తనకు బాగా ఇష్టమైన వాలుకుర్చీలో వెనక్కువాలి తీరుబడిగా పుస్తకం చదువుతున్నాడు రాఘవ. రిటైరై పదేళ్ళుదాటాయి. కిందటి ఏడు కరోనామహమ్మారి బారినపడి భార్య తనువు చాలించిన తర్వాత ఒంటరివాడైయ్యాడు రాఘవ. ఇల్లు అమ్ముకొని పుట్టిపెరిగిన పల్లెతో తనకున్న అనుబంధాన్ని తెంచుకుని కొడుకువెంట సిటీలోకి వచ్చిపడ్డాడు. పల్లెటూరి ప్రశాంత వాతావరణంలో బతకడానికి అలవాటుపడ్డ రాఘవ పట్నంవచ్చిన కొత్తలో ఉక్కిరిబిక్కిరయ్యాడు. పల్లెలోలా తెలిసిన ముఖాలేవీ లేవు. కాలక్షేపం అసలేలేదు, టివి తప్ప. టివీమాత్రం ఎంతగని చూడగలడు! సాయంకాలం వీధి చివరనున్న గుడిలో కాస్సేపు కాలక్షేపం అవుతుంది అంతే! ఒంటరిగా కూర్చుంటే గతం గుర్తుకువస్తోంది. గడిచిన దినాల్లో చేదు తీపి కలయికలున్నా కేవలం చేదు సంఘటనలు మాత్రమే గుర్తుకు వస్తున్నాయి. అవే తీవ్రమైన కలతకు గురి చేస్తున్నాయి. జీవితంలో తను సాధించలేకపోయినవన్నీ వెక్కిరిస్తున్నాయి.
ఇంట్లో కొడుకు, కోడలు, మనవడు ఉన్నా అనుక్షణం ఒంటరితనం వేధిస్తోంది. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మనసు పాడవుతోందని సొఫాలో కూర్చొని వార్తా పత్రిక చేతిలోకి తీసుకున్నాడు. రెండు నిమిషాలు చదివిన తర్వాత చాల విసుగనిపించింది. పేపర్ని టీపాయ్ మీద గీరాటేసి మళ్ళీ వాలు కుర్చీని ఆశ్రయించాడు. కళ్ళుమూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసాడు.
"మామయ్యగారూ! కాఫీ తీసుకొండి." అని టీపాయ్‌మీద కాఫీ పెట్టి వెళ్ళింది కోడలు రమ్య. ఆ మాటలకి లేచి వెళ్ళి కాఫీ అందుకొని తాగాడు. చప్పగా ఉంది కాఫీ తన జీవితం లాగే. నిర్జీవంగా మనసులోనే నవ్వుకున్నాడు రాఘవ. అవును మరి! తనేమో సుగర్ పేషంట్. తీపి తినాలని మనసులో ఎంత పీకుతున్నా కొడుకు రవి, కోడలు రమ్య ఆరోగ్య సూత్రాలు వల్లెవేస్తారు. తన బ్రతుకింతే! అలాగే సర్దుకోవాలి అనుకున్నాడు రాఘవ.
ఆలోచనలు రవి, రమ్య వైపు మళ్ళాయి. నిజం చెప్పాలంటే అందరిలాంటి వాడు కాదు తన కొడుకు. కోడలు రమ్య కూడా మంచిదే! ఎప్పుడూ కనిపెట్టుకొని వేళకి కాఫీ, ఫలహారం, భోజనం అందిస్తుంది. ఎంతమందికి ఉంటుంది అలాంటి అదృష్టం మరి! మనవడు వేణు అయితే సరి సరి! స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ పిలిచి భోజనం పెట్టేదాక తనవద్దే గడిపి స్కూల్లో జరిగిన సంగతులన్ని తన వచ్చీ రాని మాటలతో చెప్తాడు. అందుకే తన ఒంటరితనం మరిచి ఈ మధ్యనే రోజూ కొద్దికొద్దిగా సర్దుకుపోతున్నాడు.తన స్నేహితుల పిల్లలు ఎంతమందో పై చదువులకో లేక ఉద్యోగం నెపం మీద విదేశాలకి వెళ్ళి ఆ దేశాలపై మోజుతో అక్కడే స్థిరపడిపోయారు, ఇక్కడ ముసలి తల్లితండ్రులని వదిలేసి. తల్లితండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చిన వాళ్ళ సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఇలా ఆలోచిస్తూంటే అప్పుడు గుర్తుకువచ్చాడు తన స్నేహితుడు, బాల్య మిత్రుడు అయిన రంగారావు. అతని భార్య కూడా గతించి అయిదేళ్ళయింది. సొంత ఊళ్ళో ఉండలేక పొలం ఇల్లు అమ్మి కొడుకింటికి వచ్చేసాడు. అప్పుడు గాని అతనికి తెలియలేదు తన కొడుకు కోడలు అసలు స్వభావం. వేళకి తిండి ఉండేది కాదు. వచ్చిన నెలరోజుల లోపే మామగారి మకాంని ఔట్ హౌస్‌కి మార్చింది ఆ మహా ఇల్లాలు. కొడుకేమో భార్య మాటని జవదాటని బుద్ధిమంతుడు. ఆ తర్వాత కొద్దినెలల్లోనే ఈ ఊళ్ళోనే వృద్ధాశ్రమంలో రంగారావుని చేర్చి చేతులు దులుపుకున్నాడు కన్నకోడుకు. ఆ విధంగా చూస్తే తన కొడుకు రవి ఉత్తముడు. రోజూ సాయంకాలం అరగంటైనా తన క్షేమ సమాచారాలు విచారిస్తాడు.
రంగారావు విషయం తెలిసి చాలా బాధ పడ్డాడు రాఘవ. అతను అలా మధనపడుతూంటే రవి తెలుసుకొని ఓ రోజు తండ్రిని అక్కడికి తీసుకెళ్ళాడు కూడా.
తనని చూడగానే రంగారావు మొహంలో కనిపించిన ఆనందం, వెలుగూ తనెన్నడూ మర్చిపోలేడు.
ఇద్దరు మిత్రులు ఓ గంటసేపు పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు. చిన్నప్పుడు జరిగిన సంగతులు నెమరు వేసుకున్నారు.
"రాఘవా! నీకేం లోటు లేదురా! నీ కొడుకు రవి బంగారం. నిన్ను పువ్వుల్లో పెట్టుకోని చూసుకుంటాడు. నేనూ మావాడ్ని మంచివాడనే నమ్మాను. ఉళ్ళో ఉన్న పొలం, ఇల్లు అమ్మి ఆ డబ్బులన్నీ వాడి చేతులో పోసాను. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత వచ్చిన డబ్బులన్ని కూడా వాడికే ఇచ్చాను! అయినా ఏం లాభం. రోజు రోజుకీ అక్కడ నా బ్రతుకు అధ్వాన్నంగా తయారైంది. ఆఖరికి ఈ వృద్ధాశ్రమంలో చేర్చి చేతులు దులుపుకున్నాడు ఆ సుపుత్రుడు. అయినా ఒకంతట ఇదే నయంగా ఉంది. రోజూ ఉండే సూటీపోటీ మాటలు లేవు. ఏదో భోజనానికి గడిచిపోతోంది. ఇక్కడ కొత్త స్నేహితులు తయారయ్యారు. ఒకొక్కళ్ళదీ ఒక్కో కథ, ఒక్కో వ్యథ.” అన్నాడు రంగారావు. నవ్వి ఊరుకున్నాడు రాఘవ. 'నిజమే ఆ రంగారావు కన్నా నేను చాలా అదృష్టంవంతుణ్ణి.' మనసులో అనుకున్నాడు రాఘవ.
"తాతా!...తాతా!...లే తాత! ఇవాళ మా స్కూల్లో ఏం జరిగిందంటే..." అంటూ మనవడు వేణు లేపేసరికి ఆలోచనల్లోంచి బయటకు వచ్చాడు రాఘవ. అలా ఓ అరగంటసేపు మనవడి ముచ్చట్లతో కాలమే తెలిసిరాలేదు రాఘవకి.
ఇంతలో కోడలు భోజనానికి పిలిస్తే డైనింగ్ హాల్‌కి వెళ్లాడు. అక్కడ రవి కనపడకపోవటంతో అడిగాడు, "ఏమ్మా! ఇవాళ భోజనానికి రవి రాలేదేమిటి?" అని.
"ఇవాళ ఆఫీసులో పనెక్కువుందని అతను రాలేదు మావయ్యగారూ. ఆఫీస్ క్యాంటీన్‌లో భోజనం చేసేస్తానని చెప్పారు. అన్నట్లు, మావయ్యగారూ, మీకో విషయం చెప్పమన్నారు అతను. సాయంకాలం ఆరుగంటలకల్లా తయారై ఉండమన్నారు ఎక్కడికో మిమ్మల్ని తీసుకు వెళ్తారట!" అందామె పప్పు వడ్డిస్తూ.
"ఎక్కడికో ఏమైనా చెప్పాడా అమ్మా!" అడిగాడు రాఘవ.
"అంతకు మించి నాకేం చెప్పలేదు మావయ్యగారూ! ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నట్లున్నారు." అన్నాడు.
రవి తనని ఆరుగంటలకల్లా తయారవమని ఎందుకు చెప్పినట్లో ఎంత ఆలోచించినా తట్టలేదు. డాక్టర్ దగ్గరకైతే నెల మొదటివారంలో ఆదివారం మాత్రమే తీసుకెళ్తాడే! గుళ్ళు, గోపురాలు అయినా ఏ శని, ఆదివారోలో కదా! ఎమో సాయంకాలం రవి వస్తేనే తేలుతుంది అని అనుకొని భోజనం ముగించి తన రూంకి తిరిగివచ్చాడు రాఘవ.
కొద్దిసేపు ఏవో పుస్తకాలు తిరగేసిన తర్వాత నిద్రకి ఉపక్రమించాడు రాఘవ. అయితే అంత తొందరగా నిద్రపట్టలేదు అతనికి. రవి తనని సాయంకాలం ఎక్కడకి తీసుకెళ్ళబోతున్నాడన్నమీదే మనసు లగ్నమైంది మరి.
ఎలాగో అతి ప్రయత్నం మీద ఓ అరగంట సేపు నిద్రపట్టింది రాఘవకి. అయిదయ్యేసరికి మొహం కడుక్కొని, కోడలిచ్చిన కాఫీ తాగి, బిస్కెట్లు తిని సోఫా మీద మూర్చున్నాదు రవి కోసం ఎదురుచూస్తూ.
ఆరు దాటుతుండగా రవి వచ్చాడు. ఏం చెప్తాడోనని ఆత్రంగా ఎదురు చూస్తున్న తండ్రిని చూస్తూ, "నాన్నా! మీరు రెడీ కదా! నేనో పదినిమిషల్లో ఫ్రెష్ అయి వస్తాను, మనం ఓ చోటకి వెళ్ళాలి." మరో మాటకి తావియ్యకుండా బాత్‌రూంలోకి దూరాడు.
అన్నట్లుగానే పది నిమిషాల్లో తయారయ్యి, "పదండి నాన్నా!" అని ముందుకి దారి తీసాడు. వేణు వెంటబడుతూంటే, "ఇంట్లోనే ఉండు వేణు, నువ్వు అక్కడికి రాకుడదు." అని నచ్చచెప్పి బయట ఉన్న కారు వైపు వెళ్ళాడు. మనసులో ఉన్న ఆత్రతను అణుచుకొని కొడుకుని అనుసరించాడు రాఘవ.
రాఘవ కారెక్కిన తర్వాత రవి కారు స్టార్ట్ చేసాడు. ఎటు వెళ్తున్నామో అని పరిసరాలు గమనించ సాగాడు రాఘవ. ఓ అరగంట తర్వాత మెయిన్‌రోడు వదిలి ఓ సందులోకి మలుపు తిరుగుతుంటే అప్పుడు గుర్తుపట్టాడు రాఘవ. ఆ రోడ్డు వృద్ధాశ్రమానికి దారి. అటువైపు కారు మళ్ళగానే గొంతులో తడి ఆరిపోయింది రాఘవకి. బయలుదేరేముందు తనెంత అడిగినా ఎక్కడికో చెప్పాడు కాదు రవి, "మీరే చూస్తారుగా!" అన్న ఒక్క మాట తప్పించి ఇంకేం మాట్లాడలేదు. 'తన కొడుకు కూడా అందరిలాంటి వాడు కాదు కదా!' అన్న ఆలోచన ఒక్కసారి రాఘవని ఆవరించింది. తనని ఆ వృద్ధాశ్రమంలో చేర్చడానికి తీసుకెళ్ళడం లేదు కదా అని మనసులో ఓ మూల పీకుతోంది కూడా! కొడుకు మౌనం అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఏమో కాలం ఎంత మంచి వాళ్ళలోనైనా మార్పు తీసుకురావచ్చు. అందుకు తన కొడుకు, కోడలు అతీతులేమీ కాదు కదా! తన కొడుకు రవి కూడా రంగారావు కొడుకులాంటివాడే కాబోలు. ఇక తన బ్రతుకు కూడా రంగారావులానే వృద్ధాశ్రమం పాలు కాబోతోంది. ఇలా ఆలోచిస్తూ పోతూ ఉంటే రాఘవ నవనాడులూ ఒక్కసారి కృంగిపోయాయి.
ఇలా సుదీర్ఘమైన ఆలోచనల్లో రాఘవ మునిగిఉండగానే ఆ వృద్ధాశ్రమమ రానే వచ్చింది. 'అయిపోయింది, అంతా అయిపోయింది!... తన బ్రతుకింక వృద్ధాశ్రమం పాలే!' అని మనసులో మధన పడుతూనే రవిని అనుసరించి లోపలికి ప్రవేశించాడు రాఘవ.
లోపలికి వెళ్ళి అక్కడ మేనేజర్‌తో ఏదో మాట్లాడాడు రవి. మనసులోని దఃఖాన్ని అణుచుకొంటూ అక్కడే ఓ కుర్చీలో తలవంచుకొని కూలబడ్డాడు రాఘవ. అయిదు నిమిషాల్లో అక్కడకి రంగారావు వచ్చాడు తన సామాన్లతో.
"నాన్నా! ఇదిగో...మీ ఫ్రెండ్ రంగారావు అంకుల్! చాలా రోజులనుండి మీ మనసులో ఉన్న వ్యథ గమనించాను నాన్నా! ఇక నుండి అంకుల్ మనతోనే ఉంటారు, మీకు తోడుగా ఉంటారు. నేను మేనేజర్‌తో అన్నీ మాట్లాడాను. అతన్ని మనతో తీసుళుతున్నాం నాన్నా! మీకు సంతోషమే కదా నాన్నా!" అన్న రవి మాటలకి ఈ లోకంలోకి వచ్చి ఆశ్చర్యంగా చూసాడు.
రంగారావు నవ్వుతూ, "రాఘవా! నేను చెప్పాను కదా నీ కొడుకు బంగారం! పద...మనమిద్దరం ఒకరికొకరు తోడుగా ఉందాం." అన్నాడు.
రాఘవ ఇంకా నమ్మలేకపోతున్నాడు. తన కన్న కొడుకుని ఎంత అపార్థం చేసుకున్నాను అని మనసులో తనని తాను నిందించుకున్నాడు. తనని ఆశ్చర్యపరచడానికే రవి ఏ విషయం చెప్పలేదని తెలిసి, ఆనందంగా రంగారావు చేతులు పట్టుకుని బయటకు దారి తీసాడు.
…………..