ఈ మధ్యన ఘోరమైన కారు ప్రమాదంలో జరిగిన ‘ సైరస్ మిస్త్రీ ’ గారి దుర్మరణం, ప్రసార మాధ్యమాన్ని ఒక కుదుపు కుదిపింది. ఆ వార్తతో - నాలుగు చక్రాల వాహనాల తయారీలో ఉండవలసిన జాగ్రత్తలు, వాటిలో ప్రయాణించే ప్రయాణీకులు పాటించవలసిన నియమాలు, ఆ నియమపాలనలో ప్రభుత్వం వారు తీసుకోవలసిన కట్టడి చర్యల గురించి - ఈ రోజు వరకూ అడపా దడపా వార్తలు ప్రసార మాధ్యమాలలో వస్తూనే ఉన్నాయి.
కథకి 'హెల్మెట్' అన్న పేరు పెట్టి - కారు గురించి, కారులో ప్రయాణించే ప్రయాణికులకు సంబంధించి వ్రాస్తున్నాడేమిటి, ‘కొంపదీసి, కారు ప్రయాణీకులు కూడా హెల్మెట్ ధరించాలని చెప్పబోతున్నాడా’ ఈ రచయిత - అని ఆలోచించక, ముందున్న కధని ఆసాంతం సావధానంగా దయచేసి చదవండి.
పై వార్తతో అప్రమత్తమై, నాలుగు చక్రాల వాహనాలని వాటిలోని ప్రయాణికులని పరీక్షించి నియమపాలన కఠినంగా నియంత్రిస్తున్న సమయంలో –
సైకిలు, జట్కా, టాంగాలని వదలి, మిగతా యంత్ర సహాయక రెండు చక్రాల వాహనాలుగా పరిగణించబడే స్కూటీ, స్కూటర్, మోటార్ బైక్ ల మీద ప్రయాణించే వారిని కూడా ఆపి, ఆ వాహనాలకు సంబంధించిన నియమపాలన కూడా కఠినంగా నియంత్రించడం అమలుచేయడం ముఖ్యమైన పనిగా పెట్టుకున్నారు – జనసంక్షేమం కోరుతున్న రవాణా శాఖ అధికారులు, పోలీస్ వ్యవస్థలోని అధికారులు సంయుక్తంగా.
ఆ నియమపాలనలోనే, పైన ఉదహరించిన రెండు చక్రాల వాహనాల మీద ప్రయాణించే వారు హెల్మెట్ ధరించి తీరాలన్న నియమాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు.
ఒక రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన హరిని చూసి, ఆయన భార్యామణి కావేరి -
"ఇదేమిటి మీ బట్టలు జుత్తు మట్టి కొట్టుకుంటున్నాయి. ఏమిటైంది?" అని ఆదుర్దాగా ఆరా తీసింది.
"దారిలో మట్టికుప్ప దగ్గర బైక్ స్కిడ్ అయి, ఆ మట్టికుప్ప మీద పడ్డాను." అన్నాడు హరి చిన్నగా.
"బట్టలు సరే. జుత్తు కూడా మట్టి కొట్టుకోవడమేమిటి? హెల్మెట్ పెట్టుకోలేదా" అని నిగ్గదీసిన కావేరి కళ్ళలోకి సూటిగా చూడలేని హరి - "అవును" అన్నాడు మెల్లిగా.
"మట్టికుప్ప మీద పడ్డారు కాబట్టి సరిపోయింది. ఏ రాళ్ళకుప్ప మీదో లేక రోడ్ మీదో పడి, మీకేమేనా అయితే, నేను పిల్లలు ఏమవ్వాలి. మీకు ఎన్నిసార్లు చెప్పేను - హెల్మెట్ పెట్టుకొనే బైక్ నడపండని. మీకు నేనన్నా, నా మాటన్నా లక్ష్యం లేదు." అని కన్నీళ్లు కారుస్తూ ఏడుపు అందుకున్న భార్యని చూసి -
హరి - "ఇక మీదట హెల్మెట్ పెట్టుకొనే బైక్ నడుపుతానులేవే, ఏడవకు, నాకేమీ అవలేదు కదా" అని హామీ స్వాంతన కలగలిపి, రోదిస్తున్నభార్యని అక్కున చేర్చుకున్నాడు.
