కృష్ణ మూర్తి గారు పోయాక ఆయన పేరు మీద ఉన్న పొలం , ఇళ్ళు సరిసమానంగా ఆయన నలుగురి కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు పంచుకున్నారు. వారిలో ముగ్గురు టీచర్ ట్రైనింగ్ చేసి పక్క వూళ్ళల్లో టీచర్ ఉద్యోగాలు చేసుకుంటూ మరో పక్క వారసత్వంగా వచ్చిన వ్యవసాయం కూడా చేసుకుంటున్నారు. . అయితే అంతంత మాత్రం చదువు అబ్బిన గోవిందరావుకు ఆ వూళ్లోనే ఉండి పొలం పనులు చూసుకోక తప్పలేదు.
గోవిందరావుకు ఒక పక్క పెద్దగా చదువు లేకపోవడం, మరోపక్క అదుపుతప్పిన సంతానం వల్ల అతని వాటా కొచ్చిన పొలమ్మీద ఆదాయం అతని అవసరాలు తీర్చకపోగా అరకొరా జీవితాన్ని లాగించేస్తున్నాడు. అతని మగ సంతానం లేదు అందరూ ఆడపిల్లలే.
కళ్ళముందు నలుగురాడపిల్లలు తాటిచెట్టులా ఎదిగిపోతూ ఉంటే గోవిందరావుకు చెప్పలేనంత దిగులు పట్టుకుంది. అతనికి అన్నదమ్ములతో సరైన సంబంధాలు లేవు. అహంకారం పాళ్ళు ఎక్కువ. తనంత తెలివిగల వాడు ఆ ఊళ్లోనే లేడన్నట్టుగా తల ఎగరేసి మాట్లాడుతూ ఉంటాడు. ఐశ్వర్యం చాలదన్నట్టు అతనికి పేకాట పిచ్చి కూడా ఉంది. దాంట్లో ఎంతో డబ్బు పోగొట్టుకున్నాడు. ఈ మధ్య కాలంలో కొంత పొలం కూడా కరిగిపోయిందని అంటూ ఉంటారు.
అందరూ ఒకే ఊళ్ళో పెరిగినా ఎందుకో గోవిందరావు పద్దతి అతని అన్నదమ్ములకు సరిపోవక పోవడం వల్ల అతని పరిస్తితి తెలిసినా సహాయం చెయ్యడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. పూర్ + ఇల్లు = పూరిల్లు అన్న నానుడిగా ఒక్క చిన్న ఇల్లు సొంతమైనా కూడా ఎప్పుడు అమ్మేయ్యాలా అని చూస్తున్నాడు. అంత పెద్ద సంసారాన్ని పోషించడానికి ఇల్లూ, పొలం ఆశగా చూపించి ఊరంతా అప్పులు చేసేశాడు. గోవిందరావు తన అప్పులు తీర్చడానికి మొహం చాటేస్తూ ఉంటే వేరే దారిలేక అప్పులు ఇచ్చిన వాళ్ళు అతని అన్నదమ్ముల ఇళ్ల దగ్గర కాపలా కాసి "మీరూ మీరూ తర్వాత చూసుకోండి. మీ గోవిందరావు చేసిన అప్పులు కొంతైనా మీ నెత్తిన వేసుకుని తీర్చకపోతే ఈ వూళ్ళో మీ పరువులు దక్కవు. ఆ తర్వాత రౌడీలు వచ్చి మీలో ఎవరికైనా ప్రాణ హాని తలబెడితే తర్వాత మమ్మల్ని ఏమీ అనడానికి వీల్లేదు. . " అంటూ చాలా సార్లు హెచ్చరించడం జరిగింది.
" మా గోవిందరావుతో మాకెప్పుడో తెగతెంపులు అయిపోయాయి. ఆ ఇంటిమీద కాకి ఈ ఇంటిమీద, ఈ ఇంటిమీద కాకి ఆ ఇంటిమీద వాలి చాలా కాలం అయ్యింది. కాబట్టి ఆ అప్పులతో మాకు సంబంధం లేదు " అంటూ అతని అన్నదమ్ములు తెగేసి చెప్పేశాక వెర్రిమొహం వేసుకుని పోయేవాళ్లు అప్పుల వాళ్ళు.
