దాక్షాయణి ( పురాణ గాథలు -1 ) - కందుల నాగేశ్వరరావు

Daakshayani

దాక్షాయణి

(పురాణ గాథ-1)

దక్షుడు, నారదుడు, పులహుడు, పులస్త్యుడు, భృగువు, క్రతువు, అంగీరసుడు, వసిష్టుడు, మరీచి, ఆత్రి – పదిమంది బ్రహ్మ మానసపుత్రులు. బ్రహ్మతో సమానమైన ప్రభావం కలవారు

ప్రజాపతి అయిన దక్షుడు అనేక విధాలైన మానసిక సృష్టి చేశాడు. కాని ప్రజా సంతతిలో పెద్దగా అభివృద్ధి కానరాలేదు. ప్రజాసంతతి తమంత తాముగా వృద్ధి పొందే ఉపాయం చెప్పమని బ్రహ్మదేవుని కోరాడు. బ్రహ్మ “కుమారా! పంచజన ప్రజాపతికి అస్నికి అనే కుమార్తె ఉంది. నువ్వు ఆమెను భార్యగా స్వీకరించు. ఆమె ద్వారా మైథున ధర్మంచే ప్రజాసృష్టిని త్వరితగతిని విస్తరించగలవు. నీవు శివుని స్మరించు. శుభం కలుగుతుంది” అని చెప్పాడు. దక్షుడు ఆ విధంగానే పంచజనుని కుమార్తె యందు హర్యశ్వులు అనే వేయి మంది కుమారులను, తరువాత శబలాశ్వులు అనే వేయి మంది కుమారులను కన్నాడు. కాని వారందరూ నారదుని బోధనతో మోక్షప్రాప్తికై సన్యాసాన్ని స్వీకరించి తపస్సుకు వెళ్ళిపోయారు.

ఒకనాడు బ్రహ్మదేవుడు దక్షప్రజాపతిని పిలిచి “కుమారా! నీవు క్షీరసాగరపు ఉత్తరతీరానికి వెళ్ళి జగదాంబ దర్శనం కొరకు తపస్సు చెయ్యి. నీకు శుభం కలుగుతుంది” అని చెప్పి ఆశీర్వదించి పంపాడు. దక్షుడు తండ్రి మాట ప్రకారం జగదాంబను ధ్యానిస్తూ ఘోరతపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి జగదాంబ ప్రత్యక్షమైంది. దక్షుని మనస్సులోని కోరిక గ్రహించి ప్రసన్నురాలై ఇలా పలికింది. “నీవు కోరుకుంటున్నట్లుగా నీకు కుమార్తెగా పుడతాను. ఒక్క విషయం గుర్తుంచుకో. ఏనాడైతే నువ్వు నాయందు ఆదరాన్ని కోల్పోతావో ఆనాడే నేను దేహత్యాగంచేసి మరో దేహాన్ని ధరిస్తాను. దక్షుని అలా అనుగ్రహించి మహేశ్వరి అంతర్ధానమైంది. లోకమాత తనకు కుమార్తెగా జన్మించబోతుందనే ఆనందంతో దక్షుడు తన నివాసం చేరుకున్నాడు.

దక్షుడు తన భార్య యందు అరవై మంది కుమార్తెలను కన్నాడు. లోకమాతయైన ఉమాదేవి సతీరూపంలో ఆ దంపతులకు జన్మించింది. ఆ బాలికను చూచి దక్షుడు ఆమె జగన్మాతయేనని గ్రహించి సంతోషంతో స్తుతించాడు. అస్నికితో బాటు అందరూ సంతోషించారు. దక్షుడు వేదోక్త సంస్కారాలతో ఆమెకు ‘ఉమ’ అని నామకరణం చేసాడు. ఆ బాలిక శుక్లపక్ష చంద్రునిలా దినదినాభివృద్ధి పొందుతూ సకల విద్యలను అధ్యయనం చేసి, సమస్త కళలను అభ్యసించింది. ఇది చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. చిన్నతనం నుండి ఉమ శివనామం జపిస్తూ, ఆయన గాథలను వింటూ, ఆయన పాటలను పాడుతూ, ఆయన లీలలను అభినయిస్తూ పెద్దదైంది.

ఒకరోజు బ్రహ్మదేవుడు నారదమునితో కలిసి దక్షుని ఇంటికి వచ్చాడు. దక్షుడు వారిద్దరికీ నమస్కరించి, వారిని సత్కరించాడు. సతీదేవి కూడా వారికి నమస్కరించింది. అప్పుడు విధాత ఆమెను “ఓ శుభకరీ! జగత్ప్రభువైన ఈశ్వరుడు నీకు పతి యగు గాక!” అని దీవించాడు. శంకరుడు సమస్త చరాచరాలకు గురువు. విశ్వేశ్వరుడు. ఎల్లలోకాలకు దేవుడు. మహాదేవుడు.

సతీదేవి కూడా మనస్సులో శివుని వివాహమాడాలనే తన కోరిక తీరాలంటే తపస్సే కర్తవ్యమని నిశ్చయించుకొంది. తల్లి అనుమతితో ఇంటి యందే నందావ్రతాన్ని ప్రారంభించింది. సతీదేవి ఆశ్వయుజ శుక్ల అష్టమి నాడు ఉపవాసం ఉండి ఈశ్వరుని భక్తితో పూజించి నందా వ్రతాన్ని చేసింది. నవమి నాడు తన ఎదుట ప్రత్యక్షమైన సర్వాంగ సుందరుడు, పంచవక్త్రుడు, త్రిలోచనుడు, చతుర్భుజుడు అయిన శివుణ్ణి దర్శించి సిగ్గుతో శిరస్సు వంచి ఆయన పాదాలకు నమస్కరించింది. ఆమె మనస్సు గ్రహించిన శంకరుడు సతీదేవిని ‘నీ తల్లితండ్రుల అనుమతితో శాస్త్రోక్తంగా నిన్ను పరిణయమాడుతాను’ అని వరమిచ్చాడు. తన అభీష్టం నెరవేరినందుకు అతిశయించిన ఆనందంతో సతి మాట్లాడలేక హావభావాలతో తన సంతోషాన్ని ప్రకటించింది.

సతీదేవితో తన పాణిగ్రహణం జరిగేటట్లు దక్షుని ఒప్పించమని శివుడు బ్రహ్మదేవుడిని కోరాడు. బ్రహ్మదేవుడు చెప్పగా దక్షుడు తన కుమార్తె వివాహం శివునితో జరుపుటకు ఒప్పుకున్నాడు. దక్షుని ఆహ్వానంతో రుద్రుడు రుద్రగణంతో బయలుదేరి చైత్ర శుక్ల త్రయోదశి, ఉత్తరా నక్షత్రయుక్త ఆదివారం నాడు దక్షుని గృహాన్ని చేరుకున్నాడు. దక్షుడు ఎదురేగి, సత్కరించి, శివునికి, వారి వెంట వచ్చిన వారందరికీ యథోచిత సత్కారాలు చేసి సతీశివుల వివాహాన్ని ఘనంగా జరిపించాడు. సప్తర్షులు స్వస్తి వాచకాలు పఠింపగా, గంధర్వులు పాడగా, అప్సరసలు ఆడగా సతీశంకరుల కల్యాణోత్సవం జరిగింది. కన్యాదాన సమయంలో దక్షుడు శివునకు అనేక బహుమతులను ఇచ్చాడు.

