసలాన్ని తెస్తుందో అని అమ్మ అన్నదని అత్త తో చెప్పి ఏడుస్తున్నప్పుడు, అమ్మని ఎదిరించి నన్ను పై చదువులకు పంపిన అతను.

నాకు పెళ్లి సంబందాలు వస్తున్నాయని తెలిసి, మా సీనియర్ డేవిడ్ ని ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పిన రోజు జరిగిన గొడవని నేను మరువగలనా.
నేను కుటుంబ పరువు తీసావని, కులం మతం కాని వానిని ప్రేమించానని నన్ను అమ్మ కొడుతున్న రోజు అతను నాకు బాసటగా నిలిచిన వైనం నేను మరువలేను. తాతని, మా మావయ్యని ఒప్పించి నన్ను డేవిడ్ ని పెళ్ళితో ఒకటి చేసిన అతను.

కాలం పరుగుతో అతన్ని నేను మరచినా నా ప్రతి పుట్టిన రోజు నాడు నాకు మొట్టమొదటి శుభాకాంక్షలు చెప్పే అతను. నా పిల్లల ఎదుగుదలలో నేనున్నానంటూ నాకు సహకరించిన అతను.
నేను తప్ప తనకు వేరొక జీవితమే లేదన్నట్లు, నా వెన్ను తట్టి నన్ను రచయిత్రిగా మలచిన అతను.
అతని ఋణాన్ని నేను ఏ విధంగా తీర్చుకోగలను.

ఈ రోజు ఒంటరిగా ఐ.సి.యు. లో.

ఆ గుండె ఎప్పుడెప్పుడు ఆగిపోదామా అన్నట్లు నెమ్మదిగా కొట్టుకుంటుంటే , నన్ను ఒంటరిని చేయవద్దని ఆ దేవునికి నే చేసిన వేడ్కోలు వినిపించినట్లు కనిపించడం లేదు నాకు.

అతను ఎవరని, నాకు ఏమౌతాడని మీరు అడుగుతున్నరా.

అతను మా నాన్న.......
( నిద్రలేని రాత్రులలో చిన్నారి హితైషి ని తన గుండెలపై జోల పాడి నిద్ర పుచ్చిన సత్యకి )

మరిన్ని కథలు

Vinta acharam
వింత ఆచారం
- తాత మోహనకృష్ణ
Nela paalu
నేల పాలు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Manavatwam
మానవత్వం!
- - బోగా పురుషోత్తం
Mutyalannam
ముత్యాలన్నం
- మద్దూరి నరసింహమూర్తి
Parishkaram
పరిష్కారం
- తాత మోహనకృష్ణ
Apaatradanam
అపాత్రదానం
- Prabhavathi pusapati