ఐ లవ్ యు - సి హెచ్ . వి. యస్ యస్ పుల్లం రాజు

I love you

లంచ్ టైమ్ లో జరిగిన సంఘటనకి ఆ తరగతి పిల్లలందరూ అవాక్కయ్యారు. జరిగిన సంఘటనను శేషగిరి మాస్టారుకి చెప్పి తీరాలని, తప్పు చేసిన జీవన్-- శృతిలకు తగిన పుట్టిన రోజు 'బహుమానం' ఇప్పించాలని కొందరు ధృఢ నిశ్చయంతో వుండగా, కొందరు ఆ సంఘటనని పదే పదే తలుచుకుంటూ మసి మసి నవ్వులు నవ్వుతూ ఏవో గుస గుస లాడుకొన్నారు. ఇంతలో గంట మ్రోగింది. క్రమశిక్షణకు మారుపేరైన, ఉత్తమ ఉపాధ్యాయుడుగా పేరు మోసిన శేషగరిరావు తరగతిలో అడుగు పెట్టారు. . . ***** పుట్టిన రోజు సందర్భంగా జీవన్, తోటి పిల్లలందరికి మంచి పెన్ లు పంచిపెట్టగా, అదే తరగతిలో చదువుతున్న విద్యార్థిని శ్రుతి పుట్టిన రోజు కూడా ఆ రోజు కావటంతో ఆమె సహ విద్యార్థులందరికి మిఠాయి, బిస్కెట్ లు పంచింది. ఆ సంబరాలు అక్కడతో ముగిస్తే ఈ కథ లేనే లేదు. లంచ్ విరామ సమయంలో జీవన్, శ్రుతిని తరగతి వేదిక మీదకు పిలిచాడు. కౌిగిలింతలో ముద్దాడి, దగ్గరా అదుముకుని ఇంకా ఏదో చేశాడు. తెలిసీ తెలియని అయోమయంలో పడి జీవన్ తో చేయి కలిపి, వాడి చేష్టలకి ' శ్రుతి ' కలిపింది ఆమె. అందమైన దుస్తుల్లో మెరిసి పోతున్న వారిద్దరు, ఒకరికొకరు ' I love you ' కూడా చెప్పుకొని వేదిక మీద నుంచి కిందకు దిగిపోయారు. వారి వింత చేతలకి కొందరు తప్పట్లు కొడితే, కొందరు సిగ్గు పడితే, . మరి కొందరు,.ఆ ఘోర సంఘటనకు నొచ్చుకొని, వాళ్ళకి తగిన శాస్తి జరిపించాలని, అందుకు శేషగిరిరావు గారే సమర్ధులని నిర్ణయించారు. ***** విద్యార్థులను సునిశతంగా గమనించి, కావాలనే సరదాగా కబుర్లు చెప్ప సాగారు. ఫిర్యాదుకు ఇదే అదనుగా భావించిన పిల్లలు, ఆ విషయం పూస గుచ్చినట్లు చెప్పారాయనకు. విధించబోయే శిక్ష ఏమిటాని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. "మీరిద్దరు ఇలా రండి." ఖంగని మ్రోగిన ఆయన గొంతు విని హడలిపోతూ, చేతులు కట్టుకుని వచ్చి తల వంచుకొన్నారు జీవన్, శ్రుతి. ఉత్కఠభరితంగా వుంది పిల్లలందరికి, మాష్టారు ఏమి చేస్తారో అని. జీవన్, శ్రుతి భయంతో గడ గడ లాడి పోతున్నారు. " ఐ లవ్ యు అంటే ఏమిటో మీకు తెలుసురా? " అడిగారు. పిల్లలకి ఏమి చెప్పాలో తెలియలేదు. ఒక క్షణం ఆగి," ఐ లవ్ మై మదర్, ఐ లవ్ మై ఫాదర్ , ఐ లవ్ మై సిస్టర్, ఐ లవ్ యు చిల్డ్రన్"అని పిల్లల వంక ప్రేమగా చూశారు. ఒక్కసారిగా తప్పట్లతో తరగతి గది మారు మోగిపోయింది. గొంతు సవరించుకుని," ప్రతిజ్ఞ ఏమని చేస్తారురా? గుర్తు లేదా?" అడిగారు. " ఐ లవ్ మై కంట్రీ" అరిచారు . "వెరీ గుడ్. లవ్ యువర్ పేరెంట్స్ , టీచర్స్...జీవన్, శ్రుతి! అర్థమయ్యిందా లవ్ అంటే? అందర్నీ లవ్ చేయండి. దేవుడూ మనల్ని లవ్ చేస్తాడు." చెప్పడం ఆపి జీవన్, శ్రుతిలతో బాటు పిల్లల కేసి చూశారు మాస్టారు. కడిగిన స్వాతి ముత్యాల్లా వారి ముఖాలు మెరిసి పోతున్నాయి. రెండు రోజుల తరువాత,.ఆ పిల్లల తల్లిదండ్రులని స్కూల్ కి పిలిపించి పిల్లల పెంపకంలో మెళుకువలు గురించి కొన్ని సూచనలు చేశారు. ***

మరిన్ని కథలు

Viramam
విరామం.
- Harish Babu
Prema viluva
ప్రేమ విలువ
- Lakshmi Priyanka
Odarpu
ఓదార్పు!
- - బోగా పురుషోత్తం
Guruvu korika
గురువు కోరిక
- టి. వి. యెల్. గాయత్రి
Itlu nee tammudu
ఇట్లు, నీ తమ్ముడు!
- అంతర్వాహిని
Naalo sagam
నాలో సగం
- టి. వి. యెల్. గాయత్రి.
Pichhuka paga-Enugu chavu
పిచ్చుక పగ - ఏనుగు చావు
- హేమావతి బొబ్బు