ఋణ బాధ ఎక్కువవడంతో గోవిందరావు ఉంటున్న చిన్నిల్లు, ఆకలితీరుస్తున్న ఆ కొద్దిపాటి పొలం కాస్తా అప్పుల వాళ్ళ పాలయ్యింది. ఆ పక్కనే ఎవరో జాలిపడి వాళ్ళింట్లో ఒక గది ఇచ్చి ఆ కుటుంబాన్ని తలదాచుకోమన్నారు. కళ్ళముందు నలుగురాడపిల్లలు కనిపిస్తూ ఉంటే వాళ్ళ పెళ్లి మాట దేవుడెరుగు వాళ్లందరిని సాకడమే తలకు మించిన పనిగా ఉంది. అప్పటికీ పెద్ద పిల్ల పక్కింటావిడ ఇంట్లో కుట్టు మెషీన్ మీద జాకెట్లు కుడుతూ వాళ్లిచ్చే పదీ పరకా తీసుకుని ఇంట్లో సాయం అందిస్తోంది. ఇంకోపిల్ల అప్పడాలు వత్తి చుట్టుపక్కల వాళ్ళకు అమ్ముతోంది. ఈ పరిస్తితులు అన్నీ చూశాక గోవిందరావు భార్య అవమానంతో జబ్బు తెచ్చుకుని మంచాన పడింది.
రోజులు భారంగా గడుస్తున్నాయి.
"పిల్లల పెళ్లిళ్లు ఎప్పుడు చేస్తారు ? అలా ఊరుమీద పడి తిరుగుతూ ఉంటే ఆకతాయి పిల్లలు ఊరుకుంటారా ? మీ అన్నదమ్ములు బాగానే ఉన్నారు కదా. వాళ్ళు కాళ్ళు పట్టుకుని డబ్బులు అడిగి పిల్లల కన్నెచెర వదిలించవయ్యా బాబూ !" అంటూ కనపడిన ప్రతి వారూ గోవిందరావుకు గుర్తు చేస్తూనే ఉన్నారు. "అందరూ కలిసి ప్రాణాలు తీసుకోవడానికైనా సిద్దంగానీ నా అన్నదమ్ములను దేహీ అని అడుక్కోవడం నాకు ససేమిరా ఇష్టం లేదు " అంటూ సలహా ఇచ్చిన వాళ్ళ మోహమ్మీదే దురుసుగా చెప్పేసే వాడు. .
ఎవరైనా ఆ కుటుంబం మీద జాలిపడి సాయం చేద్దామంటే అగ్నిగుండాన్ని చల్లార్చడానికి ఎన్ని బిందెలు నీళ్ళు పోస్తే మాత్రం చల్లారుతుంది ? అనే ధోరణిలో తటస్తంగా ఉండిపోయేవాళ్లు. . పైగా ఊరంతా అప్పులు చేసి ఉన్న ఇల్లూ, పొలమూ అమ్ముకుని రోడ్డుమీద పడ్డాడన్న అపప్రద ఉండటంతో గోవిందరావు భార్యకు కూడా ఏదైనా చిన్న పని చూపిద్దామంటే అవమాన భారంతో అందుకు గోవిందరావు పెళ్లాన్ని బయటకు పంపడానికి ఒప్పుకునే వాడు కాదు . .
చాలా కాలంగా ఆ వూరు సర్పంచ్ గోవిందరావును గమనిస్తూ వస్తున్నాడు. ఆర్ధిక సమస్యల వల్ల పిల్లల చదువులు ఆపేశాడని, సరైన బట్టలు కూడా కొనలేకపోగా, రోజు వారీ భోజన కార్యక్రమాలు చూడటమే అతనికి కష్టమైపోతోందని తెలిసి జాలిపడి తనకు తెలిసిన ఒక రాజకీయ పార్టీ దగ్గర ఉద్యోగాన్ని ఇప్పించాడు. గోవిందరావు చేయవలసినది ఏమిటంటే ఆ పార్టీకి ఒక కార్యకర్తగా పనిచేయడం. జెండాలు కట్టించడం మొదలుకుని, ఎప్పుడైనా రాజకీయ సభలు నిర్వహించినప్పుడల్లా ప్రజలకు డబ్బులు ఆశ చూపించి జనసమీకరణ చెయ్యడం , అవతల పార్టీవాళ్లతో మంతనాలు చేసి తమ పార్టీలోకి తీసుకురావడం అన్నమాట.
గోవిందరావుకు అప్పగించిన పని బాగానే చేసుకుంటూ పోతున్నాడని అనిపించి ఆ పార్టీ వాళ్ళు అతన్ని వేరే వూళ్ళకు కూడా పంపుతూ అతన్ని ప్రచార సాధనంగా వాడుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు అతని చేతిలో డబ్బులు బాగానే ఆడుతున్నాయి. . దానితో అతనికి తనమీద తనకి విపరీతమైన నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు అతనికి తనముందు ఉన్న కర్తవ్యం ఎడాపెడా బాగా డబ్బు సంపాదించి ఆడపిల్లల పెళ్లిళ్లు చెయ్యడం.
ఒక సంవత్సరం గడిచింది. ఇప్పుడు గోవిందరావు ఆ పార్టీకి ప్రధాన కార్యకర్తగా ఉంటూ తనకింద మరో నలుగురు అనుచరులను పెట్టుకున్నాడు. పార్టీ కార్యక్రమాలతో పగలూ, రాత్రి అనక ఎన్నో ఊళ్ళు తిరుగుతున్నాడు..
** ** ** **
"నాన్నా నీ కోసం ఎవరో పార్టీ వాళ్ళు వచ్చారు. నువ్వు ఎక్కడో ప్రచారం కోసం వేరే వూళ్ళో ఉన్నావని చెప్పాను. . ఒక బుట్టడు పళ్ళు కూడా ఇచ్చి మళ్ళీ వచ్చి కలుస్తామని చెప్పి వెళ్ళి పోయారు " అని పబ్లిక్ ఫోన్ నుండి గోవిందరావుకు పెద్ద కూతురు మెసేజ్ అందించింది. ఆ రోజునుండి ఎవరెవరో ఇంటికి వస్తున్నారు. గంటలు గంటలు అతన్ని ఏదో ఒప్పించాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు.
అన్నీ కలిసొస్తే ఇంకో రెండేళ్లకైనా తన కూతుళ్ల పెళ్లిళ్లు చెయ్యాలి. . అన్న దమ్ములు పూర్తిగా మొహం చాటేశారు. . మంచైనా చెడైనా ప్రతి క్షణమూ తనెంతో కష్టపడితే కానీ వాళ్ళ పెళ్లిళ్లు చెయ్యలేడు. ప్రస్తుతం తను పనిచేస్తున్న పార్టీలో ఏదో ఇల్లు గడవడానికి సరిపోతోంది కానీ పెళ్లిళ్లు , పేరంటాలు గురించి ఆలోచన చెయ్యలేడు. ఇటువంటి పరిస్తితిలో అతని మదిలో మోహన్రావు మెదిలాడు. అతను వేరే పార్టీలో ఒక పెద్ద కార్యకర్త. అతని కన్ను గోవిందరావు పైన పడింది. అతను గత కొన్నాళ్లుగా తన కోసం ఎవరో చేత రాయబారం చేయిస్తున్నాడు. వాళ్ళ పార్టీలో మంచి భవిష్యత్తు ఉందని రాబోయే ఎన్నికలలో అధికారం కూడా చేపట్టే అవకాశాలు ఎక్కువున్నాయని , అంతే కాకుండా జీత భత్యాలు కూడా బాగా ఉంటాయని , అదృష్టం కలిసి వస్తే చిన్న చిన్న పదవులు కూడా దొరికే వీలుందని ఆశ పెట్టడంతో గోవిందరావు మెదడులో పెళ్లికాని తన నలుగురు ముగ్గురు కూతుళ్ళు మెదిలారు.
ఇప్పుడు అతను కొత్తపార్టీతో రహస్య ఒప్పందం చేసుకున్నాడు. అంతకు ముందు తను పని చేసిన పార్టీలో చేరమని కాళ్ళూ, గడ్డాలు పట్టుకుని ఎంతోమందిని బ్రతిమాలిన గోవిందరావు ఇప్పుడు తను వేరే పెద్ద పార్టీలో ఉండటంతో అదే జనాలను కొత్త పార్టీలో చేరమని ప్రలోభపెట్టడం మొదలు పెట్టాడు. ఈ విషయం కొన్నాళ్ళ పాటు పాత పార్టీ వాళ్ళకు తెలియకుండా జాగ్రత్త పడుతూ అక్కడ వాళ్లిచ్చే పారితోషికాలు కూడా అందుకుంటున్నాడు. నిప్పును అరచేతిలో పెట్టి దాయగలమా అన్నట్టు మొత్తానికి ఎవరో కార్యకర్త ఆ విషయాన్ని పాత పార్టీ వాళ్ళకు అందించడంతో వాళ్ళు గోవిందరావును విశ్వాస ఘాతకుడిగా లెక్క కట్టి చేసినన్నాళ్లు బాగానే పనిచేశాడన్న కృతజ్ఞతతో వేరే శిక్ష విధించకుండా కేవలం ఉద్యోగంలోంచి తొలగించారు.
అప్పటికి గోవిందరావు కొత్త పార్టీలో చేరి ఇంకా నెల రోజులు కూడా కాలేదు . అతని పనితనం చూశాకనే ఎంత ప్రతిఫలం ఇవ్వాలో నిర్ణయిస్తామని చెప్పారు. ఎలా తెలిసిందో కానీ గోవిందరావు రెండు పార్టీలలోనూ పని చేస్తూ ఇరు పార్టీలను మోసం చేస్తున్నాడని , ఇలా నమ్మక ద్రోహం చేసే వాళ్ళను పార్టీలో ఉంచుకుంటే అసలుకే మోసం వస్తుందని అటువంటి మోసగాడు రేపు తమ పార్టీని కూడా మోసం చేసి వేరే పార్టీకి ప్రచారం చెయ్యడని గ్యారంటీ లేదని ఇటువంటి వాళ్ళను మొగ్గలోనే తుంచెయ్యాలని గట్టి నిర్ణయం తీసుకున్న దరిమిలా రేపటినుండి మా పార్టీ ఆఫీసుకు రావలసిన అవసరం లేదని కబురు అందడంతో గోవిందరావు నిలువెల్లా వణికిపోయాడు. అతనికి తను చేసిన పొరపాటు తెలిసి వచ్చింది. తిండికి కూడా నోచుకోకుండా రోడ్లు పట్టుకు తిరుగుతున్న తనకి సర్పంచ్ ద్వారా ఏదో ఆసరా దొరికిందనుకుంటే తన దురాశ వల్ల రెండింటికీ చెడిన రేవడి అయ్యాడు. . ఆర్ధిక పరిస్తితులు వల్ల అలా చెయ్యవలసి వచ్చిందని , నా తప్పులను క్షమించి నన్ను ఉద్యోగం నుండి తొలగించవద్దని , ఆడపిల్లల తండ్రినని కాళ్లా వేళ్ళా పడ్డా ఆ పార్టీ వాళ్ళ మనసు కరగలేదు. అప్పటివరకూ తండ్రి కోసం ఎవరో ఒకరు వచ్చి పార్టీ కార్యక్రమాల గురించి చర్చించే కార్యకర్తలు కొన్నాళ్లుగా రాకపోవడం , తండ్రి పార్టీ పనుల మీద ఏ వూళ్లూ వెళ్ళక ఇంట్లోనే విచారంగా కూర్చుని క్రుంగిపోతూ కనపడటంతో ఇంట్లో వాళ్ళందరికీ అనుమానం రానే వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ నోళ్ల వెంటా, వీళ్ళ నోళ్లవెంటా తమ తండ్రి అతనికి ఆశ్రయం కలిపించిన రాజకీయ పార్టీలను నిలువునా మోసం చేశాడని తెలిసి, ఉన్న ఆసరా కూడా పోయిందని నెత్తీ, నోరూ బాదుకుని తండ్రిని నోటికొచ్చినట్టు దుయ్యపట్టారు.
"మా పెళ్లిళ్లు మాట దేవుడెరుగు. కనీసం ఒక పూట తిండికి కూడా నోచుకోకుండా అందరినీ రోడ్డున పడేశావు. నువ్వు ఒక తండ్రివా ? నీకు సహాయం చెయ్యడానికి ముందుకొచ్చిన వాళ్ళను కూడా నట్టేట ముంచుతున్నావు. నిన్ను నమ్ముకుని ఈ ఇంట్లో ఉండటం మా దురదృష్టం. ,మనల్నందరినీ దరిద్రం వెంటాడుతోంది. అందరమూ కట్ట కట్టుకుని చావడం తప్ప మాకు శరణ్యం లేదు " అంటూ బోరున ఏడ్వడం మొదలు పెట్టారు అతని కూతుళ్ళు .
పల్లె టూళ్ళల్లో ఏ చిన్న విషయం జరిగినా మొత్తం ఊరంతా పాకిపోతుంది. గోవిందరావు ఉదంతం ఆ నోటా ఈ నోటా విన్న అతని అన్నదమ్ములు అతని మోహమ్మీద ఉమ్ము వెయ్యడం ఒకటే తక్కువ. చేతకాని వాడు, అసమర్ధుడు పైకి తీసుకురావాలని చేయి అందించే వాళ్ళను కూడా బురదలోకి లాగేస్తాడు. కృతఘ్నుడు. వీడి మీద జాలిపడి సహాయం చెయ్యబోయినా వీడి దరిధ్రం మనకు కూడా అంటుతుంది అని అందరూ ఏకగ్రీవ తీర్మానం చేసుకుని గోవిందరావు ఇంటివైపు వెళ్ళడం కానీ అతని గురించి మాట్లాడుకోవడం కానీ చెయ్యడం లేదు. ,
"ప్రస్తుత పరిస్థితిలో నేను ఈ వూళ్ళో ఉండటం మంచిది కాదు. పాత కక్షలతో నేను ఇంతకు ముందు పని చేసిన పార్టీ వాళ్ళు నాకు అపకారం తలబెట్టినా తలబెట్టగలరు. అందుకే కొన్నాళ్లు ఎవరికీ తెలియకుండా నేను వేరే వూళ్ళో ఉందామని అనుకుంటున్నాను. అదృష్టవశాత్తు నాకు ఎక్కడైనా పని దొరికితే ఎంతో కొంత డబ్బు ఇంటికి పంపుతాను. విజయవాడలో ఉన్న నా చిన్న చెల్లెలు అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇంట్లో పనిచేయడానికి ఎవరైనా మనిషి కావాలని చూస్తున్నారు. నువ్వు తనతో మాట్లాడి మన అమ్మాయిల్లో ఒకరిని వాళ్ళ ఇంట్లో కొన్నాళ్లు ఉంచుకోమని ప్రాధేయపడు. మన పరిస్తితి ఈ పాటికి వాళ్ళకు తెలిసే ఉంటుంది. అయితే నేను ఎక్కడికో వెళ్లిపోయానని మాత్రం చెప్పకు. బ్రతికి బాగుంటే అందరమూ మళ్ళీ కలుసుకుందాం. నా గురించి అప్పుడప్పుడు నీకు ఫోన్ చేసి చెప్తూ ఉంటాను . ప్రస్తుత పరిస్తిలో మనమందరమూ ఈ త్యాగం చెయ్యాల్సిందే. " అంటూ అతని భార్యకు ఇష్టం లేకపోయినా నచ్చచెప్పి సంచీలో రెండు బట్టలు సర్ధుకుని ఆ వూరు విడిచాడు గోవిందరావు.
" . కల్లో గంజో తాగి ఎలాగో బ్రతుకుదామండీ. మీరు దూరమైపోతే పిల్లలు తప్పు దారి పట్టే అవకాశం ఉందంటూ భార్య నచ్చ చెప్పబోయినా అతను వినలేదు.
రోజులు గడిచిపోతున్నాయి. గోవిందరావు ఒక కూతురు అతని చెల్లిలింట్లో బలవంతంగా గడుపుతోంది. తండ్రికున్న ఆత్మాభిమానం ఆమెకు కూడా ఉంది. ఎలాగైనా విజయవాడనుండి బయటపడాలన్న ఉద్దేశ్యంతో తల్లికి ఫోన్ చేసి చెప్పింది అత్తయ్యింట్లో నా చేత అడ్డమైన చాకిరీ చేయించుకుంటున్నారు. మన ఊళ్ళో అడుక్కునైనా తింటాను కానీ ఈ వూళ్ళో ఉండలేకపోతున్నాను అంటూ.
చెల్లెలు, బావగారు గోవిందరావు విషయం అర్ధం చేసుకుని ఏదో రకంగా సహాయ పడాలన్నా అర్ధం లేని అహంకారంతో వాళ్ళింటికి పంపించిన కూతురుని వెంటనే వెనక్కి రప్పించుకున్నారు.
కొన్నాళ్ళ తర్వాత సర్పంచి గారి కూతురు పెళ్లి తిరుపతిలో పెట్టుకోవడంతో వాళ్ళ కుటుంబం మొత్తం తిరుపతి బయలుదేరింది. . పెళ్లి కార్యక్రమం అంతా పూర్తయ్యాక బంధువులందరూ తిరుమల కొండ పైకి దర్శనానికి ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోజు కొండమీద ఏదో హోటల్లో గోవిందరావుని సర్వర్ అవతారంలో చూసి సర్పంచి సుబ్రమణ్యం ఆశ్చర్యానికి అంతులేదు.
"ఏమిటోనయ్యా. దురదృష్టం నిన్ను తరిమి తరిమి కొడుతోంది. ఉన్న వూళ్ళో ఏదో మూడెకరాల పొలం, చిన్న ఇల్లు ఉన్నాయంటే వాటిని చెడు స్నేహాలు, పేకాట మరిగి అమ్మేసుకున్నావు. ఒక పూట గడవటానికి కూడా ఇబ్బందులు పడుతున్నవని తెలిసి నాకు తెలిసిన రాజకీయ పార్టీలలో చేర్పిస్తే డబ్బుకు కక్కూర్తి పడి అక్కడ కూడా దెబ్బతిన్నావు. నువ్వు ఊరునుండి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయావని తెలిసి నీ సోదరుల మాటేమో కానీ మిగతా జనం తలో మాట చెప్పుకుంటున్నారు. అయిందేదో అయ్యింది. మా ఊరి వాడివి చూస్తూ ఊరుకోలేము కదా. నాతో పాటు వచ్చేయ్యి. నా పొలంలో పని ఇస్తాను. తిండికి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. . నీ అదృష్టం బాగుంటే అక్కడే ఒక కుంట పొలం కొనుక్కుందువు గానీ. నీ బుద్ది బాగుంటే ఆ తర్వాత నీ పిల్లల పెళ్లిళ్లు కూడా అయిపోతాయి. " అంటూ గోవిందరావుపై జాలిపడి సలహా ఇచ్చాడు. సర్పంచ్ సుబ్రమణ్యానికి దొరికిపోయినందుకు గోవిందరావు మొహం మాడిపోయింది. ఒక రకంగా తను తిరిగి వెనక్కి వెళ్ళడం ఇష్టం లేదు.
"అయ్యా సర్పంచి గారు. మీరు దయార్ధ హృదయులు అని నాకు తెలుసు. ఇప్పటికే మీరు నాకెంతో చేశారు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదల్చుకోలేదు. కొన్నాళ్లు నా మొహం వూళ్ళో ఎవరికీ చూపించదల్చుకోలేదు. ఇలాగే కష్టపడాలని నిర్ణయించుకున్నాను. దయచేసి నేను ఇక్కడ హోటల్లో బ్రతుకుని వెళ్లబోస్తున్నాను అని మన వూళ్ళో ఎవరికీ తెలియనివ్వకండి. . నేను క్షేమంగానే ఉన్నాను అని మా వాళ్ళకు అప్పుడప్పుడు ఫోన్ చేసి చెపుతున్నాను. నేను కనుక మన వూరు వచ్చానంటే మన వూరు వాళ్ళు నన్ను మళ్ళీ బురదలోకి లాగేస్తారు. నా బుద్ది కూడా అంతే. . మీకు ఏదైనా మా కుటుంబానికి చేయాలని అనిపిస్తే ఎప్పుడైనా ఒక బస్తా బియ్యం ఇంట్లో వెయ్యించండి. మీ సహాయాన్ని మా వాళ్ళు ఉంచుకోరు. మా పిల్లలు, మా ఆవిడకు మీ పొలంలో ఏదో ఒక పని అప్పగించండి. ఆ భగవంతుడు నా రాత ఎలా వ్రాశాడో తెలియదు. పరిస్థితులు అనుకూలిస్తే మళ్ళీ మన వూరు వస్తాను " అంటూ కళ్ల నీళ్ళ పర్యంతమయ్యి వంటగదిలోకి వెళ్లిపోయాడు గోవిందరావు.
సర్పంచ్ సుబ్రమణ్యానికి గోవిందరావు పరిస్తితి చూశాక గుండె బరువైపోయింది. ఏమీ తోచని దిక్కులేని పరిస్తితిలో అతన్ని వదిలేసి అక్కడనుండి వచ్చేశాడు.
** ** ** **
చాలా కాలం తరవాత ఎవరో ద్వారా ఆ వూళ్ళో తెలిసింది గోవిందరావు మనసును నిండా ప్రక్షాళన చేసుకుని తిరుమలలో ఆ భగవంతుని సన్నిధిలో ఏదో కొలువు సంపాదించి పల్లెటూర్లో ఉన్న తన కుటుంబాన్ని కూడా తన దగ్గరకు రప్పించుకుని జీవితంలో తను సాధించాల్సిన మంచి పనులు నిమిత్తం పూర్తి నిమగ్నమయ్యాడు.******
సమాప్తం