ఉదయం అనగా ఇంట్లోంచి బయటకు వెళ్లి వచ్చిన భర్త ఆప్యాయంగా అక్కున చేర్చుకున్న ఆలింగనంలో ఆరు నిమిషాలు ఆనందం అనుభవించిన కావేరి, అంతలోనే అతనిని దూరంగా అదలించి - లోపలికి పరిగెత్తి పదేళ్ల కూతురు పద్మని, ఆరేళ్ళ కొడుకు అరవింద్ ని చెరో చేత్తో పట్టుకొని వచ్చి భర్త ఎదురుగా నిలబడి –
-2-
"తూర్పు వైపుకి తిరిగి, రెండు చేతులు జోడించి, నాకు వినబడేటట్టు గట్టిగా తిరుపతి వెంకటేశ్వరస్వామీ, అన్నవరపు సత్యనారాయణస్వామీ, కాశీ విశ్వేశ్వరస్వామీ నమస్కారం అని చెప్పండి"
"ఏదో ఒక దేముడికి నమస్కారం పెడితే చాలు కదే"
"నోరు మూసుకొని, నేను చెప్పమన్నట్టు చెప్పండి"
......
"చెప్పండి, అంటే అలా మౌనంగా నిలబడతారేమిటండీ"
"నువ్వే నోరు మూసుకోమన్నావు కదే"
"నా బొంద లాగుంది. నోరు మూసుకోమంటే - నేను చెప్పినదానికి అడ్డుచెప్పొద్దని. ఇందాకా నేను చెప్పినట్టు గట్టిగా చెప్పండి"
“తిరుపతి వెంకటేశ్వరస్వామీ, అన్నవరపు సత్యనారాయణస్వామీ, కాశీ విశ్వేశ్వరస్వామీ నమస్కారం”
" ఇప్పుడు, మా ముగ్గురి మీద ప్రమాణం చేసి, నేను చెప్పినట్టు చెప్పండి"
"ఇప్పుడు ప్రమాణాల వరకు ఎందుకు కావేరీ, నేను నీకు మాటిస్తున్నాను కదా"
"నా మాట విని ప్రమాణం చేస్తారా లేదా"
"సరే, నీ ఇష్టం. ఏమని ప్రమాణం చేయాలి"
"ఒక చేయి నాతల మీద, మరొక చేయి మన పిల్లల తలల మీద పెట్టి, నేను చెప్పినట్టు ప్రమాణం చేయండి"
" మీ ముగ్గురి తలల మీద ఒకేసారి చేతులు పెట్టడానికి - నాకేమేనా మూడు చేతులున్నాయా ఏమిటే. ఉన్న రెండు చేతులలో నీ తల మీద ఒక చేయి సరే, మరి ఇద్దరి పిల్లల తలల మీద మరో చేయి ఒకే సారి ఎలా పెట్టేది"
--అని వాపోయేడు హరి.
"ఖర్మ ఖర్మ, అది కూడా నేర్పాలి. ఇద్దరినీ మీదగ్గరగా తీసుకొని, వారి తలలు రెండూ కలిపి మీచేయి పెట్టండి" అంది, కాస్త విసుగు కోపం కలగలిపి.
అపర అమ్మవారు లాగ నిలబడిన భార్య వేపు చూసి, ఆమె చెప్పినట్టు చేసేడు.
"ఇప్పుడు చెప్పండి – నేను”
“నేను”
“ఇక మీదట”
“ఇక మీదట”
“బైక్ నడిపేటప్పుడు”
“బైక్ నడిపేటప్పుడు”
“వెళ్లే దూరం దగ్గరైనా దూరమైనా”
“వెళ్లే దూరం దగ్గరైనా దూరమైనా”
“హెల్మెట్ పెట్టుకొనే నడుపుతానని”
“హెల్మెట్ పెట్టుకొనే నడుపుతానని”
“నా ధర్మపత్ని కావేరి మీద”
"నా ధర్మపత్ని అంటే సరిపోతుంది కదే, మళ్ళా పేరెందుకు"
"నేను చెప్పమన్నట్టు చెప్పమన్నానా … చెప్పండి"
-3-
"నా ధర్మపత్ని కావేరి మీద”
"నాకు నా ధర్మపత్ని కావేరికి పుట్టిన మా అమ్మాయి రమణి మీద"
"అదేంటే, రమణి మన ఇద్దరికీ పుట్టినదే కదా"
"అగో మళ్ళీ, నేను చెప్పమన్నట్టు చెప్పమన్నానా … చెప్పండి"
"సరే, నాకు నా ధర్మపత్ని కావేరికి పుట్టిన మా అమ్మాయి రమణి మీద"
“నాకు నా ధర్మపత్ని కావేరికి పుట్టిన మా అబ్బాయి అరవింద్ మీద"
“నాకు నా ధర్మపత్ని కావేరికి పుట్టిన మా అబ్బాయి అరవింద్ మీద"
“భగవత్ సాక్షిగా ఇప్పుడు ప్రమాణం చేస్తున్నాను.”
“భగవత్ సాక్షిగా ఇప్పుడు ప్రమాణం చేస్తున్నాను.”
"ఇప్పుడు మీరు వెళ్లి స్నానం చేసి రండి."
"కాస్త కాఫీ ఇవ్వకూడదా"
"కూడదు. ముందు స్నానం, తరువాతే కాఫీ, వెళ్ళండి"
తప్పదన్నట్టు అజమాయిషీ చేస్తున్న భార్యని ఏమీ అనలేని హరి, స్నానం చేయడానికి లోపలికి వెళ్ళేడు.
"మీరిద్దరూ చదువుకోండమ్మా" అని పిల్లలని పంపిన కావేరి వంటగది వేపు నడిచింది.
కావేరి ఇంత రాద్ధాంతం చేయడానికి వెనుక, ఏమి జరిగిందంటే ------ పది రోజుల క్రిందట ---
“ఏమండీ, హెల్మెట్ మరచిపోయేరు" లోపలి నుంచి భార్య కావేరి వేసిన కేకకి - బదులుగా -
"అక్కర్లేదులేవే, ఇక్కడే ఉన్న మార్కెట్ కే కదా వెళ్ళేది" అన్నాడు హరి.
"మీ ఇష్టం. ఏ పోలీసో పట్టుకుంటే అనవసరంగా ఫైన్ కట్టుకోవాలి కదా అని, చెప్తున్నాను " అంది కావేరి ఇవతలికి వచ్చి, భర్త హరితో.
"మన ఇంటికి అరకిలోమీటర్ దూరం కూడా లేని మార్కెట్ కి వెళ్తూ హెల్మెట్ ఎందుకు అని, తీసుకొని వెళ్లడంలేదు. ఇంక ఫైన్ అంటావా, ఈ టైంలో ఏ పోలీస్ వెధవ ఉండడులే"
"మీ ఇష్టం బాబూ" అని, కావేరి లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది.
పది నిమిషాల తరువాత మ్రోగిన కాలింగ్ బెల్ విని తలుపు తీసిన కావేరి "అప్పుడే వచ్చేసారేమిటి?"
"మార్కెట్ ఇంకా వంద మీటర్లు ఉండగా చూసేను, అక్కడ పొలిసు జీప్ ఉంది. ఆ హెల్మెట్ ఇయ్యి. లేకపోతే ఫైన్ కట్టవలసి వస్తుంది"
"నేను ముందే చెప్పేను. నామాట వింటే నామోషీ కాబోలు" అని నిష్టూరంగా మాట్లాడుతూ లోపలికి వెళ్లి హెల్మెట్ తెచ్చి ఇచ్చింది.
హెల్మెట్ తీసుకొని హేండిల్ కి తగిలించి బైక్ స్టార్ట్ చేయబోతుంటే - "అదేమిటి హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ హేండిల్ కి తగిలించేరు" అంది కావేరి.
"ఇక్కడిక్కడికి పెట్టుకోవడమెందుకు. అంతగా పోలీసువాళ్ళు అడిగితే హెల్మెట్ చూపించి ఇదే కారణం చెప్తాను. ఏమి భయం లేదులే"
"మీ ఇష్టం. నామాట ఎప్పుడు విన్నారు కదా" అని మళ్ళా నిష్టూరంగా మాట్లాడుతూ లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది.
గంట తరువాత మార్కెట్ నుంచి వచ్చిన హరి "దొంగవెధవలు. లంచగొండు వెధవలు." అని వల్లె వేస్తూంటే -- కావేరి కుతూహలంగా -- "ఎవరిని అలా దీవిస్తున్నారు" అంది నవ్వుతూ.
"నాకు ఒళ్ళు మండిపోతుంటే, నీకు నవ్వులాటగా ఉందా"
-4-
"ఈరోజు వాతావరణం చల్లగా ఉంటే, మీకు ఎందుకు ఒళ్ళు మండిపోతోంది"
"మండదూ మరి. ఆ పోలీసు నాదగ్గర హెల్మెట్ చూసికూడా 500 ఫైన్ ఇవ్వాలని గొడవ చేసి, ఆఖరికి 200 లంచం తీసుకొని, పదినిమిషాలు నాకొక క్లాస్ పీకేడు. పైగా మీపేరు మీబండీ నెంబర్ నోట్ చేసుకున్నాం. హెల్మెట్ పెట్టుకోకుండా మళ్ళా దొరికితే 1000 రూపాయలు ఫైన్ కట్టవలసి ఉంటుంది అని హెచ్చరిక కూడా"
"హెల్మెట్ పెట్టుకోమని నేను చెప్పిన మాట వినుంటే - ఇంత గొడవ, లంచం ఇవ్వడం లేకుండా జరిగేది కదా. నా మాట అంటే మీకు అసలు ఖాతరు లేదు"
"నాకసలే చికాకుగా ఉంది. ఇప్పుడు నువ్వు మరి క్లాస్ పీకకు"
ఆ మాటలేమీ పట్టించుకోకుండా జవాబు కూడా ఇవ్వకుండా లోపలికి వెళ్లిన భార్య వేపు చూస్తూ - 'ఈ రోజు అనవసరంగా రెండు వందలు బొక్క' - అనుకున్నాడు హరి స్వగతంగా.
రెండురోజుల తరువాత హెల్మెట్ పెట్టుకోకుండా హేండిల్ కి తగిలించి బైక్ మీద ఆఫీస్ కు వెళుతున్న హరిని, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆపి -
"ఏం సర్, హెల్మెట్ ఉండి కూడా పెట్టుకోకుండా బైక్ మీద వెళ్లడం నేరమే కాదు ప్రమాదం అని తెలియదా. అన్నీ తెలిసిన మీలాంటి చదువుకున్నవాళ్ళు ఇలా తిరిగితే, చదువుకోని వాళ్ళకి మేము ఏమని చెప్పగలం"
"ఆఫీస్ కి టైం అయిపోతున్న తొందరలో హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ స్టార్ట్ చేసి బయలుదేరేను. సారీ"
"మాకు ఎందుకు సారీ చెప్పడం సర్. మీప్రాణం విలువ తెలుసుకొని, మీఫామిలీ గురించి కూడా ఆలోచించుకొని, నడచుకోవడం ఉత్తమం క్షేమకరం" అని ఇన్స్పెక్టర్ హితబోధ చేసి ఫైన్ వెయ్యకుండా వదిలేసేడు.
ఇన్స్పెక్టర్ ఎదురుగుండా హెల్మెట్ పెట్టుకొని బైక్ మీద బయలుదేరిన హరి 'నయం, ఫైన్ వెయ్యకుండా వదిలేడు' అనే ఆలోచించేడు.
అదండీ జరిగింది.
ఆ రోజునుంచీ హరి - భార్య పిల్లల మీద చేసిన ప్రమాణం గుర్తు చేసుకుంటూ - దగ్గరలో కానీ దూరంగా కానీ బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించి వెళ్తున్నాడు.
ఇక్కడితో కథ అయిపోలేదండోయి.
ఒకరోజు సాయంత్రం, హరి భార్యా పిల్లలతో బైక్ మీద సినిమాకి బయలుదేరి కొంత దూరం వెళ్లేసరికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అడ్డు తగిలేడు.
"నేను హెల్మెట్ పెట్టుకొనే ఉన్నాను కదా, మమ్మల్ని ఆపేరెందుకు" అని అడిగేడు, హరి.
"మీ ప్రాణానికి ఉన్న విలువ గుర్తించి మీరు హెల్మెట్ పెట్టుకున్నారు. సంతోషం. మీ భార్య ప్రాణానికి కూడా అంతో ఇంతో విలువ ఉంది కదా. అంతేకాక, నియమం ప్రకారం ఆవిడ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి."
"ఆడవారికి హెల్మెట్ ఏమిటి సార్ అసహ్యంగా"
"అంటే, ఆడవారి ప్రాణానికి విలువ లేదంటారా" అన్న ఇన్స్పెక్టర్ - కావేరితో "ఏమ్మా, మీ ఆయనకి మీరన్నా మీప్రాణం అన్నా విలువ లేదా" అని అడిగేడు.
"మా ఆయనకి నేనంటే వల్లమాలిన ప్రేమ సర్. నేను హెల్మెట్ పెట్టుకొంటే అందంగా దువ్వుకున్న నాజుత్తు జడ పాడైపోతాయి కదా సార్"
"జుత్తు పాడైపోతే మళ్ళా దువ్వుకోవొచ్చు, జడ పాడైపోతే మళ్ళా వేసుకోవొచ్చు, కానీ మీ బైక్ కి ప్రమాదం జరిగి తగలరాని చోట దెబ్బ తగిలితే మీప్రాణమే పోవొచ్చు కదా"
-5-
"నిజం సార్."
"కదా. అందుకే మీబైక్ ఇక్కడ ఉంచి, ఎదురుగుండా షాప్ లో హెల్మెట్ కొనుక్కొని పెట్టుకొని వెళ్ళండి"
"పిల్లలకి హెల్మెట్ అక్కరలేదు కదా సార్"
"చిన్నపిల్లలు కదా. అక్కరలేదు లెండి. మీరు వాళ్ళని గట్టిగా పట్టుకొని కూర్చొని జాగ్రత్తగా వెళ్ళండి" అని సలహా ఇచ్చి ఇన్స్పెక్టర్ మరొకరి దగ్గరకి వెళ్ళేడు.
హెల్మెట్ దుకాణం దగ్గర బైక్ ఆపి, బైక్ తాళం కూడా వాడికే ఇచ్చి, సినిమా నుంచి వచ్చిన తరువాత హెల్మెట్ కొంటామని చెప్పి - నలుగురూ ఆటోలో సినిమాకి వెళ్లి వచ్చి, కావేరికి హెల్మెట్ కొన్నారు.
'ఇద్దరూ కలిసి బైక్ మీద వెళ్ళినప్పుడు చేరవలసిన చోటుకి వంద మీటర్ల ముందరే బైక్ ఆపాలని' కావేరి హరి దగ్గర ఆరోజు మాట తీసుకుంది. ఎందుకంటే, అక్కడ ఆమె మళ్ళా తన జుత్తు జడ సరిచేసుకొని, ఆ కాస్త దూరం నడిచి వెళ్తుంది.
ఇక్కడితో కూడా కథ అయిపోలేదండోయి.
వారంరోజుల తరువాత - బడి నుంచి వచ్చిన పద్మ, "అమ్మా, ఈరోజు వ్యాసరచనపోటీలో నాకు ప్రథమ బహుమతి వచ్చింది" అని కప్పు, ప్రశంసా పత్రం చూపించింది.
అవి చూసి పొంగిపోయిన కావేరి, పద్మని దగ్గర తీసుకొని ముద్దుల వర్షం కురిపించింది.
పద్మ తన పుస్తకాలసంచీ లోంచి ఒక కవరు తీసి - "నేను వ్రాసిన వ్యాసం ఒక కాపీ మాటీచర్ నాకు ఇచ్చి, దీని మీద నువ్వు నాన్న సంతకం చేసిన తరువాత రేపు బడిలో ఇమ్మన్నారు."
"అలాగే. నీబాగ్ లోనే ఉంచు. నాన్న వచ్చిన తరువాత చూపిద్దాం"
ఒకగంట తరువాత వచ్చిన నాన్నకి పద్మ కప్పు, ప్రశంసా పత్రం చూపించి, కవరు కూడా ఇచ్చింది. కావేరి కూడా అక్కడే నవ్వుతూ కూర్చుంది.
హరి కూడా అవి చూసి పొంగిపోయి, పద్మని దగ్గర తీసుకొని ముద్దు చేసేడు.
పద్మ వ్రాసిన ఆ వ్యాసం ఇలా ఉంది - - - - -
వ్యాసం శీర్షిక : హెల్మెట్ వ్యాసం వ్రాసిన విద్యార్థిని పేరు : పద్మ, తరగతి : V(B)
హెల్మెట్ అనగా స్కూటీ, స్కూటర్, బైక్ నడిపే వారు ధరించే టోపీ.
అది తలకి పెట్టుకొని బండీ నడిపితే, ప్రమాదం జరిగినా తలకు దెబ్బ తగలకుండా కాపాడుతుంది.
ఒకసారి ఇన్స్పెక్టర్ మానాన్నతో మాట్లాడుతూ, మా నాన్న అమ్మ ప్రాణాలకి చాలా విలువ ఉందని చెప్పి, వారిద్దరూ విధిగా హెల్మెట్ పెట్టుకోవాలి, అని చెప్పేరు.
ఇప్పుడు మానాన్న అమ్మ ఇద్దరికి హెల్మెట్ ఉంది.
"మాపిల్లలు కూడా హెల్మెట్ పెట్టుకోవాలా" అని అమ్మ అడిగితే, "చిన్నపిల్లలు కదా అక్కరలేదు" అని ఇన్స్పెక్టర్ గారు చెప్పేరు.
అందుకే, నాకు తమ్ముడికి హెల్మెట్ లు లేవు.
అంటే, చిన్న పిల్లల ప్రాణాలకి ఏమీ విలువ లేదు.
వ్యాసం చదివిన హరి కావేరిలకు --- నోట మాట రాలేదు.
*****