ఇష్టమే ... కష్టమైనవేళ . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Ishtame kashtamaina vela

" మందులు,పర్సు, డిక్కిలో పెట్టాను రెండుబాటిళ్ళు మంచినీళ్ళు, ఫ్లాస్కోలో టీ పోసాను,వెళ్ళేదారిలో మాతమ్ముడి బంక్ లో టాంక్ ఫుల్ చేయించండి , రెండురోజులకు సరిపడా బట్టలు ఉన్నబ్యాగ్ డిక్కిలో ఉంది,దారిలో చాలారోజులుగా ఆహ్వానిస్తున్ననెల్లురు శివకుమార్ గారి ఇంటిలో భోజనం చేయండి సాయత్రం నాలుగు గంటలదాక విశ్రాంతి తీసుకుని బయలుదేరితే ఆరు గంటలకు ఊరు చేరతారు, వచ్చేటప్పుడు మాచెల్లెలకు కొంతడబ్బులు ఇచ్చిరండి ఎక్కడా హోటళ్ళలో తినకండి ...

"అబ్బ ఎన్నాసార్లు చెపుతావే " అంటూ కారుతీసుకుని బయలుదేరాను.

కారనోడాలోని మాఆవిడ తమ్ముడి పెట్రోల్ బంక్ లో కారు టాంక్ ఫుల్ చేయించుకుని బయలుదేరాను.

సుళ్ళూరుపేట చెంగాళమ్మని దర్శంచుకుని 'ఫ్లాస్కోలో ని టీతాగి,

భోజనం సమయాని నెల్లురు మిత్రుడు దూరపు బంధువు అయిన శివకుమార్ ఇంటికిచేరాను.

ఎదురు వచ్చిన శివకుమార్ " ప్రయాణం బాగాసాగిందా? "అన్నాడు . వంటగదిలోనుండి వస్తున్న శివకుమార్ భార్య " రండి అన్నయ్యగారు వదినగారు ఫోన్ చేసిమాట్లాడింది చేతులు శుభ్రపరచుకొండి భోజనం వడ్డిస్తాను "అన్నది.

డైనింగ్ టేబుల్ వద్దకు వెళుతూనే సాంబారు వాసన వస్తుంది. నామనసు కీడుశంకించింది.

ప్లేటులో అన్నం,బంగాళదుంప వేపుడు వడ్డించి సాంబారు గిన్నె,అప్పడాలు పళ్ళెందగ్గరగాపెడుతూ "వదిన చెప్పింది ఇవిమీకు ఇష్టమటగా !" అన్నది.

ఉదయం అల్పాహరంలో సాంబారు ,రాత్రిమిగిలిన బంగాళదుంపకూర దోశపైన వేసి మసాలా దోశపేరుతో ఈపదార్ధాలనే వడ్డించిన నాశ్రీమతిని తలచుకుంటు తిన్నాను అనిపించి వెళ్ళి మంచంపైన వాలిపోయాను.

సాయంత్రం టీతాగి బయలుదేరి ఐదు గంటలకు ఊరు చెరి ,నేరుగా మామిడి తోటవద్దకువెళ్ళాను. అప్పటికే మాతోటిఅల్లుడు తోపాటు ఆఏడు పంటకేనుగోలుదారులు అక్కడ ఉన్నారు. పంటకొనుగోలుదారులు నమస్కారిస్తు "అయ్య ఇందులో ఐదు లక్షలు ఉన్నాయి లెక్కచూసుకొండి " అని డబ్బుసు ఉన్న సంచి అందించాడు. తొటకావలిదారులు నాకారుడిక్కిలో మూడు బుట్టల మామిడి పళ్ళు పెట్టారు.నాతోటిఅల్లుడితోకలసి వాళ్ళఇంటికి వెళ్ళాను.

అలసటగా కుర్చిలో కూర్చోన్ననాకు " మామయ్య కాఫీ తీసుకొండి,స్నానానికి వేడినీళ్ళు తోడాను "అంటూ కాఫీకప్పునిండుగా అందించింది నామరదలు. సాంబారు,బంగాళదుంపల వేపుడు డైనింగ్ టేబుల్ పై కనిపించడంతో ,బాధగా నామరదలు ముఖంచూసాను.

"అక్కచెప్పింది మామయ్య అందుకే చేసాను "అన్నది నామరదలు. భోజనసమయంలో ఫోన్ మోగింది. మరో తోటిఅల్లుడు కుమారుడు ఒంగోలునుండి ,ఫోన్ ఆన్ చేయగానే "బాబాయ్ సుబ్బరాయుడు సత్రం వచ్చారంటగా రేపు ఉదయం టిఫెన్ సమయానికివచ్చేయండి "అని నాసమాధానంకొరకు ఎదురుచూడకుండా ఫోన్ ఆఫ్ చేసాడు .

ఉదయం బయలుదేరే సమయంలో మాతోటి అల్లుడిచేతిలో కొంతధనం ఉంచి " ఉంచండి "అని ఒంగోలు బయలుదేరాను.

"రండి బాబాయ్ ఈసంవత్సరం తోట మంచిరేటు పలికిందటగా "అన్నాడు .

"పిల్లలు ఎలాఉన్నారు ? "అన్నాడు మాతోటిఅల్లుడు.

తలఊపాను. ప్లేట్లో మూడు గారెలు ,మూడు ఇడ్లి ,అల్లపు పచ్చడి పెట్టుకువచ్చిన కోడలు "అత్తయ్య ఆరోగ్యం ఉన్నారా "అన్నది .