తన ఆశ్రమం చేరిన శంకరుడు గణాలను పిలిచి తనెప్పుడు స్మరిస్తే అప్పుడు రావలసిందిగా ఆజ్ఞాపించి వారిని పంపించివేశాడు. సతితో కూడి శోభావిరాజితమైన తన గిరికందరం లోకి ప్రవేశించి దాక్షాయణితో ఏకాంతగా ప్రణయలీలలు గావించాడు. కైలాసపర్వత ప్రాంతమంతా సతీసహితుడై వివరించాడు. ఆపై కైలాసాన్ని వీడి హిమవత్పర్వత ప్రాంత రమణీయ ప్రదేశాలన్నీ సంచరించాడు. సతీదేవి కోరికపై శంకరుడు హిమవత్పర్వత ప్రాంత కైలాస శిఖరంపై తమ స్థిర నివాసాన్ని ఏర్పాటుచేసుకొని లోకాలన్నీ సంచరిస్తూ ఉన్నారు.

ఈ విధంగా సతీశంకరులు పదివేల దివ్య సంవత్సరాలు విహరించారు. ఒకనాడు సతి శివుని సమీపించి “నాథా! ఇన్ని రోజులు నీతో విహరించి ధన్యురాలనయ్యాను. నా మనస్సు ఇప్పుడు ప్రవృత్తి మార్గం నుండి నివృత్తి మార్గం వైపు మళ్ళింది. పరతత్త్వాన్ని తెలుసుకోవాలను కొంటున్నాను. జీవుడు ఏ తత్త్వాన్ని తెలుసుకొని ఈ సంసార దుఃఖాన్ని దాటగలుగుతాడో ఆ మోక్షోపాయాన్ని తెలియపర్చండి” అని అడిగింది.

“దాక్షాయణీ! పరతత్త్వం అంటే విజ్ఞానం. విజ్ఞానం ఉదయించిన జ్ఞాని మనస్సులో ‘నేనే బ్రహ్మమును’ అనే స్మృతి కలుగుతుంది. ఆ జ్ఞానం దుర్లభం. నాయందలి భక్తియే ఆ జ్ఞానం పుట్టడానికి కారణం అవుతుంది. భక్తి సగుణ నిర్గుణ భేదంచే రెండు రకాలు. సహజంగా హృదయంలో పుట్టిన భక్తి గొప్పది. కోరికలతో పుట్టిన భక్తి తక్కువది. భక్తి ఏదైనా దాని అంగాలు తొమ్మిది. అవి శ్రవణం, కీర్తనం, స్మరణం, సేవనం, దాస్యం, అర్చనం, వందనం, సఖ్యం, ఆత్మార్పణం” అంటూ శంకరుడు భక్తికి సంబంధించిన అన్ని విషయాలు బోధించాడు.

ఒకరోజు సతీశివులు త్రిలోక సంచారం చేస్తూ దండకారణ్యంలో సీతా వియోగంతో బాధపడుతున్న శ్రీరామచంద్రుని చూశారు. వెంటనే శంకరుడు ఆయనకు నమస్కరించి ‘జయం కలుగు గాక!’ అని ఆశీర్వదించాడు. ఆ దృశ్యాన్ని చూసిన సతీదేవి “నాథా! హరిహరాదులు సైతం మీకు నమస్కరిస్తారే. అటువంటి మీరు ఒక మానవమాత్రునికి నమస్కరించడ మేమిటి” అని ప్రశ్నించింది. అప్పుడు శంకరుడు “దేవీ! శ్రీరామచంద్రుడు స్వయంగా శ్రీమహావిష్ణువు విష్ణువే. నీకు నా మాటపై నమ్మకం లేకపోతే స్వయంగా నీవే పరిశీలించు” అని చెప్పాడు.

అప్పుడు సతీదేవి పతిపై విశ్వాసం ఉన్నా, శివమాయా మోహితురాలై శ్రీరామచంద్రుని పరీక్షించడానికి సీతా రూపంలో దర్శన మిచ్చింది. శ్రీరాముడు సతికి నమస్కరించి ‘మాతా కుశలమేనా’ అని అడిగాడు. సతీదేవికి జ్ఞానోదయమైంది. భర్త అయిన శంకరుని మాట నమ్మక స్వతంత్రించి శ్రీరాముని పరీక్షించినందుకు మనస్సులో ఎంతో బాధపడింది.

పూర్వం బ్రహ్మవేత్తలు గొప్ప యజ్ఞం ప్రారంభించారు. ఆ మహాయజ్ఞాన్ని చూడడానికి శివుడు, బ్రహ్మదేవుడు, దేవతలు, యోగులు, మహర్షులు, ప్రజాపతులు మొదలైనవారు అందరూ వచ్చారు. అక్కడికి సూర్యతేజస్సుతో ప్రకాశించే దక్షుడు కూడా వచ్చాడు. దక్షుని చూడగానే సభలోని వారంతా లేచి నిలబడ్డారు. బ్రహ్మ, శివుడు మాత్రం లేవలేదు. అప్పుడు దక్షుడు బ్రహ్మకు నమస్కరించాడు. తనకు తగిన పీఠంపై కూర్చున్నాడు. తనను చూసి సభ్యులందరూ గౌరవించారు కాని తన అల్లుడైన శివుడు మాత్రం తన పెద్దరికం గుర్తించలేదు. దక్షుడికి ఈ చర్య అవమానం అనిపించింది. ముక్కంటిని చూపించుతూ కోపంతో ఇలా అన్నాడు.

“దేవతలారా! మహర్షులారా! మీరందరూ వినండి. ఈ శివుడు దిక్పాలకుల కీర్తిని నేలపాలు చేస్తున్నాడు. సాద్వీశిరోమణి అయిన నాకుమార్తెను పెద్దల సమక్షంలో కోరి పెళ్ళి చేసుకున్నాడు. అందుచేత నాకు అల్లుడై గొప్పవాడయ్యాడు. నన్ను చూసి నమస్కరించలేదు, సరికదా కనీసం పలుకరించ లేదు. ఇతనికి మానాభిమానాలు లేవు. మర్యాదలు తెలియవు. శుచి లేనివాడు. మతిలేనివారికి అధిపతి. బ్రహ్మగారి మాటలు విని ఇతనికి నా కుమార్తె నిచ్చి పొరపాటు చేశాను” అని ఇంకా పలు విధాల శివుని దూషించాడు. “ఈ శివుడు ఇంద్రుడు, విష్ణువు మొదలగు దేవతలతోబాటు హవిర్భాగం పొందకుండు గాక!” అని శపించి దక్షుడు ఆగ్రహంతో తన నివాసానికి వెళ్ళిపోయాడు.

శివుని సేవకులలో ముఖ్యుడైన నందికేశ్వరుడు తన స్వామిని దక్షుడు శపించడం విని కోపంతో “ఈ దక్షుడు దేహమునే ఆత్మగా భావిస్తాడు. వీడు సత్యమైనా ఆత్మతత్త్వాన్ని విడిచి పశువుతో సమానమవుతాడు. “తొందరలోనే గొర్రె తలవాడు అవుగాక. వీనిని అనుసరించేవారు సర్వదా సంసారంలో చిక్కుకొని పుట్టుతూ, చస్తూ ఉందురు గాక” అని శపించాడు. అప్పుడు వ్యాకులహృదయుడైన శివుడు నందిని శాంతిపజేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

మామ అయిన దక్షునికి, అల్లుడైన శివునికీ పరస్పర వైరం నానాటికీ పెరిగింది. బ్రహ్మదేవుడు దక్షుని ప్రజాపతు లందరికీ అధ్యక్షుణ్ణి చేశాడు. ఆ అధికార గర్వం చేతనూ, పరమేశ్వరునిపై ఉన్న పగచేతనూ దక్షుడు, రుద్రహీనమైన ‘వాజపేయము’ అనే యజ్ఞం చేశాడు. దాని తరువాత ‘బృహస్పతి సవనం’ అనే మరొక యజ్ఞాన్ని చేయడానికి పునుకున్నాడు. ఆ యజ్ఞం చూడటానికి మునులూ, ప్రజాపతులు, దేవతలూ భార్యాసహితులై వచ్చారు. సర్వదేవగణాలు, లోకపాలురు బ్రహ్మ విష్ణులను ప్రార్థించి ఆదరంతో యజ్ఞానికి తీసుకొని వెళ్లారు. దక్షుడు విరోధభావంతో యజ్ఞార్హత లేదని నిశ్చయించి సతీశంకరులను యజ్ఞానికి ఆహ్వానించ లేదు.

దధీచి మహర్షి అక్కడ యజ్ఞశాలలో శంకరుడు కనుపించక పోవటంతో ‘శివుడు లేని ఈ యజ్ఞం పరిపూర్ణం కాదు. ఇక్కడ వినాశం జరగబోతున్నది’ అని చెప్పి అక్కడ నుండివెళ్ళిపోయాడు.

హిమవత్పర్వత ప్రాంతంలో చెలికత్తెలతో ఉన్న సతీదేవి, రోహిణీ సహితుడైన చంద్రుడు దక్షయజ్ఞానికి వెళ్లటాన్ని చూసింది. తన ప్రాణసఖి విజయ ద్వారా వారు ఎక్కడకు వెళ్తున్నారో తెలుసుకుంది. తమను తల్లితండ్రులు ఎందుకు ఆహ్వానించలేదా అని మథనపడి, యజ్ఞానికి వెళ్ళడటానికి నిశ్చయించుకొని భర్త వద్దకు వెళ్ళి చెప్పింది.

అప్పుడు శంకరుడు అనునయంతో ఇలా అన్నాడు. “నీ తండ్రి చేసే యాగానికి వెళ్ళడం నాకూ ఇష్టమే. కాని ఆయన మనలను ఆహ్వానించ లేదు. ఎవరైనా సరే ఆహ్వానం లేకుండా వెళ్తే అవమానం పాలవుతారు. స్వజనుల నిందలు, శత్రువులు చేసిన గాయం కంటే ఎక్కువ బాధిస్తాయి. నీకు సత్యాన్ని చెప్పాను. తరువాత నీ ఇష్టం”.

పుట్టింటి మీద మమకారంతో సతి “స్వామీ! నేను మీ సృష్టి రహస్యం తెలుసుకోలేనిదాన్ని. యజ్ఞాన్ని సందర్శించే నిమిత్తం దివ్యవిమానాలు అధిరోహించి అందరూ ఆకాశమార్గంలో వెళ్తున్నారు. తన తండ్రి ఇంట జరిగే శుభకార్యాలను చూడటానికి వెళ్ళకుండా ఏ ఆడబిడ్డైనా ఉండగలదా? కుమార్తెనైన నన్నుఎందుకు పిలవలేదో నా తండ్రి నోటితోనే వినాలను కుంటున్నాను. అయినా పుట్టింటి పిలుపు విషయంలో నాకు పట్టింపులు ఎందుకు? నేను యజ్ఞానికి వెళ్తాను. ఒక్కసారి నాపుట్టింటిని చూడాలనుంది. మిమ్మల్ని వేడుకుంటున్నాను. అనుమతించండి” అని అడిగింది. ‘పొమ్మని అనుజ్ఞ ఇస్తే అక్కడ అవమానం జరుగుతుంది. వద్దని అంటే సతీదేవి మనస్సుకు కష్టం కలుగుతుంది’ అని ఆలోచించి శివుడు మౌనం వహించాడు. తన తల్లిదండ్రులను చూడాలని కుతూహలంతో సతీదేవి దానిని అంగీకారంగా భావించింది. పుట్టింటికి బయలుదేరింది.

సతీదేవి సువర్ణాలంకృతమైన నందిని అధిష్టించింది. ఆమె వెంట అరవై వేల రుద్రగణాలు వివిధ రకాల బహుమతులను తీసుకొని బయలుదేరారు. దక్షుని నివాసానికి చేరిన సతీదేవి ప్రమథగణాలూ యజ్ఞశాలలో అడుగు పెట్టారు. ఆమె తల్లి అస్నికి, తక్కిన సోదరీమణులు ఉచిత మర్యాదలు చేశారు. దక్షుడు ఆమెను చూచాడు కాని ఆదరణ చూపలేదు. మిగిలినవారు కూడా దక్షునికి బయపడి పలుకరించ లేదు. అలా అనాదరణకు గురియైన సతి ఆశ్చర్యంతో తల్లితండ్రులకు నమస్కరించింది.

తండ్రి తన భర్తను యజ్ఞానికి ఆహ్వానించకుండా అవమానించాడనీ, శివునికి భాగం కల్పించకుండా యజ్ఞం జరిపిస్తున్నాడనీ ఆమె గ్రహించింది. తండ్రిని నిలదీసింది. “తండ్రీ! మీరు నాభర్త శంభుని ఎందుకు ఆహ్వానించ లేదు?యజ్ఞస్వరూపుడైన ఆయనకు హవిర్భాగం ఎందుకు సమర్పించ లేదు? ఆయన లేని కర్మలన్నీ అపవిత్రాలు. నా బుద్ధి భ్రష్టమైనది. శివుడు లేని యజ్ఞానికి ఫలితమేమిటి?”. హరిని, బ్రహ్మని, దేవేంద్రుడిని మిగతా దేవతలను కూడా ఇదే విషయం ప్రశ్నించింది. అక్కడ ఉన్న అందరూ భయంతో మిన్నకుండి పోయారు.


అప్పుడు దక్షుడు సతీదేవితో “ సతీ! నువ్వు అధికప్రసంగం చేస్తున్నావు. నీ భర్త అమంగళుడు. అందువల్లనే ఆహ్వానించ లేదు. ఆ రోజు బ్రహ్మ మాట కాదనలేక నిన్ను ఇచ్చి వివాహం చేశాను. కన్న కూతురువు. ఎలాగూ వచ్చావు. యజ్ఞం అయ్యేవరకు ఉండి వెళ్ళు” అన్నాడు. తండ్రి పలుకులకు సతీదేవి దుఃఖించింది. భర్త వారించినా వచ్చినందుకు తన అవివేకానికి తనను తానే నిందించుకొంది. తన మొహాన్ని తిరిగి భర్తకు ఎలా చూపాలా అని చింతిచింది. ఈ పైన శివుడు తనను ‘దాక్షాయణీ’ అని పిలిస్తే మనశ్శాంతి ఉండదు అని తలపోసింది.

ఎవడు మహాదేవుని నిందిస్తాడో, ఎవడు ఆ నిందలను వింటాడో వాడు శాశ్వత నరకంలో ఉంటాడు. కనుక నా ఈ దేహాన్ని అగ్ని పరిత్యాగం చేస్తాను” అని అనుకొని, యోగమార్గం అనుసరించి దేహమునందు అగ్నిని వాయువును ధరించింది. సతీదేవి పాదపద్మాల నుండి అగ్ని ఉద్భవించి ఆమెను దహించింది.

వెంటనే అరవై వేల మంది రుద్రగణం హాహాకారాలు చేశారు. వారు ప్రళయాన్ని సృషించారు. అప్పుడు ఆకాశవాణి “దక్షా! సర్వమంగళయైన సతిని అవమానించావు. ఓ దేవతలారా! రుద్రుడు లేని ఈ యజ్ఞం ధ్వంసం కాబోతున్మది. మీరంతా మీ స్వస్థనాలకు మరలిపొండి” అని ఆదేశించింది.

సతీదేవి పొందిన అవమానాన్ని, ఆమె చేసిన దేహత్యాగాన్ని రుద్రగణం నోట విన్న శివుడు ఒకజటను త్రుంచి క్రోధంతో పర్వతంపై విసిరికొట్టాడు. ఆ జడ రెండు ముక్కలయ్యింది. ఒక దానినుండి ‘వీరభద్రుడు’ , రెండవ దానినుండి ‘మహాకాళి’ జన్మించారు. మహేశ్వరుని ఆజ్ఞతో యజ్ఞస్థానానికి బయలుదేరి వెళ్లాడు వీరభద్రుడు. శంభుడు పంపిన రుద్రగణాలు వీరభద్రుని ముందు వెనుక నడిచాయి. నవదుర్గలతో కూడిన మహాకాళి కూడా దక్షసంహారానికై బయలుదేరింది.

ఆ సమయంలో దక్షునికి అపశకునాలు కానవచ్చాయి. విష్ణుమూర్తితో తనని రక్షింపమని వేడుకొన్నాడు. విష్ణువు దక్షుని లేవదీసి అతనితో ఇలా అన్నాడు. “నీవు తత్త్వాన్ని తెలుసుకోలేక జగధీశ్వరుడైన శివుని అవమానించావు. శివుని తిరస్కరిస్తే కార్య సాఫల్యం చేకూరదు. ఈ ముప్పును మేమెవరమూ నివారించ లేము”.

అప్పుడు మహాబలుడైన వీరభద్రుడు శంకరుని స్మరించి, అడ్డువచ్చు వారినందరినీ ఓడించి, యజ్ఞాన్ని ద్వంశం చేసి, రౌద్రంతో దక్షుని తల మెలిపెట్టి తెంపి అగ్నిహోత్రంలో పారేశాడు. మహాదేవుడు ప్రసన్నుడై వీరభద్రుని సర్వగణాధ్యక్షుణ్ణి చేశాడు.

దేవతలు, మునులు శివుని పలు విధాల స్తుతించి శాంతించమని కోరారు. యజ్ఞం పూర్తికాని ఎడల లోకవినాశనం జరుగుతుంది కావున దక్షుని బ్రతికించి యజ్ఞాన్ని ఉద్ధరించమని ప్రార్థించారు. కరుణా సముద్రుడైన పరమేశ్వరుడు వారందరినీ ఓదార్చి వీరభద్రుని దాడిలో గాయపడ్డవారికీ, మరణించిన వారికీ పూర్వస్థితి కల్పించాడు. దక్షుని శరీరానికి యజ్ఞపశువు యొక్క శిరస్సు సంధానము చేసి పునర్జీవితుని చేశాడు. దక్షుడు కొంత సేపటికి తేరుకొని, సిగ్గుతో తల దించుకొని శంకరునికి ప్రణమిల్లి అపరాధం క్షమించమని వేడుకొన్నాడు. శివుని పలు విధాల స్తుతించి మౌనాన్ని వహించాడు.

శంకరుడు దక్షునితో “ఓ ప్రజాపతీ! ఈ నాటి నుండి నన్ను పరమేశ్వరుడిగా ఎరిగి, బుద్ధిని జ్ఞానార్జన యందు లగ్నంచేసి శ్రద్ధతో కర్మానుష్ఠానం చెయ్యి. ఇప్పుడు యజ్ఞాన్ని పూర్తి చేయి” అని అనుజ్ఞ ఇచ్చాడు. దక్షుడు శివానుగ్రహంచే యజ్ఞాన్ని పరిసమాప్తి చేసి హవిస్సు పూర్ణభాగాన్ని శంకరునకిచ్చి, శంకరుని అనుమతితో దేవతలకు వారి వారి భాగాలను ఇచ్చాడు. ఋషులకు, మునులకు, బ్రాహ్మణులకు అనేక దానాలు సమర్పించాడు.

ఈ సతీ వృత్తాంతాన్ని భక్తి శ్రద్ధలతో చదివినవారు, విన్నవారు ఈశ్వరానుగ్రహానికి పాత్రులై ఇష్టకామ్యార్థాలను పొందుతారు. శివసాయుజ్యాన్ని పొందుతారు.

శుభం

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న