లొల్లి - ఆపాసా

Lolli

పెళ్ళికొడుకు అక్క జాహ్నవి, ఫలహారాల దగ్గర ఏదో గొడవ చేస్తోందని తెలిసి, పెళ్ళికూతురు తండ్రి వెంకట్రామయ్యగారు పరుగు పరుగున అక్కడకి చేరారు. ఆమెకీ, పెళ్ళికొడుక్కీ ఎదురుగా టేబుల్­పై ఉన్న ప్లేట్లలో వెన్నలాటి మెత్తటి ఇడ్లీలు ఆవిర్లు కక్కుతున్నాయి. నంజుకోవడానికి కొబ్బరి చట్నీ, కారప్పొడి, మరో రెండు చట్నీలు ఘుమఘుమలాడుతూ నోరూరిస్తున్నాయి. అయినా ఎవరూ టిఫిన్లు ముట్టుకోలేదు.

కేటరర్ గణపతి, జాహ్నవికెదురుగా దోషిలా తలవంచుకుని నిలబడ్డాడు. జాహ్నవి మొహం ఎఱ్ఱగా మంటలు చిమ్ముతోంది. వెంకట్రామయ్యగారికి విషయం అర్థమైపోయింది. ఆమె కోరిన ‘ఉల్లి చట్నీ లేదుగా!’ అనుకున్నారు.

జాహ్నవి తన కోపాన్ని అణచుకోవటానికి విఫల యత్నం చేస్తూ, మొబయిల్లో మాట్లాడుతోంది. వెంకట్రామయ్యగార్ని చూసి మర్యాదపూర్వకంగా కుర్చీలోంచి లేచి నిలబడింది.

మొబయిల్లో సంభాషణమాత్రం కొనసాగిస్తూనే ఉంది. ...

“అవును బాబాయ్ రెండు బస్తాలే! బాంబులు తెమ్మన్నట్టు అలా అదిరిపడతావేం! ఆమాత్రం తేలేవా! రామ్­కి చెప్పు కలెక్టర్ కదా! పైగా మనదేశంలోనే అత్యధిక ఉల్లి దిగుబడినిచ్చే నాసిక్­లోనేనాయే. అతని బావమరిది పెళ్ళికి ఆఫ్టరాల్ ఆమాత్రం ఉల్లిపాయలు తేలేడూ? రెండు బస్తాలు కాకపొతే, కనీసం ఒక బస్తా అయినా తేవాలి! ఇది మన మగపెళ్లివారి ప్రిస్టేజీకి సవాల్!

ఆరోజు కేటరింగ్ గణపతి, పెద్ద గొప్పగా మనముందే, వెంకట్రామయ్యగారితో ఏమన్నాడు? 'మగపెళ్ళివారు ఎప్పుడడిగితే అప్పుడు ఉల్లి చట్నీ ఫ్రెష్­గా చేసి వడ్డిస్తాను.' అన్నాడా? తీరా ఇప్పుడు టిఫిన్లు దగ్గర ఉల్లి చట్నీ ఏదయ్యా అంటే? దేబి మొహం వేశాడు!

‘ఇక్కడ మార్కెట్లో ఉల్లి లేదు నల్లి లేదు మాయం అయింది’ అని కుంటిసాకులు చెబుతున్నాడు.

అంత చేతకాని వాడు, ముందే చెప్పివుంటే, పెళ్ళికని చంబల్ నుంచి బండెడు లగేజీ తెచ్చిన వాళ్ళం; ఆమాత్రం ఉల్లిపాయలు తేలేం!” అంది ఈసడింపుగా.

ఆమెకేం తెలుసు ఇప్పుడు ఈ పరిస్థితులలో అదంత సులభం కాదని!

అసలు సంగతి అప్పుడు చెప్పాడు ఆమె బాబాయి –

‘నాసిక్­లో, లా ఎండ్ ఆర్డర్ సిట్యుయేషన్ ఏం బాలేదు. రేపటికెలా ఉంటుందో చెప్పలేం! మీవారు కలెక్టరు కదా కదల్లేడు. పైగా కమీషనర్ గారి ఆఫీసులో ఏదో అత్యవసర సమావేశం ఉందిట. అదీ సంగతి! అందుచేత, రామ్, తన బామ్మర్ది పెళ్ళికి, అంటే మీ తమ్ముడి పెళ్ళికి రాలేడు! ఇక ఇక్కడ మిగిలింది నేనొక్కణ్ణేగా, అందుకని కార్లో రాటంలేదు. ఈరోజు రాత్రి బస్సులో నాసిక్ నుంచి బయల్దేరి రేపు ఉదయానికల్లా అక్కడకి చేరతాను. బండెడు ఉల్లిపాయలు తీసుకొస్తాను. సరా! రేపు ఇడ్లీల్లోకి నంజుకోవడానికి ఉల్లి చట్నీ ఉంటుంది. ప్రామిస్!’ అని ముగించాడు.

‘సరే బాబాయ్, నీయిష్టం. ఏదోవొకటి చెయ్!’ అని మొబయిల్ ఆఫ్ చేసింది.

పాపం బాబాయికేం తెలుసు ‘వాగ్దానాలు, చేసినంత సులభం కాదు అవి నిలబెట్టుకోవడం’ అని.

వెంకట్రామయ్యగారికి తల కొట్టేసినట్టయింది. ‘ఉల్లీ నా తల్లీ ఎంత పని చేశావే! నా పరువు తీసేశావు కదే!’ అని మనసులోనే బాధపడ్డారు.

జాహ్నవితో ‘సారీ అమ్మా! గణపతి, ముందునుంచే ఉల్లిపాయలు స్టాకు చేసుకోకపోవడం వల్ల పొరపాటు జరిగిపోయింది. అయినా, ఇలా మార్కెట్లోంచి అకస్మాత్తుగా ఉల్లి మాయమవుతుందని ఎవరూ ఊహించలేదు. ఏదో విధంగా రేపటి టిఫిన్ టైముకైనా ఏర్పాటు చేస్తాను. ఈపూటకెలాగోలా సర్దుకోండి తల్లీ!’ అని చేతులు జోడించాడు.

తండ్రంత పెద్దాయన అలా ప్రాధేయపడేసరికి, జాహ్నవికి సిగ్గేసింది. ‘ఛఛ! అలా అంటారేంటి, ఫరవాలేదు!’ అని శాంతపడి కుర్చీలో కూలబడింది. పెళ్ళికొడుకు కూడా, ‘ఫరవాలేదు మాఁవయ్యగారూ ఇట్సాల్ రైట్!’ అన్నాడు, తేలిగ్గా తీసిపారేస్తూ. అందరూ టిఫిన్­లకి ఉపక్రమించారు.

వెంకట్రామయ్యగారు మాత్రం తేలిగ్గా తీసుకోలేకపోయారు. ‘ఈమాత్రం చిన్న విషయం సాధించలేకపోవడమా!’ అని అవమానంగా తోచింది. వెంటనే వెనక్కొచ్చి, ఏ ధరకైనా సరే ఉల్లిపాయలు కొని తెమ్మని కుర్రాళ్ళకి పురమాయించారు.

వాళ్లు, ప్రతి షాపులోను కనుక్కున్నారు. కూరల బజారు, రైతు బజారు, ఒకటేమిటి అన్నీ మధ్యాహ్నం వరకు చెప్పులరిగేలా తిరిగి తిరిగి తిరిగొచ్చారు, చేతులూపుకుంటూ.

--: oo(O)oo :--

అక్కడ నాసిక్­లో జాహ్నవి బాబాయి, తెలిసిన కిరాణాకొట్టుకి వెళ్ళాడు. షాపతను చెప్పింది విని నమ్మశక్యం కాలేదు. ‘పేపరు చూసే అలవాటు లేదా? టీ.వీ. చూట్టంలేదా? ఉల్లి కోసం కొట్టుకు ఛస్తున్నారు జనాలు. ఉల్లికి కంట్రోలు వచ్చింది. రేషన్ షాపుల్లోనే ఇస్తున్నారు ఉల్లి. వెళ్లి రేషన్ షాపులో వాకబు చెయ్యండి’ అని సలహాయిచ్చాడు.

రేషన్ షాపు వాడు బాబాయిని ఎగాదిగా పిచ్చివాణ్ణి చూసినట్టు చూశాడు.

‘ఈ ఉల్లి లొల్లిలో పడి మీక్కాని మతిపోలేదు కదా! రెండు బస్తాలేంటి! ఇప్పుడున్న పరిస్థితిలో, రెండు కిలోలు సాధించడం కూడా అసాధ్యం! వెళ్ళండెళ్ళండి. వెళ్లి, మా షాపు తప్పించి, ఇంకే రేషన్ షాపుకైనా కన్నం వెయ్యండి!’ అని తరిమేశాడు.

ధైర్యం చేసి, దగ్గర్లోవున్న రేషన్ షాపుకెళ్ళాడు బాబాయి. కన్నం వెయ్యడానికి కాదు, కనుక్కోడానికి.

తను కలెక్టర్ రామ్ మాఁవయ్యనని పరిచయం చేసుకుని, ఎన్ని బస్తాల ఉల్లిపాయలు పోగుచెయ్యొచ్చో తెలుసుకోడానికి ప్రయత్నించాడు. ప్రయోజనం లేక పోయింది. అయితే, ఫుడ్ ఆఫీసర్ని కలిస్తే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చని జాహ్నవి బాబాయికి చిన్న ఆశ రేపి వదిలేశాడా రేషన్ షాపువాడు.

బాబాయికి అప్పటికే చెమటలు కారడం మొదలెట్టాయి. ‘ఈ ఉల్లి గోలేంటిరా బాబూ నా పీకకి చుట్టుకుంది! అక్కడ జాహ్నవి పరువేం కావాలి, మగపెళ్లివారి ప్రిస్టేజీ ఏం కావాలి! ఇలాటి సంకట స్థితి ట్రంపుక్కాని మరోడిక్కాని రాకూడదు భగవంతుడా!’ అని జావకారిపోయాడు. ఎలాగో శక్తి తెచ్చుకుని, ఫుడ్ ఆఫీసర్ని కలవడానికి బయల్దేరాడు.

ఫుడ్ ఆఫీసరు చెప్పింది విని, తల తిరిగినంతపనయింది బాబాయికి.

‘మీకు తెలీదా! నిన్నరాత్రి నాసిక్ శివార్లలో ఉల్లి తోటల మీద బందిపోట్లు దాడి చేశారు. మోడస్ ఆపరాండీని బట్టీ, చంబల్ డాకూలయివుండొచ్చనుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లోనైతే ఉల్లి కనబడితే చాలు, ప్రజలే దౌర్జన్యంగా మీదపడి లాక్కుంటున్నారు. దాంతో దొమ్మీలవుతున్నాయి. చాలా భీభత్సంగా ఉంది పరిస్థితి. అదుపులో ఉంచడానికి ప్రభుత్వం తల తోక్కొస్తోంది. మీ అల్లుడు కలెక్టర్ రామ్­గారు కమీషనర్ ఆఫీసులో అత్యవసర మీటింగుకి వెళ్ళారుగా, మీకు తెలీదా అక్కడేం జరిగిందో!

చంబల్నించి వచ్చినతనని, ఏరికోరి రామ్­గారినే ఈ సిట్యుయేషన్ని కంట్రోల్ చేసే టీమ్­కి ఇంచార్జి చేశారు. ఒక్క పోలీసు డిపార్టుమెంటే కాదు, సంబంధించిన ప్రభుత్వాఫీసులు, యంత్రాంగం, మంత్రాంగం అన్నీ ఇప్పుడు అతని సూచనల ప్రకారమే నడచుకోవాలి. ఇప్పుడు రేషన్ షాపుల్లో మనిషికి ఎన్ని ఉల్లిపాయలు ఇవ్వాలి అనేది కూడా, ప్రతిరోజూ నిర్ణయించేది అతనే. అతనే ఏమైనా చెయ్యగలరు. అతను ఆర్డరిస్తే, నేను శిరసావహిస్తాను.’ అని చేతులెత్తేశాడు.

--: oo(O)oo :--

ఇక్కడ వెంకట్రామయ్యగారు పంపిన కుర్రాళ్ళు రేషన్ షాపులో క్యూ కట్టారు. క్యూలో నిలబడ్డ ముసలి, ముతక, చిన్నా, పెద్దా, అందర్నీ చూసి అనుమానంతో, ‘ఏమిటి సంగతి?’ అని ముందు నిలబడ్డ వాళ్ళని అడిగారు.

‘కుటుంబసభ్యులంతా వారి వారి ఐడెంటిటీ కార్డులతో క్యూలో నిలబడితే, రేషన్ కార్డుతో సరిపోల్చి, సరిగావున్న వారికి మాత్రమే ఉల్లిపాయలిస్తున్నారు. కార్డుకిన్ని అని కాదు, వచ్చిన మనుషులకి మనిషికిన్ని అని. అది కూడా ప్రతిరోజూ ఉల్లి స్టాకుని బట్టి, క్వాంటిటీ మార్చేస్తున్నారు. ఈరోజు తీసుకున్న కార్డు మీద తిరిగి నెల్లాళ్ళ వరకు ఉల్లిపాయలు ఇవ్వరు. అందుకని, ఇంటిల్లిపాది వచ్చి లైన్లు కడుతున్నారు. అదీ సంగతి!’ అని చెప్పేసరికి, కుర్రాళ్ళు తమ తమ ఇళ్ళకి ఫోన్లు చేసి, నిలబడ్డ పాటుగా ఇంట్లో ఉన్నవాళ్ళందర్నీ టాక్సీలు, ఆటోలు, చేయించుకుని రేషన్ షాపుకి వచ్చేయమన్నారు. అప్పటికే సాయంత్రం నాలుగయింది.

--: oo(O)oo :--

అక్కడ నాసిక్­లో సరిగ్గా అదే సమయానికి జాహ్నవి బాబాయి, రామ్­కి ఫోన్ చేసి, టూకీగా విషయం చెప్పాడు. ఎలాగైనా పరువు కాపాడాలన్నాడు.

అప్పుడు రామ్, “మావయ్యగారూ! నేనే ఈ ‘ఆపరేషన్ లొల్లి’ కి ఇంచార్జినయ్యుండి, ఒక గ్రామో కిలోనో కాదు, ఏకంగా బస్తాలు బస్తాలు ఉల్లిపాయలు మీకిచ్చేయమని ఎలా చెప్పగలను? ఎవరికి చెప్పగలను? అది నా ఎథిక్సుకి విరుద్ధం. నా సిద్ధాంతాలకి వ్యతిరేకం! ఐ యామ్ సారీ!” అన్నాడు నిస్సహాయంగా.

బాబాయి బీ.పీ. రైజ్ అయింది. ముచ్చెమటలు పోసాయి. ‘ఇప్పుడెలా?’ అనుకున్నాడు.

అల్లుణ్ణి అదే అడిగాడు – ‘నువ్వే అలా అంటే ఎలా! మన పరువేం కావాలీ, జాహ్నవి మాటేం కావాలి? వేరే మార్గమేదైనా ఉందేమో ఆలోచించి చెప్పు.’ అని ప్రాధేయపడ్డాడు.

‘ఒక పని చెయ్యండి. మా పి.ఏ. తో మాట్లాడండి.’ అని చెప్పి, మరో మాటకి తావివ్వకుండా, లైన్ కట్ చేసేశాడు, కలెక్టర్ రామ్.

--: oo(O)oo :--

రాత్రి ఏడున్నరకి కానీ, క్యూలో నిలబడ్డ కుర్రాళ్ళ నెంబరు రాలేదు. అన్నీ పరిమిత కుటుంబాలే కావడం వల్ల, అక్కడకి చేరిన నాలుగు కుటుంబాల సభ్యుల సంఖ్యా మొత్తం కలిపితే ‘పది’కి తేలింది. సరే, పదిమంది పోగయ్యాం కదా అని సంబరపడ్డారు. అందరి చేతుల్లో పెద్ద పెద్ద సంచులు, జేబుల్లో పెద్ద పెద్ద నోట్లు ఉన్నాయి. కౌంటరు దగ్గరవడంతో మొహాల మీద విజయోత్సాహం వెలసింది. అందరి కోటా కలిపి కనీసం నాలుగు బస్తాల ఉల్లి మోసుకుపోవచ్చునని ఆనందపడ్డారు. తృప్తిగా అడుగులు ముందుకేశారు.

అప్పటికే లైను, పూతరేకుల్లాటి మడతలతో, ఆ వీధంతా ఆక్రమించుకుంది. క్యూని కంట్రోలు చేస్తూ నలుగురు పోలీసులున్నారు. సందు చివర్న ఉంది రేషన్ షాపు. ఆ చివర్న మరో ఇద్దరు పోలీసులు, ఉల్లిపాయలు తీసుకుని వెళ్ళే వాళ్ళని తిరిగి ఇటు రానీయకుండా అదిలిస్తూ, అట్నుంచి అటే వన్ వే లా ప్రక్క వీధిలోకి మళ్ళిస్తున్నారు.

--: oo(O)oo :--

అక్కడ నాసిక్ లో, రామ్ పి.ఏ., ‘నిజమే సార్! కలెక్టర్ గారిది సున్నితమైన పొజిషను. అతనేం చెయ్యలేరు సరికదా, నేను కాని ఫుడ్ ఆఫీసరు గాని సాహసించి ఎవరికైనా ఫేవర్ చేశామా, ఆయనే మా మీద ఏక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడెలా!’ అని బాబాయికి ఊపిరాడకుండా చేశాడు.

పి.ఏ.కి బాబాయి పాలిపోయిన మొహం చూసి జాలివేసింది. ఏదో ఐడియా తట్టినట్టు, గభాల్న ‘ఒక పని చేస్తే సరి! ఉండండి, కమీషనరు గారి పి.ఏ.తో మాట్లాడతాను. అతడుగాని, కమీషనరు గారితో మాట్లాడి స్పెషల్ ఆర్డర్ తెప్పించగలిగాడంటే చాలు! మన పని అయిపోతుంది. అలా అయితే, మనం రామ్­గారిని ఇరుకులో పెట్టినట్టు ఉండదు. అతనికి మామీద ఏక్షన్ తీసుకోవాల్సిన అవసరమూ ఉండదు. అందరం సేఫ్!

పదండి, కమీషనరు గారి పి.ఏ. తో మాట్లాడదాం.’ అంటూ సీట్లోంచి లేస్తూ చిన్న ఆశాదీపం వెలిగించాడు.

ఇద్దరూ కమీషనరు గారి పి.ఏ.ని కలిశారు. అంతా విని, అతడు కలెక్టరు గారి పి.ఏ.తో ‘కొంప ముంచేవు కదయ్యా! హోంమినిస్టర్ గారింట్లో విందుకి రెండు బస్తాల ఉల్లిపాయలు కావాలన్నారు. ఎలాగా? అని నేను సతమతమవుతుంటే, ఇప్పుడు కలెక్టరు గారి బామ్మర్ది పెళ్ళొకటా! అయినా బామ్మర్ది పెళ్ళా మజాకా! చంపేవుకదయ్యా! ఏం చెయ్యడం? నాకేం పాలుపోటంలేదు. ఏదైనా తోవుంటే నువ్వే చెప్పు.’ అని తన భారాన్ని సైతం కలెక్టరుగారి పి.ఏ. పైనే వేసేశాడు.

అంతకుముందు వెలిగిన ఆశాదీపం రెపరెపలాడింది. కొండెక్కిపోతుందేమోనని జాహ్నవి బాబాయికి భయం వేసింది.

ఇంతలో, రామ్ పి.ఏ., కమీషనర్ గారి పి.ఏ.తో, ‘దానికేముంది సార్! ప్రభుత్వం ప్రజలది. ప్రజల బాగోగులకోసమే మనం పని చేసేది. హోమ్ మినిస్టరుగారి వీధిలో ఎవరో ఒక సామాన్యుడింట్లో ఏదో శుభాకార్యమున్నట్టు అర్జీ తీసుకోండి. దాని మీద మినిస్టరుగారి చేత కమీషనరు గారికి సిఫారసు చేయించండి.

అలాగే నేను, జాహ్నవిగారి బాబాయిచేత కమీషనరుగారికి అర్జీ పెట్టిస్తాను. అలా అయితే కమీషనరుగారు, ఒక్క మినిస్టరుగారికే కాకుండా, అతనితో పాటు నిజంగా ఒక సామాన్యుడికి కూడా సహాయం చేశాననే తృప్తి పడతారు. మన పని అయిపోతుంది.’ అని సలహా ఇచ్చాడు.

‘నీబుఱ్ఱ అమోఘమయ్యా!’ అని ఆ పి.ఏ. ఈ పి.ఏ.ని పొగిడాడు.

మళ్ళీ ఆశాదీపం నిలిచి నిలువెత్తున వెలుగులు చిమ్మింది.

కొద్దిసేపట్లోనే కలెక్టరు గారి పి.ఏ., కమీషనరు గారి పి.ఏ. అందించిన ఆర్డరు కాపీ అందుకున్నాడు. ఆఘమేఘాల మీద జాహ్నవి బాబాయితో పాటు, ఫుడ్ ఆఫీసరు దగ్గరకి, అక్కడనుంచి రేషన్ షాపు గోడౌనుకి చేరాడు. అప్పటికే గోడౌను ఇంచార్జి, రెండు బస్తాల ఉల్లిపాయలనీ, రెండు అట్టపెట్టెల్లో నీటుగా సర్దివుంచాడు. ఎవరికీ వాటిలోవున్నది ఏమిటో తెలీకుండా, ఉప్పందకుండా, ఉల్లి కంపు కొట్టకుండా జాగ్రత్తపడ్డాడు.

అయినా, ఎవరికైతే అందకూడదో వారికందేసింది. కంపుకొట్టేసింది. సమాచారం చీదేసింది.

ఆసంగతి తెలీక, కలెక్టరుగారి పి.ఏ., బస్టాండు వరకు వచ్చి, రెండు అట్టపెట్టెలూ భద్రంగా బస్సులోకి చేరేలా చూశాడు. అప్పుడు తృప్తిగా వెనక్కి తిరిగాడు. వెళ్లేముందు, అందులోవున్నవి ఉల్లిపాయలని ఎట్టి పరిస్థితుల్లోను ఎవరికీ తెలియకూడదని బాబాయికి హెచ్చరించాడు. బోల్డు జాగ్రత్తలు చెప్పాడు.

ఆ బస్సు అర్ధరాత్రి సమయానికల్లా మహారాష్ట్ర-తెలంగాణ బోర్డరుకి చేరుతోంది. అప్పుడు బాబాయి, జాహ్నవికి ఈ ఉల్లి శుభవార్త చెబ్దామని మొబయిల్ తీశాడు. స్విచ్ ఆఫ్ చేసివుంది. ‘అరె! ఇదెప్పుడు ఆఫ్ అయిపోయింది?’ అనుకుంటూ ఫోన్ చేశాడు.

అట్నుంచి జాహ్నవి గొంతు ఆత్రంగా వినిపించింది. ‘ఎన్నిసార్లు చేసినా స్విచ్డ్ ఆఫ్ వస్తోంది. ఇంతకీ ఉల్లిపాయలు తెస్తున్నావా లేదా, బాబాయ్?’ అడిగింది.

‘తెస్తున్నానే తల్లీ! అని గుసగుసలాడినట్టు, రెండు పెద్ద పెద్ద అట్టడొక్కుల్లో తెస్తున్నాను. ఏదో ఆఫ్ఘనిస్తాన్నుంచి ఆయుధాలో నైజీరియానుంచి డ్రగ్సో దొంగతనంగా రవాణా చేస్తున్నవాడిలా ఉంది నా పరిస్థితి ...’ అంటుండగానే, ఒక్క కుదుపుతో బస్సు ఆగింది.

ఆ కుదుపుకి చేతిలో మొబయిల్ జారి కింద పడింది. బస్సు ఆగుతూనే లబలబమని ఎవరో బస్సుని చుట్టుముట్టేశారు. వాళ్ళ చేతుల్లో పెద్దపెద్ద తుపాకులున్నాయి. బాబాయి అదేం గమనించలేదు. కిందకు వంగి మొబయిల్ తీసి ‘చెప్పమ్మా జాహ్నవీ!’ అన్నాడు.

ఈలోగా కొందరు దుండగులు బస్సులోకి ప్రవేశించారు. వారిలో ఒకడు బాబాయికి లాగి ఒక్కటిచ్చుకున్నాడు.

మరోడు మొబయిల్ లాక్కొని స్విచ్ ఆఫ్ చేశాడు.

ఛెళ్ళుమనిపించినవాడు, బాబాయిని, కఠినంగా ‘కిస్సే బాత్ కర్రా బే?’ అని గదమాయించాడు.

బాబాయికి అప్పటికే కళ్ళు బైర్లు కమ్మాయి. వణుకుతూ, ‘మేరీ బిటియాసే!’ అన్నాడు అసంకల్పితంగా.

కొట్టినవాడు, ఆశ్చర్యపోతూ! ‘అరె స్సాలా, ఏతో అమ్రీ బాసా బోల్ రారే!’ అన్నాడు.