"అంతాకుశలమే "అని ఫలహరంముగించి ఓగంట తరువాత బయలుదేరుతూ,ఐదువేలు కోడలుచేతిలోపెడుతూ "పండుగకు పట్టుచీరతీసుకోమంది మీఅత్తయ్య "అని ఓమామిడికాయలగంప వాళ్ళకు ఇచ్చి బయలు దేరుతుండగా, ఒక చేతిసంచి అందిస్తూ "మామయ్య అత్తయ్య ఫోన్ చేసింది మధ్యాహన్నభోజనం కట్టి ఇవ్వమిని మీకు ఇష్టమటకదా సాంబారు,బంగాళదుంపల వేపుడు చేసి పెట్టాను "అన్నది.

కోడలు మాటలువింటూ కళ్ళుతిరిగి ఆసరాకోసం కారుకు ఆనుకున్నాను.

భోజనం సమయానికి అల్లూరు రోడ్డు దాటుతుండగా చెట్టుకిందకూర్చున్న వృధ్ధుడు కారు ఆపమని సైగచేస్తున్నాడు. దగ్గరాగావెళ్ళిను.

"నాయనా నిన్నటినుండి ఏమితినలేదు తాగేనీళ్ళుకూడాలేవు "అన్నాడు.

కోడలు ఇచ్చిన అన్నంఉన్న సంచి ,నీళ్ళబాటిలు ఇచ్చి సాంబారు,బంగాళ దుంపవేపుడుఅలా తప్పినందుకు సంతోషంతో కారుతీసాను.

ఎంతదూరం వెళ్ళినా అన్నిహోటళ్ళు మూసిఉన్నాయి ,మూసిఉన్న ఓక హోటల్ వద్దకువెళ్ళి "ఎందుకు హోటళ్ళు అన్నిమూసి ఉన్నాయి "అన్నాను.

" అధికధరలకు నిరసనగా ఈరోజు అన్ని హోటళ్ళు బంద్ సర్ " అన్నాడు.

"అలాగా బాగా ఆకలిగా ఉంది తెచ్చుకున్న అన్నం ఓవృధ్ధుడికి ఇచ్చాను "అనాను.

" తమకు అభ్యంతరంలేకుంటే మాకోసరం వండుకున్నభోజనం తిందురుగానిరండి "అన్నాడు అతను.

లోనికివెళుతూనే అక్కడ ఉన్న పదార్ధాలను చూసి భయపడ్డాను. సాంబారు,బంగాళదుంపవేపుడు పక్కనపెట్టి,గోంగుర రోటిపచ్చడి ,పెరుగుతో భోజనం చేసాను. హోటల్ యజమానికి డబ్బులు ఇవ్వబోతే తీసుకోలేదు "ఎండచాలా ఎక్కువగా ఉంది,కూలర్ వేస్తాను కాస్తనడుంవాల్చండి "అన్నాడు.

సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి ,ఏడుగంటలకు కారనోడలోని మావాళ్ళపెట్రోల్ బంక్ లో టాంక్ ఫుల్ చేయించుకుని బయలుదేరబోతుండగా ,పరుగువంటి నడకతోవచ్చిన నాబావమరిది" బావా ఇంటికి వచ్చి భోజనం చేసి విశ్రాంతి తీసుకొని తెల్లవారి రమ్మని అక్కయ్య నాకు ఫోన్ చేసి చెప్పింది "అన్నాడు.

అయిష్టంగానే తలఊపుతూ కారులో వాళ్ళఇంటికి బయలు దేరాను.

" గుమ్మంలో ఎదురైన మాబావమరిది భార్య "రండి అన్నయ్య గారు వదినగారు ఫోన్ చేసారు, స్నానం చేసి రండి భోజనం వడ్డిస్తాను "అన్నది.

కీడు శంకిస్తున్న మనసుతోనే డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాను.

నవ్వుతూ ఆహ్వానించాయి సాంబారు,బంగాళదుంపవేపుడు. టేబుల్ పైన ఉసిరికాయ ఊరగాయ కనిపించడంతో రెండుకాయలు వేసుకుని పెరుగుతో భోజనం ముగించాను.

"అయ్యో అన్నయ్యా వదిన చెప్పినట్లే వంటచేసాను కదా కూరలు వడ్డించుకోలేదే? "అన్నది ఆమె.

విరక్తిగా ఓనవ్వునవ్వి ,బెడ్ రూంచేరి నిద్రకు ఉపక్రమించాను.

తెల్లవారుతూనే,వాళ్ళకు ఓక మామిడి పళ్ళ బుట్ట అందించి , బయలుదేరి బాంక్ కువెళ్ళి,దారిలో కాయకూరలు ,పళ్ళు తీసుకుని భోజనసమయానికి ఇల్లు చేరి కాళ్ళుచేతులు శుభ్రపరచుకుని డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాను.

పళ్ళెంలో అన్నంవడిస్తూ నాశ్రీమతి " రెండురోజులుగా భోజనానికి ఇబ్బందిపడి ఉంటారు అంటూ సాంబారు గిన్నె ముందు పెడుతూ చారెడు బంగాళదుంప వేపుడు వడ్డించింది.

అదిచూస్తూనే కళ్ళుతిరిగి పడిపోకుండా నాశ్రీమతి పైటచెంగు అందుకున్నాను ఆసరాకొరకు.

" చాల్లే సిగ్గులేకపోతేసరి అరవైఏళ్ళవయసులో పట్టపగలు ..."అని చీరచెంగువిడిపించుకుని వంటగదిలోనికివెళ్ళిపోయింది.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు