రాత్రి మద్యం మత్తులో తన భర్త అనే మృగం చేయ్యి చేసుకున్న ఆనవాళ్ళు ,తన తల్లికి కనిపించకుండా ఉండేందుకు ఫేస్ మేకప్ చేసుకుంది వసంత. యాభై సంవత్సరాల వయస్సులో అనుమానం అనే మాయదారి రోగంతో, నిత్యం వేధించే తన భర్తతో జీవితం సాఫీగా సాగుతుంది, అని నమ్మించే ప్రయత్నం వసంత తల్లిగారిది. ***** నిర్జన ప్రదేశం.తల్లీకూతుళ్లు మధ్యన నిశబ్దం రాజ్యమేలుతోంది. ఏదో అడగాలనే ప్రయత్నం తల్లిగారిది. పెదవి దాటి రానంటుంది. ఏదో తెలుసుకోవాలనే తపన కూతురుకి. కానీ!అడగాలో వద్దో అనే సందేహం వసంతది. ఇరువురి హృదయంల్లో విస్పోటనం.. నిశబ్దంగా కరిగిపోతుంది. నిశబ్దాన్ని చేదిస్తూ వసంత తల్లిగారు కూతుర్ని అడిగింది. "నీ కాపురంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా.." తల్లిలా కాదు,నీ స్నేహితురాలిగా అడుగుతున్నా". దాచుకోకుండా చెపుతావని." "ఎందుకలా అడిగావు!" ఎందుకు నీకా అనుమానం. మీ అల్లుడు చాలా మంచివారు.అనుమానించకండి. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు." "నాన్నా మీరు నిశ్చింతగా ఉండోచ్చు" చెప్పింది వసంత తన తల్లిగారికి. "ఏమీ లేదు... ఎందుకో అలా అడగాలి అనిపించింది ..అంతే, అవునూ! నువ్వు ఎప్పుడూ పేస్ మేకప్ చేయవుకదా!. ఈ రోజు ఏంటి కొత్తగా.! అనుమానంగా అడిగింది వసంత తల్లిగారు వసంతని. "నీకు అన్నీ అనుమానాలే!. రాత్రి యూ ట్యూబ్ లో చూసా! అందుకే ట్రై చేసా. అవునూ! నాన్నా నువ్వు ఎలా ఉంటున్నారు". అడిగింది వసంత తల్లిని. "మీ నాన్నగారు శ్రీరామ చంద్రుడు. నామీద ఈగను కూడా వాలనివ్వడు తెలుసా" జారిపోతున్న పవిట సరిచేసుకుంది వసంత తల్లిగారు. ఎక్కడ తన వీపుపైన తన భర్త చేసిన గాయం కూతురు చూస్తుందో అని. "ఎప్పుడూ కూతురు యోగక్షేమాలు తల్లి మాత్రమే అడగాలా,కూతురు అండగాకూడదా."అంది వసంత. సరే!సరే ఇక వెళ్దామా..! అంటూ లేచింది వసంత తల్లిగారు. "మీ నాన్నగారు వచ్చే టైం అవుతుంది "అంటూ.. "మీ అల్లుడు గారు కూడా వచ్చే టైం అవుతుంది " అంటూ కదిలింది వసంత. ఇద్దరూ విభిన్న ధ్రువాలుగా మారిపోయారు. ***** రాత్రి తన భర్త చెంపలపై కొట్టిన దెబ్బలు కనిపించకుండా ఫేస్ మేకప్ తో సరిచేసాను, అనుకుంది వసంత.తల్లికి తెలిస్తే బాధపడుతుందని. కానీ !ఎప్పుడూ మేకప్ ఇష్టపడని తను మేకప్ వేసి అమ్మకు దొరికి పోయింది ,అనే విషయం గ్రహించలేదు వసంత.. గాలికి తొలిగిన చీర సరిచేసుకుంటుంది. వీపుపై తన భర్త రాత్రి పంటితో చేసిన గాయం కనిపించనీయకుండా చీర భుజాలు చుట్టూ చుట్టుకుంది వసంత తల్లిగారు.. తన బిడ్డ చూడకూడదని. తన కష్టం బిడ్డకు తెలియకూడదని. ఓ తల్లి మనసు ఇది. చూసినా ఆ దెబ్బేంటి అని అడగని సంస్కారం కూతురు వసంతది. ఇదే స్త్రీ మూర్తుల సహనం..ఇదే స్త్రీ ఔన్నత్యం. రాము కోలా.దెందుకూరు. ఖమ్మం.9849001201.✍️