--: oo(O)oo :--

కొద్దిసేపట్లో టీవీల్లో ఫ్లాష్ న్యూస్ – ‘ఉల్లిపాయలకోసం ముట్టడి. మహారాష్ట్ర-తెలంగాణ బోర్డర్లో నాసిక్ నుండి హైదరాబాద్ వెళ్ళే బస్సుని బందిపోట్లు ముట్టడించారు. వివరాలకై కళ్ళప్పగించి, చెవులు రిక్కించి, మా ఛానల్­నే చూస్తూ ఉండండి. ...’ అంతే! ప్రకటనలు హోరందుకున్నాయి.

ఒక్కసారిగా పెళ్ళివారిల్లు మేల్కొంది. ఆ బస్సులో ఉల్లిపాయలు తెస్తున్నది, జాహ్నవి వాళ్ళ బాబాయేనని అతడికేమైయుంటుందోనని గగ్గోలెత్తిపోయింది. కలవరపడింది.

జాహ్నవికైతే, మనసు మెదడు మొద్దుబారిపోయాయి. వెర్రిచూపులు చూస్తూ ఉండిపోయింది.

మరొక గంటలో టీవీలో న్యూస్ – ‘బస్సులోని ఒక ప్రయాణీకుడు, చంబల్ డాకూలతో వారి భాషలోనే మాట్లాడి, బస్సులోని ప్రయాణీకులెవరికీ ఏ హాని జరగకుండా సమాధానపరచాడు. అతడి సాహసానికి, మాటల చాతుర్యానికి, తోటి ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేశారు. తమకు తోచిన కానుకలతో అతన్ని ముంచెత్తారు. అయితే, అతడు ఆ కానుకలన్నీ చంబల్ డాకూలకే అర్పించేశాడు. అంతేకాక, అతడి మాటని గౌరవించినందుకు, తన తరఫునుంచి కూడా ఆ బందిపోట్లకు పెద్ద బరువైన ఒక అట్టపెట్టెతో ఆనందంగా కానుకాలందించాడు.’

‘అట్టపెట్టె అందించాడు’ అన్న వార్త అశనిపాతంలా జాహ్నవిపై పడింది. అంతే! గిర్రున కళ్ళుతిరిగి దబ్బున పడింది.

--: oo(O)oo :--

తెలతెలవారుతుండగా కేటరర్ గణపతి ఎదురెళ్ళి, జాహ్నవి బాబాయిని, వీధి చివరనుండి మేళతాళాలతో ఊరేగించి కళ్యాణమండపానికి తీసుకొచ్చాడు. వీధంతా తన ఖర్చుతో అలంకరించాడు.

అందరూ ‘ఉల్లి వీరుడికీ జిందాబాద్!’ అని నినాదాలు చేశారు.

బాబాయిని లోనికి ఆహ్వానించి, అతడికి, జాహ్నవికి, పెళ్లికొడుక్కి, వేడి వేడి ఇడ్లీలు వడ్డించాడు కేటరర్ గణపతి.

నంజుకోడానికి గణపతి వేసిన స్పెషల్ చట్నీ ‘ఉల్లి చట్నీ’ చూసి వారి కళ్లు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయ్! గణపతివైపు ప్రశ్నార్థకంగా చూశారు.

అతడు గర్వంగా వెంకట్రామయ్యగారివైపు చూశాడు.

వెంకట్రామయ్యగారు మొహమాటపడుతూ, ‘మావాళ్ళు నిన్నంతా విశ్వప్రయత్నం చేశారు. సంచులతో కాసులు తీసుకెళ్ళినా పిడికిళ్ళలో మాత్రమే తేగలిగారు! వాటితో చేసిందే ఈ పచ్చడి. ఇప్పటికి దీంతో కానీయండి. ఆనక, మీ బాబాయిగారు తెచ్చిన వాటితో. ...’ అనేసరికల్లా,

జాహ్నవి ఉత్సుకతని ఆపుకోలేక, వెంకట్రామయ్యగారిని ‘ఎన్ని ఉల్లిపాయలు దొరికాయేంటి?’ అనడిగింది.

అతను కుంచించుకుపోతూ, ‘మనషికొకటి చొప్పున మొత్తం పది!’ అని చెప్పారు.

--: oo(O)oo :--

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు