శంభో శంభో శంభో మహాదేవ నా సెల్ల్ఫోన్ మోగుతూనే ఉంది. "ఆ ఫోన్ ఎత్తమ్మ ఎత్తూ" అంది శ్రేయ.
"2 నిముషాలు తల్లీ ,.ఇంట్లోకి వెళ్ళగానే చూద్దాం " అన్నాను. అప్పటికి 10 నిముషాలు నుండి మోగుతూనే ఉంది. ఇన్ని సార్లు ఎవరా అని నాక్కూడా కంగారుగా ఉంది. కాలేజీ నుండి బయలుదేరినపుడు bluetooth పెట్టుకోవడం మరిచిపోయాను. శ్రేయ ని డేకేర్ నుండి పిక్ చేసుకున్న దగ్గర్నుండి మోగుతూనే ఉంది. డ్రైవింగ్ లో ఎందుకు అని ఎత్తకుండా వచ్చేసాం.
ఇంట్లోకి రాగానే ఫోన్ ఎవరా అని చూస్తే స్రవంతి. స్రవంతి ఇన్ని సార్లు చేసింది అంటే పెద్ద కంగారు పడాల్సిన విషయం ఏమి లేదు.. పక్కన వాళ్ళు ఫోన్ ఎత్తే దాక చేస్తూ ఉండటం దానికి అలవాటే. అందుకే ఆ ఫోన్ పక్కన పడేసి శ్రేయకి స్నానం చేయించి స్నాక్స్ పెట్టి నేను కూడా ఫ్రెష్ అయ్యాను. శ్రేయ కి టీవీ లో కార్టూన్ పెట్టి నేను టీ పెట్టుకుని బాల్కనీ లోకి వచ్చాను
ఫోన్ చెయ్యగానే "ఎన్ని సార్లు చెయ్యాలే కీర్తి నీకు ఫోన్ " అని అంది స్రవంతి.
"శ్రేయ ని తీసుకొచ్చే టైం కదా.. నీకు తెలుసు కదే " అన్నా నేను ..
"సర్లే సర్లే , సౌభాగ్య ఆంటీ ఫోన్ చేసారా ? " అని అడిగింది
"చేసారు ఉదయాన్నే .. ఈ ఆదివారం కళ్యాణి కి సీమంతం అంట కదా. ప్రొద్దున్నే వచేయమ్మా శ్రేయని తీస్కుని.. ఇక్కడే ఉందురు అన్నారే .. " అని చెప్పాను ..
"ఔనా , నాకు , అమూల్య కి కూడా చేశారే " అంది
"అయితే మీరు కూడా ప్రొద్దునే ఉంటారుగా అక్కడ " అన్నా నేను.
"లేదు కీతు .. నేను అమ్ము రావడం లేదే " అంది స్రవంతి ..
"అదేంటి? రాకపోవడం ఏంటే ? అసలా అలా ఎలా అనుకున్నారు మీరు? అది కళ్యాణి సీమంతమే .. రాకుండా ఎలా ? " అన్న నేను.
"చాల పెద్ద విషయమే ఉందిలే. శనివారం మాల్ లో కలుద్దాం. ఎదో కొత్త ప్లే సెంటర్ ఓపెన్ చేసారంట.. పిల్లల్ని తీస్కువెళ్దాం .. వాళ్ళు అడ్డుకున్నట్లు ఉంటది. మనం కాసేపు టైం స్పెండ్ చేయచ్చు కూడా " అంది
"సరే " అని పెట్టేసా .
ఫోన్ పెట్టేసి వంట పని మొదలుపెట్టనే కానీ నా మనసు మనసులో లేదు. స్రవంతి ఎందుకు అలా అందా అనే ఆలోచనే.
నేను , కళ్యాణి , స్రవంతి ,అమూల్య నలుగురు అటు ఇటుగా ఒకటే వయసు వాళ్ళం .. అందరికి అటు ఇటుగా ఒకటే వయసు లో ఐంది పెళ్లి .. అప్పటి దాక మాకెవరికి పరిచయం లేదు. కానీ పెళ్లి కాగానే అందరం ఒకటే అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళం .. ముందు కొంచెం మొహమాటంగా మొదలయిన మా స్నేహం నెమ్మదిగా చాలా గట్టిగ మారింది. ఎవరికీ ఏ హెల్ప్ కావాలన్నా చేసుకునేవాళ్లం. అపార్ట్మెంట్ లో ఈవెంట్స్ అన్నిటి లోను మాదే హడావిడి . నేను అమూల్య జాబ్స్ చేస్తాం - నేను గవర్నమెంట్ కాలేజీ లో లెక్చరర్. అమూల్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. స్రవంతి, వాళ్ళ ఆయన వ్యాపారం లో సహాయం చేస్తూ ఉంటుంది. ఇంకా కళ్యాణి boutique రన్ చేస్తుంది.
ఒకళ్ళ తరువాత ఒకళ్ళు పిల్లలు కూడా కన్నాం .. నాకు శ్రేయ. కళ్యాణి కి పాప. స్రవంతి కి ఇద్దరు అబ్బాయిలు .. అమ్ముకి ఇంకా పిల్లలు లేరు. ఇపుడు కళ్యాణి మళ్ళీ ప్రెగ్నన్ట్ .. ఏడో నెల. అదే సీమంతం. సరే శనివారం తేలుతుంది కదా ఎటూ అని పడుకున్న
పిల్లల్ని ఆడుకోవటానికి వదిలిపెట్టి, మేము అక్కడే టేబుల్స్ ఉంటే sandwiches తీస్కుని కూర్చున్నాం.
ఇంకా నేను ఆగలేకపోయాను .. "చెప్పండి ఏమైంది? ఎందుకు సీమంతం కి రావడం లేదు" అని అడిగాను .
నువ్వు చెప్పు అంటే నువ్వు చెప్పు అన్నట్లు స్రవంతి ,అమూల్య ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
"ఎవరో ఒకళ్ళు చెప్పండే బాబు .. టెన్షన్ పెట్టి చంపకండి " అన్నాను.
అమ్ము మొదలుపెట్టింది. "అది కాదు కీతు .. ఇపుడు కళ్యాణి కడుపుతో ఉంది కదా. దానికి బాబు పుట్టాలి అని బాగా కోరికగా ఉంది.
బాబే కావాలని అందరితో చెప్తుంది. డాక్టర్ తో కూడా బాబు పుడితే చాల హ్యాపీ అంది .. అపార్టుమెంట్లో ఎం ఈవెంట్ జరిగినా బాబే కావాలి అని అందరితో చెప్తుంది .. కాలం ఎంత advance అయ్యింది .. ఈ రోజుల్లో బాబు ఏంటి? పాపా ఏంటి? ఎందుకు అలా gender discrimination చెయ్యాలి? ఇంత చదువుకున్నాం మనం .. ఆడదానికి ఆడదే శత్రువు అని ఎందుకు అంటారో ఇప్పుడు అర్ధం ఔతుంది నాకు. ఇంకా బాబు కావాలి అని పట్టుపడితే ఎలా? ఇది తప్పే. healthy baby కావాలి అనుకోవాలి కానీ .. ఎందుకు ఈ డిఫరెన్స్?" ఆవేశంగా చెప్పి ముగించింది అమ్ము.
నేను ఏమి మాట్లాడలేదు. స్రవంతి వైపు చూసాను. "నాది అదే ఒపీనియన్ .. నాదే కాదు అపార్ట్మెంట్ లో అందరిదీ .. అందుకే కళ్యాణి సీమంతం అందరం బాయ్కాట్ చేస్తున్నాం. మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు కదా. ఈ విషయాలేమీ నీకు తెలీవు .. అందుకే అది చెపుదాం అనే ఇవాళ కలుద్దాం అన్నాను. రేపు నువ్వు కూడా వెళ్ళకు. ఏ నీకు మాత్రం పాపా లేదా? శ్రేయ ని పాపా అని తక్కువగా ఏమి చూడవు కదా. నేను లాస్ట్ ఇయర్ రెండో సరి ప్రెగ్నన్ట్ అయినపుడు పాపా కావాలని ఎంత తపించి పోయానో మీకు తెల్సు కదా.. మనం ఇంత అడ్వాన్స్డ్ గా ఉంటే అది ఎప్పుడో వరకట్నం కాలం లో ఆగిపోయింది. ఛా ఇన్నాళ్ల friendship లో అది ఇలా అని మనకు తెలీనే తెలియలేదు .." అంది స్రవంతి కోపం తో కూడిన బాధతో ...
నువ్వేమంటావ్ అన్నట్లు చూసారు ఇద్దరు. నేనేం మాట్లాడలేదు. పిల్లలు ఆడుకుంటున్న వైపు చూస్తూ ఉన్న. బాల్స్ ఉన్న పూల్ లో ఒకళ్ళని ఒకళ్ళు తోసుకుంటూ పడుతూ లేస్తూ ఆడుకుంటున్నారు. బాల్యం ఎంత మధురం అన్పించింది ఆ క్షణం లో .. ఎటువంటి judgements ఉండని కమ్మని బాల్యం.
స్రవంతి ,అమ్ము మాటలు విన్న నాకు , కళ్యాణి రూపం కళ్ళ ముందు కనపడింది. నా గతం గుర్తువచ్చింది. కొద్దిగా వణికాను. అంతలోనే దిటవుపడి , స్థిరమైన కంఠంతో నా మాటలు మొదలుపెట్టాను. "ఇపుడు మీరిద్దరూ కళ్యాణి ఆడదై ఉండి ఆడపిల్ల వద్దు అనుకుంటుంది అనే కదా బాధపడుతున్నారు. మనసు మనసులో లేదంటున్నారు.
మీరు మర్చిపోయారేమో కానీ నేను మర్చిపోలేదు. నా జీవితం కదా. నాకే గుర్తు ఉంటుంది. అయినా మీక్కూడా ఒకసారి గుర్తు చేస్తే కానీ కళ్యాణి ఏంటో మీకు అర్థం కాదు..
5వ నెలలో బాబో పాపో తెల్సుకునే తీరాలి అని ప్రశాంత్ నన్ను వాళ్లకు తెల్సిన డాక్టర్ దగ్గరికి తీస్కుని వెళ్ళాడు కదా. పాపా అని ఆమె తేల్చిచెప్పేసరికి abortion చేస్కుంటావా చేస్కోవా అని రోజు భయంకరంగా హింస పెట్టాడు. అసలు కడుపుతో ఉన్న నన్ను కొట్టని రోజు లేదు. మిమ్మల్ని కలిసినపుడు ఊరుకోవే బాధపడకు అని చెప్పారేకాని , ఎవరైనా ధైర్యం ఇచ్చారా? అది ఇచ్చిందే నాకు ధైర్యం. కడుపు మీద కాలు పెట్టి తన్నడానికి వస్తున్నపుడు దేవతలా వచ్చింది మా ఇంటికి. ప్రశాంత్ మీద సివంగిలా దూకింది. చేతికి ఏది దొరికితే దాని పెట్టి కొట్టి ఆటో మాట్లాడి హాస్పిటల్ కి తీసుకువెళ్ళింది. మా అమ్మ ఇంట్లో దింపి తన 6 నెల్ల పాపని వాళ్ళ అత్తవాళ్ళింట్లో వదిలి రోజు నాతో కనీసం 5-6 గంటలు ఉండి ధైర్యం చెప్పింది. ప్రశాంత్ వాళ్ళ చుట్టాలని తీస్కుని మా అమ్మ వాళ్ళింటికి గొడవకు వస్తే అది తనకు తెల్సిన లాయర్ ని తీసుకువచ్చి పోరాడింది. అమ్మాయి పుడితే నిన్ను వదిలేస్తా అన్న ప్రశాంత్ కి నువ్వెంటి వదిలేసేది? అదే నిన్ను వదిలేస్తుంది .. నీలాంటి నీచుడితో బ్రతికే కర్మ నా స్నేహితురాలికి పట్టలేదు అని డివోర్స్ నోటీసు ఇప్పించింది. నాతో లెక్చరర్ నోటిఫికేషన్ కి అప్లై చేయించి ,మెటీరియల్ తెచ్చిచ్చి, నాకు ఉద్యొగం వచ్చేవరకు పక్కన ఉంది. ఇవాళ నేను శ్రేయ ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే కళ్యాణి కారణం. ఆఖరికి లాస్ట్ ఇయర్ మా కొలీగ్ కిరణ్ నన్ను పెళ్లి చేస్కుంటా అంటే దగ్గరుండి మా అమ్మ వాళ్ళని ఒప్పించింది. ఎందుకు అమ్మ మళ్ళీ పెళ్లి అని మావాళ్లు అంటే ఏ అబ్బాయి అయితే చేస్కొడా? అమ్మాయి అయితే మానెయ్యాలి? ఎందుకు? అని పోట్లాడింది. అది ఆదిపరాశక్తే.
ఇవాళ దానికి బాబు కావాలి అనిపిస్తే అమ్మాయి అంటే ఇష్టం లేనట్టా? అమ్మాయిని చిన్న చూపు చూసినట్లా ? ఎలా అనుకుంటారు మీరు అలా ? స్రవంతి నువ్వు చెప్పు, లాస్ట్ ఇయర్ నువ్ కడుపుతో ఉన్నపుడు అమ్మాయే కావాలని అనుకున్నావ్ కదా ఎందుకు? " అన్నాను.
"నాకు ఆల్రెడీ మొదట అబ్బాయి కదా. అందుకే అమ్మాయి కావాలనుకున్నాను. " అంది
"ఓహో నీకు మొదట అబ్బాయి కాబట్టి అమ్మాయి కావాలనుకున్నావ్. నువ్వు గొప్పదానివి. ఆడజాతిని ఉద్ధరిస్తున్నావ్ .. ఫెమినిస్ట్ వి .. కానీ అది మాత్రం ఫస్ట్ అమ్మాయి పుడితే సెకండ్ అబ్బాయి కావాలని అనుకోకూడదు .. అది ఆడజాతికే ద్రోహం అంటున్నావ్ .. ఎం మాట్లాడుతున్నారో మీకు అర్ధం అవుతుందా ? ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి , తల్లికి ఎవరు కావాలనేది తల్లి ఛాయస్. అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా అని. అమ్మాయి కావాలి అనగానే ఆకాశానికి ఎత్తేయడం, ఎంత ఉన్నత భావాలూ అని పనికిమాలిన పొగడ్తలు. అబ్బాయి కావాలి అనగానే అరే ,అసలా మానవ జాతి నాశనం కావడానికి వాళ్లే కారణం అన్నట్లు చూడటం. ఇది ఎంత వరకు సమంజసం? మీరు చెప్పండి. అసలా మొదటి బిడ్డే అబ్బాయి కావాలని అనుకున్న నేను. నన్ను కూడా తిడ్తారా? మేము ఇద్దరం అక్క చెల్లెళ్ళం. మా కజిన్స్ అందరు ఆడపిల్లలే. అబ్బాయిని కనాలని నాకు కోరిక .. ఒక లక్ష్మి దేవి పుట్టాలని మీరు ఎలా కోరుకున్నారో, ఒక చిన్ని కృష్ణుడు పుట్టాలి అని వేరే వాళ్ళు కోరుకోవచ్చు. అంతమాత్రానికి వాళ్ళు చెడ్డ అవ్వరు, మీరు మంచి అవ్వరు. ఇలాంటి judgements వల్లే సమాజం ఇపుడు సర్వనాశనం అవుతుంది. మీరేమన్న అనుకోండి, నేను కళ్యాణి సీమంతానికి వెళ్లే తీరుతాను.
ఆడజాతికి నేను కళంకం అని మీరు బిరుదు ఇచ్చిన సరే" అన్నా నేను చాలా కోపంగా.
"అమ్మా , నాకు గిఫ్ట్ వచ్చింది చూడు.. " అని అరిచింది శ్రేయ. 1 హౌర్ అయిపోయింది అనమాట. "పద వెళ్దాం " అని శ్రేయతో చెప్పి, "వస్తాను" అని బయల్దేరాను.
"కీతు , లైఫ్స్టైల్ లో మెటర్నిటీ వేర్ బాగుంటుంది అంట, ఒక 2-3 టాప్స్ కొందామా, కల్యాణికి నెలలు నిండాక వేసుకోడానికి హాయిగా ఉంటుంది. రేపు వెళ్ళినపుడు ఇద్దామా? " అంది అమ్ము వెనకాల నుండి. "ఔను అమ్ము, మెటర్నిటీ పిల్లో కూడా తీసుకుందాం, పడుకోడానికి comfortable గా ఉంటుంది. .. పార్లర్ ఆంటీ ని ఈవెనింగ్ 6 కి వచేయమందం, మెహందీ పెట్టిద్దాం కళ్యాణి కి. నువ్వే టైం కి వస్తావ్ కీతు ? " అంది స్రవంతి,
కళ్ళల్లో నీళ్లు కారుతుంటే అలానే చూస్తూ ఏమి మాట్లాడలేదు నేను