లోకం పోకడ - బి.రాజ్యలక్ష్మి

Lokam pokada

పెదవి దాటితే పృథ్వి దాటుతుందన్న నానుడి మన పూర్వికులు యెంత అనుభవం తో చెప్పారో అనిపిస్తుంది .మనం సంఘజీవులం ,నలుగురిలో కలవాల్సిన వాళ్లం ,నలుగురితో నెగ్గుకు రావాల్సిన వాళ్లం .కొందరు అదేపనిగా ప్రతియింటి విషయాలను గాలికన్నా వేగం గా ప్రచారం ,ప్రసారం చేస్తారు అప్పుడే చిక్కులు వస్తాయి .

కామాక్షి అతివేగమైన ప్రసార సాధనం .ఆవిడ కు యేదైనా ఒక యింటి వార్త తెలిస్తే క్షణాల్లో రెండు వీధులవరకు ప్రసారం అవుతుంది .

“సూర్యకాంతం !!విన్నారా యీ విషయం !జానకి గారికి అర్జెంట్ గా పదిహేనురోజుల్లో వంటమనిషి కావాలిట ,,యెందుకని అడగరేం యింటికొచ్చే అతిథులకు కాఫీలూ ,టిఫిన్లు భోజనాలూ మర్యాదలూ !ఆవిడకు వంట చేస్తూ కూర్చుంటే యివన్నీ కుదరవుట ,”కామాక్షి కాస్త వూపిరి పీల్చుకోవడానికి ఆపి చుట్టూ నోరెళ్లబెట్టి వింటున్న అమ్మలక్కల ఆరాటాన్ని గమనించింది ,ఆవిడకు యింకా వుషారొచ్చింది .
అసలు విషయం యేమిటంటే ….జానకమ్మ మొగుడికి ఆఫీసర్ గా ప్రమోషన్ వస్తున్నదిట ,యింటికి పెద్దపెద్ద ఆఫీసర్లు వస్తారుట ,వాళ్లకు కాఫీలు ,టిఫినీలు భోజనాలు చెయ్యడానికి ఆవిడకు కుదరదుట ,తను వంటింట్లో వుంటే వచ్చినవాళ్లకు మర్యాదలు చేసేవాళ్లుండరుట! మరీ బడాయి కాకపోతే ఆ మాత్రం వంట చేసుకోలేదా “అంటూ కామాక్షి మూతి ముఫై వంకరలు తిప్పింది .‘అవునవును ‘చుట్టూ చేరిన అమ్మలక్కలు మూతులు తిప్పారు .

ఇవన్నీ వింటున్న గౌరి కి బోలెడంత ప్రసార విషయం దొరికిందని మహా సంబరం గా వుంది .ఏ యింటి వార్త తెలిసిన గౌరి డ్యూటీ వీధి ఆ చివరి నించి యీ చివరి దాకా విషయాన్ని. యింకాస్త నగిషీలు దిద్ది గాల్లోకి వదలడం !

“అయినా వుద్యోగం లో చేరి అయిదేళ్లు కాలేదు ,అప్పుడే ప్రమోషనా యెంత లంచం యిచ్చాడో,జానకి. కి అసలే టెక్కెక్కువ ,కారు కొనుక్కుని టింగూ రంగా అంటూ తిరుగుతారు “అంటూ గౌరి కొంగు బిగించి వార్తా ప్రసారానికి బయల్దేరింది ,అమ్మలక్కలందరూ ముక్కులూ మూతులు తిప్పుతూ అవునవును అన్నారు .

రమణకు ,జానకి కి. వీధిలో. వాళ్లు అనుకుంటున్న తమ ప్రమోషన్ విషయాలు. తెలిసాయి .ఇద్దరూ సంతోషపడ్డారు .రమణ. చిన్న చిరు వుద్యోగి .ఆ వీధిలో ముగ్గురు నలుగురు ఆఫీసర్లు వున్నారు ,వాళ్లకు రమణ. అంటే చులకన .రమణ. పలకరించినా ముఖం చాటేస్తారు .

ప్రమోషన్ వార్త పుణ్యమా అని ,యిప్పుడు దోవలో యెవరెదురైనా రమణను చూసి నవ్వుతూ పలకరిస్తున్నారు .జానకి ని కూడా బజార్లో కనపడితే అమ్మలక్కలు పలకరిస్తున్నారు .జానకి మహా మురిసిపోతున్నది .

ఒకరోజు రమణ ఆఫీసునించి దిగులుగా వచ్చాడు .జానకి భర్త ముఖం చూసి కంగారు పడింది .ఏం ప్రశ్నించకుండా వేడివేడి కాఫీ యిచ్చి ప్రక్కన కూర్చుంది . పదినిమిషాల తర్వాత
“జానకీ. …ప్రమోషన్ ఆగిపోయింది ,యింకో బ్రాంచి లో అతనికి వచ్చిందిట ,నాకు యిప్పట్లో ప్రమోషన్ లేదుట “రమణ. నిరాశపడిపోతూ భార్య తో చెప్పాడు .జానకి ఒక్కసారిగా వులిక్కిపడింది .కాసేపు మాటరాలేదు .
“ఎందుకంత దిగులుపడతారు ? యిప్పుడు హాయిగానే వున్నాం కదా ,ప్రమోషన్ వచ్చేరోజు వస్తుందిలెండి “అంటూ భర్తకు ధైర్యం యిచ్చింది జానకి .

“ప్రమోషన్. గురించి నువ్వు అర్ధం చేసుకున్నావు అది చాలు నాకు.ఎవరు ఏం అనుకున్నా పట్టించుకోవద్దు .”అన్నాడు రమణ .

దంపతులిద్దరూ ఆ సాయంకాలం సినిమాకెళ్లి హోటల్లో డిన్నర్. చేసివచ్చి హాయిగా నిద్రపోయారు .ప్రమోషన్ ఆలోచించడం మానేసారు .

రమణ ఆఫీసుకెళ్లినతర్వాత జానకి తలుపులు మూసుకుని కిటికీ తెరుచుకుని యింటిపని చేసుకుంటున్నది .ఎదురుగుండా వనజ వాళ్లింట్లో కోలాహలం గా మాటలు వినిపిస్తున్నాయి ! వద్దన్నా జానకి చెవులకు వినిపిస్తున్నాయి .

“విన్నారా యీ చోద్యం ! వంటావిడ అర్జెంట్ గా అవసరం అన్నది కదా అని నేను పంపిస్తే ,జానకి గారు వంటావిడను చీవాట్లేసి వద్దని. తిప్పిపంపింది .అంతోటి సంబరానికి రాణిగారిలాగా వంటమనిషి కావాలని చెప్పడమెందుకు !”మూతి తిప్పుతూ కామాక్షి బిగ్గరగా అరుస్తున్నది .అవునవును అంటూ అమ్మలక్కలు మూతులు. తిప్పారు .

“అసలు విషయం యేమిటంటే ఆయనకు ప్రమోషన్ రాలేదుట నేనప్పుడే అనుకున్నాను ఇంతోటి గుమస్తా ముఖానికి ప్రమోషన్ ఒక్కటే తక్కువ .”అన్నది కామాక్షి .జానకి మొగుడికి ప్రమోషన్ రానందుకు ఆవిడకు మహా సంతోషం గా వుంది .

“ఎన్ని లంచాలు తీసుకున్నాడో అందుకే. ప్రమోషన్ యివ్వలేదేమో ,మహా మిడిసిపడింది గా జానకి ,తగిన శాస్తే జరిగింది “అన్నది గౌరి .ఇప్పుడు ఆవిడ డ్యూటీ అర్జెంట్ గా యీ వార్త వీధి చివరిదాకా మెరుపు వేగం తో ప్రసారం చెయ్యాలి .

జానకి అన్ని మాటలు విన్నది .బాధ పడింది ,ఉక్రోషం వచ్చింది ,కోపం వచ్చింది ,ఏడుపొచ్చింది .అయినా ఏం చెయ్యగలదు ?

రమణ ఆఫీసునుంచి వచ్చిన తర్వాత విషయమంతా చెప్పింది .

“పిచ్చిదానా !!ఎవరి నోళ్లకు తాళాలెయ్యలేం ! లోకం తీరింతే !యెదుటివాళ్లు బాధ పడ్తుంటే వాళ్లకు మహా ఆనందం ! మనం సంఘజీవులం ! వాళ్లు పొగిడినా ,అవహేళన చేసినా ఏదీ పట్టించుకోవద్దు .నేను. నెల రోజులు. సెలవు. పెట్టాను ,హాయిగా యాత్రలు చేసొద్దాం ,రెండు రోజుల్లో మనం బయల్దేరుదాం .ఇప్పుడు నీ డ్యూటీ మనకు కావాల్సినవన్నీ సర్దుకోవడం ,బజారెళ్లి కొనుక్కోవడం సరేనా “అంటూ భార్యని ఆప్యాయం గా చూసాడు .

సమాజపు పుల్లవిరుపు మనస్తత్వాన్ని యెవరూ మార్చలేరు .అందుకే మనం మనకు నచ్చిన విధం గా యెవరిని బాధపెట్టకుండా. బ్రతకటం నేర్చుకోవాలి .

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు