ఈనాటి ఈబంధం ఏనాటిదో! (పిల్లల కథ) - చెన్నూరి సుదర్శన్

eenaati ee bandham enaatido

అడవిలో కరుణ అనే కాకి ఉండేది. కరుణ తన కుశాగ్ర బుద్ధితో రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి కావు, కావుమని అరుస్తూ పక్షులను హెచ్చరించేది. ఏదైనా ఆహారం దొరికితే పంచుకొని తిందామని కావు, కావుమని పిలిచేది. కాని పక్షులు దాన్ని అపార్థం చేసుకొని విసుక్కునేవి. ‘ఛీ..ఛీ.. పాడు కాకిగోల..’ అని తిట్టిపోసేవి.

ఒకరోజు పక్షులన్నీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. అందులో కరుణను ఏకాకిని చేసాయి. ఇకనుండి నిన్ను వెలివేస్తున్నామని తీర్మానించాయి. కరుణ కన్నీరు పెట్టుకుంది.

“మనది అంతా ఒకేజాతి. అయినా నాకు జ్ఞాపకశక్తి, కంటిచూపు మీకంటే ఎక్కువ కనుకనే అల్లంత దూరంలో ప్రమాదాన్ని గుర్తించి అరుస్తున్నాను. మన మంచి కోసమేకదా!. నన్ను వెలివేయడం న్యాయంకాదు. మరో మారు ఆలోచించండి” అని వేడుకుంది. అయినా పక్షులలో మార్పు రాలేదు. మానిర్ణయానికి తిరుగు లేదని కనికరం లేకుండా కరుణను తరిమేసాయి.

కరుణ దిక్కులేని పక్షిలా ఒకపల్లె వైపు దారితీసింది. ఊరి మొదట్లో ఒక వేపచెట్టు మీద వాలింది. ఇంతలో కాంతమ్మ అనే ముసలమ్మ పొయ్యి వెలిగించడానికై.. ఎండు పుల్లలు ఏరుకుందామని గుడిసె నుండి బయటకు వచ్చింది. ఒక ఎండిపోయిన చెట్టు దగ్గరికి పోబోతుంటే కరుణ రివ్వున ఎగురుతూ వచ్చి కాంతమ్మకెదురుగా రెప్పలు కొట్టుకుంటూ కావు, కావుమని గట్టిగా అరవసాగింది. కాంతమ్మ అర్థం చేసుకుంది. చెట్టు కిందకు పరికించి చూడగా ఒక చిన్న నాగుబాము పడగ విప్పి ఉంది. గజ్జున వణకింది కాంతమ్మ. కరుణకు రెండు చేతులా దండ పెట్టింది.

పొయ్యి ఎలా వెలిగించాలి! అని వాపోతూ గుడిసె ముందు కూర్చుంది. కరుణ నలువైపులా వెళ్లి ముక్కుతో ఎండు పుల్లలు తీసుకు వచ్చి కాంతమ్మ ముందర వాకిట్లో వేసింది. కాంతమ్మ ఆశ్చర్య పోయింది. మరో మారు కరుణకు దండం బెట్టి పుల్లలన్నీ ప్రోగు జేసి పొయ్యి రాజేసింది. గబ, గబా గారెలు చేసింది. కరుణకు ఇద్దామని పెరట్లోకి వెళ్ళింది. తాను అంట్లు కడిగే ప్రాంతంలో పడ్డ మెతుకులు తింటూ శుభ్రం చేస్తోంది కరుణ. ఒంటరిగా బ్రతుకుతున్న తనకు తోడు దొరికిందని సంతోష పడింది. కరుణను పిలిచి గారెను అందించింది. కరుణ గారెను తింటూ కాంతమ్మకు కృతజ్ఞతలు తెలుపుకుంది. కాంతమ్మకు రోజూ ఇలాగే సాయం చేస్తూ.. ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంది. పెరట్లో ఉన్న వేపచెట్టు కొమ్మపైన గూడు కట్టుకుంది. కాంతమ్మను చూసినప్పుడల్లా తనను వెలివేసినట్టే ఈమెను గూడ వెలివేసారా ! ఎందుకు ఒంటరిగా ఊరికి దూరంగా ఉంటోందని అనుకునేది. ఒకరోజు కాంతమ్మతో.. “అమ్మా.. నాన్నంటే మా పక్షి జాతి నా అరుపులు భరించలేక వెలి వేసాయి. నిన్ను గూడా ఊరి ప్రజలు వెలివేసారా?” అంటూ అడిగింది.

“నిన్ను పక్షిజాతి వెలి వేసిందా!” అంటూ ముక్కున వేలువేసుకుంది. “నీ గురించి వాటికి పూర్తిగా తెలిసినట్టుగా లేదు. కాకి అంటే ఎవరు.. శనిదేవతకు వాహనం. పూర్వం రావణునికి భయపడి యముడు కాకిరూపం దాల్చాడు. అప్పుడు కాకులకు కొన్ని వరాలు ప్రసాదించాడు. అందులో భాగంగా కాకులకు రోగాలు రావడం అరుదు. అందుకే మిగతా పక్షుల కంటే ఎక్కువ కాలం బ్రతుకుతుంది. మనుషులు పితృకర్మల సమయంలో సమర్పించుకునే పిండాకూడు కాకులు తింటేనే వారికి తృప్తి కలుగుతుంది” అంటూ కాకి గొప్పతనం గురించి చెబుతుంటే.. కరుణ నోరు తెరచి ఆశ్చర్యంగా వింటోంది. కాంతమ్మ గొంతు సర్దుకొని తిరిగి చెప్పసాగింది.

“నీవనుకున్నట్టు నన్ను ఎవరూ వెలివేయ లేదు. ప్రశాంతంగా ఉంటుందని ఊరికి కాస్త దూరంగా

ఉంటున్నాను. సాయంత్రం పిల్లలు కొందరు ఇక్కడికి వస్తారు. వారికి కథలు చెబుతాను”

“నీకు పిల్లలు లేరా?” అంటూ మధ్యలో అడిగింది కరుణ.

“నాకు ఒక్కర్తే అమ్మాయి పేరు అరుణ. ఆమె పుట్టగానే మాఆయన కాలంచేసాడు. నేనే అష్టకష్టాలు పడి అమ్మాయిని చదివించాను. టీచర్ ఉద్యోగం వచ్చింది. పెళ్లి చేసి అత్తవారింటికి పంపాను. సెలవుల్లో మాత్రమే వస్తుంది. ఎప్పుడైనా అత్యవసరమైతే కాకితోకబురు పెట్టు వస్తాను.. అని నవ్వుతుంది” అంటూ కాంతమ్మ ముసి, ముసి నవ్వులు కురిపించింది.

ఆసాయంత్రం కాంతమ్మ పిల్లలకు గారెలు పంచుతూ.. కరుణను గూడా పిలిచి ఇచ్చింది. ఆమె కథలు చెబుతుంటే శ్రద్ధగా విన్నది కరుణ. సాయంత్రమయ్యింది. పిల్లలంతా వెళ్లి పోయారు. కరుణ తన గూట్లోకి వెళ్లి విశ్రమించింది.

అలా ఆనతి కాలంలోనే కాంతమ్మ, కరుణల మధ్యమైత్రి బంధం పెరిగింది. ‘ఈనాటి ఈబంధం ఏనాటిదో !’అన్నట్టుగా.

ఒకరోజు తెల్లవారు ఝామున కరుణ అలవాటు ప్రకారం కావు, కావు మని అరిచింది. కాంతమ్మ లేవలేదు. కరుణ కంగారు పడింది. సూర్యుడు ఉదయించాడు. అయినా కాంతమ్మ లేవలేదు. బారెడు పొద్దుఎక్కింది. కాంతమ్మ లేవక పోయేసరికి కరుణ ఊళ్లలోకి వెళ్లి కావు, కావు మంటూ కాంతమ్మ లేవలేదన్న విషయం తెలియపర్చింది. కొందరు పరుగెత్తుకుంటూ వచ్చి గుడిసె తలుపులు బద్దలు కొట్టి చూసారు. కాంతమ్మ చనిపోవడం గమనించారు. వాకిట్లో చాపమీద కాంతమ్మ శవాన్ని వేసారు. కరుణ కన్నీళ్లు పెట్టుకుంది. ఏదో జ్ఞప్తికి వచ్చిన దానిలా వాయు వేగంగా ఎగిరి పొరుగూరికి వెళ్ళింది. అరుణ బడిముందు చెట్టుకింద పిల్లలకు పాఠాలు చెప్పడం చూసింది. చెట్టు కొమ్మ మీద వాలి కావు, కావు అంటూ ఏక ధాటిగా అరవసాగింది. అరుణ శంకించింది.

కాకితో కబురు పెడితే వస్తానని అమ్మతో హాస్యానికి అన్న మాట గుర్తుకు వచ్చింది. వెంటనే లేచి సెలవు చీటీ రాసి కాంతమ్మ దగ్గరికి బయలు దేరింది.

గుడిసె ముందు జనాన్ని చూసి గుండెలు బాదుకుంటూ వచ్చింది అరుణ. కాంతమ్మ శవం మీద పడి భోరుమంది. చెట్టు కొమ్మ మీద కాకి రోదనలో కలిసి పోయింది. అరుణ తలెత్తి కరుణకు దండం పెట్టింది.

కాంతమ్మ అంత్యక్రియలు చేసింది అరుణ. కాంతమ్మకు పెట్టిన పిండాకూడు తిని ఆమెకు సద్గతులు ప్రాప్తింప చేసింది కరుణ. *

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు